పోతన తెలుగు భాగవతము/ఏకాదశ స్కంధము/ఉపోద్ఘాతము

తెభా-11-1-క.
శ్రీ సీతాపతి! లంకే
శాసురసంహారచతుర! శాశ్వత! నుతవా
ణీత్యధిభూభవవృ
త్రాసురరిపుదేవజాల! రామనృపాలా!

టీక:- శ్రీ = శోభనకరమైన; సీతాపతి = రామా {సీతాపతి - జానకీ వల్లభుడు, రాముడు}; లంకేశాసురసంహారచతుర = రామా {లంకేశాసురసంహారచతురుడు - లంకేశ్వరుని (రావణాసురుని) సంహరించుటలో చతురుడు, రాముడు}; శాశ్వత = రామా {శాశ్వతుడు - శాశ్వతముగానుండు వాడు, రాముడు}; నుతవాణీసత్యధిభూభవవృత్రాసురరిపుదేవజాల = రామా {నుతవాణీసత్యధిభూభవవృత్రాసురరిపుదేవజాల -నుత (పొగడబడుతున్న వాణీసత్యధిభూ (బ్రహ్మ) భవ (మహేశ్వరుడు) వృత్రాసురరిపు (ఇంద్రుడు) దేవజాల (మున్నగుదేవతల సమూహము) కలవాడు, రాముడు}; రామనృపాలా = రామా {రామనృపాలుడు - రాముడు అను రాజు}.
భావము:- శ్రీరామచంద్రప్రభూ! శ్రీజానకీవల్లభా! రావణాసురుని సంహరించిన చతురుడా! శాశ్వతుడా! బ్రహ్మ ఈశ్వర ఇంద్రాది దేవతలచే పొగడబడువాడా! రామరాజా! అవధరింపుము.

తెభా-11-2-వ.
మహనీయగుణగరిష్ఠులగు నమ్మునిశ్రేష్ఠులకు నిఖిలపురాణ వ్యాఖ్యానవైఖరీ సమేతుండైన సూతుం డిట్లనియె; నట్లు ప్రాయోపవిష్టుండైన పరీక్షిన్నరేంద్రుం గని శుకయోగీంద్రుం “డయ్యా! జన్మ కర్మవ్యాధివిమోచనంబునకుఁ గారణంబగు దివ్యౌషధంబు గావున శ్రీమన్నారాయణ కథామృతంబుఁ గ్రోలు” మని యిట్లనియె.
టీక:- మహనీయ = ఉత్తమమైన; గుణ = సుగుణములు కలవారిలో; గరిష్ఠులు = శ్రేష్ఠులు; అగు = ఐన; ఆ = ఆ ప్రసిద్ధులైన; ముని = మునులలో; శ్రేష్ఠులు = ఉత్తముల; కున్ = కు; నిఖిల = అన్ని; పురాణ = పురాణాలను; వ్యాఖ్యాన = వివరించెడి; వైఖరీ = విధానమునందునేర్పు; సమేతుండు = కలిగినవాడు; ఐన = అయిన; సూతుండు = సూతుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; అట్లు = అలా; ప్రాయోపవిష్టుండు = మరణాయత్తమైనవాడు {ప్రాయోపవేశము - ఆహారాదులను వర్జించి మరణమునకై కూర్చుండి యుండుట}; ఐన = అయిన; పరీక్షిత్ = పరీక్షిత్తు అనెడి; నరేంద్రున్ = మహారాజును; కని = చూసి; శుక = శుకుడు అనెడి; యోగి = మునులలో; ఇంద్రుండు = శ్రేష్ఠుడు; అయ్యా = తండ్రి; జన్మ = పుట్టుకలు; కర్మ = కర్మలు; వ్యాధి = రోగములు నుండి; విమోచనంబు = విముక్తి; కున్ = కు; కారణంబు = కారణము; అగు = ఐన; దివ్య = దివ్యమైన; ఔషధంబు = నివారణకారి; కావునన్ = అగుటచేత; శ్రీమత్ = శుభకరమైన; నారాయణ = విష్ణుమూర్తి యొక్క; కథ = చరితములను; అమృతంబున్ = అమృతమును; క్రోలుము = ఆస్వాధించుము; అని = అని; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఉత్తమగుణాలు కలవారిలో శ్రేష్ఠులైన ఆ మునులతో సకల పురాణాలను వ్యాఖ్యానించుటలో బహునేర్పరి అయిన సూతుడు ఈవిధంగా అన్నాడు. “ఆవిధంగా ప్రాయోపవేశంచేసి ఉన్నట్టి పరీక్షన్మహారాజుతో శుకముని “అయ్యా! పుట్టుక, కర్మ, రోగం వీటి నుండి విముక్తి కలగటానికి కారణమైన దివ్యఔషధము శ్రీమన్నారాయణ చరితామృతం. ఆ అమృతాన్ని ఆస్వాదించు” అని ఇంకా యిలా అన్నాడు.