8. లక్ష్మణ ఊయల
పర్వతమంత విశాల హృదయులు మహాత్మా మున్షీరామ్. వారి దర్శనం చేసుకొని, వారి గురుకులం చూచి ఎంతో శాంతి పొందాను. హరిద్వారమందలి రొదకు, గురుకులమందలి శాంతికి మధ్యగల భేదం స్పష్టంగా కనబడుతూ వుంది. ఆ మహాత్ముడు నామీద ప్రేమ వర్షం కురిపించారు. అక్కడి బ్రహ్మచారులు నన్ను వదలలేదు. రామదేవన్‌ను అక్కడే కలిశాను. వారి శక్తి ఏమిటో వెంటనే గ్రహించాను. మా మధ్య కొద్దిగా అభిప్రాయభేదం వున్నట్లు కనబడినా మా యిరువురిని ప్రేమబంధం బిగించివేసింది. గురుకులంలో పరిశ్రమల స్థాపన మరియు వాటిశిక్షణను గురించి రామదేవ్‌గారితోను, యితర ఉపాధ్యాయులతోను చర్చించాను. గురుకులం త్వరగా వదిలి రావలసి వచ్చినందుకు బాధపడ్డాను.
లక్ష్మణ ఊయలను గురించి చాలామంది చెప్పగా విన్నాను. ఋషీకేశం వెళ్లకుండా హరిద్వారం వదలి రావద్దని చాలామంది సలహా యిచ్చారు. నేను అక్కడికి నడిచి వెళ్లాలి. ఒక మజిలీ ఋషీకేశంలో, రెండవ మజిలీ లక్ష్మణ ఉయ్యాలలో గడపాలి. ఋషీకేశంలో చాలామంది సన్యాసులు వచ్చి నన్ను కలిశారు. వారిలో ఒకనికి నాయందు అమితంగా మక్కువ కలిగింది. నాలో ధర్మాన్ని గురించి తపన తీవ్రంగా వుండటం అతడు గ్రహించాడు. అప్పుడే గంగలో స్నానం చేసి వచ్చాను. అందువల్ల ఒంటినిండా బట్ట కప్పుకోలేదు. శిరస్సు మీద పిలక, మెడలో జందెం కనబడనందున అతనికి అమితంగా విచారం కలిగింది. మీరు యింత ఆస్తికులై యుండి కూడా పిలక పెట్టుకోలేదు. జందెం వేసుకోలేదు. నాకు చాలా విచారం కలుగుతున్నది. యీ రెండూ హిందూ మత బాహ్యచిహ్నాలు. ప్రతి హిందువు యీ రెండిటినీ ధరించాలి అని అన్నాడు.
పది సంవత్సరాల వయస్సులో నేను పోరుబందరు నందు బ్రాహ్మణులు వేసుకున్న జందాలకు కట్టియున్న తాళం చెవుల గలగలలు విని ఈర్ష్యపడుతూ వుండేవాణ్ణి. నేను కూడా జందెం వేసుకొని దానికి తాళం చెవులు కట్టి గలగలలాడిస్తూ తిరిగితే ఎంత బాగుంటుందో అని అనుకునేవాణ్ణి. కాఠియావాడ్ నందలి వైశ్యకులంలో అప్పుడు జందెం వేసుకునే పద్ధతి అమలులో లేదు. అయితే పై మూడు కులాలవారు జందెం ధరించాలని ప్రచారం సాగుతూ వున్న రోజులవి. తత్ఫలితంగా గాంధీ కుటుంబీకులు కొందరు జందెం వేసుకున్నారు. మా ముగ్గురు అన్నదమ్ములకు రామరక్షాస్తోత్రం నేర్పిన బ్రాహ్మణుడు జందాలు వేశాడు. నిజానికి తాళం చెవుల అవసరం లేనప్పటికీ నేను రెండు మూడు తాళం చెవులు తెచ్చి నా జందానికి కట్టుకున్నాను. జందెం తెగిపోయింది. దానితోపాటు మోహమనే దారం కూడా నాలో తెగిపోయిందో లేదో గుర్తులేదు. కాని నేను ఆ తరువాత యిక క్రొత్త జందెం వేసుకోలేదు. పెద్దవాడైన తరువాత నాకు జందెం వేయాలని భారతదేశంలోనేగాక దక్షిణ ఆఫ్రికాలో కూడా కొందరు ప్రయత్నించారు. కాని వారి తర్కం నామీద పనిచేయలేదు. శూద్రులు జందెం ధరించనప్పుడు యితరులు ఎందుకు ధరించాలి? మా కుటుంబంలో మొదటి నుండి అమలులో లేని యీ జంద్యాన్ని మధ్యలో ఎందుకు ప్రవేశపెట్టాలి అను ప్రశ్నలకు సరియైన సమాధానం లభించలేదు. కావాలంటే జందెం దొరుకుతుంది. కాని దాన్ని ధరించడానికి తృప్తికరమైన కారణాలు కనబడలేదు. వైష్ణవుణ్ణి గనుక నేను పూసల దండ ధరించేవాణ్ణి. మా అన్నదమ్ములందరికీ పిలకజుట్టు వుంది. ఇంగ్లాండు వెళ్లినప్పుడు శిరస్సు ఉత్తగా వుండవలసి వచ్చింది. తెల్లవాళ్లు పిలక చూచి నవ్వుతారని, నన్ను అడివి మనిషి అని అనుకుంటారని భావించి పిలక తీసివేయించాను. నాతోబాటు దక్షిణ ఆఫ్రికాలో వున్న మా అన్నగారి కుమారుడు ఛగన్‌లాలు గాంధీ కడు శ్రద్ధతో పిలక వుంచుకున్నాడు. ప్రజా సేవకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు ఆ పిలక యిబ్బంది కలిగిస్తుందని చెప్పి నేను బలవంతాన పిలక తీసివేయించాను. స్వామికి యీ విషయమంతా చెప్పి “జందెం మాత్రం నేను వేసుకోను. ఎక్కువమంది హిందువులు జందెం వేసుకోరు. అయినా వారంతా హిందువులుగానే పరిగణింపబడుతూ వున్నారు. అందువల్ల జందెం వేసుకోవలసిన అవసరం లేదని నా అభిప్రాయం. అదీగాక యజ్ఞోపవీతం ధరించడం అంటే మరో జన్మ ఎత్తడమే. అనగా సంకల్పశుద్ధిగా పరిశుద్ధికావడం, అంటే ఊర్థ్వగాములం కావడమన్నమాట. యిప్పుడు హిందువులందరూ పూర్తిగా పతనావస్థలో వున్నారు. అట్టి వీరికీ జందెం వేసుకునే అధికారం లేదు. అస్పృశ్యత అనే మురికిని కడిగివేయాలి, హెచ్చులొచ్చులను మరిచిపోవాలి. మనలో చోటు చేసుకున్న చెడును తొలగించి వేయాలి. అధర్మాన్ని, పాఖండత్వాన్ని దూరం చేయాలి. అప్పుడే యజ్ఞోపవీతం ధరించే హక్కు హిందూ సమాజానికి కలుగుతుందని నా అభిప్రాయం. అందువల్ల జందెం విషయమై మీ మాటలు నాకు మింగుడుపడవు. కాని పిలక విషయమై మీరు చెప్పిన మాటల్ని గురించి యోచిస్తాను. మొదట పిలక నాకు వుండేది. కాని సిగ్గువల్ల అంతా నవ్వుతారేమోననే భావంతో నేనే తొలగించి వేశాను. దాన్ని తిరిగి పెట్టుకోవడం మంచిదని నాకు తోస్తున్నది. నా అనుచరులతో యీ విషయమై నేను మాట్లాడుతాను అని చెప్పాను. స్వామికి జందెం గురించి నేను అన్న మాటలు నచ్చలేదు. నేను ధరించకూడదు అని చెబుతూ చెప్పిన కారణాలు, ధరించవచ్చును అని చెప్పుటకు అనుకూలమని ఆయనకు తోచాయి. అయితే ఋషీకేశంలో జందాన్ని గురించి నేను చెప్పిన మాటల పై యిప్పటికీ నేను నిలబడివున్నాను. వేరు వేరు మతాలు వున్నంతవరకు ఆ మతాలవారికి బాహ్యచిహ్నాలు బహుశా అవసరం అవుతాయి. కాని ఆ బాహ్యచిహ్నాలు ఆడంబరంగా మారినప్పుడు, తన మతమే యితర మతాల కంటే గొప్పదని చెప్పుటకు సాధనాలుగా మారినప్పుడు వాటిని త్యజించడం మంచిది. యిప్పుడు జందెం హిందూ సమాజాన్ని ఉన్నత స్థాయికి గొంపోవుటకు సాధనమను విశ్వాసం నాకు కలుగలేదు. అందువల్ల దాని విషయంలో తటస్థంగా వున్నాను. కాని పిలక జుట్టు తీసివేసిన కారణాలను తలచుకుంటే నాకే సిగ్గువేస్తున్నది. అందువల్ల అనుచరులతో చర్చించి పిలక పెట్టుకోవాలనే నిర్ణయానికి వచ్చాను.
ఇక మనం లక్ష్మణ ఉయ్యాల దగ్గరకు వెళదాం. ఋషికేశం మరియు లక్ష్మణ ఝూలా దగ్గరి ప్రకృతి దృశ్యాలు ఎంతో రమణీయంగా వున్నాయి. ప్రకృతి శోభను, ప్రకృతి యొక్క శక్తిని గుర్తించగల మన పూర్వీకుల సామర్థ్యాన్ని, ఆ శోభకు ధార్మిక స్థాయి కల్పించగల స్తోమతను, వారి దూరదృష్టిని చూచి నా హృదయం శ్రద్ధాభక్తితో నిండిపోయింది. కాని అక్కడ మనిషి చేసిన నిర్మాణ వ్యవహారం చూచి నా మనస్సుకు అశాంతి కూడా కలిగింది. హరిద్వారంలోనే గాక, ఋషికేశంలో కూడా జనం పరిశుద్ధమైన నదీ తీరాన్ని మలమూత్రాదులతో పాడు చేస్తున్నారు. తప్పు చేస్తున్నామనే భావం కూడా వారికి లేదు. దొడ్డికి వెళ్లదలచినవారు దూరం పోవచ్చుగదా! జనం తిరిగే చోటనే మలమూత్రాదులు విసర్జిస్తున్నారు. యిది చూచి మనస్సుకు బాధ కలిగింది. లక్ష్మణ ఉయ్యాల దగ్గరకు వెళ్లగా ఇనుప ఉయ్యాల కంటపడింది. మొదట యీ వంతెన త్రాళ్లతో కట్టబడి వుండేదని, దాన్ని తెగగొట్టి ఒక ఉదార హృదయుడగు మార్వాడీ ఎంతో ధనం వెచ్చించి ఇనుముతో వంతెన తయారుచేయించి దాని తాళం చెవి ప్రభుత్వం వారికి అప్పగించాడని జనం చెప్పారు. త్రాళ్ళ వంతెనను గురించి నేను ఊహించలేదు కాని యీ ఇనుప వంతెన మాత్రం యిక్కడి సమాజ శోభను కలుషితం చేస్తున్నదని చెప్పగలను. చూడటానికి అసహ్యంగా వున్నది. జనం నడిచే మార్గపు తాళం చెవి ప్రభుత్వానికి అప్పగించారని విని బాధపడ్డాను. ప్రభుత్వం యెడ విశ్వాసం కలిగియున్న ఆనాటి నా మనస్తత్వానికి కూడా ఆ విషయం తెలిసినప్పుడు బాధ కలిగింది.
కొంచెం ముందుకు వెళ్లగా అక్కడ స్వర్ణాశ్రమం కనబడింది. దాని పరిస్థితి ఘోరంగా వున్నది. టిన్ను రేకులతో కప్పబడి వున్న పందిరి గుడిశల్లాంటి గదులకు స్వర్ణాశ్రమం అని పేరు పెట్టారు. యీ గదులు సాధన చేసేవారి కోసం నిర్మించబడ్డాయని చెప్పారు. ఇప్పుడు ఆ గదుల్లో ఒక్క సాధకుడు కూడా లేడు. వాటిని అంటి పెట్టుకొని కొన్ని మేడలు వున్నాయి. వాటిలో వుండేవారిని చూచాక వారి ప్రభావం కూడ నా మీద ఏమీ పడలేదు.
మొత్తం మీద హరిద్వార్‌లో కలిగిన అనుభవాలు నా దృష్టిలో అమూల్యాలు. వాటి ప్రభావం నా మీద బాగా పడింది. నేను ఎక్కడ వుండాలో, ఏం చేయాలో నిర్ణయించుకునేందుకు హరిద్వార్‌లో కలిగిన అనుభవాలు నాకు అమితంగా తోడ్పడ్డాయి.