7. కుంభయాత్ర
డాక్టర్ ప్రాణజీవనదాస్ గారిని కలుసుకునేందుకు రంగూన్ వెళ్లవలసి వచ్చింది. త్రోవలో శ్రీ భూపేంద్రనాధ బోసుగారి ఆహ్వానం మీద కలకత్తాలో ఆగాను. అక్కడ బెంగాలీల సౌజన్యాన్ని అపరిమితంగా చవి చూచాను. అప్పుడు నేను ఫలాలు మాత్రమే తీసుకుంటూ వున్నాను. నాతోబాటు మా అబ్బాయి రామదాసు వున్నాడు. కలకత్తాలో దొరికే పండ్లు మొదలుగా గల వన్నీ కొని మా కోసం సిద్ధంగా వుంచారు. స్త్రీలు రాత్రంతా జాగరణచేసి పిష్తా మొదలగు వాటి బెరుళ్లు వలిచారు. తాజా పండ్లను ఎంతో అందంగా అమర్చారు. నా అనుచరులం కోసం రకరకాల పిండివంటలు సిద్ధం చేశారు. ఆ ప్రేమ ఆ అతిధి సత్కారం నాకు బోధపడింది. కాని ఒకరిద్దరు అతిధుల కోసం కుటుంబసభ్యులంతా యీవిధంగా శ్రమపడటం నాకు నచ్చలేదు. అయితే యీ కష్టాన్నుండి బయటపడే మార్గం నాకు కనబడలేదు.
రంగూన్ వెళ్లేటప్పుడు నేను ఓడలో డెక్‌మీద ప్రయాణించే యాత్రీకుణ్ణి. శ్రీ బోసుగారింటి వద్ద ప్రేమాధిక్యత. స్టీమరు మీద దారిద్ర్యపు ఆధిక్యత. డెక్ మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఎన్నో కష్టాలు పడ్డాను. స్నానం చేసే చోటు మురికి కూపం. నిలబడేందుకు కూడా వీలులేని స్థితి. పాయిఖానా నిజంగా నరకమే. మలమూత్రాలు తొక్కుకుంటూ నడవడం లేక మలమూత్రాల మీదుగా దూకుతూ వాటిని దాటడం నావల్లకాలేదు. ఓడ అధికారి దగ్గరికి వెళ్లాను. కాని వినిపించుకునే నాధుడే లేడు. యాత్రీకులు తమ మురికిచే ఓడను పాడుచేశారు. కూర్చున్నచోటనే ఉమ్మివేయడం అక్కడే జర్దా వగైరా నోట్లో పెట్టుకుని పిచికారీ గొట్టంలా ఉమ్మివేయడం, అబ్బ! అక్కడి దృశ్యం వర్ణనాతీతం. ఒకటే గోల. ప్రతివాడు ఎక్కువ చోటును ఆక్రమించుకోడానికి ప్రయత్నించటమే. ప్రక్కవాడిని గురించి పట్టించుకునే స్థితిలో ఎవ్వరూ లేరు. వాళ్లు, వాళ్ల సానూను. అంతే, రెండు రోజుల ఆ యాత్ర నా పాలిట నరకయాత్ర అయిపోయింది.
రంగూను చేరిన తరువాత ఏజంటుకు వివరమంతా వ్రాశాను. తిరుగు ప్రయాణంలో కూడా డెక్‌మీదనే ప్రయాణం చేశాను. అయితే యీసారి నా జాబు వల్ల మరియు డాక్టర్ మెహతాగారి ప్రయత్నం వల్ల సౌకర్యాలు లభించాయి. అయితే నా ఫలాహారం గొడవ అక్కడ కూడా అవసరం కంటే మించి వ్యధ కలిగించింది. డాక్టర్ మెహతాగారి ఇంటిని నా యింటిలాగానే చూసుకునేవాణ్ణి. అట్టి సంబంధం వారితో నాకు వున్నది. తినే పదార్థాల సంఖ్యను తగ్గించినా రకరకాలు పండ్లు లభించాయి. వాటిని వ్యతిరేకించేవాణ్ణి కాదు. ఆ పండ్లు కంటికి యింపుగాను, నోటికి రుచిగాను వుండేవి. అయితే రాత్రిపూట ఎనిమిది తొమ్మిది గంటలవుతూ వుండేది.
ఈ సంవత్సరం 1931లో హరిద్వారంలో కుంభమేళా జరుగబోతున్నది. అందు పాల్గొనాలని కోరిక నిజానికి నాకు కలుగలేదు. అయితే మాహాత్మా మున్షీగారి దర్శనానికి వెళ్లవలసిన అవసరం వున్నది. కుంభమేళా సమయంలో గోఖలేగారి భారత సేవక సమాజం ఒక పెద్ద బృందాన్ని పంపింది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు హృదయనాధ్ కుంజ్రూ చూస్తున్నారు కీ.శే డాక్టర్ దేవ్‌కూడా ఆ బృందంలో వున్నారు. మా అనుచరులు కూడా మేళాలో వాలంటీర్లుగా పనిచేయాలని భావించారు. నేను హరిద్వార్ చేరుకునేసరికి మగన్‌లాలు ఆశ్రమవాసులను వెంటబెట్టుకొని అక్కడికి చేరుకున్నారు. నేను రంగూను నుండి తిరిగి రాగానే వెళ్లి ఆ బృందంతో కలిశాను. కలకత్తా నుండి హరిద్వార్ చేరడానికి రైల్లో నానా అవస్థ పడవలసి వచ్చింది. రైలు పెట్టెలో దీపాలు లేవు. అంతా చీకటి. సహరాన్ పూర్ నుండి గూడ్సు పెట్టెలో జనాన్ని పశువుల్ని నింపినట్లు నింపివేశారు. రైలు పెట్టెలకు పైకప్పు లేనందున సూర్యుని ఎండ ప్రయాణీకుల్ని బాగా మాడ్చివేసింది. క్రింద ఇనుపరేకులు. యిక ప్రయణీకుల బాధ వర్ణణాతీతం. ఎండకు తట్టుకోలేక జనం దాహం దాహం అని కేకలు వేయసాగారు. హిందువులు భావుకులు కదా! మహమ్మదీయుడు మంచినీళ్లు యిస్తే త్రాగరు. యిట్టి భావుకులగు హిందువులు మందు అని చెప్పి డాక్టరు మద్యం యిచ్చినా, మహమ్మదీయ, క్రైస్తవ డాక్టర్లు నీళ్లు యిచ్చినా, మాంసం పుచ్చుకోమన్నా కిమ్మనకుండా పుచ్చుకుంటారు. పుచ్చుకోవచ్చునా లేదా అని కూడా యోచించరు. శాంతినికేతనంలో చూచాను. పాకీపని చేయడం మనదేశంలో ఒక వృత్తిగా మారిపోతున్నది. మా వాలంటీర్ల కోసం ఏదో సత్రం ఆవరణలో డేరాలు వేశారు. మలమూత్ర విసర్జన కోసం డాక్టర్ దేవ్ కొన్ని గుంటలు త్రవ్వించారు. అయితే ఆ గుంటల పారిశుద్ధ్యం విషయంలో డాక్టర్ దేవ్ జీతాలు తీసుకొని పనిచేసే పాకీవారి మీద ఆధారపడ్డారు. యీ విషయం నాకు తెలిసింది. గుంటల్లో పడే మలాన్ని మట్టితో కప్పివేయడం, పారిశుద్ధ్య కార్యక్రమం గుంటల దగ్గర కొనసాగించడం మా బృందంవారు చేయగలరనీ, ఫినిక్సులో యిట్టిపనివారు చేశారనీ, మావారికి అనుమతి యిమ్మని డాక్టర్ దేవ్ గారిని కోరాను. ఆయన సంతోషంతో అంగీకరించారు. అనుమతించమని కోరింది నేను అయినా బాధ్యత వహించవలసిన వ్యక్తి మదన్‌లాలు గాంధీయే. డేరాలో కూర్చొని జనానికి దర్శనం యివ్వడం, వచ్చేపోయే జనంతో ధర్మాన్ని గురించి, తదితర విషయాలను గురించి చర్చిస్తూ వుండటం నా పని అయింది. ఇట్టి దర్శనం యిచ్చే కార్యక్రమంతో విసిగిపోయాను. ఒక్క నిమిషం కూడా సమయం చిక్కలేదు. స్నానానికి వెళ్లినా నన్ను చూచేందుకు జనమే జనం. పండ్లు తినేటప్పుడు కూడా జనమే జనం. ఒక్క నిమిషం కూడా నన్ను జనం వదలలేదు. దక్షిణ ఆఫ్రికాలో నేను చేసిన కొద్దిపాటి సేవా కార్యక్రమాల ప్రభావం యావద్భారతావని పై అపరిమితంగా పడిందను విషయం హరిద్వార్‌లో బయటపడింది. నేను రెండు తిరగలి రాళ్ల మధ్య పడి నలిగిపోసాగాను. గుర్తించబడనిచోట మూడో తరగతి రైలు ప్రయాణీకుడిగా నరకయాతన అనుభవించాను. గుర్తింపబడిన చోట విపరీతమైన జనసమర్దంతో నానా యాతన పడ్డాను. రెండింటిలో ఏది మేలైనదీ అని అడిగితే చెప్పటం కష్టం. రెండూ రెండే. దర్శనం కోసం ఎగబడే జనాన్ని చూచి ఒక్కొక్కప్పుడు నాకు కోపం బాగా వచ్చిన ఘట్టాలు వున్నాయి. ఆ తాకిడికి తట్టుకోలేక లోలోన బాధపడిన క్షణాలు అనేకం వున్నాయి. కాని మూడో తరగతి ప్రయాణం చేస్తున్నప్పుడు యమయాతన పడ్డానేకాని ఎప్పుడూ కోపం రాలేదు. పైగా మూడవ తరగతి ప్రయాణం వల్ల పలు అనుభవాలు పొంది ఔన్నత్యం పొందాను.
అప్పుడు బాగా తిరగగల శక్తి నాకు వున్నది. అందువల్ల కాలినడకన బాగా తిరిగాను. రోడ్డు మీద నడవడం కూడా కష్టమయ్యేటంతగా నాకు అప్పటికి ప్రశస్తి రాలేదు. ప్రయాణాలలో ధార్మిక భావనకంటే ప్రజల్లో అజ్ఞానం, నిలకడలేకపోవడం, మొండితనం, పెంకితనం ఎక్కువగా కనబడ్డాయి. సాధువులు తండాలు తండాలుగా వచ్చిపడ్డారు. వాళ్లు పరమాణ్ణం, మాల్‌పూరీలు తినడానికే పుట్టారా అని అనిపించేలా వ్యవహరించారు. యిక్కడ అయిదుకాళ్ల ఆవును చూచి ఆశ్చర్యపడ్డాను. కాని తెలిసినవారు దాని రహస్యం చెప్పగా నివ్వెరబోయాను. పాపం ఆ అయిదు కాళ్ళ ఆవు, దుష్టులు దుర్మార్గులు అయిన లోభులుదుర్మార్గానికి తార్కాణనుని తెలిసింది. దూడ బ్రతికి వున్నప్పుడు దాని కాలు ఒకటి నరికి, ఆవు మెడను కత్తితో చీల్చి అందు దూడ కాలును అమర్చి మెడను సరిచేస్తారట. ఎంతటి కిరాతకం అజ్ఞానుల కండ్లలో కారం కొట్టి డబ్బులు గుంజేందుకై చేస్తారట. అయిదు కాళ్లుగల గోమాతను చూచేందుకు ముందుకురకని హిందువు వుంటాడా? అట్టే గోమాతకు ఎంత డబ్బైనా యివ్వకుండా హిందువు వుండగలడా?
కుంభోత్సవం రోజు వచ్చింది. నాకు అదిపావనదినం. నేను యాత్రకోసం హరిద్వార్ వెళ్లలేదు. తీర్థస్థలాల్లో పవిత్రతను అన్వేషించేందుకై వెళ్లాలనే మోహం నాకు కలుగలేదు కాని 17 లక్షలమంది జనంలో అంతా పాఖండులు కారుకదా! ఆ మేళాలో 17 లక్షలమంది పాల్గొంటారని అంచనా వేశారు. వారిలో చాలామంది పుణ్యం కోసం, శుద్ధికోసం వచ్చారనడంలో నాకేట్టి సందేహమూ లేదు. ఈ విధమైన శ్రద్ధ ఆత్మను ఎంతటి ఉన్నత స్థాయికి తీసుకువెళుతుందో చెప్పడం కష్టమే. పక్కమీద పడుకొని ఆలోచనా సాగరంలో తేలిపోసాగాను. నాలుగు వైపుల ముసిరియున్న పాఖండుల మధ్య పవిత్రాత్మలు కూడా కొన్ని వున్నాయి. ఆ ఆత్మలు దేవుని దర్బారులో దండనకు గురికావు. అసలు యిటువంటి చోటుకు రాకూడదనుకుంటే అసమ్మతిని తెలియజేసి ఆనాడే నేను తిరిగి వెళ్లిపోతే బాగుండేది. వచ్చాను గనుక కుంభం రోజున క్రొత్త వ్రతాన్ని ప్రారంభించి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని భావించాను. వ్రతాలనే కోడులమీద నిలబడి వున్న జీవితం నాది. అందువల్ల కఠోరమైన వ్రతానికి పూనుకోవాలనే నిర్ణయానికి వచ్చాను. కలకతాలోను, రంగూన్‌లోను నావల్ల యింటి యజమానులు పడ్డ శ్రమ జ్ఞప్తికి వచ్చింది. దానితో నేను తినే పదార్థాల సంఖ్యను బాగా తగ్గించి వేయాలని, చీకటి పడకముందే ఫలాహారం చేసివేయాలని నిర్ణయానికి వచ్చాను. నేను చేపట్టే వ్రతం యిదే. యీ విధంగా నన్ను నేను హద్దులో పెట్టుకోకపోతే యింటి యజమానులు పడే శ్రమ ఎక్కువైపోతుంది. నా సేవచేయడానికే వారికాలం చెల్లిపోతుంది. అందువల్ల 24గంటల్లో 5 పదార్థాలు మాత్రమే పుచ్చుకుంటానని, చీకటి పడకముందే భోజన కార్యక్రమం ముగించివేస్తానని వ్రతం పట్టాను. జబ్బు పడినప్పుడు మందు రూపంలో పదార్థాలు పుచ్చుకోవలసివస్తే ఏం చేయాలి అని కూడా యోచించి, అట్టి స్థితిలో కూడా 5 పదార్థాలు మాత్రమే తీసుకోవాలని నిర్ణయించాను. యీ రెండు వ్రతాలు ప్రారంభించి 13 సంవత్సరాలు గడిచాయి. ఎన్నో గడ్డు పరీక్షలను ఎదుర్కొన్నాను. అయితే పరీక్షా సమయంలో యీ వ్రతాలు నా జీవితకాలాన్ని పెంచాయనే విశ్వాసం నాకు కలిగింది. అనేక పర్యాయాలు జబ్బుల పాలిట పడకుండా యీ వ్రతాల వల్ల రక్షణ కూడా పొందాను.