9. ఆశ్రమ స్థాపన
ది. 25 మే 1915 నాడు సత్యాగ్రహ ఆశ్రమ స్థాపన జరిగింది. హరిద్వార్‌లో వుండమని శ్రద్ధానందగారు చెప్పారు. వైద్యనాదదామంలో వుండమని కలకత్తాకు చెందిన కొందరు మిత్రులు సలహా ఇచ్చారు. రాజకోటలో వుండమని కొందరు మిత్రులు కోరారు. ఒకసారి అహమదాబాదు వెళ్లాను. చాలామంది మిత్రులు అహమదాబాదులో వుండమని చెప్పారు. ఆశ్రమానికి అయ్యే ఖర్చంతా భరిస్తామని చెప్పి ఇల్లు వెతికి పెట్టే బాధ్యత కూడా వహిస్తామని మాట యిచ్చారు.
అహమదాబాదు మీద మొదటి నుండి నాకు చూపు వున్నది. నేను గుజరాతీ వాడిని, గుజరాతీ భాష ద్వారా దేశానికి ఎక్కువ సేవ చేయగలుగుతానని గ్రహించాను. చేనేతకు అహమదాబాదు కేంద్రం కావడం వల్ల అక్కడ చరఖా పని బాగా సాగుతుందనే భావం కూడా నాకు కలిగింది. గుజరాత్‌లో పెద్ద పట్టణం గనుక, యిక్కడ ధనవంతులు ఎక్కువగా వుండటం వల్ల వారి సాయం లభిస్తుందనే ఆశ కూడా కలిగింది. అహమదాబాదుకు చెందిన మిత్రులతో మాట్లాడుతూ వున్నప్పుడు అస్పృశ్యతను గురించి కూడా చర్చ జరిగింది. ఎవరైనా అంత్యజ సోదరుడు ఆశ్రమంలో చేరదలచుకుంటే నేను తప్పక చేర్చుకుంటానని స్పష్టంగా చెప్పాను. “మీ షరతుల ప్రకారం నడుచుకునే అంత్యజుడు మీకెక్కడ దొరుకుతాడు?” అంటూ ఒక వైష్ణవ మిత్రుడు తన మనస్సును శాంతపరచుకున్నాడు. చివరికి అహమదాబాదులో వుండాలని నిర్ణయం చేశాము.
ఇంటి కోసం అన్వేషణ ప్రారంభమైంది. అహమదాబాదులో నన్ను వుంచడానికి ప్రముఖంగా కృషి చేసిన శ్రీ జీవన్‌లాల్ బారిష్టరుగారి కోచరబ్‌లో గల గృహం అద్దెకు తీసుకోవాలని నిర్ణయించాం. ఆశ్రమానికి ఏం పేరు పెట్టాలి అని చర్చ జరిగింది. ఎన్నో పేర్లు దృష్టికి వచ్చాయి. సేవాశ్రమం, తపోవనం అంటూ చాలా పేర్లు చర్చకు వచ్చాయి. సేవాశ్రమం పేరు బాగున్నదే కాని ఏరకమైన సేవయో బోధపడలేదు. మేము చేసేది తపస్సే అయినా ఆ పేరు చాలా బరువుగా వున్నది. మేము చేయవలసింది సత్యశోధన, సత్యం కోసమే మా కృషి, మా ప్రయత్నం. దక్షిణ ఆఫ్రికాలో నేను అమలు చేసిన పద్ధతిని భారతదేశానికి తెలియజేయాలి. ఆ శక్తి ఎంత వ్యాప్తం కాగలదో చూడాలి. అందువల్ల నేను, నా అనుచరులు కూడా సత్యాగ్రహ ఆశ్రమం అను పేరుకు యిష్టపడ్డాం. అందు సేవ, సేవావిధానం రెండూ సహజంగా యిమిడి వుంటాయని భావించాం. ఆశ్రమ నియమావళి ముసాయిదా ఒకటి తయారుచేసి అందరికీ పంపి మీ అభిప్రాయం తెలియజేయమని కోరాం. చాలామందికి నియమావళి నచ్చింది. కాని నియమావళి యందు వినమ్రతకు ప్రముఖ స్థానం లభించాలని వారు సూచించారు. అంటే మన యువకుల్లో వినమ్రత తక్కువగా వున్నదని వారి భావం అన్నమాట. నేను కూడా యీ సత్యాన్ని గ్రహించాను. కాని వినమ్రతను వ్రతంగా భావించి దానికి ప్రాముఖ్యం యిస్తే వినమ్రత తక్కువగా మిగిలిపోతుందేమో నను అనుమానం కలిగింది. వినమ్రతకు పూర్తి అర్థం శూన్యత్వం. శూన్యత్వాన్ని పొందడం కోసం యితర వ్రతాల్ని అనుష్టించాలి. వాస్తవానికి శూన్యత్వం మోక్షస్థితియే. ముముక్షువు లేక సేవకుడు చేసే ప్రతి పని యందు నమ్రత, అభిమానరాహిత్యం వుండితీరాలి. అవి లేకపోతే అతడు ముముక్షువు కాలేడు. సేవకుడు కాలేడు. స్వార్థపరుడవుతాడు. అహంకారి అవుతాడు.
ఆశ్రమంలో యిప్పుడు సుమారు 13 మంది తమిళులున్నారు. నాతోబాటు దక్షిణ ఆఫ్రికానుండి అయిదుమంది తమిళబాలురు వచ్చారు. వారితోబాటు, యిక్కడి సుమారు 25 మంది స్త్రీ పురుషులతో ఆశ్రమం ప్రారంభించాం. ఒకే వంటశాలలో అందరికీ భోజనం. అంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా ఉండేవారం.