ఐదవ భాగం

1. మొదటి అనుభవం

నేను దేశం చేరక ముందే ఫినిక్సు నుండి భారతదేశానికి రాదల్చుకున్న వాళ్లు వచ్చివేశారు. నిర్ణయం ప్రకారం వాళ్ల కంటె ముందుగా నేను రావాలి. కాని యుద్ధం కారణంగా నేను లండనులో ఆగిపోయాను. అయితే ఫినిక్సు నుండి వచ్చిన వారిని ఎక్కడ వుంచడమా అని ప్రశ్న బయలుదేరింది. అంతా కలిసి ఫినిక్సు ఆశ్రమంలో వుంటే మంచిదని భావించాను. ఫలానా చోటుకు వెళ్లమని చెబుదామంటే నాకు ఏ ఆశ్రమమూ తెలియదు. ఆండ్రూసును కలిసి వారు ఎలా చెబితే అలా చేయమని వ్రాశాను. వాళ్లను ముందు కాంగడీ గురుకులంలో వుంచారు. అక్కడ కీ.శే. శ్రద్ధానంద్ వాళ్లను తమ బిడ్డల్లా చూచుకున్నారు. తరువాత వారని శాంతినికేతనంలో వుంచారు. అక్కడ కవివర్యులు, వారి అనుచరులు వారి మీద ప్రేమామృతం కురిపించారు. ఆ రెండు చోట్ల వాళ్లకు కలిగిన అనుభవం వాళ్లకు నాకు చాలా ఉపయోగపడింది.

“కవివర్యులు, శ్రద్ధానంద్‌జీ, శ్రీసుశీలరుద్ర” యీ ముగ్గురిని ఆండ్రూసుగారు చెప్పే త్రిమూర్తులు అని అనేవాణ్ణి. దక్షిణాఫ్రికాలో ఆయన ఆ ముగ్గురిని అమితంగా పొగుడుతూ వుండేవారు. దక్షిణాఫ్రికాలో జరిగిన అనేక సమావేశాలలో, అనేక సందర్భాలలో ఆండ్రూసు యీ ముగ్గురిని స్మరిస్తూ వుండేవారు. సుశీలరుద్ర గారి దగ్గర మా ముగ్గురు బిడ్డల్ని వుంచారు. రుద్రగారికి ఆశ్రమం లేదు. అందువల్ల వారి ఇంట్లోనే పిల్లల్ని వుంచారు. ఆ యింటిని నా బిడ్డలకు అప్పగించివేశారని చెప్పవచ్చు. రుద్రగారి పిల్లలు, నా పిల్లలు మొదటిరోజునే మమేకం అయిపోయారు. దానితో నా పిల్లలు, ఫినిక్సు నుండి వచ్చిన వాళ్లు శాంతినికేతనంలో వున్నారని తెలుసుకొని, గోఖలేగారిని కలుసుకొని వెంటనే శాంతినికేతనం వెళ్లాలని తొందరపడ్డాను.

బొంబాయిలో అభినందనలు స్వీకరించునప్పుడు నేను కొద్దిగా సత్యాగ్రహం చేయవలసి వచ్చింది. మి. పేటిట్ గారి వద్ద నాకు స్వాగతోత్సవం ఏర్పాటు చేశారు. అక్కడ గుజరాతీలో సమాధానం యిచ్చుటకు నాకు ధైర్యం చాలలేదు. బ్రహ్మాండమైన భవనం, కండ్లకు మిరిమిట్లుగొలిపే లైట్లు. వైభవోపేతంగా వున్న ఆ ప్రదేశంలో గిర్మిట్‌కూలీల వెంట వున్న నాబోటి పల్లెటూరివాడికి స్థానం లేదని అనిపించింది. యీనాటి నా దుస్తుల కంటే ఆనాటి నా దుస్తులు కొంచెం బాగా వున్నాయని చెప్పవచ్చు. అప్పుడు చొక్కా, తలపాగా వగైరా దుస్తులు మంచివే ధరించాను. అయినా టిప్‌టాప్‌గా దుస్తులు ధరించియున్న అక్కడి వాళ్లమధ్య నేను విడిగా కనబడుతూ వున్నాను. ఏదో విధంగా అక్కడ పని ముగించుకొని నేను ఫిరోజ్‌మెహతాగారి ఒడిలో ఆశ్రయం పొందాను.

గుజరాతీ సోదరులు ఉత్సవం చేయకుండా వూరుకుంటారా? క్రీ.శే. ఉత్తమలాల్ త్రివేది ఆసభను ఏర్పాటు చేశారు. ఆ ఉత్సవ కార్యక్రమం గురించి ముందుగానే కొద్దిగా తెలుసుకున్నాను. ఆయన అధ్యక్షత వహించారో లేక ప్రధాన వక్తగా వున్నారో నాకు యిప్పుడు సరిగా గుర్తులేదు. కాని ఆయన క్లుప్తంగా మధురంగా ఇంగ్లీషులో ప్రసంగించారు. మిగతా ఉపన్యాసాలు కూడా ఇంగ్లీషులోనే జరిగినట్లు గుర్తు. నా వంతు వచ్చినప్పుడు నేను గుజరాతీలోనే ప్రసంగించాను. గుజరాతీ, హిందుస్తానీ భాషలయెడ నాకుగల పక్షపాత భావాన్ని కొద్దిగా వెల్లడించి గుజరాతీల సభలో ఇంగ్లీషు వాడకాన్ని వినమ్రతతో వ్యతిరేకించాను. అలాంటి భావం వ్యక్తం చేస్తున్నప్పుడు కొంచెం తటపటాయించాను. చాలాకాలం తరువాత దేశం వచ్చిన యితడు అవివేకంగా ప్రవాహానికి ఎదురీత ఈదుతూ వున్నాడే అని అనుకుంటారేమోనని భావించాను. ఏదిఏమైనా గుజరాతీ భాషలోనే మాట్లాడాను. ఎవ్వరూ నా మాటల్ని ఖండించలేదు. సహించారు. అందుకు నేను సంతోషించాసు. ఈ సభలో కలిగిన అనుభవంవల్ల యిప్పుడు ప్రజలు అనుకుంటున్న దానికి విరుద్ధంగా మాట్లాడినా యిబ్బంది కలుగదు అని గ్రహించాను. ఈ విధంగా రెండురోజులు బొంబాయిలో వుండి గోఖలేగారి అనుమతి పొంది పూనాకు బయలుదేరాను. 

2. గోఖలే గారితో

నేను బొంబాయి చేరగానే గోఖలేగారు “గవర్నరు మిమ్ము కలుసుకోవాలని అనుకుంటున్నారు. పూనాకు వెళ్లే ముందు మీరు వారిని కలవడం మంచిది” అని వార్త పంపారు. ఆ ప్రకారం నేను బొంబాయి గవర్నరు గారిని కలుసుకునేందుకు వెళ్లాను. మామూలు మాటల తరువాత మీరు నాకు మాట యివ్వండి. ప్రభుత్వం విషయమై మీరేదైనా అడుగు వేయాలనుకుంటే ముందుగా నాతో మాట్లాడుతూ వుండండి” అని ఆయన అన్నాడు.

“ఆవిధంగా మాట యివ్వడం నాకు సులభమే. ఎవరికైనా వ్యతిరేకంగా వ్యవహరించదలుచుకున్నప్పుడు ఆవిషయం వారికి తెలిపి వారి అభిప్రాయం తెలుసుకోవడం, సాధ్యమైనంతవరకు వారికి అనుకూలంగా వ్యవహరించడం సత్యాగ్రహి ధర్మం. దక్షిణ ఆఫ్రికాలో నేను సదా యీ నియమాన్ని పాటించాను. యిక్కడకూడా అలాగే పాటిస్తాను అని సమాధానం యిచ్చాను. లార్డ్ విల్లింగ్టన్ ధన్యవాదాలు తెలిపి మీరు అవసరమని భావించినప్పుడు నన్ను కలుసుకోవచ్చు. ప్రభుత్వం కావాలని ఏ చెడ్డ పని చేయదలచదని మీరే గ్రహిస్తారు అని అన్నాడు. “ఈ విశ్వాసమే నాకు ఆధారం” అని అన్నాను.

నేను పూనా చేరాను. అక్కడి వివరాలన్నింటిని వ్రాయడం సాధ్యంగాదు. గోఖలేగారు, వారి సొసైటీ (భారత్ సేవక్ సమాజ్) సభ్యులు అంతా ప్రేమామృతంతో నన్ను తడిపివేశారు. నాకు జ్ఞాపకం వున్నంత వరకు గోఖలేగారు తమ సొసైటీ సభ్యులనందరినీ పూనా పిలిపించారు. వారితో అనేక విషయాలను గురించి అరమరికలు లేకుండా చర్చించాను. సొసైటీలో చేరమని గోఖలేగారు నన్ను గట్టిగా కోరారు. నాకూ అట్టి కోరిక కలిగింది. కాని సాసైటీ సభ్యులకు ఒక ధర్మ సందేహం కలిగింది. సొసైటీ ఆదర్శాలకు గాంధీ ఆదర్శాలకు, యిరువురి పని చేసే తీరుకు గల వ్యత్యాసం వారు గ్రహించారు. అందువల్ల నన్ను సొసైటీలో సభ్యునిగా చేర్చుకోవచ్చా లేదా అని వారు సందేహించారు. కాని గోఖలేగారి భావం వేరుగా వుంది. నేను నా ఆదర్శాల మీద ఎంత దృఢంగా వుంటానో యితరుల ఆదర్శాలను అంత దృఢంగా గౌరవిస్తానని, యితరులతో బాగా కలిసి పోగలనని గోఖలేగారికి తెలుసు. మా సభ్యులు యింకా యితరులతో కలిసి పోగల మీ స్వభావాన్ని గ్రహించలేదు. వారు తమ ఆదర్శాల విషయమై దీక్ష కలవారు. స్వతంత్ర భావాలు కలవారు. వారు మిమ్ము స్వీకరిస్తారని ఆశిస్తున్నాను. ఒక వేళ వారు స్వీకరించకపోయినా మీ యెడ వారికి ఆదరణ, ప్రేమ లేవని మాత్రం మీరు భావించవద్దు. ఈ ప్రేమాదరణల రక్షణ కోసమే వారు ఏ విధమైన ప్రమాదాన్ని కొనితెచ్చుకునేందుకు యిష్టపడటం లేదు. మీరు నియమ ప్రకారం సొసైటీ సభ్యులైనా కాకపోయినా నేను మాత్రం మిమ్ము సొసైటీ సభ్యులుగా భావిస్తున్నాను అని అన్నారు. నా అభిప్రాయాలను స్పష్టంగా గోఖలేగారికి చెబుతూ “నేను సొసైటీ సభ్యుడనైనా, కాకపోయినా నేను ఒక ఆశ్రమం స్థాపించి అందు ఫినిక్సులో వున్న నా అనుచరులను వుంచుతాను. నేను కూడా అక్కడ వుంటాను. నేను గుజరాతీ వాణ్ణి. కనుక, గుజరాత్ ప్రాంతానికి సేవచేస్తూ తద్వారా దేశానికి అత్యధిక సేవచేయాలని భావిస్తున్నాను. అందువల్ల నేను గుజరాత్ ప్రాంతంలో ఎక్కడైనా వుంటాను” అని ప్రకటించాను. నా అభిప్రాయం గోఖలేగారికి నచ్చింది. “మీరు అలాగే చేయండి. మా సభ్యులతో జరిగిన చర్చల పరిణామం ఎలా వున్నప్పటికీ మీరు మాత్రం ఆశ్రమానికి అవసరమైన డబ్బు నావద్ద స్వీకరించాలి. మీ ఆశ్రమాన్ని మా ఆశ్రమంగా భావిస్తాను అని గోఖలే అన్నారు. నా హృదయం పొంగిపోయింది. ఆశ్రమం కోసం డబ్బు వసూలు చేయవలసిన అవసరం లేకుండా పోయినందుకు ఆనందం కలిగింది. అంతేగాక ఏ సమస్య వచ్చినా నేనొక్కడినేగాక, నాకు మార్గం చూపించగలవారు మరొకరున్నారనే భావం కూడా కలిగింది. దానితో నెత్తిమీద వున్న బరువు దిగిపోయినట్లనిపించింది. కీ.శే. డాక్టర్ దేవ్‌ను పిలిచి “గాంధీ గారి పేరిట ఖాతా ప్రారంభించండి, ఆశ్రమ స్థాపనకు ప్రజా సేవా కార్యక్రమాలకు అవసరమైన డబ్బు గాంధీ కోరినంత యివ్వండి అని గోఖలేగారు ఆదేశించారు. ఇక నేను పూనా నుండి శాంతినికేతన్ వెళ్లే ఏర్పాటులో వున్నాను. చివరిరోజు రాత్రి గోఖలే నాకు నచ్చే విధంగా విందు ఏర్పాటు చేశారు. ప్రత్యేకించి కొందరు మిత్రులను ఆ విందుకు ఆయన ఆహ్వానించారు. నేను భుజించే పదార్ధాలు అనగా ఎండు ద్రాక్ష వగైరా మరియు తాజా పండ్లు మాత్రమే వడ్డన చేయించారు. విందు ఏర్పాటు చేసిన చోటు వారి గది అతి సమీపంలో వుంది. వారి ఆరోగ్యం సరిగాలేదు. వారు విందులో పాల్గొనుటకు వీలులేని స్థితి. అయినా నాయందుగల ప్రేమ వారిని ఆగనిస్తుందా? ఏదో విధంగా వారు వచ్చి విందులో పాల్గొన్నారు. యింతలో మూర్ఛవచ్చి సొమ్మసిల్లిపోయారు. వారిని గదిలోకి చేర్చారు. ఆప్పుడప్పుడు వారు యీ విధంగా మూర్ఛపోతూ వుండటం జరుగుతూ వుంటుందట. విందు సాగించమని సందేశం పంపారు. సొసైటీ అనే ఆశ్రమం ముంగిట అతిథులు, ఇంటివాళ్లు, దగ్గరివాళ్లు అంతా కలిసి పెద్ద జంబుఖానా పరిచి దాని మీద కూర్చొని వేరు సెనగపప్పు, ఖర్జూరం మొదలగు వాటిని తింటూ ప్రేమతో చర్చలు జరుపుతూ, ఒకరి హృదయాలను మరొకరు తెలుసుకొనేందుకు ప్రయత్నించడం ఆ విందు యొక్క లక్ష్యం. అయితే గోఖలే గారికి వచ్చిన యీ మూర్ఛ మాత్రం నా జీవితంలో అసాధారణమైన ఘట్టంగా చోటుచేసుకున్నది. 

3. అది బెదరింపా?

మా అన్నగారు చనిపోయారు. వితంతువు అయిన మా వదినగారు తదితర కుటుంబీకులను కలుసుకునేందుకు రాజకోట మరియు పోర్‌బందర్ వెళ్లాను. దక్షిణ ఆఫ్రికాలో జరిగిన సత్యాగ్రహ సంగ్రామ సమయమప్పుడు నేను నా దుస్తుల్ని గిరిమిటియా కూలీల కనుగుణ్యంగా సాధ్యమైనంత వరకు మార్చుకున్నాను. విదేశాలలో కూడా ఇంట్లో ఆ డ్రస్సే వేసుకునేవాణ్ణి. మన దేశం వచ్చిన తరువాత కాఠియావాడ్ దుస్తులు ధరించాలని భావించాను. కాఠియావాడ్ డ్రస్సు నా దగ్గర వున్నది. ఆ డ్రస్సుతోనే బొంబాయిలో దిగాను. చొక్కా, అంగరఖా, ధోవతి తెల్లని తలపాగా, యిదీ ఆ డ్రస్సు. స్వదేశపు మిల్లుల యందు తయారైన బట్టతో ఆ దుస్తులు తయారయ్యాయి. మూడో తరగతిలో బొంబాయినుండి కాఠియావాడుకు వెళ్లాలి. తలపాగా అంగరఖా రెండూ జంజాటంగా వున్నాయి. అందువల్ల చొక్కా, ధోవతి, పది అణాలకు లభించిన కాశ్మీరు టోపీ ధరించాను. యిట్టి దుస్తులు ధరించే వాణ్ణి బీదవాడనే అంతా భావిస్తారు. అప్పుడు బీరంగావ్, బడవాఫణ్‌లో ప్లేగువ్యాధి వ్యాపించివుంది. ఆరోగ్యాధికారి నా చెయ్యి పట్టుకు చూచాడు. వేడిగా వుంది. అందువల్ల రాజకోటలో డాక్టరును కలవమని ఆదేశించి నా పేరు రాసుకున్నాడు.

బొంబాయి నుండి ఎవరో తంతి పంపగా బఢవాణ్ స్టేషనుకు అక్కడి ప్రసిద్ధ ప్రజాసేవకుడు దర్జీ మోతీలాల్ నన్ను కలుసుకునేందుకు వచ్చాడు. ఆయన బీరంగావ్ లో టోల్‌గేటు దగ్గర జరుగుతున్న పన్నుల వసూళ్లను గురించి, ప్రజలకు కలుగుతున్న యిబ్బందుల్ని గురించి నాకు చెప్పాడు. జ్వర తీవ్రతవల్ల నాకు మాట్లాడాలనే కోరిక కలుగలేదు. క్లుప్తంగా “మీరు జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా వున్నారా?” అని అడిగాను.

ఆలోచించకుండా ఠపీమని వెంటనే జవాబిచ్చే పలువురు యువకులవలె ఆయన కూడా వెళతానంటాడని అనుకున్నాను. కాని ఆ విధంగా ఆయన అనలేదు. స్థిరమైన నిర్ణయం వెల్లడించే వ్యక్తిలా “మేము తప్పక జైలుకు వెళతాము. మీరు మాకు మార్గం చూపించాలి. కాఠియావాడ్ వాసులం గనుక మీ మీద మాకు అధికారం వున్నది. యివాళ మిమ్మల్ని మేము ఆపం. తిరిగి వెళుతున్నప్పుడు బడవాణ్‌లో ఆగండి. యిక్కడి యువకుల కార్యక్రమాలు, వాళ్ల ఉత్సాహం చూచి మీరు ఆనందిస్తారు. మీరు మీ సైన్యంలో మమ్మల్ని స్వేచ్ఛగా చేర్చుకోవచ్చు” అని అన్నాడు.

మోతీలాలును పరిశీలించి చూచాను. అతని అనుచరులు అతణ్ణి గురించి “ఈ సోదరుడు దర్జీ వృత్తి చేపట్టినా ఎంతో నేర్పరి. రోజూ ఒక గంట సేపు కష్టపడి పనిచేసి ప్రతి నెల తన ఖర్చుల కోసం 15రూపాయలు మాత్రం సంపాదించుకుంటాడు. మిగతా సమయమంలో ప్రజల సేవకు వినియోగిస్తాడు. చదువుకున్న మా బోంట్లకు మార్గం చూపించి మా చేత పని చేయిస్తున్నాడు” అని చెప్పారు.

ఆ తరువాత మోతీలాలును దగ్గరగా చూచే అవకాశం నాకు లభించింది. ఆయనను గురించి వాళ్లు చెప్పిన మాటలన్నీ నిజమేనని అందు అతిశయోక్తి లేదని గ్రహించాను. సత్యాగ్రహ ఆశ్రమం స్థాపించినప్పుడు ప్రతినెల కొద్దిరోజులు ఆయన అక్కడ వుండేవారు. బీరం గ్రామాన్ని గురించి నాకు రోజూ చెబుతూ వుండేవాడు. ప్రయాణీకులకు కలిగే అసౌకర్యాలు సహించలేకపోయేవాడు. యీ మోతీలాలును నిండు యౌవ్వనంలో జబ్బు ఎత్తుకు పోయింది. బడవాణ్ శూన్యమైపోయింది.

రాజకోటచేరి మరునాడు ఉదయం ఆరోగ్యశాఖ అధికారి ఆదేశం ప్రకారం ఆసుపత్రికి వెళ్లాను. అక్కడి వారికి నేను పరిచితుణ్ణే. అందువల్ల నన్ను చూచి డాక్టర్లు సిగ్గుపడ్డారు. ఆవిధంగా ఆదేశించిన అధికారి మీద కోపం తెచ్చుకోసాగారు. నాకు మాత్రం దోషం కనబడలేదు. అతడు తన కర్తవ్యాన్ని నెరవేర్చాడు. అతడు నన్ను ఎరుగడు. ఒక వేళ నేనెవరినో తెలుసుకున్నా తనకు యివ్వబడ్డ ఆజ్ఞను పాలించడం అతని కర్తవ్యమేకదా! అంతా పరిచితులు కావడం వలన రాజకోటలో నన్ను ఆసుపత్రిలో వుంచకుండా యింటికి పంపి మా యింటిదగ్గరే నన్ను పరీక్షించారు. మూడో తరగతి ప్రయాణికుల్ని యీ విధంగా పరీక్షిస్తూ వుండటం వలన ఆ తరగతిలో ప్రయాణించే గొప్ప వాళ్లకు కూడా అట్టి పరీక్ష జరుగవలసిందే. అధికారులు కూడా పక్షపాతం వహించకూడదని నా అభిప్రాయం. అయితే అధికారులు మూడో తరగతి ప్రయాణీకుల్ని మనుష్యులుగా పరిగణించక జంతువులుగా పరిగణిస్తుంటారు. సంబోధించే తీరు చాలా అసభ్యంగా వుంటుంది. మూడో తరగతి ప్రయాణీకులు మాట్లాడేందుకు వీలులేదు. తర్కించేందుకు వీలు లేదు. అధికారులు చప్రాసీల్లా వాళ్లను చూస్తూవుంటారు. వాళ్లను నిలబెట్టి వేధిస్తారు. టిక్కట్టు తీసుకొని తిరిగి యివ్వక బాధిస్తారు? యీ బాధలన్నీ నేను స్వయంగా అనుభవించాను. యీ పరిస్థితుల్లో మార్పురావాలంటే చదువుకున్న వాళ్లు బీదవాళ్లుగా మారి, మూడో తరగతిలో ప్రయాణిస్తూ, ఆ ప్రయాణీకులకు చేకూరని ఏ సౌకర్యమూ తాముకూడా పొందకుండా అక్కడ కలిగే యిబ్బందుల్ని, అన్యాయాల్ని, బీభత్సాన్ని గట్టిగా ఎదిరించి వాటిని తొలగించాలి.

కాఠియావాడ్‌లో పర్యటించిన ప్రతిచోట జనం బీరం గ్రామంలో పన్ను వసూలు చేస్తున్న తీరు పట్ల అసమ్మతి తెలియజేశారు. వివరమంతా తెలుసుకొని లార్డ్ విల్లింగ్టన్ లోగడ నాకు యిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్నాను. కాగితాలన్నీ చదివాను. సత్యం గ్రహించాను. బొంబాయి ప్రభుత్వంతో ఉత్తర ప్రత్యుత్తరాలు ప్రారంభించాను. సెక్రటరీని కలిశాను. ఆయన అంతా విని విచారం వెల్లడించి ఢిల్లీ ప్రభుత్వం యీ విషయమై చూపుతున్న తీరును వివరించాడు. “మా చేతుల్లో వుంటే యీటోలుగేటును ఎప్పుడో ఎత్తి వేసే వాళ్లం. కాని అది తిన్నగా భారత ప్రభుత్వానికి సంబంధించినది కనుక మీరు వారి దగ్గరకు వెళ్లడం మంచిది” అని సెక్రటరీ చెప్పాడు. నేను భారత ప్రభుత్వానికి జాబు వ్రాశాను. ఉత్తరం అందినట్లు తెలియజేయటమే తప్ప వారేమీ చర్య గైకొనలేదు. లార్డ్ చేమ్స్‌ఫర్డును కలుసుకునే అవకాశం లభించినప్పుడు అనగా రెండు సంవత్సరాల తరువాత యీ వ్యవహారం మీద చర్య తీసుకున్నాడు. నేను యీ విషయం చెప్పగా లార్డ్ చేమ్స్‌ఫర్డు నివ్వెరబోయాడు. ఆయనకు బీరం గ్రామాన్ని గురించి ఏమీ తెలియదు. నా మాటలు ఓపికగా విని ఫోను చేసి అందుకు సంబంధించిన కాగితాలు వెంటనే తెప్పించుకున్నాడు. మీరు చెప్పిన విషయాలపై అధికారులు వ్యతిరేకించకపోతే తప్పక పన్నుల వసూళ్లను నిలిపి వేస్తానని మాట యిచ్చాడు. తరువాత కొద్ది రోజులకే పన్ను వసూళ్లు రద్దు చేశారని పత్రికల్లో చదివాను.

ఈ విజయం సత్యాగ్రహ విజయానికి పునాది అని భావించాను. అందుకు కారణం పున్నది. బొంబాయి ప్రభుత్వ సెక్రటరీ బీరం గ్రామ పన్నును గురించి మాట్లాడుతూ మీరు యీ విషయమై బగ్‌సరాలో చేసిన ప్రసంగపాఠం నాదగ్గర వున్నది. అందు మీరు సత్యాగ్రహం విషయం కూడా ఎత్తారు అని అంటూ “మీరు చేసింది బెదిరింపు కాదా? శక్తి సామర్థ్యాలుగల ఏ ప్రభుత్వమైనా యిలాంటి బెదిరింపులకు తలవంచుతుందా?” అని ఆయన నన్ను ప్రశ్నించాడు.

ఆయన ప్రశ్నకు సమాధానం యిస్తూ “ఇది బెదిరింపు కాదు. ప్రజాశిక్షణ, ప్రజలకు వారి కష్టాల్ని తొలగించుకునేందుకు అవలంబించవలసిన చర్యలను గురించి చెప్పడం నా ధర్మం. స్వాతంత్ర్యం కోరే ప్రజల దగ్గర తమ రక్షణకు అవసరమైన సాధనాలు కూడా వుండటం అవసరం. సాధారణంగా యిట్టి సాధనాలు హింసాపూరితంగా వుంటాయి. కాని సత్యాగ్రహం పూర్తిగా అహింసతో కూడిన సాధనం. దాని ఉపయోగాన్ని గురించి, దాని ప్రయోగాన్ని గురించి తెలియజేయడం నా కర్తవ్యం. ఆంగ్ల ప్రభుత్వం శక్తివంతమైనది. అందు నాకు సందేహం లేదు. అయితే సత్యాగ్రహం సర్వోన్నతమైన ఆయుధం. యీ విషయమై నాకెట్టి సందేహమూ లేదు” అని చెప్పాడు. ఆ సెక్రటరీ చతురుడు. “మంచిది చూద్దాం” అని అంటూ తల ఊపాడు. 

4. శాంతినికేతనం

రాజకోటనుండి శాంతినికేతనం వెళ్లాను. అక్కడి ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రేమ జల్లులతో నన్ను తడిపివేశారు. స్వాగత విధానంలో సాదాతనం, కళ, ప్రేమ మూడింటి సుందర సమన్వయం కనబడింది. అక్కడే కాకాసాహెబ్ కాలేల్కర్‌ను మొదటిసారి కలుసుకున్నాను. అందరూ కాలేల్కరును కాకాసాహబ్ అని ఎందుకంటారో నాకప్పుడు తెలియదు. కాని తరువాత తెలిసింది. ఇంగ్లాండులో నేను వున్నప్పుడు అక్కడ వున్న కేశవరావు దేశాపాండే బరోడా ప్రాంతంలో గంగానాధ విద్యాలయం నడుపుతూ వుండేవారు. వారికి గల భావాల్లో విద్యాలయంలో పనిచేసేవారంతా ఒకే కుటుంబీకులుగా వుండాలన్నది ఒకటి. ఆ ఉద్దేశ్యంతో అక్కడి ఉపాధ్యాయులందరికీ ఒక్కొక్క పేరు పెట్టారు. ఆ పద్ధతిలో కాలేల్కరు కాకా (పెదతండ్రి), అయ్యారు. ఫడకే మామ అయ్యాడు. హరిహరశర్మ అన్న అయ్యాడు. తదితరులకు కూడా తగిన పేర్లు లభించాయి. కాలేల్కర్ అనుచరుడు ఆనందనాధ్ (స్వామి), మామ మిత్రుడు పట్వర్ధన్ (అప్ప) పేర్లతో యీ కుటుంబంలో తరువాత చేరారు. యీ కుటుంబానికి చెందిన ఆ అయిదుగురు నా అనుచరులైనారు. దేశపాండే “సాహబ్” పేరట ప్రసిద్ధికెక్కారు. సాహబ్ గారి విద్యాలయం మూతబడగానే ఆ అయిదుగురు చెల్లాచెదురయ్యారు. అయినా తమ మధ్య నెలకొన్న ఆధ్యాత్మిక సంబంధాన్ని వీరు వదులుకోలేదు. కాకా సాహబ్ పలుచోట్లకు వెళ్లి అనుభవం గడిస్తూ శాంతినికేతనంలో చేరారు. ఆ కోవకు చెందిన చింతామణి శాస్త్రి అను మరొకరు కూడా ఇక్కడే వున్నారు. వీరిద్దరు సంస్కృతం బోధిస్తూ వుండేవారు.

శాంతినికేతనంలో మా అనుచరులకు బస విడిగా ఏర్పాటుచేశారు. అక్కడ మగన్‌లాల్ గాంధీ వారి మంచి చెడ్డలు చూస్తూ వున్నాడు. ఫినిక్సు ఆశ్రమంలో పాటించిన నియమనిబంధనల్ని తాను పాటిస్తూ యితరుల చేత పాటింప చేస్తూ వున్నాడు. తన జ్ఞానం, ప్రేమ, కష్టపడి పనిచేసే మనస్తత్వంతో శాంతి నికేతనంలో సువాసనలు ఆయన విరజిమ్మటం గమనించాను. అక్కడ ఆండ్రూస్ వున్నారు. పియర్సన్ వున్నారు. జగదానందబాబు, నేపాల్ బాబు, సంతోషబాబు, క్షితిమోహనబాబు, నగేన్‌బాబు, శరద్‌బాబు, కాళీబాబు మొదలగువారితో నాకు పరిచయం ఏర్పడింది.

నా స్వభావం ప్రకారం నేను విద్యార్థులతోను, ఉపాధ్యాయులతోను కలిసిపోయి కాయకష్టం గురించి చర్చ ప్రారంభించాను. జీతం తీసుకొని పనిచేసే వంటవానికి బదులు ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి వంటపని చేసుకుంటే మంచిది గదా అని నాకు అనిపించింది. అప్పుడు భోజనశాల ఆరోగ్యకరంగాను, పరిశుభ్రంగాను. ఆదర్శవంతంగాను వుంటుంది. విద్యార్థులు స్వయంపాకాన్ని గురించి ప్రత్యక్ష పాఠం నేర్చుకోగలుగుతారు. యీ విషయం ఉపాధ్యాయులకు చెప్పాను. యిద్దరు ముగ్గురు ఉపాధ్యాయులు తల ఊపారు. కొంతమందికి యీ ప్రయోగం నచ్చింది. విద్యార్థులకు క్రొత్త విషయం సహజంగానే నచ్చుతుంది. వెంటనే వారంతా ఉత్సాహంతో ముందుకు వచ్చారు. గురుదేవుని దాకా యీ విషయం వెళ్లింది. వారు కొద్ది సేపు యోచించి ఉపాధ్యాయులు అంగీకరిస్తే అమలు పరచడం మంచిదేనని అన్నారు. ఇది క్రొత్త ప్రయోగం. స్వరాజ్యప్రాప్తికి తాళంచెవి యిందు నిహితమై వున్నది అని గురుదేవులు విద్యార్థులకు చెప్పారు.

పియర్సన్ యీ ప్రయోగాన్ని విజయవంతం చేయుటకు అపరిమితంగా కృషి చేశారు. వారికి యీ పని బాగా నచ్చింది. కూరలు తరిగేందుకు ఒక బృందం ఏర్పడితే తిండిగింజలు శుభ్రం చేసేందుకు మరో బృందం ఏర్పడింది. వంట యింటి పారిశుద్ధ్యానికి నగేన్‌బాబు ఆధ్వర్యంలో కొందరు పూనుకున్నారు. పారలు పుచ్చుకొని వారంతా వంటి యింటిని పరిసరాల్ని బాగుచేస్తుంటే నాహృదయం సంతోషంతో పొంగిపోయింది. ఇది దరిదాపు వందమందికి పైగా ఉపాధ్యాయులు, విద్యార్థులు ఒక్కసారిగా ఠపీమని చేసేపని కాదు. కొందరికి అలసట కలిగింది. కాని చేసే పనికి ఆయన పూనుకున్నారు. అంట్లు తోముతున్న వారి అలసటను పోగొట్టి వారికి ఆహ్లాదం కలిగించేందుకై కొందరు సితారు వాయిస్తూ వుండేవారు. మొత్తం పనులన్నీ స్వయంగా చేసేందుకు విద్యార్థులు పూనుకున్నారు.

శాంతినికేతం తేనెటీగల తుట్టెలా తళతళ మెరిసిపోయింది. ఇటువంటి మార్పులు ఆగిపోకూడదు. ఫినిక్సు ఆశ్రమంలో మేము ప్రారంభించిన భోజనశాల స్వయంపోషకమై మంచిగా సాగింది. అందు సాదా భోజనం లభిస్తూ వుండేది. మసాలాల వాడకం తగ్గించి వేశాము. ఆవిరితో అన్నం, పప్పు, కూరలు గోధుమతో తయారయ్యే వస్తువులు తయారయ్యేవి.

తరువాత శాంతినికేతనంలో కొన్ని కారణాల వల్ల యీ ప్రయోగం ఆగిపోయింది. ప్రపంచ ఖ్యాతి బడసిన యీ సంస్థలో కొద్దిరోజుల పాటు యీ ప్రయోగం సాగినా సంస్థకు ఎంతో మేలే చేకూరిందని చెప్పవచ్చు. ఇంకా కొద్దిరోజులు శాంతినికేతనంలో వుందామని అనుకున్నాను. కాని సృష్టికర్త నన్ను అక్కడ వుండనీయలేదు. వారం రోజులు మాత్రమే వున్నాను. యింతలో పూనాలో గోఖలేగారు పరమపదించారని సమాచారం అందింది. శాంతినికేతనం విచారసాగరంలో మునిగిపోయింది. తమ విచారం ప్రకటించేందుకు అంతా నా దగ్గరకు రాసాగారు. దేవళంలో ప్రత్యేక సభ జరిగింది. వాతావరణం గంభీరంగా వుంది. ఆనాడు సాయంత్రమే నేను పూనాకు బయలుదేరాను. నా భార్య మరియు మగన్‌లు నాతోబాటు వున్నారు. మిగతావారంతా శాంతినికేతనంలో వుండిపోయారు. ఆండ్రూస్ బర్ద్వాను దాకా వచ్చారు, “హిందూ దేశంలో సత్యాగ్రహం చేయవలసి వస్తుందని మీరు భావిస్తున్నారా? అలా భావించితే ఎప్పుడు జరుగుతుందో ఊహిస్తున్నారా?” అని నన్ను ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు జవాబివ్వడం కష్టం. ఒక్క ఏడాదిపాటు దేశమందంతట పర్యటించమని, ప్రజా సమస్యలను గురించి స్వయంగా తెలుసుకొని యోచించమని, నిర్ణయాలను మాత్రం వెంటనే ప్రకటించవద్దని గోఖలే చెప్పారు. సరేనని వారికి మాట యిచ్చాను. ఆ మాట మీద నిలబడి వుంటాను. ఆ తరువాత అవసరమైతేనే నా అభిప్రాయం వెల్లడిస్తాను. అందువల్ల అయిదు సంవత్సరాల వరకు సత్యాగ్రహం చేయవలసిన అవసరం కలగదని భావిస్తున్నాను” అని చెప్పాను.

ఇక్కడ మరో విషయం పేర్కొనడం మంచిది “హింద్‌స్వరాజ్” లో నేను ప్రకటించిన విషయాలను గోఖలేగారు ఎగతాళిచేస్తూ ఒక్క ఏడాదిపాటు దేశమంతా తిరిగిచూస్తే మీభావాలు వాటంతట అవే త్రోవకు వస్తాయి అని అన్నారు. 

5. బాధాకరమైన మూడోతరగతి ప్రయాణం

బర్ద్వాన్ చేరిన తరువాత మేము మూడో తరగతి టికెట్లు తీసుకోవాలి. చాలా యిబ్బంది కలిగింది. ‘మూడో తరగతి ప్రయాణీకులకు ముందుగా టికెట్లు యివ్వం’ అని అన్నారు. స్టేషను మాస్టరును కలుద్దామని వెళ్లాను. ఆయనను కలుసుకోనిస్తారా? ఎవరో దయతో స్టేషన్ మాస్టరును చూపించారు. ఆయన దగ్గరకు వెళ్ళాను. ఆయన కూడా ఆ సమాధానమే యిచ్చాడు. కిటికీ తెరిచిన తరువాత టికెట్లు తీసుకుందామని వెళ్ళాను. బలంగా వున్నవారంతా తోసుకొని ముందుకు వెళ్లి టికెట్లు తీసుకుంటున్నారు. నాబోటి వాళ్లను వెనక్కి నెట్టివేస్తున్నారు. చివరికి టికెట్లు దొరికాయి. బండి వచ్చింది. అక్కడ కూడా ఇదే తంతు. బలిష్టులు ఎక్కుతున్నారు. కూర్చున్నవారికీ, ఎక్కినవారికి ద్వంద్వయుద్ధం సాగుతున్నది. తోపుళ్లు నెట్టుళ్లు అమోఘంగా సాగుతున్నాయి. నాబోటివాడు తట్టుకోగలడా? మేము ముగ్గురం అటుయిటు పరుగులు ప్రారంభించాం. ప్రతిచోట “జాగాలేదు” అన్నమాటే వినబడుతున్నది. నేను గార్డు దగ్గరికి వెళ్లాను. “జాగా దొరికితే ఎక్కు లేకపోతే తరువాత బండిలోరా” అని ఆయన అన్నారు. ఏం చేయాలో తోచలేదు. మగన్‌లాలును ఏదోవిధంగా బండి ఎక్కమని చెప్పాను. భార్యతో సహా నేను మూడో తరగతి టిక్కెట్లతో ఇంటరు పెట్టెలోకి ఎక్కాను. గార్డు నన్ను చూచాడు. అసన్‌సోల్ స్టేషనులో బండి ఆగింది. గార్డు అదనపు రేటు వసూలు చేసేందుకై నా దగ్గరకు వచ్చాడు. ‘నాకు చోటు చూపించడం మీ కర్తవ్యం. చోటు దొరక్క నేను యిక్కడ కూర్చున్నాను. మూడో తరగతిలో చోటు చూపించండి వెళతాను’ అని అన్నాను. ‘నీతో తర్కం నాకు అనవసరం. నీకు చోటు చూపించడం నా పని కాదు. డబ్బు లేకపోతే బండి దిగు’ అని గద్దించాడు గార్డు. నేను పూనా వెళ్లాలి. గార్డుతో తగాదా పడటం అనవసరమనిపించి డబ్బు చెల్లించివేశాను. అతడు పూర్తిగా పూనాదాకా ఇంటరు చార్జీ వసూలుచేశాడు. నాకు యిది అన్యాయమనిపించింది. ఉదయానికి ముగల్‌సరాయి చేరాము. మగన్‌లాలు మూడోతరగతిలో చోటు సంపాదించాడు. ముగల్‌సరాయిలో నేను కూడా మూడో తరగతిలోకి మారాను. టికెట్టు కలెక్టరుకు విషయమంతా చెప్పాను. అతణ్ణి ఒక ధృవీకరణ పత్రం వ్రాసి యిమ్మని కోరాను. అతడు యివ్వనని భీష్మించాడు. నేను రైల్వే అధికారికి జాబు వ్రాశాను. “ధృవీకరణ పత్రం లేనిదే అదనంగా వసూలుచేసిన సొమ్ము తిరిగి చెల్లించడానికి వీలులేదు. అయినా మీకు సొమ్ము చెల్లిస్తున్నాము. బర్ద్వాన్ నుండి ముగల్‌సరాయి వరుకు మాత్రం ఇంటరు తరగతి సొమ్ము చెల్లించబడదు” అంటూ సమాధానం అందింది.

ఆ తరువాత మూడో తరగతి ప్రయాణానికి సంబంధించి నాకు కలిగిన అనుభవాలు కోకొల్లలు. అన్నీ రాస్తే పెద్ద గ్రంధం అవుతుంది. అవకాశం చిక్కినప్పుడు వేరు వేరు ప్రకరణాల్లో కొన్ని అనుభవాలను సందర్భాన్ని బట్టి వివరిస్తాను. శారీరకంగా శక్తిలేనందున నా మూడో తరగతి ప్రయాణం చేస్తున్నప్పుడు రైల్వే అధికారుల దౌర్జన్యం, అవమానకరమైన వారి ప్రవర్తనా తీరు వర్ణనాతీతం. యిటు ప్రయాణీకుల ప్రవర్తన కూడా అంతకంటే ఘోరమని చెప్పక తప్పదు. ప్రయాణీకుల మూర్ఖత్వం, మురికి, స్వార్ధం, అజ్ఞానం అత్యధికం. తమ తప్పుల్ని వారు గ్రహించరు. తాము చేస్తున్న పని రైటేనని వారు భావిస్తారు. సంస్కారం కలిగిన చదువుకున్న వాళ్లు వారి చర్యల్ని సరిదిద్దేందుకు ప్రయత్నించరు. అలసి సొలసిన మేము కళ్యాణ్ జంక్షను చేరాం. స్నానం చేద్దామని వెళ్లి స్టేషనులో గల పంపు నీళ్లతో మేమిద్దరం స్నానం చేశాం. భార్య స్నానం ఎట్లాగా అను యోచిస్తూ వుండగా భారత్ సేవక్ సమాజ కార్యకర్త శ్రీ కాల్ మమ్మల్ని గుర్తించాడు. ఆయన కూడా పూనా వస్తున్నాడు. సెకండ్ క్లాసులో గల స్నానాల గదిలో ఆమెకు స్నానం ఏర్పాటుచేస్తానని చెప్పాడు. అట్టి సౌకర్యం పొందుటకు నేను సంకోచించాను. నిజానికి సెకండు క్లాసు ప్రయాణీకుల స్నానాల గదిలో స్నానం చేసే హక్కు నా భార్యకు లేదు కదా! అయినా నేను వద్దనకుండా మౌనం వహించాను. సత్యపూజారి యిలా చేయకూడదు. స్నానం కోసం అక్కడికి వెళతానని ఆమె కోరలేదు. భర్త అనే మోహంతో కూడిన స్వర్ణపాత్ర సత్యాన్ని మరుగున పడవేసిందన్నమాట.

6. నా ప్రయత్నం

పూనా చేరాం. దహన కర్మలన్నీ పూర్తి అయ్యాయి. అంతా సొసైటీని గురించి ఏం చేయడమా అని ఆలోచనలో పడ్డాం. నేను సొసైటీలో చేరాలా వద్దా అను మీమాంసలో పడ్డాను. నామీద పెద్ద బరువు పడినట్టనిపించింది. గోఖలేగారు జీవించియుంటే నేను సొసైటీలో చేరవలసిన అవసరం లేదు. నేను గోఖలేగారి ఆదేశానుసారం నడపవలసినవాణ్ణి. ఆవిధంగా చేయడం నాకు యిష్టం. భారతదేశమనే తుఫానుతో నిండిన సముద్రంలో దూకిప్పుడు నాకు సహాయం చేసేవారు అవసరం. గోఖలేవంటి సహాయకుని నీడన సురక్షితంగా వున్నాను. అట్టి గోఖలే యికలేరు. అందువల్ల వారి సొసైటీలో చేరడం అవసరమని అనిపించింది. గోఖలే ఆత్మ కూడా దీన్నే కోరుతున్నదని అనిపించింది. నేను గట్టిగా అందుకు పూనుకున్నాను. అప్పుడు సొసైటీ మెంబర్లంతా పూనాలోనే ఉన్నారు. వారికి నచ్చచెప్పి నా విషయంలో వారికి గల సందేహాల్ని తొలగించేందుకు ప్రయత్నం చేయసాగాను. మెంబర్లలో అభిప్రాయ భేదం కనబడింది. ఒక వర్గంవారు చేర్చుకోవాలని, మరోవర్గం వారు చేర్చుకోవద్దని భావిస్తున్నారు. యిరువర్గాలవారికీ నా యెడ ప్రేమ వున్నది. అయితే నామీదగల ప్రేమ కంటే కొందరికి సొసైటీ మీద మక్కువ ఎక్కువగా వున్నదని అనిపించింది. మా చర్యలు సిద్ధాంతపరంగా సాగినా ఎంతో మధురంగా వున్నాయి. వ్యతిరేకించిన వారి తర్కం ప్రకారం నా దృక్పధానికి సొసైటీ దృక్పధానికి తూర్పు పడమరలంత వ్యత్యాసం వున్నదని తేలింది. గోఖలేగారు ఏ లక్ష్యాలతో సొసైటీని స్థాపించారో, నేను అందు చేరితే ఆ లక్ష్యాలు దెబ్బతింటాయని వారి భావమని తేలింది. చాలా సేపు చర్చించి మేము విడిపోయాము. నిర్ణయం మరో సమావేశంలో చేయాలని నిర్ణయించారు.

ఇంటికి చేరి ఆలోచనా సాగరంలో పడ్డాను. మెజారిటీ ఓట్లతో నేను సొసైటీలో చేరడం సబబా? అది గోఖలే గారి యెడ నాకు గల నిజాయితీ అని అనిపించుకుంటుందా? నాకు వ్యతిరేకంగా ఓట్లు పడితే సొసైటీ చీలికకు నేను కారణభూతుడను కానా? బాగా యోచించిన మీదట, నన్ను సొసైటీలో చేర్చుకునేందుకు అందరూ అంగీకరిస్తేనే అందు చేరడం మంచిదని, కొందరు వ్యతిరేకించినా అందు చేరడం సొసైటీ క్షేమం దృష్ట్యా మంచిది కాదని భావించాను. గోఖలేగారి యెడ సొసైటీ సభ్యుల యెడ నేను చూపవలసిన విధానం అదేనను నిర్ణయానికి వచ్చాను. అంతర్వాణి యీ విధంగా చెప్పిన వెంటనే నేను శాస్త్రిగారికి జాబు వ్రాసి నాకోసం మళ్లీ సమావేశం ఏర్పాటు చేయవద్దని కోరాను. నా నిర్ణయం వ్యతిరేకులకు నచ్చింది. ధర్మసంకటంలో పడవలసిన అవసరం వారికి కలుగకుండా పోయింది. వారికి నా యెడగల ప్రేమ యింకా అధికమైంది. సొసైటీలో చేరుటకు పంపిన దరఖాస్తు తిరిగి తీసుకోవడం వల్ల నేను సొసైటీ సభ్యునిగా చేరినట్లే అయింది.

తరువాత నేను సొసైటీలో చేరకపోవడమే మంచిదని అనుభవంలో తేలింది. కొందరు నన్ను చేర్చుకోవద్దని తెలిపిన విషయాలు యదార్ధమైనవే. వారికి నాకు సిద్ధాంతరీత్యా తేడా వున్నమాట నిజం. అభిప్రాయ భేధం ఏర్పడినప్పటికీ మాకు గల ఆత్మ సంబంధం ఎన్నడూ చెక్కుచెదరలేదు. మేము మిత్రులంగానే వున్నాము. సొసైటీ స్థలం నా దృష్టిలో తీర్ధక్షేత్రమే. లౌకిక దృష్ట్యా నేను సొసైటీ మెంబరుగా చేరలేదు కాని ఆధ్యాత్మిక దృష్ట్యా నేను మెంబరుగా చేరినట్లే. వాస్తవానికి లౌకిక సంబంధం కంటే ఆధ్యాత్మిక సంబంధం గొప్పది కదా! ఆధ్యాత్మికత్వం లేని లౌకిక సంబంధం ప్రాణం లేని దేహంతో సమానమేకదా! 

7. కుంభయాత్ర

డాక్టర్ ప్రాణజీవనదాస్ గారిని కలుసుకునేందుకు రంగూన్ వెళ్లవలసి వచ్చింది. త్రోవలో శ్రీ భూపేంద్రనాధ బోసుగారి ఆహ్వానం మీద కలకత్తాలో ఆగాను. అక్కడ బెంగాలీల సౌజన్యాన్ని అపరిమితంగా చవి చూచాను. అప్పుడు నేను ఫలాలు మాత్రమే తీసుకుంటూ వున్నాను. నాతోబాటు మా అబ్బాయి రామదాసు వున్నాడు. కలకత్తాలో దొరికే పండ్లు మొదలుగా గల వన్నీ కొని మా కోసం సిద్ధంగా వుంచారు. స్త్రీలు రాత్రంతా జాగరణచేసి పిష్తా మొదలగు వాటి బెరుళ్లు వలిచారు. తాజా పండ్లను ఎంతో అందంగా అమర్చారు. నా అనుచరులం కోసం రకరకాల పిండివంటలు సిద్ధం చేశారు. ఆ ప్రేమ ఆ అతిధి సత్కారం నాకు బోధపడింది. కాని ఒకరిద్దరు అతిధుల కోసం కుటుంబసభ్యులంతా యీవిధంగా శ్రమపడటం నాకు నచ్చలేదు. అయితే యీ కష్టాన్నుండి బయటపడే మార్గం నాకు కనబడలేదు.

రంగూన్ వెళ్లేటప్పుడు నేను ఓడలో డెక్‌మీద ప్రయాణించే యాత్రీకుణ్ణి. శ్రీ బోసుగారింటి వద్ద ప్రేమాధిక్యత. స్టీమరు మీద దారిద్ర్యపు ఆధిక్యత. డెక్ మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఎన్నో కష్టాలు పడ్డాను. స్నానం చేసే చోటు మురికి కూపం. నిలబడేందుకు కూడా వీలులేని స్థితి. పాయిఖానా నిజంగా నరకమే. మలమూత్రాలు తొక్కుకుంటూ నడవడం లేక మలమూత్రాల మీదుగా దూకుతూ వాటిని దాటడం నావల్లకాలేదు. ఓడ అధికారి దగ్గరికి వెళ్లాను. కాని వినిపించుకునే నాధుడే లేడు. యాత్రీకులు తమ మురికిచే ఓడను పాడుచేశారు. కూర్చున్నచోటనే ఉమ్మివేయడం అక్కడే జర్దా వగైరా నోట్లో పెట్టుకుని పిచికారీ గొట్టంలా ఉమ్మివేయడం, అబ్బ! అక్కడి దృశ్యం వర్ణనాతీతం. ఒకటే గోల. ప్రతివాడు ఎక్కువ చోటును ఆక్రమించుకోడానికి ప్రయత్నించటమే. ప్రక్కవాడిని గురించి పట్టించుకునే స్థితిలో ఎవ్వరూ లేరు. వాళ్లు, వాళ్ల సానూను. అంతే, రెండు రోజుల ఆ యాత్ర నా పాలిట నరకయాత్ర అయిపోయింది.

రంగూను చేరిన తరువాత ఏజంటుకు వివరమంతా వ్రాశాను. తిరుగు ప్రయాణంలో కూడా డెక్‌మీదనే ప్రయాణం చేశాను. అయితే యీసారి నా జాబు వల్ల మరియు డాక్టర్ మెహతాగారి ప్రయత్నం వల్ల సౌకర్యాలు లభించాయి. అయితే నా ఫలాహారం గొడవ అక్కడ కూడా అవసరం కంటే మించి వ్యధ కలిగించింది. డాక్టర్ మెహతాగారి ఇంటిని నా యింటిలాగానే చూసుకునేవాణ్ణి. అట్టి సంబంధం వారితో నాకు వున్నది. తినే పదార్థాల సంఖ్యను తగ్గించినా రకరకాలు పండ్లు లభించాయి. వాటిని వ్యతిరేకించేవాణ్ణి కాదు. ఆ పండ్లు కంటికి యింపుగాను, నోటికి రుచిగాను వుండేవి. అయితే రాత్రిపూట ఎనిమిది తొమ్మిది గంటలవుతూ వుండేది.

ఈ సంవత్సరం 1931లో హరిద్వారంలో కుంభమేళా జరుగబోతున్నది. అందు పాల్గొనాలని కోరిక నిజానికి నాకు కలుగలేదు. అయితే మాహాత్మా మున్షీగారి దర్శనానికి వెళ్లవలసిన అవసరం వున్నది. కుంభమేళా సమయంలో గోఖలేగారి భారత సేవక సమాజం ఒక పెద్ద బృందాన్ని పంపింది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు హృదయనాధ్ కుంజ్రూ చూస్తున్నారు కీ.శే డాక్టర్ దేవ్‌కూడా ఆ బృందంలో వున్నారు. మా అనుచరులు కూడా మేళాలో వాలంటీర్లుగా పనిచేయాలని భావించారు. నేను హరిద్వార్ చేరుకునేసరికి మగన్‌లాలు ఆశ్రమవాసులను వెంటబెట్టుకొని అక్కడికి చేరుకున్నారు. నేను రంగూను నుండి తిరిగి రాగానే వెళ్లి ఆ బృందంతో కలిశాను. కలకత్తా నుండి హరిద్వార్ చేరడానికి రైల్లో నానా అవస్థ పడవలసి వచ్చింది. రైలు పెట్టెలో దీపాలు లేవు. అంతా చీకటి. సహరాన్ పూర్ నుండి గూడ్సు పెట్టెలో జనాన్ని పశువుల్ని నింపినట్లు నింపివేశారు. రైలు పెట్టెలకు పైకప్పు లేనందున సూర్యుని ఎండ ప్రయాణీకుల్ని బాగా మాడ్చివేసింది. క్రింద ఇనుపరేకులు. యిక ప్రయణీకుల బాధ వర్ణణాతీతం. ఎండకు తట్టుకోలేక జనం దాహం దాహం అని కేకలు వేయసాగారు. హిందువులు భావుకులు కదా! మహమ్మదీయుడు మంచినీళ్లు యిస్తే త్రాగరు. యిట్టి భావుకులగు హిందువులు మందు అని చెప్పి డాక్టరు మద్యం యిచ్చినా, మహమ్మదీయ, క్రైస్తవ డాక్టర్లు నీళ్లు యిచ్చినా, మాంసం పుచ్చుకోమన్నా కిమ్మనకుండా పుచ్చుకుంటారు. పుచ్చుకోవచ్చునా లేదా అని కూడా యోచించరు. శాంతినికేతనంలో చూచాను. పాకీపని చేయడం మనదేశంలో ఒక వృత్తిగా మారిపోతున్నది. మా వాలంటీర్ల కోసం ఏదో సత్రం ఆవరణలో డేరాలు వేశారు. మలమూత్ర విసర్జన కోసం డాక్టర్ దేవ్ కొన్ని గుంటలు త్రవ్వించారు. అయితే ఆ గుంటల పారిశుద్ధ్యం విషయంలో డాక్టర్ దేవ్ జీతాలు తీసుకొని పనిచేసే పాకీవారి మీద ఆధారపడ్డారు. యీ విషయం నాకు తెలిసింది. గుంటల్లో పడే మలాన్ని మట్టితో కప్పివేయడం, పారిశుద్ధ్య కార్యక్రమం గుంటల దగ్గర కొనసాగించడం మా బృందంవారు చేయగలరనీ, ఫినిక్సులో యిట్టిపనివారు చేశారనీ, మావారికి అనుమతి యిమ్మని డాక్టర్ దేవ్ గారిని కోరాను. ఆయన సంతోషంతో అంగీకరించారు. అనుమతించమని కోరింది నేను అయినా బాధ్యత వహించవలసిన వ్యక్తి మదన్‌లాలు గాంధీయే. డేరాలో కూర్చొని జనానికి దర్శనం యివ్వడం, వచ్చేపోయే జనంతో ధర్మాన్ని గురించి, తదితర విషయాలను గురించి చర్చిస్తూ వుండటం నా పని అయింది. ఇట్టి దర్శనం యిచ్చే కార్యక్రమంతో విసిగిపోయాను. ఒక్క నిమిషం కూడా సమయం చిక్కలేదు. స్నానానికి వెళ్లినా నన్ను చూచేందుకు జనమే జనం. పండ్లు తినేటప్పుడు కూడా జనమే జనం. ఒక్క నిమిషం కూడా నన్ను జనం వదలలేదు. దక్షిణ ఆఫ్రికాలో నేను చేసిన కొద్దిపాటి సేవా కార్యక్రమాల ప్రభావం యావద్భారతావని పై అపరిమితంగా పడిందను విషయం హరిద్వార్‌లో బయటపడింది. నేను రెండు తిరగలి రాళ్ల మధ్య పడి నలిగిపోసాగాను. గుర్తించబడనిచోట మూడో తరగతి రైలు ప్రయాణీకుడిగా నరకయాతన అనుభవించాను. గుర్తింపబడిన చోట విపరీతమైన జనసమర్దంతో నానా యాతన పడ్డాను. రెండింటిలో ఏది మేలైనదీ అని అడిగితే చెప్పటం కష్టం. రెండూ రెండే. దర్శనం కోసం ఎగబడే జనాన్ని చూచి ఒక్కొక్కప్పుడు నాకు కోపం బాగా వచ్చిన ఘట్టాలు వున్నాయి. ఆ తాకిడికి తట్టుకోలేక లోలోన బాధపడిన క్షణాలు అనేకం వున్నాయి. కాని మూడో తరగతి ప్రయాణం చేస్తున్నప్పుడు యమయాతన పడ్డానేకాని ఎప్పుడూ కోపం రాలేదు. పైగా మూడవ తరగతి ప్రయాణం వల్ల పలు అనుభవాలు పొంది ఔన్నత్యం పొందాను.

అప్పుడు బాగా తిరగగల శక్తి నాకు వున్నది. అందువల్ల కాలినడకన బాగా తిరిగాను. రోడ్డు మీద నడవడం కూడా కష్టమయ్యేటంతగా నాకు అప్పటికి ప్రశస్తి రాలేదు. ప్రయాణాలలో ధార్మిక భావనకంటే ప్రజల్లో అజ్ఞానం, నిలకడలేకపోవడం, మొండితనం, పెంకితనం ఎక్కువగా కనబడ్డాయి. సాధువులు తండాలు తండాలుగా వచ్చిపడ్డారు. వాళ్లు పరమాణ్ణం, మాల్‌పూరీలు తినడానికే పుట్టారా అని అనిపించేలా వ్యవహరించారు. యిక్కడ అయిదుకాళ్ల ఆవును చూచి ఆశ్చర్యపడ్డాను. కాని తెలిసినవారు దాని రహస్యం చెప్పగా నివ్వెరబోయాను. పాపం ఆ అయిదు కాళ్ళ ఆవు, దుష్టులు దుర్మార్గులు అయిన లోభులుదుర్మార్గానికి తార్కాణనుని తెలిసింది. దూడ బ్రతికి వున్నప్పుడు దాని కాలు ఒకటి నరికి, ఆవు మెడను కత్తితో చీల్చి అందు దూడ కాలును అమర్చి మెడను సరిచేస్తారట. ఎంతటి కిరాతకం అజ్ఞానుల కండ్లలో కారం కొట్టి డబ్బులు గుంజేందుకై చేస్తారట. అయిదు కాళ్లుగల గోమాతను చూచేందుకు ముందుకురకని హిందువు వుంటాడా? అట్టే గోమాతకు ఎంత డబ్బైనా యివ్వకుండా హిందువు వుండగలడా?

కుంభోత్సవం రోజు వచ్చింది. నాకు అదిపావనదినం. నేను యాత్రకోసం హరిద్వార్ వెళ్లలేదు. తీర్థస్థలాల్లో పవిత్రతను అన్వేషించేందుకై వెళ్లాలనే మోహం నాకు కలుగలేదు కాని 17 లక్షలమంది జనంలో అంతా పాఖండులు కారుకదా! ఆ మేళాలో 17 లక్షలమంది పాల్గొంటారని అంచనా వేశారు. వారిలో చాలామంది పుణ్యం కోసం, శుద్ధికోసం వచ్చారనడంలో నాకేట్టి సందేహమూ లేదు. ఈ విధమైన శ్రద్ధ ఆత్మను ఎంతటి ఉన్నత స్థాయికి తీసుకువెళుతుందో చెప్పడం కష్టమే. పక్కమీద పడుకొని ఆలోచనా సాగరంలో తేలిపోసాగాను. నాలుగు వైపుల ముసిరియున్న పాఖండుల మధ్య పవిత్రాత్మలు కూడా కొన్ని వున్నాయి. ఆ ఆత్మలు దేవుని దర్బారులో దండనకు గురికావు. అసలు యిటువంటి చోటుకు రాకూడదనుకుంటే అసమ్మతిని తెలియజేసి ఆనాడే నేను తిరిగి వెళ్లిపోతే బాగుండేది. వచ్చాను గనుక కుంభం రోజున క్రొత్త వ్రతాన్ని ప్రారంభించి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని భావించాను. వ్రతాలనే కోడులమీద నిలబడి వున్న జీవితం నాది. అందువల్ల కఠోరమైన వ్రతానికి పూనుకోవాలనే నిర్ణయానికి వచ్చాను. కలకతాలోను, రంగూన్‌లోను నావల్ల యింటి యజమానులు పడ్డ శ్రమ జ్ఞప్తికి వచ్చింది. దానితో నేను తినే పదార్థాల సంఖ్యను బాగా తగ్గించి వేయాలని, చీకటి పడకముందే ఫలాహారం చేసివేయాలని నిర్ణయానికి వచ్చాను. నేను చేపట్టే వ్రతం యిదే. యీ విధంగా నన్ను నేను హద్దులో పెట్టుకోకపోతే యింటి యజమానులు పడే శ్రమ ఎక్కువైపోతుంది. నా సేవచేయడానికే వారికాలం చెల్లిపోతుంది. అందువల్ల 24గంటల్లో 5 పదార్థాలు మాత్రమే పుచ్చుకుంటానని, చీకటి పడకముందే భోజన కార్యక్రమం ముగించివేస్తానని వ్రతం పట్టాను. జబ్బు పడినప్పుడు మందు రూపంలో పదార్థాలు పుచ్చుకోవలసివస్తే ఏం చేయాలి అని కూడా యోచించి, అట్టి స్థితిలో కూడా 5 పదార్థాలు మాత్రమే తీసుకోవాలని నిర్ణయించాను. యీ రెండు వ్రతాలు ప్రారంభించి 13 సంవత్సరాలు గడిచాయి. ఎన్నో గడ్డు పరీక్షలను ఎదుర్కొన్నాను. అయితే పరీక్షా సమయంలో యీ వ్రతాలు నా జీవితకాలాన్ని పెంచాయనే విశ్వాసం నాకు కలిగింది. అనేక పర్యాయాలు జబ్బుల పాలిట పడకుండా యీ వ్రతాల వల్ల రక్షణ కూడా పొందాను. 

8. లక్ష్మణ ఊయల

పర్వతమంత విశాల హృదయులు మహాత్మా మున్షీరామ్. వారి దర్శనం చేసుకొని, వారి గురుకులం చూచి ఎంతో శాంతి పొందాను. హరిద్వారమందలి రొదకు, గురుకులమందలి శాంతికి మధ్యగల భేదం స్పష్టంగా కనబడుతూ వుంది. ఆ మహాత్ముడు నామీద ప్రేమ వర్షం కురిపించారు. అక్కడి బ్రహ్మచారులు నన్ను వదలలేదు. రామదేవన్‌ను అక్కడే కలిశాను. వారి శక్తి ఏమిటో వెంటనే గ్రహించాను. మా మధ్య కొద్దిగా అభిప్రాయభేదం వున్నట్లు కనబడినా మా యిరువురిని ప్రేమబంధం బిగించివేసింది. గురుకులంలో పరిశ్రమల స్థాపన మరియు వాటిశిక్షణను గురించి రామదేవ్‌గారితోను, యితర ఉపాధ్యాయులతోను చర్చించాను. గురుకులం త్వరగా వదిలి రావలసి వచ్చినందుకు బాధపడ్డాను.

లక్ష్మణ ఊయలను గురించి చాలామంది చెప్పగా విన్నాను. ఋషీకేశం వెళ్లకుండా హరిద్వారం వదలి రావద్దని చాలామంది సలహా యిచ్చారు. నేను అక్కడికి నడిచి వెళ్లాలి. ఒక మజిలీ ఋషీకేశంలో, రెండవ మజిలీ లక్ష్మణ ఉయ్యాలలో గడపాలి. ఋషీకేశంలో చాలామంది సన్యాసులు వచ్చి నన్ను కలిశారు. వారిలో ఒకనికి నాయందు అమితంగా మక్కువ కలిగింది. నాలో ధర్మాన్ని గురించి తపన తీవ్రంగా వుండటం అతడు గ్రహించాడు. అప్పుడే గంగలో స్నానం చేసి వచ్చాను. అందువల్ల ఒంటినిండా బట్ట కప్పుకోలేదు. శిరస్సు మీద పిలక, మెడలో జందెం కనబడనందున అతనికి అమితంగా విచారం కలిగింది. మీరు యింత ఆస్తికులై యుండి కూడా పిలక పెట్టుకోలేదు. జందెం వేసుకోలేదు. నాకు చాలా విచారం కలుగుతున్నది. యీ రెండూ హిందూ మత బాహ్యచిహ్నాలు. ప్రతి హిందువు యీ రెండిటినీ ధరించాలి అని అన్నాడు.

పది సంవత్సరాల వయస్సులో నేను పోరుబందరు నందు బ్రాహ్మణులు వేసుకున్న జందాలకు కట్టియున్న తాళం చెవుల గలగలలు విని ఈర్ష్యపడుతూ వుండేవాణ్ణి. నేను కూడా జందెం వేసుకొని దానికి తాళం చెవులు కట్టి గలగలలాడిస్తూ తిరిగితే ఎంత బాగుంటుందో అని అనుకునేవాణ్ణి. కాఠియావాడ్ నందలి వైశ్యకులంలో అప్పుడు జందెం వేసుకునే పద్ధతి అమలులో లేదు. అయితే పై మూడు కులాలవారు జందెం ధరించాలని ప్రచారం సాగుతూ వున్న రోజులవి. తత్ఫలితంగా గాంధీ కుటుంబీకులు కొందరు జందెం వేసుకున్నారు. మా ముగ్గురు అన్నదమ్ములకు రామరక్షాస్తోత్రం నేర్పిన బ్రాహ్మణుడు జందాలు వేశాడు. నిజానికి తాళం చెవుల అవసరం లేనప్పటికీ నేను రెండు మూడు తాళం చెవులు తెచ్చి నా జందానికి కట్టుకున్నాను. జందెం తెగిపోయింది. దానితోపాటు మోహమనే దారం కూడా నాలో తెగిపోయిందో లేదో గుర్తులేదు. కాని నేను ఆ తరువాత యిక క్రొత్త జందెం వేసుకోలేదు. పెద్దవాడైన తరువాత నాకు జందెం వేయాలని భారతదేశంలోనేగాక దక్షిణ ఆఫ్రికాలో కూడా కొందరు ప్రయత్నించారు. కాని వారి తర్కం నామీద పనిచేయలేదు. శూద్రులు జందెం ధరించనప్పుడు యితరులు ఎందుకు ధరించాలి? మా కుటుంబంలో మొదటి నుండి అమలులో లేని యీ జంద్యాన్ని మధ్యలో ఎందుకు ప్రవేశపెట్టాలి అను ప్రశ్నలకు సరియైన సమాధానం లభించలేదు. కావాలంటే జందెం దొరుకుతుంది. కాని దాన్ని ధరించడానికి తృప్తికరమైన కారణాలు కనబడలేదు. వైష్ణవుణ్ణి గనుక నేను పూసల దండ ధరించేవాణ్ణి. మా అన్నదమ్ములందరికీ పిలకజుట్టు వుంది. ఇంగ్లాండు వెళ్లినప్పుడు శిరస్సు ఉత్తగా వుండవలసి వచ్చింది. తెల్లవాళ్లు పిలక చూచి నవ్వుతారని, నన్ను అడివి మనిషి అని అనుకుంటారని భావించి పిలక తీసివేయించాను. నాతోబాటు దక్షిణ ఆఫ్రికాలో వున్న మా అన్నగారి కుమారుడు ఛగన్‌లాలు గాంధీ కడు శ్రద్ధతో పిలక వుంచుకున్నాడు. ప్రజా సేవకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు ఆ పిలక యిబ్బంది కలిగిస్తుందని చెప్పి నేను బలవంతాన పిలక తీసివేయించాను. స్వామికి యీ విషయమంతా చెప్పి “జందెం మాత్రం నేను వేసుకోను. ఎక్కువమంది హిందువులు జందెం వేసుకోరు. అయినా వారంతా హిందువులుగానే పరిగణింపబడుతూ వున్నారు. అందువల్ల జందెం వేసుకోవలసిన అవసరం లేదని నా అభిప్రాయం. అదీగాక యజ్ఞోపవీతం ధరించడం అంటే మరో జన్మ ఎత్తడమే. అనగా సంకల్పశుద్ధిగా పరిశుద్ధికావడం, అంటే ఊర్థ్వగాములం కావడమన్నమాట. యిప్పుడు హిందువులందరూ పూర్తిగా పతనావస్థలో వున్నారు. అట్టి వీరికీ జందెం వేసుకునే అధికారం లేదు. అస్పృశ్యత అనే మురికిని కడిగివేయాలి, హెచ్చులొచ్చులను మరిచిపోవాలి. మనలో చోటు చేసుకున్న చెడును తొలగించి వేయాలి. అధర్మాన్ని, పాఖండత్వాన్ని దూరం చేయాలి. అప్పుడే యజ్ఞోపవీతం ధరించే హక్కు హిందూ సమాజానికి కలుగుతుందని నా అభిప్రాయం. అందువల్ల జందెం విషయమై మీ మాటలు నాకు మింగుడుపడవు. కాని పిలక విషయమై మీరు చెప్పిన మాటల్ని గురించి యోచిస్తాను. మొదట పిలక నాకు వుండేది. కాని సిగ్గువల్ల అంతా నవ్వుతారేమోననే భావంతో నేనే తొలగించి వేశాను. దాన్ని తిరిగి పెట్టుకోవడం మంచిదని నాకు తోస్తున్నది. నా అనుచరులతో యీ విషయమై నేను మాట్లాడుతాను అని చెప్పాను. స్వామికి జందెం గురించి నేను అన్న మాటలు నచ్చలేదు. నేను ధరించకూడదు అని చెబుతూ చెప్పిన కారణాలు, ధరించవచ్చును అని చెప్పుటకు అనుకూలమని ఆయనకు తోచాయి. అయితే ఋషీకేశంలో జందాన్ని గురించి నేను చెప్పిన మాటల పై యిప్పటికీ నేను నిలబడివున్నాను. వేరు వేరు మతాలు వున్నంతవరకు ఆ మతాలవారికి బాహ్యచిహ్నాలు బహుశా అవసరం అవుతాయి. కాని ఆ బాహ్యచిహ్నాలు ఆడంబరంగా మారినప్పుడు, తన మతమే యితర మతాల కంటే గొప్పదని చెప్పుటకు సాధనాలుగా మారినప్పుడు వాటిని త్యజించడం మంచిది. యిప్పుడు జందెం హిందూ సమాజాన్ని ఉన్నత స్థాయికి గొంపోవుటకు సాధనమను విశ్వాసం నాకు కలుగలేదు. అందువల్ల దాని విషయంలో తటస్థంగా వున్నాను. కాని పిలక జుట్టు తీసివేసిన కారణాలను తలచుకుంటే నాకే సిగ్గువేస్తున్నది. అందువల్ల అనుచరులతో చర్చించి పిలక పెట్టుకోవాలనే నిర్ణయానికి వచ్చాను.

ఇక మనం లక్ష్మణ ఉయ్యాల దగ్గరకు వెళదాం. ఋషికేశం మరియు లక్ష్మణ ఝూలా దగ్గరి ప్రకృతి దృశ్యాలు ఎంతో రమణీయంగా వున్నాయి. ప్రకృతి శోభను, ప్రకృతి యొక్క శక్తిని గుర్తించగల మన పూర్వీకుల సామర్థ్యాన్ని, ఆ శోభకు ధార్మిక స్థాయి కల్పించగల స్తోమతను, వారి దూరదృష్టిని చూచి నా హృదయం శ్రద్ధాభక్తితో నిండిపోయింది. కాని అక్కడ మనిషి చేసిన నిర్మాణ వ్యవహారం చూచి నా మనస్సుకు అశాంతి కూడా కలిగింది. హరిద్వారంలోనే గాక, ఋషికేశంలో కూడా జనం పరిశుద్ధమైన నదీ తీరాన్ని మలమూత్రాదులతో పాడు చేస్తున్నారు. తప్పు చేస్తున్నామనే భావం కూడా వారికి లేదు. దొడ్డికి వెళ్లదలచినవారు దూరం పోవచ్చుగదా! జనం తిరిగే చోటనే మలమూత్రాదులు విసర్జిస్తున్నారు. యిది చూచి మనస్సుకు బాధ కలిగింది. లక్ష్మణ ఉయ్యాల దగ్గరకు వెళ్లగా ఇనుప ఉయ్యాల కంటపడింది. మొదట యీ వంతెన త్రాళ్లతో కట్టబడి వుండేదని, దాన్ని తెగగొట్టి ఒక ఉదార హృదయుడగు మార్వాడీ ఎంతో ధనం వెచ్చించి ఇనుముతో వంతెన తయారుచేయించి దాని తాళం చెవి ప్రభుత్వం వారికి అప్పగించాడని జనం చెప్పారు. త్రాళ్ళ వంతెనను గురించి నేను ఊహించలేదు కాని యీ ఇనుప వంతెన మాత్రం యిక్కడి సమాజ శోభను కలుషితం చేస్తున్నదని చెప్పగలను. చూడటానికి అసహ్యంగా వున్నది. జనం నడిచే మార్గపు తాళం చెవి ప్రభుత్వానికి అప్పగించారని విని బాధపడ్డాను. ప్రభుత్వం యెడ విశ్వాసం కలిగియున్న ఆనాటి నా మనస్తత్వానికి కూడా ఆ విషయం తెలిసినప్పుడు బాధ కలిగింది.

కొంచెం ముందుకు వెళ్లగా అక్కడ స్వర్ణాశ్రమం కనబడింది. దాని పరిస్థితి ఘోరంగా వున్నది. టిన్ను రేకులతో కప్పబడి వున్న పందిరి గుడిశల్లాంటి గదులకు స్వర్ణాశ్రమం అని పేరు పెట్టారు. యీ గదులు సాధన చేసేవారి కోసం నిర్మించబడ్డాయని చెప్పారు. ఇప్పుడు ఆ గదుల్లో ఒక్క సాధకుడు కూడా లేడు. వాటిని అంటి పెట్టుకొని కొన్ని మేడలు వున్నాయి. వాటిలో వుండేవారిని చూచాక వారి ప్రభావం కూడ నా మీద ఏమీ పడలేదు.

మొత్తం మీద హరిద్వార్‌లో కలిగిన అనుభవాలు నా దృష్టిలో అమూల్యాలు. వాటి ప్రభావం నా మీద బాగా పడింది. నేను ఎక్కడ వుండాలో, ఏం చేయాలో నిర్ణయించుకునేందుకు హరిద్వార్‌లో కలిగిన అనుభవాలు నాకు అమితంగా తోడ్పడ్డాయి. 

9. ఆశ్రమ స్థాపన

ది. 25 మే 1915 నాడు సత్యాగ్రహ ఆశ్రమ స్థాపన జరిగింది. హరిద్వార్‌లో వుండమని శ్రద్ధానందగారు చెప్పారు. వైద్యనాదదామంలో వుండమని కలకత్తాకు చెందిన కొందరు మిత్రులు సలహా ఇచ్చారు. రాజకోటలో వుండమని కొందరు మిత్రులు కోరారు. ఒకసారి అహమదాబాదు వెళ్లాను. చాలామంది మిత్రులు అహమదాబాదులో వుండమని చెప్పారు. ఆశ్రమానికి అయ్యే ఖర్చంతా భరిస్తామని చెప్పి ఇల్లు వెతికి పెట్టే బాధ్యత కూడా వహిస్తామని మాట యిచ్చారు.

అహమదాబాదు మీద మొదటి నుండి నాకు చూపు వున్నది. నేను గుజరాతీ వాడిని, గుజరాతీ భాష ద్వారా దేశానికి ఎక్కువ సేవ చేయగలుగుతానని గ్రహించాను. చేనేతకు అహమదాబాదు కేంద్రం కావడం వల్ల అక్కడ చరఖా పని బాగా సాగుతుందనే భావం కూడా నాకు కలిగింది. గుజరాత్‌లో పెద్ద పట్టణం గనుక, యిక్కడ ధనవంతులు ఎక్కువగా వుండటం వల్ల వారి సాయం లభిస్తుందనే ఆశ కూడా కలిగింది. అహమదాబాదుకు చెందిన మిత్రులతో మాట్లాడుతూ వున్నప్పుడు అస్పృశ్యతను గురించి కూడా చర్చ జరిగింది. ఎవరైనా అంత్యజ సోదరుడు ఆశ్రమంలో చేరదలచుకుంటే నేను తప్పక చేర్చుకుంటానని స్పష్టంగా చెప్పాను. “మీ షరతుల ప్రకారం నడుచుకునే అంత్యజుడు మీకెక్కడ దొరుకుతాడు?” అంటూ ఒక వైష్ణవ మిత్రుడు తన మనస్సును శాంతపరచుకున్నాడు. చివరికి అహమదాబాదులో వుండాలని నిర్ణయం చేశాము.

ఇంటి కోసం అన్వేషణ ప్రారంభమైంది. అహమదాబాదులో నన్ను వుంచడానికి ప్రముఖంగా కృషి చేసిన శ్రీ జీవన్‌లాల్ బారిష్టరుగారి కోచరబ్‌లో గల గృహం అద్దెకు తీసుకోవాలని నిర్ణయించాం. ఆశ్రమానికి ఏం పేరు పెట్టాలి అని చర్చ జరిగింది. ఎన్నో పేర్లు దృష్టికి వచ్చాయి. సేవాశ్రమం, తపోవనం అంటూ చాలా పేర్లు చర్చకు వచ్చాయి. సేవాశ్రమం పేరు బాగున్నదే కాని ఏరకమైన సేవయో బోధపడలేదు. మేము చేసేది తపస్సే అయినా ఆ పేరు చాలా బరువుగా వున్నది. మేము చేయవలసింది సత్యశోధన, సత్యం కోసమే మా కృషి, మా ప్రయత్నం. దక్షిణ ఆఫ్రికాలో నేను అమలు చేసిన పద్ధతిని భారతదేశానికి తెలియజేయాలి. ఆ శక్తి ఎంత వ్యాప్తం కాగలదో చూడాలి. అందువల్ల నేను, నా అనుచరులు కూడా సత్యాగ్రహ ఆశ్రమం అను పేరుకు యిష్టపడ్డాం. అందు సేవ, సేవావిధానం రెండూ సహజంగా యిమిడి వుంటాయని భావించాం. ఆశ్రమ నియమావళి ముసాయిదా ఒకటి తయారుచేసి అందరికీ పంపి మీ అభిప్రాయం తెలియజేయమని కోరాం. చాలామందికి నియమావళి నచ్చింది. కాని నియమావళి యందు వినమ్రతకు ప్రముఖ స్థానం లభించాలని వారు సూచించారు. అంటే మన యువకుల్లో వినమ్రత తక్కువగా వున్నదని వారి భావం అన్నమాట. నేను కూడా యీ సత్యాన్ని గ్రహించాను. కాని వినమ్రతను వ్రతంగా భావించి దానికి ప్రాముఖ్యం యిస్తే వినమ్రత తక్కువగా మిగిలిపోతుందేమో నను అనుమానం కలిగింది. వినమ్రతకు పూర్తి అర్థం శూన్యత్వం. శూన్యత్వాన్ని పొందడం కోసం యితర వ్రతాల్ని అనుష్టించాలి. వాస్తవానికి శూన్యత్వం మోక్షస్థితియే. ముముక్షువు లేక సేవకుడు చేసే ప్రతి పని యందు నమ్రత, అభిమానరాహిత్యం వుండితీరాలి. అవి లేకపోతే అతడు ముముక్షువు కాలేడు. సేవకుడు కాలేడు. స్వార్థపరుడవుతాడు. అహంకారి అవుతాడు.

ఆశ్రమంలో యిప్పుడు సుమారు 13 మంది తమిళులున్నారు. నాతోబాటు దక్షిణ ఆఫ్రికానుండి అయిదుమంది తమిళబాలురు వచ్చారు. వారితోబాటు, యిక్కడి సుమారు 25 మంది స్త్రీ పురుషులతో ఆశ్రమం ప్రారంభించాం. ఒకే వంటశాలలో అందరికీ భోజనం. అంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా ఉండేవారం.

10. పరీక్ష

ఆశ్రమ స్థాపన జరిగిన కొద్ది కాలానికే అగ్ని పరీక్షను ఎదుర్కోవలసి వచ్చింది. యిలా జరుగుతుందని నేను ఊహించలేదు. భాయీ అమృతలాల్ టక్కర్ జాబు వ్రాస్తూ “ఒక బీద అంత్యజుని కుటుంబం వాళ్లు మీ ఆశ్రమంలో చేరాలని భావిస్తున్నారు. వారు ఎంతో నిజాయితీపరులు” అని సూచించారు.

నేను కొంచెం నివ్వెరబోయాను. ఠక్కర్ బాపాగారి సిఫారసుతో యింత త్వరగా ఆశ్రమంలో చేరడానికి అంత్యజుని కుటుంబం సిద్ధపడుతుందని నేను ఊహించలేదు. జాబును అనుచరులకు చూపించాను. అంతా అందుకు స్వాగతం పలికారు. ఆశ్రమ నియమావళి ప్రకారం నడుచుకునేందుకు సిద్ధపడితే మీరు సూచించిన అంత్యజుని కుటుంబీకుల్ని ఆశ్రమంలో చేర్చుకుంటామని బాపాకు జాబు వ్రాశాను. దూదాభాయి, అతనిభార్య దానీబెన్, చిలక పలుకులు పలికే చంటిబిడ్డ లక్ష్మీ ముగ్గురూ వచ్చారు. దూదాభాయి బొంబాయిలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నాడు. నియమాల్ని పాటిస్తామని తెలిపిన మీదట ఆశ్రమంలో చేర్చుకున్నాం. దానితో మాకు సహాయం చేస్తున్న మిత్రబృందంలో గొడవ బయలుదేరింది. ఆ బంగళాకు సంబంధించిన బావి నుండి నీరు తోడుకోవాలంటే చిక్కులు ఏర్పడ్డాయి. గంజాయి వాడు ఒకడు సమీపంలో వున్నాడు. అతని మీద నీటిచుక్కలు పడ్డాయని అతడు దూదాబాయి మీద విరుచుకుపడ్డాడు. తిట్టడం ప్రారంభించాడు. తిట్టినా ఎదురు చెప్పవద్దని నీళ్ళు మాత్రం తోడుకురమ్మని నేను ఆశ్రమవాసులకు చెప్పాను. ఎన్ని తిట్లు తిట్టినా మారు పలకనందున గంజాయివాడు సిగ్గుపడి తిట్టడం మానివేశాడు. అయితే మాకు వచ్చే ఆర్థికసాయం తగ్గిపోసాగింది. సహాయకుల్లో ఒకరికి అంత్యజుల విషయమై సందేహం వున్నప్పటికీ యింత త్వరగా అంత్యజులు ఆశ్రమంలో చేరతారని వారు ఊహించలేదు. ధనం యివ్వడం మానుకున్నారు. అంత్యజులు త్వరలోనే ఆశ్రమాన్ని బహిష్కరిస్తారని నాకు వార్త అందింది. నేను అనుచరులతో చర్చించాను. “మనల్ని బహిష్కరించినా, ధనసహాయం చేయకపోయినా యీ పరిస్థితుల్లో మనం అహమదాబాదు వదలకూడదని, పాకీవాళ్లు వున్న వాడకు వెళ్లి వుందామని, కాయకష్టం చేసి బ్రతుకుదామని నిర్ణయానికి వచ్చాం. “వచ్చే నెలకు సరిపడ సామ్ము లేదని” మగన్‌లాలు హెచ్చరించాడు. ఏం ఫరవాలేదు, పాకీవారున్న వాడకు వెళ్లి వుందామని చెప్పాను.

ఇలాంటి ఇబ్బందులకు నేను అలవాటు పడిపోయాను. ప్రతిసారి చివరి నిమిషంలో దేవుడే ఆదుకునేవాడు. మగన్‌లాలు డబ్బు లేదని చెప్పిన కొద్ది రోజులకు ఒకనాడు ఉదయం ఎవరో పిల్లవాడు వచ్చి “బయట కారు నిలబడి వున్నది. సేఠ్ మిమ్మల్ని పిలుస్తున్నాడు” అని చెప్పాడు. నేను కారు దగ్గరకివెళ్లాను. “ఆశ్రమానికి సాయం చేద్దామని వున్నది. సాయం స్వీకరిస్తారా?” అని సేఠ్ నన్ను అడిగాడు. “ఏమియిచ్చినా తప్పక తీసుకుంటాను. ప్రస్తుతం యిబ్బందిగా కూడా వున్నది” అని అన్నాను. “రేపు యిదే సమయానికివస్తాను. మీరు ఆశ్రమంలో వుంటారా?” అని అడిగాడు. వుంటాను అని చెప్పాను. సేఠ్ వెళ్లిపోయాడు. మరునాడు సరిగా అనుకున్న సమయానికి బయట కారు హారును వినబడింది. పిల్లలు వచ్చి చెప్పారు. సేఠ్ లోనికి రాలేదు. నేను వారిని కలుద్దామని వెళ్లాను. ఆయన నా చేతుల్లో 13 వేల రూపాయల నోట్లు వుంచి వెళ్లిపోయాడు. ఈ విధంగా సహాయం అందుతుందని నేను కలలో కూడా ఊహించలేదు. సాయం చేసే యీ పద్ధతి కూడా నాకు క్రొత్తే. ఆయన అదివరకు ఆశ్రమానికి రాలేదు. ఆయనను ఒకసారి కలుసుకున్నట్లు గుర్తు. ఆయన ఇప్పుడూ ఆశ్రమంలోకి రాలేదు. ఏమీ చూడలేదు. చేతుల్లో 13 వేల రూపాయల నోట్లు వుంచి వెళ్లిపోయాడు. ఇలాంటి అనుభవం నాకు మొదటిసారి కలిగింది. యీ డబ్బు అందడంవల్ల పాకీవారుండే పల్లెకు వెళ్లవలసిన అవసరం కలగలేదు. సుమారు ఒక ఏడాది వరకు సరిపోయే ఖర్చు నాకు లభించింది.

బయట గొడవ జరగినట్లే ఆశ్రమం లోపల కూడా జరిగింది. దక్షిణ ఆఫ్రికాలో వున్నప్పుడు అంత్యజులు నా యింటికి వచ్చేవారు. భోజనం చేసేవారు. నాభార్య అందుకు ఇష్టపడిందా లేదా అను సమస్య బయలుదేరలేదు. ఆశ్రమంలో దానీబెన్‌ను తోటి స్త్రీలు తేలికగా చూడటం నేను గమనించాను. కొన్ని మాటలు కూడా నా చెవిన పడ్డాయి. బయటివారు ధన సహాయం చేయరనే భయం నాకు ఎప్పుడూ కలుగలేదు. కాని ఆశ్రమంలో ప్రారంభమైన యీ వ్యహారం మాత్రం నన్ను క్షోభకు గురిచేసింది. దానీబెన్ సామాన్య స్త్రీ. దాదూభాయికి వచ్చిన చదువు కూడా తక్కువే. కానీవారు తెలివిగలవారు వారి ధైర్యం చూచి సంతోషించాను. వారికి అప్పుడప్పుడు కోపం వస్తూ వుండేది. అయితే మొత్తం మీద వారి సహనశక్తి గొప్పది. చిన్న చిన్న అవమానాలను సహించమని నేను దాదూభాయికి చెబుతూ వుండేవాణ్ణి. అతడు విషయం గ్రహించేవాడు. దానీబెన్ కూడా అతడు సముదాయించి చెబుతూ వుండేవాడు .

ఈ కుటుంబాన్ని ఆశ్రమంలో వుంచుకోవడం వల్ల ఆశ్రమానికి ఎన్నో అనుభవాలు కలిగాయి. అస్పృశ్యతను ఆశ్రమంలో పాటించకూడదు అని మొదటనే నిర్ణయం అయిపోవడం వల్ల పని తేలిక అయిపోయింది. యింత జరుగుతూ వున్నా, ఆశ్రమం ఖర్చులు పెరిగిపోతూ వున్నా ఆర్థిక సాయం సనాతనుల వల్లే లభిస్తూ వుండేది. అస్పృశ్యత యొక్క మూలం కదిలిపోయిందని అనడానికి అదే నిదర్శనం. యింకా నిదర్శనాలు అనేకం వున్నాయి. అయినా ఒక్క విషయం. అంత్యజులతోబాటు కూర్చొని భోజనాలు చేస్తున్నారని తెలిసి కూడా సనాతనులు ఆశ్రమానికి ఆర్థిక సాయం చేశారు.

ఈ సమస్య మీద ఆశ్రమంలో జరిగిన మరో ఘట్టంతో బాటు ఆ సందర్భంలో బయలుదేరిన సున్నితమైన సమస్యలు, ఊహించని యిబ్బందులు, అన్నీ సత్యశోధన కోసం చేసిన ప్రయోగాలే. వాటినన్నింటిని యిక్కడ ఉదహరించకుండా వదిలి వేస్తున్నందుకు విచారపడుతున్నాను. రాబోయే ప్రకరణాల్లో కూడా యీ విధంగా చేయక తప్పదు. అవసరమైన సత్యాలు వదలవలసి రావచ్చు. అందుకు సంబంధించిన వ్యక్తులు చాలామంది జీవించేయున్నారు. వారి పేర్లు వ్రాస్తే యిబ్బందులు కలుగవచ్చు. అయితే వారి విషయంలో జరిగిన ఘట్టాలు వ్రాసి వారికి పంపడం, వారు అందుకు సమ్మతించి ప్రకటించవచ్చునని అనుమతి యివ్వడం జరిగే పని కాదు. అది ఆత్మకథకు మించినపని. అందువల్ల సత్యశోధనకు సంబంధించినవే అయినా చాలా ఘట్టాల్ని వివరించి వ్రాయడం సాధ్యం కాదని భావిస్తున్నాను. అయినప్పటికి సహాయ నిరాకరణోద్యమ చరిత్ర దాకా భగవంతుడు అనుమతిస్తే వ్రాయలని నా ఆకాంక్ష. 

11. గిరిమిట్ ప్రథ

కొత్తగా స్థాపించబడిన ఆశ్రమం లోపల బయట ఎదుర్కొంటూ పున్న తుఫానుల తీరును గురించి వ్రాయడం ఆపి గిర్‌మిట్ ప్రథను గురించి వ్రాస్తాను. అయిదు సంవత్సరాలు లేక అంతకంటే తక్కువ కాలం మజూరీ తీసుకొని పని చేస్తానని అంగీకరించి పత్రం మీద సంతకం చేసి భారతదేశాన్ని వదిలి దక్షిణ ఆఫ్రికా వెళ్లిన వారిని గిరిమిటియాలని అంటారు. 1914లో అట్టి గిర్‌మిటియాలకు విధించబడ్డ మూడు పౌండ్ల పన్ను రద్దుచేయబడిందే కాని ఆ విధానం యింకా పూర్తిగా రద్దు కాలేదు. 1916లో భారత భూషణ పండిత మదన మోహన మాలవ్యాగారు పెద్ద కౌన్సిలులో యీ విషయం ఎత్తారు. అందుకు సమాధానం యిస్తూ లార్డ్ హార్డింగ్ ప్రభువు వారి ప్రశ్నను అంగీకరించారు. సమయం వచ్చినప్పుడు దీన్ని ఆపుతామని ఆయన అన్నాడు. యీ విధానాన్ని భారతదేశం చాలా కాలం సాగనిచ్చిందని నా అభిప్రాయం. ప్రజల్లో కూడా చైతన్యం వచ్చింది కనుక తక్షణం యీ విధానం రద్దు చేయబడాలని నిర్ణయానికి వచ్చి చాలామంది నాయకుల్ని ప్రముఖుల్ని కలిశాను. ప్రజాభిప్రాయం అందుకు అనుకూలంగా వున్నదని గ్రహించాను. యీ విషయంలో సత్యాగ్రహాన్ని ఉపయోగించవచ్చని భావించాను. కాని ఎలా ఎప్పుడు అను విషయమై నేను యింకా నిర్ణయానికి రాలేదు. “సమయం వచ్చినప్పుడు” అంటే ఏమిటో చెప్పడానికి వైస్రాయి ప్రయత్నించి “మరో వ్యవస్థ చేయుటకు ఎంత సమయం పడుతుందో అంతవరకు” అని అన్నాడు. ఫిబ్రవరి 1917లో భారత భూషణ పండిత మదన మోహన మాలవ్యా గిర్మిట్ ప్రధను వెంటనే రద్దు చేయాలని బిల్లు కౌన్సిలులో ప్రవేశపెట్టగా వైస్రాయి అందుకు అంగీకరించలేదు. దానితో యీ సమస్యపై నేను దేశమందంతట ప్రచారం చేసేందుకై పర్యటన ప్రారంభించాను. పర్యటన ప్రారంభించే పూర్వం వైస్రాయిని కలవడం మంచిదని భావించాను. ఆయన వెంటనే తనను కలుసుకునేందుకు తేదీ నిర్ణయించాడు. అప్పుడు మి.మేఫీ (యిప్పుడు సర్‌జాన్ మేఫీ) వైస్రాయికి సెక్రటరీగా వున్నాడు. ఆయనతో నాకు మంచి సంబంధం ఏర్పడింది. లార్డ్ చేమ్స్‌ఫర్డుతో కూడా మాట్లాడాను. నిశ్చింతగా ఏమీ చెప్పకపోయినా తప్పక నిర్ణయం గైకొంటానని తాను సహకరిస్తానని చెప్పి అతడు ఆశ కల్పించాడు.

నేను బొంబాయి నుండి నా పర్యటన ప్రారంభించాను. బొంబాయిలో సభ ఏర్పాటుచేసే బాధ్యత బిష్టర్ జహంగీర్ పేటీట్ వహించారు. ఇంపీరియల్ సిటిజన్‌షిప్ అసోసియేషస్ ఆధ్వర్యాన సభ జరిగింది. అందు ప్రవేశ పెట్టవలసిన తీర్మానం తయారుచేసేందుకు ఒక కమిటీ ఏర్పడింది. అందు డా. రీడ్ సర్ లల్లూభాయి శ్యామల్ దాస్, మి. నటరాజన్ మొదలగువారు వున్నారు. మి. పేటిట్ అందు ప్రముఖులు. వెంటనే గిర్‌మిట్ ప్రథను రద్దుచేయమని ప్రభుత్వాన్ని తీర్మానంలో కోరారు. ఎప్పుడు రద్దుచేయాలి అన్నదే ముఖ్యమైన సమస్య. (1) రద్దు బహు త్వరగా జరగాలి. (2) జులై 31వ తేదీనాటికి రద్దు జరగాలి (3) వెంటనే రద్దు జరగాలి అని మూడు సూచనలు వచ్చాయి. జూలై 31వ తేదీనాటికీ రద్దు కావాలన్న సూచన నేను చేశాను. నేను తేదీ నిర్ణయించబడాలని కోరాను. అలా తీర్మానిస్తే ఆ తేదీనాటికి రద్దు చేయకపోతే ఏం చేయాలో నిర్ణయించవచ్చునని నా ఉద్దేశ్యం. కాని లల్లూభాయి తక్షణం రద్దుచేయాలని అభిప్రాయపడ్డారు. తక్షణం అంటే జనానికి అర్థం కాదని ప్రజల ద్వారా పని చేయించాలంటే నిశ్చితంగా తేదీవాళ్ల ముందు వుంచడం అవసరమని తక్షణం అంటే ప్రతివారు తమ యిష్టప్రకారం అంచనా వేస్తారని అందువల్ల జూలై 31వ తేదీ వరకు గడువు యిద్దామని నచ్చచెప్పాను. నా తర్కం రీడ్‌కు నచ్చింది. లల్లూభాయికి కూడా నా తర్కం నచ్చింది. జూలై 31వ తేదీ వరకు గడువు యిస్తూ బహిరంగసభలో తీర్మానం ఏకగ్రీవంగా అంగీకరించబడింది. శ్రీజయజీ పేటిట్ గారి కృషివల్ల బొంబాయి నుండి కొందరు మహిళలు వెళ్లి వైస్రాయిని కలుసుకున్నారు. వారిలో లేడీ తాతా, కీ.శే దిల్‌ఫాద్ బేగం మొదలగు మహిళలు వున్నారు. యింకా ఎవరెవరు వున్నారో నాకు గుర్తులేదు. కాని యీ రాయబారం వల్ల సత్ఫలితం కలిగింది. వైస్రాయి ఉత్సాహవర్ధకమైన సమాధానం యిచ్చాడు. నేను కరాచీ, కలకత్తా మొదలగు స్థలాలకు కూడా వెళ్లి వచ్చాను. అన్ని చోట్ల సభలు జరిగాయి. ప్రజల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. పర్యటనకు పూనుకొనే ముందు సభల్లో యింత అధిక సంఖ్యలో జనం పాల్గొంటారని నేను ఊహించలేదు.

అప్పుడు నేనొక్కడినే ప్రయాణం చేస్తూ వుండేవాణ్ణి. అందువల్ల ఊహించని అనుభవాలు కలుగుతూ వుండేవి. గూఢచారులు నావెంట వుండేవారు. వారితో జగడానికి అవకాశం లేదు. నేను ఏమీ దాచేవాణ్ణి కాదు. అందువల్ల వాళ్లు నన్ను బాధించేవారు కాదు. నేను వారిని బాధించేవాణ్ణి కాను. అదృష్టవశాత్తు అప్పటికి నాకు యింకా మహాత్మ అను బిరుదు లభించలేదు. నన్ను గుర్తించిన చోట మాత్రం జనం యీ బిరుదును ఉపయోగించి నినాదాలు చేస్తూ వుండేవారు. ఒక సారి రైల్లో వెళుతున్నప్పుడు గూఢచారులు నా దగ్గరకి వచ్చి టిక్కెట్టు అడిగి తీసికొని నెంబరు నోట్ చేసుకోసాగారు. వారడిగిన ప్రశ్నలకు నేను వెంటనే సమాధానం యిచ్చాను. నేనేదో అమాయకుడైన సాధువునని తోటి ప్రయాణీకులు భావించారు. రెండు మూడు స్టేషన్ల వరకు వరుసగా గూఢచారి పోలీసులు రావడం, నన్నేవేవో ప్రశ్నలు అడగడం చూచి తోటి ప్రయాణీకులకు కోపం వచ్చి వాళ్లను బెదిరించి “ఎందుకయ్యా అమాయకుడైన యీ సాధుపుంగవుణ్ణి బాధపెతడారు వెళ్లండి” అని అరవడం ప్రారంభించారు, “ఇదుగో! యిక టిక్కెట్టు చూపించకండి చూద్దాం ఏం చేస్తారో!” అని నాతో అన్నారు.

“వాళ్లు చూస్తే నష్టం ఏముంది? వాళ్లు తమ కర్తవ్యాన్ని పాలిస్తున్నారు. నాకేమీ బాధ కలగడం లేదు” అని చెప్పాను. యాత్రీకులకు నా యెడ సానుభూతి పెరిగి పాపం, నిరపరాధుల్ని యింతగా బాధిస్తారేమిటి? అని తమలో తాము అనుకున్నారు. గూఢచారులగు పోలీసుల వల్ల నాకేమీ బాధ కలుగలేదు, కాని లాహోరు ఢిల్లీల మధ్య రైల్లో ప్రయాణించినప్పుడు జనం గుంపులు గుంపులుగా విరుచుకుపడ్డప్పుడు నాకు చాలా యిబ్బంది కలిగింది. కరాచీ నుండి కలకత్తాకు లాహోరు మీదుగా వెళ్లాలి. లాహోరులో రైలు మారాలి. అక్కడి రైల్లో నా పప్పులేమీ ఉడకలేదు. యాత్రీకులు బలవంతంగా లోపలికి దూరుతున్నాడు. నేను నిశ్చిత సమయానికి కలకత్తా చేరాలి. ఆ ట్రైను అందకపోతే కలకత్తా సమయానికి చేరలేను. చోటు దొరుకుతుందనే ఆశ పోయింది. నన్ను తమ పెట్టెలో ఎవ్వరూ ఎక్కనీయలేదు. ఒక్క కూలీ నన్ను చూచి 12 అణాలు యిస్తే చోటు చూపిస్తానని అన్నాడు. చోటు చూపించు, 12 అణాలు తప్పక యిస్తాను అని అన్నాను. పాపం ఆ కూలీ ప్రయాణీకుల్ని బ్రతిమిలాడినా ఒక్కరు కూడా వినిపించుకోలేదు. బండి కదలబోతుండగా కొందరు యాత్రికులు లోపల చోటు లేదు కాని, జొరబడేలా చేయగలిగితే ఎక్కించు అని అన్నారు. కూలీ ఏమండీ ఎక్కుతారా అని అడిగాడు. ఆ అన్నాను. వెంటనే కూలీ నన్ను ఎత్తి కిటికీలో నుండి లోనికి వేశాడు. నేను లోపల పడ్డాను. కూలీ 12 అణాలు సంపాదించాడు. ఆ రాత్రి అతి కష్టంగా గడిచింది. మిగతా యాత్రికులు ఏదో విధంగా చోటు చేసుకొని కూర్చున్నారు. నేను పై బెంచి గొలుసు పట్టుకొని రెండు గంటలపాటు నిలబడే వున్నాను. ఈలోపున కూర్చోవేమయ్యా అని కొందరు గద్దించి అడగసాగారు. చోటు వుంటే కదా కూర్చోవడానికి అని నేను అన్నాను. వాళ్లకు నేను నుంచోవడం కూడా యిష్టం లేదు. పైగా వాళ్లు బెంచీల మీద హాయిగా పడుకున్నారు. తప్పుకోమని నన్ను మాటిమాటికి సతాయిస్తూ వున్నారు. వారు బాధించినప్పుడు నేను ప్రశాంతంగా వుండేసరికి నీ పేరేమిటి అని నన్ను అడిగారు. నేను పేరు చెప్పవలసి వచ్చింది. పేరు వినగానే వాళ్లు సిగ్గుపడ్డారు. క్షమించమని అని తమ ప్రక్కన చోటు యిచ్చి కూర్చోబెట్టారు. కష్టే ఫలే అను సూక్తి జ్ఞాపకం వచ్చింది. అప్పటికి అలసిపోయాను. తల తిరుగుతూ వుంది. కూర్చోవలసిన అవసరం కలిగినప్పుడు దేవుడు వెంటనే చోటు చూపించాడన్నమాట.

ఈ విధంగా నానాయాతన పడి సమయానికి కలకత్తా చేరాను. అక్కడ కౌసిన్ బజారు మహారాజా తన దగ్గర వుండమని ఆహ్వానించాడు. ఆయనే కలకత్తా సభకు అధ్యక్షుడు. కరాచీ వలెనే కలకత్తాలో కూడా జనం ఉత్సాహంతో సభలో పాల్గొన్నారు. కొద్దిమంది ఆంగ్లేయులు కూడా సభలో పాల్గొన్నారు. జూలై 31వ తేదీ లోపునే గిర్‌మిట్ ప్రథను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రకటన వెలువడింది. 1895లో మొట్టమొదటి దరఖాస్తు ఈ విధానాన్ని రద్దు చేయమని వ్రాసి పంపాను. అప్పుడు ఏదో రోజున ఈ అర్ధ బానిసత్వం తొలగిపోతుందని నమ్మాను. అయితే దీని వెనుక పరిశుద్ధమైన సత్యాగ్రహ ప్రవృత్తి పనిచేసిందని చెప్పక తప్పదు.

దీన్ని గురిచిన పూర్తి వివరం. అందు పాల్గొన్న వారి పేర్లు తెలుసుకోవాలను కొన్నవారు దక్షిణ ఆఫ్రికా సత్యాగ్రహ చరిత్ర అను నా గ్రంథం చదువవచ్చు.

12. నీలి మందు మచ్చ

చంపారన్ రాజర్షి జనకుని భూమి. చంపారన్ మామిడితోటలు వున్నట్లే నీలిమందు ఉత్పత్తి చేస్తూ వుండేవారు. చంపారన్ రైతులు తమ భూమిలో 3/20 భాగంలో తప్పనిసరిగా తమతెల్ల యజమాని కోసం నీలి మందు చట్టరీత్యా ఉత్పత్తి చేయవలసి వచ్చేది. దీన్ని తిన్‌కఠియా రివాజు అని అనేవారు. 20 కుంట (ఐదుమూరల నాలుగు అంగుళాల భూమి) లు అక్కడ ఒక ఎకరం. అందు 3 కుంటల్లో నీలిమందు ఉత్పత్తి చేయడాన్ని తిన్‌కఠియా రివాజు అని అనేవారు. అక్కడికి వెళ్లక పూర్వం నాకు చంపారన్ అను పేరు కూడా తెలియదు. అక్కడ నీలి మందు ఉత్పత్తి అవుతుందని కూడా నాకు తెలియదు. నీలిమందు బిళ్లలు చూచాను. కాని, అవి చంపారన్‌లో ఉత్పత్తి చేయబడతాయిని, అందువల్ల అక్కడి రైతులు విపరీతంగా నష్టపడుతున్నారని నాకు తెలియదు.

రాజకుమార్ శుక్లా చంపారన్‌కు చెందిన రైతు. ఆయన దాని వల్ల బాధపడ్డాడు. అయితే ఆ నీలి మచ్చను రైతులందరి హృదయాల నుండితొలగించి వేయాలనే అగ్ని అతని హృదయంలో రగుల్కొంది. లక్నో కాంగ్రెసుకు నేను వెళ్ళాను అక్కడే ఆ రైతు నన్ను పట్టుకున్నాడు. వకీలు బాబు నీకు అన్ని విషయాలు చెబుతారు. మీరు ఒకసారి చంపారన్ రండి అని ఆహ్వానించాడు. వకీలు అంటే చంపారన్‌లో గల నా అనుంగు అనుచరుడు. బీహారులో సేవాజీవులకు ప్రాణం వంటవాడునగు ప్రజ కిషోర్‌బాబు. రాజకుమార్ శుక్లా ఆయనను నా డేరాకు తీసుకొని వచ్చాడు. ఆయన నల్లని జుబ్బా, ప్యాంటు మొదలగునవి ధరించి వున్నాడు. చూడగానే ఆయన ప్రభావం నా మీద పడలేదు. అమాయకులైన రైతులను పీల్చే వకీలు అయివుంటాడని అప్పుడు అనిపించింది.

నేను చంపారన్ కథ ఆయన ద్వారా కొద్దిగా విన్నాను. నా సహజ పద్దతిలో “స్వయంగా చూడందే నేను నిర్ణయం ప్రకటించను. మీరు కాంగ్రెసులో యీ విషయం మీద మాట్లాడండి. ప్రస్తుతం నన్ను వదలండి” అని అన్నాను. రాజకుమార్ శుక్లాకు కాంగ్రెసుతో అవసరం ఎలాగూ ఉన్నది. చంపారన్ పరిస్థితిని గురించి మహాసభలో ప్రజకిషోర్ బాబు ప్రసంగించారు. అందు సానుభూతి తీర్మానం కూడా ప్యాసైంది.

రాజకుమార్ శుక్లాకు సంతోషం కలిగింది కానీ తృప్తి కలుగలేదు. నాకు చంపారన్ రైతుల కష్టాలు స్వయంగా చూపించాలని భావించాడు. నా యాత్రలో భాగంగా చంపారన్ చేరుతాను. ఒకటి రెండు రోజులు అక్కడ వుంటాను అని చెప్పాను. ఒక్క రోజు చాలు. మీ కండ్లతో అక్కడి రైతుల కడగండ్లు చూడండి అని శుక్లా అన్నాడు. నేను లక్నో నుండి కాన్పూర్ వెళ్ళాను. అక్కడికి కూడా రాజకుమార్ శుక్లా వచ్చాడు. యిక్కడికి చంపారన్ బాగా దగ్గర. ఇప్పుడే వచ్చి అక్కడ ఒక్కరోజు ఉండండి అన్నాడు. ఇప్పుడు నన్ను మన్నించండి నేను తప్పక వస్తాను. మాట యిస్తున్నాను అని ఇంకా ఎక్కువగా పట్టుబట్టాను. నేను ఆశ్రమం చేరుకున్నాను. రాజకుమార్ శుక్లా అక్కడికి కూడా వచ్చాడు. ఎప్పుడు వచ్చేది నిర్ణయించండి అని అన్నాడు. మీరు వెళ్ళండి. నేను ఫలానా తేదీన కలకత్తా వస్తాను. అక్కడికి వచ్చి నన్ను తీసుకువెళ్లండి అని చెప్పాను. అక్కడ ఎవరి దగ్గర వుండాలో, ఎవరిని చూడాలో కూడా నాకు తెలియదు. కలకత్తాలో భూపేన్ బాబుగారి ఇంట్లో బస చేద్దామని వెళ్ళాను. అక్కడ రాజకుమార్ శుక్లా ప్రత్యక్షమయ్యాడు. చదువురాని అమాయకంగా వున్న యీ పల్లెటూరి రైతు తన నిర్ణయాత్మక శక్తి ద్వారా నా హృదయం జయించాడు. 1917 ప్రారంభంలో మేమిద్దరం కలకత్తా నుండి బయలుదేరాం. మా యిద్దరి జోడా ఒకటిగా వున్నది. ఇద్దరం రైతుల్లా వున్నాం. ఇది నా మొదటి పాట్నా యాత్ర. తిన్నగా ఎవరి ఇంటికైనా వెళ్ళి బస చేద్దామంటే నాకు తెలిసినవారు అక్కడ ఎవ్వరూ లేదు. రాజకుమార్ శుక్లా చదువురాని రైతు. అయినప్పటికీ ఆయనకు తెలిసినవారు అక్కడ వుంటారనే అనుకున్నాను. రైల్లో ఆయనను కొంచెం ఎక్కువగా తెలుసుకొనే అవకాశం చిక్కింది. పాట్నాలో ఆయన రహస్యం బయటపడింది. రాజకుమార్ పూర్తిగా అమాయకుడు. ఆయన తన మిత్రుడని భావించిన వకీలు నిజానికి ఆయన మిత్రుడు కాడు. రాజకుమార్ శుక్లా ఆయనను ఆశ్రయించుకొని వున్నాడని తేలింది. కక్షిదారులగు రైతులకు, వకీళ్ళకు వుండే సంబంధం వర్షఋతువులో గంగానది ప్రవాహం వంటిది గదా! నన్ను ఆయన తిన్నగా రాజేన్‌బాబుగారింటికి తీసుకువెళ్ళాడు. రాజేన్‌బాబు పూరీ నగరమో లేక మరో చోటికో వెళ్ళారు. వారి బంగళాలోయిద్దరు నౌకర్లు ఉన్నారు. తినడానికి నాదగ్గర కొంత ఆహారపదార్థం ఉన్నది. కర్జూరం అవసరం అయింది. పాపం రాజకుమార్ శుక్లా బజారుకు వెళ్లి తెచ్చి పెట్టాడు.

బీహారులో అంటరానితనం అపరిమితంగా వున్నది. నా బాల్టీయందలి నీటి బొట్లు పడితే మైలపడతామని అక్కడి నౌకర్లు భావించారు. నా కులం ఏమిటో ఆ నౌకర్లకు తెలియదు! రాజకుమార్ లోపలి పాయిఖానా దొడ్డి ఉపయోగించమని నాకు చెప్పాడు. కానీ నౌకరు బయట ఉన్న పాయిఖానా దొడ్డిని వేలితో చూపించాడు. నాకు బాధ కలుగలేదు. కోపం రాలేదు. ఇలాంటి అనుభావాలు చాలా కలిగినందున నేను రాటు తేలిపోయాను. నౌకరు తన కర్తవ్యాన్ని పాలిస్తున్నాడు. రాజేంద్రబాబు యెడ తన కర్తవ్యాన్ని అతడు పాలిస్తున్నాడు అంతే. ఇట్టి వినోదం కలిగించే అనుభవాల వల్ల రాజ్‌కుమార్ శుక్లా యెడ నాకు గల గౌరవం పెరిగింది. వారిని గురించిన జ్ఞానం కూడా బాగా పెరిగింది. పాట్నా నుండి ఇక పగ్గాలు నా చేతికి తీసుకున్నాను. 

13. బీహారీల అమాయకత్వం

మౌలానా మజహరుల్ హక్ మరియు నేను లండనులో కలిసి వున్నాం. తరువాత మేము 1915లో బొంబాయిలో జరిగిన కాంగ్రెస్ యందు కలుసుకున్నాం. అప్పుడు ఆయన ముస్లింలీగ్ అధ్యక్షుడు. పాత పరిచయాన్ని తిరగవేసి ఈ మారు పాట్నా వచ్చినప్పుడు మా యింటికి దయచేయండి అని చెప్పాడు. ఆ ఆహ్వానాన్ని పురస్కరించుకొని నా రాకకు కారణం తెలుపుతూ వారికి జాబు వ్రాసాను. వెంటనే ఆయన కారు తీసుకొని వచ్చి తన ఇంటికి రమ్మని పట్టుపట్టారు. ఆయనకు ధన్యవాదాలు తెలిపి నేను ఫలానా చోటుకు వెళ్ళాలి, యిప్పుడు ఏ రైలు వుంటే దానిలో నన్ను ఎక్కించండి అని అన్నాను. రైల్వే గైడు చూస్తే నాకు ఏమీ బోధ పడలేదు. రాజకుమార్ శుక్లాతో మాట్లాడి, మీరు ముందు ముజప్ఫర్ వూరు వెళ్లాలి అని చెప్పి ఆరోజు సాయంత్రం ముజప్ఫర్ వూరుకు వెళ్ళే రైలు ఎక్కించారు. ఆచార్య కృపలానీ అప్పుడు ముజప్ఫర్ పూర్‌లో వున్నారు. వారిని నేను ఎరుగుదును. ఆయన ముజప్ఫర్‌పూర్ కాలేజీలో ప్రొఫెసరుగా వున్నారు. ప్రస్తుతం ఆ పనికూడా మానుకున్నారు. నేను వారికి తంతి పంపాను. రైలు ముజప్ఫర్ పూరుకు అర్ధరాత్రి చేరింది. ఆయన తన శిష్యమండలితో రైలు స్టేషనులో సిద్ధంగా వున్నారు. ఆయనకు అక్కడ ఇల్లు లేదు. ప్రొఫెసరు మల్కానీ గారి యింట్లో వుంటున్నారు. నన్ను వారింటికి తీసుకొని వెళ్లారు. ఆనాటి పరిస్థితుల దృష్ట్యా గవర్నమెంటు కాలేజీలో ప్రొఫెసరుగా పనిచేస్తున్న వ్యక్తి నా వంటివాణ్ణి తన గృహంలో ఉండనీయడం గొప్ప విశేషమే.

కృపలానీ బీహారు స్థితిని గురించి, ముఖ్యంగా తిరహుత్ ప్రాంతపు దీనగాధను గురించి చెప్పారు. నేను పూనుకోబోతున్న పని ఎంత కష్టమైనదో కూడా చెప్పారు. గయాబాబు యిక్కడ పేరుగల వకీలు. వారి పక్షాన వారింటికి రమ్మని నేను ఆహ్వానిస్తున్నాను. మేమంతా గవర్నమెంటుకు భయపడేవాళ్లమే. అయినా చేతనైనంత సహాయం మీకు చేస్తాం. రాజకుమార్ శుక్లా చెప్పిన మాటలు చాలా వరకు నిజమే. అయితే ఆయన నాయకుడు. యివాళ యిక్కడ లేడు, బాబూ ప్రజకిషోర్ మరియు బాబూ రాజేంద్ర ప్రసాదుకు తంతి పంపాము. వాళ్లిద్దరూ వస్తారు మీకు విషయమంతా చెబుతారు. సాయం చేస్తారు. దయయుంచి మీరు గయాబాబు గారింటికి బయలుదేరండి” అని అన్నారు. ఈ మాటలు విని నేను మెత్తబడ్డాను. నేను బసచేస్తే గయాబాబుగారికి యిబ్బంది కలుగుతుందేమోనని సంకోచించాను. కాని గయాబాబు సంకోచించవద్దని నాకు చెప్పారు. నేను గయాబాబు గారింటికి వెళ్లాను. వారు, వారి కుటుంబంలోని వారు నన్ను ప్రేమ జల్లుతో తడిపివేశారు.

ప్రజకిషోర్ బాబు దర్భంగా నుండి వచ్చారు. రాజేంద్రబాబు పూరీ నుండి వచ్చారు. లక్నోలో నేను చూచిన ప్రజకిషోర్ బాబు సామాన్యుడు కాదని తేలింది. బీహారు ప్రజలకుండే సహజ వినమ్రత, సాదాతనం, మంచి మనస్సు, అసాధారణమైన శ్రద్ధ వారిలో చూచి నా హృదయం ఆనందంతో నిండిపోయింది. బీహారు వకీళ్లు వారి యెడ చూపించిన ఆదరం నాకు ఆశ్చర్యం కలిగించింది.

ఆ మండలి సభ్యులకు నాకు మధ్య ఏర్పడ్డ ప్రేమబంధం జీవితాంతం విడిపోకుండా నిలిచిపోయింది. ప్రజకిషోర్‌బాబు అక్కడ విషయాలన్నీ నాకు వివరంగా చెప్పారు. ఆయన బీదరైతుల పక్షాన కోర్టుల్లో వాదిస్తున్నారని, రెండు మూడు కేసులు అట్టివి నడుస్తున్నాయని, ఆ కేసుల్లో వాదించి వ్యక్తిగతంగా కొంత ఊరట చెందుతూ వున్నారని తెలుసుకున్నాను. అప్పుడప్పుడు అందు ఓడిపోతూ వుంటారట. అమాయకులైన ఆ రైతుల దగ్గర సామ్ము తీసుకుంటూ వుంటారట. త్యాగులే అయినా ప్రజకిషోర్‌బాబు, రాజేంద్రప్రసాద్‌లు కక్షిదారులగు రైతుల దగ్గర ధనం తీసుకుంటూ వుంటారని, అందుకు సంకోచించరనీ తెలిసింది. వృత్తిపరంగా డబ్బు తీసుకోకపోతే మా ఇంటి ఖర్చులకు డబ్బు ఎలా వస్తుందని వారి తర్కం. అట్టి డబ్బుతోనే సమాజ సేవ కూడా చేయగలుగుతున్నామని చెప్పారు. వారికి లభించే సొమ్ముకు, బెంగాల్ బీహారుకు చెందిన మిగతా బారిష్టర్లకు లభించే సొమ్ముకు గల ఊహకైనా అందని వ్యత్యాసాన్ని అంకెల రూపంలో తెలుసుకుని నివ్వెరబోయాను.

“బాబు గారికి మేము ఒపీనియన్ (అభిప్రాయం) కోసం పదివేలు యిచ్చాం.” అని జనం చెబుతూ వుంటే ఆశ్చర్యం వేసింది. వెయ్యికి తక్కువ మాట నాకు వినబడలేదు. ఈ విషయంలో నేను తియ్యగా ఆ మిత్రమండలిని మందలించాను. ఓర్పుతో నా మందలింపును వారు సహించారు. విపరీతార్థాలు తియ్యలేదు. అంతా విన్న తరువాత “ఇక యిట్టి కేసులు మనం విరమించుకోవాలి. యీ విధమైన కేసుల వల్ల ప్రయోజనం శూన్యం. అణగారిపోయి భయభ్రాంతులై వున్న రైతు సోదరుల్ని కచ్చేరీల చుట్టూ త్రిప్పితే లాభం లేదు. అది సరియైన చికిత్స కాదు. వాళ్లకుగల భయాన్ని పోగొట్టాలి. అదే సరియైన చికిత్స. తిన్‌కఠియా రివాజు రద్దుకావాలి. అప్పటివరకు మనం విశ్రమించకూడదు. రెండు రోజుల్లో సాధ్యమైనంతగా చూచి తెలుసుకుందామని వచ్చాను. అయితే యీ పనికి రెండు సంవత్సరాలు పట్టవచ్చని తోస్తున్నది. అంత సమయం యివ్వడానికి సిద్ధంగా వున్నాను. యిందుకు ఏంచేయాలో నిర్ణయిస్తాను. కాని మీ సాయం కావాలి” అని స్పష్టంగా చెప్పాను.

ప్రజ కిషోర్ బాబు అసలు విషయం అర్ధం చేసుకున్నారు. అయితే నాతోను మిగతా వారితోను తర్కం చేయసాగారు. నామాటల్లో గర్భితమైయున్న భావాన్ని గురించి ప్రశ్నించాను. మీ అభిప్రాయంలో వకీళ్లు చేయాల్సిన త్యాగం ఏమిటి? ఎంతవరకు? ఎంతమంది వకీళ్లు కావాలి? కొద్దిమంది కొద్దికాలం పనిచేస్తే సరిపోతుందా లేదా? మొదలగు ప్రశ్నలు వేశారు. మీరంతా ఎంత త్యాగం చేస్తారో చెప్పండి అని ఆయన మిగతా వకీళ్లను అడిగారు. ఈ విధమైన చర్చ సాగించి చివరికి “మేము యింత మందిమి మీరు అప్పగించిన పని చేయడానికి సిద్ధంగా వుంటాము. వారిలో ఎవరిని మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు మీ దగ్గరకు వస్తాము. జైలుకు వెళ్లాలంటే మరి అది మాకు క్రొత్త. అందుకు అవసరమైన శక్తి చేకూర్చుకునేందుకు ప్రయత్నిస్తాం” అని తమ నిర్ణయాన్ని ఆయన ప్రకటించారు. 

14. అహింసాదేవి సాక్షాత్కారం

నేను రైతుల పరిస్థితిని పరీక్షించాలి. నీలిమందు కొఠార్ల యజమానులగు తెల్లదొరలకు వ్యతిరేకంగా వచ్చిన ఆరోపణల్లో ఎంత నిజం వున్నదో తెలుసుకోవాలి. యీ విషయమై వేలాది రైతుల్ని కలవాలి. వారిని కలుసుకునే ముందు నీలిమందు కొఠారుల యజమానుల్ని కలిసి వాళ్ళు చెప్పేది కూడా వినాలి. కమీషనరుకు జాబులు వ్రాశాను. యజమానుల సంఘ కార్యదర్శి ఒకడు వున్నాడు. వెళ్లి కలిశాను. “నీవు పరదేశివి. మాకు, రైతులకు మధ్య నీవు కల్పించుకోవద్దు. ఏమైనా చెప్పదలచుకుంటే లిఖితంగా వ్రాసి పంపు” అని ఆయన అన్నాడు. ఆయన మాటకు వినమ్రంగా జవాబిస్తూ “నేను పరదేశిని కాను. రైతులు కోరినందువల్ల వారి యీ వ్యవహారం క్షుణ్ణంగా తెలుసుకొనే అధికారం నాకు వున్నది.” అని చెప్పాను. కమీషనరును కలిశాను. ఆయన నన్ను చూడగానే మండిపడ్డాడు. బెదిరించాడు. తిరహుత్ నుండి తిరుగుముఖం పట్టమని చెప్పివేశాడు. అనుచరులకు ఈ విషయమంతా చెప్పి ఇక వ్యవహారం తీవ్రరూపం దాలుస్తుంది. రైతుల పరిస్థితుల్ని పరీక్షించేందుకు ప్రభుత్వం నన్ను వెళ్ళనీయదు. నేను ఊహించినదాని కంటే ముందే నేను జైలుకు వెళ్లక తప్పదు. మోతీహారీలోగాని లేక అవకాశం దొరికితే బేతియాలోగాని నేను అరెస్టు కావడం మంచిది. నేను త్వరగా అక్కడికి చేరుకోవాలి అని అన్నాను.

చంపారన్ తిరహత్ కమీషను యందలి ఒక జిల్లా. దానికి మోతీహారీ ప్రధాన కేంద్రం. బేతియాకు దగ్గరలో రాజకుమార్ శుక్లాగారి ఇల్లు వున్నది. అక్కడి కొఠార్లకు సంబంధించిన రైతులు కడు నిరుపేదలు. వారి పరిస్థితుల్ని చూపించాలని శుక్లాకు ఆరాటం ఎక్కువగా వున్నది. నేను అక్కడికి వెళ్లి వారిని చూడాలి అని భావించాను. వెంటనే అనుచరులందరినీ వెంటబెట్టుకొని మోతిహారీకి బయలుదేరాను. మోతిహారీలో గోరఖ్‌బాబు ఆశ్రయం, వారిల్లు సత్రంగా మారిపోయింది. మేము వారింటినంతటిని ఆక్రమించాం. మేము చేరిననాడే అక్కడికి దగ్గరలో అయిదు మైళ్ల దూరాన వున్న గ్రామంలో ఒక రైతు మీద దుర్మార్గం జరిగిందను వార్త మాకు అందింది. అతణ్ణి చూచేందుకు ధరణీధర బాబు అను వకీలును వెంటబెట్టుకొని నేను ఉదయాన వెళ్ళాలని నిర్ణయించాను. ఆ ప్రకారం ఏనుగు మీద ఎక్కి మేము ఆ గ్రామానికి బయలుదేరాం. గుజరాత్‌లో ఎడ్లబండిని ఉపయోగించిన విధంగా చంపారన్‌లో ఏనుగుల్ని ఉపయోగిస్తారు. సగం దూరం చేరామో లేదో ఇంతలో పోలీసు సూపరింటెండెంటు దూత అక్కడికి వచ్చి “సూపరింటెండెంట్ గారు మీకు సలాము చెప్పమన్నారు” అని అన్నాడు. వెంటనే విషయం గ్రహించాను. ధరణీధరబాబును ముందుకు వెళ్లమని చెప్పి వార్తాహరునితో బాటు అతను తెచ్చిన కిరాయి బండి ఎక్కాను. అతడు చంపారన్ వదలి వెళ్లిపొమ్మని నోటీసు నాకు యిచ్చి కాగితం చూపి సంతకం చేయమని అన్నాడు. “నేను చంపారన్ వదలి వెళ్ళను. నేను యిక్కడి పరిస్థితుల్ని పరీక్షించాల్సి వున్నది” అని సమాధానం వ్రాసి అతనికి యిచ్చాను. మరుసటి రోజున చంపారన్ వదలి వెళ్ళనందువల్ల కోర్టులో హాజరుకమ్మని సమను నాకు అందింది. ఆ రాత్రంతా మేలుకొని నేను వ్రాయవలసిన జాబులన్నీ వ్రాశాను. అవసరమైన సూచనలన్నీ వ్రాసి ప్రజకిషోర్‌బాబుకు యిచ్చాను.

కోర్టువాళ్లు సమను పంపారను వార్త క్షణంలో జనానికి తెలిసిపోయింది. మోతిహారీలో ఎన్నడూ కనీవినీ ఎరుగని ఘట్టం జరిగిందని ప్రజలు గోల పెట్టారు. గోరఖ్‌బాబుగారి యింటిదగ్గర, కోర్టు దగ్గర గుంపులు గుంపులుగా జనం చేరారు. అదృష్టవశాత్తూ ఆ రాత్రే పనులన్నీ పూర్తిచేయడం వల్ల ఆ జనాన్ని శాంతింపచేసేందుకు నాకు అవకాశం చిక్కింది. నా అనుచరుల వల్ల కలిగే ఉపయోగమేమిటో నాకు బోధపడింది. వాళ్లు జనాన్ని వరసగా నిలబెట్టడం ప్రారంభించారు. కోర్టులో ఎక్కడికి వెళితే అక్కడ నా వెంట ఒకటే జనం. కలెక్టరు, మేజిస్ట్రేట్, సూపరింటెండెంటుతో కూడా నాకు సంబంధం ఏర్పడింది. గవర్నమెంటువారి నోటీసుల్ని ఒప్పుకున్నాను. అధికారులతో ఎంతో మంచిగా వ్యవహరించాను. దానితో వారందరికీ నా విషయమై భయం పోయింది. వారిని మంచిగానే వ్యతిరేకిస్తానని వాళ్లకు బోధపడింది. నన్ను అదుపులో పెట్టడానికి బదులు జనాన్ని అదుపులో పెట్టడానికీ నా అనుచరులకు సంతోషంతో వాళ్లు సహకరించడం ప్రారంభించారు. దానితోబాటు తమ అధికార ప్రాబల్యం ఆనాటితో తగ్గిపోయిందని వాళ్లు గ్రహించారు. ప్రజలు ఆ క్షణం గవర్నమెంటు అధికారుల దండన, శిక్షల భయం మరచిపోయి తను క్రొత్త మిత్రుని యెడ గల ప్రేమ యొక్క ఆధిపత్యానికి లోబడిపోయారని అందరికీ స్పష్టంగా తెలిసిపోయింది.

నిజానికి చంపారన్‌లో నన్ను ఎవ్వరూ ఎరుగరు. రైతులు నిరక్షరకుక్షులు. చంపారన్ గంగానదికి ఆవలి ఒడ్డున హిమాలయ పర్వత చరియల్లో నేపాలుకు దగ్గరగా వున్న ప్రాంతం. అంటే అదీ ఒక క్రొత్త ప్రపంచమన్నమాట. అక్కడ కాంగ్రెస్ అంటే ఏమిటో ఎవ్వరికీ తెలియదు. కాంగ్రెస్ మెంబరు ఒక్కడు కూడా అక్కడ లేడు. కొందరి పేర్లు వినపడ్డా వారు భయంతో నక్కి కూర్చున్నారు. కాంగ్రెస్ పేరు తెలియకపోయినా యీనాడు కాంగ్రెస్ జరిగినంతపని అయింది. అనేకమంది సేవకులు కాంగ్రెసులో చేరినట్లయింది. అక్కడ కాంగ్రెస్ ప్రారంభమైందని అనిపించింది. అనుచరులతో సంప్రదించిన పిమ్మట కాంగ్రెస్ పేరట ఏ పనీ చేయకూడదని నిర్ణయించాం. పేరుతో అవసరం లేదు. పని ముఖ్యం అని భావించాం. మాటలు కాదు చేతలు ముఖ్యం అని నిర్ణయించాం. కాంగ్రెస్ పేరు ఎవ్వరికీ ఇష్టం కాలేదు. యీ పరగణాలో కాంగ్రెసంటే ప్లీడర్ల వాద ప్రతివాదాలు, చట్ట సంబంధమైన ఛిద్రాలతో తలపడటం అనే ప్రచారం అయింది. కాంగ్రెస్ అంటే బాంబులనీ, మాటలే కాని చేతలు లేనిదని యిక్కడి గవర్నమెంటు, మరియు దానికి దన్నుగా నిలబడియున్న తెల్లదొరల అభిప్రాయం. అట్టి కాంగ్రెస్‌కు, యిక్కడి కాంగ్రెస్‌కు తేడా వున్నదని మేము రుజువు చేయవలసిన అవసరం ఏర్పడింది. అందువల్ల కాంగ్రెస్ ఊసే ఎత్తకుండా పనిచేయాలని భావించాం. కాంగ్రెస్ పేరుతో గాక, దాని లక్ష్యాలను ప్రజలు తెలుసుకుంటే చాలునను నిర్ణయానికి వచ్చాం. అందువల్ల కాంగ్రెస్ పేరట రహస్యంగాని, బహిరంగంగా గాని ఏ పనీ చేయలేదు. రాజకుమార్ శుక్లాకు వేలాదిజనంతో కలిసిపోయే శక్తిలేదు. రాజకీయంగా అక్కడ యింతవరకు ఎవ్వరూ పనిచేసి యుండలేదు. చంపారన్ బయటగల ప్రపంచాన్ని ఆయన ఎరుగడు. అయితే మా యిరువురి కలయిక పాతమిత్రుల కలయికగా పరిణమించింది. ఆ రూపంలో నేను దేవుణ్ణి, అహింసను, సత్యాన్నీ దర్శించాను. ఇది అక్షరాలా నిజం. ఈ విషయమై నాకు గల అధికారం ఏమిటి అని ఆలోచిస్తే ప్రేమ తప్ప వేరే ఏమీలేదని ప్రేమ, అహింసల ఎడ నాకు గల నిశ్చలమైన శ్రద్ధ తప్ప మరేమీ లేదని తేలింది.

చంపారన్‌లో జరిగిన ఈ వ్యవహారం నా జీవితంలో మరిచిపోవడానికి వీలులేనిది. అది నాకు, రైతులకు ఉత్సవదినం. ప్రభుత్వ నిర్ణయ ప్రకారం నామీద కేసు నడపబోతున్నది. ఆ కేసు నామీద కాక ప్రభుత్వం మీదనే నడవబోతున్నదన్న మాట. నా కోసం కమీషనరు పరిచిన వలలో ఆంగ్ల ప్రభుత్వమే చిక్కుకోబోతున్నదని వాళ్లు అప్పుడు గ్రహించలేదు. 

15. కేసు ఉపసంహరణ

నా మీద కేసు నడిచింది. గవర్నమెంటు వకీలు, మరియు మేజిస్ట్రేటు కంగారుపడ్డారు. ఏం చేయాలో వారికి పాలుపోలేదు. గవర్నమెంటు వకీలు విచారణను వాయిదా వేయమని ప్రార్ధించాడు. నేను చంపారన్ వదిలివెళ్లమని యిచ్చిన నోటీసుని ఖాతరు చేయలేదు. అపరాధం అంగీకరిస్తున్నాను అని అంటూ నేను వ్రాసుకొచ్చిన క్రింది పాఠాన్ని కోర్టులో చదివి వినిపించాను

“చట్టప్రకారం సెక్షను 144 క్రింద విధించబడ్డ ఆదేశాన్ని ఉల్లంఘించవలసి వచ్చిన కారణాల్ని మీ అనుమతితో క్లుప్తంగా వివరించదలచుకున్నాను. అది నిరాదరణకు సూచకం కాదని మనవి చేస్తున్నాను. యిక్కడి ప్రభుత్వానికి నాకు మధ్య గల అభిప్రాయ భేదమే ఇందుకు కారణం. ప్రజాసేవ ద్వారానే దేశ సేవ చేయడానికి నేను యిక్కడికి వచ్చాను. ఇక్కడి రైతులను యజమానులు సరిగా చూడటం లేదు. అందు నిమిత్తం నన్ను గట్టిగా కోరినందున వారి స్థితిని చూచి సరిచేద్దామనే ఉద్దేశ్యంతో వివరాలన్నీ తెలుసుకుందామని వచ్చాను. నా రాకవలన శాంతి భంగం వాటిల్లుతుందని గాని, రక్తపాతం జరుగుతుందనిగాని నేను భావించడం లేదు. యిట్టి విషయాలలో నాకు మంచి అనుభవం వున్నదని మనవి చేస్తున్నాను. కాని గవర్నమెంటు మరో విధంగా తలుస్తున్నది. ప్రభుత్వానికి గల యిబ్బంది కూడా నేనెరుగుదును. తనకు అందిన సమాచారం మీదనే ప్రభుత్వ ఆధారపడవలసి వస్తుంది. నేను ప్రజాహితం చేస్తూ అందుకు సంబంధించిన చట్టాల్ని ఆమోదించి ఆ ప్రకారం నడుచుకోవాలని భావించేవాణ్ణి. కాని నాకిచ్చిన ప్రభుత్వ ఆదేశాన్ని పాటించితే ప్రజలకు నేను న్యాయం చేయలేనని భావిస్తున్నాను. వారి మధ్యన వుండి మాత్రమే నేను యిక్కడి ప్రజలకు సేవ చేయగలనని నమ్ముతున్నాను. అందువల్ల నేను యిప్పుడు చంపారన్ విడిచి వెళ్లలేను. నాకిది ధర్మసంకటం. అందువల్ల చంపారన్ వదిలి వెళ్లమని ప్రభుత్వం యిచ్చిన ఆ దేశపు బాధ్యత ప్రభుత్వానిదేనని సూచించవలసి వచ్చినందుకు విచారిస్తున్నాను.” “భారతదేశంలో ప్రజాజీవనమునందు నా వంటి గౌరవ ప్రతిష్టలు గల వ్యక్తి ఒక చర్యకు పూనుకొన్నప్పుడు ఎంతో జాగ్రత్త వహించవలసియున్నదని నాకు తెలుసును. కాని నాకు యిక్కడ కల్పించబడిన పరిస్థితిని ఆత్మాభిమానం గల వ్యక్తి ఎవ్వడూ అంగీకరించలేడని చెప్పవలసిన అవసరం కలగడం దురదృష్టకరం. ప్రభుత్వ స్థానిక అధికారుల ఆదేశం కంటే, నా అంతర్వాణి పెద్దదని, దాని ఆదేశాన్ని పాలించడం నా కర్తవ్యమని భావిస్తున్నాను.”

నా ప్రకటనతో కేసును వాయిదా వేయవలసిన అవసరం లేకుండాపోయింది. యిలా జరుగుతుందని వకీలుగాని, మేజిస్ట్రేటుగాని ఊహించలేదు. అందువల్ల శిక్ష విధించేందుకు కోర్టువారు కేసును ఆపి వుంచారు. నేను యీ వివరమంతా తంతి ద్వారా వైస్రాయికి తెలియజేశాను. పాట్నాకు కూడా తంతి పంపాను. భారత భూషణ్ పండిత మదనమోహన మాలవ్యా వంటి పెద్దలకు కూడా తంతి పంపాను. నేను కోర్టుకు బయలుదేరబోతూ వుండగా వైస్రాయి గారి ఆదేశం ప్రకారం కేసును ఉపసంహరించుకోవడమైనదని మేజిస్ట్రేటు నాకు సమాచారం అందజేశాడు. మీరు చేయదలచిన పరీక్షలు చేయండి అని కలెక్టరు నుండి జాబు అందింది. అధికారుల సహాయం పొందవచ్చునని ఆ జాబులో ఆయన సూచించాడు. మా చర్యకు యింత త్వరగా శుభ పరిణామం కలుగుతుందని కలలో కూడా మేము ఊహించియుండలేదు.

నేను కలెక్టరు మి. హెకోసును కలిశాను. అతడు మంచివాడుగా కనబడ్డాడు. మీరు అవసరమనుకున్న పత్రాలన్నీ చూడవచ్చు. అవసరమని అనుకున్నప్పుడు మీరు తిన్నగా వచ్చి నన్ను కలుసుకోవచ్చు. ఏ సాయం కావాలనన్నా మీకు అందిస్తాను అని ఆయన చెప్పాడు.

మరో వైపున భారతదేశానికి సత్యాగ్రహం అంటే ఏమిటో, చట్టాన్ని సవినయంగా ఉల్లంఘించడం అంటే ఏమిటో పాఠం నేర్చినట్లయింది. పత్రికల ద్వారా నా యీ వ్యవహారానికి పెద్ద ప్రచారం లభించింది. చంపారన్‌లో, నాయీ కార్యక్రమానికి ప్రఖ్యాతి లభించింది. నేను అక్కడి పరిస్థితుల్ని పరీక్షిస్తున్నప్పుడు ప్రభుత్వం దృష్టిలో కూడా నేను నిష్పక్షంగా వ్యవహరించడం అవసరమని అయితే అందుకు పత్రికా విలేఖరులను తీసుకొని వెళ్లి వాళ్ల ప్రకటనలు వెలువరించవలసిన అవసరం లేదని నిర్ణయించాను. వాళ్లు పెద్ద పెద్ద రిపోర్టులు పత్రికల్లో ప్రకటిస్తే అపకారం కూడా జరుగవచ్చు. అందువల్ల చాలామంది పత్రికా సంపాదకులకి మీ విలేఖర్లను పంపవద్దని అవసరమైన వివరాలు నేనే మీ విలేఖర్లకు అందజేస్తూ వుంటానని జాబులో వ్రాశాను. చంపారన్‌లో గల తెల్ల ఖామందులు బాగా కోపంగా వున్నారని నాకు తెలుసు. అధికారులు కూడా లోపల సంతోషంగా వుండరని తెలుసు. వాళ్లకు కోపం వస్తే నన్నేమీ చేయలేరు కాని పాపం అక్కడి నిరు పేదలగు రైతుల్ని యమబాధలు పెడతారని, అందువల్ల నేను చేయదలచుకున్న విచారణ సరిగా జరుగదని గ్రహించాను. తెల్లదొరలు అప్పుడే విషప్రచారం ప్రారంభించారు. వాళ్లు నాకు, నా అనుచరులకు వ్యతిరేకంగా అబద్ధపు ప్రకటనలు పత్రికల్లో ప్రకటించడం ప్రారంభించారు. నేను ఎంతో జాగ్రత్తగా వున్నందున, బహు చిన్న విషయాలలో సైతం సత్యం మీద ఆధారపడియున్నందున తెల్లదొరలు ప్రయోగించిన బాణాలు గురి తప్పిపోయాయి. ప్రజకిషోర్‌బాబును బాగా దుమ్మెత్తి పోశారు. తెల్లదొరలు వారిని నిందించిన కొద్దీ వారి గౌరవ ప్రతిష్టలు బాగా పెరిగిపోయాయి.

ఇట్టి సున్నితమైన వాతావరణంలో రిపోర్టర్లను వెంటవుండమని నేను ప్రోత్సహించలేదు. నాయకుల్ని కూడా ఆహ్వానించలేదు. “అవసరమైనప్పుడు తనను పిలవమని, తాను సిద్ధంగా వున్నానని” పండిత మదనమోహన మాలవ్యాగారు మనిషి ద్వారా వార్త పంపారు. అయినా వారికి కూడా నేను శ్రమ కలిగించలేదు. యీ సమస్యను నేను రాజకీయం చేయదలచలేదు. ఎప్పటికప్పుడు జరిగిన వివరాలు పత్రికలకు పంపుతూ వున్నాను. రాజకీయ సంబంధమైన వ్యవహారాలకు కూడా, రాజకీయ అవసరం లేనప్పుడు రాజకీయ రూపం కల్పించితే రెంటికీ చెడిన రేవడి చందమవుతుంది. యీ విధంగా అసలు విషయాన్ని స్థలం మారకుండా అక్కడే వుండనిస్తే అంతా సర్దుకుంటుందని నా విశ్వాసం. ఎన్నో పర్యాయాలు కలిగిన అనుభవం వల్ల నేను యీ విషయం గ్రహించాను. పరిశుద్ధమైన ప్రజా సేవయందు ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగానైనా రాజకీయం తప్పక పనిచేస్తుంది. చంపారన్‌లో జరిగిన పోరాటం యీ విషయాన్ని రుజూ చేసింది.

16. కార్య విధానం

చంపారన్ పరిస్థితుల్ని వివరించడమంటే చంపారన్ రైతుల చరిత్రను వివరించడమే. ఆ వివరాలన్నీ యీ ప్రకరణాలలో పేర్కొనడం సాధ్యం కాదు. చంపారన్‌లో జరిపిన పరిశీలనంతా అహింసా ప్రయోగమే. అందుకు సంబంధించిన వివరాలు అవసరమైనంత వరకే వివరించాను. మొత్తం వివరాలు తెలుసుకోదలచిన పాఠకులు బాబూ రాజేంద్ర ప్రసాద్ యీ సంగ్రామాన్ని గురించి వ్రాసిన గ్రంథం చదవవచ్చును లేక యుగధర్మ్ ప్రెస్ ద్వారా ప్రకటించబడ్డ ఆ గ్రంధపు గుజరాతీ అనువాదం చదవవచ్చు.

ఇక అసలు విషయానికి వద్దాం. గోరఖ్‌బాబుగారి యింటి దగ్గర వుండి నేను యీ పరిశీలనా కార్యక్రమం నిర్వహించియుంటే వారు యిల్లు వదిలి పెట్టి వెళ్లవలసి వచ్చేదే. మోతీహారీలో కిరాయి చెల్లించినా యిల్లు యిచ్చే పరిస్థితిలో ఎవ్వరూ లేరు. అందుకు భయమే కారణం. కాని ప్రజకిషోర్‌బాబు వ్యవహారదక్షులు. ఆయన అద్దెకు ఒక పెద్ద భవనం సంపాదించారు. మేమంతా ఆ యింటికి వెళ్లాం. అక్కడ డబ్బు లేకుండా పని జరిగే పరిస్థితి లేదు యిటువంటి ప్రజాకార్యక్రమాలకు ప్రజల దగ్గర విరాళాలు తీసుకునే పద్ధతి ప్రారంభం కాలేదు. ప్రజకిషోర్‌బాబు, వారితో బాటు వున్న మిత్రమండలి వారంతా వకీళ్లే. వాళ్లు తమ ఖర్చులు తామే భరిస్తూ. అవసరమైతే మిత్రుల దగ్గర డబ్బు తీసుకోకూడదని నా దృఢనిర్ణయం. వాళ్ల దగ్గర డబ్బు తీసుకుంటే ఉద్యమ అర్థం మారిపోతుందని నా అభిప్రాయం. యీ కార్యక్రమం కోసం దేశప్రజల్ని కూడా డబ్బు అడగకూడదని నా నిర్ణయం. అలా తీసుకుంటే వ్యవహారానికి రాజకీయరంగు పులిమే ప్రమాదం వున్నది. బొంబాయి మిత్రుల నుండి 15 వేల రూపాయలు ఇస్తామని ఒక తంతి వచ్చింది. కృతజ్ఞతలు తెలిపి వాళ్ల కోరికను నిరాకరించాం. బాగా ఆలోచించి చంపారన్ బయటవుండే బీహారుకు చెందిన ధనికుల దగ్గర ప్రజకిషోర్‌బాబు బృందం సాధ్యమైనంత డబ్బు ప్రోగుచేయాలని, లోటుపడితే డాక్టర్ ప్రాణజీవన్‌దాస్ మెహతాగారి దగ్గర డబ్బు తీసుకొని భర్తీ చేస్తానని నేను చెప్పాను. అవసరమైనంత డబ్బు వ్రాసి తెప్పించుకోమని డాక్టర్ మెహతాగారు మొదటే నాకు వ్రాశారు. దానితో డబ్బును గురించి చింత తొలగిపోయింది. తక్కువ డబ్బు ఖర్చు పెట్టి యీ సమస్యను పరిష్కరించాలని మా నిర్ణయం. అందువల్ల ఎక్కువ డబ్బు అవసరం పడలేదు. రెండు లేక మూడు వేల రూపాయల కంటే ఎక్కువ డబ్బు అవసరం లేదని భావించాను. వసూలు చేసిన డబ్బులో అయిదు వందలో లేక వెయ్యి రూపాయలో మిగిలినట్లు నాకు గుర్తు. ఆ రోజుల్లో మా సహచరుల అలవాట్లు విచిత్రంగా వుండేవి. నేను రూజీవారి ప్రవర్తనను గురించి ఛలోక్తులు విసురుతూ వుండేవాణ్ణి. వకీళ్ళ మండలికి వంట విడివిడిగా తయారవుతూ వుండేది. రాత్రిపూట 12 గంటల వరకు భోజనం చేస్తూ వుండేవారు. ఎవరి ఖర్చు వారు భరించినా నాకు వాళ్ల పద్ధతి నచ్చలేదు. మా అందరి మధ్య స్నేహబంధం గట్టిగా బిగుసుకున్నందున ఎవరెన్ని చెప్పినా, ఎవరేమన్నా మా బంధనం వదులుకాలేదు. నేను విసిరే మాటల బాణాల బాధను నవ్వుతూ వారు సహించేవారు. చివరికి నౌకర్లందరినీ పంపించివేయాలని, భోజన నియమాల్ని అంతా పాటించాలని నిర్ణయం చేశాం. అందరూ శాకాహారులు కారు. రెండు కుంపట్లు ప్రారంభిస్తే ఖర్చు పెరుగుతుంది. అందువల్ల ఒకే కుంపటి వెలగాలని, శాకాహార భోజనం తయారుచేయాలని, భోజనం బహుసాదాగా వుండాలని నిర్ణయించాం. దానితో ఖర్చు బాగా తగ్గిపోయింది, కార్యశక్తి పెరిగింది. సమయం కూడా బాగా కలిసివచ్చింది.

మా పని బాగా పెరిగిపోయింది. రైతులు గుంపులు గుంపులుగా వచ్చి తమ గాధలు వ్రాయించసాగారు. వ్రాసుకునేవారి దగ్గర గుంపులుగా జనం పెరిగిపోయారు. ఇల్లంతా జనంతో నిండిపోయింది. చూడడానికి వచ్చే జనాన్నుంచి నన్ను రక్షించడం కోసం నా సహచరులు ఎంతో శ్రమపడ్డారు. యిక గత్యంతరం లేక సమయం నిర్ధారించి నన్ను బయటకి తీసుకురాసాగారు. ఆరు లేక ఏడుగురు వకీళ్లు రైతులు చేప్పే కధలు రాసుకుంటూ వుండేవారు. అయినా సాయంకాలానికి రాతపని పూర్తి అయ్యేది కాదు. యింతమంది వాఙ్మూలాలు అనవసరం కాని వారు చెప్పింది రాసుకుంటే రైతులు తృప్తిపడతారు. కధలు వ్రాసేవారు కొన్ని నియమాల్ని పాటిస్తూ వుండేవారు. ప్రతి రైతును ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టేవారు. సమాధానం సరిగా చెప్పలేని వారి వాఙ్మూలం రాసుకోకూడదనీ నిరాధారమైన కధలు కూడా రాసుకోకూడదనీ నిర్ణయించాం. అందువల్ల యదార్ధమైన గాధలు, ఆధారాలు గల కధలే రాసుకోవడం జరిగింది.

ఈ వాఙ్మూలాలు రాసుకునేటప్పుడు గూఢచారి పోలీసులు తప్పక వుండేవారు. మేము కావాలంటే వాళ్లు ఆగిపోయేవారే. కాని మేము వాళ్లను రానియ్యాలని, వారి విషయంలో వినమ్రంగా వ్యవహరించాలని, అవసరమైన సమాచారం వాళ్ళకు అందజేయాలని నిర్ణయించాం. వాళ్ల కండ్ల ఎదుట రైతులు కధలు చెబుతూ వుండేవారు. యిందువల్ల రైతులకు ధైర్యం వచ్చింది. గూఢచారి పోలీసులంటే జనం విపరీతంగా భయపడుతూ వుండేవారు. వారి భయం పోయింది. వాళ్లు చెప్పే కథల్లో అతిశయోక్తులు తగ్గిపోయాయి. అబద్ధాలు చెబితే పోలీసులు పట్టుకుంటారనే భయంతో రైతులు నిజం చెబుతూవుండేవారు. తెల్లదొరల్ని భయపెట్టి వారిని పారద్రోలడం నా లక్ష్యం కాదు. వారి హృదయాలను జయించాలనే ఉద్దేశ్యంతో నా యీ సంగ్రామం సాగింది. ఫలానా దొరకు వ్యతిరేకంగా వాఙ్మూలాలు వచ్చాయని తెలియగానే జాబులు వ్రాసి వారికి తెలియజేయడమేగాక, వారిని కలిసి మాట్లాడుతూ వుండేవాణ్ణి. తెల్లదొరల బృందాన్ని కలసి వారి సాక్ష్యాలు కూడా సేకరించడం ప్రారంభించాను. వారిలో కొందరు నన్ను అసహ్యించుకునేవారు. కొందరు తటస్థంగా వుండేవారు. కొందరు మంచిగా వ్యవహరించేవారు. 

17. అనుచరులు

ప్రజకిషోర్‌బాబు మరియు రాజేంద్రబాబుగారలది గొప్ప జోడి. వారిద్దరూ తమ అమితప్రేమచే నన్ను, తాము లేకపోతే ముందుకు సాగలేనంతగా నిర్వీర్యుణ్ణి చేసివేశారు. వారి శిష్యులు లేక అనుచరులు శంభూబాబు, అనుగ్రహబాబు, ధరనీబాబు, రామనవమీ బాబు మొదలగు వకీళ్లు దరిదాపు నా వెంటనే వుండేవారు. యిది బీహారీ సంఘం. రైతుల వాఙ్మూలాలు రాయడం వారి పని. ఆచార్య కృపలానీ మాతో కలవకుండా వుండగలరా? వారు స్వయగా సింధీలే అయినా బీహారులో వుంటూ బీహారీగా మారిపోయారు. వారి వలె ఒక ప్రాంతానికి సంబంధించిన వారు మరో ప్రాంతానికి వెళ్లి అక్కడివారితో కలిసిపోయి, తాము ఆ ప్రాంతంవారిలా మారిపోగలవారు బహుతక్కువ. ఆయన నాకు ద్వారపాలకుని వలె వ్యవహరించారు. చూడటానికి అసంఖ్యాకంగా వస్తున్నవారినుండి నన్ను రక్షించే బాధ్యత వారు వహించారు. అదే తమ జీవన సార్థకత అని భావించారు. ఆయన పరిహాసం చేస్తూ కొందరిని నా దగ్గరకు రాకుండా ఆపివేసేవారు. కొందరిని అహింసాత్మకంగా బెదిరించి ఆపేవారు. రాత్రిపూట ఉపాధ్యాయ వృత్తి ప్రారంభించి అక్కడివారినందరిని నవ్విస్తూ, గుండెదిటవు లేనివారికి ధైర్యం చెబుతూ వుండేవారు.

మౌలానా మజహరుల్ హక్ నాకు సహాయకులుగా పేరు నమోదు చేయించుకున్నారు. నెలకు రెండు మూడుసార్లు వచ్చిపోతుండేవారు. వెనుకటి రోజుల్లోగల వారి దర్జాకు, ఆడంబరానికి యిప్పటి సాదా జీవనానికి ఎంతో వ్యత్యాసం వున్నది. మా దగ్గరకు వచ్చి మాలో కలిసిపోతూ వుండేవారు, చంపారన్‌లో పనిచేయడం ప్రారంభించిన తరువాత ఈ గ్రామాలలో విద్యాప్రచారం జరిగితే తప్ప ఇవి బాగుపడవనే నిర్ణయానికి వచ్చాము. ఎవరికీ చదువురాదు. పిల్లలు చదువులేక తిరుగుతుండేవారు. తల్లిదండ్రులు రెండు మూడు కాసుల కోసం నీలిమందు పొలాల్లో చచ్చేలా పనిచేస్తూ వుండేవారు. పురుషులకు రోజంతా పనిచేస్తే పది పైసల కూలి. స్త్రీలకు ఆరు పైసల కూలి, పిల్లలకు మూడు పైసల కూలి. నాలుగణాలు తెచ్చుకునే కూలీవాడు గొప్ప అదృష్టవంతుడుగా లెక్కింపబడేవాడు. సహచరులతో చర్చించి మొదట ఆరుగ్రామాల్లో పాఠశాలలు తెరిపించాను. గ్రామ పెద్ద యిల్లు యివ్వాలి. మాష్టారుకు అన్నం పెట్టాలి. మిగతా ఖర్చులు మేము భరించాలి. డబ్బు యివ్వలేదు కాని గ్రామస్తులు ధాన్యం యివ్వగల స్థితిలో వున్నారు. కనుక గింజలు ఇచ్చేందుకు గ్రామస్తులు సిద్ధపడ్డారు. యీ ఉపాధ్యాయులు ఎక్కడి నుండి వస్తారా అని ప్రశ్న బయలుదేరింది. బీహారులో జీతాలు లేకుండా పనిచేసే ఉపాధ్యాయులు లేరు, వున్నా తక్కువే. సామాన్యులైన ఉపాధ్యాయులకు పిల్లల్ని అప్పగించకూడదని నా అభిప్రాయం. ఉపాధ్యాయునికి చదువు రాకపోయినా ఫరవాలేదు గాని శీలవంతుడై వుండాలని గట్టిగా చెప్పాను.

ఇందుకోసం వాలంటీర్లు కావాలని ప్రకటించాను. గంగాధరరావు దేశపాండే నా ప్రకటనకు స్పందించి బాబా సాహెబ్ సామణ్ మరియు పుండలీక్‌ని పంపారు. బొంబాయి నుండి అవంతికాబాయి గోఖలే వచ్చారు. దక్షిణాది నుండి ఆనందీబాయి వచ్చింది. నేను ఛోటేలాలు, సురేంద్రనాధ్, నా చిన్న పిల్లవాడు దేవదాసును పిలిపించాను. మహదేవదేశాయి, నరహరిపారీఖ్ గారలు వచ్చి కలిశారు. మహా దేవదేశాయి భార్య దుర్గాబెన్, నరహరిపారిఖ్ భార్య మణిబెన్ కూడా వచ్చారు. కస్తూరిబాయిని కూడా పిలిపించాను. యింతమంది ఉపాధ్యాయులు ఉపాధ్యాయురాండ్రు సరిపోతారని భావించాను. శ్రీమతి అవంతికాబాయి, ఆనందీబాయి, చదువుకున్నవారే కానీ మణీబెన్ పారీఖ్, దుర్గాబెన్ దేశాయి గార్లకు కొద్దిగా గుజరాతీ వచ్చు. కస్తూరీబాయికి చదువురానట్లే లెక్క. వీరు పిల్లలకు హిందీ ఎలా నేర్పగలరు? వీరు పిల్లలకు వ్యాకరణం చెప్పనవసరం లేదు, నడవడిక నేర్పితే చాలు. అని వారికి చెప్పాను. వ్రాయడం, చదవడం కంటే వాళ్లకు పారిశుద్ధ్యాన్ని గురించి చెప్పాలి. హిందీ, గుజరాతీ, మరాఠీ భాషల్లో పెద్ద తేడా లేదని మొదటి తరగతిలో అంకెలు నేర్పమని అందువల్ల నీకు కష్టం ఉండదని చెప్పాను. తత్‌ఫలితంగా మహిళల క్లాసులు బాగా నడిచాయి. మహిళలకు ఆత్మ విశ్వాసం పెరిగింది. వాళ్లు తమ క్లాసులకు ప్రాణం పోశారు. వాళ్లు బాగా పాఠాలు చెప్పారు. యీ సోదరీమణుల ద్వారా గ్రామ మహిళలతో కూడా మాకు బాగా పరిచయం పెరిగింది. నాకు చదువుతో తృప్తి కలుగలేదు. గ్రామాలలో మురికి అధికంగా వున్నది. గ్రామం వీధుల్లో పెంటకుప్పలూ, బావుల దగ్గర బురద, దుర్వాసన యిళ్లముందు భరించలేని పరిస్థితులు. పెద్దలు కూడా పారిశుద్ధ్యాన్ని గరపడం అవసరమని భావించాను. చంపారన్ జనం రోగాలతో బాధపడుతున్నారు. సాధ్యమైనంతవరకు గ్రామ ప్రజలను సరియైన త్రోవకు తేవాలనీ, పారిశుద్ధ్యం నేర్పాలనీ, వారి జీవితంలో ప్రవేశించి కార్యకర్తలు వారికి సేవ చేయాలని నా అభిప్రాయం. యిందుకు డాక్టర్ సహాయం అవసరం. గోఖలేగారి సొసైటీకి చెందిన డాక్టర్ దేవ్ గారిని పంపమని కోరాను. వారికీ నాకూ ప్రేమ సంబంధం ఏర్పడింది. ఆరుమాసాల పాటు వారి సేవ లభించింది. వారి పర్యవేక్షణలో ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు పనిచేయవలసి వచ్చింది. తెల్లదొరలకు వ్యతిరేకంగా ఉపాధ్యాయులు పనిచేయవలసి వచ్చింది. తెల్లదొరలకు వ్యతిరేకంగా చేయబడుతున్న ఆరోపణల్లో పాల్గొనవద్దని, రాజకీయాల్లో పడవద్దని ఎవరైనా ఆరోపణలు చేసేవారు వస్తే నా దగ్గరకి పంపమని, మీ క్షేత్రం దాటి వెళ్లవద్దని అందరికీ చెప్పాను. చంపారన్‌లో యిట్టి అనుచరుల నియమబద్ధత అత్యద్భుతం. సూచనలను ఉల్లంఘించిన ఉదాహరణ ఒక్కటికూడా లేదు. 

18. గ్రామాలలో

ప్రతి పాఠశాలలో ఒక పురుషుణ్ణి ఒక మహిళను నియమించే ఏర్పాటుచేశాము. వారి ద్వారానే మందులు యిప్పించడం పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహింపచేయడం, మహిళల ద్వారా స్త్రీ సమాజంలో ప్రవేశించడం, మందులు ఇచ్చే పనిని తేలికగా నిర్వహించేలా చేయడం జరిగింది. క్వినైన్, పట్టీలు, ఆముదం ప్రతి స్కూల్లో వుంచాము. నాలుక మురికిగా వున్నా, అజీర్ణం చేసినా ఆముదం తాగించాలి. జ్వరం తగిలితే ఆముదం త్రాగించిన తరువాత క్వినైన్ యివ్వాలి. కురుపులు, గడ్డలు లేస్తే వాటిని కడిగి మలాం పట్టీ వేయాలి అని ఉపాధ్యాయులకు శిక్షణ యిచ్చాం. జబ్బు పెద్దదైతే డా. దేవ్‌గారికి చూపించి వారిచేత వైద్యం చేయించాలి. డా. దేవ్ వేరు వేరు సమయాల్లో వేరు వేరు గ్రామాలకు వెళ్లి రోగుల్ని పరీక్షిస్తూ వుండేవారు. యీ ఏర్పాటు వల్ల అధికసంఖ్యలో గ్రామ ప్రజలు ప్రయోజనం పొందసాగారు. సామాన్యంగా వచ్చే జబ్బులు కొద్దే. వాటికి పెద్ద పెద్ద డాక్టర్ల అవసరం వుండదు. యీ విషయాల్ని గ్రహిస్తే మేము చేసిన ఏర్పాటు ఎంతో ప్రయోజనకరమైనదని చెప్పవచ్చు. జనం మురికిని తొలగించేందుకు సిద్ధపడలేదు. డా. దేవ్ అంత త్వరగా ఓటమిని అంగీకరించే వ్యక్తి కాదు. ఆయన, మిగతా వాలంటీర్లు కలిసి ఒక గ్రామంలో వీధులు శుభ్రం చేశారు. యిళ్ల ముందరపడియున్న పెంటకుప్పలు ఎత్తివేశారు. బావుల దగ్గర పడిన గుంటల్ని మట్టితో పూడ్చారు. పారిశుద్ధ్యం యీ విధంగా కొనసాగించమని జనానికి బోధించారు. కొన్ని చోట్ల జనం సిగ్గుపడి పారిశుద్ధ్యం పనులు చేశారు. కొన్ని గ్రామాలకు కారు వెళ్లుటకు మట్టి రోడ్ల వల్ల కటు అనుభవాలు కూడా కలిగాయి. పారిశుధ్యం మాట విని కొన్ని చోట్ల జనం అసహ్యించుకున్నారు. ఒక అనుభవాన్ని గురించి యిక్కడ వ్రాస్తాను. స్త్రీల సభల్లో అనేకసార్లు ఆ అనుభవాన్ని గురించి చెప్పాను. భీతిమరవా ఒక చిన్న గ్రామం. దాని సమీపంలో దానికంటే చిన్న పల్లె ఒకటి వున్నది. అక్కడి స్త్రీల బట్టలు చాలా మురికిగా వున్నాయి. ఆ మహిళలకు బట్టలు ఉతుక్కోమని, బట్టలు మార్చుకోమని చెప్పమని కస్తూరిబాకు చెప్పాను. ఆమె మహిళలతో మాట్లాడింది. వారిలో ఒక సోదరి ఆమెను తన గుడిసెలోకి తీసుకెళ్ళి “మీరే చూడండి, బట్టలు పెట్టుకునేందుకు మా గుడిసెలో పెట్టె బేడ ఏమీ లేదు. నేను కట్టుకున్న చీర దప్ప మరో చీర లేదు. దీన్ని ఎలా ఉతుక్కోవాలో చెప్పండి, మహాత్మునికి చెప్పి మాకు బట్టలిప్పించండి. రోజూ చీర ఉతుక్కుంటాను. చీర మార్చుకుంటాను” అని చెప్పింది. భారతదేశంలో ఇటువంటి గుడిసెలు అసంఖ్యాకంగా వున్నాయి. ఎన్నో గుడిసెల్లో సామానుగాని, పెట్టెగాని, బట్టలుగానీ ఏమీ వుండవు. ఎంతోమంది జనం కట్టుబట్టలతో జీవిస్తున్నారు.

మరో అనుభవం కూడా చెబుతాను. చంపారన్‌లో వెదురుగడలు, గడ్డి ఎక్కువ భితిహరమా గ్రామంలో నిర్మించిన పాఠశాల పైకప్పు వెదురుగడలతోనూ, గడ్డితోనూ తయారు చేయబడింది. ఎవరో ఒకనాటి రాత్రి దానికి నిప్పు అంటించారు. దగ్గరలో వున్న నీలిమందు తొట్టెల యజమానుల మనుష్యులు ఈ పనిచేశారని అనుమానం కలిగింది. దానితో వెదురు గడలతోనూ గడ్డితోనూ ఇల్లు కట్టడం విరమించాం. ఈ పాఠశాల శ్రీ సోమణ్ మరియు కస్తూరిబా నడుపుతూ వున్నారు. ఇటుకలతో పక్కా ఇళ్లు కట్టాలని సోమణ్ నిశ్చయించాడు. అతని శ్రమవల్ల ఇటుకలతో ఇల్లు తయారైంది. ఇల్లు తగులబడుతుందేమోనను భయం పోయింది.

ఈ పని బాగా జరగాలని నేను భావించాను. కాని మనోరధం నెరవేరలేదు. దొరికిన వాలంటీర్లు కొంత వ్యవధి వరకే వుండి పనిచేశారు. క్రొత్త కార్యకర్తలు దొరకడం కష్టం. చంపారన్‌లో పని పూర్తి అయిందో లేదో మరో పని నన్ను లాక్కు వెళ్లింది. ఏది ఏమైనా ఆరు నెలల పాటు అక్కడ సాగిన కార్యక్రమాలు వ్రేళ్ళూని, ఆ రూపంలోనే కాకపోయినా మరో రూపంలో తన ప్రభావం చూపుతూనే వున్నాయి.

19. ఉజ్వల పక్షం

గత ప్రకరణంలో నేను వివరించినట్లు ఒక వైపు సమాజ సేవ సాగుతూ వున్నది. రెండోవైపున బాధితుల కష్టగాధలు వ్రాయడం జరుగుతున్నది. రోజురోజుకు అలా పని పెరిగిపోతున్నది. వేలాదిమంది చెప్పిన కధలు లిపిబద్ధం చేయబడ్డాయి. తెల్లదొరల కోపం కట్టలు తెంచుకున్నది. దానితో నా పరిశీలనా కార్యక్రమం ఆపివేయించుటకు ప్రయత్నం చేశారు.

ఒక రోజున బీహారు ప్రభుత్వం నుండి నాకు ఒక జాబు వచ్చింది. “మీ పరిశీలన కార్యక్రమం చాలాకాలం పాటు సాగింది. యిక ఆ కార్యక్రమం విరమించి బీహారు వదలి వెళ్లిపోండి” అని ఆ జాబులో వున్నది. జాబు మెత్తగా వున్నా భావం స్పష్టంగా వున్నది. అందుకు సమాధానం యిస్తూ “నా పరిశీలనా కార్యo పూర్తికాలేదు. యింకా చేయవలసి వున్నది. ఆ పని పూర్తి అయిన తరువాత కూడా ప్రజల కష్టాలు తొలగనంతవరకు నేను బీహారు వదలి వెళ్లను” అని స్పష్టంగా వ్రాశాను.

నా నిరీక్షణ కార్యక్రమాన్ని ఆపాలంటే ప్రభుత్వం ప్రజల కష్టాల్ని తొలగించాలి. కమిటీని నియమించాలి. గవర్నరు సర్ ఎడ్వర్డ్ గేట్ నన్ను పిలిచి, తామే విచారణ కమిటీ వేస్తానని, అందు మెంబరుగా వుండమని కోరాడు. మిగతా కమిటీ మెంబర్ల పేర్లు చూచి, సహచరులతో చర్చించి కొన్ని షరతుల మీద అంగీకారం తెలిపాను. కమిటీలో చేరినా, నా అనుచరులతో చర్చలు జరిపేందుకు స్వాతంత్ర్యం నాకు వుండాలని, కమిటీలో మెంబరుగా వుంటూ రైతుల్ని సమర్ధించడం మానుకోమని నాకు చెప్పకూడదని, విచారణ జరిగాక రైతులికి న్యాయం జరగలేదని తోస్తే నేను రైతుల పక్షం వహించే స్వాతంత్ర్యం వుండాలని కోరాను.

నర్ ఎడ్వర్డ్ గేట్ నా షరతులు న్యాయమైనవని భావించి అంగీకరించాడు. కీ.శే సర్ ఫ్రేంక్ స్లై యీ కమిటీ అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డారు. విచారణ కమిటీ, రైతులు చేసిన ఆరోపణలన్నీ నిజమేనని ప్రకటించింది. అన్యాయంగా తెల్లదొరలు తీసుకున్న సొమ్ము నుండి కొంత భాగం రైతులకు చెల్లించాలని, తిన్‌కఠియా రివాజును రద్దు చేయాలని సిఫారసు చేస్తూ తీర్మానించింది. యీ రిపోర్టు అంగీకరింపబడటానికి, ఆ ప్రకారం చట్టం ప్యాసు చేయటానికి సర్ ఎడ్వర్డ్ గేట్ మహత్తరమైన కృషి చేశాడు. ఆయన గట్టిగా వ్యవహరించి యుండకపోతే మా రిపోర్టు ఏకగ్రీవంగా వుండేదికాదు. చట్టం కూడా ప్యాసు అయి వుండేది కాదు. తెల్లదొరలు చాలా శక్తివంతులు. రిపోర్టు వెల్లడించబడిన తరువాత కూడా చట్టం కానీయకుండా నిరోధించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కాని సర్ ఎడ్వర్డ్ గేట్ ధైర్యంగా వ్యవహరించి చట్టం చేయించాడు. దాన్ని అమలులోకి తెచ్చాడు కూడా. ఈ విధంగా 100 సంవత్సరాల నుండి అమల్లో వున్న తిన్‌కఠియా విధానం రద్దు అయింది. తెల్లదొరల రాజ్యం కూడా అస్తమించింది. అణగిపోయి పడివున్న రైతులు తమ శక్తిని గుర్తించారు. నీలిమందు మచ్చ కడిగినా పోదు అను భ్రమ తొలగిపోయింది. 

20. కార్మికులతో సంబంధం

నేను చంపారన్‌లో కమెటీలో చేరిపనిచేస్తూ వుండగా ఖేడానుండి మోహన్‌లాల్ పాండ్యా, శంకర్‌లాల్ పారిఖ్‌ల జాబు వచ్చింది. ఖేడా జిల్లాలో పంటలు దెబ్బతిన్నాయి. కనుక పన్నులు రద్దు చేయడం అవసరం. అక్కడికి వెళ్లి ప్రజలకు మార్గం చూపించమని వాళ్లు ఆ జాబులో కోరారు. ఖేడా వెళ్లి అక్కడి పరిస్థితులు స్వయంగా తెలుసుకోకుండా సలహాలివ్వాలనే కోరిక నాకు కలుగలేదు.

మరో జాబు కార్మిక సంఘం విషయమై శ్రీమతి అనసూయాబాయి వ్రాసింది. వేతనాలు పెంచమని చాలా కాలాన్నుండి కార్మికులు కోరుతున్న విషయం నాకు తెలుసు. అది చిన్న విషయమే, అయినా దూరాన్నుండి సలహాయిచ్చే స్థితిలో నేనులేను. అవకాశం చిక్కగానే నేను అహమదాబాదు వెళ్లాను. అక్కడి వ్యవహారాలు సరిచేసి చంపారన్ వెళ్లి నిర్మాణ కార్యక్రమాలు సాగిద్దామని భావించాను. కాని అహమదాబాదు చేరిన తరువాత పనుల వత్తిడివల్ల అనుకున్న ప్రకారం నేను చంపారన్ వెంటనే వెళ్లలేకపోయాను. అక్కడ నడుస్తున్న పాఠశాలలు ఒక్కొక్కటే మూతబడ్డాయని తెలిసింది. నేను, నా అనుచరులు అంతా ఏమేమో చేద్దామని ఆకాశంలో మేడలు కట్టాం. అవన్నీ కూలిపోయాయి. చంపారన్‌లో గ్రామ్య పాఠశాలతో బాటు గోసంరక్షణ కార్యక్రమం కూడా ప్రారంభించాము. గోశాల, హిందీ ప్రచారం రెండు కార్యక్రమాలు ఇజరామార్వాడీ సోదరులు నిర్వహిస్తామని చెప్పారు. బేతియాలో ఒక మార్వాడీ సజ్జనుడు తన ధర్మసత్రంలో నాకు ఆశ్రయం ఇచ్చాడు. బేతియాలోగల మార్వాడీ సోదరులు తమ గోశాల విషయంలో నన్ను ఒప్పించారు. గోసంరక్షణను గురించి ఇప్పుడు గల భావాలే ఆనాడు కూడా నాకు వున్నాయి. గోసంరక్షణ అంటే గోవంశవృద్ధి, గోజాతి సంస్కరణ, ఎద్దులచేత తగినంత పనినే చేయించడం, గోశాలను ఆదర్శవంతమైన క్షీరశాలగా రూపొందించడమన్నమాట. ఇందుకు పూర్తిగా సహకరిస్తామని మార్వాడీ సోదరులు మాట ఇచ్చారు. అయితే నేను చంపారన్ వెళ్లలేక పోయినందున ఆ పని అసంపూర్తిగా వుండిపోయింది. బేతియాలో గోశాల నడుస్తున్నదేగాని అది ఆదర్శవంతమైన క్షీరశాలగా రూపొందలేదు. చంపారన్‌లో ఎద్దుల చేత అపరిమితంగా పని చేయిస్తున్నారు. హిందువులు ఎద్దుల్ని చావకొట్టి ధర్మానికి హాని కలిగిస్తున్నారు. ఆ ముల్లు నా హృదయంలో గుచ్చుకొని అలాగే వుండిపోయింది. చంపారన్ వెళ్లినప్పుడు అసంపూర్తిగా మిగిలిపోయిన ఈ పనులను గురించి తలచుకొని నిట్టూర్పువిడుస్తూ వున్నాను. వాటిని అసంపూర్తిగా వదిలినందుకు మార్వాడీ సోదరుల్ని, బీహారీల్ని మందలిస్తూ వున్నాను. పాఠశాలలు అనుకున్న విధానంలో కాకపోయినా ఏదో విధంగా నడుస్తున్నాయి. కాని గోసంరక్షణ కార్యక్రమం అసలు ప్రారంభమేకాలేదు. అనుకున్నట్లు సాగలేదు. అహమదాబాదులో ఖేడాను గురించి చర్చలు జరుగుతూ వున్నప్పుడే నేను కార్మికుల పనికి పూనుకున్నాను.

నా స్థితి కడు సున్నితంగా వున్నది. కార్మికుల పక్షం బలంగా వున్నది. శ్రీ అనసూయాబెన్ తన సొంత అన్నతో పోరాటం సాగించవలసివచ్చింది. కార్మికులకు, యజమానులకు మధ్య ప్రారంభమైన ఈ దారుణపోరాటంలో శ్రీ అంబాలాల్ సారాభాయి ముఖ్యులు. మిల్లు యజమానులతో నాకు ప్రేమ సంబంధం వున్నది. వారితో పోరాటం జరపడం యిబ్బందికరమైన విషయం. కార్మికుల విషయమై వారిని కలిసి పంచాయితీ పెద్దలు చెప్పినట్లు వినమని ప్రార్ధించాను. కాని యజమానులు తమకు, తమ కార్మికులకు మధ్య నా మధ్యవర్తిత్వం అంగీకరించము అని స్పష్టంగా చెప్పివేశారు. కార్మికులకు సమ్మె చేయమని సలహా ఇచ్చాను. ఈ సలహా యిచ్చుటకు పూర్వం కార్మికులతోను, వారి నాయకులతోను బాగా కలిసి పోయాను. వాళ్లకు సమ్మె షరతులు తెలియజేశాను. ఆ షరతులు ఇవి.

  1. ఎట్టి పరిస్థితుల్లోను శాంతికి భంగం కలిగించకూడదు.
  2. పనికి వెళ్లదలచిన వారిని బాధించకూడదు.
  3. బిచ్చం మీద కార్మికులు ఆధారపడకూడదు.
  4. సమ్మె ఎంతకాలం నడిచినా గట్టిగా నిలబడాలి. దగ్గర డబ్బులేకపోతే మరోపని చేసుకొని పొట్టపోసుకోవాలి.

ఈ షరతులు నాయకులు తెలుసుకొని అందుకు అంగీకరించారు. కార్మికుల సభ జరిగింది. కోరికలు సబబైనవా కావా అని నిర్ణయించుటకు పంచాయతీ పెద్దల నియామకం జరగనంత వరకు పనిలోకి వెళ్లకూడదని కార్మికులు నిర్ణయించారు. ఈ సమ్మెకాలంలోనే శ్రీ వల్లభాయి మరియు శంకర్‌లాల్ బాంకరుగారలను, దగ్గరగా చూచి అర్థం చేసుకొనే అవకాశం లభించింది. శ్రీ అనసూయాబెన్‌ను గురించి అదివరకే నాకు తెలుసు. సమ్మె చేస్తున్న కార్మికుల సభలు నదీతీరాన ఒక చెట్టు క్రింద జరుగుతూ వుండేవి. వందల సంఖ్యలో కార్మికులు పాల్గొంటూ వుండేవారు. వారుచేసిన ప్రతిజ్ఞను వారికి నేను రోజూ జ్ఞాపకం చేస్తూ వుండేవాణ్ణి. శాంతి సంరక్షణ, వారి కుటుంబపోషణను గురించి రోజూ వారికి చెబుతూ వుండేవాణ్ణి. వాళ్లు తమ జండా పుచ్చుకొని పట్టణంలో రోజు తిరుగుతూ వుండేవారు. ఊరేగింపుగా వచ్చి సభలో పాల్గొంటూ వుండేవారు.

ఈ సమ్మె 21 రోజులు సాగింది. మధ్య మధ్య యజమానులతో నేను మాట్లాడుతూ వుండేవాణ్ణి. న్యాయం చేయమని కోరుతూ వుండేవాణ్ణి. “మాకు మాత్రం పట్టుదల లేదా? మాకు మా కార్మికులకు మధ్య తండ్రికొడుకుల వంటి సంబంధం వున్నది. మా యిద్దరి మధ్య మరొకరు కాలు యిరికించితే మేము ఎలా సహిస్తాం? యిందు పంచాయితీ పెద్దల ప్రమేయం ఎందుకు?” అని యజమానులు అంటూ వుండేవారు. 

21. ఆశ్రమం

కార్మికుల ప్రకరణానికి ముందు ఆశ్రమాన్ని గురించి కొద్దిగా వ్రాయడం అవసరం. చంపారన్‌లో వున్నా నేను ఆశ్రమాన్ని మరిచిపోలేదు. అప్పుడప్పుడు నేను అక్కడికి వెళ్లి వస్తూ వుండేవాణ్ణి. కోచరబ్ అహమదాబాదు సమీపంలో గల చిన్న గ్రామం. ఆశ్రమం యీ గ్రామంలోనే వున్నది. కోచరల్‌లో ప్లేగు ఆరంభమైంది. పిల్లల్ని ఆశ్రమంలో సురక్షితంగా వుంచలేని పరిస్థితి ఏర్పడింది. ఆశ్రమంలో పారిశుద్ధ్య నియమాన్ని ఎంతగా పాటించినా చుట్టుప్రక్కలగల మురికిని పోగొట్టడం సాధ్యంకాలేదు. కోచరల్‌లో గల ప్రజలకు నచ్చచెప్పడానికి, వారికి సేవ చేయడానికి మా శక్తి చాలలేదు. పట్టణానికి, ఆశ్రమాన్ని దూరంగా వుంచాలనేది మా ఆదర్శం. కాని రాకపోకలకు యిబ్బంది కలిగేలా వుండడం కూడా మాకు యిష్టంలేదు. ఆశ్రమం సొంతచోటులో తెరపగాలిలో, ఆశ్రమరూపంలో ఏదో ఒక రోజున నిర్మాణం కావాలి.

ప్లేగు వ్యాపించినప్పుడు కోచరల్‌ను వదిలివేయమని ఆదేశం అందినట్లు భావించాను. శ్రీ పూంజాభాయి హీరాచంద్‌గారికి మా ఆశ్రమంతో దగ్గర సంబంధం వుంది. ఆశ్రమానికి సంబంధించిన సేవా కార్యాలు శ్రద్ధగా ఆయన చేస్తూ వుండేవాడు. అహమదాబాదు ప్రజాజీవితం ఆయనకు బాగా తెలుసు. ఆశ్రమం కోసం భూమి బాధ్యత ఆయన వహించాడు. కోచరల్‌కు ఉత్తర దిశయందు భూమికోసం ఆయనతోబాటు నేను తిరిగాను. అక్కడికి మూడునాలుగు మైళ్లదూరాన భూమి దొరికితే వెతకమని ఆయనకు చెప్పాను. యిప్పుడు ఆశ్రమం వున్నచోటును కూడా వెతికింది ఆయనే. చోటు జైలుకు సమీపంలో వుండటం వల్ల నాకు కొంచెం మోహం కలిగింది. సత్యాగ్రహి నొసట జైలు వ్రాసి వుంటుంది గనుక జైలు సమీపంలో ఆశ్రమం వుంటే మంచిదని అభిప్రాయపడ్డాను. సామాన్యంగా చుట్టుప్రక్కల పరిశుభ్రంగా వున్నచోటే జైలు వుంటుందని నాకు తెలుసు. ఎనిమిది రోజుల్లోపలే భూమి కొనుగోలు వ్యవహారం పూర్తి అయింది. అక్కడ ఒక్క చెట్టుకూడాలేదు. నదీతీరం, ఏకాంత ప్రదేశం, యిది ఆ చోటుయొక్క ప్రత్యేకత. డేరాలు వేసుకొని వుందామని నిర్ణయానికి వచ్చాం. వంటనిమిత్తం తాత్కాలికంగా రేకుల షెడ్డు వేద్దామని, తరువాత నెమ్మదిగా యిల్లు కట్టిద్దామని నిర్ణయించాం. ఆశ్రమవాసుల సంఖ్య పెరిగింది. చిన్నా పెద్దా అంతా కలిపి మొత్తం 40 మంది అయ్యారు. అంతా ఒకేచోట భోజనాలు చేస్తారు. అది మంచి సౌకర్యం. ప్లానంతా నాది. దాన్ని అమలు పరచడం కీ.శే. మగన్‌లాల్ గాంధీ బాధ్యత. పక్కా ఇళ్లు తయారయ్యే లోపల చాలా ఇబ్బందులు పడ్డాం. వర్షాకాలం సమీపిస్తున్నది. నాలుగుమైళ్ల దూరానవున్న పట్టణాన్నుండి వస్తువులు తెచ్చుకోవాలి. అది బంజరు భూమి. పాములకు లోటు లేదు. వాటినుండి పిల్లలను రక్షించడం పెద్దపని అయింది. పాములు మొదలుగాగల వాటిని చంపకూడదని మా నియమం. కాని వాటి భయం మాలో ఒక్కరినీ వదలలేదు. యిప్పటికీ అదే స్థితి. సాధ్యమైనంత వరకు హింసా ప్రవృత్తి గల ప్రాణులను చంపకూడదని ఫినిక్సులోను, టాల్‌స్టాయ్ ఫారమ్‌లోను సాబర్మతిలోను మూడుచోట్ల నిర్ణయం చేశాం. మూడు చోట్ల బంజరుభూమి. మూడుచోట్ల పాములు మొదలుగాగలవి జాస్తిగా వుండేవి. అయినా ఒక్క ప్రాణిని కూడా మేము చంపలేదని చెప్పగలను. నావంటివాడు ప్రతిప్రాణి యందు దేవుణ్ణి చూస్తాడు. దేవుడు పక్షపాతం చూపించడు. మనిషి ప్రతిరోజు చేసేపనుల్లో దేవుడు ఎందుకు కల్పించుకుంటాడు? ఆయనకు అంత సమయం ఎక్కడ దొరుకుతుంది? సందేహాల్లో మనిషి పడకూడదు. ఈ నా అనుభవాన్ని మరో భాషలో చెప్పలేను. లౌకిక భాషలో దేవుని లీలల్ని చూస్తూవుంటే ఆయన కార్యాలు అమోఘం, అవర్ణనీయం అని చెప్పవచ్చు. యిది నా అనుభవం. పామరుడు వర్ణించాలంటే చిలకపలుకులే పలుకుతాడు కదా! సర్పాలవంటి పురుగుపుట్రను చంపకుండా సమాజంలో 25 సంవత్సరాలు బ్రతికి వున్నామంటే అదృష్టమని భావించకుండా, దేవుని దయ అంటే అది తప్పు. అయితే అట్టి తప్పు అంగీకారయోగ్యమేనని నా భావం. కార్మికులు సమ్మె కట్టినప్పుడు ఆశ్రమనిర్మాణం జరుగుతున్నది. ఆశ్రమంలో నేతపని ముఖ్యం. వడుకుపని గురించి యింకా మేము ఆలోచించలేదు. అందువల్ల నేతకోసం గృహం నిర్మించాలని నిర్ణయించాం. దానికి పునాది వేశాం. 

22. ఉపవాసం

కార్మికులు మొదటి రెండువారాలు ధైర్యంగాను శాంతంగాను వున్నారు. రోజూ జరిగే సభకు వస్తూ వున్నారు. నేను రోజూ వారికి వారు చేసిన ప్రతిజ్ఞను జ్ఞాపకం చేస్తూ వున్నాను. మేము ప్రాణమైనా వదులుతాం, ప్రతిజ్ఞను మాత్రం నెరవేరుస్తాం అని బిగ్గరగా అరుస్తూ వున్నారు. కాని చివరికి వారు జారిపోతున్నారని అనిపించింది. మిల్లులోకి వెళుతున్న కార్మికులను చూచి వాళ్లు హింసకు దిగారు. ఎవరిమీదనైనా చెయ్యి చేసుకుంటారేమోనని భయం కలిగింది. రోజూ సభకు వచ్చేవారి సంఖ్య తగ్గిపోయింది. కొద్దిమంది వచ్చినా నిరుత్సాహంతో వుండేవారు. కార్మికుల్లో స్థిరత్వం తగ్గిందని తెలిసి విచారించాను. దక్షిణాఫ్రికాలో కార్మికుల సమ్మెకు సంబంధించిన అనుభవం నాకున్నది. కాని యిక్కడ క్రొత్త అనుభవం కలిగింది. రోజూ ప్రతిజ్ఞ చేయిస్తూ సాక్షిగా వున్న నా ఎదుటే యిలా జరిగితే నేనేం చేయాలా అని ఆలోచించాను. యిది నాకు కలిగిన అభిమానం అనుకున్నా సరే, కార్మికుల యెడ, సత్యం యెడ నాకు గల ప్రేమ అనుకున్నా సరే తీవ్రంగా యోచించాను.

ఉదయం సభ ప్రారంభమైంది. ఏం చేయాలో తోచలేదు. స్థిరంగా ధైర్యంగా వుండక పోతే సమస్య పరిష్కారం కాకపోతే అంతవరకు నేను ఉపవాసం చేస్తాను అని ప్రకటించివేశాను. కార్మికులు నివ్వెరపోయారు. అనసూయాబెన్ కండ్లనుండి నీరు కారింది. మీరు ఉపవాసం చేయొద్దు. మేము చేస్తాం. ప్రతిజ్ఞ మీద నిలబడివుంటాం క్షమించండి అని కార్మికులు అన్నారు. మీరు ఉపవాసం చేయనవసరంలేదు. మీరు మీ ప్రతిజ్ఞ నెరవేర్చండి చాలు. మా దగ్గర డబ్బులేదు. అయినా కార్మికులకు బిచ్చం తినిపించి సమ్మె చేయించడం నాకు యిష్టంలేదు. మీరు కాయకష్టం చేసి పొట్టపోసుకోండి. ఎన్నాళ్లు సాగినా సరే నిశ్చింతగా సమ్మె చేయండి. నిర్ణయం జరగనంతవరకు నా ఉపవాసం సాగుతుంది అని చెప్పివేశాను. వల్లభభాయి కార్మికులకు మునిసిపాలిటీలో పని యిప్పించాలని ప్రయత్నించారు. కాని ప్రయోజనం కలుగలేదు. ఆశ్రమంలో నేత గృహం దగ్గర గల గొయ్యిని పూడ్చాలి. కార్మికులను అందుకు వినియోగించవచ్చునని మగన్‌లాలు సలహాయిచ్చారు. అందుకు కార్మికులు అంగీకరించారు. అనసూయాబెన్ ఇసుకతో నిండిన మొదటి తట్టను నెత్తికి ఎత్తుకున్నది. నది నుండి ఇసుక తట్టలను ఎత్తుకు వచ్చి గొయ్యిపూడ్చడానికి కార్మికులు పూనుకున్నారు. చూసేందుకు ఆ దృశ్యం ముచ్చటగా వున్నది. కార్మికులకు నూతనోత్తేజం కలిగింది. వారికి మజూరీ చెల్లించిన ఆశ్రమం వారికి నిజంగా అలసట కలిగిందని చెప్పవచ్చు. పని ముమ్మరంగా సాగింది. అయితే నా యీ ఉపవాసంలో ఒక దోషం వున్నది.

యజమానులతో నాకు మధుర సంబంధం వున్నదని మొదటనే వ్రాశాను. అందువల్ల నా ఉపవాసం వారిని కదిలించి తీరుతుంది. ఒక సత్యాగ్రహిగా యజమానులకు వ్యతిరేకంగా నేను ఉపవాసం చేయకూడదు. నిజానికి కార్మికుల సమ్మె ప్రభావం మాత్రమే వాళ్ళ మీద పడాలి. నేను పూనుకున్న ప్రాయశ్చిత్తం యజమానులు చేసిన దోషానికి సంబంధించినది కాదు. కార్మికులకు ప్రాతినిధ్యం వహిస్తూ వున్నందున వాళ్ల దోషాలకు నేను బాధ్యుణ్ణే. యజమానులను ప్రార్ధించగలను. వారికి వ్యతిరేకంగా ఉపవాసం చేయటం వారిని ఘెరావు చేయడమే అయినా నా ఉపవాస ప్రభావం యజమానుల మీద పడుతుందని నాకు తెలుసు. పడింది కూడా. కాని నా ఉపవాసాన్ని వారెవరూ ఆపలేని పరిస్థితి ఏర్పడింది.

దోషభూయిష్టమైన ఉపవాసం చేస్తున్నానని నేను గ్రహించాను. నా ఉపవాసం వల్ల మీరు మీ మార్గాన్ని వదలవద్దని నేను యజమానులకు చెప్పాను. వాళ్లు కటువుగాను, తియ్యగాను, నన్ను ఎన్నో మాటలు అన్నారు. అట్టి హక్కు వారికి వుంది. సేఠ్ అంబాలాలు యీ సమ్మెకు వ్యతిరేకంగా యాజమాన్యానికి నాయకత్వం వహించాడు. ఆయన గుండెదిటవు చూచి ఆశ్చర్యం కలిగింది. ఆయన నిష్కపటి కూడా. ఆయనతో వివాదపడటం నాకు యిష్టం. అయినా ఉపవాస ప్రభావం ఆయన మీద పడకుండా వుండటం సాధ్యమా? మరో రూపంలో ఆయన మీద వత్తిడి తీసుకురావడమేగదా! ఆయన భార్య సరళాదేవీ నన్ను సొంత సోదురునిగా చూసుకుంటుంది. ఆమెకు నా యెడ అమిత అనురాగం. నేను ఉపవాసం చేస్తుంటే ఆ దంపతులకు కలిగే బాధ నాకు తెలుసు.

ఉపవాస సమయంలో అనసూయాబెన్, యితర మిత్రులు, కార్మికులు నాతో బాటు ఉపవాసం చేశారు. వారిని నేను వారించాను. కాని వింటారా? యి విధంగా వాతావరణం ప్రేమతో నిండిపోయింది. యజమానులు దయాభావంతో రాజీపడేందుకు సిద్ధపడ్డారు. అనసూయాబెన్‌తో వారి చర్చలు ప్రారంభమయ్యాయి. శ్రీ ఆనందశంకర్ ధ్రువగారు కూడా రంగంలోకి దిగారు. చివరికి వారినే పెద్దగా నిర్ణయించారు. సమ్మె విరమణ జరిగింది. మూడురోజులు మాత్రం నేను ఉపవాసం చేయవలసి వచ్చింది. యజమానులు కార్మికులకు మిఠాయిలు పంచారు. 21వ రోజున ఒడంబడిక కుదిరింది. ఒక ఉత్సవం జరిపారు. అందు యజమానులు, కమీషనరు కూడా పాల్గొన్నారు. మీరు గాంధీ చెప్పిన ప్రకారం నడుచుకోండి అని కమీషనరు వారికి చెప్పాడు. ఆ కమీషనరుతోనే జగడం పెట్టుకోవలసి వచ్చింది. అతడూ మారాడు. ఖేడాలో పార్టీవాళ్లను నా మాట వినవద్దని అతడే చెప్పాడు.

ఒక కరుణాజనకమైన విషయం యిక్కడ పేర్కొనడం అవసరమని భావిస్తున్నాను. యజమానులు తయారుచేయించిన మిఠాయిలు ఎక్కువగా వున్నందున వేలాదిమంది కార్మికులకు వాటిని ఎలా పంచాలా అని మీమాంస బయలుదేరింది. ఏ చెట్టు క్రింద కార్మికులు ప్రతిజ్ఞ చేశారో, అక్కడ 21 రోజులు నియమాన్ని పాటించిన కార్మికులంతా వరుసగా క్యూలో నిలబడి మిఠాయి తీసుకోవాలన్న నిర్ణయాన్ని అమాయకంగా నేను ఒప్పుకున్నాను. కార్మికులు ఒక్కుమ్మడిగా మిఠాయిల మీద విరుచుకుపడకుండా పంపిణీ జరుగుతుందని భావించాను. కాని పంపిణీ సరిగా జరగలేదు. రెండు మూడు నిమిషాలకే వరుసక్రమం పోయింది. కార్మిక నాయకులు ప్రయత్నించినా ప్రయోజనం కలుగలేదు. కార్మికులు తండాలు తండాలుగా విరుచుకుపడినందువల్ల కొంత మిఠాయి పాడైపోయింది. మిగిలిన మిఠాయి జాగ్రత్తగా సేఠ్ మిర్జాపూర్‌లోగల అంబాలాల్ గారి బంగాళాకు చేర్చారు. మరునాడు ఆ బంగాళా మైదానంలో మిఠాయి పంచవలసి వచ్చింది. చెట్టు దగ్గర మిఠాయి పంచుతున్నారని విని అహమదాబాదులో గల బిచ్చగాళ్లంతా వచ్చి మిఠాయి కోసం విరుచుకు పడినందున ఏర్పాట్లన్నీ చెల్లాచెదురయ్యాయని తరువాత తెలిసింది. ఇందు కరుణరసం ఇమిడి వున్నది.

ఆకలి అను రోగంతో బాధపడుతున్న దేశం మనది. తత్ఫలితంగా దేశంలో బిచ్చగాళ్ళ సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నది. భోజనం దొరుకుతుంది అంటే అన్నార్తులు నియమాల్ని, నిబంధనల్ని పాటించవలసిన విధుల్ని మరిచిపోతారు. ధనవంతులు యిట్టి బిచ్చగాళ్లకు పని అప్పగించకుండా వాళ్లకు బిచ్చం యిచ్చి వాళ్ల సంఖ్యను బాగా పెంచుతున్నారు. 

23. ఖేడా సత్యాగ్రహం

కార్మికుల సమ్మె ముగిసింది. యిక నాకు ఒక్క నిమిషమైనా తీరిక చిక్కలేదు. వెంటనే ఖేడా జిల్లాలో సత్యాగ్రహం ప్రారంభించవలసి వచ్చింది. ఖేడా జిల్లాలో కరువు పరిస్థితులు ఏర్పడినందున పన్నుల వసూళ్లు రద్దు చేయమని అక్కడ రైతులు కోరుతున్నారు. యీ విషయం శ్రీ అమృతలాల్ ఠక్కర్ పరిశీలించి రిపోర్టు యిచ్చారు. నేను వెళ్లి కమీషనరును కలిశాను. శ్రీ మోహనలాల్ పాండ్యా, శ్రీ శంకర్‌లాల్ పారిఖ్, శ్రీ విఠ్ఠల్‌భాయి పటేల్ ల ద్వారా వాళ్లు కౌన్సిలులో ఉద్యమం సాగిస్తున్నారు. ప్రభుత్వం దగ్గరికి రాయబారాలు చాలాసార్లు సాగించారు.

అప్పుడు నేను గుజరాత్ కాంగ్రెస్‌కు అధ్యక్షుణ్ణి. కాంగ్రెస్ పక్షాన కమీషనరుకు, గవర్నరుకు ప్రార్ధనా పత్రాలు పంపాను. టెలిగ్రాములు యిచ్చాను. అవమానాలు సహించాను. వాళ్ల బెదిరింపుల్ని మ్రింగాను. ఆనాడు అధికారులు వ్యవహరించిన తీరును యీనాడు తలచుకుంటే హాస్యాస్పదంగా వుంటుంది.

ప్రజల కోరిక న్యాయం, సమంజసం. దాన్ని అంగీకరింప చేయడం కోసం నిజానికి ఉద్యమం అనవసరం. ప్రభుత్వ నియమం ప్రకారం రూపాయికి నాలుగు అణాలకు పంట తక్కువగా పండితే పన్నుల వసూళ్లు వెంటనే ఆపివేయాలి. కాని అక్కడి ఆఫీసర్ల అంచనా ప్రకారం రాబడి నాలుగు అణాలకు పైగా వున్నది. ప్రజలు అది తప్పని రుజువు చేయసాగారు. కాని ప్రభుత్వం అంగీకరిస్తుందా? పంచాయతీ పెద్దల్ని నియమించి నిర్ణయించమని ప్రజలు కోరారు. ప్రభుత్వం అంగీకరించలేదు. ఎన్నో పర్యాయాలు ప్రార్ధనా పత్రాలు పంపి విసిగి వేసారి అనుచరులతో చర్చలు జరిపి చివరికి సత్యాగ్రహం ప్రారంభించారు. వారిలో ఖేడా జిల్లా సేవకులే కాక ప్రత్యేకించి శ్రీ వల్లభ భాయి పటేల్, శ్రీ శంకర్ లాల్ బాంకరు, శ్రీ అనసూయా బెన్, శ్రీ ఇందూలాల్ యాజ్ఞిక్, శ్రీ మహాదేవ దేశాయి మొదలుగా గలవారు కూడా వున్నారు. వల్లభభాయి ముమ్మరంగా సాగుతున్న వకీలు వృత్తి మానుకొని వచ్చారు. ఆ తరువాత వారు వకీలు వృత్తి సాగించలేకపోయారు.

మేము నడియాద్ అనాధాశ్రమంలో మకాం బెట్టాం. అందుకు ప్రత్యేకించిన కారణం ఏమీ లేదు. నడియాద్ లో యింత మంది వుండటానికి మరో ఖాళీగృహం దొరకలేదు. అక్కడి జనం చేత క్రింద తెలిపిన మతలబు వ్రాసిన పత్రం మీద సంతకాలు చేయించి తీసుకున్నాం. “మా గ్రామంలో పంట రాబడి రూపాయికి నాలుగు అణాల కంటే తక్కువని మాకు తెలుసు. ఆందువల్ల పన్నుల వసూళ్లు ఒక సంవత్సరం వరకు ఆపమని ప్రార్ధించాం. కాని పన్నుల వసూళ్లు ఆపలేదు. అందువల్ల యీ పత్రం మీద సంతకం చేసిన మేము యీ ఏడు పన్నులు చెల్లించలేమని మనవి చేస్తున్నాం. పన్నుల వసూళ్లకు పూనుకొని ప్రభుత్వం చర్యలు తీసుకుంటే మేము వ్యతిరేకించం. ఎన్ని కష్టాలైనా సహిస్తాం. మా పొలాలు జప్తు చేసినా ఊరుకుంటాం. మా చేతులతో పన్నులు చెల్లించి అబద్ధాల కోరులం అయి ఆత్మాభిమానం చంపుకోము. ప్రభుత్వం పన్నుల వసూళ్ళు అన్ని చోట్ల ఆపి వేస్తే మాలోశక్తి కలిగిన వాళ్లం పూర్తిగానో లేక కొంత భాగమో తప్పక చెల్లిస్తామని మాట యివ్వలేము. మాలో శక్తిగలవారం పన్నులు చెల్లించి వేస్తే, శక్తి లేనివారు భయపడి తమ కొంపాగోడూ తెగనమ్మి పన్నులు చెల్లించి నానా యాతనలు పడతారు. అందువల్ల శక్తిగలవారం కూడా పన్ను చెల్లించం. యిలా చెల్లించకపోవడం శక్తివంతుల కర్తవ్యమని భావిస్తున్నాము.

ఈ పోరాట వివరాలు తెలుపుటకు ప్రకరణాన్ని పొడిగించదలుచుకోలేదు అందువల్ల యిందుకు సంబంధించిన మధురస్మృతులు అనేకం యిక్కడ వివరించడం లేదు. మహత్తరమైన ఖేడా సత్యాగ్రహ పోరాట చరిత్రను వివరంగా తెలుసుకోవాలని భావించినవారు శ్రీ శంకర్ లాల్ పారిఖ్ వ్రాసిన ఖేడా పోరాట విస్తృత ప్రామాణిక చరిత్ర అను పుస్తకం చదవమని సిఫారసు చేస్తున్నాను. 

24. ఉల్లిపాయల దొంగ

చంపారన్ భారతావనియందు ఒక మూల వున్నది. అక్కడ సాగిన పోరాటం పత్రికలకు ఎక్కలేదు. అక్కడి పరిస్థితుల్ని చూచేందుకై బయటివారు రాకుండా ప్రభుత్వం చర్య గైకొన్నది. అయినా ఖేడా సత్యాగ్రహాన్ని గురించి పత్రికల్లో వార్తలు వెలువడ్డాయి. గుజరాతీ వారికి ఈ విషయం తెలిసింది. వారు శ్రద్ధ తీసుకోవడం ప్రారంభించారు. వాళ్లు ఎంత డబ్బు అయినా సరే యివ్వడానికి సిద్ధపడ్డారు. కాని ఈ పోరాటం కేవలం డబ్బుతో నడవదు. డబ్బు అవసరం బహు తక్కువేనని ఎంత చెప్పినా వారికి బోధపడలేదు. వద్దని ఎంత చెప్పినా వినకుండా బొంబాయి పౌరులు చాలా ధనం ఇచ్చి వెళ్లారు. అవసరాన్ని మించి ధనం ఇచ్చినందున పోరాటం ముగిసిన తరువాత కొద్దిగా ధనం మిగిలింది. సత్యాగ్రహులనే సైనికులు సాదా జీవనం నేర్చుకోవలసిన అవసరం వున్నది. వారు పూర్తిగా పాఠం నేర్చుకున్నారని చెప్పలేను, కానీ చాలావరకు తమ జీవనంలో మార్పు తెచ్చుకున్నారని మాత్రం చెప్పగలను.

అక్కడి రైతులు మొదలగు వారికి కూడా పోరాటం క్రొత్తదే. ఊరూరా తిరిగి యీ పోరాటం గురించి ప్రచారం చేయవలసి వచ్చింది. అధికారులు ప్రజల యజమానులు కారు. వారు సేవకులు. ప్రజలిచ్చే డబ్బునే వాళ్లు జీతాలుగా తీసుకుంటున్నారు అని చెప్పి అధికారులంటే గల భయం పోగొట్టవలసిన అవసరం ఏర్పడింది. నిర్భయంతోబాటు వినమ్రతకూడా వాళ్లకు నేర్పవలసి వచ్చింది. ఇది చాలా కష్టమైన పని. భయం పోయిన తరువాత అధికారులు చేసిన అవమానాలకు, వాళ్లు పెట్టిన కష్టాలకు పగతీర్చుకోవద్దంటే జనం ఊరుకుంటారా? కాని అది సత్యాగ్రహి లక్షణం కాదు. పాలలో విషం కలపడమేకదా? అక్కడి జనం వినమ్రతా పాఠం అర్థం చేసుకోలేదను విషయం ఆ తరువాత తెలుసుకున్నాను. వినయం సత్యాగ్రహికి వుండవలసిన ప్రధాన గుణమని అనుభవంవల్ల తెలుసుకున్నాను. వినయమంటే మాటల్లోనేకాక, వ్యతిరేకులను కూడా ఆదరించాలి. సరళస్వభావం కలిగివుండాలి. అందరి మంచిని కాంక్షించి వ్యవహరించాలి. ఆరంభంలో ప్రజల్లో ధైర్యం అమితంగా కనబడింది. ప్రారంభంలో ప్రభుత్వం కూడా మెత్తగా వ్యవహరించింది. ప్రజల్లో చైతన్యం పెరిగి వాళ్లకు ధైర్యం వచ్చిన కొద్ది ప్రభుత్వం యొక్క కరుకుదనం కూడా అమితంగా పెరిగిపోయింది. జప్తు చేసేవాళ్లు రైతుల పశువుల్ని అమ్మివేశారు. ఇళ్లలో దొరికిన వస్తువులు ఎత్తుకెళ్లారు. భూములను గురించి కూడా నోటీసులు ఇచ్చారు. కొన్ని గ్రామాల్లో పండిన పంటల్ని పూర్తిగా జప్తు చేశారు. దానితో జనం భయపడ్డారు. చాలామంది పన్ను చెల్లించి వేశారు. కొంత మంది అధికారులు వచ్చి జప్తు చేయాలని పొంచివున్నారు. అక్కడి జనంలో చివరి శ్వాస వరకు పోరాటం సాగించినవారు కొందరున్నారు. ఈ లోపున శ్రీ శంకర్ లాల్ పారిఖ్ గారి పొలానికి చెల్లించవలసిన పన్ను, అక్కడ పని చేస్తున్న వాడు చెల్లించివేశారు. దానితో గందరగోళం జరిగింది. వెంటనే శంకరలాల్ తన భూమినంతటిని జనానికి దానం చేసి తన మనిషి చేసిన దోషానికి ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. దానితో ఆయన ప్రతిష్ఠ ఇనుమడించింది. అది యితరులకు మంచి ఉదాహరణ అయింది.

తప్పుగా జప్తు చేయబడిన ఒక పొలంలో ఉల్లిగడ్డల పంటవున్నది. భయపడిన జనానికి ధైర్యం కలిగించాలనే భావంతో నేను మోహన్ లాల్ పాండ్యాగారి నాయకత్వాన ఉల్లిగడ్డల్ని పెకిలించమని చెప్పాను. నా దృష్టిలో అది చట్టాన్ని వ్యతిరేకించడం కాదు. చెల్లించవలసిన కొద్దిపన్ను కోసం పంటనంతటినీ జప్తు చేస్తున్నారు. అది మరీ నీతి బాహ్యమైన చర్య. బహిరంగంగా చేస్తున్న దోపిడీయే. అందువల్ల యిటువంటి జప్తుల్ని ఎండగట్టడం అవసరమని చెప్పాను. ఆ విధంగా చేసినందుకు జైలుకు పంపుతారు, సిద్ధపడాలి అని కూడా చెప్పాను. మోహన్ లాల్ పాండ్యా అందుకు సిద్ధపడ్డాడు. కష్టాలు పడకుండా వ్యతిరేకతను ఎదుర్కోకుండా సత్యాగ్రహం విజయం సాధించడం ఆయనకు యిష్టంలేదు. పొలంలో వున్న ఉల్లిగడ్డల్ని పెకిలించేందుకు సిద్ధపడ్డాడు. ఏడెనిమిదిమంది ఆయనకు సాయం చేశారు. ప్రభుత్వం వారిని పట్టుకోకుండా ఎలా వూరుకుంటుంది? పాండ్యాను, ఆయన అనుచరులను ప్రభుత్వం నిర్బంధంలోకి తీసుకున్నది. దానితో ప్రజల్లో ఉత్సాహం పెరిగింది. జైళ్లకు వెళ్లడానికి జనం సిద్ధపడినప్పుడు రాజదండనకు ఎవ్వరూ భయపడరు. ఆ కేసు విచారణను చూచేందుకు జనం విరుచుకుపడ్డారు. పాండ్యాకు, వారి అనుచరులకు కొద్దిగా కారాగార శిక్ష విధించబడింది. కోర్టు వారిచ్చిన తీర్పు తప్పులతడక. అసలు ఉల్లిగడ్డల పెకిలింపు దొంగతనం క్రిందకు రాదు. అయినా అప్పీలు చేయాలని తలంపు ఎవ్వరికీ కలుగలేదు. జైలుకు వెళుతున్నవారిని సాగనంపుటకు ఉల్లిపాయల దొంగ అను గౌరవం ప్రజల పక్షాన పాండ్యా పొందాడు. యిప్పటికీ ఆయన ఆ శబ్దాన్ని తన పేరుతో బాటు ఉపయోగిస్తూ వున్నాడు.

ఈ పోరాటం ఎలా ముగిసిందో వివరించి ఖేడా ప్రకరణం ముగించివేస్తాను. 

25. ఖేడా సంగ్రామం ముగింపు

ఖేడాలో జరిగిన సంగ్రామం విచిత్రంగా ముగిసింది. దృఢదీక్షతో చివరివరకు వున్నవారు నష్టపడిపోవడం నాకు యిష్టంలేదు. సత్యాగ్రహం విజయం కోసం అన్వేషించసాగారు. ఊహించని అట్టి మార్గం ఒకటి దొరికింది. చెల్లించగల పార్టీలు పన్ను చెల్లించితే బీదవారి దగ్గర పన్నుల వసూళ్లు వాయిదా వేస్తామని నడియాద్ తహసీల్దారు కబురు పంపాడు. తహసీల్దారు తన తాలూకా వరకే బాధ్యత వహించగలడు. జిల్లా బాధ్యత కలెక్టరు వహించాలి. అందువల్ల నేను కలెక్టరును అడిగాను. తహసీల్దారు అంగీకరించిన విధంగా ఆదేశం వెలువడింది అని కలెక్టరు చెప్పాడు. నాకీ ఆదేశం విషయం తెలియదు. అటువంటి ఆదేశం ప్రభుత్వం వెలువరిస్తే ప్రతిజ్ఞలో పేర్కొనబడ్డ విశేషం అదే. అందువల్ల మేము అట్టి ఆర్డరుతో తృప్తిపడ్డాం.

అయినా ఈ విధంగా జరిగిన ముగింపు వల్ల నాకు సంతోషం కలుగలేదు. సత్యాగ్రహం సమాప్తమైనప్పుడు ఏర్పడవలసిన మధుర వాతావరణం ఏర్పడలేదు. క్రొత్త నిర్ణయం తాను చేయలేదని కలెక్టరు భావించాడు. అయితే బీదవారిని మివహాయించే విషయమై అతడు అంగీకరించవలసి వచ్చింది. బీదవాళ్లంటే ఎవరో ఎలా తేల్చడం? ఆ విధంగా నిర్ణయించగల శక్తి జనానికి లేకపోవడం విచారించ తగ్గ విషయం. ముగింపు ఉత్సవం జరిపారు. కాని నాకు అంతగా ఉత్సాహం కలుగలేదు. సత్యాగ్రహం ప్రారంభించినప్పటికంటె ముగించినప్పుడు ప్రజల్లో ఎక్కువ ఉత్సాహం తేజస్సు కనబడినప్పుడే దాన్ని విజయంగా భావించాలి. అట్టి తేజస్సు ఖేడా సంగ్రామం సమాప్తమైనప్పుడు నాకు కనపడలేదు. అయినా యీ ఉద్యమం వల్ల కలిగిన సత్ఫలితాలు అనూహ్యమైనవి. పరోక్షంగా ఆ సంగ్రామం ఎన్నో ప్రయోజనాలు చేకూర్చింది. ఖేడా సంగ్రామంవల్ల గుజరాత్‌కు చెందిన రైతుల్లో గొప్ప చైతన్యం వచ్చింది. వారికి రాజకీయంగా మంచి శిక్షణ లభించింది. విదుషీమణియగు డా. బిసెంట్ ప్రారంభించిన ఉద్యమంకంటే వారిలో నిజమైన చైతన్యం యి ఉద్యమం వల్లనే వచ్చింది. వాలంటీర్లు రైతులతో కలిసిపోయారు. తమ శక్తిని తమ హద్దును తెలుసుకొని ఎంతో త్యాగదీక్షతో పనిచేశారు. వల్లభభాయికి తనశక్తి ఏమిటో తెలుసుకునే అవకాశం ఈ సంగ్రామం వల్ల లభించింది. యిటువంటి అనుభవాలు బార్డోలీలోను, తదితర సంగ్రామాల్లోను కూడా కలిగాయి. గుజరాత్ ప్రజల్లో నూతన తేజస్సు వెల్లివిరిసింది. రైతులు తమ శక్తి ఏమిటో తెలుసుకోగలగడం విశేషం. ప్రజలకు విముక్తి లభించాలంటే అది వారి త్యాగప్రవృత్తిపై ఆధారపడి వుంటుందని అంతా తెలుసుకున్నారు. ఖేడా పోరాటం ద్వారా గుజరాత్ ప్రాంతంలో సత్యాగ్రహం స్థిరమైన స్థానం సంపాదించుకుంది. ఖేడా సంగ్రామ ముగింపు విషయమై నాకు ఉత్సాహం కలుగకపోయినా అక్కడి ప్రజల్లో మాత్రం నూతనోత్సాహం నెలకొన్నది. తాము అనుకున్నది సాధించామనే విశ్వాసం వారికి కలిగింది. భవిష్యత్తులో యిలాంటి సమస్యలు ఎదురైనప్పుడు వాటిని ఎదుర్కొనే విధానం కూడా వారికి బోధపడింది. అయితే సత్యాగ్రహమంటే ఏమిటో ఖేడా ప్రజలు తెలుసుకోలేకపోయారు. అందుకు సంబంధించిన వివరాలు రాబోయే ప్రకరణాల్లో తెలియజేస్తాను. 

26. సమైక్యత

ఖేడా వ్యవహారం సాగుతూ వున్నప్పుడు యూరపులో మహాయుద్ధం జరుగుతూవున్నది. యిందుకోసం ఒక సమావేశం ఏర్పాటుచేసి వైస్రాయి ఢిల్లీకి నాయకుల్ని ఆహ్వానించారు. లార్డ్‌చేమ్స్‌ఫర్డ్‌తో నాకు సత్సంబంధం ఏర్పడిందని ముందే వ్రాశాను. కాని ఆ సభలో ఎలా పాల్గొనడం? నాకు ఒక సంకోచం కలిగింది. యీ సభకు ఆలీ సోదరులను, లోకమాన్య తిలక్‌ను మరియు యింకా కొంతమంది నాయకుల్ని ఆహ్వానించలేదు. అదే నా సంకోచానికి కారణం. అప్పుడు ఆలీ సోదరులు జైల్లో వున్నారు. వారిని ఒకటి రెండు సార్లే కలిసాను. వారిని గురించి చాలా విన్నాను. వారి సేవానిరతిని గురించి వారి ధైర్యసాహసాలను గురించి అంతా పొగడటం గమనించాను. హకీం (క్రీ.శ. హకీం అజమల్ ఖాన్) గారితో ప్రత్యక్ష పరిచయం నాకు లేదు. వారి గొప్పతనాన్ని గురించి కీ.శే. రుద్ర్ మరియు దీనబంధు ఆండ్రూస్‌గారల నోట విన్నాను. కలకత్తాలో ముస్లిం లీగు సమావేశం జరిగినప్పుడు కురేషీ, బారిస్టర్ ఖ్వాజాగారిని కలుసుకున్నాను. డా. అన్సారీగారిని, డా. అబ్దుల్ రహమాన్ గారలను కూడా కలిశాను. ముస్లిం పెద్దమనుషుల్ని కలుసుకునేందుకు ప్రయత్నిస్తూ వున్నాను. దేశభక్తులు, పవిత్రులునగు వారిని కలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాను. వారు పిలిచిన చోటుకు సందేహించకుండా వెళుతున్నాను.

హిందువులు మహ్మదీయుల మధ్య ఐక్యతలేదని దక్షిణ ఆఫ్రికాలో వున్నప్పుడే గ్రహించాను. ఇరువురి మధ్య గల వివాదాల్ని తొలగించేందుకు అవకాశం చిక్కినప్పుడల్లా గట్టిగా ప్రయత్నిస్తూ వున్నాను. అబద్ధాల పొగడ్తలతో, ఆత్మాభిమానం చంపుకొని ఒకరిని సంతోష పెట్టడం నాకు గిట్టదు. నా అహింసా విధానం వీరిరువురి మధ్య సామరస్యం చేకూర్చునప్పుడు పరీక్షకు గురి అవుతుందని భావించాను. యిప్పటికీ నా అభిప్రాయం అదే. భగవంతుడు ప్రతిక్షణం నన్ను పరిశీలిస్తున్నాడు. నా సత్యశోధన సాగుతూనే వున్నది.

ఇట్టి భావాలతో నేను బొంబాయి రేవులో దిగాను. ఆలీ సోదరులను కలుసుకొని ఎంతో సంతోషించాను. మా స్నేహం పెరుగుతూ వున్నది. మాకు పరిచయం కలిగిన తరువాత ప్రభుత్వంవారు ఆలీ సోదరులను జీవించివుండగనే నిర్జీవులా అన్నంత పని చేశారు. జైలు అధికారుల అనుమతితో మౌలానా మహమ్మద్ ఆలీ పెద్ద పెద్ద ఉత్తరాలు బైతూల్ జైలునుండి, లేక చిందవాడా నుండి నాకు వ్రాస్తూ వుండేవారు. నేను వారిని కలుస్తానని వ్రాసి అనుమతి కోరాను. నాకు అనుమతి లభించలేదు. ఆలీ సోదరులు నిర్బంధించబడిన తరువాత కలకత్తాలో జరిగిన ముస్లింలీగు సమావేశానికి నన్ను ముస్లిం సోదరులు తీసుకు వెళ్లారు. అక్కడ మాట్లాడమని నన్ను కోరారు. అలీ సోదరులను విడిపించడం ముస్లిం సోదరుల కర్తవ్యమని అక్కడ చెప్పాను.

తరువాత వాళ్లు నన్ను ఆలీగఢ్ కాలేజీకి తీసుకువెళ్లారు. అక్కడ ముస్లిం సోదరులను దేశం కోసం ఫకీర్లు కమ్మని ఆహ్వానించాను. ఆలీ సోదరుల విడుదలకై ప్రభుత్వంతో ఉత్తరప్రత్యుత్తరాలు ప్రారంభించాను. యీ సందర్భంలో ఆలీ సోదరుల ఖిలాఫత్ ఉద్యమాన్ని గురించి అధ్యయనం చేశాను. ముస్లిం సోదరులతో చర్చించాను. ముస్లిములకు నిజమైన సోదరునిగా రూపొందదలిస్తే ఆలీ సోదరులను విడుదల చేయించాలని, ఖిలాఫత్ ఉద్యమం న్యాయబద్ధంగా సఫలం కావడానికి కృషి చేయాలని భావించాను.

ఖిలాఫత్ నాకు సులువైన వ్యవహారమే. అందు స్వతంత్రించి గుణదోషాలు చూడవలసిన అవసరంలేదు. ముస్లిం సోదరుల కోరిక నీతి విరుద్ధం కాకపోతే వారికి సాయం చేయాలని భావించాను. మత విషయంలో శ్రద్ధకు మహత్తరమైన స్థానం వుంటుంది. అందరి శ్రద్ధ ఒకే వస్తువు యెడ, ఒకే విధంగా వుండి వుంటే ప్రపంచంలో ఒకే మతం వుండివుండేది. ఖిలాఫత్‌కు సంబంధించిన కోరిక నాకు నీతి విరుద్ధమని అనిపించలేదు. యీ కోరికను బ్రిటిష్ ప్రధానమంత్రి లాయడ్‌జార్జి అంగీకరించాడు కూడా. ఆయన అంగీకారాన్ని ఆచరణలో పెట్టించడమే నా కర్తవ్యమని భావించాను. అయన మాటలు స్పష్టంగా వున్నాయి. యిక గుణదోషాల్ని గురించి యోచించడం ఆత్మ తృప్తి కోసమేనని తేల్చుకున్నాను.

ఖిలాఫత్ వ్యవహారంలో నేను ముస్లిం సోదరులను సమర్థించాను. దానితో మిత్రులు, కొందరు విమర్శకులు నన్ను తీవ్రంగా విమర్శించారు. వారి విమర్శలను పరిశీలించి చూచిన తరువాత కూడా నేను చేసింది సరియైన పనియేనని నిర్ణయానికి వచ్చాను. ఈనాడు కూడ అటువంటి సమస్య వస్తే నా నిర్ణయం అలాగే వుంటుందని చెప్పగలను. ఈ భావాలతో నేను ఢిల్లీకి వెళ్లాను. మహమ్మదీయుల బాధను గురించి వైస్రాయితో మాట్లాడవలసి వున్నది. అప్పటికి యింకా ఖిలాఫత్ ఉద్యమం పూర్తి రూపు దాల్చలేదు.

ఢిల్లీ చేరగానే దీనబంధు ఆండ్రూస్ ఒక నైతిక ప్రశ్న లేవదీశారు. ఆంగ్లపత్రికల్లో ఇటలీ, ఇంగ్లాండుల మధ్య రహస్య ఒడంబడిక జరిగినట్లు వెలువడిన వార్తలు చూపించి అట్టి స్థితిలో మీరు యీ సమావేశంలో ఎలా పాల్గొంటారని ఆయన ప్రశ్నించారు. ఆ ఒడంబడికను గురించి నాకు ఏమీ తెలియదు. దీనబంధు మాటలు నాకు చాలు. దానితో మీ సమావేశంలో పాల్గొనుటకు నేను సంకోచిస్తున్నానని లార్డ్ చేమ్స్‌ఫర్డుకు జాబు వ్రాశాను. చర్చలకు రమ్మని ఆయన నన్ను ఆహ్వానించారు. వారితోను, మి. మేఫీతోను విస్తృతంగా చర్చించాను. చివరికి సమావేశంలో పాల్గొనుటకు నిర్ణయించుకున్నాను. “బ్రిటిష్ మంత్రివర్గం చేసిన నిర్ణయం వైస్రాయికి తెలియవలసిన అవసరం లేదు గదా? ప్రభుత్వం ఎన్నడూ తప్పుచేయదని నేను చెప్పలేను. ఎవరైనా పొరపాటు చేయవచ్చు. బ్రిటిష్ ప్రభుత్వపు ఉనికి ప్రపంచ మనుగడకు మేలు కలిగిస్తుందని, దాని కృషివల్ల ఈ దేశానికి సామూహికంగా మేలు జరుగుతుందని మీరు భావిస్తే ఆపద సమయంలో దానికి సాయపడటం ప్రతిపౌరుని కర్తవ్యమని మీరు భావించరా? రహస్య ఒడంబడికను గురించి పత్రికల్లో మీరు చూచినట్లే నేను చూచాను. అంతకంటే మించి నాకేమీ తెలియదు. మీరు నామాట నమ్మండి. పత్రికల్లో ఏదో తలాతోక లేని వార్త వెలువడినందున మీరు యిలాంటి సమయంలో ప్రభుత్వానికి సహకరించడం విరమిస్తారా? యుద్ధం ముగిసిన తరువాత మీ యిష్టం వచ్చినన్ని నైతిక ప్రశ్నలు చేయవచ్చు, యిష్టం వచ్చినట్లు చర్చలు జరపవచ్చు” యిదీ వైస్రాయి లార్డ్ చేమ్స్‌ఫర్డు మాటల సారాంశం.

ఈ తర్కం క్రొత్తది కాదు. అయితే సమయం, విధానం రెండిటి దృష్ట్యా కొత్తదనిపించింది. నేను సమావేశంలో పాల్గొనుటకు అంగీకరించాను. ఖిలాఫత్ విషయమై వైస్రాయికి నేను జాబు వ్రాయాలని నిర్ణయం జరిగింది.

27. సైన్యం కోసం యువకుల ఎంపిక

నేను సభలో పాల్గొన్నాను. సైనికుల్ని చేర్పించి ప్రభుత్వానికి నేను సాయం చేయాలని వైస్రాయి అభిప్రాయపడ్డారు. నేను సభలో హిందీ - హిందుస్తానీలో మాట్లాడతానని చెప్పాను. వైస్రాయి అంగీకరించారు. హిందీతో బాటు ఇంగ్లీషులో కూడా మాట్లాడమని కోరారు. నేను ఉపన్యాసం యివ్వదలచలేదు. “నా బాధ్యత ఏమిటో నాకు పూర్తిగా తెలుసు. తెలిసికూడా నేను యీ తీర్మానాన్ని సమర్ధిస్తున్నాను” అని మాత్రం అన్నాను.

హిందుస్తానీలో మాట్లాడినందుకు చాలామంది నన్ను అభినందించారు. వైస్రాయి సభలో యీ రోజుల్లో హిందుస్తానీలో మాట్లాడటం యిదే ప్రథమం అనికూడా చెప్పారు. అభినందన, మొదటి పర్యాయం అను మాటలు రెండు నాకు గుచ్చుకున్నాయి. నేను సిగ్గుపడ్డాను. మన దేశంలో, దేశ సమస్యను గురించి దేశభాషలో మాట్లాడకపోవడం, దేశభాషను అవమానించడం ఎంతో విచారకరమైన విషయం. నావంటి వ్యక్తి రెండు వాక్యాలు హిందుస్తానీలో మాట్లాడితే అందుకు అభినందించడమా? మన పతనావస్థను యీ విషయం సూచిస్తున్నది. సభలో నేను అన్నమాటలకు నా దృష్టిలో మంచి తూకం వున్నది. దాన్ని మరిచిపోయే స్థితి యీ సభలో నాకు ఏమీ కనబడలేదు. నాకు గల ఒక బాధ్యతను ఢిల్లీలో నిర్వహించవలసియున్నది. వైస్రాయికి జాబు వ్రాయడం తేలికపనియని నాకనిపించలేదు. సభలో పాల్గొనేందుకు నా తడబాటు, అందుకు గల కారణాలు, భవిష్యత్తుపై నాకుగల ఆశ మొదలగు వాటిని స్పష్టంగా వెల్లడించడం అవసరమని భావించాను.

నేను వైస్రాయికి జాబు వ్రాసాను. అందు లోకమాన్య తిలక్, ఆలీ సోదరులు మొదలగువారిని సభకు ఆహ్వానించనందుకు విచారం వెల్లడించాను. ప్రజల రాజకీయ కోరికలను గురించి, యుద్ధంవల్ల మహమ్మదీయులకు కలిగిన కోరికలను గురించి ఆ జాబులో పేర్కొన్నాను. జాబును ప్రకటించేందుకు అనుమతించమని వైస్రాయిని కోరాను. ఆయన సంతోషంతో అనుమతించారు. ఆ జాబు సిమ్లా పంపాల్సి వచ్చింది. సమావేశం ముగియగానే వైస్రాయి సిమ్లా వెళ్లిపోయారు. పోస్టులో జాబు పంపితే ఆలస్యం అవుతుంది. నా దృష్టిలో జాబుకు విలువ ఎక్కువ. సమయం ఎక్కువ పట్టకూడదు. ఎవరి చేతనో జాబు పంపడం మంచిదికాదు. పవిత్రుడగు వ్యక్తి ద్వారా జాబు పంపితే మంచిదని భావించాను. దీనబంధు మరియు సుశీల రుద్రగారలు సజ్జనులగు రెవరెండ్ ఐర్లండుగారి పేరు సూచించారు. జాబు చదివిన తరువాత తనకు నచ్చితే తీసుకువెళ్లేందుకు ఆయన అంగీకరించాడు. జాబు రహస్యమైనదికాదు. ఆయన చదివారు. ఆయనకు నచ్చింది. తీసుకొని వెళ్లేందుకు అంగీకరించారు. సెకండ్‌క్లాసు కిరాయి యిస్తానని చెప్పాను. కాని ఆయన కిరాయి తీసుకునేందుకు అంగీకరించలేదు. రాత్రిపూట ప్రయాణం అయినా ఆయన ఇంటర్ టిక్కట్టు తీసుకున్నాడు. ఆయన నిరాడంబరత, స్పష్టత చూచి ముగ్ధుడనయ్యాను. యింతటి పవిత్రవ్యక్తి ద్వారా పంపిన జాబుకు సత్ఫలితం చేకూరింది. దానితో నాకు మార్గం సులువైపోయింది. సైన్యంలో యువకుల్ని చేర్చడం యిక నా రెండో బాధ్యత. ప్రజల్ని సైన్యంలో చేరమని నేను విన్నపం చేయాలంటే అందుకు తగిన చోటు ఖేడాయే గదా? నా అనుచరుల్ని ఆహ్వానించకపోతే యింక ఎవర్ని ఆహ్వానించగలను? ఖేడా చేరగానే వల్లభాయి మొదలగు వారితో చర్చించాను. చాలామందికి నా మాటలు రుచించలేదు. రుచించినవారికి యిందు సాఫల్యం లభిస్తుందా అని సందేహం కలిగింది. ఏ వర్గం వారిని ఇందు చేర్చాలో ఆ వర్గం వారికి ప్రభుత్వం మీద విశ్వాసం లేదు. ప్రభుత్వ అధికారుల వల్ల కలిగిన అనుభవాలు వాళ్లు యింకా మరిచిపోలేదు. అయినా పని ప్రారంభిద్దామని అంతా నిర్ణయానికి వచ్చారు. పని ప్రారంభించినప్పుడు నా కండ్లు తెరుపుడు పడ్డాయి. నా ఆశావాదం తగ్గిపోయింది. ఖేడా సంగ్రామం జరిగినప్పుడు జనం తమ సొంత బండ్లను యిచ్చారు. ఒక్క వాలంటీరుతో పని జరిగేచోట నలుగురు వాలంటీర్లు పనిచేశారు. కాని యిప్పుడు డబ్బుయిచ్చినా బండి కట్టేవాళ్లు కనబడలేదు. అయితే మేము నిరాశపడే రకం కాదుగదా! బండ్లకు బదులు కాలినడకన తిరగాలని నిర్ణయించాం. రోజుకు 20 మైళ్లు నడవాల్సి వచ్చింది. బండిదొరకని చోట తిండి ఎలా దొరుకుతుంది? భోజనం పెట్టమని అడగటం మంచిది కాదుగదా! అందువల్ల ప్రతి వాలంటీరు బయలుదేరినప్పుడే ఆహారం వెంటతెచ్చుకోవాలని నిర్ణయించాం. వేసవికాలపురోజులు. అందువల్ల కప్పుకునేందుకు బట్టలు అవసరంలేదు. వెళ్లిన ప్రతి గ్రామంలో సభ జరిపాం. జనం వచ్చేవారు కాని ఇద్దరు ముగ్గురు మాత్రమే తమ పేరు నమోదు చేయించుకునేవారు. “మీరు అహింసావాదులు కదా! మమ్మల్ని ఆయుధాలు పట్టమని ఎలా చెబుతున్నారు? ప్రభుత్వం యీ దేశప్రజలకు ఏమి మేలు చేసింది? దానికి సాయం చేయమని మీరు ఎలా కోరుతున్నారు?” ఈరకమైన ప్రశ్నలు జనం వేయసాగారు.

ఇట్టి స్థితిలో కూడా మెల్లమెల్లగా పని చేశాం. పేర్లు బాగానే నమోదు కాసాగాయి. మొదటి బృందం బయలుదేరి వెళ్లితే రెండో బృందానికి మార్గం సుగమం అవుతుందని భావించాం. జనం ఎక్కువగా చేరితే వాళ్లను ఎక్కడ వుంచాలా అను విషయాన్ని గురించి కమీషనరుతో మాట్లాడాను. కమీషనరు కూడా ఢిల్లీ పద్ధతిలో సభలు జరుపుతున్నారు. గుజరాత్‌లో కూడా అట్టిసభ జరిగింది. అందు నన్ను నాఅనుచరులను పాల్గొనమని ఆహ్వానించారు. అక్కడికి వెళ్లి సభలో పాల్గొన్నాను. ప్రతి మీటింగులోను పరిస్థితి మరో విధంగా వుంటూ వుంది. చిత్తం చిత్తం అను పద్ధతి ఎక్కువ కావడం వల్ల నేను అధికారుల మధ్య యిమడలేక పోయాను. సభలో నేను కొంచెం ఎక్కువగానే మాట్లాడాను. నా మాటల్లో ముఖస్తుతి అనునదిలేదు. రెండు కటువైన మాటలు కూడా అందు వున్నాయి. సైన్యంలో యువకుల్ని చేర్చుకునే విషయమై నేను ఒక కరపత్రం ప్రకటించాను. సైన్యంలో చేరే విషయమై వెలువరించిన విజ్ఞప్తిలో ఒక తర్కం వున్నది. అది కమీషనరుకు గుచ్చుకున్నది. “బ్రిటిష్ ప్రభుత్వం చేసిన ఆకృత్యాలు అపరిమితం. ప్రజలనందరినీ ఆయుధాలు లేకుండా చేసిన చట్టం దేశచరిత్రలో మాయనిమచ్చ అని చెప్పవచ్చు. చట్టాన్ని రద్దు చేయాలన్నా, ఆయుధాలను ప్రయోగించడం నేర్చుకోవాలన్నా ఇది మంచి తరుణం. రాజ్యం ఆపదలోవున్న సమయంలో మధ్య తరగతి ప్రజలు స్వచ్ఛందంగా సాయపడితే వారి మనస్సులో గల అపనమ్మకం తొలగిపోతుంది. ఆయుధాలు పట్టదలచినవారు సంతోషంగా పట్టవచ్చును” ఇది ఆ తర్కానికి సారాంశం. దీన్ని దృష్టిలో పెట్టుకుని కమీషనరు మీకు మాకు మధ్య అభిప్రాయబేధం వున్నప్పటికీ సభలో మీరు పాల్గొనడం నాకు ఇష్టం అని అన్నాడు. అందుకు నేనుకూడా నా అభిప్రాయాన్ని తీయని మాటలతో సభలో సమర్ధించుకోవలసి వచ్చింది. వైస్రాయికి నేను పంపిన పత్రం యొక్క వివరం క్రింద ప్రకటిస్తున్నాను.

“యుద్ధ పరిషత్తులో పాల్గొనే విషయమై నాకు సంకోచం కలిగింది. కాని మిమ్ము కలసిన తరువాత ఆ సంకోచం తొలగిపోయింది. మీ యెడ నాకు గల అమిత ఆదరణ అందుకుగల ఒక పెద్దకారణం. ఆ సభలో పాల్గొనమని లోకమాన్యతిలక్ మిసెస్ బిసెంట్, ఆలీ సోదరులను మీరు ఆహ్వానించకపోవడం నా సంకోచానికి మరో పెద్ద కారణం. వారు గొప్ప ప్రజా నాయకులని నా విశ్వాసం. వారిని ఆహ్వానించకపోవడం ప్రభుత్వం చేసిన పెద్ద తప్పిదం. యిక ముందు జరిపే ప్రాంతీయ సభలకు వారిని తప్పక ఆహ్వానించమని నా సలహా. ఇంతటి ప్రౌఢనాయకుల్ని అభిప్రాయభేదాలెన్ని వున్నప్పటికీ ఏ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకూడదని నా నమ్రతతో కూడిన వినతి. అందువల్ల నేను సభ యొక్క కార్యనిర్వాహక సమితి సమావేశాల్లో పాల్గొనలేకపోయాను. సభలో తీర్మానాన్ని సమర్థించి తృప్తి పడ్డాను. ప్రభుత్వం నా సలహాను అంగీకరిస్తే నేను వెంటనే నా సమర్ధనకు కార్యరూపం ఇవ్వగలనని తెలియజేస్తున్నాను. ఏ ప్రభుత్వపు భవిష్యత్తులో మేము భాగస్వాములమని విశ్వసిస్తున్నామో ఆ ప్రభుత్వం ఆపదలో వున్నప్పుడు దానికి పూర్తిగా మద్దతు అందించడం మా కర్తవ్యం. యిట్టి మద్దతు ద్వారా మేము మా లక్ష్యం వరకు త్వరగా చేరుకోగలమని ఆశిస్తున్నామని చెప్పడం ఈ సందర్భంలో అవసరమని భావిస్తున్నాను. మీరు మీ ఉపన్యాసంలో పేర్కొన్న మార్పుల్లో కాంగ్రెస్, ముస్లిమ్‌లీగు కోరుతున్న కోరికలు కూడా చోటు చేసుకుంటాయని విశ్వసించే హక్కు ప్రజలకు వున్నది. నావల్ల నెరవేరగల పరిస్థితి పుండివుంటే ఇటువంటి సమయంలో హోమ్ రూలు మొదలగు వాటి పేరు ఎత్తి వుండేవాణ్ణి కాదు. సామ్రాజ్యానికి సంభవించిన ఈ కష్టసమయంలో శక్తివంతులైన భారతీయులందరు దాని రక్షణార్థం మౌనంగా బలిదానం అయిపోవాలని ప్రోత్సహించేవాణ్ణి. ఈ విధంగా చేయడం వల్ల మేము సామ్రాజ్యంలో ఆదరణగల గొప్ప భాగస్వాములం అయివుండేవాళ్లం. వర్ణభేదం, దేశభేదం పటాపంచలైపోయేవి.

చదువుకున్న ప్రజలు యింతకంటే కొంచెం తక్కువ ప్రభావం కలిగించే మార్గం ఎన్నుకున్నారు. ప్రజాబాహుళ్యం మీద వారి ప్రభావం బాగా పడింది. భారతదేశం వచ్చినప్పటి నుండి సామాన్య ప్రజానీకంతో సంబంధం పెట్టుకున్నాను. వారి హృదయంలో కూడా హోంరూలును గురించిన ఆకాంక్ష నాటుకున్నదని మనవి చేయదలుచుకున్నాను. హోంరూలు లేకపోతే ప్రజానీకం సంతృప్తి చెందదు. హోంరూలు కోసం ఎంతటి త్యాగానికైనా ప్రజానీకం సిద్ధంగా వున్నది. రాజ్య రక్షణకు ఎంతమంది సైనికులైనా మేము యివ్వవలసిందే. కాని ఆర్థిక సాయం విషయమై నేను మాట యివ్వలేను. భారతదేశపు ప్రజానీకానికి యిది శక్తికి మించిన విషయం. ఇప్పటికి యిచ్చిందే చాలా ఎక్కువ. అయితే సభలో కొందరు చివరి శ్వాస వరకు సాయం చేయాలని నిర్ణయించారు. కాని అది మావల్ల కాని పని. మేము గద్దెల కోసం గాని మేడల కోసం గాని ఎగబడటం లేదు. మా సాయం భవిష్యత్తు మీద గల ఆశల పునాది మీద ఆధారపడియున్నది. ఆ ఆశలు స్పష్టంగా చెప్పడం అవసరమని భావిస్తున్నాను. నేను బేరసారాలకు దిగను. కానీ ఈ విషయమై మా హృదయాలలో నిరాశ నెలకొంటే మాత్రం బ్రిటిష్ సామ్రాజ్యం మీద మాకు గల నమ్మకం అంతా నీరుగారిపోతుంది. గృహకల్లోలాలు మరిచిపొమ్మని అన్నారు. దానికి అర్థం అధికారుల ఆకృత్యాలను మరిచిపొమ్మనా? అలా అనుకుంటే అది సాధ్యం కాని పని. సుసంఘటితంగా సాగే దుర్మార్గాన్ని పూర్తి శక్తి సామర్ధ్యాలతో ఎదుర్కోవడం ధర్మమని నా భావం. అందువల్ల అధికారులకు దుర్మార్గాలు ఆపివేయమని, ప్రజాభిప్రాయాన్ని ఆదరించమని చెప్పండి. చంపారన్‌లో శతాబ్దాల తరబడి సాగుతున్న దుర్మార్గాన్ని ఎదుర్కొని బ్రిటిష్ వారి న్యాయవ్యవస్థ ఎంత గొప్పదో నిరూపించి చూపించాను. సత్యం కోసం కష్టాల్ని సహించగల శక్తి తమకు వున్నదని తెలుసుకున్న ఖేడా ప్రజలు వాస్తవానికి ప్రభుత్వ శక్తి ఒక శక్తి కాదని, ప్రజా శక్తియే నిజమైన శక్తియని గ్రహించారు. ఆ తరువాత అక్కడి ప్రజలు అప్పటివరకు తాము శపిస్తున్న ప్రభుత్వం శక్తి యెడ తమకు గల వ్యతిరేకతను తగ్గించుకున్నారు. సహాయ నిరాకరణోద్యమాన్ని సహించిన ప్రభుత్వం ప్రజాభిప్రాయాన్ని నిర్లక్ష్యం చేయదని విశ్వసించారు. అందువల్ల చంపారన్, ఖేడాలలో నేను జరిపిన చర్యలన్నీ యుద్ధానికి సహాయపడాయని భావిస్తున్నాను. యిటువంటి చర్యలు చేయవద్దని మీరు నన్ను కోరితే శ్వాస పీల్చవద్దని మీరు చెబుతున్నారని భావిస్తాను. ఆయుధ బలం కంటే ఆత్మ బలం, అనగా ప్రేమ బలం గొప్పదను భావం ప్రజల హృదయాలలో నేను నాటగలిగితే భారతదేశం మొత్తం ప్రపంచానికే తలమానికం కాగలదని భావిస్తున్నాను. అందువల్ల ప్రతివ్యక్తీ కష్టాలు దుఃఖాలు సహించగల శక్తిని అలవరచుకునే పద్ధతిన సనాతన విధానాన్ని జీవితంలో అనుసరించడం కోసం నా ఆత్మశక్తిని వినియోగిస్తాను. ఈ విధానాన్ని అనుసరించమని యితరులను కూడా ఆహ్వానిస్తూ వుంటాను. యితర వ్యవహారాలలో తలదూర్చడం యీ విధానం యొక్క గొప్పదనాన్ని రుజూచేసేందుకేనని మనవి చేస్తున్నాను.

ముస్లిం రాజ్యాల విషయమై గట్టిగా మాట యిమ్మని బ్రిటిష్ మంత్రి వర్గానికి మీరు వ్రాయండి. ప్రతి మహమ్మదీయుడు యీ విషయమై చింతిస్తున్నాడని మీరు గ్రహించండి. నేను హిందువును అయినా వారి భావాన్ని విస్మరించలేదు. వాళ్ల దుఃఖం మా దుఃఖమే. ముస్లిం రాజ్యాల హక్కుల రక్షణ కోసం, వారి ధార్మిక స్థలాల విషయంలో, వారి భావాల్ని ఆదరించే విషయంలో భారతదేశానికి హోమ్‌రూలు మొదలగు వాటిని అంగీకరించడం బ్రిటిష్ సామ్రాజ్యానికే క్షేమం కలిగిస్తుందని మనవి చేస్తున్నాను. ఇంగ్లీషు వారిలో గల విశ్వసనీయతను ప్రతి భారతీయుని హృదయంలో నెలకొల్పాలని కాంక్షిస్తున్నాను. 

28. మృత్యుశయ్య మీద

సైన్యంలో యువకుల్ని చేర్చడం కోసం నా శరీరం అరిగిపోయింది. అప్పుడు వేయించి దంచిన బెల్లం కలిపిన వేరుసెనగపప్పు నా ఆహారం. అరిటిపండ్లు, రెండు మూడు నిమ్మకాయల రసం, వేరుసెనగ పప్పు ఎక్కువగా తింటే హానిచేస్తుందని తెలుసు. అయినా దాన్ని ఎక్కువగా తిన్నాను. అందువల్ల విరోచనాలు పట్టుకున్నాయి. నేను తరచు ఆశ్రమం వెళ్లవలసి వస్తూ వుండేది. విరోచనాలు అంత బాధాకరమని అనిపించలేదు. రాత్రి ఆశ్రమం చేరాను. అప్పుడు మందులేమీ వాడేవాణ్ణి కాను. ఒక పూట ఆహారం మానివేస్తే విరోచనాలు తగ్గిపోతాయని భావించాను. మరునాడు ఉదయం ఏమీ తినలేదు. దానితో బాధ కొంత తగ్గింది. యింకా ఉపవాసం చేయడం అవసరమని, ఆహారం తీసుకోవలసి వస్తే పండ్లరసం వంటి వస్తువేదైనా తీసుకోవాలని నాకు తెలుసు.

అది ఏదో పండగరోజు. మధ్యాహ్నం ఏమీ తిననని కస్తూరిబాయికి చెప్పినట్లు గుర్తు. కాని ఆమె పండగపూట కొంచెం తినమని ప్రోత్సహించింది. నేను కొంచెం ఉబలాటపడ్డాను. నేను పశువుల పాలు పుచ్చుకోవడం లేదు. అందువల్ల నెయ్యి, మజ్జిగ కూడ మానివేశాను. కస్తూరిబాయి నూనెతో వేయించిన గోధుమజావ, పెసరపప్పు పదార్థం నాకిష్టమైనవి చేసివుంచింది. వాటిని చూచేసరికి నాకు నోరు ఊరింది. కస్తూరిబాయికి తృప్తి కలిగించేందుకు కొద్దిగా తిందామని, రుచి చూడటంతోపాటు శరీర రక్షణ కూడా సాధ్యపడుతుందని భావించాను. కాని సైతాను రెడీగా పొంచివున్నాడు. తినడం ప్రారంభించిన తరువాత పూర్తిగా తినివేశాను. తినడానికి పసందుగా వున్నాయేగాని, యమధర్మరాజును చేతులారా కొని తెచ్చుకున్నానని తరువాత తేలింది. తిని ఒక గంట అయిందో లేదో కడుపులో నొప్పి ప్రారంభమైంది.

రాత్రికి నడియాద్ వెళ్లాలి. సాబర్మతి స్టేషను వరకు నడిచి వెళ్లాను. మైలున్నర దూరం నడవాలంటే కష్టమైపోయింది. అహమదాబాదు స్టేషనులో వల్లభభాయి కలిశారు. ఆయన నేను పడుతున్న బాధను గ్రహించారు. అయినా బాధ భరించలేకపోతున్నానని ఆయనకుగాని, యితర అనుచరులకుగాని నేను చెప్పలేదు. నడియాద్ చేరాం. అక్కడికి అనాధాశ్రమం అరమైలు దూరాన వుంది. పదిమైళ్ల దూరం నడిచినంత శ్రమ కలిగింది. అతికష్టం మీద అక్కడికి చేరాను. మెలికలు తిరిగేటంతగా వుంది కడుపునొప్పి. పావుగంటకు ఒకసారి చొప్పున విరోచనాలు ప్రారంభమైనాయి. భరించలేక నేను పడుతున్న బాధను గురించి చెప్పివేశాను. మంచం ఎక్కాను. అక్కడి పాయిఖానా దొడ్డిని ఉపయోగించాను. కాని అంత దూరం కూడా వెళ్లలేక పక్క గదిలో కమోడ్ పెట్టమని చెప్పాను. సిగ్గుపడ్డాను కాని గత్యంతరం లేదు. పూల్ చంద్ బాపూజీ పరుగెత్తుకొని వెళ్లి కమోడ్ తెచ్చాడు. చింతాక్రాంతులైన నలుగురూ చుట్టూ మూగారు. అంతా ప్రేమామృతం నామీద కురిపించారు కాని నా బాధను పంచుకోలేరు గదా! నా మొండిపట్టు కూడా యిబ్బందికరంగా వున్నది. డాక్టర్లను పిలుస్తామంటే వద్దని వారించాను. మందు తీసుకోను. చేసిన పాపానికి ఫలితం అనుభవిస్తాను అని చెప్పివేశాను. అనుచరులు ఓర్పు వహించారు. 24 గంటల్లో 30 లేక 40 సార్లు విరోచనాలు అయ్యాయి. ఆహారం పూర్తిగా మానివేశాను. తిందామనే వాంఛ పోయింది. రాతి వంటి శరీరం నాది అనుకునేవాణ్ణి. కాని బలం తగ్గిపోయింది. డాక్టర్లు వచ్చి మందు తీసుకోమని చెప్పారు. నేను తీసుకోనని చెప్పివేశాను. ఇంజక్షను గురించి అప్పటి అజ్ఞానాన్ని తలచుకుంటే నవ్వువస్తుంది. ఇంజక్షను గొట్టంలో ఒక విధమైన చెడు ఔషధం వుంటుందని అనుకునేవాణ్ణి. నా అభిప్రాయం సరికాదని తరువాత తెలిసింది. అయితే అప్పటికి సమయం దాటిపోయింది. జిగట విరోచనాలు తగ్గలేదు. మాటిమాటికి లేవవలసిన పరిస్థితి ఏర్పడింది. దానితో జ్వరం వచ్చింది. ఒళ్లు తెలియకుండా పడిపోయాను. మిత్రులు భయపడిపోయారు. చాలామంది డాక్టర్లు వచ్చారు. కాని రోగి అంగీకరించకపోతే వారేం చేస్తారు?

సేఠ్ అంబాలాలు, ఆయన సతీమణి నడియాద్ వచ్చారు. అనుచరులతో మాట్లాడి నన్ను మీర్జాపూరులో వున్న తమ బంగళాకు కడు జాగ్రత్తగా తీసుకువెళ్ళారు. జబ్బుస్థితిలో నేను పొందిన నిర్మల, నిష్కామసేవ మరెవ్వరూ పొందియుండరని చెప్పగలను. జ్వరం తక్కువగా వున్నా శరీరం క్షీణించిపోయింది. జబ్బు చాలాకాలం లాగుతుందని మంచం మీద నుండి లేవలేనని అనుకున్నాను. అంబాలాలు గారి బంగళాలో ప్రేమామృతం వారు ఎంత కురిపిస్తున్నా నేను అక్కడ వుండలేకపోయాను. ఆశ్రమం చేర్చమని వారిని వేడుకున్నాను. నా పట్టుదలను చూచి వారు నన్ను ఆశ్రమం చేర్చారు. బాధపడుతున్న సమయంలో వల్లభభాయి వచ్చి యుద్ధంలో జర్మనీ ఓడిపోయిందని, సైన్యంలో యువకుల్ని చేర్చవలసిన అవసరం లేదని కమీషనరు చెప్పాడని అన్నారు. సంతోషం కలిగింది. బరువు తీరినట్లనిపించింది. జల చికిత్స ప్రారంభించినందున నా శరీరం యింకా నిలిచివున్నది. బాధ తగ్గింది. కాని శరీరం కుదుటబడలేదు. వైద్యులు, డాక్టర్లు ఎన్నో సలహాలు యిచ్చారు కాని నేను అంగీకరించలేదు. పాలు తీసుకోకపోతే మాంసం పులుసు పుచ్చుకోమని, ఆయుర్వేద శాస్త్రంలో అందుకు అంగీకరించారని కొందరు వైద్యులు గ్రంథాలు తిరగవేసి మరీ చెప్పారు. ఒకరు గుడ్డు తీసుకోమని చెప్పారు. ఎవ్వరి మాటా నేను వినలేదు. ఆహారం విషయంలో గ్రంథాల మీద నేను ఎన్నడూ ఆధారపడలేదు. ఆహారంలో ప్రయోగాలు నా జీవితంలో భాగమై పోయాయి. ఏదో ఒకటి తినడం, ఏదో మందు పుచ్చుకోవడం నేనెరుగను. నా బిడ్డలకు, భార్యకు, మిత్రులకు వర్తించని ధర్మం నాకు మాత్రం ఎలా వర్తిస్తుంది? ఇది జీవితంలో నాకు చేసిన పెద్దజబ్బు, ఎక్కువకాలం మంచం పట్టిన జబ్బు కూడా యిదే. జబ్బు తీవ్రతను దగ్గరగా పరిశీలించే అవకాశం నాకు చిక్కింది. ఒకనాటి రాత్రి యిక బ్రతకనని అనిపించింది. మృత్యువుకు దగ్గరలో వున్నానని అనిపించింది. శ్రీమతి అనసూయాబెన్‌కు కబురు పంపాను. ఆమె వచ్చింది. వల్లభభాయి వచ్చారు. డాక్టర్ కానూగా వచ్చారు. డాక్టర్ కానూగా కూడా నాడిని జాగ్రత్తగా పరిశీలించి చూచి “మృత్యు లక్షణాలేమీ నాకు కనబడటం లేదు. నాడి శుభ్రంగా వున్నది. బలహీనత వల్ల మీరు మానసికంగా భయపడుతున్నారు” అని చెప్పారు. కాని నా మనస్సు అంగీకరించలేదు. ఆ రాత్రి అతికష్టం మీద గడిచింది. కన్ను మూతబడలేదు.

తెల్లవారింది. నేను చనిపోలేదు. అయినా బ్రతుకు మీద ఆశ నాకు కలుగలేదు. మరణం దగ్గరలో వున్నదని భావించి గీతాపఠనం విడువకుండా సాగించమని చెప్పి, గీతాశ్లోకాలు వింటూ పడుకున్నాను. పనిచేసే శక్తి లేదు. చదివే ఓపిక అసలే లేదు. రెండు మూడు వాక్యాలు మాట్లాడేసరికి మెదడు అలిసిపోతున్నది. అందువల్ల ప్రాణం మీద ఆశపోయింది. బ్రతకడం కోసం బ్రతకడం నాకు యిష్టం లేదు. కాయకష్టం చేయకుండా అనుచరుల చేత చేయించుకుంటూ బ్రతకడం భారమనిపించింది. ఈవిధమైన స్థితిలో వుండగా డాక్టర్ తల్‌వల్కర్ ఒక విచిచిత్రమై వ్యక్తిని తీసుకువచ్చారు. ఆయన మహారాష్ట్రకు చెందినవాడు. భారతదేశంలో ఆయనకు ఖ్యాతి లేదు. ఆయనను చూడగానే నా మాదిరిగానే ఆయన కూడా పెంకిరకమని గ్రహించాను. ఆయన తన చికిత్సను నా మీద ప్రయోగించి చూచేందుకు వచ్చాడని తేల్చుకున్నాను. ఆయన గ్రేట్ మెడికల్ కాలేజీలో వైద్యశాస్త్రం అధ్యయనం చేశాడు. అయితే డిగ్రీ తీసుకోలేదు. బ్రహ్మ సమాజంలో చేరాడని తరువాత తెలిసంది. ఆయన పేరు కేల్కర్. పూర్తిగా స్వతంత్ర స్వభావం గల వ్యక్తి. మంచు చికిత్స తప్పదని ఆయన భావం. నా జబ్బు విషయం తెలిసి మంచి చికిత్స చేయడానికి వచ్చాడన్నమాట. ఆయనకు ఐస్ డాక్టర్ అని పేరు పెట్టాము. తన చికిత్స అంటే ఆయనకు గట్టి నమ్మకం. డిగ్రీ హోల్డర్ల కంటే తను గొప్ప డాక్టరునని ఆయనకు అపరిమితమైన విశ్వాసం.

అయితే తనకెంత విశ్వాసంవుందో అంత విశ్వాసం నాకు కలిగించలేకపోయాడు. ఈ విషయం మా ఇరువురికీ విచారం కలిగించింది. కొన్ని విషయాలలో ఆయన తొందరపడ్డాడని నాకు అనిపించింది. ఏది ఏమైనా నాశరీరం మీద ఆయనను ప్రయోగాలు చేయనిచ్చాను. బాహ్య చికిత్సే గదా అని భావించాను. ఆయన శరీరమంతా మంచుగడ్డలతో రాయడం ప్రారంభించాడు. ఆయన చికిత్స వల్ల చెప్పినంత ప్రయోజనం కలుగకపోయినా మృత్యువు కోసం మొదట నిరీక్షించినట్లు యిప్పుడు నిరీక్షించడం మానివేశాను. జీవితంమీద ఆశ చిగురించింది. కొద్దిగా ఉత్సాహం కలిగింది. తినే ఆహారం కొద్దిగా పెరిగింది. 10 నిమిషాలపాటు రోజూ పచారు చేయసాగాను. ఆయన నా ఆహారంలో కొద్దిగా మార్పు చేయమని సూచించి “మీరు గ్రుడ్డురసం త్రాగండి. యిప్పటికంటే అత్యధికంగా మీకు ఉత్సాహం కలుగుతుంది. పాల వలెనే గ్రుడ్డు కూడా దోషంలేని వస్తువు. అది మాంసం కానేకాదు. ప్రతి గ్రుడ్డు నుండి పిల్ల పుట్టదు. పిల్లగా మారని గొడ్డుబోతు గ్రుడ్లు కూడా వుంటాయి. వాటిని వాడవచ్చును. నా మాటను రుజూ చేసి చూపిస్తాను” అని మాటల వర్షం కురిపించాడు. కాని అందుకు నేను యిష్టపడలేదు. అయినా నా బండి కొంచెం ముందుకు సాగింది. కొద్ది కొద్దిగా పనులు చేయసాగాను. 

29. రౌలట్ అక్టు - ధర్మసంకటం

మథెరాన్ వెళితే శరీరానికి త్వరగా పుష్టి చేకూరుతుందని మిత్రులు సలహా యిచ్చారు. ఆ ప్రకారం నేను మథెరాన్ వెళ్లాను. అక్కడి నీళ్లు పడలేదు. అందువల్ల నా వంటిరోగి అక్కడ వుండటం కష్టమైపోయింది. ఆమం ఎక్కువ కావడం వల్ల మలద్వారం మెత్తబడిపోయి అక్కడ బాగా గాట్లు పడ్డాయి. దొడ్డికి వెళితే యమబాధ ప్రారంభమైంది. అందువల్ల ఆహారం ఏమన్నా తీసుకుందామంటే భయం వేసింది. ఒక్క వారం రోజుల్లో మథెరాన్ నుండి తిరిగి వచ్చివేశాను. నా ఆరోగ్యాన్ని గురించి శంకరలాల్ శ్రద్ధ వహించాడు. డాక్టర్ దలాల్ సలహా తీసుకోమని వత్తిడి చేశాడు. డాక్టర్ దలాల్ వచ్చారు. వెంటనే నిర్ణయం చేసే ఆయన శక్తి నన్ను ఆకర్షించింది. ‘మీరు పాలు తీసుకోనంత వరకు నేను మీ శరీరాన్ని బాగుచేయలేను. మీ శరీరం బాగుపడాలంటే పాలు త్రాగక తప్పదు. ఆర్సెనిక్ ఇంజెక్షన్లు చేయించుకోవాలి. మీరు సరేనంటే మీ శరీర బాధ్యత నాది’ అని అన్నారు. “ఇంజెక్షన్లు తీసుకుంటాను కాని పాలు మాత్రం త్రాగను”. “పాలను గురించిన మీ ప్రతిజ్ఞ ఏమిటి?” ఆవులను గేదెలను నరకయాతనలకు గురిచేస్తారని తెలిసి పాలంటే నాకు ఏవగింపు కలిగింది. పాలను ఆహారంగా తీసుకోకూడదని నిర్ణయానికి వచ్చాను. అందువల్ల పాలు త్రాగడం మానివేశాను”. “అయితే మేకపాలు తీసుకోవచ్చు గదా!” అని నా మంచం దగ్గరే నిలబడి వున్న కస్తూరిబాయి అన్నది. “మీరు మేకపాలు పుచ్చుకున్నా చాలు” అని అన్నాడు డాక్టరు. నేను ఓడిపోయాను. సత్యాగ్రహ సంగ్రామపు మోహం జీవించాలనే లోభాన్ని కలిగించిందన్న మాట. ప్రతిజ్ఞను అక్షరశః పాటిస్తున్నానని సంతోషపడి దాని ఆత్మకు హాని కలిగించాను. పాలు త్రాగను అని ప్రతిజ్ఞ చేసినప్పుడు నాదృష్టిలో వున్నది ఆవులు గేదెలు మాత్రమే. అయినా పాలు అంటే అన్నిరకాల పాలు అని అర్థం కదా! జంతువుల పాలు ఆహారంగా తీసుకోకూడదు అని నేను భావించాను గనుక ఏవిధమైన పాలు నేను పుచ్చుకోకూడదు కదా! యీ విషయం తెలిసి కూడా నేను మేకపాలు పుచ్చుకునేందుకు సిద్ధపడ్డాను. సత్యాన్ని పూజించే వ్యక్తి సత్యాగ్రహ సంగ్రామం జరపడం కోసం జీవించాలనే కాంక్షతో అసలు సత్యాన్ని అణచివేసి దానికి మచ్చ తెచ్చాడన్న మాట.

నేను చేసిన యీ పని నాకు బాధ కలిగించింది. ఆ బాధ ఆ గాయం యింకా మానలేదు. మేకపాలు మానివేయాలి అను యోచన నాకు కలుగలేదు. మేకపాలు రోజూ త్రాగుతూ వున్నప్పుడు లోలోన బాధపడసాగాను. అయితే సేవ చేయాలనే అతిసూక్ష్మమైన మోహం నన్ను పట్టుకున్నది. అది నన్ను వదలలేదు. అహింసా దృష్టితో ఆహార ప్రయాగాలు చేయడం నాకు యిష్టం. అందువల్ల నా మనస్సుకు ఆహ్లాదం చేకూరుతుంది. కాని మేకపాలు తాగడం మాత్రం సత్యశోధన దృష్ట్యా నాకు యిష్టంలేదు. అహింస కంటే కూడా సత్యాన్ని ఎక్కువగా తెలుసుకోగలిగానని నా భావం. సత్యాన్ని త్యజిస్తే అహింస ద్వారా సమస్యల్ని పరిష్కరించలేనని నా విశ్వాసం. సత్య పాలన అంటే మాటను పాటించడం. శరీరం, ఆత్మ రెండిటిని రక్షించడం. శబ్దార్ధం మరియు భావార్ధం రెండిటినీ దెబ్బ తీశానన్నమాట. ప్రతి క్షణం యీ బాధ నన్ను బాధిస్తూనే వుంది. విషయాలు అన్నీ తెలిసినప్పటికీ అసలు విషయం నేను పూర్తిగా తెలుసుకోలేదన్నమాట లేక దాన్ని పాటించే ధైర్యం నాకు చాలలేదని కూడా చెప్పవచ్చు. “ఓ భగవంతుడా! నాకు అట్టి ధైర్యం ప్రసాదించు!” మేకపాలు తాగడం ప్రారంభించిన కొద్ది రోజుల తరువాత డా. దలాల్ మలద్వారం దగ్గర పడ్డ గాట్లకు శస్త్రచికిత్స చేశారు. దానితో గాట్లు సర్దుకున్నాయి. ఇప్పుడు లేవగలననే ఆశ కలిగింది. పత్రికలు చదవడం ప్రారంభించాను. ఇంతలో రౌలట్ కమిటీ రిపోర్టు నా చేతికి అందింది. అందు పేర్కొన్న సిఫారసులను చదివి నివ్వెరబోయాను. ఉమర్‌భాయి (సుభానీ), శంకరలాల్ యీ విషయమై గట్టి చర్య తీసుకోవాలని అన్నారు. ఒక నెల రోజులు గడిచిన తరువాత నేను అహమదాబాదు వెళ్లాను. వల్లభభాయి ప్రతి రోజు నన్ను చూచేందుకు వస్తూ వుండేవారు. వారితో మాట్లాడి దీన్ని గురించి ఏమైనా చేయాలి అని అన్నాను. “ఏం చేయాలి?” అని ప్రశ్నించారు వల్లభభాయి. కమిటీ చేసిన సిఫారసుల ప్రకారం చట్టం చేయబడితే వెంటనే సత్యాగ్రహం ప్రారంభించాలి. అలా చేస్తామని ప్రతిజ్ఞ గైకొనేవారు కొందరైనా అవసరం అని చెప్పాను. నేను మంచం పట్టి వుండకపోతే ఒంటరిగానే పోరాటానికి దిగేవాణ్ణి. తరువాత కొంతమంది అయినా పోరాటంలో చేరేవారు. శరీర దారుఢ్యత లేనందువలన ఒంటరిగా పోరాటానికి దిగగల శక్తి నాకు లేదు అని చెప్పాను.

ఈ సంభాషణ జరిగిన తరువాత నాతో బాటు పని చేస్తూ వున్న వారి సమావేశం ఒకటి ఏర్పాటు చేశాను. రౌలట్ కమిటీ చేసిన సిఫారసులు, వాటికి సంబంధించిన చట్టాలు అన్నీ అనవసరం అని నాకు తోచింది. అభిమానం గల ఏ దేశమూ యిట్టి చట్టాల్ని అంగీకరించదని స్పష్టంగా తేలిపోయింది. సమావేశం జరిగింది. 20 మంది మాత్రమే ఆహ్వానించబడ్డారు, వల్లభభాయి గాక శ్రీమతి సరోజినీ నాయుడు, హార్నిమెన్, కీ.శే ఉమర్ సుభాని, శంకర్ లాల్ బాంకరు, అనసూయా బెన్ వారిలో వున్నారని నాకు బాగా గుర్తు. ప్రతిజ్ఞాపత్రం తయారుచేయబడింది. అక్కడ వున్నవారంతా దాని మీద సంతకాలు చేశారని నాకు జ్ఞాపకం. అప్పటికి నేను పత్రికా ప్రచురణ ప్రారంభించలేదు. కాని పత్రికలకు వ్యాసాలు వ్రాస్తూవుండేవాణ్ణి. శంకర్ లాల్ బాంకరు ఉద్యమం ప్రారంభించాడు. ఆయన శక్తి సామర్థ్యాలు అప్పుడు నాకు బాగా బోధపడ్డాయి. సత్యాగ్రహాన్ని మించిన మరో క్రొత్త ఆయుధ ప్రయోగం ఎవరైనా ప్రారంభిస్తారనే నమ్మకం నాకు కలగలేదు. అందువల్ల సత్యాగ్రహ సభ ఏర్పాటు చేయబడింది. ముఖ్యమైన పేర్ల పట్టిక బొంబాయిలోనే తయారైంది. అందుకు కేంద్రం బొంబాయి నగరమే. ప్రతిజ్ఞాపత్రం మీద ఎక్కువమంది సంతకాలు చేయసాగారు. ఖేడా సంగ్రామంలో వలె యిక్కడ కూడా కరపత్రాలు వెలువడ్డాయి. అనేక చోట్ల సభలు జరిగాయి. ఆ సంస్థకు నేనే అధ్యక్షుణ్ణి. చదువుకున్న వర్గం వారికి, నాకు అంతగా పొసగదని తేల్చుకున్నాను. కరపత్రాల్లో గుజరాతీ భాషనే వాడాలని చెప్పాను. యిలాంటివే మరికొన్ని విషయాలు వాళ్లను గొడవలో పడవేశాయి. అయినా చాలామంది నా పద్ధతి ప్రకారం నడిచేందుకు సిద్ధపడి తమ ఉదారబుద్ధిని చాటుకున్నారు. అయితే యీ సభ ఎక్కువ రోజులు నడవదని ప్రారంభంలోనే గ్రహించాను. పని మాత్రం బాగా పెరిగిపోయింది. 

30. అద్భుతమైన దృశ్యం

రౌలట్ కమిటీ రిపోర్టుకు వ్యతిరేకంగా ఒకవైపున ఉద్యమం సాగుతూ వుంటే మరోవైపున ప్రభుత్వం ఆ రిపోర్టును అమలుపరిచి తీరాలనే నిర్ణయానికి వచ్చింది. రౌలట్ బిల్లు వెలువడింది. నేను కౌన్సిలు మీటింగులో రౌలట్ బిల్లు మీద జరిగే చర్చ విందామని ఒకసారి వెళ్లాను. శాస్త్రిగారి ఉపన్యాసం మహావేడిగా సాగుతున్నది. ఆయన గవర్నమెంటును గట్టిగా హెచ్చరిస్తున్నారు. శాస్త్రిగారి మాటలు జోరుగా సాగుతూ వుంటే వైస్రాయి ఆయన ముఖం వంక శ్రద్ధగా చూస్తూ వున్నాడు. శాస్త్రి గారి మాటల ప్రభావం ఆయన మీద బాగా పడివుంటుందని అనుకున్నాను. శాస్త్రి గారి భావావేశం బాగా పొంగిపొర్లుతూ వుంది.

నిద్రపోతున్నవాణ్ణి మేల్కొల్పవచ్చు. కాని మేల్కొనివుండి నిద్రపోతున్నట్లు నటించేవాడి చెవి దగ్గర శంఖం ఊదినా ప్రయోజనం ఏముంటుంది? కౌన్సిల్లో బిల్లుల మీద చర్చ జరిగినట్లు పెద్ద నాటకం ఆడాలికదా! ప్రభుత్వం ఆ పని చేసింది. అయితే తను అనుకున్నట్లే చేయడానికి ప్రభుత్వం పూనుకున్నది. అందువల్ల శాస్త్రిగారిది అంతా కంఠశోష అని తేలిపోయింది. ఇక ఆ సందట్లో నామాట వినేవాడెవరు? వైస్రాయిని కలిసి అనేక విధాల చెప్పాను. జాబులు వ్రాశాను. బహిరంగ లేఖలు కూడా వ్రాశాను. సత్యాగ్రహం తప్ప గత్యంతరం లేదని కూడా ప్రకటించాను. అంతా అడవిలో గాచిన వెన్నెల చందాన అయిపోయింది.

ఇంకా బిల్లు గెజట్లో ప్రకటించబడలేదు. నా శరీరం బలహీనంగావుంది. అయినా పెద్ద పోరాటానికి నడుం బిగించాను. పెద్ద ప్రసంగాలు చేసే శక్తి ఇంకా నాకు చేకూరలేదు. నిలబడి మాట్లాడగల శక్తి ఎప్పుడో పోయింది. ఆ శక్తి ఇక యీనాటివరకు నాకు చేకూరలేదు. నిలబడి కొద్ది సేపు మాట్లాడితే శరీరం వణికిపోవడం, గుండెలో నొప్పి యిదీ వరస. అయితే మద్రాసు నుండి అందిన ఆహ్వానం అంగీకరించాలని భావించాను. దక్షిణాది ప్రాంతాలు నా స్వగృహాలు అని అనిపించేవి. దక్షిణాఫ్రికాలో ఏర్పడ్డ సంబంధం వల్ల తెలుగు, తమిళం భాషల వారిమీద నాకు హక్కు వున్నట్లు భావించేవాణ్ణి. ఆవిధంగా భావించడంలో పొరబడలేదనే విశ్వాసం ఇప్పటికీ నాకు వున్నది. కీ.శే. కస్తూరీ రంగస్వామి అయ్యంగారి ఆహ్వానం నాకు అందింది. ఆ ఆహ్వానం వెనుక శ్రీ రాజగోపాలాచార్యులు వున్నారు. ఆ విషయం మద్రాసు చేరిన తరువాత నాకు తెలిసింది. శ్రీ రాజగోపాలాచార్యులతో ఇది నాకు ప్రథమ పరిచయమని చెప్పవచ్చు. వారి రూపాన్ని మొదటిసారి చూచాను. ప్రజా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనాలనే ఉద్దేశ్యంతో కస్తూరి రంగస్వామి అయ్యంగారి వంటి మిత్రుల ప్రోత్సాహంతో సేలం వదిలి పెట్టి మద్రాసులో వకీలు వృత్తి, ఆచార్యులు ప్రారంభించబోతున్నారని తెలిసింది. వారింటి దగ్గరే నాకు మకాం ఏర్పాటుచేశారు. అయితే యీ విషయం నాకు రెండు రోజుల తరువాత తెలిసింది. కస్తూరి అయ్యంగారి బంగళాలో నేను అతిథిగా వున్నానని అనుకున్నాను. మహాదేవదేశాయి నా పొరపాటును సరిచేశారు. రాజగోపాలచారి మా ఎదుట పడకుండా తప్పుకు తిరుగుతూ వున్నాడు. అయితే మహాదేవ్ ఆయనను పసిగట్టి “మీరు రాజగోపాలాచారితో పరిచయం చేసుకోవాలి” అని నాకు చెప్పాడు.

నేను పరిచయం చేసుకున్నాను. రోజూ యుద్ధ ప్రణాళికను గూర్చి సలహా సంప్రదింపులు జరుపవలసిన అవసరం ఏర్పడింది. సభలు తప్ప నాకు మరేమీ తోచడం లేదు. రౌలట్ బిల్లు చట్టరూపం దాలిస్తే దాన్ని సవినయంతో ఎలా ఎదుర్కొనడం? అట్టి అవకాశం ప్రభుత్వం కల్పిస్తేనే గదా? ఆ చట్టాన్ని సవినయంగా వ్యతిరేకిస్తే దానికి గల హద్దు ఏమిటి? ఈ విషయాలపై మా మధ్య చర్చ జరుగుతూ వుండేది. శ్రీ కస్తూరి రంగస్వామి అయ్యంగారు కొద్దిమంది నాయకుల్ని పిలిచి సమావేశం ఏర్పాటుచేశారు. ఆ సమావేశంలో బాగా చర్చ జరిగింది. ఆ చర్చలో శ్రీ విజయ రాఘవాచార్యులు పాల్గొన్నారు. ఆయన సూక్ష్మంగా కొన్ని సూచనలు చేసి సత్యాగ్రహం మీద పుస్తకం వ్రాయమని సలహా యిచ్చారు. అది నా శక్తికి మించినపని అని చెప్పాను.

ఇంకా ఒక నిర్ణయానికి మేము రాలేదు. పొయ్యి మీద పులగం వుడుకుతూ వుంది. ఇంతలో బిల్లు చట్టం రూపంలో గెజెట్‌లో ప్రకటించబడిందను వార్త మాకు అందింది. ఈ వార్త అందిననాటి రాత్రి ఏం చేయాలి అని తీవ్రంగా ఆలోచిస్తూ నిద్రపోయాను. ప్రాతఃకాలం మెళుకువ వచ్చింది. అర్ధ నిద్రావస్థలో ఒక స్వప్నం వచ్చింది. అందు ఒక సలహా వినబడింది. ఈ చట్టానికి వ్యతిరేకంగా దేశమందంతటా హర్తాలు జరపమని ప్రకటన చెయ్యాలి. సత్యాగ్రహం ఆత్మశుద్ధికి సంబంధించిన యుద్ధం. అది ధార్మిక యుద్ధం, ధర్మకార్యం. శుద్ధిగా ప్రారంభించాలి. అందువల్ల ఆ రోజున ఉపవాసం చేయాలి. పనులేవీ చేయకూడదు. ముస్లిం సోదరులు రోజూ ఉపవాసం చేస్తారు గనుక 24 గంటలపాటు అంతా ఉపవాసం చేయాలి. అన్ని ప్రాంతాలవారు చేరుతారో లేదో తెలియదు. కనుక ముందుగా బొంబాయి, మద్రాసు, బీహారు, సింధ్‌లో జరపాలి. యీ ప్రాంతాల్లో సరిగా హర్తాళ్ జరిగితే దానితో తృప్తిపడాలి’ యిదీ స్వప్నంలో నాకు వినబడిన సలహా.

ఈ సలహా రాజగోపాలచార్యులకు బాగా నచ్చింది. తరువాత యితర మిత్రులకు తెలియజేశాం. అందరూ హర్షం ప్రకటించారు. ఒక చిన్న నోటీసు తయారుచేశాను. ప్రారంభంలో ది. 30 మార్చి 1919 నాడు హర్తాళ్ జరపాలని నిర్ణయించారు. తరువాత అది ఏప్రిల్ 6వ తేదీకి మారింది. ప్రజలకు కొద్దిరోజుల ముందే యీ సమాచారం అందజేయబడింది. పని వెంటనే ప్రారంభించాలని నిర్ణయించాము. వ్యవధి ఎక్కువగా లేదు.

ఆశ్చర్యం! ఎలా జరిగాయో ఏమో ఏర్పాట్లు పకడ్బందీగా జరిగాయి. హిందూ దేశమంతట పట్టణాల్లో, పల్లెటూళ్లలో జయప్రదంగా హర్తాళ్ జరిగింది. అద్భుతమైన దృశ్యం అది. 

31. ఆ వారం -1

దక్షిణాదిన కొద్దిగా పర్యటించి ఏప్రిల్ 4వ తేదీ నాటికి బొంబాయి చేరాను. శంకర్‌లాల్ బాంకరు ఏప్రిల్ 6వతేదీ నాడు హర్తాళ్ జరిపేందుకై బొంబాయిరమ్మని తంతి పంపాడు. మార్చి 30వతేదీన ఢిల్లీలో హర్తాళ్ జరిగింది. కీ.శే. శ్రద్ధానందగారు, డా. హకీమ్ అజమల్ ఖాన్ సాహెబ్ అందుకు పూనుకున్నారు. ఏప్రిల్ 6వ తేదీన హర్తాళ్ జరపాలనే వార్త ఢిల్లీకి ఆలస్యంగా చేరింది. ఢిల్లీలో 30వ తేదీన జరిగిన హర్తాళ్ ఎంతో బాగా జరిగింది. హిందువులు, మహమ్మదీయులు కలిసి హృదయపూర్తిగా చేసిన హర్తాళ్ అది. ముస్లిములు శ్రద్ధానంద్ గారిని జామా మసీదుకు ఆహ్వానించడమే కాక అక్కడ వారిచే ఉపన్యాసం కూడా చేయించారు. ప్రభుత్వాధికారులు యీ వ్యవహారాన్ని సహించలేకపోయారు. రైలు స్టేషను వైపు ఊరేగింపుగా వెళుతున్న జనాన్ని పోలీసులు ఆపి వారిని తుపాకీ గుండ్లకు గురిచేశారు. కొంతమంది చనిపోయారు. చాలామంది గాయపడ్డారు. అధికార్లు అణచివేత చర్యకు పూనుకున్నారు. శ్రద్ధానందగారు నన్ను వెంటనే డిల్లీ రమ్మని తంతి పంపారు. ఏప్రిల్ 6వ తేదీన బొంబాయిలో వుండి వెంటనే ఢిల్లీ వస్తానని శ్రద్ధానందగారికి తంతి ద్వారా తెలియజేశాను ఢిల్లీలో జరిగినట్లుగానే లాహోరు, అమృతసర్‌లో కూడా హర్తాళ్ జరిగింది. వెంటనే అమృతసర్ రమ్మని డా. సత్యపాల్ మరియు కిచలూగారల తంతి అందింది. యీ యిద్దరు సోదరుల్ని నేను బొత్తిగా ఎరుగను. ముందు ఢిల్లీ వెళ్లి తరువాత అమృతసర్ వస్తానని వారికి తెలియజేశాను. బొంబాయిలో ఆరవ తేదీ ఉదయం వేలాదిమంది జనం చౌపాటీ దగ్గర స్నానం చేసి దేవాలయానికి వెళ్ళేందుకు ఊరేగింపుగా బయలుదేరారు. ఊరేగింపులో స్త్రీలు, పిల్లలు కూడా వున్నారు. ముస్లిములు కూడా పెద్ద సంఖ్యలో అందు పాల్గొన్నారు. వారు త్రోవలో మమ్మల్ని మసీదుకు తీసుకువెళ్లారు. అక్కడ సరోజినీదేవిని మరియు నన్ను ఉపన్యాసం యిమ్మని కోరారు. మేము ఉపన్యాసాలు యిచ్చాము. శ్రీ విఠల్ దాస్ జెరాజాణి స్వదేశీ మరియు హిందూ ముస్లిం సమైక్యతకు సంబంధించిన ప్రతిజ్ఞ చేయిద్దామని సూచించాడు. తొందరపాటుగా ప్రతిజ్ఞ చేయించడానికి నేను యిష్టపడలేదు. జరిగినదానితో తృప్తిపడమని సలహా యిచ్చాను. ప్రతిజ్ఞ చేసిన తరువాత ఉల్లంఘించకూడదు కదా! స్వదేశీ అంటే అర్థం ఏమిటో తెలుసుకోవాలని, హిందూ ముస్లిం సమైక్యతకు సంబంధించిన ప్రతిజ్ఞను అర్ధం చేసుకోవాలని చెప్పి యిట్టి ప్రతిజ్ఞ చేయదలచినవారు రేపు ఉదయం చౌపాటి దగ్గరకు రమ్మని చెప్పారు.

బొంబాయిలో పూర్తిగా హర్తాళ్ జరిగింది. అక్కడ చట్టాల్ని ఉల్లంఘించే కార్యక్రమం నిర్ణయించబడింది. రద్దు చేయడానికి అనుకూలమైన చట్టాలను, ప్రతివారు తేలికగా ఉల్లంఘించుటకు వీలైన చట్టాలను ఉల్లంఘించాలని నిర్ణయం చేశాము. ఉప్పు పన్ను ఎవ్వరికీ ఇష్టం లేదని తేలింది. దాన్ని రద్దుచేయాలని ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీమీ ఇండ్లలో ఉప్పు తయారుచేసి తీసుకురమ్మని చెప్పాను. ప్రభుత్వం నిషేధించిన పుస్తకాల్ని అమ్మాలని చెప్పాను. అట్టి పుస్తకాలు నావే రెండు వున్నాయి (1) హింద్ స్వరాజ్ (2) సర్వోదయ్. యీ పుస్తకాలను అచ్చు వేయడం తేలిక. ఆ విధంగా చట్టాన్ని ఉల్లంఘించవచ్చు. వెంటనే ఆ పుస్తకాలు అచ్చువేయాలని మరునాడు సాయంత్రం చౌపాటీలో జరిగిన సభలో వాటి అమ్మకం జోరుగా జరపాలని నిర్ణయం గైకొన్నాం. ఒక కారులో నేను, మరో కారులో సరోజినీ నాయుడు బయలుదేరాం. ముద్రించబడిన పుస్తక ప్రతులన్నీ అమ్ముడుబోయాయి. వచ్చిన సొమ్మంతా యుద్ధ కార్యక్రమం నిమిత్తం ఖర్చు చేయాలని నిర్ణయం గైకొన్నాం. పుస్తకం ధర నాలుగు అణాలు, అయితే నా చేతికి, సరోజినీ దేవి చేతికి మూల్యం మాత్రమేగాక తమ జేబులో వున్న సొమ్మంతా యిచ్చి చాలామంది పుస్తకాలు కొన్నారు. కొందరు అయిదు, పది రూపాయల నోట్లు కూడా యిచ్చారు. ఒక ప్రతికి 50 రూపాయలు ఒకరు యిచ్చినట్లు నాకు గుర్తు. యీ పుస్తకాలు కొన్న వారికి కూడా జైలు శిక్ష పడవచ్చునని ముందుగానే జనానికి చెప్పాం. కాని ఆ క్షణంలో జైలు భయం జనానికి పోయిందని చెప్పవచ్చు. అయితే ఏ పుస్తకాల్ని ముద్రించి మేము అమ్మకం చేశామో వాటికి నిషేధం లేదని ప్రభుత్వం భావించిందని ఏడవ తేదీన తెలిసింది. అమ్మకం జరిగిన పుస్తకాలు పునర్ముద్రణ పొందినట్టివి. నిషేధం ప్రథమ ముద్రణ వరకే నీమితం. కనుక పుస్తకాల అమ్మకం చట్టవిరుద్ధం కాదని ప్రభుత్వం భావించిందట. యీ వార్త తెలిసినప్పుడు జనం కొద్దిగా నిరుత్సాహపడ్డారు.

ఏడవ తేదీన స్వదేశీ వ్రతం పట్టేందుకు హిందూ ముస్లిం సమైక్యత కోసం ప్రతిజ్ఞ చేసేందుకు చౌపాటీ దగ్గర సభ జరగాల్సి వున్నది. తెల్లగా కనబడేవన్నీ పాలు కాజాలవని తెలిసింది. అక్కడికి బహు కొద్దిమంది మాత్రమే వచ్చారు. వారిలో ఇద్దరు ముగ్గురు మహిళల పేర్లు నాకు గుర్తు వున్నాయి. పురుషులు కూడా బహు కొద్దిమందే వచ్చారు. నేను వ్రతాన్ని గురించిన ముసాయిదా తయారుచేసి వుంచాను. సభలో పాల్గొన్న వారందరికి వివరించి చెప్పి వ్రతాన్ని గురించిన శపథం చేయించాను. కొద్దిమంది మాత్రమే హాజరవడం వల్ల నాకు ఆశ్చర్యంగాని, విచారంగాని కలగలేదు. తుఫానుల వంటి కార్యాలకు, నిర్మాణాత్మక కార్యాలకు గల తేడా నాకు తెలుసు. తుఫాను కార్యాలంటే సహజంగా జనానికి పక్షపాతం వుంటుంది. నెమ్మదిగా సాగే నిర్మాణ కార్యక్రమాలంటే అభిరుచి వుండదు. దీన్ని గురించి వ్రాయాలంటే మరో ప్రకరణం అవసరం.

9వ తేదీ రాత్రి ఢిల్లీ అమృత్‌సర్‌లకు బయలుదేరాను. ఎనిమిదవ తేదీన మధుర చేరాను. నన్ను అరెస్టు చేయవచ్చునను వార్త నా చెవినపడింది. మధుర తరువాత ఒక స్టేషను దగ్గర రైలు ఆగుతుంది. అక్కడ ఆచార్య గిద్వానీ వచ్చి కలిశారు. నన్ను అరెస్టు చేయబోతున్నారని ఆయన నన్ముకంగా చెప్పాడు. నా సేవలు అవసరమైతే చెప్పండి, సిద్ధంగా వున్నానని అన్నాడు. ధన్యవాదాలు చెప్పి అవసరమైతే మీ సేవల్ని ఉపయోగించుకుంటానని చెప్పాను.

రైలు పల్వల్ స్టేషనుకు చేరక పూర్వమే ఒక పోలీసు అధికారి నా చేతిలో ఒక ఆర్డరు పత్రం వుంచాడు. “మీరు పంజాబులో ప్రవేశిస్తే అశాంతి ప్రబలే ప్రమాదం వున్నది గనుక మీరు పంజాబు గడ్డమీద అడుగు పెట్టవద్దు.” అని ఆ పత్రంలో వున్నది. ఆ ఆర్డరు పత్రం యిచ్చి ఈ బండి దిగిపొమ్మని ఆ పోలీసు అధికారి ఆదేశించాడు. బండి దిగడానికి నేను అంగీకరించలేదు. “అశాంతి పెంచేందుకు గాక అశాంతిని తగ్గించేందుకై వెళ్లదలిచాను. అందువల్ల యీ ఆదేశాన్ని పాటించలేనని తెలుపుటకు విచారిస్తున్నాను” అని చెప్పివేశాను. పల్వల్‌స్టేషను వచ్చింది. మహాదేవ్ నాతోబాటు వున్నాడు. ఢిల్లీ వెళ్లి శ్రద్ధానంద గారికి యీ విషయంచెప్పి, జనాన్ని శాంతంగా వుండేలా చూడమని మహాదేవ్‌కి చెప్పాను. గవర్నమెంటు ఆర్డరును పాటించకుండా అరెస్టు కావడమే మంచిదని భావించానని, నన్ను అరెస్టు చేశాక కూడా ప్రజలు శాంతంగా వున్నారంటే అది మనకు విజయమని భావించాలని కూడా చెప్పమన్నాను.

పల్వల్ స్టేషనులో దింపివేసి పోలీసులు నన్ను తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఢిల్లీ నుండి వస్తున్న ఏదో రైల్లో మూడోతరగతి పెట్టె ఎక్కించారు. పోలీసుల బృందం నా వెంట వున్నది. మధుర చేరిన తరువాత నన్ను పోలీసుల బారెక్‌కు తీసుకువెళ్లారు. నన్ను ఎక్కడికి తీసుకువెళతారో ఏ అధికారి చెప్పలేకపోయాడు. ప్రాతఃకాలం నాలుగు గంటలకు నన్ను మేల్కొలిపి బొంబాయికి వెళ్లే ఒక గూడ్సు బండిలో కూర్చోబెట్టారు. మధ్యాహ్నం బండి సవాయి మాదోపూర్ చేరింది. అక్కడ నన్ను దింపివేశారు. బొంబాయి వెళ్లే బండిలో ఎక్కించారు. లాహోర్ నుండి వచ్చిన ఇన్స్‌పెక్టర్ బోరింగ్ అక్కడ నా బాధ్యత వహించాడు. ఫస్ట్‌క్లాస్ పెట్టెలో నన్ను కూర్చోబెట్టారు. నా వెంట బోరింగ్ దొర కూర్చున్నాడు. యిక నేను జెంటిల్‌మెన్ ఖైదీగా మారిపోయానన్నమాట. సర్ మైకాల్ ఓడయరును గురించి తెల్లదొర వచ్చి ప్రారంభించాడు. మాకు మీరంటే వ్యతిరేకత లేదు, కాని పంజాబులో మీరు అడుగు పెడితే అక్కడ అశాంతి ప్రబలుతుంది గనుక అక్కడికి వెళ్లవద్దని, తిరిగి వెళ్లిపొమ్మని నాకు చెప్పాడు. “నేను ఆ విధంగా వెళ్లనని, మీ ఆదేశాన్ని పాటించనని” చెప్పాను. అయితే చట్టరీత్యా చర్య తీసుకుంటామని అన్నాడు. ఏం చేయదలచుకున్నారో చెప్పమని దొరను అడిగాను. నాకేమీ తెలియదని, మిమ్మల్నిబొంబాయి తీసుకు వెళుతున్నానని, మరో ఆదేశం కోసం ఎదురుచూస్తున్నానని అతడు అన్నాడు.

సూరత్ చేరాం. మరో అధికారి వచ్చాడు. నా బాధ్యతను తాను స్వీకరించాడు. బండి బయలుదేరింది. మిమ్మల్ని విడుదల చేశారు. మీ కోసం మెరీన్‌లైన్సు స్టేషనులో బండి ఆపిస్తాను. మీరు ఇక్కడ దిగిపోతే మంచిది. కొలాబా స్టేషనులో జనం విపరీతంగా వుంటారని భావిస్తున్నాను అని అన్నాడు. మీరు చెప్పిన ప్రకారం చేయడం నాకు సంతోషదాయకం అని అన్నాను. అతడు ఆనందించి ధన్యవాదాలు తెలిపాడు. నేను మెరీన్‌లైన్సులో బండి దిగిపోయాను. ఎవరో పరిచితుడి గుర్రం బండి కనబడింది. అతడు నన్ను రేవాశంకర్ ఝుబేరీగారి ఇంటి దగ్గర దింపివెళ్లాడు. “మిమ్మల్ని అరెస్టు చేశారని తెలిసి జనంకోపంతో పేట్రేగిపోయారు. వాళ్లకు పిచ్చి ఎక్కినంత పని అయింది. పాయధునీ దగ్గర కొట్లాట జరిగేలా వుంది. మేజిస్ట్రేటు, పోలీసులు అక్కడికి హుటాహుటిన వెళ్లారు” అని నాకు చెప్పాడు. నేను ఇంటికి చేరానో లేదో యింతలో ఉమర్ సుభానీ, అనసూయాబెన్ కారులో వచ్చి నన్ను పాయుధునీకి బయలుదేరమని అన్నారు. “ప్రజలు కోపంతో వున్నారు. వాతావరణం ఉద్రిక్తంగా వుంది. జనం ఎవ్వరు చెప్పినా వినే స్థితిలో లేరు. మిమ్మల్ని చూస్తే శాంతించవచ్చు” అని అన్నారు. నేను కారులో కూర్చున్నాను. పాయధునీ చేరాను. అక్కడ అంతా గందరగోళంగా వున్నది. నన్ను చూడగానే జనం సంతోషంతో ఊగిపోయారు. జనం పెద్ద ఊరేగింపు తీశారు. వందేమాతరం, అల్లా హో అక్బర్ అను నినాదాలతో ఆకాశం మార్మోగింది. పాయధునీ దగ్గర పోలీసులు గుర్రాల మీద ఎక్కి కనబడ్డారు. ఇటుక రాళ్ల వర్షం కురుస్తూ వున్నది. శాంతంగా వుండమని చేతులు జోడించి జనాన్ని ప్రార్థించాను. ఇటుకలు, రాళ్లు మాకు తప్పవని అనిపించింది.

ఊరేగింపు అబ్దుల్ రహమాన్ వీధి నుండి క్రాఫర్జ్ మార్కెట్టు వైపుకు మళ్లింది. ఇంతలో ఎదురూగా గుర్రపు రౌతుల పటాలం వచ్చి నిలబడింది. ఫోర్టువైపు వెళ్లకుండా ఊరేగింపును ఆపేందుకు రౌతులు ప్రయత్నించసాగారు. క్రిక్కిరిసి వున్న జనం ఆగుతారా? పోలీసు లైనును దాటి జనం ముందుకు దూసుకు వెళ్ళారు. నా మాటలు ఎవ్వరికీ వినబడలేదు. వెంటనే గుర్రపు రౌతుల దళాధికారి జనాన్ని చెదరగొట్టమని ఆర్డరు యిచ్చాడు. తళతళలాడే బల్లాలను త్రిప్పుతూ గుర్రపు రౌతులు హఠాత్తుగా జనం మీదకి గుర్రాల్ని తోలారు. నా ప్రక్కగా బల్లాలు బహువేగంగా తళ తళ మెరుస్తూ ముందుకు సాగుతూ వున్నాయి. జనం చెదిరిపోయారు. అక్కడ గుర్రాలు పరిగెత్తేందుకైనా చోటు లేదు. ఎటు పోదామన్నా త్రోవలేదు. దృశ్యం కడు భయానకంగా వుంది. అటు గుర్రపు రౌతులు, ఇటు జనం. యిద్దరికీ పిచ్చి ఎక్కినట్లున్నది. గుర్రాలకు ఏమీ కనబడటం లేదు. ఎటుబడితే అటు, ఎలా బడితే అలా దౌడు తీస్తున్నాయి. వేలాది జనాన్ని చెల్లాచెదురు చేయాలి. గుర్రపు రౌతులకు ఏమీ కనబడటం లేదని బోధపడుతూవుంది. మొత్తం మీద జనాన్ని చెల్లాచెదురు చేసి వాళ్లను ముందుకు సాగకుండా చేశారు. మా కారును మాత్రం ముందుకు పోనిచ్చారు. పోలీసు కమీషనరు ఆఫీసు ముందు కారు ఆపించాను. పోలీసులు వ్యవహరించిన తీరుపై అసమ్మతి తెలుపుదామని కారు దిగాను.

32. ఆ వారం - 2

కమీషనరు గ్రిఫిత్ గారి ఆఫీసులోకి వెళ్లాను. మెట్ల దగ్గర తుపాకులు పుచ్చుకొని సిద్ధంగా వున్న సైనికులు కనబడ్డారు. వారంతా యుద్ధానికి సిద్ధంగా వున్నట్లు బోధపడింది. వరండాలో కూడా గందరగోళంగా వున్నది. నేను కబురు పంపి ఆఫీసులోకి ప్రవేశించాను. అక్కడ కమీషనరు దగ్గర మి. బోరింగు కూర్చొని వున్నాడు. నేను చూచిన దృశ్యాన్ని కమీషనరుకు వివరించి చెప్పాను. “ఊరేగింపును ఫోర్టు వైపుకు వెళ్లకుండా ఆపడం నా లక్ష్యం. జనం అక్కడికి చేరితే ఉపద్రవం జరిగి తీరేది. ఎంత చెప్పినా జనం వినే స్థితిలో లేనందున వాళ్లను తొలగించి వేయమని ఆదేశించక తప్పలేదు” అని అతడు క్లుప్తంగా జవాబు యిచ్చాడు.

“ఫలితం మీకు తెలుసుకదా! గుర్రాల కాళ్ల క్రింద జనం నలిగిపోవడం తప్ప జరిగిందేమిటి? అసలు గుర్రపు రౌతుల్ని తీసుకురావడం అనవసరం కాదా!” అని నేను అన్నాను. “ఆ విషయం మాకు తెలియదు. మీ బోధలు జనం మీద ఎలా పనిచేశాయో, చేస్తున్నాయో మీకంటే పోలీసువాళ్లం మాకు బాగా తెలుసు. ముందే మేము జాగ్రత్త వహించకపోతే కీడు అధికంగా జరిగివుండేది. స్పష్టంగా చెబుతున్నాను. జనం మీ మాట వినే స్థితిలోలేరు. చట్టాన్ని వ్యతిరేకించటమంటే జనం ముందుకు ఉరుకుతారు. కాని శాంతంగా వుండమని చెబితే వాళ్ల బుర్రకు ఎక్కదు. మీ విధానం మంచిదే కాని దాన్ని సరిగా అర్ధం చేసుకునే వాళ్లేరీ? వాళ్ల ధోరణి వాళ్లదే!” అని అన్నాడు కమీషనరు. “మీకూ నాకూ మధ్య గల తేడా యిదే. ప్రజలు సహజంగా కొట్లాటలకు దిగరు. వాళ్లు శాంతిప్రియులు” అని అన్నాను. మా యిరువురికి మధ్య కొంత చర్చ జరిగిన తరువాత దొర “సరేనండి, మీ బోధన ప్రజలు అర్థం చేసుకోలేదని మీరు గ్రహించారనుకోండి. అప్పుడు మీరేం చేస్తారో చెప్పండి?” అని సూటిగా ప్రశ్నించాడు. “ఆ విషయం నాకు తెలిపిన మరుక్షణం ఉద్యమాన్ని ఆపివేస్తాను” అని అన్నాను. “ఆపివేయడనుంటే ఏమిటి? మిమ్మల్ని విడుదల చేసిన మరుక్షణం పంజాబు వెళతానని మీరు బోరింగుకు చెప్పలేదా?” “అవును చెప్పాను. ఈ రైలుకే వెళదామని భావించాను కూడా. కాని యివాళ వెళ్లలేను.” “కొంచెం ఓపికపడితే అన్ని విషయాలు మీకే తెలుస్తాయి. అహమదాబాదులో ఏం జరుగుతున్నదో, అమృతసర్‌లో ఏం జరిగిందో మీకు తెలుసా? జనం బాగా పెట్రేగిపోయారు. నాకూ యింకా పూర్తి సమాచారం అందలేదు. ఎన్నోచోట్ల తంతితీగలు తెగగొట్టారు. యీ రగడకంతటికీ పూర్తిగా మీదే బాధ్యత” “నా బాధ్యత ఎంతవరకో అంతవరకు వహించేందుకు నేను సిద్ధమే. అహమదాబాదులో జనం యిష్టం వచ్చినట్లు వ్యవహరించారు అంటే నాకు విచారం కలుగుతుంది. అమృతసర్‌ను గురించి నాకేమీ తెలియదు. అక్కడికి నేను ఎప్పుడూ వెళ్లలేదు. అక్కడ నన్ను ఎవ్వరూ ఎరుగరు. పంజాబు ప్రభుత్వం నన్ను ఆపి వుండకపోతే అక్కడ జనాన్ని శాంతింపచేసేందుకు గట్టి కృషి చేసి యుండేవాణ్ణి. నన్ను వెళ్ళకుండా ఆపి ప్రభుత్వమే జనాన్ని రెచ్చగొట్టింది” అని అన్నాను.

ఈ విధంగా మాటలు సాగుతూ వున్నాయి. మా ఇద్దరి అభిప్రాయాలు కలవడం లేదు. చౌపాటీ దగ్గర మీటింగు జరిపి ప్రజలకు శాంతంగా వుండమని చెబుతానని చెప్పి అక్కడినుండి వచ్చివేశాను.

చౌపాటీ దగ్గర సభ జరిగింది. ప్రజలకు శాంతిని గురించి, సత్యాగ్రహ ఆదర్శాల గురించి వివరించి చెప్పాను. “సత్యాగ్రహం అంటే సత్యపు క్రీడ. ప్రజలు శాతంగా వుండకపోతే నేను సత్యాగ్రహ పోరాటం జరపలేను” అని చెప్పాను. అహమదాబాదులో కూడా దొమ్మీ జరిగిందని అనసూయాబెన్‌కు సమాచారం అందింది. ఆమెను అరెస్టు చేశారని ఎవరో పుకారు లేవదీశారు. దానితో కార్మికులు పెట్రేగిపోయారు. వాళ్ళు హర్తాళ్‌తోబాటు ఉపద్రవానికి పూనుకున్నారు. ఒక సైనికుణ్ణి ఖూనీ చేశారు. నేను అహమదాబాదు వెళ్లాను. నడియాద్ దగ్గర రైలు పట్టాలు పీకివేసేందుకు ప్రయత్నించారని అక్కడ నాకు తెలిసింది. వీరంగావ్‌లో ఒక గవర్నమెంటు కార్యకర్తను చంపివేశారు. అహమదాబాదు చేరాను. అక్కడ మార్షల్ లా అమలు చేశారు. జనం జంకినట్లు కనబడింది. చేసిందానికి వడ్డీతో సహా జనానికి గవర్నమెంటు వారు సైన్య సాయంతో ముట్టచెబుతూ వున్నారన్నమాట. నన్ను స్టేషను నుండి కమీషనరు మిస్టర్ ప్రెట్ దగ్గరకి తీసుకుని వెళ్లేందుకు మనుష్యులు సిద్ధంగా వున్నారు. నేను వారి దగ్గరికి వెళ్లాను. ఆయన ఎంతో కోపంగా వున్నాడు. నేను ప్రశాంతంగా సమాధానాలిచ్చాను. జరిగిన హత్యలకు విచారం వ్యక్తం చేశాను. మార్షల్ లా అనవసరమని కూడా చెప్పాను. తిరిగి శాంతి నెలకొల్పేందుకు ఏం చేయమంటే అది చేస్తానని చెప్పాను. బహిరంగ సభ జరిపేందుకు అనుమతి కోరాను. ఆశ్రమ ప్రదేశంలో ఆ సభ జరుపుతానని చెప్పాను. నా అభిప్రాయం ఆయనకు నచ్చింది. ఏప్రిల్ 13వతేదీ ఆదివారం నాడు బహిరంగ సభ జరిపినట్లు నాకు గుర్తు. ఆ రోజునో లేక ఆ మరునాడో మార్షల్ లా ఎత్తివేశారు. సభలో ప్రసంగిస్తూ జనం చేసిన పొరపాటు ఏమిటో తెలియజేసేందుకు ప్రయత్నించాను. అందుకు ప్రాయశ్చింత్తంగా మూడు రోజులు ఉపవాసం చేయమని చెప్పాను. హత్యలు కావించి వారు తమ తప్పు అంగీకరించి ప్రభుత్వానికి లొంగిపొమ్మని సలహా యిచ్చాను. నా కర్తవ్యం ఏమిటో స్పష్టంగా బోధపడింది. ఏ కార్మికుల మధ్య అధిక సమయం గడిపానో, ఏ కార్మికులకు నేను సేవ చేశానో, ఏ కార్మికులు సత్కార్యాలు చేస్తారని నేను ఆశించానో ఆ కార్మికులే కొట్లాటలలో పాల్గొనడం సహించలేకపోయాను. వారు చేసిన అపరాధంలో నేను కూడా భాగస్వామినేనని భావించాను.

ప్రభుత్వానికి లొంగిపొమ్మని జనానికి సలహా యిచ్చినట్లే జనం చేసిన తప్పుల్ని క్షమించమని ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేశాను. కాని నా మాట యిరుపక్షాల వారిలో ఒక్క పక్షం వారు కూడా వినలేదు. ప్రజలు తమ తప్పును అంగీకరించలేదు. ప్రభుత్వం వారిని క్షమించేందుకు సిద్ధపడలేదు. కీ. శే రమణభాయి మొదలుగాగల పౌరులు వచ్చి సత్యాగ్రహం ఆపివేయమని నన్ను కోరారు. ఆ విధంగా నన్ను కోరవలసిన అవసరమే లేదు. శాంతిని గురించి తెలుసుకొని జనం ఆ విధంగా నడుచుకోనంత వరకు సత్యాగ్రహ సమరాన్ని నిలిపివేయాలని నేను అప్పటికే నిర్ణయానికి వచ్చివున్నాను. అందుకు వాళ్లంతా సంతోషించారు. కొంతమంది మిత్రులకు కోపం కూడా వచ్చింది. దేశమందంతట శాంతంగా సంగ్రామం సాగాలని అనుకుంటే అది సాధ్యం కాదని వారు భావించారు. నా అభిప్రాయం స్పష్టంగా చెప్పాను. ఏ ప్రజలకు నేను సేవ చేశానో ఆ ప్రజలు కూడా సత్యాగ్రహ సమరాన్ని గురించి, శాంతిని గురించి సరిగా గ్రహించకపోతే యి సత్యాగ్రహ పోరాటం జరపడం సాధ్యం కాదని చెప్పివేశాను. సత్యాగ్రహులు తమ హద్దు వుండి శాంతియుతంగా పోరాటం సాగించాలని అది నా నిశ్చితాభిప్రాయమని చెప్పాను. యీ నాటికీ నా అభిప్రాయం అదే. 

33. పర్వతమంత తప్పు

అహమదాబాదు సభ ముగించుకొని నేను నడియాద్ వెళ్లాను. పర్వతమంత తప్పు అని నేను అక్కడ అన్నమాట ఎంతో ప్రచారంలోకి వచ్చింది. అట్టి మాట అదివరకు నేను ఎప్పుడూ అనలేదు. అహమదాబాదులోనే నా తప్పు నాకు స్పష్టంగా కనబడింది. నడియాద్ వెళ్ళి అక్కడి పరిస్థితిని గురించి యోచించాను. ఖేడా జిల్లాకు చెందిన చాలామందిని అరెస్టు చేశారని విన్నాను. అక్కడి సభలో ప్రసంగిస్తూ ఖేడా జిల్లావాసులను, తదితరుల్ని సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొని చట్టాల్ని ధిక్కరించమని నేను కోరాను. ఆ కోరికలో తొందరపాటు కలదని నా మనస్సుకు తోచి పైమాట అనేశాను. ఆ తప్పు పర్వతమంతగా నాకు కనిపించింది. ఆ విషయం బహిరంగంగా ప్రకటించేసరికి నన్ను చాలామంది ఎగతాళి చేసారు. అయినా తప్పును ఒప్పుకున్నాను. కనుక నాకు పశ్చాత్తాపం కలుగలేదు. యితరులు చేసిన ఏనుగంత తప్పును ఆవగింజంత చిన్నదిగా చూడు. నీవు చేసిన తప్పును పర్వతమంతగా భావించు. అప్పుడే తప్పులెన్నువారు తమ తప్పులు తెలుసుకుంటారు. అను మాట చెల్లుబాటు అవుతుంది. ప్రతి సత్యాగ్రహి యీ లక్షణాన్ని అలవరచుకోవాలని నా అభిప్రాయం. అసలు నాకు పర్వతమంతగా కనిపించిన ఆ తప్పేమిటో కొద్దిగా చెబుతాను. చట్టాన్ని పూర్తిగా అమలుబరిచినట్టి వ్యక్తులు చట్టాన్ని సవినయంగా ఉల్లంఘించారు. భయం వల్లనే అలా చేస్తారని గ్రహించాలి. ఉల్లంఘించితే శిక్షపడుతుందనేదే ఆ భయం. నీతికి అవినీతికి సంబంధించని చట్టాల విషయంలోనే యిలా జరుగుతుంది. చట్టం వున్నా లేకపోయినా మంచివాడు ఎన్నడూ దొంగతనం చేయడు. కాని రాత్రిళ్ళు సైకిలు మీద వెళుతూ లైటు వెలుగుతున్నదా లేదా అని ఎవ్వడూ చూడడు. సామాన్యంగా చట్టవిరుద్ధమైన ఆ చర్యను గమనించడు. గమనించమని కోరినా మంచివాళ్లు కూడా అందుకు సిద్ధపడరు. కాని అలా చేస్తే శిక్ష పడుతుందని భయం కలిగినప్పుడు మాత్రం అతడు లైటు వెలిగించడానికి సిద్ధపడతాడు. యీ విధంగా జరిగే నియమపాలనను, స్వేచ్ఛగా జరిగే నియమపాలన అని అనడానికి వీలులేదు. నిజమైన సత్యాగ్రహి చట్టాల్ని స్వేచ్ఛగా పాటిస్తాడు. యీ విషయం తెలుసుకొని సమాజంలో చట్టాల్ని పాటించునట్టి వారే చట్టాల యొక్క నీతిని, అవినీతిని గురించి నిర్ణయించుటకు అర్హులు. అట్టివారికే చట్టాన్ని ఆయా పరిస్థితుల్లో, ఆయా పరిధికి లోబడి వ్యతిరేకించే అర్హత వుంటుంది. అట్టి అర్హత వున్నదా లేదా అని గమనించకుండా నేను చట్టాన్ని ఉల్లంఘించమని వారికి చెప్పాను. నాయీ తప్పు నాకు పర్వతమంతగా కనబడింది. ఖేడా జిల్లాలో ప్రవేశించిన తరువాత నాకు అక్కడి ఉద్యమం జ్ఞాపకం వచ్చింది. నేను బహిరంగంగా కనపడుతున్న ప్రమాదాన్ని గుర్తించలేదని నాకు బోధపడింది. సహాయ నిరాకరణోద్యమాన్ని కొనసాగించేందుకు ప్రజలు అర్హులు కావాలి. అందలి రహస్యాన్ని వారు గ్రహించాలి. తెలిసివుండి కూడా చట్టాల్ని రోజూ ఉల్లంఘించేవారు, రహస్యంగా చట్టాల్ని పలుసార్లు ఉల్లంఘించేవారు హఠాత్తుగా సహకార నిరాకరణం అంటే ఏమిటో ఎలా తెలుసుకోగలరు? దాని మర్యాదను ఎలా కాపాడగలరు?

వేలాది మంది, లక్షలాదిమంది జనం యిట్టి ఆదర్శస్థితిని పొందలేరని అంతా అంగీకరిస్తారు. కాని ఆ విధమైన శిక్షణ ఉద్యమం ప్రారంభించుటకు పూర్వం జనానికి గరపాలి. అట్టి శిక్షణ నొసంగగల నిష్ణాతులగు వాలంటీర్లను ముందు తయారుచేయాలి. వాళ్లకు సహకార నిరాకరణోద్యమం అంటే ఏమిటో బోధించాలి. అప్పుడే యీ ఉద్యమం విజయవంతం అవుతుంది. ఈ విధంగా యోచించి నేను బొంబాయి చేరుకొని సత్యాగ్రహ సంస్థ ద్వారా సత్యాగ్రహుల వాలంటీర్ల దళాన్ని ఏర్పాటు చేసి, సత్యాగ్రహ విధానాల్ని వారికి బోధపరిచి, అందుకు అవసరమైన కరపత్రాలు ప్రకటించే ఏర్పాటు చేశాను. ఈ పని ప్రారంభించానే గాని జనాన్ని ఆకర్షించలేకపోయాను. వాలంటీర్లు అధికంగా దొరకలేదు. చేరినవారైనా పూర్తిగా గ్రహించారా అంటే సమాధానం చెప్పడం కష్టమే. రోజులు గడిచిన కొద్దీ వాళ్లు కూడా జారుకోవడం ప్రారంభించారు. దానితో సహకార నిరాకరణోద్యమం బండి నేను అనుకొన్నట్లు వేగంగా నడవడం లేదని, నెమ్మదిగా నడుస్తున్నదని గ్రహించాను. 

34. నవజీవన్ మరియు యంగ్ ఇండియా

ఒకవైపున సహాయనిరాకరణోద్యమం (దాని నడక ఎంత సన్నగిల్లినా) నడుస్తూనే వున్నది. మరోవైపున ప్రభుత్వ పక్షాన ఆ ఉద్యమ అణచివేత కార్యక్రమం ముమ్మరంగా సాగుతున్నది. పంజాబులో ఈ దృశ్యం కనబడింది. అక్కడ మిలటరీ చట్టం అంటే నియంతృత్వం ప్రారంభమైంది. నాయకుల్ని నిర్భందించారు. ప్రత్యేకించిన న్యాయస్థానాలు, న్యాయస్థానాలుగా వుండక, గవర్నరు ఆర్డరును పాలించే సాధనాలుగా మారిపోయాయి. విచారణ అనేదే లేకుండా అందరికీ శిక్షలు విధించారు. నిరపరాధుల్ని పురుగుల్లా బోర్లా పడుకోబెట్టి పాకించారు. యీ దుర్మార్గం ముందు జలియన్‌వాలాబాగ్‌లో జరిగిన ఘోరకృత్యం కూడా తలవంచుకుంది. అయితే బాగ్‌లో జరిగింది నరమేధం గనుక ప్రపంచాన్ని అది బాగా ఆకర్షించింది.

ఏ విధంగానైనా సరే మీరు పంజాబు వెళ్లాలి అని నా మీద వత్తిడి ఎక్కువైంది. నేను వైస్రాయికి జాబు వ్రాశాను. తంతి పంపాను. కాని అనుమతి లభించలేదు. అనుమతి లేకుండా వెళితే లోనికి అడుగు పెట్టనీయరు కదా! చట్టాన్ని సవినయంగా ఉల్లంఘించాననే గౌరవం తప్ప వేరే ప్రయోజనం చేకూరదు. ధర్మసంకటంలో పడ్డాను. ప్రభుత్వం వారి నిషేధాజ్ఞను ఉల్లంఘించితే అది సహకార నిరాకరణోద్యమం క్రిందకు రాదు. శాంతిని గురించి ఆశించిన విశ్వాసం యింకా నాకు కలుగలేదు. పంజాబులో జరుగుతున్న దుర్మార్గపు పాలన వల్ల దేశంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. యిట్టి స్థితిలో నేను చట్టాన్ని ఉల్లంఘించితే అగ్నిలో ఆజ్యం పోసినట్లవుతుందని అనిపించింది. అందువల్ల పంజాబులో ప్రవేశించడానికి నేను ఇష్టపడలేదు. ఇది చేదు నిర్ణయం. రోజూ పంజాబులో జరుగుతున్న ఘోరకృత్యాలు తెలుస్తున్నాయి. వాటినివింటూ పండ్లు కొరుకుతూ వుండిపోవలసిన స్థితి ఏర్పడింది.

ఇదే సమయాన క్రానికల్ పత్రికను ప్రచండశక్తిగా రూపొందించిన మిస్టర్ హార్నమెన్‌ను ప్రజలకు తెలియకుండా రహస్యంగా ప్రభుత్వం ఎత్తుకుపోయింది. ఈ దొంగతనంలో నిండివున్న దుర్వాసన యీనాటివరకు నాకు కొడుతూనేవున్నది. మి. హార్నిమెన్ అరాచకత్వాన్ని కోరలేదని నాకు తెలుసు. సత్యాగ్రహ సంస్థ సలహా తీసుకోకుండా పంజాబు ప్రభుత్వపు ఆదేశాన్ని నేను ధిక్కరించడం సరికాదని ఆయన భావించాడు. సహాయ నిరాకరణోద్యమాన్ని వాయిదా వేయడానికి ఆయన పూర్తిగా యిష్టపడ్డాడు. నేను వాయిదా వేస్తున్నానని ప్రకటించక పూర్వం వాయిదా వేయమని సలహాయిస్తూ ఆయన వ్రాసిన జాబు నాకు ఆలస్యంగా అందింది. అప్పటికి నా ప్రకటన వెలువడింది. ఆ ఆలస్యానికి కారణం అహమదాబాదుకు బొంబాయికి మధ్యన గల దూరమే. ఆయనను దేశాన్నుండి బహిష్కరించిన తీరు నాకు బాధ కలిగించింది. ఈ ఘట్టం జరిగిన తరువాత క్రానికల్ పత్రికను నడిపే బాధ్యత నాకు అప్పగించారు. మిస్టర్ బరేల్వీ అక్కడ వున్నారు. అందువల్ల నేను చేయవలసిన పని అంటూ ఏమీ మిగలలేదు. ఆ బాధ్యత కూడా ఎక్కువ రోజులు వహించవలసిన అవసరం లేకుండా పోయింది. ప్రభుత్వంవారి దయ వల్ల క్రానికల్ ప్రచురణ ఆగిపోయంది. క్రానికల్ వ్యవస్థను చూస్తున్న ఉమర్‌సుభానీ, శంకర్‌లాల్ బాంకర్‌గారలు “యంగ్ ఇండియా” వ్యవస్థ కూడా చూస్తున్నారు. వారిద్దరూ యంగ్ ఇండియా బాధ్యత వహించమని నన్ను కోరారు. క్రానికల్ లేని లోటు తీర్చడం కోసం యంగ్ ఇండియా పత్రికను వారానికి ఒకసారి గాకుండా రెండు సార్లు ప్రచురించాలని నిర్ణయించాం.

ప్రజానీకానికి సత్యాగ్రహ రహస్యాలు తెలియచేయాలనే కాంక్ష నాకు వున్నది. పంజాబును గురించి ఏమీ చేయలేకపోయాను. కనీసం విమర్శించవచ్చు కదా! దాని వెనుక సత్యాగ్రహస్ఫూర్తి వున్నదని గవర్నమెంటుకు తెలుసు. అందువల్ల ఆ మిత్రుల సలహాను అంగీకరించాను. కాని ఇంగ్లీషు ద్వారా ప్రజానీకానికి సత్యాగ్రహాన్ని గురించి శిక్షణ ఎలా గరపడం? నా కార్యక్షేత్రం ముఖ్యంగా గుజరాత్ ప్రాంతం. సోదరుడు ఇందూలాల్ యాజ్ఞిక్ అప్పుడు యీ మండలిలో ఉన్నారు. ఆయన చేతిలో మాసపత్రిక నవజీవన్ వున్నది. ఆ ఖర్చు కూడా పై మిత్రులే భరిస్తున్నారు. ఆ పత్రికను ఇందూలాల్ మరియు ఆ మిత్రులు నాకు అప్పగించారు. అయితే అందు పని చేయడానికి ఇందూలాల్ అంగీకరించారు. ఆ మాసపత్రికను మేము వారపత్రికగా మార్చాము. ఇంతలో క్రానికల్‌కి మళ్లీ ప్రాణం వచ్చింది. అందువల్ల యంగ్ ఇండియా వారపత్రికగా మారింది. దాన్ని నా సలహా ప్రకారం అహమదాబాదుకు మార్చారు. రెండు పత్రికల్ని వేరు వేరు చోట్ల నుండి వెలువరించాలంటే ఖర్చు పెరిగింది. శ్రమ కూడా హెచ్చింది. నవజీవన్ పత్రిక అహమ్మదాబాద్ నుండే వెలువడుతున్నది. అటువంటి పత్రికలు నడపాలంటే సొంత ప్రెస్సుఅవసరమను విషయం ఇండియన్ ఒపీనియన్ అను పత్రిక నడుపుతూ వున్నప్పుడు నాకు బోధపడింది. వ్యాపార దృక్పధంతో సొంత ప్రెస్సులో ముద్రించబడే పత్రికల్లో ఆయా పత్రికాధిపతులు నా అభిప్రాయాల్ని ప్రకటించడానికి భయపడుతూ వుండేవారు. ఇది కూడా సొంత ప్రెస్సు పెట్టడానికి ఒక కారణం. అహమదాబాదులోనే అది సాధ్యం గనుక యంగ్ ఇండియాను అహమదాబాదుకు మార్చారు.

ఈ పత్రికల ద్వారా సత్యాగ్రహాన్ని గురించిన వివరాలు ప్రజలకు తెలపడం ప్రారంభించాను. ప్రారంభంలో రెండు పత్రికల ప్రతులు కొద్దిగా ముద్రించబడుతూ వుండేవి. ఆ సంఖ్య పెరిగి 40 వేలకు చేరుకున్నది. నవజీవన్ పత్రిక చందాదారులు ఒక్కసారిగా పెరిగారు. యంగ్ ఇండియా చందాదారులు నెమ్మదిగా పెరిగారు. నేను జైలుకు వెళ్లిన తరువాత యీ వెల్లువ తగ్గుముఖం పట్టింది. రెండు పత్రికల్లోను విజ్ఞాపనలు ప్రకటించకూడదని మొదటి నుండి నా నిర్ణయం. దానివల్ల నష్టం కలుగలేదని నా అభిప్రాయం. పత్రికల్లో భావనా ప్రకటనకు గల స్వాతంత్ర్య రక్షణకు యీ విధానం బాగా తోడ్పడింది. ఈ పత్రికలు వెలువడటంతో నాకు శాంతి లభించింది. సహాయ నిరాకరణోద్యమం వెంటనే ప్రారంభించలేకపోయినా నా అభిప్రాయాల్ని ప్రకటించ గల అవకాశం దొరికింది. సలహాల కోసం నా వంక చూస్తున్న వారికి ధైర్యం చేకూర్చగలిగాను. ఆ రెండు పత్రికలు గడ్డుసమయంలో ప్రజలకు అధికంగా సేవ చేయగలిగాయని నా అభిప్రాయం. మిలిటరీ చట్టాల దుర్మార్గాల్ని ఎండగట్టి వాటిని తగ్గించడానికి కూడా కృషి చేశాయి. 

35. పంజాబులో

పంజాబులో జరిగిన ఘోరాలకన్నింటికీ అపరాధిని నేనేనని సర్ మైకేల్ ఓడయర్ నిర్ణయించారు. ఇక అక్కడ కొందరు నవయువకులు మార్షల్ లాకు కారణం నేనేనని, నేను అపరాధిని అనడానికి కూడా వెనుకాడలేదు. కోపంతో పెట్రేగిపోయిన ఆ నవయువకులు సహాయ నిరాకరణోద్యమాన్ని నేను మధ్యలో వాయిదావేసి యుండకపోతే జలియన్‌వాలా బాగ్ హత్యాకాండ జరిగియుండేది కాదని, మిలటరీ చట్టం అమలులోకి వచ్చియుండేది కాదనే స్థితికి వెళ్లారు. గాంధీ గనుక పంజాబులో అడుగు పెడితే తుపాకీతో కాల్చి పారేస్తామని కూడా కొందరు బెదిరించారు. కాని నేను చేసిన పని సరియైనదేనని, తెలివిగల వాళ్లెవరూ అందుకు భిన్నంగా ఆలోచించరని నా నిశ్చితాభిప్రాయం. పంజాబు వెళ్లడానికి ఎంతో తొందరపడ్డాను. నేను పంజాబు చూడలేదు. చూడగలిగినంత వరకు పంజాబును చూడాలని అభిలాష కలిగింది. నన్నక్కడికి ఆహ్వానించిన డా. సత్యపాల్, డా. కిచలూ, పండిత రామభజదత్త చౌదరిగారలను చూడాలని ఆరాటం ఎక్కువైంది. వారు జైల్లో ఉన్నారు. అయితే వాళ్లను ప్రభుత్వం ఎక్కువ కాలం జైల్లో వుంచలేదని నాకు తెలుసు. బొంబాయి వెళ్లినప్పుడే అనేకమంది పంజాబు సోదరులు వచ్చి నన్ను కలియడం ప్రారంభించారు. వారిని ప్రోత్సహించాను. వారంతా సంతోషంతో తిరిగి వెళుతూ వుండేవారు. నేను ఎంతో ఆత్మవిశ్వాసంతో వున్నా నా పంజాబు యాత్ర వాయిదా పడుతూనే వుంది. వైస్రాయి ప్రతిసారి “అప్పుడే కాదు” అంటూ నన్ను పంజాబుకు వెళ్లనీయలేదు.

ఈలోపున హంటర్ కమిటీ వచ్చింది. ఆ కమిటీ వాళ్లు పంజాబులో మిలటరీ పాలన యందు జరిగిన అధికారుల చర్యలను పరిశీలించవలసి వున్నది. దీనబంధు ఆండ్రూసు అక్కడకు వెళ్లారు. వారి జాబుల్లో హృదయాన్ని కదిలించే వర్ణనలు నిండివున్నాయి. పత్రికల్లో వెలువడిన వివరాల కంటే అక్కడ జరిగిన ఘోరాలు అధికంగా వున్నాయని వారి జాబుల వల్ల తెలిసింది. మీరు త్వరగా పంజాబు రావాలని వారు వ్రాశారు. వెంటనే పంజాబు చేరమని మాలవ్యాగారి టెలిగ్రాములు వస్తున్నాయి. అందువల్ల నేను మళ్లీ వైస్రాయికి తంతి పంపాను. ఫలానా తేదీన మీరు వెళ్లవచ్చునని ఆయన సమాధానం పంపాడు. అయితే ఆ తేదీ యిప్పుడు సరిగా జ్ఞాపకం లేదు. కాని అది అక్టోబరు 17వతేదీ అయి వుంటుంది.

నేను వెంటనే లాహోరుకు బయలుదేరాను. అక్కడి దృశ్యం ఎన్నటికీ మరచిపోలేను. స్టేషను దగ్గర జనం విపరీతంగా వున్నారు. ఎన్నో సంవత్సరాల నుండి విడిపోయి ఎక్కడో నివసిస్తున్న తమ కుటుంబీకుడు వస్తున్నట్లు వారి ప్రవర్తనా తీరు ప్రకటిస్తున్నది. అక్కడి జనం హర్షానందంతో ఉన్మత్తులైపోతున్నారు. పండిత రామభజదత్త చౌదరిగారింట్లో నాకు మకాం ఏర్పాటు చేశారు. నేను మొదటినుండి ఎరిగిన సరళాదేవి చౌదరాణి మీద నా ఆతిధ్యపు భారం పడింది. భారమని ఎందుకు అంటున్నానంటే ఆనాటికి కూడా నేను ఏ ఇంటి యజమాని దగ్గర బసచేస్తానో ఆ ఇల్లు ధర్మసత్రంగా మారిపోతూవుంది. పంజాబులో చాలామంది నాయకుల్ని జైళ్లలో నిర్భదించి వుంచారు. అందువలన వాళ్ల చోటును మాలవ్యాగారు, మోతీలాల్ గారు, స్వామీ శ్రద్ధానందగారు అధిష్టించారు. మాలవ్యాగారితోను, శ్రద్ధానందగారితోను నాకు అదివరకే పరిచయం వున్నది. కాని మోతీలాలు గారితో దగ్గరి పరిచయం లాహోరులోనే నాకు కలిగింది. ఈ నాయకులతో బాటు జైళ్లలో పెట్టబడని పలువురు స్థానిక నాయకులు వచ్చి నన్ను కలిశారు. నన్ను ఎంతో ఆత్మీయంగా చూచారు. మేమంతా ఏకగ్రీవంగా హంటర్ కమిటీ ఎదుట సాక్ష్యాలుగాని, వాఙ్మూలాలు గాని యివ్వకూడదని నిర్ణయానికి వచ్చాం. అందుకు గల కారణాలు అప్పుడే సవివరంగా ప్రకటించాం. వాటినన్నిటిని యిక్కడ తిరిగి ఏకరువు పెట్టను. కాని మేము చెప్పిన కారణాలు బలవరత్తరమైనవని ఆ కమిటీని బహిష్కరించడం సబబైన పనేనని యీ నాటికి నా నిశ్చితాభిప్రాయం. అయితే హంటర్ కమిటీని బహిష్కరించి వూరుకోకూడదని, ప్రజల పక్షాన అనగా కాంగ్రెస్ పక్షాన ఒక ఎంక్వైరీ కమిటీ ఏర్పాటుచేయాలని నిర్ణయం చేశాం. పండిత మాలవ్యాగారు నన్ను, పండిత మోతిలాల్ నెహ్రూ, కీ.శే చిత్తరంజన్ దాస్, అబ్బాస్ తయాబ్జీ, జయకర్‌గారలను ఒక కమిటీగా నియమించారు. మేము పరిశీలన కోసం విడివిడిగా పర్యటన ప్రారంభించాం. యీ కమిటీ భారం ఎక్కువగా నా మీద పడింది. అత్యధిక గ్రామాలను దర్శించే పని నాకు అప్పగించడంవల్ల పంజాబు నందలి గ్రామాల్ని స్వయంగా చూచే అవకాశం నాకు కలిగింది. యీ పర్యటన సందర్భంలో పంజాబు నందలి మహిళలతో నేను బాగా కలిసిపోయాను. యుగయుగాల నుండి వారిని నేను ఎరిగి వున్నంతగా సామీప్యం ఏర్పడింది. వెళ్లిన ప్రతిచోట స్త్రీలు అత్యధికంగా వచ్చి తాము వడకిన నూలు చిలపలు తెచ్చి, నా ఎదుట పోగులు పోయసాగారు. ఈ యాత్రా సందర్భంలో పంజాబు ఖద్దరుకు గొప్ప కేంద్రం కాగలుగుతుందనే విశ్వాసం నాకు కలిగింది. అక్కడ జరిగిన ఘోరాలు అపరిమితం. లోతుకు వెళ్లిన కొద్దీ అధికారుల అరాచకత్వం, దుర్మార్గం, నియంతృత్వం విని, చూచి నివ్వెరబోయాను. ప్రభుత్వ సైన్యంలో ఎక్కువగా వున్నది పంజాబీలే. అట్టివారి మీద యిన్ని ఘోరాలు ఎలా చేయగలిగారు, వాళ్లు ఎలా సహించారా అని యోచించి విస్తుపోయాను.

మా కమిటీ రిపోర్టు తయారుచేసే బాధ్యత నా మీద పడింది. పంజాబ్‌లో జరిగిన దురంతాలను గురించి తెలుసుకోదలచిన వారు మా రిపోర్టు చదవమని కోరుతున్నాను. మా ఆ రిపోర్టులో ఎక్కడా అతిశయోక్తులు చోటు చేసుకోలేదని చెప్పగలను. ప్రకటించిన దురంతాలకు సాక్ష్యాలు అక్కడే యివ్వబడ్డాయి. సందేహించవలసిన మాట ఒక్కటి కూడా రిపోర్టులో లేదని స్పష్టంగా చెప్పగలను. సత్యాన్ని మాత్రమే ఎదురుగా పెట్టుకొని తయారుచేయపబడ్డ మా రిపోర్టునందు బ్రిటిష్ ప్రభుత్వం వాళ్లు తమ ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు ఎంతటి ఘోరాలకైనా తెగించగలరని నిరూపించాము. మా రిపోర్టులో పేర్కొనబడిన ఒక్క మాట కూడా అసత్యమని ఎవ్వరూ అనలేకపోయారు. 

36. ఖిలాఫత్‌కు బదులు గోసంరక్షణా?

పంజాబ్‌లో జరిగిన మారణకాండను కొంచెం సేపు వదిలివేద్దాం. పంజాబ్‌లో డయ్యర్ నియంతృత్వ దురంతాల పరిశీలన కాంగ్రెస్ పక్షాన జరుగుతూ వున్నది. యింతలో ఒక ప్రజావేదికకు సంబంధించిన ఆహ్వానం నాకు అందింది. దాని మీద కీ.శే. హకీం సాహబ్ మరియు భాయి అసఫ్ అలీగార్ల పేర్లు వున్నాయి. శ్రద్ధానంద్‌గారు సభలో పాల్గొంటారని అందు వ్రాశారు. ఆయన ఆ సభకు అధ్యక్షుడు అని గుర్తు. ఢిల్లీలో ఖిలాఫత్ గురించి యోచించుటకు రాజీకి అంగీకరించాలా లేదా అని నిర్ణయించుటకు హిందూ ముస్లిములు కలిసి ఏర్పాటు చేసిన సమావేశం అది. నవంబరు మాసంలో ఆ సభ ఏర్పాటు చేయబడినట్లు నాకు గుర్తు. ఆ సమావేశంలో ఖిలాఫత్ విషయం మీదనే గాక గోసంరక్షణను గురించి చర్చ జరుగుతుందని, అందుకు యిది మంచి తరుణమని అందు వ్రాశారు. నాకు ఆ వాక్యం గుచ్చుకుంది. సమావేశంలో పాల్గొనుటకు ప్రయత్నిస్తానని వ్రాసి ఖిలాఫత్ సమస్యకు గోసంరక్షణ సమస్యకు ముడివేయడం బేరసారాలు సాగించడం మంచిది కాదని, ప్రతివిషయం మీద దాని గుణదోషాలను బట్టి చర్చించాలని వ్రాశాను. తరువాత సభ జరిగింది. నేను వెళ్లి అందు పాల్గొన్నాను. జనం బాగా వచ్చారు. అయితే యితర సమావేశాలవలె యిది హడావుడిగా జరగలేదు. శ్రద్ధానంద కూడా సభలో పాల్గొన్నారు. నేను యోచించిన విషయాన్ని గురించి వారితోకూడా మాట్లాడాను. నా మాట వారికి నచ్చి ఆ విషయం సమావేశంలో చెప్పమని అని ఆయన ఆ పని నాకే అప్పగించారు. డా. హకీంసాహెబ్‌ తోకూడా మాట్లాడాను, ఇవి రెండు వేరువేరు విషయాలు. వాటి గుణదోషాలనుబట్టి యోచించాలని నా భావం. ఖిలాఫత్ వ్యవహారం నిజమైతే గవర్నమెంట్ సరిగా వ్యవహరించక అన్యాయంచేస్తే హిందువులు మహమ్మదీయులను సమర్ధించాలి, సహకరించాలి. అయితే దానితో గోసంరక్షణను జోడించకూడదు. హిందువులు అలా కోరడం మంచిదికాదు. ఖిలాఫత్ కోసం ముస్లిములు గోవధను ఆపుతామంటే అది సరికాదు. ఒకే గడ్డ మీద ఇరుగుపొరుగున ఉండటంవల్ల గోసంరక్షణకు ముస్లింలు పూనుకొంటే అది వారికి గౌరవం. ఈ విధంగా యోచించాలని నా భావం. ఈ సభలో ఖిలాఫత్‌ను గురించే చర్చించాలని నా అభిప్రాయమని స్పష్టంగా ప్రకటించాను. సమావేశంలో అంతా అందుకు అంగీకరించారు. గోసంరక్షణను గురించి సమావేశంలో చర్చ జరుగలేదు. అయితే మౌలానా అబ్దుల్ బారీ సాహబ్ “ఖిలాఫత్‌కు హిందువులు సహకరించినా, సహకరించకపోయినా మహమ్మదీయులు గోసంరక్షణకు పూనుకోవాలి అని అన్నాడు. ముస్లింలు గోవధను నిజంగా ఆపివేస్తారని అని అనిపించింది. కొందరు పంజాబు సమస్యను ఖిలాఫత్‌తోబాటు చర్చించాలని అన్నారు. నేను వ్యతిరేకించాను. పంజాబుది స్థానిక సమస్య. పంజాబులో జరిగిన దారుణాలవల్ల బ్రిటిషు సామ్రాజ్యానికి సంబంధించిన ఉత్సవాలకు దూరంగా ఉందాము. ఖిలాఫత్‌తో బాటు పంజాబును కలిపితే మన తెలివితక్కువను వేలెత్తి చూపే అవకాశం వున్నదని చెప్పాను. అంతా నా వాదాన్ని అంగీకరించారు. యీ సభలో మౌలానా హసరత్ మొహానీ కూడా వున్నారు. వారితో నాకు పరిచయం కలిగింది. కాని ఆయన ఎలాంటి యోధుడో నాకు ఇక్కడే తెలిసింది. మాకు అభిప్రాయభేదం ప్రారంభమైంది. ఆ అభిప్రాయ భేదం ఇంకా అనేక విషయాలలో కూడా ఏర్పడింది. హిందూ మహమ్మదీయులు స్వదేశీవ్రతం పాలించాలని అందుకోసం విదేశీవస్త్రాలను బహిష్కరించాలని చర్చ జరిగింది. అప్పటికి ఇంకా ఖద్దరు యొక్క జననం కాలేదు. ఈ విషయం మౌలానా హసరత్ సాహబ్‌కు గొంతు దిగలేదు. ఖిలాఫత్ విషయంలో బ్రిటీష్ ప్రభుత్వం సహకరించకపోతే పగతీర్చుకోవాలని ఆయన తపన. అందుకై బ్రిటిషువారి వస్తువులను సాధ్యమైనంతవరకు బహిష్కరించాలని ఆయన భావం. నేను బ్రిటిషు వారి వస్తువులను వెంటనే బహిష్కరించటం ఎంత అసాధ్యమో వివరించాను. నా అభిప్రాయాల ప్రభావం సభాసదులమీద బాగా పడటం నేను గమనించాను. అయితే మౌలానా హసరత్ సాహబ్ విపరీతంగా తర్కిస్తూవుంటే ఒకటే చప్పట్లు మోగాయి. దానితో నా పని హుళక్కేనని అనుకున్నాను. తరువాత ఎవరు అంగీకరించినా, అంగీకరించకపోయినా నా కర్తవ్యం నేను నిర్వహించడం అవసరమని భావించి మాట్లాడేందుకు లేచాను. నా ఉపన్యాసం శ్రద్ధగా జనం విన్నారు. నా భావాలకు బాగా సమర్దన లభించింది. తరువాత నన్ను సమర్థిస్తూ చాలామంది మాట్లాడారు. బ్రిటిషు వారి వస్తువులను బహిష్కరిస్తే లాభం లేదని ఎగతాళి తప్ప ప్రయోజనం కలగదని జనం గ్రహించారు. మొత్తం సభలో వున్న జనం ఒంటిమీద ఏదో ఒక విదేశీ వస్తువు ఉన్నది. సభలో పాల్గొన్నవారే ఆదరించలేని విషయాన్ని గురించి యోచించడం అనవసరమని అంతా భావించారు. మౌలానా హసరత్ ప్రసంగిస్తూ “మీరు విదేశీ వస్త్రాలను బహిష్కరించమంటే ఎట్లా? అది మాకు ఇష్టం లేదు. మన అవసరాలకు కావలసిన బట్టి ఎప్పుడు తయారు చేసుకుంటాం? ఎప్పుడు విదేశీ వస్త్రాలను బహిష్కరిస్తాం. అందువల్ల ఆంగ్లేయుల్ని వెంటనే దెబ్బతీసే వస్తువు ఏదైనా వుంటే చెప్పండి? బహిష్కారం తప్పదు కాని వెంటనే బ్రిటిషు వారిని దెబ్బతీయగల వస్తువు ఏమైనా వుంటే త్వరగా చెప్పండి” అని తొందర పెట్టాడు. విదేశీ వస్త్రాలను బహిష్కరించమనే గాక మరేదేమైనా కొత్త వస్తువును బహిష్కరించమని చెప్పడం అవసరమని భావించాను. అవసరమైనంత ఖాదీ వస్త్రం మనం తయారు చేసుకోవచ్చునని తరువాత నాకు బోధపడింది. అప్పటికి నాకీ విషయం తెలియదు. కేవలం విదేశీ బట్టల కోసం మిల్లులమీద ఆధారపడితే అవి సమయానికి మోసం చేస్తాయని అప్పటికి నేను గ్రహించాను. మౌలానా గారి ప్రసంగం పూర్తికాగానే నేను ప్రసంగించేందుకు లేచి నిలబడ్డాను.

నాకు తగిన ఉర్దూ, హిందీ శబ్దాలు స్ఫురించలేదు. మహమ్మదీయులు ఎక్కువగా వున్న ఇట్టి సభలో యుక్తిపరంగా ఉపన్యసించవలసి రావడం నాకు యిదే ప్రథమం. కలకత్తాలో జరిగిన ముస్లింలీగ్ సభలో కొద్ది నిమిషాల సేపు మాత్రమే మాట్లాడాను. అది హృదయాల్ని స్పృశించే ఉపవ్యాసం. కాని ఇక్కడ వ్యతిరేక భావాలు గల వారి మధ్య ఉపన్యసించాలి. ఇక సంకోచం మానుకున్నాను. ఢిల్లీ ముస్లిముల ఎదుట మంచి ఉర్దూలో ప్రాసయుక్తంగా మాట్లాడవలసిన అవసరం వున్నది. కాని నా అభిప్రాయం అట్టి భాషలోకాక సూటిగా వచ్చీరాని హిందీలో తెలియచేయటమే మంచిదని భావించాను. ఆ పని బాగానే పూర్తి చేశాను. హిందీ ఉర్దూ యే దేశ భాష కాగలదనుటకు ఆ సభ ప్రత్యక్ష తార్కాణం. ఇంగ్లీషులో మాట్లాడియుంటే నా బండి ముందుకు సాగియుండేదికాదు. మౌలానాగారు సవాలు విసిరారు. అందుకు సమాధానం యిచ్చే అవకాశం నాకు సూటిగా లభించియుండేది కాదు.

ఉర్దూ లేక గుజరాతీ శబ్దాలు సమయానికి తోచనందుకు సిగ్గుపడ్డాను. అయినా సమాధానం యిచ్చాను. నాకు “నాన్ కో ఆపరేషన్” అను శబ్దం స్ఫురించింది. మౌలానా గారు ఉపన్యసిస్తున్నప్పుడు బాగా ఆలోచించాను. ఆయన స్వయంగా అనేక విషయాలలో గవర్నమెంటును సమర్ధిస్తున్నాడు. అట్టి గవర్నమెంటుకు వ్యతిరేకంగా మాట్లాడటం వ్యర్ధమని అనుకున్నాను. కత్తితో సమాధానం యివ్వదలచనప్పుడు వారికి సహకరించకపోవడమే నిజంగా వ్యతిరేకించడం అవుతుందని భావించాను. నేను “నాన్ కో ఆపరేషన్” అను శబ్దం ప్రప్రథమంగా యీ సభలోనే ప్రయోగించాను. దాన్ని సమర్ధిస్తూ నా ఉపన్యాసంలో అనేక విషయాలు పేర్కొన్నాను. ఆ సమయంలో నాన్ కో ఆపరేషన్ అను శబ్దానికి ఏఏ విషయాలు అనుకూలిస్తాయో నేను ఊహించలేదు. అందువల్ల నేను వివరాలలోకి పోలేదు. నేను ఆ సభలో చేసిన ఉపన్యాస సారాంశం యిక్కడ తెలుపుతున్నాను.

“మహమ్మదీయ సోదరులు మరొక మహత్తరమైన నిర్ణయం చేశారు. వారు చేస్తున్న ప్రయత్నానికి విధించబడే షరతులు వ్యతిరేకంగా వుంటే ప్రభుత్వానికి చేస్తున్న సహకారం వారు విరమిస్తారన్నమాట. అప్పుడు ప్రభుత్వ డిగ్రీలు స్వీకరించడం, ప్రభుత్వ పదవులు అంగీకరించడం మొదలగు పనులు చేయవలసిన అవసరం వుండదు. ప్రభుత్వం ఖిలాఫత్ వంటి ఎంతో మహత్తరమైన మత సంబంధమైన విషయాలకు నష్టం కలిగిస్తే మనం అట్టి ప్రభుత్వానికి సహాయం ఎలా చేస్తాం? అందువల్ల ఖిలాఫత్ వ్యవహారం మనకు వ్యతిరేకం అయితే ప్రభుత్వానికి చేస్తున్న సహకారాన్ని విరమించుకునే హక్కు మనకు వుంది.” ఆ విషయాన్ని గురించి ప్రచారం చేయడానికి కొన్ని నెలల కాలం పట్టింది. ఆ విషయం కొద్ది మాసాల పాటు సంస్థలోనే పడి వుంది. ఒక నెల రోజుల తరువాత అమృతసర్‌లో కాంగ్రెసు మహాసభలు జరిగాయి. అక్కడ నేను సహాయ నిరాకరణోద్యమానికి సంబంధించిన తీర్మానాన్ని సమర్ధించాను. అయితే హిందూ ముస్లిములు సహాయ నిరాకరణానికి పూనుకోవలసిన అవసరం కలుగుతుందని అప్పుడు నేను ఊహించలేదు. 

37. అమృతసర్ కాంగ్రెస్

మార్షల్ లా సమయంలో వందలాది నిర్దోషులగు పంజాబీలను తెల్లప్రభుత్వం పేరుకు మాత్రమే స్థాపించబడ్డ కోర్టుల్లో, బూటకపు కేసులు బనాయించి శిక్షలు విధించి జైళ్లల్లోకి నెట్టివేసింది. ఆ దుర్మార్గాల్ని దుండగాల్ని ఖండిస్తూ ఉవ్వెత్తున వ్యతిరేకత వెల్లడి అయ్యేసరికి ఆ ఖైదీలను ఎక్కువ కాలం జైళ్లలో వుంచడం సాధ్యం కాలేదు. కాంగ్రెసు సభలు ప్రారంభం కాక ముందే చాలామంది ఖైదీలు విడుదల చేయబడ్డారు. లాలా హరకిషన్‌లాల్ మొదలగు నాయకులంతా విడుదల అయ్యారు. కాంగ్రెస్ మహాసభలప్పుడు అలీ సోదరులు కూడా విడుదల అయి వచ్చేశారు. దానితో ప్రజల ఆనందం అవధులు దాటిపోయింది. పండిత మోతీలాల్ నెహ్రూ తన వకీలు వృత్తిని కాళ్లతోతన్నివేసి పంజాబులో తిష్ఠవేశారు. వారే అమృతసర్ ఉపన్యాసం యిచ్చి హిందీ భాషయొక్క ఆవశ్యకతను నొక్కి చెప్పడం, విదేశాలలో వుంటున్న హిందూ దేశస్థుల సమస్యలను గురించి చెప్పడం వరకే నా పని సీమితం అయింది. అమృతసర్ కాంగ్రెసులో కూడా అంతకంటే మించి నేను చేయవలసింది ఏమీ వుండదని భావించాను. కాని అక్కడ ఎంతో బాధ్యత నా మీద పడింది. బ్రిటిష్ చక్రవర్తి తరఫున క్రొత్త సంస్కరణలకు సంబంధించిన ప్రకటన వెలువడింది. నాకు అవి పూర్తి సంతృప్తిని కలిగించలేదు. యితరులకైతే అసలు తృప్తికరంగా లేవు. అయినా వాటిని ఆ సమయంలో అంగీకరించటమే మంచిదను నిర్ణయానికి నేను వచ్చాను. చక్రవర్తి ప్రకటనలో లార్డ్ సింహ్ చెయ్యి వుందని నాకు అనిపించింది. వారిభాషలో నాకు ఆశారేఖ గోచరించింది. కాని అనుభవజ్ఞులగు లోకమాన్యులు చిత్తరంజనదాసు మొదలగు యోధులు అంగీకరించలేదు. మాలవ్యా వంటి వారు తటస్థంగా వున్నారు.

మాలవ్యాగారింట్లో నా మకాం ఏర్పాటు చేశారు. కాశీ విశ్వవిద్యాలయం శంకుస్థాపన రోజున మాలవ్యాగారి నిరాడంబరత్వాన్ని చూచే అవకాశం నాకు లభించింది. కాని ఈ పర్యాయం వారు నన్ను తన గదిలోనే వుండమన్నారు. అందువల్ల వారి దినచర్యను కండ్లారా చూచే అవకాశం దొరికింది. నాకు ఆనందమేగాక ఆశ్చర్యం కూడా కలిగింది. వారున్న గది బీదలుండే ధర్మశాల అని చెప్పవచ్చు. అక్కడ కొద్దిగా కూడా ఖాళీగా వదిలిన చోటులేదు. అంతటా జనం వున్నారు. ఖాళీ చోటుగాని, ఏకాంత ప్రదేశంగాని అక్కడ లేదు. ఎవరైనా ఎప్పుడైనా సరే రావచ్చు. వారితో మాట్లాడవచ్చు. ఆ గదియందలి ఒక కొసన నా దర్బారు. అంటే నా మంచం వున్నది. అయితే మాలవ్యాగారి నడవడికను గురించి చెప్పడం నా ఉద్దేశ్యం కాదు. గనుక అసలు విషయానికి వస్తాను. మాలవ్యాగారితో రోజూ మాట్లాడడానికి అవకాశం లభించింది. తన అభిప్రాయాలను పెద్దన్నగారు తమ్ముడికి చెప్పే పద్ధతిన నాకు ప్రేమతో చెబుతూ వుండేవారు. ప్రభుత్వ సంస్కరణలకు సంబంధించిన సభలో పాల్గొనడం అవసరమని భావించాను. పంజాబ్ కాంగ్రెస్ యొక్క రిపోర్టును గురించిన వ్యవహారంలో నాకూ పాలు వున్నది. పంజాబు విషయంలో ప్రభుత్వం చేత పని చేయించుకోవాలి. ఖిలాఫత్ సమస్య సరేసరి. మాంటెగ్యూ హిందూ దేశాన్ని మోసం చేయరను నమ్మకం నాకు వున్నది. ఖైదీలు ముఖ్యంగా అలీ సోదరుల విడుదల శుభ లక్షణమని భావించాను. అందువల్ల సంస్కరణలను అంగీకరిస్తూ తీర్మానం చేయాలని అభిప్రాయపడ్డాను. సంస్కరణలు అసంతృప్తికరంగా వున్నాయి. గనుక వాటిని తిరస్కరించాలనే దృఢ దీక్షతో చిత్తరంజన్‌దాస్ వున్నారు. లోకమాన్యులు తటస్థంగా వున్నారు. అయితే చిత్తరంజన్ ప్రవేశపెట్టే తీర్మానానికే మొగ్గు చూపాలను నిర్ణయానికి వారు వచ్చారు.

ఇటువంటి పండి పోయిన సర్వమాన్యులగు పాత నాయకులతో అభిప్రాయ భేదం రావడం సహించలేక పోయాను. నా అంతర్వాణి నా కర్తవ్యాన్ని స్పష్టంగా సూచించింది. కాంగ్రెస్ సమావేశాల నుండి పారిపోదామని ప్రయత్నించాను. పండిత మోతీలాల్ నెహ్రూగారికి, పండిత మాలవ్యాగారికి నా అభిప్రాయం చెప్పివేశాను. నేను హాజరుకాకపోతే పని సాఫీగా జరుగుతుందని, మహానాయకులను వ్యతిరేకించవలసిన స్థితి నుండి నాకు ముక్తి లభిస్తుందని కూడా చెప్పాను. నా అభిప్రాయం ఆ పెద్దలిద్దరికీ రుచించలేదు. లాలా హరకిషన్‌లాల్ చెవిలో ఈ మాటపడేసరికి “అలా జరగడానికి వీలులేదు. పంజాబీలకు బాధకలుగుతుంది” అని ఆయన అన్నారు. లోకమాన్యునితోను, దేశబంధుతోను మాట్లాడాను. మిష్టర్ జిన్నాను కలిసాను. ఏవిధంగానూ దారి దొరకలేదు. నా బాధను మాలవ్యాగారికి తెలిపి “రాజీపడే అవకాశం కనబడటం లేదు. నా తీర్మానం ప్రవేశపెడితే చివరికి ఓట్లు తీసుకోవలసి వస్తుంది. యిక్కడ ఓట్లు తీసుకునే పద్ధతి కూడా సరిగా వున్నట్లు నాకు తోచడంలేదు. మన మహాసభలో దర్శకులకు, ప్రతినిధులకు తేడా ఏమీ లేదు. యింత పెద్ద సభలో ఓట్లు తీసుకునే వ్యవస్థ మనకు లేదు. నా తీర్మానం మీద ఓట్లు తీసుకోమని కోరదామంటే అందుకు అవకాశమే లేదు” అని అన్నాను. అయితే లాలా హరకిషన్‌లాల్ అట్టి వ్యవస్థ చేయిస్తానని పూచీ పడ్డారు. ఓట్లు తీసుకునే రోజున దర్శకుల్ని రానివ్వం. ప్రతినిధుల్ని మాత్రమే రానిస్తాం. వారి ఓట్లు లెక్కింపచేసే బాధ్యత నాది. అందువల్ల మీరు కాంగ్రెస్‌కు హాజరు కాకపోవడం సరికాదు అని గట్టిగా అన్నారు.

చివరికి నేను తలవంచాను. నా తీర్మానాన్ని తయారు చేశాను. ఎంతో సంకోచిస్తూ నా తీర్మానాన్ని మహాసభలో ప్రవేశపెట్టుటకు సిద్ధపడ్డాను. మిస్టర్ జిన్నా మరియు పండిత మాలవ్యాగారలు నా తీర్మానాన్ని సమర్ధిస్తామని చెప్పారు. ఉపన్యాసాలు పూర్తి అయ్యాయి. భావాలలో వ్యతిరేకత వున్నా కటుత్వానికి ఉపన్యాసాలలో చోటు లభించలేదు. ఉపన్యాసాలలో తర్కందప్ప మరేమీలేదు. అయినా మహాసభలో పాల్గొనే జనం నాయకుల అభిప్రాయభేదాల్ని సహించే స్థితిలో లేరు. సభలో అందరు ఏకాభిప్రాయాన్ని కోరుతూ వున్నారు. ఉపన్యాసాలు జరుగుతూ వున్నపుడు కూడా అభిప్రాయభేదం తొలగించేందుకు వేదిక మీద ప్రయత్నాలు సాగుతూ వున్నాయి. నాయకుల మధ్య చీటీల రాకపోకలు జరుగసాగాయి. ఏది ఏమైనా రాజీ కోసం మాలవ్యాగారు గట్టిగా కృషి చేస్తున్నారు. ఆయన నా చేతికి తన సలహా కాగితం అందించి అందు ఓట్లు తీసుకునే పరిస్థితి ఏర్పడకుండా చూడమని తీయని మాటలతో కోరారు. నాకు వారి సూచన వచ్చింది. మాలవ్యాగారి కండ్లు ఆశాకిరణం కోసం వెతుకుతూ తిరుగుతున్నాయి. “ఈ విషయం రెండు పక్షాలకు యిష్టమయ్యేలా వున్నది” అని అన్నాను. లోకమాన్యునికి నేను ఆ కాగితం అందచేశాను. “దాసుకు యిష్టమైతే నాకు అభ్యంతరం లేదు” అని ఆయన అన్నారు. దేశబంధు కరిగి పోయారు. ఆయన బిపిన్ చంద్రపాల్ వంక చూచారు. మాలవ్యా గారి హృదయంలో ఆశ చిగురించింది. దేశబంధు నోటినుండి ‘సరే’ అనుమాట యింకా పూర్తిగా వెలువడకుండానే మాలవ్యాగారు లేచి నిలబడి “సజ్జనులారా! రాజీ కుదిరిందని చెప్పడానికి సంతోషిస్తున్నాను” అని ప్రకటించారు. సభాస్థలి అంతా కరతాళ ధ్వనులతో మార్మోగి పోయింది. జనం ముఖాన కనపడుతున్న గాంభీర్యరేఖలు తొలగిపోయాయి. అందరి ముఖాలు సంతోషంతో కళకళ లాడాయి. ఆ తీర్మానం ఏమిటో ఇక్కడ వివరించవలసిన అవసరం లేదు. ఆ తీర్మానం ఏవిధంగా జరిగిందో వివరించడమే నా యీ సత్య శోధన యొక్క లక్ష్యం. ఆ తీర్మానం వల్ల నా బాధ్యత పెరిగింది. 

38. కాంగ్రెస్‌లో చేరిక

కాంగ్రెసులో నేను పాల్గొనవలసి వచ్చింది. అయితే దీన్ని నేను కాంగ్రెస్‌లో చేరిక అని అనను. జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశాలలో నిష్ఠగా పాల్గొంటూవున్నాను. అది అంతవరకే సీమితం. చిన్న సైనికుని పనివంటిదే. అక్కడ నా పని అంతకంటే మించి నాకు అక్కడ భాగస్వామ్యం వుంటుందని భావించలేదు. అట్టి కోరిక కూడా నాకు లేదు. నా శక్తి కాంగ్రెసుకు అవసరమని అమృతసర్ కాంగ్రెస్‌లో అనుభవం మీద తేలింది. పంజాబులో పరిశీలనాకమెటీ యిచ్చిన రిపోర్టు చూచి లోక మాన్యులు, మాలవ్యాగారు, మోతీలాల్ గారు, దేశబంధు దాసుగారు మొదలుగు వారంతా ఎంతో సంతోషించారు. ఆ విషయం నాకు బోధపడింది. దానితో వారు తమ సమావేశాలకు, చర్చలకు నన్ను పిలవడం ప్రారంభించారు. విషయ నిర్ధారణ సభ నిర్ణయాలన్నీ యిట్టి సమావేశాల్లోనే జరుగుతున్నాయని గ్రహించాను. యీ సమావేశాలలో జరిగే చర్చల్లో ఆ నాయకుల విశ్వాసపాత్రులే పాల్గొంటూ వుండటం కూడా గమనించాను. కొంతమంది ఏదోవిధంగా సమావేశాల్లో జొరబడేవాళ్లు. వాళ్లను కూడా చూచాను. రాబోయే సంవత్సరం చేయవలసిన రెండు కార్యక్రమాలను గురించి నాకు ప్రమేయం ఉన్నది. జలియావాలాబాగ్‌లో జరిగిన మారణకాండకు స్మారక చిహ్నం ఏర్పాటు చేయడం ఒక కార్యక్రమం. దీన్ని గురించి మహాసభలో బ్రహ్మాండమైన తీర్మానం చేశారు. అందు నిమిత్తం అయిదు లక్షల రూపాయలు వసూలు చేయాలి. ట్రస్టీలలో నాపేరు కూడా చేర్చారు. దేశంలో ప్రజల కార్యక్రమాల నిమిత్తం బిచ్చమెత్తగల మహాశక్తిమంతుల్లో మొదటి పేరు పండిత మాలవ్యాగారిది. నా పేరు వారి పేరుకి చాలా క్రింద ఉంటుందని నాకు తెలుసు. నా శక్తి ఏమిటో దక్షిణ ఆఫ్రికాలో తెలుసుకున్నాను. రాజుల్ని మహారాజుల్ని గారడీచేసి లక్షలాది రూపాయలు తీసుకురాగల శక్తి నాకు అప్పటికి లేదు. యిప్పటికీ లేదు. యీ విషయంలో మాలవ్యాగారిని మించిపోగల వ్యక్తిని నేను చూడలేదు. జలియావాలాబాగ్ స్మారక చిహ్నం కోసం వారిని చందాలడగడానికి వీలులేదని నాకు తెలుసు. అందువల్ల యీ బాధ్యత నామీద పడుతుందని అప్పుడే గ్రహించాను. అదే జరిగింది కూడా. యీ కార్యక్రమం నిమిత్తం బొంబాయిపౌరులు హృదయపూర్వకంగా విరాళాలు యిచ్చారు. ప్రజలు యిటువంటి పనులకు కావలసినంత ధనం యిచ్చే స్థితిలో వున్నారు. అయితే జలియన్‌వాలాబాగ్ గడ్డ హిందూ ముస్లిం సిఖ్కుల రక్తంతో తడిసినది గనుక యిక్కడ ఎలాంటి స్మారకచిహ్నం ఏర్పాటు చేయాలి అని ప్రశ్న బయలుదేరింది. మరో మాటల్లో ప్రోగైన డబ్బును ఎలా ఉపయోగించాలా అనునది గడ్డు ప్రశ్న అయింది. ఆ బాధ్యత నా మీద పడినట్లే. సామరస్యం లేకపోవడం వల్ల ఇది సమస్యగా మారిందని చెప్పవచ్చు.

గుమాస్తాగా పనిచేయడం నాకు గల రెండో శక్తి. దాన్ని కాంగ్రెస్ సంస్థ ఉపయోగించుకునే స్థితిలో వున్నది. చిరకాలం పనిచేసి గడించిన అనుభవం వల్ల ఎక్కడ, ఏ విధంగా తక్కువ మాటలను ఉపయోగించి వినయ విధేయతలతో కూడిన భాష వ్రాయాలో నాకు బాగా తెలుసునని అంతా గ్రహించారు. కాంగ్రెస్‌కు వున్న నియమావళి గోఖలేగారు అప్పగించి వెళ్లిన ఆస్తియే. ఆయన కొన్ని నియమాలు తయారుచేసి యిచ్చి వెళ్లారు. వాటి సాయంతో కాంగ్రెస్ నడుస్తున్నది. ఆ నియమాలు తయారుచేసిన విధానాన్ని గురించి వారి నోట నేను విన్నాను. ఆ కొద్ది నియమాలతో యిక కాంగ్రెస్ సంస్థ నడవదని అంతా తెలుసు కున్నారు. నియమావళి తయారుచేయాలని ప్రతి సంవత్సరం చర్చ జరిగేది. కాని సాలు పొడుగునా సంస్థ పనిచేయవలసిన వ్యవస్థగాని, అందుకు అవసరమైన ఏర్పాటుగాని జరుగలేదు. ముగ్గురు కార్యదర్శులు ఉండేవారు. కాని కార్యనిర్వాహక సెక్రటరీ ఒక్కడే మొత్తం వ్యవహారమంతా చూస్తూ వుండేవాడు. ఒక్క కార్యదర్శి ఆఫీసును నడుపుతాడా? భవిష్యత్తును గురించి యోచిస్తాడా? భూతకాలంలో చేయబడ్డ నిర్ణయాలను అమలు బరిచి నడుస్తున్న సంవత్సరంలో పూర్తిచేయగలుగుతాడా? అందువల్ల అందరి దృష్టి యీ విషయం మీద కేంద్రీకృతం అయింది. వేలాదిమంది ప్రతినిధులుగా గల సభ మీద ఆధారపడి దేశానికి సంబంధించిన కార్యక్రమాలు ఎలా సాగుతాయి? ప్రతినిధుల సంఖ్యకు హద్దు అంటూ ఏమీలేదు. ప్రతి ప్రాంతాన్నుండి ఎంత మందైనా సరే ప్రతినిధులు రావచ్చు. ఎవరైనా సరే ప్రతినిధులు కావచ్చు. ఇందు కొంత మార్పు అవసరమని అంతా నిర్ణయానికి వచ్చాము. యిక నియమావళిని తయారుచేసే బాధ్యత నేను వహించాను. అయితే ఒక షరతు పెట్టాను. ప్రజల మీద యిద్దరు నాయకుల పట్టు నేను గమనించాను. అందువల్ల వారి ప్రతినిధులు నాతోబాటు వుండాలని కోరాను. వాళ్లు హాయిగా కూర్చొని నియమావళి తయారుచేయలేరని నాకు తెలుసు. అందువల్ల లోకమాన్యునికి, దేశబంధువుకి విశ్వాసపాత్రులగు ఇద్దరు ప్రతినిధుల పేర్లు ఇమ్మని వారిని కోరారు. వారు తప్ప నియమావళి కమిటీలో మరెవ్వరూ వుండకూడదని చెప్పాను. అందుకు అంతా అంగీకరించారు. లోకమాన్యులు శ్రీ కేల్కారు గారి పేరు, దేశబంధు శ్రీ ఐ.బి. సేన్ గారి పేరు సూచించారు. యీ కమిటీ సమావేశం ఒక్కరోజున కూడా జరగలేదు. అయినా మేము మా పని ఏకగ్రీవంగా పూర్తిచేశాం. ఇట్టి నియమావళి తయారు చేయగలిగామనే అభిమానం మాకు కలిగింది. ఈ విధానం ప్రకారం సంస్థను నడిపితే సంస్థ యొక్క పని సవ్యంగా సాగుతుందని నా విశ్వాసం. అయితే నేను యీ బాధ్యత వహించి నిజంగా కాంగ్రెస్ సంస్థలో ప్రవేశించినట్లయిందని అభిప్రాయపడ్డాను. 

39. ఖాదీ పుట్టుక

1908 వరకు నేను రాట్నాన్నిగాని, మగ్గాన్ని గాని చూచినట్లు జ్ఞాపకం లేదు. కాని రాట్నం ద్వారా హిందూదేశపు ఏ దారిద్ర్యాన్ని పారత్రోలవచ్చో ఆ ఉపాయంతోనే స్వరాజ్యం కూడా పొందవచ్చునను విషయం అందరూ గ్రహించారు. 1901లో దక్షిణ ఆఫ్రికా నుండి భారతదేశం వచ్చాను. అప్పటికి నేను రాట్నం చూడలేదు. ఆశ్రమం తెరవగానే మగ్గం ఏర్పాటు చేశాం. మగ్గం వల్ల యిబ్బంది కలిగింది. మాకు దాన్ని గురించి ఏమీ తెలియదు. మగ్గం తెప్పించినంత మాత్రాన పని అవుతుందా? మేమంతా కలం వీరులం లేక బేరసారాలు చేసేవాళ్ళం. అలాంటి వాళ్ళం అక్కడ చేరాం. నేతపనివాడు ఒక్కడు లేడు. అందువల్ల మగ్గం తీసుకురాగానే నేత నేర్పడానికి పనివాడు కావలసివచ్చాడు. కాఠియావాడ్ మరియు పాలస్‌పుర్ నుండి మగ్గాలు వచ్చాయి. నేర్పేవాడు కూడా ఒకడు వచ్చాడు. అతడు తన పనితనాన్ని వ్యక్తం చేయలేదు. అయితే మగన్‌లాల్ గాంధీ చేబట్టిన పనిని తేలికగా వదిలి పెట్టే మనిషి కాదు. ఆయన పనిమంతుడు. ఆయన నేతపనిని క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. ఆశ్రమంలో ఒకరి తరువాత మరొకరు నేత పనివాళ్ళు తయారైనారు.

మేము మాబట్టలు స్వయంగా నేసుకొని ధరించాలి. అందువల్ల మిల్లు బట్టలు మానివేశాం. ఆశ్రమవాసులు మిల్లు నూలుతో మగ్గం మీద నేసిన బట్ట కట్టుకోవడం ప్రారంభించారు. యీ వ్రతనిర్వహణలో చాలా విషయాలు తెలుసుకున్నాం. హిందూ దేశపు నేతపనివారి జీవనం, వారి రాబడి, నూలు సంపాదించాలంటే కలిగే కష్టాలు ఆ వ్యవహారంలో వారు మోసపోతున్న విధానం, రోజురోజుకు ఏవిధంగా అప్పుల పాలవుతున్నారో ఆ తీరు మొదలుగా గల వివరాలన్నీ బోధపడ్డాయి. అందరికి అవసరమైన బట్టంతా నేసుకునే స్థితిలో లేము. అందువల్ల బయటి నేతవారిచేత బట్ట నేయించి అవసరమైనంత తెచ్చుకోవాలి. దేశపు మిల్లుల్లో తయారైన నూలుతో నేయబడ్డ నేతబట్ట తేలికగా దొరకదు. విదేశీనూలుతో నేత వాళ్ళు సన్నని బట్టలు నేసేవారు. దేశవాళీ మిల్లుల్లో తయారయ్యే నూలు సన్నగా వుండేది కాదు. మనమిల్లులు సన్నని నూలు తయారుచేసేవికాదు. దేశపు మిల్లుల నూలుతో బట్టనేసి యిచ్చే నేతవాళ్ళు అతికష్టం మీద బహుకొద్దిమంది దొరికారు. అయితే దేశపు మిల్లుల నూలుతో తయారుచేసే బట్ట మొత్తం కొంటామని ఆశ్రమం తరుపున మేము హామీ యివ్వవలసి వచ్చింది. ఈ విధంగా తయారుచేసి కట్టుకున్న బట్టను గురించి మిత్రుల్లో బాగా ప్రచారం చేశాము. ఈ విధంగా మేము నూలు మిల్లుల దమ్మిడీ ఖర్చులేని దళారులం అయిపోయాం. మిల్లుల్ని గురించి తెలుసుకున్నాం. వాటి వ్యవస్థ, అక్కడి వాళ్ళ బాధలు తెలిశాయి. స్వయంగా నూలు వడకడం, ఆ నూలుతో బట్టనేయడం మిల్లుల లక్ష్యం. మిల్లులు మగ్గాల వారికి సాయం చేయవు. చేసినా యిష్టం లేకుండా చేసేవన్నమాట. ఇదంతా చూచిన తరువాత వడుకుపని మనమే ఎందుకు చేయకూడదా అని ఆలోచించాము. మన చేతులతో నూలు వడకనంతవరకు మనం పరాయివారికి బానిసలమేనని తెలుసుకున్నాం. మిల్లు నూలుకు ఏజంట్లమై దేశ సేవ చేస్తున్నామని అనుకోవచ్చునా? మాకు బోధపడలేదు. అయితే రాట్నమూ మాకు దొరకలేదు. రాట్నం మీద నూలు వడికే వారు దొరకలేదు. నారపీచుతో పురికొస తయారు చేసే రాట్నాలు మా దగ్గర వున్నాయిగాని వాటితో దారం తీయవచ్చని మాకు తెలియలేదు. ఒక పర్యాయం కాళిదాసువకీలు ఒక సోదరిని వెతుక్కొని తీసుకువచ్చాడు. ఈమె నూలు వడికి చూపిస్తుందని చెప్పాడు. క్రొత్త పనులు నేర్చుకోవడంలో నిపుణుడైన ఒక ఆశ్రమవాసిని ఆమె దగ్గర వడకడం నేర్చుకొనేందుకే పంపాము. కాని ఆ కళ మా చేతికందలేదు.

రోజులు గడుస్తున్నాయి. నాకు తొందర ఎక్కువైంది. ఆశ్రమానికి వచ్చే ప్రతి మనిషినీ యీ విషయం గురించి అడగడం ప్రారంభించాను. అయితే వడుకు వ్యవహారమంతా స్త్రీ సొత్తేనని తేలింది. వడుకు తెలిసి ఏమూలనో పడియున్న స్త్రీలను స్త్రీలే పట్టుకోగలరని తేలింది. 1917లో గుజరాతీ సోదరుడు ఒకడు నన్ను భడోంచ్ శిక్షాపరిషత్తుకు తీసుకువెళ్ళాడు. అక్కడ మహాసాహసియగు మహిళ గంగాబాయి నాకు కనబడింది. ఆమెకు పెద్దగా చదువురాదు. కాని చదువుకున్న స్త్రీలకంటే మించిన తెలివి, ధైర్యం ఆమెకు వున్నాయి. ఆమె అస్పృశ్యతను కూకటి వ్రేళ్ళతో సహా పెకిలించి పారవేసింది. ఆమె దగ్గర డబ్బుకూడా వున్నది. ఆమె అవసరాలు చాలా తక్కువ. శరీరం బాగా బలంగా కుదిమట్టంగా వున్నది. ఎక్కడికైనా సరే నిర్భయంగా వెళ్లి వస్తుంది. సంకోచించదు. గుర్రం స్వారీకి సిద్ధపడేది. ఈ సోదరితో గోధరా పరిషత్తులో నాకు పరిచయం ఏర్పడింది. నా బాధను ఆమెకు తెలిపాను. దమయంతి ఏవిధంగా నలుడి కోసం తెగతిరిగిందో ఆ విధంగా రాట్నం కోసం తిరిగి దాన్ని తెస్తానని ప్రతిజ్ఞచేసి ఆమె నా నెత్తిన గల బరువును దించినంత పనిచేసింది. 

40. రాట్నం దొరికింది

గుజరాత్ ప్రాంతంలో తెగతిరిగిన తరువాత గంగాబెన్‌కు గాయక్వాడ్‌కు చెందిన బీజాపూరులో రాట్నం దొరికింది. అక్కడ చాలా కుటుంబాల వారి దగ్గర రాట్నాలు వున్నాయి. కాని వాటిని వాళ్ల అటకమీద పెట్టి వేశారు. వాళ్ళు వడికిన నూలు ఎవరైనా తీసుకొని, వాళ్లకు ఏకులు ఇస్తే వాళ్ళు నూలు వడికేందుకు సిద్ధంగా వున్నారని గంగాబెన్ చెప్పింది. నాకు అమిత సంతోషం కలిగింది. అయితే దూదితో తయారు చేసిన ఏకులు పంపడం, కష్టమైపోయింది. కీ.శే. ఉమర్‌సుభానీతో మాట్లాడగా ఆయన తన మిల్లునుండి ఏకులు పంపుతానని మాట యిచ్చాడు. ఏకులు గంగాబెన్ దగ్గరకు పంపాను. దానితో వడుకునూలు బహువేగంగా తయారవడం చూచి నివ్వరబోయాను.

భాయి ఉమర్ సుభానీ ఉదార హృదయుడు కనుక ఉదార బుద్ధితో ఏకులు యిచ్చి సహకరించాడు. అయితే హద్దంటూ వుంటుంది కద! డబ్బు యిచ్చి ఆయన దగ్గర ఏకులు కొనడానికి సంకోచించాను. అంతేగాక మిల్లులో తయారైన ఏకులతో నూలు వడికించడమా? అది పెద్ద దోషమని మిల్లులో తయారయ్యే ఏకులు తీసుకుంటే మిల్లులో తయారయే నూలు తీసుకోవచ్చుగదా! అందు దోషం ఏముంటుంది? మన పూర్వీకుల దగ్గర మిల్లుల్లో తయారయే ఏకులు వుండేవికాదు గదా? మరి వాళ్ళు ఏకులు ఎలా తయారు చేసుకునేవారో? అయితే యిక ఏకులు తయారు చేసేవారిని కూడా వెతకమని గంగాబెన్‌కు చెప్పాను. ఆమె ఆ బాధ్యత కూడా వహించి ఒక దూది ఏకే వాడిని వెతికి తెచ్చింది. అతనికి నెలకు 35 లేక అంత కంటే కొంచెం ఎక్కువ జీతం ఇచ్చి వుంచా. ఏకులు తయారు చేయడం పిల్లలకు నేర్పించాం. ప్రత్తి కావాలని బిచ్చం అడిగాము. సోదరుడు యశవంతప్రసాద్ దేశాయి ప్రత్తి మూటలు తెచ్చే బాధ్యత వహించారు. గంగాబెన్ ఖద్దరు పనిని బాగా నడిపించింది. వడికిన నూలుతో బట్టల నేత ప్రారంభమైంది. బీజాపూర్ ఖాదీ అనే దానికి పేరు వచ్చింది.

ఆశ్రమంలో చరఖా వెంటనే ప్రవేశించింది. మగన్‌లాల్ యొక్క పరిశోధనాశక్తి రాట్నంలో చాలా మార్పులు చేసింది. రాట్నాలు, కదుళ్ళు ఆశ్రమంలో తయారయ్యాయి. ఆశ్రమంలో తయారైన మొదటి ఖద్దరు బట్ట గజం ఖరీదు 17 అణాలు పడింది. నేను లావుపాటి నూలుతో తయారైన ఖాదీ గజం 17 అణాలు చొప్పున మిత్రులకు అమ్మాను. బొంబాయిలో కనబడ్డ వాళ్ళందర్నీ అడుగుతూ వున్నాను. అక్కడ నూలువడికే ముహిళలు యిద్దరు దొరికారు. వాళ్ళకు ఒక --- నూలు ఒక రూపాయి చొప్పున యిచ్చాను. నేను ఖాదీ శాస్త్రంలో యింకా పూర్తిగా అనుభవం లేనివాడను. నాకు చేతితో వడికిన నూలు కావాలి. వడికే స్త్రీలు కావాలి. గంగాబెన్ వాళ్లకు యిస్తున్న ధరతో పోలిస్తే నేను మోసగింపబడ్డానని తేలింది. సోదరీమణులు తక్కువ సొమ్ము తీసుకొనేందుకు అంగీకరించలేదు. అందువల్ల వాళ్లను వదిలి పెట్టవలసి వచ్చింది. అయితే వాళ్ళ వల్ల ప్రయోజనం చేకూరింది. వాళ్ళు శ్రీ అవంతికాబాయికి, శ్రీ రమీబాయి కామదార్‌కు, శ్రీశంకర్‌లాల్ బాంకరు గారి తల్లికి, శ్రీ వసుమతిబెన్‌కు నూలు వడకడం నేర్పారు. నాగదిలో రాట్నం మోత వినబడసాగింది. యీ యంత్రం జబ్బుపడ్డ నన్ను ఆరోగ్యవంతుణ్ణి చేసింది. ఇది మానసికం అన్న విషయం నిజం అయినా మనస్సు నందలి ఒక భాగం మనిషిని ఆరోగ్యవంతుణ్ణి చేసిందంటే చిన్న విషయం కాదు గదా? నేను కూడా రాట్నం చేతబట్టాను. అంతకంటే మించి ఈ రంగంలో ముందుకు పోలేకపోయాను.

ఇక ఏకులు ఎలా వస్తాయి? శ్రీరేవాశంకర్ ఝబేరీగారి బంగళా దగ్గరనుండి ప్రతి రోజూ ఒక దూదేకుల వాడు వెళుతూ వుండేవాడు. అతణ్ణి నేను పిలిచాను. అతడు పరుపుల కోసం దూదిని ఏకుతూ వుండేవాడు. అతడు ఏకులు తయారు చేసి యిస్తానని అంగీకరించాడు. అయితే మజూరీ ఎక్కువ అడిగాడు. నేను అంగీకరించాను. యీ విధంగా తయారైన నూలుతో తయారైన హారాన్ని వైష్ణవులకు డబ్బు తీసుకుని దేవుడికి హారంగా వాడుటకు అమ్మాను. శివాజీ బొంబాయిలో చరఖా క్లాసులు ప్రారంభించాడు. యీ ప్రయోగాలకు డబ్బు బాగా ఖర్చు అయింది. శ్రద్ధాళువులగు దేశభక్తులు డబ్బు ఇచ్చారు. నేను ఖర్చు చేశాను. ఆ ఖర్చు వ్యర్ధం కాలేదని వినమ్రంగా మనవి చేస్తున్నాను. మేము చాలా నేర్చుకున్నాం. కొలతబద్ద మాకు దొరికింది. ఇక నేను ఖాదీమయం అయిపోవాలని తహతహలాడాను. నేను కట్టుకున్నబట్ట దేశపు మిల్లు నూలుతో తయారైంది. బీజాపూరులోను, ఆశ్రమంలోను తయారవుతున్న ఖద్దరు బట్ట బాగా లావుగా వుండి 30 అంగుళాలు పన్నా కలిగి ఉన్నది. ఒకనెల లోపల 45 అంగుళాల పన్నా గలిగిన ఖద్దరు ధోవతి తెచ్చి ఇవ్వకపోతే లావుపాటి ఖద్దరు తుండుగుడ్డ కట్టుకోక తప్పదని గంగాబెన్‌కు చెప్పాను. పాపం ఆమె కంగారు పడింది. సమయం తక్కువ. అయినా ఆమె అధైర్యపడలేదు. నెలరోజులలోపల ఏభైఅంగుళాల పన్నా గల రెండు ఖాదీ ధోవతులు తెచ్చి నా ఎదుట వుంచింది. నా దారిద్ర్యం తొలిగిపోయింది. ఈ లోపున లక్ష్మీదాస్‌భాయి, లాటీ అను గ్రామం నుండి రామ్‌జీభాయి మరియు ఆయన భార్యయగు గంగాబెన్ అను పేర్లు గల అంత్యజులను ఆశ్రమం తీసుకువచ్చాడు. వారిచేత పెద్ద పన్నా గల ఖద్దరు తయారు చేయించాడు. ఖద్దరు ప్రచారానికి ఈ భార్యాభర్తలు యిద్దరూ చేసిన సేవ అసామాన్యమైనది. వాళ్ళు గుజరాత్‌లోను, గుజరాత్ బయట చేతితో వడికిన నూలుతో బట్ట నేయడం చాలామందికి నేర్పారు. ఆమె చదువుకోలేదు. కాని మగ్గం ముందు కూర్చొని నేత పని ప్రారంభించినప్పటినుండి అందులీనమైపోయేది. ఎవ్వరితోను మాట్లాడటానికి యిష్టపడేదికాదు. 

41. ఒక సంభాషణ

స్వదేశీ పేరుతో ఉద్యమం ప్రసిద్ధికెక్కేసరికి మిల్లు యజమానులు నన్ను తీవ్రంగా విమర్శించడం ప్రారంభించారు. భాయీ ఉమర్ సుభానీ ఒక తెలివిగల మిల్లు యజమాని. అందువల్ల అతడు తన తెలివి తేటలు నాకు బోధపరుస్తూ వుండేవాడు. ఇతరుల అభిప్రాయాలు కూడా నాకు తెలుపుతూ వుండేవాడు. అట్టివారిలో ఒక వ్యక్తి మాటల ప్రభావం సుభానీ మీద కూడా పడింది. నన్ను ఆయన దగ్గరకు తీసుకొని వెళతానని అన్నాడు. ఆయన సలహా ప్రకారం మేము ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళాము. ఆయన యిలా సంభాషణ ప్రారంభించాడు. “మీ యీ స్వదేశీ ఉద్యమం ఆరంభమైంది. ఆ ఉద్యమం వల్ల మిల్లు యజమానులం ఎంతో లాభం పొందాం. బట్టల ధర పెంచి వేశాం. ఎవ్వరూ ఏమీ అనలేని మాటలు మాట్లాడాం” అని అన్నాడు. “నేను ఆ విషయాన్ని గురించి విన్నాను. కాని అలా జరిగినందుకు విచారిస్తున్నాను” “మీ విచారం ఏమిటో ఎందుకో నాకు తెలుసు. మేము పరోపకారం చేసేందుకు వ్యాపారం చేయడం లేదు. డబ్బు సంపాదించడమే మా లక్ష్యం. మా భాగస్వాములకు మేము సమాధానం చెప్పాలి. వస్తువుల ధర వాటి గిరాకీ మీద ఆధారపడి వుంటుంది. దీనికి విరుద్ధంగా ఎవ్వడూ వెళ్ళలేడు. యీ ఉద్యమం వల్ల స్వదేశీ బట్టల ధర పెరుగుతుందని బెంగాలీలు తెలుసుకోవాలి” అని అన్నాడు.

“పాపం వాళ్ళు నా మాదిరిగా తేలికగా అందరినీ నమ్ముతారు. కనుక మిల్లు యాజమానులు స్వార్థపరులు కారని మోసం చేయరని స్వదేశీవస్త్రాల పేరిట విదేశీ వస్త్రాలు అమ్మరని వాళ్ళు విశ్వసించారు.” అని అన్నాను.

“మీరు అలా నమ్ముతారని నాకు తెలుసు. అందుకనే నేను మీకు హెచ్చరిక చేస్తున్నాను. ఇక్కడకు రావడానికి శ్రమపడ్డారు. అమాయకులైన బెంగాలీల వలె మోసంలో పడకండి” అని చెప్పి తన దగ్గర నేయబడుతున్న బట్టల నమూనాలు తెమ్మని ఒకరికి సైగ చేశాడు. మొదటి నమూనా రద్దీ అవి పారవేసే దూదితో నేయబడ్డ కంబళీ. దాన్ని చూపిస్తూ “చూడండి మేము దీన్ని కొత్తగా నేయించాం. ఇది బాగా అమ్ముడుపోతున్నది. రద్దీగా భావించబడే దూదితో తయారు చేయబడింది గనుక చవుకగా ఉంటుంది. వీటిని ఉత్తరాదికి కూడా పంపుతాం. మా ఏజంట్లు దేశం నాలుగు చెరగులా ఉన్నారు. అందువల్ల మాకు మీవంటి ఏజంట్ల అవసరం వుండదు. మరోమాట. మీ కంఠస్వరం చేరుకోని దూర దూర ప్రదేశాల్లో సైతం మా ఏజంట్లు వున్నారు. సామగ్రి అక్కడికి చేరుతుంది. భారతదేశానికి కావలసినంత బట్ట మేము తయారు చేస్తాం. అసలు స్వదేశీ అంటే ఉత్పాదనకు సంబంధించిన విషయం. మనకు అవసరమైన బట్ట మనం తయారు చేసుకోగలిగినప్పుడు మేలురకం బట్ట తయారు చేసుకోగలిగినప్పుడు, విదేశీ బట్టల దిగుమతి దానంతట అదే తగ్గిపోతుంది. అందువల్ల మీరు నడుపుతూ ఉన్న స్వదేశీ ఉద్యమం నడపవద్దని సలహా ఇస్తున్నాను. క్రొత్త మిల్లులు తెరిచేందుకు ప్రయత్నం చేయండి. మన దేశంలో స్వదేశీ వస్తువులు అమ్మకం చేసే ఉద్యమం సాగించడం అనవసరం. మనకు కావలసింది స్వదేశీ వస్తువుల ఉత్పత్తి. ఆ విషయం అర్థం చేసుకోండి.” అని అన్నాడు. నేను ఆ పనే చేస్తున్నాను. ఆశీర్వదిస్తారు కదూ!” “అదెలా! మీరు క్రొత్త మిల్లులు తెరవగలిగితే ధన్యవాదాలు పొందుటకు పాత్రులు కాగలుగుతారు” “ఆపని నేను చేయడం లేదు. నేను రాట్నం పనిలో లీనమైవున్నాను.” “అదేమిటి? రాట్నం ఏమిటి” అని అడిగాడు. నేను రాట్నం గురించి వివరించి చెప్పి “మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నాను, నేను మిల్లులకు ఏజంటుగా పనిచేయకూడదు. అందువల్ల లాభానికి బదులు నష్టం చేకూరుతుంది. మిల్లుల్లో తయారైన సామగ్రి నిల్వఉండదు. నేను ఉత్పత్తి అయిన సామగ్రిని అమ్మకం చేసేందుకు పూనుకోవాలి. ఇప్పుడు నేను ఉత్పత్తి కార్యక్రమానికి పూనుకున్నాను. ఇటువంటి స్వదేశీ వస్తువులంటే నాకు శ్రద్ధ. ఇట్టి సామగ్రి ద్వారా ఆకలితో అలమటిస్తున్న వారికి అన్నం పెట్టవచ్చు, సంవత్సరం పొడుగునా ఖాళీగా ఉండే స్త్రీలకు పని కల్పించవచ్చు. వాళ్ళు వడికిన నూలుతో బట్ట నేయించాలి. ఆ విధంగా తయారైన ఖద్దరును ప్రజలచేత ధరింపచేయాలి. ఇదే నా అభిలాష. ఇదే నా ఉద్యమం. రాట్నానికి సంబంధించిన ఈ ఉద్యమం ఎంతవరకు విజయం సాధిస్తుందో నాకు తెలియదు. ఇప్పుడు ఆరంభదశలో వుంది. కాని నాకు దానిమీద పూర్తి విశ్వాసం ఉన్నది. ఏది ఏమన్నాగానీ, నష్టం మాత్రం ఉండదు. హిందూ దేశంలో తయారయ్యే బట్ట ఎంత వృద్ధి అయితే ఈ ఉద్యమం వల్ల అంత లాభం చేకూరుతుంది. ఈ కృషిలో మీరు చెప్పిన దోషం లేదని అనుకుంటున్నాను” అని స్పష్టంగా చెప్పివేశాను.

“ఈ విధమైన ఉద్యమం మీరు సాగిస్తూ ఉంటే నేను చెప్పవలసింది ఇక ఏమీలేదు. ఈ యుగంలో రాట్నం నడుస్తుందా లేదా అనునది వేరు విషయం. నేను మాత్రం మీ కృషి సఫలం కావాలని కోరుతున్నాను.” అని సంభాషణను ముగించాడు ఆ పెద్దమనిషి. 

42. సహాయ నిరాకరణోద్యమ తీవ్రత

తరువాత ఖద్దరు అభివృద్ధి ఎలా జరిగిందో ఈ ప్రకరణంలో తెలపడం లేదు. ఆ వస్తువు ప్రజల ఎదుటకు ఎలా వచ్చిందో చెప్పిన తరువాత దాని చరిత్రలోకి దిగడం ఈ ప్రకరణాల లక్ష్యం కాదు. ఆవివరమంతా చెబితే పెద్ద గ్రంథం అవుతుంది. సత్యశోధన జరుపుతూ కొన్ని వస్తువులు ఒకటి తరువాత ఒకటిగా నా జీవితంలో సహజంగా ఎలా ప్రవేశించాయో తెలుపడమే నా ప్రధాన లక్ష్యం. ఇదే క్రమంలో యిక సహాయనిరాకరణోద్యమాన్ని గురించి తెలిపే సమయం ఆసన్నమైందని భావిస్తున్నాను. ఆలీ సోదరులు ప్రారంభించిన ఖిలాఫత్ ఉద్యమం ఒకవైపున తీవ్రంగా సాగుతూ వున్నది. కీ.శే. మౌలానా అబ్దుల్ బారీ మొదలుగా గల ముస్లిం పండితులతో యీ విషయమై చర్చలు జరిపాను. మహమ్మదీయులు ఎంతవరకు శాంతిని, అహింసను పాటించగలరా అని యోచించాము. ఒక స్థాయి వరకు వాటిని పాటించడం సులువేనని నిర్ణయానికి వచ్చాము. ఒక్కసారి అహింసా విధానాన్ని పాటిస్తామని ప్రతిజ్ఞచేస్తే చివరివరకు దానిమీద నిలబడాల్సిందే. అంతా సరేనని అన్న తరువాత సహాయ నిరాకరణోద్యమం సాగించాలని ఖిలాఫత్ కాన్ఫరెన్స్‌లో తీర్మానం అంగీకరించబడింది. అందు నిమిత్తం అలహాబాదులో రాత్రంతా సభ జరిగిన విషయం నాకు జ్ఞాపకం వున్నది. హకీంఅజమల్ ఖాను గారిని శాంతియుతంగా ఉద్యమం సాగించాలా అని సందేహం పట్టుకుంది. సందేహనివృత్తి అయిన తరువాత ఆయన రంగంలోకి దిగాడు. ఆయన చేసిన సాయం అపారం. తరువాత గుజరాత్‌లో ప్రాంతీయ సభ జరిగింది. అందు నేను సహాయ నిరాకరణోద్యమ తీర్మానం ప్రవేశపెట్టాను. దాన్ని కొందరు వ్యతిరేకించారు. “జాతీయ కాంగ్రెస్ సహాయ నిరాకరణోద్యమాన్ని అంగీకరించనంతవరకు ప్రాంతీయ పరిషత్తులకు అట్టి విధాన నిర్ణయాన్ని చేసేహక్కు లేదని వారు తెలిపిన మొదటి అడ్డంకి. అయితే నేను వారి వాదనను అంగీకరించలేదు. ప్రాంతీయ పరిషత్తులకు బాధ్యత లేదని చెప్పి వెనక్కి తగ్గడానికి వీలులేదు. ముందుకు అడుగు వేసే హక్కు అధికారం ప్రాంతీయ పరిషత్తులకు వున్నదని చెప్పాను. అంతేగాక ధైర్యం వుంటే తమ కర్తవ్యమని భావించి యీ విధంగా చేస్తే ప్రధాన సంస్థ యొక్క శోభ పెరుగుతుందని చెప్పాను. తీర్మానం యొక్క గుణదోషాలను గురించి కూడా మధురంగా చర్చ సాగింది. ఓట్లు తీసుకొని లెక్క పెట్టారు. అత్యధిక మెజారిటీతో తీర్మానం ఆమోదించబడింది. ఈ తీర్మానాన్ని ఆమోదింపజేయడానికి అబ్బాస్ తయబ్జీ మరియు వల్లభభాయి ఎంతో కృషి చేశారు. అబ్బాస్‌సాహబ్ ఆ సమావేశానికి అధ్యక్షులు. ఆయన సహాయనిరాకరణోద్యమానికి అనుకూలంగా మొగ్గు చూపారు. భారతీయ కాంగ్రెస్ యీ ప్రశ్నపై ఆలోచించుటకు ప్రత్యేక మహాసభను కలకత్తాలో సెప్టెంబరు 1920 నాడు ఏర్పాటు చేసింది. ఏర్పాట్లు పెద్ద స్థాయిలో జరిగాయి. లాలాలజపతిరాయ్ ఆ మహాసభకు అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డారు. ఖిలాఫత్ స్పెషల్ మరియు కాంగ్రెస్ స్పెషల్ అను రెండు రైళ్లు బొంబాయి నుండి కలకత్తాకు బయలుదేరాయి. కలకత్తాకు ప్రతినిధులు, దర్శకులు పెద్దసంఖ్యలో చేరారు. మౌలానా షౌకత్ అలీ కోరిక మేరకు సహాయనిరాకరణాన్ని గురించిన తీర్మానం ముసాయిదా రైల్లో తయారు చేశాను. నా తీర్మానాలలో యిప్పటివరకు శాంతియుతంగా అను శబ్ద ప్రయోగం చేయలేదు. ఉపన్యాసాల్లో మాత్రం యీ శబ్దాన్ని ప్రయోగిస్తూ వుండేవాణ్ణి. మహమ్మదీయుల సమావేశాల్లో మాత్రం శాంతియుతం అను శబ్దార్థాన్ని సరిగ వివరించి చెప్పలేకపోతూ వుండేవాణ్ణి. మౌలానా అబుల్‌కలాం ఆజాదును శాంతియుతంగా అనుదానికి ఉర్దూ శబ్దం చెప్పమని అడిగాను. ఆయన “బా అమన్” శబ్దం సూచించారు. సహాయనిరాకరణం అను శబ్దానికి “తరకే మవాలత్” అను శబ్దం సూచించారు. ఈ విధంగా గుజరాతీలోను, హిందీలోను, హిందుస్తానీలోను సహాయనిరాకరణాన్ని గురించిన భాష నా బుర్రలో నిర్మాణం కాసాగింది. కాంగ్రెస్‌లో సహాయనిరాకరణోద్యమాన్ని గురించి ప్రవేశపెట్టవలసిన తీర్మానం తయారు చేసి రైల్లోనే తీర్మానం షౌకత్ అలీకి యిచ్చివేశాను. అయితే అందు “శాంతియుతంగా” అను ముఖ్యమైన శబ్దం లేదని ఆ రాత్రి గ్రహించాను. వెంటనే మహాదేవను పరిగెత్తించి శాంతియుతంగా అను శబ్దాన్ని తీర్మానంలో చేర్చమని చెప్పించాను. ఈ శబ్దం చేర్చక పూర్వమే తీర్మానం అచ్చు అయిందని నా అభిప్రాయం. విషయనిర్ధారణ సభ ఆ రాత్రికే జరుగుతున్నది. ఆ సభలో అందరికీ చెప్పి ఆ శబ్దం చేర్చవలసి వచ్చింది. నేను జాగ్రత్తగా తీర్మానాన్ని సరిచేసి యుండకపోతే చాలా యిబ్బంది కలిగియుండేది. ఎవరు తీర్మానాన్ని వ్యతిరేకిస్తారో, ఎవరు అనుకూలిస్తారో తెలియని స్థితిలో పడ్డాను. లాలాలజపతిరాయ్ గారి అభిప్రాయం ఏమిటో నాకు తెలుసు. అనుభవజ్ఞులగు కార్యకర్తలు పెద్దసంఖ్యలో కలకత్తా సమావేశంలో పాల్గొన్నారు. విదుషీమణి ఎని బెసెంట్, పండిత మాలవ్యా, విజయరాఘవాచార్య, పండిత మోతీలాల్, దేశబంధు మొదలగు వారంతా అక్కడ వున్నారు. నా తీర్మానంలో ఖిలాఫత్ మరియు పంజాబులో జరిగిన దురంతాలకు సహకరించకూడదని పేర్కొన్నాను. శ్రీ విజయరాఘవాచార్యగారికి యీ విషయం రుచించలేదు. సహాయనిరాకరణం సాగించడానికి నిర్ణయించి అది ఫలానా అన్యాయమని కేసుని సీమితం ఎందుకు చేయాలి? స్వరాజ్యం లభించక పోవడం పెద్ద అన్యాయం కదా! దానికోసం సహాయనిరాకరణం అవసరం అని రాఘవాచార్యగారి వాదన. మోతీలాలుగారు కూడా తీర్మాన పరిధిని విస్తరింపచేయాలని భావించారు. నేను వెంటనే వారి సూచనను అంగీకరించాను. స్వరాజ్యం అని కూడా తీర్మానంలో చేర్చాను. విస్తారంగాను, గంభీరంగాను, తీవ్రంగాను చర్చలు సాగిన తదనంతరం సహాయనిరాకరణోద్యమ తీర్మానం ఆమోదింపబడింది.

శ్రీ మోతీలాల్ గారు ఈ విషయమై శ్రద్ధ వహించారు. నాతో జరిగిన వారి తీయని సంభాషణ యిప్పుడు నాకు జ్ఞాపకం వున్నది. కొన్ని మాటలు అటు యిటు మార్చమన్నవారి సూచనను నేను అంగీకరించాను. దేశబంధును ఒప్పించే బాధ్యత వారు వహించారు. దేశబంధు హృదయం సహాయనిరాకరణోద్యమానికి అనుకూలమే, కాని ప్రజలు దాన్ని ఆచరణలో పెట్టలేరని ఆయన బుధ్ధికి తోచింది. దేశబంధు మరియు లాలాలజపతిరాయ్ గారలు పూర్తిగా నాగపూరులో సహాయనిరాకరణోద్యమంలో పాల్గొన్నారు. ఈ ప్రత్యేక సమావేశంలో లోకమాన్యుడు లేని లోటు నన్ను కలచివేసింది. వారు జీవించి యుంటే కలకత్తా నిర్ణయానికి తప్పక స్వాగతం చెప్పి యుండేవారని నా విశ్వాసం. అలా జరగక వారు వ్యతిరేకించినా నేను సంతోషించేవాణ్ణి. వారి దగ్గర నేను ఏదో కొంత నేర్చుకునేవాణ్ణి. వారితో నాకు అభిప్రాయభేదం వుండేది కాని అది తీయనిది. మా యిరువురి మధ్య మంచి సంబంధం వుండేది. దాన్ని వారు చెదరనీయలేదు. ఈ వాక్యలు వ్రాస్తున్నప్పుడు వారి చివరి గడియల దృశ్యం నా కండ్ల ముందు కనిపిస్తున్నది. అర్ధరాత్రి సమయంలో వారు తుదిశ్వాస విడిచే స్థితిలో వున్నారని ఫోనులో నా పరిచితులు శ్రీ పట్వర్దన్ తెలిపారు. “ఆయన నాకు పెద్ద అండ. అది కాస్తా వాడిపోయింది” అని ఆ క్షణంలో నా నోటినుండి వెలువడింది. దేశంలో సహాయ నిరాకరణోద్యమం తీవ్రంగా సాగుతున్నది. లోకమాన్యుని ప్రోత్సాహం ఎక్కువగా లభిస్తుందని ఆశించిన తరుణంలో వారు కన్నుమూశారు. ఉద్యమం సరియైన రూపం దాల్చినప్పుడు వారి అభిప్రాయం ఎలావుండేదో భగవంతుని కెరుక. భారతదేశ చరిత్ర బహుసున్నిత స్థాయిలో నడుస్తున్న యీ సమయంలో లోకమాన్యుడు లేకపోవడం నిజంగా తీరని లోటే. 

43. నాగ్‌పూర్‌లో

జాతీయ కాంగ్రెసు ప్రత్యేక సమావేశంలో అంగీకరించబడ్డ సహాయ నిరాకరణకు సంబంధించిన తీర్మానాన్ని నాగపూరులో జరుగనున్న వార్షిక మహాసభలో ఆమోదింపజేయాలి. కలకత్తాలో వలెనే నాగపూరులో కూడా అసంఖ్యాకంగా జనం వచ్చారు. ప్రతినిధుల సంఖ్య నిర్ధారణ కాలేదు. నాకు గుర్తు వున్నంతవరకు 14 వేలమంది ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. లాలాలజపతిరాయ్ గారు కోరిన ప్రకారం విద్యాలయాలకు సంబంధించిన తీర్మానంలో ఒక చిన్న మార్పుకు అంగీకరించాను. దేశబంధు కూడా కొద్ది మార్పుచేర్పులు చేయించారు. చివరికి శాంతియుత సహాయనిరాకరణోద్యమ తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ నియమావళికి సంబంధించిన తీర్మానం అంగీకరించాలి. ప్రత్యేక కాంగ్రెసులో ఆ తీర్మానం ప్రవేశపెట్టాను. అది ప్రకటించబడి చర్చించబడింది కూడా. శ్రీ విజయరాఘవాచార్యులు యీ సమావేశానికి అధ్యక్షులు. నియమావళిలో విషయ నిర్ధారణ కమిటీ ఒక్క మార్పు చేసింది. నేను ప్రతినిధుల సంఖ్య 1500 వుండాలి అని పేర్కొన్నాను. యిన్ని సంవత్సరాల తరువాత యిప్పటికీ నా అభిప్రాయం అదే. ప్రతినిధుల సంఖ్య ఎక్కువగా వుండటంవల్ల ఎక్కువ మంచి జరుగుతుందనో లేక ప్రజాస్వామ్య విధానం ఎక్కువ పాటించబడుతుందనో భావించడం పూర్తిగా భ్రమయని నా అభిప్రాయం. ప్రజాస్వామ్య రక్షణకు ప్రజానీకంలో స్వాతంత్ర్యాభిలాష, ఆత్మాభిమానం, సమైక్యతా భావం గల నిజమైన మంచి ప్రతినిధుల ఎన్నిక జరగడం అవసరం. కాని సంఖ్యామోహంలో పడిపోయిన విషయ నిర్ధారణ సభ ఆరువేల కంటే ఎక్కువ మంది ప్రతినిధులు కావాలని కోరింది. అందువల్ల చివరికి ఆరువేల సంఖ్య అంగీకరించబడింది. జాతీయ కాంగ్రెసులో స్వరాజ్య లక్ష్యాన్ని గురించి చర్చ జరిగింది. నియమావళి యందలి ఒక నియమం ప్రకారం సామ్రాజ్యం లోపల, బయట ఎలా దొరికితే అలా సామ్రాజ్యంలో వుంటూనే స్వరాజ్యం సంపాదించాలనే వర్గం కూడా అక్కడ వున్నది. పం. మాలవ్యా, మి. జిన్నాగారలు యీ పక్షాన్ని సమర్ధించారు. కాని వారికి ఎక్కువ ఓట్లు లభించలేదు. శాంతి సత్యం రెండిటిని ఆధారంగాగొని మాత్రమే స్వరాజ్యం సాధించాలని నియమావళిలో వున్నది. ఈ షరతును కూడా కొందరు వ్యతిరేకించారు. ఆ వ్యతిరేకతను కాంగ్రెసు అంగీకరించలేదు. చర్చ జరిగిన తరువాత యథాతథంగా తీర్మానం అంగీకరించబడింది. యీ తీర్మానాన్ని జనం నిజాయితీతో అమలుపరిచి వుంటే ప్రజానీకానికి మంచిశిక్షణ లభించి యుండేది. ఆ తీర్మానాన్ని సరిగా ఆచరణలో పెడితే స్వరాజ్యపు తాళం చెవి చేతికి అంది యుండేది. అయితే ఆ విషయం యిక్కడ అప్రస్తుతం.

ఈ సమావేశంలో హిందూ మహమ్మదీయ సమైక్యత, అస్పృశ్యత మరియు ఖద్దరును గురించిన తీర్మానాలు కూడా ఆమోదించబడ్డాయి. అస్పృశ్యతను తొలగించి వేయాలనే గట్టి పట్టుదల సమావేశంలో పాల్గొన్న హిందువులందరి హృదయాల్లో నాటుకోవడం ముదావహం. ఖద్దరు ద్వారా జాతీయ కాంగ్రెసు దేశమందలి అస్థిపంజరాలతో సంబంధం పెట్టుకున్నది. ఖిలాఫత్‌ను గురించి సహాయ నిరాకరణోద్యమ తీర్మానం చేసి హిందూ మహమ్మదీయుల సమైక్యతను సాధించుటకు కాంగ్రెసు మహత్తరమైన ప్రయత్నం చేసిందని చెప్పవచ్చు.

44. పూర్ణాహుతి

ఇక యీ ప్రకరణాల్ని ముగించవలసిన సమయం ఆసన్నమైంది. ఆ తరువాత నా జీవితం పూర్తి ప్రజామయం అయిపోయింది. ప్రజలకు తెలియని అంశం అంటూ నా జీవనంలో ఏమీ మిగలలేదు. 1921 నుండి జాతీయ కాంగ్రెసు నాయకులందరితో అమితంగా మమేకం అయిపోయాను. ఏమి రాయాలన్నా నాయకులకు సంబంధించిన ఘట్టాలను వర్ణించకుండా వుండలేని స్థితి ఏర్పడింది. వారితో నాకు బహు దగ్గర సంబంధం ఏర్పడింది. శ్రద్ధానంద్, దేశబంధు, లాలాజీ, హకీం సాహబ్ యిప్పుడు మన మధ్య లేరు. అదృష్టవశాత్తు యితర పలువురు నాయకులు మన మధ్య వున్నారు. జాతీయ కాంగ్రెస్‌లో వచ్చిన మార్పును గురించిన చరిత్ర యిప్పుడు వ్రాయబడుతూ వున్నది. నా ప్రధాన ప్రయోగాలన్నీ కాంగ్రెస్ ద్వారానే జరిగాయి. ఆ ప్రయోగాలను గురించి వ్రాయ పూనుకుంటే ఆ నాయకుల్ని గురించి వ్రాయక తప్పదు. శిష్టత దృష్ట్యా కూడా ఆ విషయాలను యిప్పుడు వ్రాయలేను. యిప్పుడు నేను చేస్తున్న ప్రయోగాలను గురించిన నా నిర్ణయాలు నిర్ణయాత్మకాలుగా పరిగణింపబడవు. అందువల్ల ఈ ప్రకరణాలను తాత్కాలికంగా ఆపివేయడం అవసరమని భావిస్తున్నాను. నా కలం యిక ముందుకు సాగనంటున్నది అని చెప్పగలను. పాఠకుల దగ్గర సెలవు తీసుకోవలసి వచ్చినందుకు విచారంగా వుంది. నా ప్రయోగాలకు నా దృష్టిలో అమిత విలువ వుంది. వాటిని యధాతధంగా వర్ణించకలిగానో లేదో నాకు తెలియదు. యదార్ధ చిత్రణ చేయాలని నా మటుకు నేను అమితంగా కృషిచేశాను. సత్యాన్ని నేను ఏవిధంగా చూచానో, ఏ రూపంలో చూచానో, ఆ రూపంలో దాన్ని వివరించడానికి సదా ప్రయత్నించాను. యీ ప్రయోగాల వల్ల పాఠకుల మనస్సులో సత్యము, అహింసల యెడ అధికంగా విశ్వాసం ఏర్పడుతుందని నా నమ్మకం. సత్యంకంటే మించి మరో భగవంతుడు వున్నాడనే అనుభవం నాకు కలుగలేదు. సత్యమయం కావడానికి అహింసయే ఏకైక మార్గం. ఈ విషయం ఈ ప్రకరణాల ప్రతి పేజీలో వెల్లడికాకపోతే నా కృషి అంతా వ్యర్థమేనని భావిస్తున్నాను. ప్రయత్నాలు వ్యర్థం కావు కదా! నా అహింస సత్యమయం అయినా అది యింకా అపూర్ణమే, అపరిపక్వమే. వేలాది సూర్యుల్ని ప్రోగుచేసినా, సత్యమనే సూర్యుణ్ణి చూడలేము. అంత తీక్షణమైనది సత్యం. అయినా ఆ సూర్యుని కిరణాన్ని మాత్రం దర్శించవచ్చు. అహింస లేనిదే అట్టి దర్శనం లభించడం సాధ్యంకాదు. ఇప్పటివరకు జీవితంలో పొందిన అనేక అనుభవాల నాధారంగా చేసుకొని ఈమాట చెబుతున్నాను. ఇట్టి వ్యాప్తి చెందిన సత్యపారాయణుని సాక్షాత్కారం కోసం ప్రతిజీవిని, ప్రతిప్రాణిని ఆత్మ స్వరూపంలో ప్రేమించడం చాలా అవసరం. అట్టి అభిలాషగల మనిషి జీవన స్రవంతికి దూరంగా వుండలేడు. అందువల్ల సత్యారాధనయే నన్ను రాజనీతిలోకి దింపింది. ధర్మానికీ రాజనీతికీ సంబంధం లేదని చెప్పేవారికి ధర్మమంటే ఏమిటో తెలియదని గట్టిగా చెప్పగలను. అలా చెప్పడం అవిధేయత కానేరదు. ఆత్మశుద్ధి లేనిదే ప్రతి జీవితో సమైక్యత ఏర్పడదు. ఆత్మశుద్ధిలేనిదే అహింసా ధర్మపాలన సాధ్యపడదు. అశుద్ధాత్మ పరమేశ్వరుని దర్శనం పొందలేదు. అందువల్ల జీవన నగరంలో ప్రతిభాగము పరిశుద్ధంగా ఉండటం అవసరం. ఇట్టి శుద్ధి సర్వులకు సాధ్యమే. వ్యష్టికి సమిష్టికి మధ్య ఎంతో దగ్గర సంబంధం వున్నది. ఒక వ్యక్తి యొక్క శుద్ధి అనేకుల శుద్ధికి తోడ్పడుతుంది. వ్యక్తిగతంగా ప్రయత్నించగల శక్తి సామర్థ్యాలను సత్యనారాయణుడు సర్వులకు పుట్టుక నుండి ప్రసాదించాడు.

అయితే శుద్ధి యొక్క సాక్షాత్కారం భయంకరమైనది. అట్టి అనుభవం ప్రతిక్షణం నేను పొందుతూ వున్నాను. శుద్ధి కావడమంటే మనోవాక్కాయ కర్మేణ నిర్వికారుడు కావడమే. రాగద్వేషరహితుడు కావడమే. యిట్టి నిర్వికార ప్రవృత్తిని అలవరచుకొనుటకు ప్రతిక్షణం ప్రయత్నిస్తున్నప్పటికీ నేను ఆ స్థితిని యింకా అందుకోలేదు. ప్రజలు నన్ను ఎంత పొగడినా, ఆ పొగడ్త నన్ను ఏమరుపాటులో పడవేయదు. అట్టి పొగడ్త నా మదిలో గుచ్చుకుంటూ వుంటుంది. మనస్సులో గల వికారాలను జయించడం ప్రపంచాన్ని శస్త్రాస్త్రాల యుద్ధంలో జయించడం కంటే కష్టమైనదని నాకు కలిగిన అనుభవం. హిందూ దేశానికి వచ్చిన తరువాత కూడా నా మనస్సులో గల వికారాలను చూచాను. చూచి సిగ్గుపడ్డాను. కాని ధైర్యం మాత్రం సడలనీయలేదు. సత్యశోధన కావించుతూ రసానందం పొందాను. యిప్పుడూ పొందుతూ వున్నాను. కంటకావృతమైన మార్గం దాటవలసియున్నదని నాకు తెలుసు. అందు నిమిత్తం నేను శూన్యుణ్ణి అయిపోవాలి. మానవుడు తన యిష్టప్రకారం అందరికంటే వెనుక తనను నిలబెట్టుకోవాలి. అందరి కంటే తాను బహుతక్కువ వాడనని భావించాలి. ఆ స్థితికి చేరుకోనంతవరకు ముక్తి పొందలేడు. అహింస వినమ్రతకు పరాకాష్ట. వినమ్రతను అలవరచుకోనిదే ఏ కాలంలోను ముక్తి లభించదని అనుభవం మీద చెబుతున్నాను. అట్టి వినమ్రత కోసం ప్రార్థిస్తూ, అందుకు విశ్వసహాయాన్ని యాచిస్తూ ఈ ప్రకరణాలను ముగిస్తున్నాను.


* సమాప్తం *

Public domain
ఈ కృతి భారత ప్రభుత్వ w:భారత డిజిటల్ లైబ్రరీ ద్వారా, రచయిత/ముద్రాపకుల అనుమతితో ఆర్ధిక లావాదేవీలు లేకుండా స్కాన్ చేసి సర్వర్లపై వుంచడం ద్వారా 2007-2017 మధ్యకాలంలో ప్రజలకు అందుబాటులో ఉంచబడింది. కొన్ని సమస్యలవల్ల DLI సర్వర్ తాత్కాలికంగా అందుబాటులో లేకున్నా ఈ కృతులు USA కేంద్రంగా పనిచేసే ఆర్కీవ్ లో లభ్యమవుతున్నాయి. హక్కుదారుల ఉద్దేశాన్ని గౌరవిస్తూ, DLI స్కాన్ కంటే మెరుగుగా యూనికోడ్ కు మార్చి ప్రజలకు అందుబాటులో చేయటానికి లాభనిరపేక్షంగా పనిచేసే తెలుగు వికీసోర్స్ సాయపడుతుంది కావున వికీసోర్స్ లో వుంచబడుతున్నది. ఈ కృతిని చదువుకోవటానికి తప్పించి వేరే విధంగా వాడుకొనేవారు సంబంధిత హక్కుదారులను సంప్రదించవలసింది. ఈ విషయమై హక్కుదారులు ఆక్షేపమేమైనా తెలిపితే వికీసోర్స్ నిర్వాహకులు కృతిని తొలగిస్తారు.