సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/గోలకొండ సుల్తానులు

గోలకొండ సుల్తానులు :

దక్షిణభారత చరిత్రలో గోలకొండ యుగ మొక ప్రత్యేక స్థానమును గడించుకొని యున్నది. ఇది ఒక విధముగ మహమ్మదీయ యుగముగ కీర్తింపబడుచున్నను, సమకాలిక సాంఘిక, రాజకీయ, సారస్వతాది ప్రభావముల వలనను, గోలకొండనవాబులు పాలించిన ప్రాంత మాంధ్రదేశాంతర్గత మగుటవలనను, పాలిత ప్రజ లాంధ్రు లగుటవలనను, కొందరు మహమ్మదీయ ప్రభువుల ప్రాంతీయ దేశ భాషాభిమానము వలనను, గోలకొండ సుల్తానులు ఒక విధముగ ఆంధ్రప్రభువు లనియే నిర్ణయించుట సమంజస మను విషయమున పలువురు చరిత్ర కారులు ఏకాభిప్రాయులై యున్నారు.

ఆంధ్రుల చరిత్రకును గోలకొండ చరిత్రకును విడరాని సంబంధము కలదు. కావున గోలకొండ స్థాపనోదంతమును వివరించు సందర్భమున సమకాలికాంధ్ర రాజకీయముల ప్రసక్తి అత్యవసరము. దక్షిణాపథ చరిత్రలో మహమ్మదీయ యుగము కాకతీయుల కాలమునుండి ప్రారంభమగుచున్నది. ఓరుగల్లు రాజధానిగా పండ్రెండవ శతాబ్ది నుండి పాలించుచున్న కాకతీయ ప్రభువుల ప్రాభవ వైభవములను క్షీణింపజేసి, దక్షిణాపథమును కైవస మొనర్చుకొనుటకై ఉత్తరమునుండి మహమ్మదీయుల దండయాత్రలు ప్రారంభమైనవి. క్రీ.శ. 14 వ శతాబ్ది ప్రారంభమున ఖిల్జీ, తుఘలకు దండయాత్రలు కాకతీయుల పరిపాలనాంగమును ఛిన్నాభిన్న మొనర్చినవి. మొదటి దశయందు వారి దండయాత్రలు విఫలములైనను తరువాత జయప్రదములై కాకతీయుల పతనమునకు దారితీసినవి (1323). వీరి విజయపరంపరయే బహమనీ రాజ్య స్థాపనకు నాంది యయ్యెను (1347). కాకతీయ సామ్రాజ్య పతనముతో దేశము నిర్జీవమైనది. ప్రోలయనాయకుని అకుంఠిత దేశాభిమానము, వీరుల హృదయమున నుబికిన ప్రగాఢ స్వాతంత్ర్యేచ్ఛ, హైందవ మత ధర్మరక్షణకై పునాదులు వేసినవి. వాటి ఫలితమే విజయనగర సామ్రాజ్యావతరణము (1336). కాని నాటికే సమయము మించిపోయినది. మహమ్మదీయుల కొక చిన్న రాజ్య మేర్పడినది. అదియే బహమనీ రాజ్యము (1347-1512). బహమనీరాజులు కొంత కాలమువరకు దేశీయ

ప్రభువుల ధాటిని అడ్డగింపలేకపోయిరి. పరిస్థితుల ప్రోద్బలమువలన బహమనీ రాజ్యము వివిధ రాజకీయ మండలములుగా చీలిపోయినది. క్రీ. శ. 1490 ప్రాంతమున మహమూదుషా కాలమున బిజాపూరు, అహమ్మద్ నగరు, బిరారు ప్రాంతములేర్పడినవి. విజయనగర ప్రభువుల సామ్రాజ్యము బలిష్ఠముగా నుండినను. మహమ్మదీయ మండలాధికారులు రాజకీయ చతురంగమున వివిధములయిన పన్నాగములను పన్ని తమ ఆటలు సాగించుకొను

చిత్రము - 127

పటము - 1

గోలకొండ దుర్గము

చుండిరి. ఆ కారణమున వీరు విజయనగర సమ్రాట్టులకు కంటక ప్రాయులై యుండిరి. సమయానుకూలముగ వివిధ మండలాధిపతులతో చేతులు కలిపి తమ స్థానములను స్థిరపరచుకొనుటకై మహమ్మదీయులు అహోరాత్రములు కృషిసలిపిరి. విజయనగర ప్రభువుల ఔదార్యముకూడ కొంతవరకు వీరికి అనుకూలమయ్యెను. మహమ్మదీయుల రాజకుటుంబములలో ప్రస్తుతము పేర్కొనదగినది గోలకొండ సుల్తానులను గూర్చియే. కొంతవరకు దేశప్రజల యొక్క సంస్కృతికి దోహదమొనర్చి, భాషాపోషణ మొనర్చి గౌరవమునకు పాత్రమైనది ఈ గోలకొండ కుతుబుషాహి రాజకుటుంబమే (1512 - 1686).

గోలకొండ సుల్తాన్ ఖులీ : ఈతడు తుర్కిస్థాన్లోని సుప్రసిద్ధ కుటుంబమునకు చెందినవాడు. ఈ కుటుంబము వారు వీరాధివీరులై దక్షిణ ఇరాన్‌లోని “హమ్దన్ "అను దానిని రాజధానిగచేసికొని దేశమును పాలించి కీర్తినొందిరి. అట్టి రాజన్యులలో పీర్ ఖులీ సుప్రసిద్ధుడు. ఈతడు హమ్దన్‌లోని సంపన్నుడగు 'మలిక్ ‌సాలె' అను నాతని కుమార్తెయగు "మరియమ్ ఖాతూన్" అను నామెను వివాహమాడెను. ఈ దంపతులకు జన్మించినవాడే గోలకొండ రాజ్యస్థాపకుడుగ కీర్తింపబడుచున్న సుల్తాన్ ఖులీ కుతుబుషా అను నాతడు.

దేశమున శత్రువర్గము విజృంభించి, సుల్తాన్ ఖులీకి ప్రాణభయమేర్పడినందున ఆతడు తండ్రి ఆనతి ననుసరించి హిందూదేశమునకు వచ్చెను. కొందరు చరిత్రకారు లీతని రాక కేవలము గుఱ్ఱముల వ్యాపారము నిమిత్తమే యై యుండెనని భావించుచున్నారు. ఏది యెటులున్నను సుల్తాన్ ఖులీ మాత్రము హిందూదేశము వచ్చి దక్కనులో బీదరు ప్రాంతమును పాలించుచున్న మహమూద్ షా దర్బారులో ప్రవేశించెను. ఆనాడు విదేశములనుండి వచ్చిన మహమ్మదీయులకు బీదరు దర్బారు సముచితముగ ఆతిథ్య మొసగుచుండెను. సుల్తాన్ ఖులీకూడ రాజును సందర్శించి, ఆతని ఆశ్రయమును సంపాదించుకొని స్థిరనివాస మేర్పరచికొనెను. మహమూద్ షా క్రమముగ సుల్తాన్ ఖులీ పాండితీగరిమను, దక్షతమ గ్రహించి ఆతనిని ఆదరించెను . కొంతకాలము తరువాత మాతృదేశమున ప్రశాంత వాతావరణ మేర్పడినందున సుల్తాన్ ఖులీ తనదేశమునకు పయన మగుటకు సంకల్పించుకొని ప్రభువుయొక్క అనుమతి నర్థించెను. కాని స్నేహప్రియుడగు మహమూదుషా, సుల్తాన్ ఖులీని వెడలనీయలేదు. కాలక్రమమున దేశములో ఒకానొక ప్రాంతమున చెలరేగిన విప్లవమును అణచుటలో తోడ్పడి, తనకుగల గణితశాస్త్రాది విద్యలయందలి ప్రావీణ్యమును ప్రదర్శించి, బీదరు సుల్తాను మన్ననలనొంది, బిరుదు సత్కారములచే పూజితుడై సుల్తాన్‌ఖులీ ఒక గ్రామాధిపత్యమును సంపాదించుకొనెను. ఇంతలో తెలంగాణా సుబేదారు మరణించెను. తర్వాత తత్కార్యభారమును నిర్వహించు నిమిత్తము సుల్తానుఖులీ నియుక్తుడయ్యెను. (1496). కొన్ని సంవత్సరములవరకు సుబేదారుగానుండి సుల్తాన్‌ఖులీ, మహమూద్‌షా యొక్క మరణానంతరము క్రీ. శ. 1512 లో గోలకొండ ప్రాంతమున స్వాతంత్ర్యమును ప్రకటించెను. ఈ సంఘటన క్రీ. శ. 1518 ప్రాంతమున జరిగియున్నట్లు కొందరు మహమ్మదీయ చరిత్రకారులు విశ్వసించుచున్నారు.

నాటి తెలంగాణాసుబా, కోహిరు-వరంగల్లుల మధ్య ప్రాంతము నావరించియుండెను. ఈ ప్రాంతమునకు అధిపతియై, స్వతంత్రుడై రాజ్యస్థాపన మొనర్చిన సుల్తాన్‌ఖులీ బలవంతుడై ఇరుగుపొరుగు ప్రాంతములను, దుర్గములను జయించుకొనుటకు సంకల్పించుకొనెను. సంకల్పించుకొని, రాచకొండ, దేవరకొండ, కొండపల్లి, కంభముమెట్టు, మెతుకు, పానగల్లు, కోయిలకొండ దుర్గములను క్రమముగ అచిరకాలమున సాధించి ఆక్రమించెను. ముప్పది సంవత్సరముల పరిపాలానా కాలమున, సుల్తాన్‌ఖులీ గోలకొండ రాజ్యమునకు గట్టిపునాదు లేర్పరచెను. ఒక విజయనగర ప్రభువులను మాత్రము ఎదుర్కొని పరాజితుడయ్యెను.

సుల్తాన్‌ఖులీకి హైదర్, జమ్షీదు, ఇబ్రహీం అను మువ్వురు కుమారులుండిరి. ఇంకను మువ్వురు కుమారు లుండిరనియు, వారేనాడో మరణించిరనియు కొందరు చరిత్రకారు లూహించుచున్నారు. ఆ మువ్వురు కుమారులలో నొకరిద్దరు విద్రోహచర్యలకు పాల్పడినందున బందీకృతులై యుండిరని కొందరి యూహ. హైదర్‌ఖులీ అనుకొడుకు సుల్తాన్‌ఖులీ జీవితకాలముననే మరణించెను.

జమ్షీదుఖులీ-ఇతడు మొదటి నుండియు తండ్రిరాజ్యము నాక్రమించుకొనవలయునని విద్రోహచర్యల నొనర్చు చుండెను. తత్ఫలితముగ అతడు గోలకొండదుర్గమున బంధింపబడెను. కారాగారమున నుండికూడ రాజ్యమును చేబట్టవలయునని సంకల్పించి, ఒక దుర్గపాలకుని లోగొని

చిత్రము - 128

పటము - 2

క్రిందిభాగముననున్న బురుజులు - సాధారణ దృశ్యము

గోలకొండదుర్గమున నిర్మాణదశయందున్న యొక మశీదునకు నమాజు నిమిత్తమై వచ్చిన తండ్రిని వధింపజేసెను

(1543). ఇంతియే కాక రాజ్యము నాక్రమించుకొనిన తర్వాత రహస్యములు తెలిసికొని యుండిన దుర్గపాలకుని వధింపచేసిన కఠినహృదయుడు జమ్షీదు. దేశప్రజలు, అధికారవర్గమువారు, జంషీద్‌కుతుబ్‌షాసుల్తాను ప్రవర్తనమును ఏవగించుకొనిరి. సోదరుడైన ఇబ్రహీం విజయనగరముచేరి, మహమ్మదీయ చరిత్రకారులవలన 'రాయ్ ఆజమ్'గా కీర్తింపబడిన అళియ రామరాయలను శరణు వేడెను. ఈ విధముగ దాదాపు ఏడు సంవత్సరముల వరకు నిరంకుశముగ పాలించి జమ్షీద్‌ఖుతుబ్‌షా' మరణించెను (1550). కొన్నాళ్లవరకు సుభాన్ ఖులీ నామమాత్రముగ పాలించెను. పిదప విజయనగరము నుండి ఇబ్రహీం కుతుబ్‌షా వచ్చి గోలకొండ సామ్రాజ్యాధిపత్యమును స్వీకరించెను (1550).

ఇబ్రహీం కుతుబ్‌షా : తెలుగు కవులచేత 'మల్కిభ రాము'గా ప్రశంసింపబడిన గోలకొండ సుల్తాను ఇబ్రహీం కుతుబషాయే. సుల్తాన్‌ఖులీ తర్వాత రాజ్యభారమును అత్యంత సామర్థ్యముతో నిర్వహించిన ఇబ్రహీం కుతుబ్‌షా ప్రశంసాపాత్రుడు. ఈతడు రాజ్యమును స్థిరపరచుటయే కాక, నిర్మాణ కార్యకలాపములందు కూడ అధికముగ కృషి సలిపినవాడు. కత్తిని, కలమును ఏకధాటిగా నడపిన మహనీయుడు. ప్రజాసంక్షేమ కార్యములను రూపొందించుటలోను, రాజ్య విస్తరణ బాధ్యతను స్వీకరించుటయందును కవియై, పండితుడై, కవిపండిత పోషకుడై వాఙ్మయమును పోషించుట యందును, కుల మత వర్గ పక్షపాతము లేక అశేషజనాదరణము నొందుటయందును, ఇబ్రహీం కుతుబ్‌షాకు సాటియగు మరియొక గోలకొండ సుల్తాను లేడనియే చెప్పవచ్చును. ఇట్టి మహనీయ బహుగుణ విరాజితుని కీర్తికాయమున స్వామిద్రోహ రూప కళంక మేర్పడుట దురదృష్టము. దాదాపు ఏడు సంవత్సరముల వరకు అళియ రామరాయల భుజదండము నాశ్రయించియుండి తాళికోట యుద్ధమున (1565) ఆతని పరాజయమునకు కారకులైనవారిలో ఇబ్రహీం ఒకడై యుండెనని గ్రహించినవారు 'ఇబ్రహీమును' స్వామి ద్రోహిగ పరిగణింపక మానరు.

చిత్రము - 129

పటము - 2

"ఫతేదర్వాజా"

మహమ్మదు ఖులీ కుతుబుషా : ఇబ్రహీం మరణానంతరము ఆతని మూడవ కుమారుడు మహమ్మద్ ఖులీ ఖుతుబ్‌షా గోలకొండ రాజ్యాధికారి యయ్యెను (1560-1612). హైదరాబాదు నగరమును స్థాపించినవా డీతడే (1591). ఈ సుల్తాను భాగ్యమతి యను హిందూసుందరిని ప్రేమించి, వివాహమాడి ఆమె పేర భాగ్యనగరమును నిర్మించెను (1591). కాని దర్బారులోని మహమ్మదీయానుచరుల తీవ్ర విమర్శలకు గురియగుటచే మహమ్మదు

ఖులీ ఖుతుబుషా భాగ్యమతికి 'హైదర్ మహల్' అను బిరుదము నొసగి, భాగ్యనగర మను పేరును హైదారాబాదుగా మార్చెను. గోలకొండ ప్రాంతము జనసమ్మ

చిత్రము - 130

పటము - 4

మోతీమహల్ సింహద్వార కవాటమునకుగల ఘనమైన గుబ్బ

ర్దము కలదగుటచేత, మూసీతీరమున సుందర నగరముగా భాగ్యనగరమును నిర్మించిన తర్వాత గోలకొండ ప్రాభవము క్రమముగ సన్నగిల్లినది. మహమ్మద్ ఖులీ రసజ్ఞుడు, మహాకవి, పరిపాలనా దక్షుడు, భాగ్యనగర నిర్మాణ మను సుందర స్వప్నమును రూపొందించినవాడు. ప్రియాపరిరంభసౌఖ్య రసైకలోలుడయ్యు, ప్రజాహితై కాభిలాషిగా వరలినవాడు. ఈతని ఏకైక దుహిత హయాత్ బక్షీబేగమ్. ఈ రాజకుమార్తె పట్టపురాణికి జన్మించినదని స్థానిక చరిత్రకారులు అభిప్రాయ పడుచున్నను, ఈమె భాగ్యమతి యొక్క కుమార్తె యనియే ప్రబలమైన జన శ్రుతికలదు. ఈమెను సుల్తాన్ మహమ్మద్ అను నాతనికిచ్చి 1607 లో వివాహము గావించిరి.

మహమ్మదు ఖుతుబుషా : మహమ్మద్ ఖులీ తర్వాత సుల్తాన్ మహమ్మద్ గోలకొండ ప్రభు వయ్యెను (1612- 1626). కాని అతడు తన 34 వ ఏటనే మరణించెను.

అబ్దుల్లా ఖుతుబుషా : ఇతడు బాలుడుగా నుండుటచే తల్లియగు హయాత్ బక్షీ బేగమ్ రాజ్యరక్షణ భారమును స్వీకరించి, కుమారుడగు అబ్దుల్లా ఖుతుబ్ షాకు (1626-1672) చేదోడుగా నుండెను. గోలకొండ పట్టపురాణులలో హయాత్ బక్షీ బేగము గొప్ప అదృష్టవంతురాలని చెప్పవచ్చును. ఏల యన ఈమె తండ్రి, భర్త, కుమారుడు వరుసగ గోలకొండ సుల్తాను లగుటచేత ఈమె రాజకుమార్తెగను, పట్టపురాణిగను, రాజమాతగను మూడు కాలాలపాటు సుఖముగా జీవించి మహోన్నత దశను అనుభవించిన భాగ్యమతి ఈమె.

అబుల్ హసన్ కుతుబుషా : కుతుబషాహి వంశమున చివరి రాజు అబుల్ హసన్ కుతుబ్‌షా (1672-1687). అక్కన్న మాదన్నల మూలమునను, భక్త రామదాసు మూలమునను తెలుగువారికి సుపరిచితుడైన భోగియు, విలాసజీవియు నైన తానాషా ఈతడే. మహోన్నత ప్రాభవ వైభవముల ననుభవించిన గోలకొండ రాజ్యము ఈతని కాలమున మొగలు సామ్రాజ్యాధిపతుల దృష్టి నాకర్షింప గలిగినది. స్వయముగ ప్రభువు భోగలాలసు డగుటచేతను, హిందూ మంత్రులగు అక్కన్న మాదన్నల ప్రాభవమును ద్వేషదృష్టితో చూచిన మొగలుల అగ్రహమునకు గురియగుటచేతను, దురాశాపరులును, మూఢాత్ములు నైన మహమ్మదీయుల విద్రోహచర్యల ఫలితముగను, గోలకొండ రాజ్యము కొన్ని మాసములలో ఔరంగజేబు వశమయ్యెను. క్రీ. శ. 1687 లో సుల్తానుల ధ్వజము గోలకొండదుర్గమునుండి తిరోధానము నొందెను.

ఇక గోలకొండ యుగమునకు సంబంధించిన ఇతర విషయము లెన్ని యోకలవు. గోలకొండసుల్తానుల ప్రజాహిత కార్యములు, కట్టడములు, వాఙ్మయపోషణము, నాటి సాంఘికపరిస్థితులు, మున్నగునవి చరిత్రకారుల దృష్టి నాకర్షించినవి.

ప్రజాహితకార్యములు; కట్టడములు : గోలకొండ సుల్తానులు పెక్కు ప్రజాహితకార్యముల నొనర్చిరి. అందు హర్మ్య, ప్రాసాద, తటాకాది నిర్మాణములు ముఖ్యమైనవి. గోలకొండను స్మరించుసరికి మొదట మన మనఃఫలకమున ప్రతిబింబించునది గోలకొండ దుర్గము. ఆంధ్ర ప్రాంతమునగల సుప్రసిద్ధములైన దుర్గములలో నిది యొకటి. ఇది హైదరాబాదు నగరమునకు ఆరుమైళ్ళ దూరమున కలదు. ఇది మొదట మట్టికోటగ నుండినదట. ఇది 14 వ శతాబ్దమున బహమనీ సుల్తానుల వశమైనది. ఒకానొక కాలమున 'మానుగల్లుకోట' అను పేర ఈ దుర్గము ప్రసిద్ధమై యుండినటుల 'తేవనాట్' వ్రాతల వలన స్పష్టమగుచున్నది. ఈ దుర్గనిర్మాణమున గొల్లవాని సహకారముండి యుండెననుటకుకూడా తగిన ఆధారములుకలవు. సుల్తాన్ కులీకుతుబ్‌షా కాలమున ఈ దుర్గము బలిష్ఠ మొనర్పబడెను. భోనగిరి దుర్గమును నిర్మించిన ధనగరుకొండయ్యయొక్క ఆశీర్వాదమునొంది అహమ్మద్ నగరుగా పేర్కొనబడియున్న దుర్గమును గొల్లకొండగా సుల్తానులు మార్చిరి. గోలకొండదుర్గము క్రీ. శ. 1651 ప్రాంతమున పునర్నిర్మితమైనది. ఈ దుర్గమున మూడు కోటగోడలు ఒకదాని నొకటి చుట్టుకొని యున్నవి. దుర్గముచుట్టును పర్వతప్రాంత మొకటి కలదు. ప్రాకార కుడ్యముల కై వారము దాదాపు మూడుమైళ్ళుండును. 87 బురుజులతోను, ఎనిమిది ద్వారములతోను ఈదుర్గము బలిష్ఠముగా నుండినది. ఆనాటి కోటద్వారములలో ప్రస్తుతము ఫత్తేదర్వాజామాత్రమే నిలచియున్నది.

గోలకొండదుర్గశిఖరమున 'బాలాహిస్సారు' కలదు. ఇచట రాజప్రాసాదములు, అంతఃపురములు, ఉద్యాన వనములు, మసీదులు, దేవాలయములు, ఆయుధాగారములు, అంగళ్ళు, భాగ్యమతియొక్కయు, తారామతి యొక్కయు వాసగృహములు, మాదన్నమంత్రి పూజామందిరము మున్నగున వెన్నియో కలవు. గోలకొండ నుండి కొన్ని సొరంగములు గోషామహలు, చార్మినారుల వరకు భూగర్భమున కలవని జనశ్రుతి బలీయముగ నున్నది. గోలకొండ సుల్తానుల సమాధులు 'లంగర్ హౌసు' ప్రాంతమున కలవు. ఈ సమాధులు, దక్కనీమహమ్మదీయ శిల్పమునకు చక్కని తార్కాణములు. భాగ్యమతి సమాధికూడ ఇచ్చటనే కలదని తెలియుచున్నది. చక్కని పర్వత ప్రాంతమునుండి సుందర బలిష్ఠ ప్రాకారకుడ్యములతో నొప్పారిన గోలకొండ దుర్గమును ముట్టడించి వశపరుచు కొనుటకు ఔరంగజేబు సైన్యమునకు ఎనిమిది మాసములు పట్టెననుటయే దీని ప్రతిష్ఠను చాటుచున్నది.

కేవలము దుర్గమేకాక, గోలకొండ ప్రాంతమునను, మూసీతీరమునను ఎన్నియో హర్మ్యములు, ప్రాసాదములు గోలకొండ సుల్తానుల కాలమున నిర్మింపబడినవి. కొన్ని శిథిలావస్థలో నున్నవి. మరికొన్ని నేటికిని చెక్కుచెదరక హైదరాబాదును సందర్శించువారికి నేత్రపర్వముగ నున్నవి. అట్టివాటిలో చార్మినారు, మక్కా మశీదు ముఖ్యమైనవి. బారాదరి, గోషామహల్ మున్నగు భవనములు పెక్కులు భాగ్యనగర నిర్మాణానంతరము కట్టబడినవి. ఎటు చూచినను ఉద్యానవనములు, హర్మ్యములు, ప్రాసాదములు ఉండెను. కావుననే విదేశయాత్రికు డొకడు “నగరమంతయు సుందరోద్యానము" గ నుండెనని వర్ణించెను. హుస్సేన్ సాగరు వంటి తటాకములుకూడ నిర్మింపబడినవి. యాత్రికులకు సత్రములు కట్టబడినవి. ప్రాసాదములయొక్కయు, సుందర భవనములయొక్కయు శిథిలచిహ్నములు నేటికిని గోలకొండను దర్శించువారిని విస్మయమగ్నుల నొనర్చుచున్నవి. దుర్గమును బలపర్చుటయే గాక వివిధ నగర నిర్మాణ కార్యక్రమములయందు కూడ సుల్తానులు శ్రద్ధవహించిరి. ఇబ్రహీంపట్టణము, హయాత్‌నగరమువంటివి నాడు వెలసినవే.

సాంఘికపరిస్థితులు : గోలకొండనగరము శతాబ్దముల వరకును వర్తక వ్యాపారకేంద్రముగ విలసిల్లినది. కోహినూర్ వజ్రముల వలననే గోలకొండపేరు సర్వ ప్రపంచమునకును సుపరిచితమైనది. రత్నములకు, వజ్రములకు, కస్తూరీ మొదలగు సుగంధ ద్రవ్యములకు గోలకొండ వ్యాపార కేంద్రముగ నుండినది. విదేశములనుండి వర్తకులు వచ్చి సరకుల నమ్మి ధనరాసులను సంపాదించుకొను చుండిరి. కొన్ని సంవత్సరములు తప్ప తక్కిన కాలమును గోలకొండ సుభిక్షముగ నుండినది. కృషియందు కూడ గోలకొండ ఏ ప్రాంతమునకు వెనుకబడినది కాదు. గోధుమ, జొన్న, పప్పుధాన్యములు, ఆముదములు, తాటిబెల్లము, ఆమ్ల ఫలములు, నారింజ ఫలములు, మున్నగునవి విరివిగ ఆర్థిక సంపత్తిని కూర్చినవి. దట్టమైన అడవుల వలన వంట చెరకు విరివిగా లభించెడిది. వన్యమృగములు కూడ ఎన్నియో యుండెను. అన్నిటివలన దేశమున కెంతయో ఆదాయము లభించెడిది. గోలకొండలో గల 23 గనుల వలన కూడ దేశమునందలి ఆర్థికపరిస్థితులు పటిష్ఠముగ నుండెను. అందుచేత దేశమున ప్రజలు ఏదియో ఒక వృత్తియందు సిద్ధహస్తులై యుండిరి. కరువు కాటకములులేక ప్రజలు సుఖముగ జీవించుచుండిరి. గోలకొండ నేతపనికి కూడ ప్రసిద్ధమై యుండెను. ఇచ్చటి వస్త్రములు విదేశములకు గూడ ఎగుమతి యగుచుండెను. నిర్మల, ఇందోల్ ప్రాంతమును ఇనుము, ఉక్కు పనిముట్లు తయారగుచుండెను. దారు శిల్పము కూడ ప్రసిద్ధమై యుండెను. నేటికిని కొండపల్లి బొమ్మలు ఆకర్షకములయి యున్నవి. కస్తూరి, చందనము, చైనాసిల్కు, పంచదార పోరస్ పాత్రలు, చైనా వస్త్రములు మున్నగునవి గోలకొండకు దిగుమతి యగుచుండెడివి. దేశమునగల ప్రశాంత పరిస్థితులవలన భాషా వాఙ్మయ పోషణ మొనర్చుటకు గోలకొండ సుల్తానులకు సదవకాశము లభించినది.

గోలకొండ వాఙ్మయపోషణము : గోలకొండ సుల్తానులు సంస్కృతాంధ్ర వాఙ్మయములను, పారసీక, ఉర్దూ భాషావాఙ్మయములను చక్కగా పోషించిరి. సంస్కృతమున శృంగారమంజరి యను అలంకారగ్రంథము ఈయుగమున రచింపబడినదే. ఆంధ్రభాషావాఙ్మయ పోషణమునను, కవిపండితాదరణమునను గోలకొండ సుల్తానులు చూపిన అభిరుచి ప్రశస్తమైనది. మహమ్మదీయ ప్రభువులలో సుల్తాను ఇబ్రహీం కుతుబుషా ఏడు సంవత్సరములవరకు విజయనగరమున నుండి తెలుగు భాషా పాండిత్యమును సంపాదించుకొని గోలకొండసింహాసనము నధిష్ఠించిన తరువాత తెలుగుపండితులను, కవులను ఆదరించి తద్రచిత కావ్యములకు కృతిభర్తయై స్థిరకీర్తివిరాజితుడయ్యెను. నాటినుండియు విద్యానగరముతోపాటు గోలకొండకూడ ప్రధాన విద్యారంగమయ్యెను. అద్దంకి గంగాధరకవి 'తపతీసంవరణోపాఖ్యానము', పొన్నగంటి తెలగనార్యుని 'యయాతి చరిత్ర', రుద్రకవి 'నిరంకుశోపాఖ్యానము', 'సుగ్రీవవిజయ యక్షగానము', మట్ల అనంతభూపాలుని 'కకుత్సవిజయము', సారంగు తమ్మయ 'వైజయంతీ విలాసము', భద్రాచల రామదాసు 'భద్రాద్రిశతకము', 'రామదాసు కీర్తనలు' మున్నగు వివిధ ఆంధ్రవాఙ్మయ ప్రక్రియలు గోలకొండ సుల్తానులకాలమున వెలువడినవే. ప్రప్రధమముగ అచ్చతెనుగు కబ్బమగు యయాతిచరిత్రము 'ఈ కాలమున రచితమగుట గమనించదగిన విశేషము.

పై కావ్యపీఠికల వలన గోలకొండ సుల్తానుల యొక్కయు, తత్ప్రధానాధికారులయొక్క యు వాఙ్మయాభిరుచి తేటపడుచున్నది. అంతియేకాక మహమ్మదీయ చరిత్రకారులకు తెలియని విశేషాంశము లెన్నియో బయల్పడినవి. భాగ్యనగర నిర్మాతయగు మహమ్మద్‌కులీ స్వయముగ తెలుగులో పద్యరచన గావించినటుల స్థానిక చరిత్రకారుల వ్రాతలవలన రుజువగుచున్నది. కాని నేటికిని అట్టి పద్యములు లభింపకుండుట దురదృష్టము. తండ్రి వారసత్వమునను, భాగ్యమతి పరిచయ భాగ్యమునను మహమ్మద్ కులీ తెలుగునేర్చి పద్యరచన గావించి యుండుటలో ఆశ్చర్యముకాని, సందేహముకాని, ఉండబోదు. మహమ్మద్‌కులీ వ్రాసిన ఉర్దూగీతములందు భ్రష్ట రూపమున తెలుగుపదములెన్ని యో ఉపయోగింపబడినవి.

గోలకొండ సుల్తానులు పారశీక ఉర్దూ భాషావాఙ్మయముల కొనర్చిన సేవను ప్రత్యేకముగ ప్రశంసింప నవసరము లేదు. ప్రభువుల భాషాభిమానమును పురస్కరించుకొని విదేశములనుండియు, మొగలు దర్బారునుండియు ఏతెంచిన ఎందరో పారశీక కవులు గోలకొండ దర్బారు నలంకరించిరి. వీరు సుల్తానుల చరిత్రను, గోలకొండయందలి తమ అనుభవములను గ్రంథరూపమున ప్రకటించిరి చరిత్రకారుల కాగ్రంథము లెంతయు నమూల్యములు.

కులీకుతుబుషా కాలమున నొక సాహితీసమితి ఏర్పడెను. జమ్షీదు కాలమునుండి సుల్తానుల దర్బారు సుప్రసిద్ధి కెక్కెను. జమ్షీదు ఉర్దూ కవిత్వమున సిద్ధహస్తుడు. అతడు ఒక్కొకసారి ఆవేశమునకు లోనై ఆశుకవిత చెప్పెడి వాడట. ఇబ్రహీంకాలము పారశీక ఉర్దూ వాఙ్మయములకు స్వర్ణయుగమని చెప్పవచ్చును. అమీన్‌షా, మహమ్మద్ అంజూ, అమీర్ ఇమాముద్దీన్, కాసింబేగ్, హుస్సేన్ కులీమీర్జా మొదలగువా రెందరో ఈతని దర్బారు నలంకరించిరి. “తారీఖె ఖుతుబ్ షాహి” (కుతుబ్‌షా చరిత్ర) ఈ కాలమున రచింపబడినదే. రసికాగ్రేసరుడగు మహమ్మద్ కులీకాలమున ఉర్దూభాషావాఙ్మయములకు మహోన్నత స్థానము లభించినది. ఈతని పేష్వా 'మీర్ మోమిన్' పారశీకపండితుడు. మీర్జామహమ్మదు అమీన్ వంటి పండితులెందరో ఉండిరి. సుప్రసిద్ధకవి, మహమ్మదు కులీఖుతుబుషా సమకాలికుడు 'ముల్లావజీ' యనువాడు 'కుతుబ్ ముష్తరి' యనుకావ్యమును రచించెను. ఈ కావ్యము భాగ్యమతి నుద్దేశించి వ్రాయబడినదని పండితులు చెప్పుచున్నారు. మహమ్మద్ కులీ స్వయముగ గొప్పకవి. ఇతడు తన ప్రియురాండ్ర నుద్దేశించి వ్రాసిన ప్రేమగీతికలు నేటికిని సహృదయుల నాకర్షించుచున్నవి. మహమ్మదీయులయొక్కయు, హిందువులయొక్కయు పండుగలపైకూడ ఇతడు కొన్ని గీతికలు రచించెను. అబ్దుల్లా కాలమునకూడ ఎన్నియో చారిత్రకగ్రంథములు రచింపబడినవి. ఈతని సోదరి ఉత్తమకవయిత్రి. గోలకొండ సుల్తానులు 'దక్కనీ ఉర్దూ' అను ఉర్దూమాండలికమును అభివృద్ధి పరచి పోషించినందున ఉర్దూ వాఙ్మయచరిత్రలో వారికి ప్రత్యేకస్థానము లభించినది. దక్కనీ ఉర్దూకూడ కావ్యరచనాస్థాయి నందకొనజాలెనని బీజాపురము, గోలకొండవారు సోదాహరణముగ నిరూపించిరి. ఈ కాలమున ప్రణయగాథా కావ్యములు, వీరగాథలు, మస్నవీ, గజల్, ద్విపద, పద్యసంకలనములు, ప్రణయగీతికలు, మర్సియా మున్నగు కావ్యప్రక్రియలకు అధికమైన ఆదరము లభించినది. కావుననే ఉర్దూ వాఙ్మయమున కిది స్వర్ణయుగమని చెప్పవచ్చును.

గోలకొండ కథలు - గాథలు : విజయనగర సామ్రాజ్య సంపదకును, తదితర రాజ్యవైభవములకును సంబంధించిన గాథలు జనబాహుళ్యమున ప్రచారము నొందినట్లే, గోలకొండకు సంబంధించిన గాథలును నేటికిని హైదరాబాదులో పెద్దలలో వ్యాప్తిలో నున్నవి. ఇట్టి గాథలలో చారిత్రికాధారములు కలవి కొన్నియు శ్రుతి ఆధారములు గలవి కొన్నియు, కేవల కల్పితములు మరికొన్నియు కలవు. ఇట్టి గాథలలో, భాగ్యమతి ప్రణయగాథ, గోలకొండ కోహినూరు వృత్తాంతము, అబ్దుల్ రజాక్ లారి వీరరసాత్మకగాథ, గోలకొండ సుల్తానులకును, ప్రధానాధి కారులకును సంబంధించిన గాధలు, చార్మినారు మక్కామసీదు, గోషామహలు, బారాదరి, మిల్క్ మహల్, పురానాపూల్ మున్నగువాటి నిర్మాణమునకు సంబంధించిన వింతగాథలు, ఆంధ్ర మంత్రులగు అక్కన్న మాదన్న వృత్తాంతములు, రాజకుమారులకు, రాణివాసములకు, రాజకుమార్తెలకు, ప్రియురాండ్రకు, మతగురువులకు సంబంధించిన చిత్రవిచిత్రములైన గాథలు ఎన్నియో కలవు.

గోలకొండ పరిపాలనా యంత్రము: గోలకొండ ప్రభువులు నిరంకుశులై వర్తించినను, తగిన అధికారవర్గమును నియమించి వారి సలహా ననుసరించి దేశమును పాలించిరి. అన్ని విషయములందును సుల్తానుల మాటయే వేదవాక్కుగా భాసిల్లెను. అయినను రాజ్యనిర్వహణమునకు సంబంధించిన ప్రధానాధికారులు కొందరుండిరి. ప్రధానమంత్రి పదవిని అలంకరించువానిని ' పేష్వా' అనుచుండిరి. ముస్తఫాఖాన్, మీర్ మోమిన్ అనువారు పేష్వాలై, సింహాసనమునకు ఎడమ వైపుననున్న గౌరవస్థానమును అలంకరించిరి. రెవిన్యూ, ఆర్థిక శాఖల ఆధిపత్యమును వహించువారిని 'మీర్ జుంలా' అనుచుండిరి. ముల్లాతఖీ, మీర్జామహమ్మద్ మున్నగువారు ఈ పదవి నలంకరించిన వారు. సైన్యాధికారిని 'ఆయిన్ ఉల్ ముల్క్' అని పేర్కొనుచుండిరి. అక్కౌంట్సు, ఆడిట్ శాఖలను నిర్వహించిన ఉపమంత్రిని 'మజుందార్ ' అనుచుండిరి. 'నాజిర్ ' అనగా ఇనస్పెక్టరు. ఇప్పటికిని విద్యాశాఖలో కొందరు నాజిర్ అను పదవిని నిర్వహించుచున్నారు. రాజకీయవ్యవహారములు, ఉత్తర ప్రత్యుత్తరములు నిర్వహించుట, శాసనములు, ఉర్దూలోను, తెలుగునందును వ్రాయించుట మున్నగు పనులు చేయువారిని 'దబీరు' అని పేర్కొనిరి. పోలీస్ కమీషనరును 'కొత్వాలు’అని పిలుచుచుండిరి. ఈ పదవికూడ మొన్న మొన్నటి వరకును అమలులో నుండెను. వీరుకాక హవల్దారు, జమేదారు మున్నగు ఇతర అధికారు లెందరో ఉండిరి. గోలకొండ ప్రధానాధికారవర్గమును గూర్చి వ్రాయునపుడు ఆంధ్రమంత్రు లగు అక్కన్న మాదన్న మహాభాగులను గూర్చియు, భద్రాచలము తహసీల్దారుగ నున్న కంచర్ల గోపన్న మహాశయుని గూర్చియు విస్మరింపజాలము. సుల్తానుల అత్యాదరణము నొంది ప్రధానాధికారులై వరలిన వీరు ఆంధ్రులై యుండుట గర్వ కారణము. వీరు తమ మేధా సంపన్నతచేతను, పరిపాలనా దక్షతచేతను, దూరదృష్టి చేతను, మహమ్మదీయ సుల్తానుల అనుగ్రహమునకు పాత్రులై, అపర యుగంధరులుగా కీర్తి నొందిరి. వీరు పారశీక వాఙ్మయమునందు పాండిత్యము కలిగి ప్రఖ్యాతులైనవారు. వీరి పాండితీ గరిమను, పరిపాలనా దక్షతను గుర్తించక అసూయాపరులై వీరిని పదవీభ్రష్టులను చేసినందున అచిరకాలముననే దేశము అన్యాక్రాంతమైనది.

ఈ విధముగ గోలకొండ రాజకీయ చతురతకు, వివిధ భాషావాఙ్మయ పోషణమునకు, దేశీయ విదేశీయ వర్తక

వ్యాపారములకు, తదితర అభ్యుదయ కార్యములకు దాదాపు మూడు శతాబ్దములు ప్రధాన కేంద్రముగ మహోన్నత వైభవము ననుభవించినది.

కో. గో.


గౌతమబుద్ధుడు :

భారతదేశమునకు ఉత్తరమున నేపాళమునందు శాక్యనామక క్షత్రియవంశమున శుద్దోదనుడను రాజు ఉండెను. అతని రాజధాని కపిలవస్తునగరము. అతనిభార్య మాయాదేవి. ఆమె గర్భవతియై కపిలవస్తు పట్టణమునుండి పురిటికై పుట్టింటికి ప్రయాణము చేయుచుండెను. మార్గమధ్యమున లుంబిని యను ఆరామమునందు ఆమెకు ఒక మగశిశువు జనించెను. ఆ శిశువునకు సిద్ధార్థుడని నామకరణము చేయబడెను. ఈ శిశువే అనంతరము గౌతమ బుద్ధుడుగా ప్రసిద్దు డయ్యెను.

గౌతమబుద్ధుని జన్మసంవత్సరమును గూర్చి చారిత్రకులలో అభిప్రాయభేదము కలదు. కాని క్రీ. పూ. 563 సం. ప్రాంతమున అతడు జన్మించినట్లు పెక్కురు అంగీకరించిరి. అతడుపుట్టినపుడు వచ్చిన జ్యోతిష్కులు పరిపాలింప దలచినచో అతడు చక్రవర్తి కాగలడనియు, సన్యసించినచో జ్ఞానసిద్ధిని పొందగలడనియు తెలిపిరి. సిద్ధార్థుడు జన్మించిన వారమురోజులకే అతని జనని మాయాదేవి మరణించెను. అందుచేత శుద్దోదనుని రెండవభార్యయగు మహా ప్రజాపతి గౌతమి ఈ శిశువును వాత్సల్యముతో పెంచెను.

సిద్ధార్థుడు యౌవనమునందు యశోధర యను కన్యను వివాహమాడి, ఆ మెయందు రాహులుడను పుత్రుని బడసెను. సిద్ధార్థుడు చిన్ననాటి నుండియు ఇతర క్షత్రియ బాలురవలె క్రీడాసక్తుడుగాక నిరంతరము దీర్ఘాలోచనా నిమగ్నుడై యుండెడివాడు. అతని అట్టి విచిత్ర ప్రవర్తనమును గాంచి, అతడు విరాగి యగునేమో యని భీతిల్లి తండ్రియగు శుద్దోదనుడు అతని మనస్సును ప్రాపంచిక విషయములపై మరల్చుటకయి అనేకవిధముల యత్నించెను. అయినను, కారణజన్ముడైన సిద్ధార్థుని విషయ సుఖములు ఆకర్షింపజాలకుండెను.

సిద్ధార్థు డొకనాటి సాయంకాలము వాహ్యాళికై పురబాహ్య ప్రదేశమునకు వెడలెను. అచ్చటచ్చట త్రోవలో మున్ముందు కనిపించిన వృద్ధ, రోగి, శవ దృశ్యములవలన అతని హృదయము దుఃఖావిష్టమయ్యెను. పిదప నొక సన్యాసి కనిపించెను. సిద్ధార్థుడు సన్యాసిని పిలిచి యడుగగా ఆ సన్యాసి తాను మోక్షము కొరకు సన్యసించితి ననియు, ఆసన్యాసమే తన నిత్యతృప్తికి, నిత్య సంతోషమునకు కారణమైన దనియు చెప్పెను. ఆ సన్యాసి వృత్తాంతమును వినిన తోడనే సిద్ధార్థుడు దీర్ఘాలోచనా నిమగ్నుడై రథమును మరలించి స్వీయనగరము చేరెను.

సిద్ధార్థునకు ప్రపంచమున సర్వత్ర దుఃఖమే కనిపించెను. ప్రజల దుఃఖమును నివారించి వారుశాశ్వతమైన ఆనందమును పొందుటకై మార్గమును అన్వేషించుటకు అతడు నిశ్చయించుకొనెను. తోడనేఅతనికి ఇంద్రియ భోగములపై ఏవగింపును, ప్రాణి వర్గముపై అపారమైన దయయు, సంసారమును పరిత్యజింప తలంపును కలిగెను. ఆ పరిత్యాగము స్వీయ మోక్షమునకై

చిత్రము - 131

పటము - 1

గౌతమబుద్దుడు