సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/గోలకొండ పట్టణము
గోలకొండ పట్టణము :
దక్షిణాపథ చరిత్రమునందు గోలకొండ సామ్రాజ్య చరిత్రమున కొక ప్రత్యేకస్థానము కలదు. ఆంధ్రుల చరిత్రలో ఇది యొకభాగము. దాదాపు మూడు శతాబ్దముల వరకు ఈ సామ్రాజ్యము అఖండైశ్వర్యము ననుభవించి భోగభాగ్యముల నోలలాడినది. గోలకొండ నేలిన సుల్తానులు కుతుబుషాహీ వంశస్థులు. వీరికి రాజధానియగు గోలకొండ సామ్రాజ్య రక్షకదుర్గముగ కీర్తిగాంచినది.
గోలకొండ దుర్గమునందు నగరము క్రమాభివృద్ధి నొందినది. గోలకొండదుర్గము, నగరము అవినాభావ సంబంధము కలవియై విలసిల్లినవి. 'ఇది దుర్గము' 'ఇది నగరము' అని గీతగీసి నిర్దేశించుటకు అలవిగానట్లుగ అవి వర్ధిల్లినవి. ప్రాథమికదశయందు దుర్గప్రాంతము, నగర ప్రాంతము విడివిడిగ నుండెను. కాలక్రమమున గోలకొండ సుల్తానులు దేశరక్షణమును, ప్రజా సౌకర్యములను దృష్టియందిడుకొని దుర్గాభివృద్ధి - నగరాభివృద్ధుల కొరకు తమ శక్తినెల్ల ధారపోసిరి. దుర్గప్రాంతమున గూడ నగరము విస్తృతమైనది. ఇంతేకాదు. హర్మ్యములు, ప్రాసాదములు, వేసవి కనుకూలమగు విశ్రాంతి గృహములు, విలాసమందిరములు, నగరమునకు కొన్ని మైళ్ళ దూరమున నిర్మితములైనవి. ఇవన్నియు గోలకొండ నగర పరిధిలో జేరినవై యుండెను.
తెలంగాణ ప్రాంతమునకు గవర్నరుగ నియమింపబడిన
చిత్రము - 122
పటము - 1
"బాలాహిస్సార్"
చిత్రము - 123
పటము - 2
బాలాహిస్సార్ మరియు ఇబ్రహీం కుతుబ్‌షా నిర్మించిన మశీదు
సుల్తాను కులీ మొదట గోలకొండ పరిసరములందుగల ఒకానొక ప్రాంతమును ప్రధానకేంద్రముగ గ్రహించినట్లు తెలియుచున్నది. కాని సుల్తాన్‌కులీ, గోలకొండదుర్గము, నగరము నిర్మింపబడిన తరువాతనే స్వాతంత్య్రమును ప్రకటించు కొన్నట్లు చరిత్రకారులు అభిప్రాయపడుచున్నారు. ఇతడు క్రీ. శ. 1518 లో స్వతంత్రుడయ్యెను. కావున గోలకొండ దుర్గముతోపాటు గోలకొండ నగరస్థాపనము కూడ 1518 వ సంవత్సరమునకు ముందే జరగెనని నిర్ణయించుటయే సమంజస మగుచున్నది. కులీసుల్తానునకు వశముకాకపూర్వము గోలకొండ, చాళుక్యులయొక్కయు, కాకతీయులయొక్కయు అధీనమున నుండెను. ఈదుర్గము తెలంగాణమునకు కేంద్రస్థానమున లేకుండినను, శత్రువుల దండయాత్రలను కనిపెట్టుటకు రక్షణ దృష్టిచే ప్రాధాన్యమును వహించి యుండెనని మాత్రము చెప్పవచ్చును.
సుల్తాను కులీ గోలకొండ దుర్గమును, నగరమును విస్తృతపరచుటకు తగిన ప్రయత్నము లొనర్చెను. ఆతని అనంతరము గోలకొండ సామ్రాజ్య పాలన భారమును వహించిన సుల్తానులు నగరాభివృద్ధికై కృషి సల్పిరి. సుల్తాన్ కులీ కాలమునను, తదనంతరము కొంతకాలము వరకును, గొలకొండ ప్రభువులు తమ రాజ్యమును సుస్థిర పరచుకొనుటయందు అధిక మైన శ్రద్ధను వహించిరి. కొంత కాలమైన తరువాత సుల్తానుల దృష్టి నగరాభివృద్ధిపై కేంద్రీకృత మయ్యెను. కులీ కుతుబుషా, ఇబ్రహీం కుతుబుషా, మహ్మద్ కులీ కుతుబుషా, అబ్దుల్లా కుతుబుషా మొదలగు సుల్తానులు గోలకొండ నగరమును సుందరముగ తీర్చిదిద్దుట యందు శ్రద్ధ వహించిరి.
గోలకొండనగర వైశాల్యమును, నగరమునందు నివసించు ప్రజల సంఖ్య మున్నగు వివరములను తెలుపుటకు ఆధారములు స్వల్పముగ నున్నవి. శతాబ్దములు పై బడిన కొలది గోలకొండ నగరము ఎంతయు అభివృద్ధి నొందినది. అది కులీకుతుబుషా నాటికే జనసంకీర్ణమై వేరొక నగర నిర్మాణమునకు దారితీసినది. గోలకొండ నగర వైశాల్యము దినదినము మారుచుండెను. ఈ కారణము వలననే, నగరము హైదరాబాదు వరకు విస్తృతమైనది. గోలకొండనగరము సుల్తానులకు గాని, అచ్చట నివసించు ప్రజలకు గాని చాలని కాలముకూడ వచ్చినది. కొందరు సుల్తానులు గోలకొండను విస్తృత పరచుటయే గాక, క్రొత్త నగరములను, కోటలను నిర్మించుటకు పూను కొనిరి. సుల్తాన్‌నగరము, నయాఖిల్లా, హైదరాబాదు మున్నగునవి నిర్మింపబడినవి.
మొదటి గోలకొండపట్టణము దుర్గప్రాకారమధ్యగతమున నిర్మింపబడినది. మూడు ప్రాకారములతో అలరారిన గోలకొండ దుర్గముయొక్క కైవార మేడు మైళ్ళు. గోలకొండ నగరమునందు కాంక్రీటుతో నిర్మింపబడిన 50 వేల గృహము లుండెననియు, నగరమున దాదాపు రెండు లక్షల పరిమితికల జనసంఖ్య ఉండెననియు, చరిత్రకారులు అంచనావేసిరి. కాని పరిసరప్రాంతములను, విస్తృత నగర వైశాల్యమును గమనించినచో గోలకొండజనాభా అంతకు మించి యుండు ననవచ్చును. నగరాభివృద్ధికై గోలకొండ సుల్తానులు దాదాపు 78 లక్షల హోనులు వ్యయమొనర్చిరి.
గోలకొండ నగరమన కేవలము సామాన్యప్రజలు నివసించు వీథులుగల ప్రాంతమే కాదు. దుర్గమున నిర్మితము లైన సౌధములు, అక్కడి ఉద్యోగులు, రాజాధికారులు, రాజులు, అంతఃపురస్త్రీలు మున్నగువారి నివాసగృహములు - అన్నియు నగరపరిధిలో చేరును. గోలకొండకు దూరమున నిర్మితములయిన కొన్ని భవనములు, శ్మశాన వాటికలుకూడ నగరమున చేరును. నగరపరిధినుండి దుర్గ ప్రాంతమును తదితరప్రాంతములను తొలగించుట సమంజసము కాదు.
గోలకొండ పట్టణమును నిర్మించుటకు తగిన పథకములను దీర్చినవాడు 'ఆజంఖాను' అను ఇంజనీరు. విస్తృత గోలకొండ నగరనిర్మాణమునకు తదనంతరము భాగ్యనగర నిర్మాణమునకు, నాజర్ - ఉల్ - ముల్క్ వంటి ఇంజనీర్లు ఎందరో పథకములను సిద్దము చేసిరి.
గోలకొండనగరమును మూడు ప్రధానభాగములుగ విభజింపవచ్చును. (1) సామాన్యప్రజానీకము నివసించు భాగము, విపణివీథులు, వర్తక కేంద్రములు మున్నగునవి. (2) రాజసౌధములు, అధికారులనివాసగృహములు సైనికుల వీథులు మొదలగునవి. (3) విస్తృతనగర ప్రాంతము.
తొలిదశయందు మొదటి ప్రాకారమునకును రెండవ ప్రాకారమునకును మధ్యగల ప్రాంతమున గోలకొండ నగరము నిర్మితమైనది. ఇచ్చట సామాన్యప్రజలు నివసించుటకు తగిన సౌకర్యములు కలిగించబడినవి. ఈ ప్రాంతమునగల వీధులు 'మొహల్లా'లని వ్యవహరింపబడినవి. గోలకొండనగరమునందు మీరుజుమ్లామొహల్లా, మాదన్న మొహల్లాలవంటి వెన్ని యో యుండెను. నేటికిని హైదరాబాదులోగల కొన్ని వీథులు మొహల్లాలనియే వ్యవహరింపబడుచున్నవి. రాజమొహల్లా. పంచమొహల్లా — మొదలగునవి యిట్టివే. గోలకొండలోని మొహల్లాలు
చిత్రము - 124
పటము - 3
కుతుబ్‌షాహియొక్క సమాధుల సాధారణ దృశ్యము
'కమా'ను లనబడు చుండెను. హబ్షీకమాన్ మున్నగునవిట్టివే. ఈ సంప్రదాయము నేటికిని హైదరాబాదులో
నిలచియున్నది. చార్‌కమాన్, మఛ్లీకమాన్, అను వాటి పేర చార్‌మీనారు వద్దగల ప్రాంతమును వ్యవహరించు
చున్నారు. మరి కొన్ని ప్రాంతములందు హవుజులుండుట వలన అవి హవుజులపేర ప్రసిద్ధినొందినవి. ఉదా : కటోరా హవుజు.
గోలకొండలోగల రాజసౌధములు మహలులని వ్యవహారమును గాంచినవి. మంత్రులనివాస గృహములు,
రాజాధికారుల సౌధములు, రాయబారులకు, విదేశాగంతకులకు తగిన విశ్రాంతి మందిరములు, సైనికులకు తగిన
వసతి సౌకర్యములు అన్నియు — ఇందుకలవు. రాజ ప్రాసాదములకు సమీపముననే సైనికుల వసతులు
కల్పింపబడినవి. తుపాకిగుండ్లు, యుద్ధ పరికరములు కల భవనము లీ ప్రాంతమునగలవు.
గోలకొండ దుర్గమునకు దాదాపు 87 బురుజులును, 8 ప్రధాన ద్వారములును కలవు. ఇట్టి ప్రధాన ద్వారములను 'దర్వాజాలు' అనుచుండిరి. బంజారాదర్వాజా, ఫత్తేదర్వాజా వాటిలో ముఖ్యమైనవి. మొన్నటి వరకును హైదరాబాదు నగరమును ఆవరించిన కోటలకు ప్రధాన ద్వారములు నాలుగు దిక్కులం దుండినవి. ప్రయాణ సౌకర్యముల దృష్టితో నగరమును విస్తృత పరచుటకై ప్రభుత్వమువారు ఇటీవల ఢిల్లీ దర్వాజా, లాల్ దర్వాజా, గౌలీపురము దర్వాజ అనువాటిని పడగొట్టించిరి. పురాతత్త్వశాఖవారు చరిత్రప్రసిద్ధ మయిన ఫత్తే దర్వాజాను చారిత్రక ప్రాధాన్యముగల కట్టడమని గుర్తించి భద్రముగ కాపాడినారు..
సామాన్య గృహము లన్నియు, ప్రాగ్దక్షిణోత్తర దిశలందుండ, రాజసౌధములు పడమటి దిశయందు నిర్మితము లైనవి. సామాన్య గృహముల విషయము తెలియదు కాని, రాజసౌధముల శిథిలముల వలనను, చెక్కు చెదరని కోటగోడల వలనను, నాటి సౌధనిర్మాణ పద్దతియు, ఇంజనీర్లు సమకూర్చిన సౌకర్యములును తేటపడు చున్నవి. కోటలోని సౌధములు మూడేసి, నాలుగేసి, ఐదేసి అంతస్తులు కలవిగా నున్నవి. ఈ మందిరముల పైభాగమున నేటి రూఫ్ గార్డెన్సు (Roof Gardens) వంటి చిన్న తోటలు కలవు. భవనములందు విశాలమైన గదులు కలవు. స్నానము చేయుటకు, భోజనము చేయుటకు, విశ్రాంతినొందుటకు ప్రత్యేకముగ గదులు నిర్మింప బడినవి. ఎంత ఎత్తైన ప్రదేశమునకైనను, మట్టి గొట్టములద్వారా, నీటి నందించుటకు సౌకర్యములు కల్పింప బడినవి.
సౌధ ప్రాంతములందు చక్కని ఉద్యానవనములు, ద్రాక్షవనములు, జలాశయములు, దుర్గ తటాకములు కలవు. కటోరాహవుజునుండి భూగర్భమున మందిరము
చిత్రము - 125
పటము - 4
ఇబ్రహీం కుతుబ్‌షా సమాధి
ప్రజలకు, రాజులకు నీటి సౌకర్యములు కలిగించుటయే కాక, ఉపరితలోద్యానములకు, ద్రాక్షవనములకు, సుందరోద్యానములకు, నీటినందించుటకు పెక్కు ప్రయత్నములు కావించిరి.
సైనిక ప్రాధాన్యముగల దుర్గమునందు కళాదృష్టితో, సుందర నగర నిర్మాణమునకు సంకల్పించుట కుతుబుషాహీ సుల్తానులకును, నాటి ఇంజనీర్లకును గౌరవకారణ మైనది. బాలాహిస్సారు ప్రాంతమున రెండు కమానులు గల భవనములు కలవు. దీని సమీపమున విశాలమైన అవరణమున్నది. ఇచ్చట గోలకొండ సుల్తానులు సైనిక వందనమును స్వీకరించెడివారు. ఈ ఆవరణమును "జల్వే ఖానా అలీ" అందురు. దీనికి కొలనిదూరమున మూస బురుజు కలదు. ఈ బురుజునకును ఫతేదర్వాజాకును మధ్య ఎన్నియో శిథిలములు కలవు. కోటపైని రాజసౌధములలో తొమ్మిది సౌధములు సముదాయముగగల సౌధరాజము, 'మోతీమహలు' అనునది.
చిత్రము - 128
పటము - 5
మహమ్మదు కులీకుతుబ్‌షా సమాధి
రాజప్రాసాదముల సమీపమున రాయబారులు, విదేశీయులు నివసించుటకు సౌధములు నిర్మింపబడినవి. ఈరాన్‌దేశపు రాయబారి వచ్చినపు డీ భవనమునందే అతనికి సమస్త సౌకర్యములు కలిగించబడినవి. ప్రభువులు దర్భారుచేయుటకు తగిన భవనములు కలవు. రాజ సింహాసనము 'దీవాన్‌ఖాన్' అను భవనమున గలదు. న్యాయ సభలందు ప్రజలువచ్చి తమ కష్టనిష్ఠురములను విన్నవించు కొనుటకును, వారు కూర్చుండుటకును తగిన వసతులు కలవు. 'దౌలత్‌ఖానా' అనునది దర్భారుహాలుగ సుప్రసిద్ధమైనది. బాలాహిస్సారు ప్రాంతముననే 'తానాషాగద్ది' అని ప్రసిద్ధివహించిన రెండంతస్తులభవనము గలదు. 'నగీనా బాగు' అను ఉద్యానవనమొకటి కలదు. జింకల రక్షణము కొరకు గోలకొండ సుల్తానులు ప్రత్యేకోద్యానమును నిర్మించిరి. ఈ వనమునగల జింకలను బాధించుటగాని చంపుటగాని తగదని రాజాజ్ఞ యుండెను. గోలకొండ ప్రాంతమున కొన్ని రాజప్రాసాదములు నిర్మింపబడినవి. ఇవి కోటకు కొన్నిమైళ్ల దూరమున గలవు. మహమ్మదు కులీ హుస్సేన్ సాగరము సమీపమున 'Black Hills' ప్రాంతమున వేసవి విశ్రాంతిగృహమును కట్టించుకొనెను. వర్షర్తువులందు కొన్ని దినములు సుఖముగ కాలక్షేపము చేయుటకు 'మహల్ కోహినూర్' అను భవనమును కట్టించెను. ఈ భవనము ప్రస్తుతము 'ఫలక్‌సుమా' సౌధముగల ప్రాంతమున నిర్మితమై యుండెను.
గోలకొండ నగరమున రాజసౌధములకు సమీపమున అంతఃపురస్త్రీలకొరకు నిర్మింపబడిన జనానామహల్ ఉండెను. స్త్రీలకొరకు ప్రత్యేకముగ నిర్మింపబడిన ఇట్టి భవనములు మరికొన్ని ఉండెను. అంతఃపురమునందే చక్కనితోట లుండెను. అంతఃపురరక్షణకై ప్రత్యేకముగ హబ్షీలు నియమితులగుచుండిరి. ఔరంగజేబు గోలకొండ కోటపై దాడిచేసిన సందర్భమునందు సైన్యము కోటలోనికి ప్రవేశించినపుడు అంతఃపురస్త్రీలను రక్షించుటకు హబ్షీలు తమ ప్రాణములను సైతము ధారపోసిరి. అంతఃపురస్త్రీలు ఆత్మాభిమానము కలవారుగుటచే శత్రువుల చేజిక్కుటకు ఇచ్చగింపక, సమీపమునగల బావులందు దూకి, ప్రాణములను కోలుపోయిరి. ఆ బావుల శిథిలములు నేటికిని కలవు.
ఉమ్రావులు, రాజాధికారులు, మంత్రులు మున్నగువారి కొరకు ప్రత్యేకమందిరములు నిర్మింపబడెను. ధనికులు, రాజాధికారులు, కోట వెలుపల, పరిసర ప్రాంతములందు కూడ ఎ త్తైన భవనములను, విశాలమైన ఉద్యానవనములను, నిర్మించుకొనిరి. అట్టి నిర్మాణ విషయమున గోలకొండ సుల్తానులు ప్రోత్సాహము నొసగిరి. తత్ఫలితముగ కోటయందు, దాని సమీపమునందు నగరము విస్తృతమగుటకు ఏమాత్రము అవకాశము లేని పరిస్థితు లేర్పడెను. అట్టి సందర్భముననే మహమ్మద్ కులీకి హైదరాబాదు నగర నిర్మాణ విషయమున సంకల్పము కలిగినది.
సైనికుల నివాసముకొరకు ప్రత్యేకము అయిన మందిరములు నిర్మింపబడినవి. ఆయుధసామగ్రిని నిక్షిప్తము చేయుట కొరకును ప్రత్యేక మందిరము లుండెను. రాజ ధనాగారములు సైనికాధికారులచే రక్షింపబడుచుండెను. రాజ ధనాగారము లందలి ధనమును దొంగిలించుటగాని, దుర్వినియోగ పరచుటగాని గొప్ప నేరముగ పరిగణింప బడుచుండెను. రాజ ధనాగారమును 'అంబరఖానా' అని వ్యవహరించుచుండిరి. రాజధనమును దుర్వినియోగము కావించినందులకు, అబుల్ హసన్ కాలమున 'మూసా' అను అధికారి కఠినముగ శిక్షింపబడెను. 'మూసా' ఇంటిని సోదాచేసి, 5 లక్షల విలువగల రొక్కమును ప్రభుత్వము వారు తిరిగి పొందగలిగిరి.
సామాన్య ప్రజలు నివసించు వీధులందును. రాజ ప్రాసాదము లందును మసీదులు, ధర్మశాలలు, భిక్షా
గృహములు, యాత్రిక భవనములు, పాఠశాలలు, వైద్యశాలలు, పెక్కులు నిర్మింపబడెను. మసీదు గోడలపై,
గుంబదుల గోడలపై చిలుకలను, గబ్బిలములను, ఉడుతల రూపములను వివిధములయిన రంగులతో చిత్రించు
చుండిరి. కోట ద్వారములపై సింహములను చిత్రించిరి.
గోలకొండ నగరమున సామాన్య ప్రజలు సుఖముగ జీవించిరి. వారి ఆస్తిపాస్తులను రక్షించుటయందును, నగరమున శాంతిభద్రతలను నెలకొల్పుటయందును, సిటీ పోలీసు కమీషనరు (కొత్వాలు) శ్రద్ధ వహించుచుండెడి వాడు. మూడుకాళ్ళ ముసలమ్మ కూడ నిర్భయముగ ఆభరణములతో వెడలుటకు ఎట్టి ఆటంకము లేకుండెను. కాసింబేగ్ వంటి ప్రముఖులు పోలీసు కమీషనరు పదవియందుండి అత్యంత సమర్థులుగా స్థిరకీర్తి నార్జించిరి. మహమ్మద్‌కులీ కాలమున ఎవరికిని మరణశిక్ష విధింపబడలేదు. నగరమునవచ్చు విదేశీయులపై పోలీసువారు గూఢచారులను నియోగించి, వారిచర్యలను అనుక్షణము గమనించు చుండిరి. గూఢచారులు, రక్షకభటులు, విదేశీయులు ఎట్టి విద్రోహచర్యలకు పూనుకొనకుండ జాగ్రత్తవహించిరి.
గోలకొండ ప్రజలలో వివిధ వృత్తులు స్వీకరించిన వారుండిరి. వారి ప్రధానవృత్తి వ్యవసాయము. ప్రభుత్వోద్యోగములలో చేరినవారు కొలదిమంది మాత్రమే ఉండిరి. ప్రభుత్వమునందలి ఉన్నతోద్యోగములు బ్రాహ్మణుల ఆధీనమునం దుండెను. సైన్యములో ఈరాక్, పర్షియాదేశములనుండివచ్చి గోలకొండలో స్థిరపడినవారే కాక, పాశ్చాత్యులుకూడ నుండిరి. నేతపనివారు, కుటీర పరిశ్రమలవారు, కత్తులు మొదలగు ఆయుధములు చేయువారు, నగారా మ్రోగించువారు, నాట్యముచేయువారు, శిల్పులు, చిత్రకారులు, భవననిర్మాతలు, ఉద్యానకృషిలో నిపుణులయినవారు, పల్లకీలు మోయువారు, బోయలు, చక్కని దస్తూరి వ్రాయువారు, ఇట్లు వివిధవృత్తులను స్వీకరించినవారు, ఎందరో ఉండిరి. జ్యోతిష్కులు, పండితులు, మతగురువులు పూజనీయులై యుండిరి.
గోలకొండ, ప్రధానముగ వర్తకకేంద్రము. ఇక్కడి వజ్రములు ఈ నగరమునకు ప్రపంచఖ్యాతి నార్జించినవి. యాత్రికులవలన, వర్తకవ్యాపారము లొనర్చుటకై వచ్చు వారివలన, వింతవింతలయిన విశేషములు తెలియు చున్నవి. కోహినూరు వజ్రముకథ ప్రపంచ ప్రసిద్ధమైనది. గోలకొండనుండి ఆ వజ్రము పయనించి ఎందరినో సామాన్యులను, ధనికులను, చక్రవర్తులను, తన్మకుటములను వరించినది. ఇట్టి గాథ లనంతములుగ గలవు. గోలకొండలో వజ్రములను పరీక్షించు నిపుణు లెందరో ఉండిరి. వజ్రముల పరీక్షించు పద్ధతులుకూడ పలువిధము లయినవి. కొందరు చూచినంతమాత్రమున, కొందరు తాకినంతమాత్రమున, మరికొందరు వాసన చూచినంత మాత్రముననే వజ్రముల మంచిచెడుగులను తెలిసికొనెడి వారట. వజ్రముల గనులు రాజాధికారులయొక్కయు, ధనికులయొక్కయు స్వాధీనమున ఉండినవి. విదేశీయములైన కంపెనీలకు ఈ గనులపై యాజమాన్యము లేకుండ, గోలకొండసుల్తానులు కట్టుదిట్టములు కావించిరి. అక్కన్న మాదన్నలు ఈ విషయమున ప్రత్యేకశ్రద్ధ వహించి విదేశీయములయిన కంపెనీలకు ఎట్టి యాజమాన్యము లేకుండ ఆంక్షలు విధించిరని తెలియుచున్నది. డచ్చివారు వజ్రముల వ్యాపారములో ప్రముఖులుగ నుండిరి.
సుగంధద్రవ్య వ్యాపారసంబంధములు రెడ్డిరాజుల కాలమునుండియు విదేశములకును, ఆంధ్రదేశమునకును మధ్య ప్రగాఢముగ నుండెను. గోలకొండలో అవచి తిప్పయసెట్టివంటివా రెందరుండిరో చెప్పుట కష్టము. వర్తకులు తెచ్చిన సుగంధద్రవ్యములు గోలకొండ విఫణి వీథులందు కొన్ని గంటలలోనే అమ్ముడు పోవుచుండెడి వట. ఇక్కడకు సుగంధాదివస్తువులు తెచ్చి అమ్ముడుపోక, నిరాశాహతులైనవా రెవ్వరును లేకుండిరి. మహమ్మద్‌కులీ కాలమున సుగంధ ద్రవ్యములను దెచ్చిన వర్తకు డొకడు తనసరకు నమ్మలేకపోయెనట. నాటికే రాజుగారి యొద్ద, ధనికులయొద్ద . అట్టి సుగంధద్రవ్యములు రాసులుగ నుండెనట. ఆ వర్తకుడు నిరాశాహతుడై వెళ్ళుచున్న వార్త గూఢచారులవలన రాజుగారి కందినది. రాజు ఆ వస్తువులను కొని రాజసౌధములం దుంచుటకు స్థలము లేకపోయినది. అందుచే, ఆ చక్రవర్తి తక్షణమే వర్తకునియొద్ద కొన్న కస్తూరిని అపుడపుడే హైదరాబాదు ప్రాంతమున నిర్మాణదశలో నున్న సౌధపు పునాదులందు వేయ నాజ్ఞాపించెనట. అప్పటినుండి ఆ సౌధము 'మిష్క్ మహల్' అనగా కస్తూరిభవనము అని ప్రసిద్ధి పొందినదని జనశ్రుతి కలదు. ఇందలి సత్యాసత్యము లెట్లున్నను, గోలకొండ గొప్ప వర్తక కేంద్రమనియు, ఆచట ఎంత సుగంధ సామగ్రినైనను కొనుటకు శక్తిసామర్థ్యములు కలవారుండిరనియు, గోలకొండ విఫణివీథులందు సుగంధాది ద్రవ్యములు అమ్ముడు పోకుండుట లేనేలేదనియు, గోలకొండప్రభువులు వర్తకులకు తగిన సౌకర్యములను కూర్చుచుండిరనియు తెలియుచున్నది.
గోలకొండ ప్రజలు వివిధోత్సవములను మహావైభవముగ జరుపుకొనుచుండిరి. జాతిమతవర్గభేదములులేక గోలకొండ నగరమునందలి ప్రజలు రాజుగారి పట్టాభిషేక - జన్మదినోత్సవములందు పాల్గొనుచుండిరి. నౌరోజా ఉత్సవము, వసంతోత్సవము, మృగశిరాప్రవేశోత్సవము, ఇత్యాది ఉత్సవములందు సమధికోత్సాహమున చక్రవర్తులతోపాటు ప్రజలందరు సంతోషమునొందు చుండిరి. ఈ ఉత్సవములు మహమ్మద్ కులీకాలమునుండి ద్విగుణితోత్సాహమున జరుగుచుండెను.
ఈ ఉత్సవములందు రాజు, రాజాధికారులందరు, మద్యపాన మత్తులై సుఖములందోలలాడుచుండిరి. ఆట కత్తెలు వివిధ నృత్యములచేత రాజునకు వినోదమును కూర్చుచుండిరి. చెలికత్తెలందరు పుష్పాలంకృతలై కోలాటము లాడుచు మైమరచి ఇతరులను మురిపించుచుండిరి.
రాజుగారి పట్టాభిషేకోత్సవము నగరప్రజలకొక పర్వదినము. ఈ సందర్భమున నగరమంతయు సుందరముగ అలంకరింపబడుచుండెను. అంతఃపురములోని చెలికత్తెలు చెరకుగడలతో అమర్చిన పుష్పమంటపమును చేతులతో బట్టుకొ నినీలవర్ణ ఛత్రచ్ఛాయలందు సుల్తాను నాసీనుని గావించుచుండిరి. నీలవర్ణము కుతుబుషాహీల అభిమాన వర్ణము. రాజునకు దృష్టితీయుట, కండచక్కెర తినిపించుట, పుష్పములు, చందనము, సుగంధద్రవ్యములు సమర్పించుట, రాజు పాదములను పారాణితో నలంకరించుట, సురటీలు పట్టుట మున్నగు కృత్యములు మహావైభవముతో జరుగుచుండెను. సన్నాయిలు నగారాలు వీటి మ్రోతలచే దిశలు ప్రతిధ్వనించు చుండెను. ఈ ఉత్సవమున పాల్గొనువారందరును, రాజును వెండి పూలుగల పల్లకియందు ఊరేగించుచుండిరి. చక్రవర్తి జన్మదినోత్సవములందు ప్రజలకు కండచక్కెరను పంచిపెట్టుచుండిరి. బీదలకు అన్నదానము, విద్యార్థులకు వేతనములు విద్వాంసులకు సత్కారములు జరిగెడివి. 'నౌరోజా' (పర్షియనుల ఉగాది) ఉత్సవ మారంభ మయిననాడు సుల్తాను ఆస్థాన జ్యోతిష్కుల వలన సంవత్సర ఫలములను చెప్పించుకొను చుండెను. సామంతులు ఇట్టి ఉత్సవ సందర్భములందు కప్పములు చెల్లించుచుండిరి.
వసంతోత్సవము తెలుగువారికి ప్రియతమ మైనది. రెడ్డిరాజుల కాలమునుండి ఈ ఉత్సవములు మహావైభవముతో జరుగుచు వచ్చినవి. ఢిల్లీసుల్తానులలో అమీరుఖుస్రో కాలమునుండి వసంతోత్సవములు మహమ్మదీయులకు అభిమాన పాత్రములైనవి. వారు వసంతోదయమున చిగిర్చిన పుష్పములను పెద్దల సమాధులపై నుంచెడివారు. స్త్రీలు కేశములను పుష్పములచేత అలంకరించుకొనెడివారు. గులాబిరంగు వస్త్రములను ధరించెడివారు. కుతుబుషాహీ సుల్తాను లీవిధముగ వసంతుని ఆగమనమునకు సంతసించి, తమ ఉత్సాహమును వివిధరీతుల ప్రదర్శించుచుండిరి. కుతుబుషాహీ ప్రభువులలో మహమ్మదు కులీకి అత్యంతా మోదమును, ఉల్లాసమును కూర్చునట్టిది మృగశిరాప్రవేశోత్సవము. ఈ చక్రవర్తి వర్షర్తువులో విహారమునకు బయలుదేరెడివాడు. విలాసముగ కొన్ని వారములు ఆనందమున కాలక్షేపము చేసెడివాడు. 'కోహినూర్ ' భవనమునకు సపరివారముగ వెడలి అచ్చట అనుక్షణము ప్రియాపరిరంభణ సుఖాసక్తుడై మహమ్మదుకులీ మైమరచుచుండెను. చందనము. కస్తూరి, కర్పూరము, కుంకుమపువ్వు మున్నగువాటి వాసనలచే ఆతని సౌధభాగములును, నగరమును గుబాళించుచుండెను. నగరోద్యానములందుగల ద్రాక్షలు రసధునులై, సుందరాంగనల నవయౌవనమును, ప్రేయసీ ధమ్మిల్ల సుమసౌరభములను, కామినీచంచల నేత్రాంచల కజ్జలరేఖాలం కృతులను తమలో రంగరించుకొని, అంతఃపుర ప్రాసాద ప్రాంగణములందు, పానశాలలందు ప్రవహించి, భాగ్యమతీ హృదయ విహారి యగు మహమ్మదు కులీని బ్రహ్మానంద మగ్ను నొనర్చుచుండెను.
గోలకొండ సుల్తానులకాలమున రంజాను, మొహరము వంటి పండుగలు ప్రత్యేక వైభవము కలవై యుండెను. ప్రభుత్వముచే వేలకొలది ధనము వెచ్చింపబడుచుండెను. ఆలంను స్థాపించి రోదన దినములవరకును ఈ పండుగలు మహమ్మదీయ మత సంప్రదాయానుగుణముగ జరుగుచుండెను. ఇందు హిందువులు సమధిక సంఖ్యలో పాల్గొనుచుండిరి. నేటికిని హైదరాబాదులో జరుగు మొహరం పండుగలో హిందువులు అధిక సంఖ్యలో పాల్గొనుచున్నారు.
పట్టాభిషేక వసంతోత్సవాది సందర్భము లందేకాక, సామాన్యకాలము లందును, మహమ్మదీయ సుల్తానులు, అధికారులు, ధనికులు, భోగలాలసత్వమున జీవించు చుండిరి. గోలకొండ రసికుల చిత్తవృత్తి ననుసరించి వేలకొలది వేశ్యాంగనలు, గోలకొండలో స్థిరనివాసముల నేర్పరచుకొనిరి. ఆ కాలమున దాదాపు 25 వేల వేశ్య లుండిరని అనేకములయిన ఆధారములవలన తెలియుచున్నది. రాజులు తమ ఉంపుడుకత్తెలకు ప్రత్యేక మందిరములు నిర్మించెడివారు. ఇరాను తుర్కీదేశములనుండి వచ్చిన సుందరాంగనలుకూడ రాజాంతఃపురములలో చెలికత్తెలుగ ప్రవేశించిరి. గోలకొండ రాజులలో మహమ్మదు కులీయు, తానీషాయు, రసికులుగ ప్రశస్తినొందిరి. మహమ్మద్ కులీకి ప్రియురాండ్రెందరో ఉండిరి. వారిలో భాగ్యమతి, మహమ్మదు కులీ హృదయ దేవతయైయుండెను. భాగ్యనగర నిర్మాణము, ఆమె స్మృతిచిహ్నముగ నేటి హైదరాబాదు రూపమున, కనులపండువై ఒప్పుచున్నది. సరోజిని, పద్మిని, మున్నగుప్రియురాండ్రు ఆతని హృదయమును తమవశ మొనర్చుకొనియుండిరి. గోలకొండ నగరోద్యానములనుండి వీచిన మందమారుతములు ప్రేయసీ ప్రియుల ప్రణయ సౌరభ సంవాసితములై వందలకొలది ప్రేమగాథలకు ఊపిరిపోసినవి. ప్రియురాండ్రపేరనిర్మితములయిన ఉద్యానవనములు, మందిరములు, శిథిలములై నామమాత్రావశిష్టములై, గోలకొండ సుల్తానుల రసికత్వమును వేనోళ్ళ కీర్తించుచున్నవి. గోలకొండ నగరమునగల వేశ్యలలో నృత్యము చేయువారికి ప్రభుత్వము వలన కొంత ధనము బత్తెమురూపమున లభించుచుండెను. వేశ్యలకు నాయకురాండ్రుండిరి. తమ నాయకురాండ్ర ద్వారా వారు వారమున కొకసారి అధికారులను దర్శించుచుండిరి.
గోలకొండ సుల్తానులు తమతమ మత సంప్రదాయ ముల ననుసరించి దుస్తులు ధరించెడివారు. వీరిలో మహమ్మద్ కులీమాత్రము స్థానిక వేషభాషల ననుకరించెను. గోలకొండ ప్రభువులలో మహమ్మదు కులీ ఒక్కడే గడ్డమును తీయించివేసెను. ఆతడు తెలుగుభాషను అభ్యసించి కొన్ని పద్యములు వ్రాసెను. అవి ఇపుడు అలభ్యములు. స్థానికములుగు జరుగు ఉరుసులలో అతడు పాల్గొను చుండెడివాడు.
స్థానిక ప్రజలు తమతమ సంప్రదాయముల ననుసరించి కోట్లు, పాగాలు, దోవతులు, ధరించుచుండిరి. హుక్కా పీల్చుట గౌరవ సూచకముగా భావింపబడుచుండెను. ధనికులు మద్యపానప్రియులై, వేశ్యాలోలురై యుండిరి. ఇక్కడి ప్రజలు శుభ్రమయిన వస్త్రములు ధరించెడివారనియు, చక్కని దేహచ్ఛాయ కలవారై యుండిరనియు ఎత్తైనవారనియు, సుందరాకారము కలిగియుండిరనియు, విదేశీయుల వ్రాతల వలన తెలియుచున్నది. రాజులు, రాజాధికారులు బ్రాహ్మణుల కన్నియలకు వివాహములు కావించుట పుణ్యకార్యముగ భావించెడివారు. వస్త్రదానము, అన్నదానము విరివిగ జరుగుచుండెను.
పెండ్లిండ్ల సందర్భమున, పెండ్లి కుమార్తె కన్నులకు కాటుక, సుర్మా తీర్చెడివారు. చంద్రబింబమువంటి తిలకమును దిద్దువారు. ముత్యాలపాపట తీర్చెడివారు. వివిధ పుష్పములచే కేశాలంకరణము చేసెడివారు. పెండ్లికుమార్తె పాదములకును, చేతులకును, పారాణి నలంకరించెడివారు. ఈ సందర్భమున ముత్తైదువులకును, కన్నియలకును, ముత్యాల అంచు చీరలను కానుకలుగ నొసగుచుండిరి.
గోలకొండ నగరము వివిధ కళలకు విద్యలకు కేంద్రముగ వర్ధిల్లినది. శిల్పము, చిత్రకళ, చక్కని వ్రాత, అభిమాన విషయములుగ నుండెను. భవన నిర్మాణ నైపుణి ఆనాటి వారికి వెన్నతోబెట్టిన విద్యయై యుండెను. సుల్తానుల దర్బారులలో, సమర్థులగు ఇంజనీర్లుండిరి. జ్యోతిష్కులకు, విద్వాంసులకు, మతగురువులకు, కవులకు, గోలకొండ దర్బారునందు సముచితస్థానము లభించినది. యూనానీ, డచ్చి వైద్యులు రాజగౌరవమునకు పాత్రులైరి. సంవత్సరమునకు 800 లు పగడాల వేతనమునిచ్చి ఒకానొక డచ్చి శస్త్ర చికిత్సకుని తన ఆస్థాన వైద్యునిగ నియమించి సుల్తాను గౌరవించెను. రాజు ఫర్మానాలు పారశీకభాషలో నుండెడివి.
చక్కని దస్తూరియే కాక, ప్రత్యేక లేఖనపద్ధతు లెరిగిన గూఢచారులుండిరి. అట్టి లేఖనలను చదువగలిగిన కారణముననే అక్కన్న మాదన్నలు గోలకొండ సుల్తాను ఆదరానుగ్రహములకు పాత్రులైరని జనశ్రుతి. గోలకొండ సుల్తానులు పారసీకము, అరబ్బీ, ఉర్దూ, తెలుగు అను భాషలకు ఉచితరీతి ఆదరము కల్పించిరి. పండితులను కవులను సత్కరించి, వారిచేత కృతులు వ్రాయించిరి. అమీర్ షా, మహమ్మద్ షీరాజీ, కాసింబేగ్ వంటి పండితులు నేటికిని ఉర్దూ, పారసీక వాఙ్మయ చరిత్రలో పేరుపొందిన కవులు. నాటి ఉర్దూ కావ్యములు ప్రత్యేకతను కలిగియుండి, సాహిత్యమునకు అలంకార ప్రాయములయిన రచనలుగా కీర్తింపబడుచున్నవి.
గోలకొండ సుల్తానుల కాలమున తెలుగు కవులు ప్రత్యేకాదరమునకు పాత్రులైరి. రాజులేకాక రాజాధికారులును పండితుల సత్కరించి వారిచేత గ్రంథములు వ్రాయించిరి. ఆనాడు వ్రాయబడిన కావ్యములు ఆంధ్ర వాఙ్మయమునందు ప్రత్యేక గుణములుకలవై యున్నవి. అచ్చ తెనుగు కావ్యరచన కుతుబు షాహీల కాలమున వెలువడుట వారికి స్థిరకీర్తిదాయకమైనది. అద్దంకి గంగాధర కవి రచించిన 'తపతీ సంవరణోపాఖ్యానము', పొన్నగంటి తెలగనార్యుని 'యయాతి చరిత్ర' గోలకొండ సుల్తానులకు, అధికారులకు గొప్పకీర్తి నార్జించినవి. మరిం గంటి సింగరాచార్య కవివంటివారెందరో సుల్తానొసగిన మన్ననలకును, గౌరవ బిరుదములకును పాత్రులైరి. రామదాసు కీర్తనలు తానాషా కాలమున రచింప బడినవే.
గోలకొండ సుల్తానులు ప్రదర్శించిన మత సామరస్య మెన్నదగినది. ప్రభువులు మహమ్మదీయులు. పాలిత ప్రజలలో అధికసంఖ్యాకులు హిందువులు. ఒకటి రెండు సందర్భములందు తప్ప గోలకొండ చరిత్రలో, హిందూ మహమ్మదీయ మత సామరస్యమునకు ఎట్టి భంగము కలుగలేదు. ఔరంగజేబు గోలకొండను ముట్టడించుటకు గల హేతువులలో తానాషా హిందూప్రజలయందు చూపిన అభిమాన మొకటి యని చరిత్రవలన తెలియును. పలువురు హిందువులు గోలకొండ రాజ్య నిర్వహణమున ప్రధానపాత్ర వహించిరి. అది గిట్టనివారికి అసూయా ద్వేషములు కలిగెననుటకు సందేహములేదు. అక్కన్న మాదన్నలు ఉన్నతపదవులలో నుండుట అట్టి అసయా పరులకు మరింత ద్వేషకారణమైనది. గోలకొండసుల్తానులు షియాశాఖకు చెందినవారు. స్థానిక దక్కను ముసల్మానులు సున్నీ శాఖవారు. సుల్తానులు వీరిలో అందరియందును సమదృష్టిని పరపిరి. గోలకొండ సుల్తానుల సర్వమత సమదృష్టి కారణముగా ప్రజలు సుఖమయమయిన జీవితమును గడిపిరి.
మహమ్మదుకులీ కుతుబుషా కాలమునాటికి గోలకొండ పట్టణము జనసంకీర్ణమైన కారణమున అది క్రమముగ విస్తరింప నారంభించెను. భాగ్యమతీ మహమ్మదుకులీ ప్రణయము, మహమ్మదుకులీ వర్షర్తువులో విలాసము కొరకు నెలలతరబడిగా రాజ్యమునుండి దూరముగ నుండుట, హుస్సేనుసాగరు సమీపమున వేసవిగృహము నిర్మితమగుట, గోలకొండలో మహామారి సంభవించి తగ్గిన తరువాత చార్మినారు నిర్మింపబడుట, మక్కామసీదు నిర్మాణాదులు - అన్నియు క్రమముగ మూసీనది తీరమందొక క్రొత్తనగరమును సుందరోద్యానములతో నిర్మింప వలయునను సుల్తానుసంకల్పమునకు మరింత దోహదము కల్పించినవి. దీని ఫలితముగ భాగ్యమతిపేర భాగ్యనగర నిర్మాణము అచిరకాలముననే పూర్తియైనది. గోలగొండ సౌధములను మించు సౌధరాజములు, రాజభవనములు, అంతఃపురములు, దర్భారుహాలులు, న్యాయశాలలు, విద్యాలయములు, వైద్యాలయములు, లెక్కకు మించిన ఉద్యానవనములు నిర్మితములైనవి. జనసంకీర్ణమయిన గోలకొండనుండి కుతుబుషాహి సుల్తానులు పదునారవ శతాబ్దిప్రాంతమున, రాజధానిని హైదరాబాదు నగరమునకు మార్చిరి. ఐనను, గోలకొండ, సైనిక కేంద్రముగ తుదికాలమువరకు సుల్తానుల అధీనముననుండి అభివృద్ధి పొందినది. హైదరాబాదునకు తూర్పున సుల్తాన్‌మహమ్మద్ ఆరంభించిన సుల్తాన్‌నగర నిర్మాణము ఆతని మరణముతో పరిసమాప్తమై భాగ్యనగర మేకైక రాజధానియయ్యెను. భాగ్యనగరము రాజధానికాకపూర్వము మహమ్మద్ కులీ కాలమున దర్బారు 'దౌలత్‌ఖానా' లో జరిగెడిది. ఖుదా దాద్ మహల్ వంటి సౌధములు రాజకీయ కార్యకలాపములకు ఉపయోగించినవి.
గోలకొండ నగరవర్ణనము, గోలకొండ శ్మశానవాటికల వర్ణనములేనిది పూర్తి కానేరదు. లంగర్ హౌజునకు కార్వాన్‌సరాయికి సమీపమున విశాలమైన ఆవరణమున గోలకొండ సుల్తానులు, రాజబంధువులు, పట్టపురాణులు, రాజుల ప్రియురాండ్రు మున్నగువారి సమాధులన్నియు నిర్మింపబడి నేటికిని కుతుబుషాలకాల స్మృతిచిహ్నములై యున్నవి. ప్రపంచమునం దెచ్చటను, ఇన్ని సమాధులు, రాజులకు సంబంధించినవి, ఒక్కచో వినిర్మితములైనవి లేవని గోలకొండను సందర్శించిన టెవర్నియర్ అను ప్రముఖుడు తమ అనుభవములందు వ్రాసెను. గోలకొండ సుల్తానులకు తమ జీవితకాలమునందే తగిన గుంబదులను నిర్మించుకొనుట పరిపాటయినది. ప్రశాంత వాతావరణమున గల ఈ గుంబదులన్నియు, గోలకొండ సుల్తానుల కాలమున చక్కని ప్రాకార కుడ్యములతో భద్రపరచబడినవి. అన్నివేళలందు జనసామాన్యమునకు ఈ గుంబదులందు ప్రవేశ సౌకర్యములు లేకుండెను. హైదరాబాదు ప్రభుత్వమువారిలో సాలారుజంగు ఈ గుంబదుల రక్షణమున ప్రత్యేక శ్రద్ధను చూపెను. ఔరంగజేబు దాడివలన గోలకొండ శిథిలమైనదికాని, ఈ గుంబదులు మాత్రము చెక్కు చెదరక నిల్చియున్నవి. దండయాత్ర లొనర్చినవా రెవరును గుంబదు భవనములను నాశనము చేయుటకు పూనుకొనలేదు. ఇవన్నియు హిందూ - మహమ్మదీయ శిల్పకళా సమ్మేళనమునకు తార్కాణములుగ నిల్చియున్నవి. గోలకొండ సుల్తానులు తమ జీవితకాలమున మహోన్నత సౌధరాజములను నిర్మించుకొని, అందు సుఖించినటుల, మరణించిన తరువాతగూడ, పారలౌకిక సుఖాసక్తులై సుందరతర శిల్పములతో నొప్పు సమాధు లందు దీర్ఘనిద్రనొందిరి. గోలకొండ గుంబదులలో గల పెక్కు సమాధులలో కొన్నిటిపై ఆయా వ్యక్తులయొక్క మరణకాలముకూడ వ్రాయబడినది. కొన్నిటిపై ఎట్టి లిఖితాధారములు లేవు. అవి ఎవరివో తెలిసికొనుట కష్టసాధ్యము. మొత్తముమీద రాజాధికారులు, రాజబంధువులు, ప్రియురాండ్రు మున్నగువారి కొరకే ఈ సమాధులు నిర్మితములైనవనినిశ్చయముగ చెప్పవచ్చును. ఈ గుంబదలకు సమీపమున 'షాహీహమామ్' కలదు. గోలకొండలో చనిపోయినవారి శవములను బంజారా దర్వాజా ద్వారా కార్వానుసరాయి ప్రాంతమున గల యీ స్నాన భవనమునకు తెచ్చెడివారు. ఇచ్చట చక్కగ నిర్మింపబడిన అరుగులపై శవములనుంచి స్నానము చేయించి, మత సంప్రదాయము ననుసరించి అన్ని కార్యకలాపములు పూర్తిచేసెడివారు. గదుల పై భాగమున హవుజులలో నీటిని వేడిచేయుటకు, అక్కడి నుండి గదులకు ప్రత్యేకపు నీటి గొట్టముల ద్వారా వేడి నీటి నందించుటకు చక్కని సౌకర్యములుండెను. చల్లని నీటి నందిచ్చుటకై ప్రత్యేకపు గొట్టములుండెను. స్నానములు చేయించు గదులు నేటికిని చెక్కు చెదరక యున్నవి. ఇక్కడికి వచ్చువారు పాదరక్షలను వదలిపెట్టుటకు ప్రత్యేక స్థానము కలదు. శవములను ఇక్కడినుండి సమాధికి తీసికొనివెళ్ళి సమాధి చేసెడివారు. గోలకొండ రాజ్యస్థాపకుడగు కులీ సమాధి గుంబదు నిరాడంబరముగ నున్నది, గోరీ తలపై ఖురాను భాగములు వ్రాయబడినవి. ఇతడు 1543 సం॥రమున తన కుమారునిచే వధింపబడెను. ఈ సమాధిప్రక్క 21 సమాధులున్నవి. ఇవన్నియు ఆతని బంధువులవై యుండును.
క్రీ. శ. 1580 సం. జూను రెండవతేదినాడు చనిపోయిన ఇబ్రహీం కుతుబుషా సమాధి గుంబదు పై భాగమున గోడలపై రంగుపూతలు చెక్కుచెదరక యున్నవి. ఇతని సమాధియొద్ద ఇతని బంధువుల 16 సమాధులు కూడ నున్నవి.
క్రీ. శ. 1608లో భాగ్యమతి చనిపోయినది. 17 వ డిసెంబరు 1611 సం॥లో మహమ్మద్ కులీ మరణించెను. ఇరువురికి సమాధులు గలవు. మహమ్మద్ కులీ గుంబదు గోలకొండ సుల్తానుల గుంబదులలో సుందరాతి సుందరమైనది. దీని శిల్పనిర్మాణ నైపుణి వర్ణనాతీతము. విశాలమైన రెండు అరుగులు ఒకదానిపై మరొకటి కలవు. క్రింది అరుగు 200 చ, ఆడుగుల వైశాల్యము కలది. పై అరుగు 120 చ. అడుగుల వైశాల్యము కలదిగ నున్నది. దీనిపై 180 అడుగుల ఎత్తు గుంబదు నిర్మింప బడినది. ఇది గ్రెనైటు రాళ్ళతో అందముగ నుండును. గుంబదులోపల మహమ్మద్ కులీ నల్లరాతి సమాధి కలదు. విశాలములైన ఈ గుంబదు అరుగులపై బ్రిటిషు ప్రభుత్వమువారి కాలమున విందులు జరిగెడివి. ఇపుడు ప్రతి సంవత్సరము 11 జనవరినాడు మహమ్మదు కులీ స్మృతిచిహ్నముగ వైభవముతో ఉత్సవములు చేయబడుచున్నవి. మహమ్మద్ కుతుబుషా సమాధి సమీపమున ఇతని ప్రియురాలు తారామతి సమాధియు, ఇతని కుమారుని ప్రియురాలు ప్రేమామతి సమాధియు క లవు.
ఇబ్రహీం గుంబదు సమీపమున గోలకొండ సైన్యాధిపతి నేక్‌నాంఖాన్ సమాధికలదు. ఇతడు 1763 సం. మార్చి 30 వ తేదినాడు చనిపోయెను. ఈ గుంబదులో గల సమాధిరాతిపై శాసనమొకటి కలదు. గోలకొండ సమీపమునగల మంగళారము అను పల్లెయొక్క రెవెన్యూ ఆదాయము, ఈ సమాధివద్ద ఖురాను చదువువారికి, సమాధి దగ్గర రేపగలు ఉండి కార్యకలాపములు నిర్వహించువారికి, సమాధిదగ్గర దీపములు వెలిగించుటకు, వినియోగింప వలయునని శాసన భావము. ఇంకను కొన్ని గుంబదులు కలవు.
1645-53 ప్రాంతమున గోలకొండను దర్శించిన టెవర్నియరు అను పాశ్చాత్యుడు ఈ గుంబదులను జూచి ముగ్ధుడై పోయెను. సాయంకాలము ఆరుగంటల సమయమున ఈగుంబదులకు వచ్చిపోవువారికి రొట్టెలు, పులావు పంచిపెట్టుచుండిరని టెర్నియరు వ్రాతలవలన తెలియుచున్నది. విలువగల జంపుఖానాలు ఈగుంబదు ప్రాంతమున ఎల్లప్పుడును పరచి ఉంచెడివారట.
తానాషా కాలములో జరిగిన ఔరంగజేబు ముట్టడివలన గోలకొండ మొగలు సైన్యములకు వశమైనది. 'లారీ' వంటి స్వామిభక్తులు, దేశాభిమానముగల వీరులు, కొందరుండి యున్నచో గోలకొండ దుర్గము శత్రు హస్తగతము కాకుండెడిది. గోలకొండ కోటలోనికి శత్రుసైన్యము వచ్చునపుడు ఒక కుక్క మొరిగి స్థానిక సైన్యమును మేల్కొల్పినదట. దానికి 'ఫెరోజ్ జంగ్ ' అను బిరుదు నిచ్చిరి. దాని కంఠమును బంగరుపట్టాతో అలంకరించిరి. వీరుల దేశాభిమానమున కిది చిహ్నప్రాయము. కోటద్వారములు తెరచిన స్వామిద్రోహి అబ్దుల్లాఖానును గోలకొండ ప్రజలెన్నడును విస్మరింపలేదు. మొగలువారు సమర్పించిన ధనరాసులకు దాసులై వారి సైన్యములో చేరిన ఇతర స్వామిద్రోహులవలె అబ్దుల్లాఖాన్ కూడ మొగలు సైన్యమున చేరియున్న బాగుగ నుండెడిది. కాని అతడు గోలకొండ సైన్యమున నుండి 1686 వ సం. రము 21 సెప్టెంబరునాడు అర్ధరాత్రమందు కోటద్వారములు తెరచి మొగలుసేనలకు స్వాగత మొసగెను. ఈ దాడిఫలితముగ 11/2 శతాబ్దికిపైగా వైభవదశ ననుభవించిన గోలకొండనగరము ఔరంగ జేబు చేజిక్కి తన సౌభాగ్యమును కోల్పోయినది.
గోలకొండ వైభవమును తెలుగుకవులు, ఉర్దూకవులు ఎందరో కీర్తించియున్నారు. మహమ్మద్‌కులీ వ్రాతల వలన, ప్రణయగీతికలవలన, చరిత్రకారుల అనుభవముల వలన, విదేశీయులు, రాయబారులు వ్రాసిన గ్రంథముల వలన, గోలకొండ వైభవము నేటికిని కన్నుల గట్టినట్లున్నది. పొన్నగంటి తెలగన్న తన యయాతిచరిత్ర కావ్య పీఠికయందు గోలకొండను ఈ విధముగ వర్ణించెను :
"తెఱగంటి దొరఱాల తెగలఁదీఱినకోట
నిగనిగల్ నలుగడల్ నిండియుండఁ
దమ్ముల పాదు రాకొమ్మల దగదగల్
వేలుపుఁ బ్రోలిర్లు విరియఁజేయఁ
గొత్తడంబుల కెంపు క్రొత్తడంబుల రంగు
నింగికిఁ దోపు వన్నియలు నింపఁ
గడలి యోనని చిల్వపడతి చాల గడిత
తెలనీటి నే ప్రొద్దు గలసియుండ
మిసిమి బంగారు మేడలమీఁది యెదల
నిడిన ముత్యాలుఁ జుక్కలుఁ దడవడంగఁ
దెలియకెల్లరు వెఱగంద నలరునెపుడు
మేలు వజ్జీర్లగమికొండ గోలకొండ.
కో. గో.