సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/క్షేత్రపాయనము - మురుగుపారుదల

క్షేత్రపాయనము - మురుగుపారుదల :

నీటిపారుదల ఎందులకు అవసర మగుచున్నది? పంటలు పండుటకు వర్షపునీరు చాలనపుడు తక్కువ యయిన నీటిని నదులమూలమున, తటాకముల మూలమున, బావుల మూలమున పొలములకు పారుదలు చేసి సస్యాభివృద్ధికి తోడ్పడవలసి యున్నది. లేనిచో మొక్క యొక్క అభివృద్ధి కుంటువడి, ఫలితము నీరసించును. పంటభూములకు అదనపు నీటిని కృత్రిమముగా అందజేయు విధానము క్షేత్రపాయన మనబడును. (Irrigation).

స్వాభావిక మైన వర్ష జలము ఒక ప్రాంతపు పంట భూములకు చాలినంత లభించినచో, కృత్రిమమైన నీటి పారుదలతో సామాన్యముగా అవసరము కలుగదు. ఉదాహరణమునకు దక్షిణ భారతములో సమయానుకూలముగా పడు వర్షజలము, ఆ ప్రాంతములోని జొన్న, వేరుసెనగ, ప్రత్తి మొదలగు పంటలకు సామాన్యముగా సరిపోవును, ఇవి పండు పొలములను మెరక పొలములనియు, ఈ పంటలను మెరక పంటలనియు వాడుకగా పిలుతురు. దీనినే మెరక సాగనియు లేక మెట్ట వ్యవసాయమనియు అందురు. ఇట్టి భూములయందు నీటిపారుదలతో అవసరముండదు. ఇట్టి పొలములలో పంటలు సాధారణముగా తక్కువస్థాయిలో పండును. నీటి వనరులున్న ప్రదేశములలో అధికతరమైన పరిమాణములో పంటలను ఉత్పత్తి చేయవచ్చును.

నీటి పారుదల విధానములు :

నీటి సరఫరా : నీరు ఉత్పత్తి అయ్యెడి స్థలమునుండి పంట భూములకు కాలువల మూలమున నీటిని పారుదల చేయుదురు. ఇవి మట్టి కాలువలగుటవలన, నీరు పొలములకు చేరెడి లోపుననే ఎక్కువ భాగమును భూమి పీల్చివేయును. కాగా పంట భూములకు సరఫరా అయ్యెడి నీరు నిరంతరము తగ్గుచునేయుండును. ఇసుక నేలలందు అధిక జలము వ్యర్థముగా భూమియందు ఇంకిపోగా, బంకమట్టి నేలలయందు ఇట్లు వ్యర్థమగు జలము అతిస్వల్పముగ మాత్రమే ఉండును. ఏటవాలుగాఉన్న ప్రాంతము కంటె, సమతలముగానున్న భూమిపైన పొడుగైన కాలువల త్రవ్వకము అవసరమగును. మట్టికాలువలలో ఒండు పేరుకొన్నను, లేక గడ్డి, గాదము పెరిగియున్నను, నీటి పారుదలకు ఆటంకము కలిగి పంటభూములకు నీరు సక్రమముగా సరఫరా కాజాలదు. అందువలన ఇట్టి కాలువలను తరచుగా పరిశుభ్రము చేయుచుండవలెను. ఇటిక, సిమెంటులతో నిర్మింపబడిన కాలువల వలన నీటి నష్టము చాలావరకు తగ్గును.

ఉపరితలక్షేత్రపాయనము : భూమియొక్క ఉపరితలము పైనను, భూమి అడుగుభాగమునుండి, పైరు పై భాగము నుండి పంటపొలములకు అనేక విధములుగా నీటిని సరఫరా చేయవచ్చును. ఉపరితలమున పొలములకు నీటి పారుదల సాగించు విధానమును 'ఉపరితలక్షేత్రపాయన’ (Surface irrigation) మందురు. దక్షిణ భారతదేశములో ఈ విధానము సర్వసామాన్యముగా అమలునందున్నది. ఈ విధానమునందు (1) ఫ్లడ్ ఇర్రిగేషన్, (2) బెడ్ ఇర్రిగేషన్, (8) ఫర్రో ఇర్రిగేషన్, (4) ట్రెంచ్ ఇర్రిగేషన్, (5) బేసిన్ ఇర్రిగేషన్ అను అనేక మార్గములు అవలంబింపబడుచున్నవి.

1. ఫ్లడ్ ఇర్రిగేషన్ : వరిపొలములలో నీటిని నిలువచేసి వరిమొక్కలను నాటి పెంచెదరు. చెఱకు, అరటి, పసుపువంటి పంటలుకూడా నీటిని నిలువచేయుట మూలముననే పండుచున్నవి. అవసరము తీరగా మిగిలిన నీరును వెలుపలికి తోడివేయుదురు.

2. బెడ్ ఇర్రిగేషన్: బావులనుండి నీటిని పొలములకు సరఫరా చేయువిధానము 'బెడ్ ఇర్రిగేషన్' అందురు. భూమిపైన చినచిన్న 'మడులు' (beds) ఏర్పాటుచేసి, ఆ మడులలో నీరు సమముగా నిలువయుండునట్లు చూచెదరు. ఇట్టి నీటి సరఫరా విధానము కాయగూరల తోటలలో ఎక్కువగా వాడుకయందున్నది. ఈ దిగువ ఉదహరింపబడిన పరిమాణములలో కాయగూరల మడులు ఏర్పాటు చేయబడును.

నీటిని అందజేయు సాధనము. అడుగులలో మడుల పరిమానము. చ. అడుగులలో మడుల వైశాల్యము
ఒక మోట నీరు 8 × 8 - 10 64 నుండి 80
రెండు మోటల నీరు 10 × 10 - 13 100 నుండి 130
ఎలిక్ట్రిక్ పంపు 15 × 15 - 20 225 నుండి 300

3. ఫర్రో ఇర్రిగేషన్ : భూమిని నాగలితో చాళ్లుగా తయారుచేసి, ఈ చాళ్ల ద్వారా నీటిని నెమ్మదిగా పారుదల చేయుదురు. చాళ్ల అడుగుభాగము క్రమముగా నాని, రెండుచాళ్ల నడుమనుండు మెరక భాగము గూడ చెమ్మగిలును. ఈ విధముగా నీరు కొంతవరకు పొదుపగును. భూమిమీదనున్న నీరు ఆవిరి యగుటకు గూడ తక్కువ అవకాశముండును. తడిగాలులు వీచెడి తరుణములో ఈ నాగటిచాళ్లు నీటి బోదెలుగా ఉపయోగించును. ఈ విధానమువలన, నిలువ నీటియందువలె పంటలు నష్ట పడవు. నాగటి చాళ్ళద్వారా నీరును పారుదలచేయు విధానము, విశాలభూములలో పండు ప్రత్తి, పుగాకు, మిర్చి, బంగాళాదుంప, ఉల్లి మొదలగు పంటలకు అనువుగా నుండగలదు. చెఱకుపంటలకు అవసరమయిన వెడల్పును లోతునుగల నాగటిచాళ్ళను తయారుచేసి వాటిద్వారా పుష్కలముగా నీటిని సరఫరా చేయుదురు. 10 మొదలు 30 అడుగుల దూరమునకు ఒక్కొక్క కాలువ చొప్పున తయారుచేసి, వీటినుండి నాగటిచాళ్ళలోనికి నీరు పారునట్లు ఏర్పాటు చేయుదురు. ఇంతకు పూర్వ ముదహరించినట్లు, సమతలమునందు దీర్ఘపరిమాణపు నాగటిచాళ్ళను, ఏటవాలు ప్రాంతమునందు పొట్టి నాగటిచాళ్ళను తయారుచేయుదురు.

4. ట్రెంచి ఇర్రిగేషను : పల్లపు భూములలో అరటి తోటలను పెంచుటకై అప్పుడప్పుడు ఫ్రెంచి ఇర్రిగేషన్ విధానము అవలంబింపబడును. అరటిమొక్కలను ఎటుచూచినను 6 నుండి 8 అడుగుల ఎడముగా ఒక్కొక్కటి చొప్పున నాటెదరు. అరటిచాళ్ళకు మధ్య నిలువుగను, అడ్డముగను రెండుఅడుగుల వెడల్పు, ఒకటిన్నర అడుగుల లోతుగల కాలువలను త్రవ్వెదరు. ఈ కాలువలలోనికి వదలబడిన నీరు నిలువయుండి, పై యెత్తున నుండు మడులను క్రమముగా తడుపును.

5. బేసిన్ ఇర్రిగేషన్ : పండ్ల తోటలలో వృక్షముల చుట్టును వలయాకారములో పాదులను తయారుచేసి, కాలువల మూలమున వాటిలోనికి నీరును ప్రవేశపెట్టెదరు. తోటనంతయు జలమయము చేయరు. తరచుగా నీరు అవసరమైన లేదోటల పెంపకమునకు ఈవిధానము ముఖ్యముగా ఉపయోగపడును.

భూమి అడుగుభాగమునుండి నీటి పారుదల: ఈ నీటి పారుదల విధానములో భూమియొక్క ఉపరితలము నుండి ఒక అడుగు లోతున 3 - 5 అడుగులకు ఒక్కొక్కటి చొప్పున 'పోరస్ ' (సూక్ష్మమైన రంధ్రములుగల) గొట్టములను సమాంతరము (Parallel) గా అమర్చెదరు. జలాశయము నుండి ఏర్పాటు చేయబడిన ముఖ్యమగు గొట్టములకు ఈ చిన్న గొట్టములు కలుపబడును. ఈ కలుపబడిన చోట్లు (joints) అతికించబడవు. ఈ గొట్టముల ద్వారా స్రవించు జలము మొక్కల యొక్క మూలమునకు చేరుకొనును. ఈ విధానము వలన నీరు ఎంతో పొదుపగును. కాని ఇది ఎంతో వ్యయముతో కూడిన విధానమగుటచే సామాన్యమైన పేదరైతులు ఈ పద్ధతిని అనుసరింప లేరు.

ఊర్ధ్వభాగము నుండి నీటి పారుదల: ఈ పద్ధతి ననుసరించి గుండ్రముగా పరిభ్రమించు రంధ్రములుగల గొట్టములు భూమికి ఎత్తుగా పై భాగమున అమర్చబడి యుండును. ఒత్తిడి ఫలితముగా నీరు ఈ గొట్టములద్వారా సరఫరా చేయబడును. నీటియొక్క త్వరిత గమనము వలన, పై పేర్కొనబడిన రంధ్ర భాగములు గుండ్రముగా తిరుగుచు పైరుమీద సన్నని వర్షపు జల్లువలె నీటిని వదలును. ఒక్కొకప్పుడు రంధ్రములు గలిగిన ఈ గొట్టములు వరుసగా పాతబడిన స్తంభముల ఆధారముతో 30 నుండి 40 అడుగుల దూరమున నిర్మింపబడును. తీవ్రమైన ఒత్తిడితో నీటిని సరఫరా చేయుటవలన, గొట్టముల మూలముగా నీరు వర్షపు జల్లువలె పైరుమీద పడును. ఈ విధానము చాల వ్యయశీలమైనట్టిది. దీనివలన పంట పొలముచే అత్యధిక పరిమాణములో నీరు ఉపయోగింప బడును. కాఫీ, పుగాకు, కూరగాయల తోటలకు ఈపద్ధతి వలన అధిక ప్రయోజనము కలుగును.

మురుగు పారుదల : ఎందుకును పనికిరాని నీటిని వెలుపలికి పంపివేసి, ఆ నీటి సహాయముతో కొన్ని రకములైన పంటలను పండించుటయే ఈ మురుగునీటి పారుదల విధానముయొక్క ముఖ్యోద్దేశము. కొన్ని రకములైన పంటలు పండుటకు అవసరమైన ఆహార పదార్థములు ఈ మురుగునీటి యందు లభించగలవు. మురుగునీటి పారుదలకు ఇసుక, గులకరాయితో కూడుకొన్న భూములు ఎక్కువ అనువుగా నుండును. ఇట్టి నేలలందు నీరు వెంటనే సులభముగా ఇంకిపోవును. బంకమట్టి భూములు మురుగునీటి పారుదలకు పనికిరావు. కొంతవరకు నీటిపారుదల జరిగిన పిదప జంతువృక్ష సంబంధమగు తుక్కుపదార్థముతో బంకమట్టిలోని రంధ్రములు పూడిపోయి నీరు ఇంకదు. కనుక పైరుల పెరుగుదల నిలచపోవును.

నీటి పారుదలను సమర్థవంతముగా, పొదుపుగా నిర్వహించుట : నీటిపారుదల విధానమును సమర్థవంతముగను పొదుపుగను నిర్వహించుటకు ఈ క్రింది చర్యలను అవలంబించవలెను :

1. భూమి ఉపరితలమును, సహజ సిద్ధముగా నున్న ఏటవాలు ననుసరించి మెత్తగా, చదునుగా తయారు చేయవలెను.

2. భూమి స్వభావమునకు తగినట్లుగా పండింపదలచుకొన్న పైరులకు అనువగునట్లు నీటిపారుదల విధానమును నిర్ణయించవలెను.

3. నేలను కోత కోయకుండా, పైరుకు చాలినంత నీటిని పుష్కలముగా సరఫరా చేయునట్లు కాలువల త్రవ్వకమును ఏర్పాటు చేయవలెను.

4. భూమిని లోతుగా, చక్కగా దున్నవలెను. నీరు భూమిలోనికి పూర్తిగా చొచ్చుకొని పోవునట్లు మట్టిగడ్డలను మెత్తగా చితుకగొట్ట వలెను.

5. భూమిని తరచుగా దున్నుచు, కలుపును నిర్మూలము చేయుచుండవలెను. పైరుమీద పరిశుభ్రమైన గాలి వీచునట్లు ఏర్పాటు చేయవలెను.
6. నేలను పదునుచేసి, సారవంతముగా చేయవలెను. సారవంతమైన భూమి తక్కువ నీటిసరఫరాతో మంచి ఫలితముల నివ్వగలదు.

7. సకాలములో మాత్రమే పైరులకు నీటిని అందజేయవలయును. ఏ తరుణములో ఏ పైరు నాటవలెనో జాగ్రతగా ఆలోచించి నిర్ణయించవలెను.

8. మురుగునీటిని వెలుపలికి పంపుటకు అవసరమైన చర్యలు తీసికొనవలెను.

9. పొలముయొక్క దిగువభాగమునకు ప్రవహించి వచ్చిన నీటిని పైరు పెంపకమునకై మరల పారుదలకు ఉపయోగించవలెను.

మురుగుపారుదల : పైరుకు అవసరమగు నీరు సరిపోగా, అదనపు నీటిని పొలమునుండి వెలుపలికి పంపివేయుట వ్యవసాయ విధానములో ముఖ్యమైన అంశము. నిలువనీరు పైరుయొక్క పెరుగుదలను నష్టపరచి పంటను తగ్గించివేయును. బాడవప్రదేశములందును, క్షారభూములందును, రేవడ పొలములందును, నీరు భూమిలోనికి ఇంకని ఇతర చోటులయందును మురుగు పారుదల సౌకర్యములు అవసరమగును.

భూమి ఉపరితలమునుండిగాని, భూమి లోతట్టు భాగమునుండిగాని నీటిని తోడి పారబోయవలెను. సవ్యమైన మురుగుపారుదల విధానమును అమలునందుంచిన యెడల, పంటలకు నష్టదాయకముగా పరిణమించెడి క్షార పదార్థములను, మిక్కుటమైన వర్షములవలన, నీటిపారుదలవలన కలిగెడి విపరీతమైన చిత్తడిని, చెమ్మను వేరు చేయవచ్చును. ఈ క్షారపదార్థములు, చిత్తడి, చెమ్మమిక్కుటముగా ఏర్పడినచో పంట నష్టపడును. మొక్కయొక్క అభివృద్ధికై గాలియొక్కయు, చెమ్మయొక్కయు పాళ్లు తగు సామ్యములో నుండునట్లు చూడవలెను. ఆరోగ్యకరమయిన వాయువు పైరుపై సోకిననేగాని పంటలకు హాని కలుగజేయు విషవాయువులు నశించవు.

వర్షములు వెనుకబడిన తర్వాత బాడవభూముల యందు వ్యవసాయము ప్రారంభింప వచ్చును. ఇట్లు ప్రారంభించిన యెడల సకాలములో విత్తనములు' నాటుటకును ఇతరములగు పొలము పనులు కొనసాగించుటకును వీలగును. ఒక్కొక్క సమయములో విత్తనములు నాటుటయందు ఒక వారము రోజులు ఆలస్యమైనను పంటలో నూటికి 10 నుండి 50 వంతులు వరకు నష్టము కలుగును.

బాడవప్రదేశములందు మొక్కయొక్క వ్రేళ్ళు భూమియందు లోతుగా చొచ్చుకొని పోవలెను. మొక్కయొక్క అభివృద్ధికి దోహద మొసగు సూక్ష్మక్రిముల కార్యకలాపము అధికమగును.

మురుగునీటి పారుదల విధానములో రెండు పద్ధతులు గలవు.

(ఎ) భూమి ఉపరితలమున కాలువలగుండ మురుగునీరు ప్రహించుట.

(బి) భూమి అడుగుభాగమున ప్రవహించుట.

ఉపరితలమున కాలువలద్వారా ప్రవహించు విధానమే శ్రేష్ఠమయినది, పొదుపైనది. ఉపరితలమున నిలువ యుండిన మురుగునీరు అధికమైన పరిమాణములో ఈ కాలువలద్వారా త్వరగా బయటికి పోగలదు. పర్వత పరిసరములయందు నిలువయున్న మురుగునీరు ఈ కాలువలద్వారా నిరాటంకముగా, స్వేచ్ఛగా వెడలిపోవును.

అయితే ఈ విధానమువలన చాల నష్టములుగూడ నున్నవి. సాగుకు పనికివచ్చు భూమిని ఈ మురుగు కాలువలు ఆక్రమించుకొనును. కావున ఎప్పటి కప్పుడు ఈ కాలువలను మరమ్మతుచేసి బాగుచేయవలెను. ఇంతేకాక, ఈ కాలువలు పశువులకు ప్రమాదకరముగా పరిణమించును. ఈ కాలువలలో కలుపు బలిసి, పంటలకు నష్టము కలుగజేయు జాడ్యములు అంకురించును.

భూమి లోతట్టు భాగమునుండి ఏర్పాటగు మురుగు కాలువలు కాల్చిన మట్టిగొట్టములతోను, సిమెంటు కాంక్రీటు గొట్టములతోను నిర్మితమై, నీరు ధారాళముగ ప్రవహించుటకై భూమి ఉపరితలమునుండి 5 అడుగుల లోతుగా అమర్పబడును. భూగర్భములో అమర్పబడుట వల్ల ఇట్టి గొట్టములతో ఏర్పాటైన మురుగుకాలువలు ఉపరితలమున జరుగు వ్యవసాయమునకు ఏ విధముగను ఆటంకము కలిగించవు. ఇంతేకాక ఇట్టి కాలువలను నైపుణ్యముతో అనేక రీతులుగా నిర్మించుటకు వీలగును. వీటి రక్షణకుగూడ శ్రమపడవలసిన అవసర ముండదు. చిత్తడి నేలలందు 150 మొదలు 300 అడుగులవరకు ఒక్కొక్కటి వంతున కాలువలు నిర్మింపబడును. ఇసుక నేలలందు 300 మొదలు 600 అడుగులకు ఒక్కొక్కటియు, రేవడిభూములందు 30 మొదలు 40 అడుగులకు ఒక్కొక్కటియు కాలువలను నిర్మింతురు. నీటిపారుదల ప్రదేశములలో ఒక మైలు పొడవుగల ఇట్టి కాలువల మూలమున 80 ఎకరముల నేల తడిసి, సాగగును. ఈ కాలువల నిర్మాణమునకు ఉపయోగపడు సిమెంటు కాంక్రీటు పెంకులయొక్కగాని, కాల్చిన మట్టి పెంకులయొక్కగాని కొలత, కాలువయొక్క ఏట వాలును బట్టియు, పారుదల కావలసియున్న నీటి పరిమాణమును బట్టియు నిర్ణయింపబడును.

ముగింపు : సరియైన నీటి సరఫరా, మురుగు నీటిపారుదల - ఈ రెండును ఏపు అయిన పైరుల పెంపుదలకు, పుష్కలమైన పంట రాబడికి అవసరము. సవ్యమైన మురుగు పారుదల విధానమువలన పైరుకు అవసరమైన నీటిని వెలుపలికి పంపి, పంటలయొక్క ఆరోగ్యమును కాపాడుటకు వీలగును.

ఈ విధముగా పైరులకు ఏర్పాటుచేయు నీటిసరఫరా, మురుగునీటి పారుదల - ఈ రెండును అన్యోన్యాధారములై పంటల ఆరోగ్యమును కాపాడుటకును, అధికమగు ఫలసాయమును పొందుటకును దోహద మొసగును.

బి. ఆర్. బి.