సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/క్షేత్ర యంత్రములు
క్షేత్ర యంత్రములు :
భారతదేశముయొక్క ఆర్థిక సౌష్ఠవము వ్యవసాయముపై ఆధారపడియున్నది. ఇతర పరిశ్రమలవలెనే, వ్యవసాయోత్పత్తియొక్క సత్ఫలితములు ఈ రంగమునం దుపయోగించు పరికరములపైనను, యంత్రములపైనను ఆధారపడియుండును. వ్యవసాయ విధానములో సాగుబడి కుపయోగించు పరికరములును, యంత్రసామగ్రియు ఈ క్రింది విధముగా సహకరించును.
1. పైరు ఏపుగా పెరుగుటకై మున్ముందుగా నేలను లోతుగా కెళ్ళగించి పదును చేయవలెను. ఇందులకై కలుపు తీయుట, మంటి గడ్డలను మెత్తగా చితుకగొట్టుట, వర్ష జలమును పీల్చుకొనునట్లు భూమిని తయారుచేయుట, సహజమైనట్టియు, కృత్రిమమైనట్టియు ఎరువులను దున్నిన నేలలో చక్కగా కలిపివేయుట, వేళ్ళు బలిష్ఠముగా అభివృద్ధి నొందుటకై ఆరోగ్యకరమైన గాలి సోకునట్లు చేయుట అవసరము. ఈ కార్యకలాపములకై ఏదో యొకవిధమగు పరికరముల సహాయమవసరమగు చున్నది.
2. పొలములో విత్తనములు వెద పెట్టుటకును, పంటను కోత కోయుటకును, నూర్పిడి చేయుటకును, తూర్పారపట్టుటకును ఇతర వ్యవసాయ కార్యక్రమమును కొనసాగించుటకును సాధ్యమైనంత తక్కువమంది కార్మికులను నియోగించుట అవసరము. ఇటులనే వ్యవసాయోత్పత్తి కగు వ్యయమును తగ్గించుటయు, ఉత్పత్తిని అధికతర మొనర్చుటయు కూడ అవసరము.
వ్యవసాయయంత్ర పరికరములు వాటి విధులు : వ్యవసాయ యంత్ర పరికరములను ప్రధానముగా రెండు వర్గములుగా విభజింపవచ్చును.
(1) సాధారణముగా ఈ క్రింది పరికరములను పంటలను పండించుటకై వ్యవసాయదారులు ఉపయోగింతురు.
1. నాగళ్లు. 2. గుంటకలు లేక పాపటములు, 3. కట్టలను నిర్మించు యంత్రము (Bund-former), 4. విత్తనములు వెద పెట్టు నట్టియు, మొక్కలు నాటు నట్టియు యంత్రములు, 5. భూమిని త్రవ్వు రకరకములైన సాధనములు, 6. పంటలను కోతకోయు పరికరములు, యంత్రములు, 7. నూర్పిడిచేసి, తూర్పారపట్టు యంత్రములు.
(2) ఆహార ధాన్యములను, పశుగ్రాసమును శుభ్రపరచి క్రమవిధానములో వేరుపరచుటకై ఈ క్రింది యత్నములు గూడ అవసరమగుచున్నవి.
1. చెఱకు గడలను చితుకగొట్టు యంత్రము (Sugar-cane crusher), 2. వేరుసెనగ పొట్టు ఒలుచుయంత్రము (ground nut decorticator), 3. పర్షియన్ చక్రములు, పంపులు (Persian wheels and pumps). 4. నూనె గానుగలు (Oil ghanies), 5. పశు గ్రాసమును నరకు యంత్రము (chaff cutter).
ఇతర ముఖ్య యంత్రపరికరముల వర్ణనము :
1. నాగళ్లు : ఈ పరికరము మున్ముందుగా భూమిని దున్నుటకును, పైరు నాటిన తర్వాత కొంత కాలము వరకును విరివిగా వాడబడును. దేశీయమైన నాగలి, మౌల్డ్ బోర్డు నాగలి (mould board plough) అను రెండు రకముల నాగళ్ళు కలవు.
చిత్రము - 38
పటము - 1
దేశీయమైన నాగలి కొయ్యతో చేయబడును. దీనిలో ఏడికర్ర, కర్రు, మేడి అను భాగములు అమర్చబడి యుండును. దీనిని వంకరయైన తుమ్మకర్రతో గాని, ఏపె కర్రతోగాని తయారు చేయుదురు. 'కర్రు' అను ఇనుప ముక్క సన్నగా చెక్కబడిన నాగలి చివరభాగమునకు అమర్చబడి నేలను దున్నుటకు అనుకూలముగా ఏర్పాటు చేయబడును. చిన్న నాగళ్లను పల్లపు భూముల వ్యవసాయమునందును, మధ్యరకపు నాగళ్ళను మెట్ట వ్యవసాయమందును, తోటల సాగుబడియందును ఉపయోగించెదరు.
నేలను లోతుగా కెళ్ళగించుటకును, నారుమళ్ళు తయారు చేయుటకును భూమిపై తోలబడిన యెరువు, మట్టిలో కలిసిపోవునట్లు దున్నుటకును, కంది మొదలయిన పంటపొలములలో వెడల్పుగానున్న చాళ్ళమధ్య దున్ని పైరును ఏపుగా పెంపుదల చేయుటకును, కొన్ని పైరులను పల్చనచేయుటకును, కలుపును ఏరిపారవేయుటకును నాగలి ఉపయోగపడును. అప్పుడప్పుడు నీరు పారుటకు వెడల్పయిన చాళ్ళను తయారు చేయుటకుగూడ నాగలి ఉపయోగపడును. కొన్ని ప్రాంతములందు నాగలి అడుగు భాగమున ఒక కన్నమును ఏర్పాటుచేసి, విత్తనములు చల్లుటకై నిడుపైన ఒక గొట్టమును ఈ కన్నములో అమర్చెదరు. ఈ విధముగా అమర్చబడిన నాగలిని “వెదనాగలి” (Nari Plough) అని పిలిచెదరు.
"మౌల్డ్ బోర్డు" (Mould board) అను నాగళ్లు అనేక పరిమాణములలో తయారు చేయబడును. వీటి
చిత్రము - 39
పటము - 2
వెడల్పు 6 నుండి 8 అంగుళములవరకు ఉండును. ఇట్టి నాగళ్లు పశువులు లాగుటకు వీలుగా నిర్మింపబడుచున్నవి. 6 అంగుళముల వెడల్పుగల నాగళ్లు సాధారణముగా ఉత్తరప్రదేశ్, ఢిల్లీప్రాంతములందును, 7 అంగుళముల నాగళ్లు దక్షిణభారతము నందును వాడుకలో నున్నవి. ఇట్టి నాగళ్ల ప్రయోగమువలన భూమి 4 నుండి 6 అంగుళముల లోతువరకు తెగుచున్నది. ఎద్దులచే లాగబడు ఇట్టి నాగళ్లు భారతదేశములో అన్ని ప్రాంతములందు అమ్మకమునకు లభించును. ఈ నాగలివలన నాగటి 'కర్రు'కు ఒక ప్రక్కనున్న భూమిమాత్రమే కదలబారగా, దేశీయమైన కొయ్యనాగలి ఇరుప్రక్కల గల నేలను కదలబారచేయును. కొయ్యనాగలికంటె ఈ నాగలికి వలయు ఈడ్పుశక్తి (pull) తక్కువస్థాయిలో నుండును.
2. గుంటక : ఈ సాధనము మట్టిగడ్డలను మెత్తగా చితుకకొట్టి, భూమిని చదునుచేయుటకును, కలుపును ఏరివైచి విత్తనములపై మన్ను సక్రమముగా కప్పి యుంచుటకును, ఉపయోగపడును. పలురకములగు గుంటకలలో ఈ క్రిందివి సర్వసామాన్యముగా వాడుకయం దున్నవి. దేశీయమైన ఇనుపరేకులుగల గుంటకలు :
దేశీయమైన గుంటకలకు అడ్డముగా (horizontal) కత్తివంటి ఒక సాధనము భూమియందు లోతుగా చొచ్చుకొని పోవునట్లు అమర్చబడును. గుంటకను తోలునపుడు ఈ కత్తి లోతున నుండెడి కలుపును నరకును. గోధుమ మొదలయిన మెరక పంటల కుపయోగపడు నాగళ్ళవలె గాక ఈ గుంటక లు అప్పుడప్పుడు మాత్రమే వాడబడును. ఇనుపముక్క లమర్చిన ఇట్టి గుంటకలు వాటి పరిమాణములనుబట్టి విభిన్నములయిన వర్గములుగా, వేర్వేరు రాష్ట్రములలో, వేర్వేరు పేర్లతో వ్యవహరింపబడు చున్నవి. ఉదాహరణమునకు మరాట్వాడా, విదర్భ, ఉత్తర భారత దేశములందు ఈ సాధనమును “బాఖర్" అనియు, దక్షిణదేశమునందు "గుంటక" అనియు పిలుచు చున్నారు.
గుంటక : ఈ సాధనములో ప్రధానమైన భాగము “అడ్డ". ఇది లావైన కొయ్య చట్రము. దీనికి మేడి అమర్చబడును. ఈ మేడికి ఒక చేతి పిడి గూడా ఏర్పాటు చేయబడి యుండును. మేడిని, కాడిని కలుపు మరొక ముఖ్యమైన భాగము 'నగలు' అని పిలువబడును. భూమిలోనికి చొచ్చుకొని పోవు పదునైన యినుపబద్దె అడ్డకు అమర్చబడి యుండును. ఈ యినుపబద్దె 3 అడుగుల పొడవును, 3 అంగుళముల వెడల్పును 1/2 అంగుళము మందమును ముందు భాగములో పదునైన అంచును కలిగి యుండును. "బరాగుంటక" అనబడు 6 ఆడుగుల వెడల్పు
చిత్రము - 40
పటము - 3
గల గుంటకలుగూడ వ్యవసాయములో ఉపయోగింపబడు చున్నవి. 'దంతెలు' అను చిన్న గుంటకలు వెడల్పయిన చాళ్ళ యందు కలుపు తీయుటకు విరివిగా ఉపయోగపడుచున్నవి.
మేలిరకపు గుంటకలు (విద్యుచ్ఛక్తి వల్లగాని, ఎద్దుల వల్లగాని లాగబడునవి) :
(ఎ) డిస్క్ గుంటకలు (Disk harrows): ఈ గుంటకలకు అమర్చబడిన చదరపు ఇరుసులపైన ఆరు
చిత్రము - 41
పటము - 4
అంగుళములకు ఒక్కొక్కటి చొప్పున గుండ్రని బిళ్ళలు ఏర్పాటు చేయబడును. గుంటక నడచునపుడు ఇరుసులతో పాటుగా వాటిమీద అమర్చబడిన గుండ్రని బిళ్ళలు గూడ వలయాకారములో తిరుగును. ఇరుసులను యుక్తమైన కోణములో (angle) సిద్ధముగా ఉంచినపుడు, గుండ్రని బిళ్ళలు వంపుతిరిగి నేలలోనికి చొచ్చుకొని పోవును. ఈ సాధనము, గడ్డి గాదము దట్టముగా పెరిగియున్న భూములలో కలుపును నిశ్శేషముగా నిర్మూలించుటకును, మట్టి గడ్డలను చూర్ణముగా చితుకగొట్టుటకును శ క్తిమంతముగా పనిచేయును.
ఇట్టి గుంటకలు భూమిలో లోతుగా, సులభముగా చొచ్చుకొనిపోవుటకై, వీటిమీద బరువులు పెట్టుటకు వెడల్పయిన పళ్ళెములవంటి సాధనములును, గుంటక తోలువానికి ఒక ఆసనమును అమర్చబడి యుండును.
(బి) స్పైక్ టూత్ గుంటకలు లేక దంతెలు (Spike Tooth Harrows) : ఈ గుంటకల యొక్క అడ్డలకు ఉక్కుతో తయారు కాబడిన బలమైన మేకులు అమర్చబడును. ఇట్టి మేకులు గుంటకల యొక్క పరిమాణము ననుసరించి తరగతులవారీగా ఏర్పాటు చేయబడును. అనగా గుంటకలను లాగెడి ఎద్దుల సామర్థ్యమును బట్టియు, భూమిలోనికి చొచ్చుకొని పోవలసియున్న లోతును బట్టియు ఈ తరగతులు నిర్ణయింపబడును.
(సి) స్ప్రింగ్ టూత్ గుంటకలు (Spring Tooth Harrows) : ఈ తరగతికి చెందిన గుంటకలకు స్థిరముగా అమర్చబడు ఉక్కు మేకుల స్థానములో బలమైన ఉక్కు స్ప్రింగులు చట్రములో నిర్మింపబడును. నాగలి కఱ్ఱు అమర్చబడు కోణములోనే పళ్ళవంటి ఈ స్ప్రింగులు గూడా అమర్చబడును. ఈ స్ప్రింగులు బలిష్ఠములుగా నుండుటచే గట్టి రాతి నేల లందు సహితము వీటిని ఉపయోగించ వచ్చును. ఇవి చెడిపోవు. పై ఉదహరించిన స్పైక్ గుంటకల కంటె ఇవి భూమిలోనికి ఎక్కువ లోతుగా చొరబడి, అచ్చటనున్న కలుపును వెలుపలికి పెకలించి వేయును.
బండ్ ఫార్మర్ (Bund-former) : పంట భూములలో నీరు పారుదల చేయుటకై బోదెలు తయారుచేయు సామాన్యమైన ఈ సాధనమును జోడెద్దులు లాగును. ఈ బోదెల ద్వారా మడులకు నీరు సరఫరా అగును. ప్రత్తి విత్తనములు నాటుటకును, ఇతర పంటలు పండించుటకును అవసరమగు కట్టలను (ridges) ఈ సాధనముతో నిర్మించెదరు.
విత్తనములు వెదపెట్టు - మొక్కలు నాటు యంత్రము :
(ఎ) గొర్రు : ఆంధ్ర ప్రాంతములో విత్తనములను వెదపెట్టుటకై గొర్రు అను సాధనమును ఉపయోగించెదరు. ఇటులనే వేర్వేరు రాష్ట్రములలో ఈ సాధనమును వేర్వేరు నామములతో పిలిచెదరు. విత్తనములను వెదపెట్టు ఈ సాధనమును వెదగొర్రు అని పిలుతురు. విత్తనములను భూమిలో నాటుటకై వెదగొర్రునకు 'జడ్డిగములు' అనుపొడవైన గొట్టములు అమర్చబడి యుండును.
చిత్రము - 42
పటము - 5
అవసరమును బట్టి జడ్డిగముల సంఖ్య మారుచుండును. మధ్యప్రదేశములో రెండు జడ్డిగములుగల ఈ సాధనమును “దుప్ఫాన్" అనియు, మూడు జడిగములుండు దానిని 'తిప్ఫాన్ 'అనియు. మూడింటి కంటె ఎక్కువ జడ్డిగములు గల దానిని 'ఆర్ఘాడా' అనియు పిలిచెదరు. అడ్డముగా (horizontal) గల ఒక కొయ్య కడ్డీకి, విత్తనములు నేలలోనికి పడునట్లు కొన్ని గొట్టములు లేక జడ్డిగములు అమర్చబడును. విత్తనములు నాటుటలో గల తారతమ్యమును బట్టి జడ్డిగముల మధ్య ఉండవలసిన దూరము నిర్ణయింపబడును. విత్తనములు వెదపెట్టు నతడు అదే సమయములో తయారుకాబడు చాళ్ళలో సూటిగా పడునట్లు జడ్డిగములద్వారా విత్తనములను వదలుచుండును. ఈ కార్యక్రమము అనుభవము గల రైతుచే నైపుణ్యముతో నిర్వహింపబడును.
విత్తనములు వెదపెట్టు ఆధునిక యంత్రము (Mechanical seed drill) : ఆధునిక యుగమందు అవసరమును పురస్కరించుకొని అనేక వరుసలలో విత్తనములు వెదపెట్టు యంత్రములును, మొక్కలను నాటు యంత్రములును ఉపయోగింపబడుచున్నవి. దేశీయమైన 'గొర్రు' 'దుప్ఫాన్' 'తిప్ఫాన్ 'వంటి సాధనములకంటె ఈ ఆధునిక యంత్రము సులభమైనది, నాణ్యమైనది. ఈ యంత్రము వలన విత్తనములు భూమిలో సక్రమముగా, హెచ్చు తగ్గులులేక నాటుకొనును. ఎద్దులతోగాని లేక మరనాగళ్లతో (tractors) గాని లాగబడు ఈ యంత్రములకు అవసరమైన లోతులో విత్తనములను నాటుటకును, భూమియందు ఒక విత్తనమునకు మరియొక విత్తనమునకు మధ్య ఉండవలసిన దూరమును సవరించుకొనుటకును, ఒక యెకరము భూమిలో నాటవలసిన విత్తనముల ప్రమాణమును నిర్ణయించుటకును అవసరమైన ఉపసాధనములు అమర్చబడి యుండును.
దంతెలు (Cultivators) : ఒక శ్రేణిలో నాటుప్రత్తి, చెఱకు, వేరుసెనగ, పొగాకు వంటి వ్యవసాయమందు మాత్రమే 'దంతెలు' అను సాధనములు ఉపయోగపడును. ముఖ్యముగా కలుపును నిర్మూలించుటకు ఈ పరికరము అవసరమగును. బంగాళాదుంప, చెఱకువంటి వ్యవసాయములందు భూమిని క్రుళ్లగించుటకును లేదా కట్టలు నిర్మించుటకును కొన్ని అదనపు చేర్పులతో దంతెలు
చిత్రము - 43
పటము - 6
ఉపయోగపడును. వేరువేరు వ్యవసాయ విధానములకు తగిన రీతిగా, అవసరమగు పద్ధతిలో ఈ దంతెలు నిర్మాణము చేయబడును. సాధారణముగా రెండెద్దులచే ఈడ్వబడు సాధనములకు 5 లేక 7 దంతెలు అమర్చబడును. దంతెల చివర అమర్చబడు పలుగులు ఉక్కుతో తయారు కాబడును. ఈ ఉక్కు పలుగులు అరిగిపోయినపుడు క్రొత్తవి అమర్చబడును. వీటిమధ్యగల దూరమును, భూమిలోనికి చొచ్చుకొనిపోవలసిన లోతును సమయానుకూలముగా ఎప్పటికప్పుడు మార్చుటకు వీలగును.
పంటలుకోయు పరికరములు, యంత్రములు :
(ఎ) కొడవలి : పంటలుకోయుటకు భారతదేశములో అనాదికాలము నుండియు కొడవలి అను సాధనము ప్రధానముగా వాడబడుచున్నది. ఈ కొడవళ్లు మామూలు అంచుగలవియు, ఱంపపు పళ్లవంటి అంచుగలవియు (కక్కు కొడవళ్లు) అని రెండురకములుగా నుండును. వంచుటకు వీలుకాని కందివంటి చెట్ల కొమ్మలను మామూలు అంచుగల కొడవలితోను; వంచుటకు వీలైన వరి, రాగి మొక్కలను కక్కు కొడవలితోను కోయుదురు.
(బి) రీపర్ : కత్తెరవంటి ఈ సాధనము బొత్తిగా పట్టుపట్టబడిన మొక్కలను కత్తిరించును. ఈ పరికరమును సామాన్యమైన మధ్యరకపు ఎద్దుల జతగాని, లేక చిన్నరకపు ట్రాక్టరుగాని ఈడ్చుకొని పోగలదు. కోయబడిన పదార్థము 'రీపర్'పై అమర్చబడిన ప్లాట్ ఫారమునందు తాత్కాలికముగా నిలువచేయబడును. ప్లాట్ ఫారమ్ నిండిన వెంటనే ఈ పదార్థము పొలములో ఒక ప్రక్కగా నిర్ణీతప్రదేశమునకు ఎప్పటికప్పుడు చేరవేయబడును.
జోడెద్దుల సహాయముతో 5 అడుగుల పొడవుగల కత్తి అమర్చబడిన 'రీపర్' గంటకు సగటున ముప్పాతిక నుండి 1 యెకరముమేర వరకు గల పంటను కోత కోయ గలదు. ఈ యంత్రముతో సమర్థవంతముగా కోత కోయవలె నన్నచో గింజలు ముక్కచెక్కలు కాకుండుటకై పంట పరిపక్వస్థితికి వచ్చునట్లు చూడవలయును. మామూలుగా కార్మికులు కోతకోయు కాలమునకు మూడు నాలుగు రోజులకు పూర్వమే ఈ యంత్రముతో కోత ప్రారంభము కావలెను.
నూర్పిడి, తూర్పారపట్టు యంత్రపరికరములు : సాధారణముగా భారతదేశమున ఎద్దులచేత నూర్పిడి చేయించి,
కార్మికులచేత ధాన్యమును శుభ్రపరపించెదరు. ఈ విధానము వలన ఎక్కువ కాలయాపన జరుగుటయేగాక, భూమి దున్నుట కుపయోగపడవలసిన ఎద్దులు నూర్పిడి కార్యక్రమములో నియోగింపబడవలసి వచ్చును. ఇట్లుగాక, 40 యెకరములలో పండిన పంటను, 5 నుండి. 7 ఆశ్విక శక్తి (horse power) గల నూర్పిడియంత్రము చిత్రము - 44
పటము - 7
సులభముగా నూర్చివేయగలదు. జపానుదేశములో ఒక విధమైన త్రొక్కుడు (pedal-operated) నూర్పిడి యంత్రము తయారు చేయబడినది. ఈ యంత్రమును భారత దేశములో గూడ ప్రయోగించి వరిపంటను మాత్రము నూర్పిడి చేయుటకు ఉపయుక్తమగునని నిర్ణయింపబడినది. కొన్ని భారతీయ పరిశ్రమలలో ఎద్దులచే నడిపింపబడుటకు వీలుగా నూర్పిడి యంత్రములు తయారు చేయబడుచున్నవి.
గింజలను పొట్టునుండి వేరుచేయుటను తూర్పారపట్టు విధాన (Winnowing) మందురు. భారతదేశములో ఎక్కువభాగము ప్రకృతిసిద్ధముగా వీచు గాలి సహాయముననే తూర్పారపట్టు కార్యకలాపము కొనసాగుచున్నది. దక్షిణ భారతదేశములో జనవరి, ఫిబ్రవరి నెలలలో జరుగు కోతల తరుణములో సహజమైన గాలి వీచును. కాని ఈ విధానమువలన కాలము వృధా యగుటయేగాక, యంత్రములవలె సమర్థవంతముగా తూర్పారపట్టు కార్యకలాపము జరుగనేరదు. ధాన్యము తూర్పారపట్టుటకు ఒక సులభమైన యంత్రమును మనుష్యుల సహాయముతో ఉపయోగింపవచ్చును. ఇది విసనకర్రవంటి (Winnowing fan) యొక సాధనము. దీనిని వడిగా త్రిప్పుటవలన బలమైన గాలి వీచి ఎత్తునుండి ధారగా పోయబడు త్రొక్కుడు గింజల (threshed grains) నుండి తేలికగా నుండు పొట్టు వేరై, శీఘ్రకాలములో అది కొట్టుకొని పోవును.
విద్యుచ్ఛక్తి వలనగాని, చేతులతో త్రిప్పుట వలనగాని, పనిచేయు ఇతరములయిన తూర్పార యంత్రములు కూడ కలవు. ఈ యంత్రముల పై భాగమున, నూర్పిడి కావలసిన ధాన్యమును ఒక తొట్టిలోపోసి ఉంచెదరు. ఈ తొట్టి నుండి ధాన్యము కొలది పరిమాణములో గొట్టముద్వారా అడుగుభాగమున ఒకదానిపై మరొకటిగా అమర్చబడిన జల్లెడలకు చేర్చబడియున్న అరల (nests) లోనికి క్రమముగా దిగుచుండును. ఒక జల్లెడకు మరొక జల్లెడకు నడుమ కొంత ఖాళీప్రదేశముండును. యంత్రము పనిచేయునపుడు జల్లెడలకు అమర్చియున్న అరలు (Nests) ముందునకును, వెనుకకును ఊగుచుండును. ఇట్లు ఊగుట వలన జల్లెడద్వారా పొట్టు క్రిందికి జారిపోవును. ఈ యంత్రములో వలయాకారముగా తిరుగు విసనకర్ర వంటి పరికరముండుటవలన గాలి ఉత్పత్తియగును. ఈ గాలి విసురువలన పొట్టుతోపాటు, చెత్తవంటి ఇతర పదార్థములు గూడ బయటికి పోగలవు. మిక్కుటముగా గాలి వీచని ఋతువుల యందు పక్వస్థితికి వచ్చిన పంటలను తూర్పారపట్టి శుభ్రము చేయుటకు ఈ యంత్రము మిక్కిలి తోడ్పడును. ఈ యంత్రము సగటున గంటకు 6 నుండి 8 బస్తాలవరకు ధాన్యమును శుభ్రపరచ గలదు.
చెఱకును చితుకగొట్టు యంత్రము : భారతీయ వ్యవసాయ విధానములో చెఱకును చితుకగొట్టు యంత్రము ప్రధానమయిన వ్యవసాయ యంత్రములలో ఒకటియై యున్నది. విపణి వీధిలో ఎద్దులచే నడుపబడు యంత్రములును, విద్యుచ్ఛక్తి చే నడుపబడు యంత్రములును, లభించును. ఈ యంత్రములు, రెండు పెద్ద రోలర్ల (rollers) చేతను, ఒక చిన్న రోలరు చేతను సులభపద్ధతిలో నిర్మింపబడుచున్నవి. ఈ రోలర్లు ఉక్కు స్తంభములపై అమర్చబడియుండును. సామాన్యముగా గ్రామీణ ప్రాంతములలో ఎద్దులచే నడుపబడు యంత్రములే ఎక్కువగా వాడుక యందున్నవి.
వేరుసెనగపొట్టు ఒలుచు యంత్రము (Decorticator): వేరు సెనగపొట్టు ఒలుచు యంత్రములు (decorticators)
చిత్రము - 45
పటము - 8
సులభ నిర్మాణము గలవియైనను మిక్కిలి సమర్థవంతముగా పనిచేయును. వేరుసెనగ కాయలోని పప్పు చితుకకుండ, పై పొట్టును మాత్రము వేరుచేయునట్లుగా ఈ యంత్రము నిర్మింపబడును. ఈ యంత్రములు వేర్వేరు ప్రమాణములలోను, వేర్వేరు సామర్థ్యముల (capacities) తోను తయారుకాబడును. ఇవి విద్యుచ్ఛక్తి వలనను, లేదా మానవశక్తి వలనను నడుపబడును. ఈ యంత్రములు పటిష్ఠములైన చట్రములమీద దృఢముగా నిర్మింపబడును. వీటి నిర్మాణము సులభమైనది. వీటి వాడకమును, పోషణమును తక్కువ వ్యయముతో సాధ్యమగును.
పర్షియన్ చక్రములు (wheels); పంపులు: 'పర్షియన్ చక్రము' అను పరికరము భారతదేశములో ఎక్కువగా వాడుకలోనున్న యంత్రము. ఉత్తర భారతములోని గ్రామసీమలలో నీరు తోడుటకు ఇది ముఖ్యమైన సాధనముగా ఉపయోగపడుచున్నది. ఈ సాధనము అనేక పరిమాణములలో, నమూనాలలో తయారగుచు, ఎప్పటికప్పుడు మార్పులు, అభివృద్ధులు పొందుచున్నది. కొన్ని నమూనాలలో పూర్వమున్న నిడుపైన కడ్డీ ఇటీవల తొలగింపబడినది; కొన్నిటియందు రెండు వరుసలలో బొక్కెనలు. అమర్చబడియున్నవి. ఈ యంత్రము సామాన్యముగా ఎద్దుల సహాయముతో పనిచేయును.
పలురకములైన నీటి పంపులు ఈనాడు విపణివీధిలో లభించుచున్నవి. సామాన్యముగా 'సెంట్రిఫ్యూగల్' మరియు 'ప్లంగర్' పంపులు వాడకమునందున్నవి. ఎద్దుల చేతను, మానవశక్తిచేతను పనిచేయు 'ప్లంగర్' పంపు లీనాడు లభ్యమగుచున్నవి.
నూనెగానుగలు (oil ghanis) : చమురుగింజలనుండి చమురుతీయుటకు ఎద్దులచేనడుపబడు గానుగలు (ఘనీలు) అను యంత్రములు భారతదేశమందు సామాన్యముగా ఉపయోగింపబడుచున్నవి. కాలమును పొదుపు చేసి కొనుటయందును, అధికతరమైన పరిమాణము గల చమురును తీయుటయందును, విద్యుత్ చోదితమైన యంత్రము ప్రయోజనకారిగా నుండగలదు. ఈ రెండు విధములయిన 'ఘనీలు' వివిధ పరిమాణములలో, వివిధ శక్తులలో లభ్యములగుచున్నవి. చొప్ప నరకు యంత్రము (chaff cutters): ఈ యంత్రము పశుగ్రాసమును నరకుట కుపయోగపడును. పశుగ్రాసమును చేతితో నరకుటవలన కాలవ్యయము అగుటయేగాక, శ్రమగూడ అధికమగును. ఈ యంత్రము
చిత్రము - 46
పటము - 9
విద్యుచ్ఛక్తిచేగాని లేక ఒక ఉపకరణముద్వారా ఎద్దులచేగాని నడుపబడుచున్నది. ఈ యంత్రమువలన తక్కువ వ్యవధిలో ఎక్కువ పశుగ్రాసమును నరుక వీలగును.
తక్కువ వ్యయముతోను, తక్కువ కార్మికశక్తితోను అధికమైన పంటను పండించుటకును, భూమిని సారవంతమైన దానినిగా పదునుచేసి ఆరోగ్యకరమైన వాతావరణములో విత్తనములు మొలచి, మొక్కలు దృఢముగను, ఏపుగను పెరుగుటకును, పైరుకు చేటు తెచ్చు కలుపును పెకలించి వేయుటకును, సమర్థవంతమైన పరికరములు, యంత్రములు అవసరమగుచున్నవి. అందుచే, అత్యధికోత్పత్తిని సాధించుటకును, ఉత్పత్తికగు వ్యయమును తగ్గించుటకును మిక్కిలి సమర్థతగల ఇట్టి యంత్రములను, పరికరములను ఇతోధికమైన పరిమాణములో వాడుటయే గాక వాటిని ఎప్పటికప్పుడు బాగుచేయుచు సవ్యముగపనిచేయునట్లును, ఎక్కువ పని జరుగునట్లును చూచు చుండవలెను.
బి. ఆర్. బి.