సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/క్షీరసాగరము
క్షీరసాగరము (Milky Way) :
ఆకాశమున క్షీరసాగరమును చూడనివారుండరు. ఉత్తరమునుండి దక్షిణమువరకు పెద్దకాలువవలె ప్రవహించు తెల్లనికాంతినే క్షీరసాగరమందురు. దీనినే పాలపుంత (Milky way) యనియు, 'కాశీ రామేశ్వరముల త్రోవ' యనియు గూడ వ్యవహరింతురు. దీనికి తూర్పుగను, పడమరగను పోయినకొలది చుక్కలు పల్చబడి, ఎక్కువ సంఖ్యలో కానరావు. మనకు కనిపించు చుక్కలలో నూటికి 90 వంతులు ఈ క్షీరసాగరమునకు సమీపమున నున్న వే. ఇది ఖగోళమునకు ఒక విధమగు వడ్డాణముగ నుండి దీనినుండి దూరముగా, అనగా, దీని ధ్రువ ప్రాంతమునకు పోయినకొలది, చుక్కల సంఖ్య తగ్గు చుండును.
మన పురాణములలోని క్షీరసాగర మధనము మొదలైన కథలన్నియు దీనికి సంబంధించినవే. కాని వాటిలోని ఖగోళశాస్త్ర విషయములను మనము మరచిపోయి, కేవలము వాటిని పురాణగాథలుగా మాత్రమే మననము చేయుచున్నాము.
పై జెప్పిన కాంతి ప్రవాహములో ఒక భాగమునకు 'ఆకాశగంగ' యని పేరు. ఈ ఆకాశగంగ మహావిష్ణు మండలము (Hercules) ప్రక్కనున్న గరుడమండలములో (Aquila) శ్రవణానక్షత్రము (Altair) వద్ద అనగా విష్ణుపాదము వద్ద ఉద్భవించి 'చదలేటి బంగారు జలరుహంబుల తూండ్లు భోజనంబులు' గా గల రాజహంస మండలము (cygnus) ద్వారా ప్రవహించి 'పచ్చరాచట్టు గమిరచ్చపట్టు' గా గల రంభా, ఊర్వశీ మొదలగు అప్సరోగణములకు విహార క్షేత్రమై, కల్పవృక్షమండలము (Camalo Paradalis) ప్రక్కగా సాగిపోవును. అదే ఆకాశగంగ దక్షిణమునకు సాగిపోయి, మృగవ్యాధరుద్ర నక్షత్రము (Syrius) వరకును వ్యాపించి శివ జటాజూటమున ధరింపబడుచున్నది. రెండవభాగమునకు క్షీరసాగరమని సామాన్యముగ వ్యవహరింతురు. ఈ క్షీరసాగరముననే శ్రీమహావిష్ణువు శయనించియున్నా డను మహావిష్ణు మండలము (Hercules) ఉన్నది. దిగువను మందరగిరి, వాసుకి మొదలగు నక్షత్రముల గుంపులుండి, క్షీరసాగర మథన కథను జ్ఞప్తికి తెచ్చుచుండును.
ఒక దూరదర్శిని యంత్రముతో పరిశీలించినచో, మనకు వెలుగు వెల్లువవలె కన్పించు నది అనేక నక్షత్రముల కాంతిసముదాయమే యని తెలియనగును. ఈ నక్షత్రములన్నియు ఒక్కచోట గుంపుగా నుండక ఒకదాని వెనుక నొకటి ఉండుటచే, అన్నిటి కాంతియు కలిసి ఒక గొప్ప కాంతి వెల్లువవలె కాన్పించును. ఈ క్షీరసాగరము ఒక బండిచక్రమువలె నుండును. ఈ చక్రమునకు పూటీల మీదను, పట్టామీదను అంతులేని నక్షత్రసముదాయముండి, ఆ నక్షత్రములలోనే ఒక నక్షత్రమువద్దనుండి చూచు మనకు ఇవి యన్నియు ఒకదాని వెనుక మరొకటుండి, ఆకాశము అను నల్లని తెరపై వెండిపొడి చల్లినట్లు గనపడును. అడవిలోని చెట్లు ఒక దానినుండి మరియొకటి ఎంతదూరముగ నున్నను, దూరమునుండి చూచువారికి అవి యన్నియు ఒకదానితో మరియొకటి పెనవేసికొని చెట్టునకును చెట్టునకును నడుమ దూరమే యున్నట్లు కాన్పింపదు. దూరమునుండి చూచువారికి ఒక గ్రామమున అన్నియు వృక్షములే యున్నట్లు కాన్పించును గాని ఇండ్లేమియును కానరావు. కాని తీరా దగ్గరకు వెళ్ళి చూతుముకదా, చెట్లు అక్కడక్కడ మాత్రమే యున్నట్లు కనపడును. ఈ క్షీరసాగరములోని నక్షత్రములును అట్లే.
బాగుగ పరీక్షించినచో, క్షీరసాగరమున చుక్కలు కొన్నికొన్ని చోట్ల సాంద్రముగనుండి గుత్తులుగా కన్పించును. ఇట్టి చుక్కలగుత్తులు ఈ క్షీరసాగరమున ఎన్నియో కలవు. వీటిలో అన్నిటికంటెను మనకు దగ్గరగా నున్నది. అశ్వతర మండలములోనిది. దాని దూరమైనను 18,000 కాంతి సంవత్సరములు. ఇక మిగిలినవాటి దూరమేమి చెప్పగలము? ఈ చుక్కలగుత్తుల దూరములను కనుగొనుటకు అవకాశము, వాటిలో 'సిఫాయిడ్స్' (Sephoids) తార లుండుటవలన కలిగినది. ఇట్టి చుక్కలగుత్తులు క్షీరసాగరమున అనంతముగ నున్నవి. ఒక్కొక్క గుచ్ఛమున కొన్నిలక్షల నక్షత్రములుండి, అన్నియుకలిసి ఒక కుటుంబముగా నున్నవి. ఈ చుక్కలన్నియు ఒకదానికి మరొకటి దగ్గరగానుండి, విడిపోకుండుటకు వాటి పరస్పర ఆకర్షణ శక్తియే కారణము. ఈ గుత్తులలోని నక్షత్రములు పరస్పరాకర్షణచే, సూర్యకుటుంబములోని గ్రహములు ఒక కేంద్రముచుట్టును పరిభ్రమించునట్లుగనే ఒక కేంద్రము చుట్టును పరిభ్రమించుచుండును. ఈ నక్షత్ర గుచ్ఛముల పరిభ్రమణకాలములు తెలిసినచో, వాటిలోని నక్షత్రముల సమిష్టి భారమును లెక్కకట్టవచ్చును. సూర్యుడు గూడ ఇట్టి నక్షత్రగుచ్ఛములలోని ఒక గుచ్ఛమునం దున్న నక్షత్రము మాత్రమే. అనగా మనము భూమిమీదినుండి కంటితో చూడగలిగిన నక్షత్రము లన్నియు కలిసి ఒక గుచ్ఛముగా ఏర్పడినవన్నమాట. ఈ గుచ్ఛములోని నక్షత్రములన్నియు ఒకే కేంద్రము చుట్టును పరిభ్రమించు చున్నవి. వీటితోపాటు సూర్యుడు గూడ ఈ నక్షత్ర గుచ్ఛము యొక్క కేంద్రము చుట్టును పరిభ్రమించు చున్నాడు. సూర్యపరిభ్రమణ వేగము క్షణమునకు 12 మైళ్ళు. ప్రస్తుతము సూర్య గమనదిశ వీణా (Lyra) మండలములోని బ్రహ్మనక్షత్రము (Vega) వైపున గలదు.
పై జెప్పిన నక్షత్ర గుచ్ఛములు కాక, క్షీరసాగరమున పెక్కు నభోలములు (Nebulae) గలవు. నభోలము లనగా ఇంకను నక్షత్ర రూపము ధరింపని పదార్థము . ఇవి పొగమబ్బువలె నుండి అతి కాంతివంతముగ నుండును. వీటిలో నుండియే నక్షత్రములు ఉద్భవించును. ఇట్టి రిక్కమబ్బు (Nebulae) వృత్రాసుర మండలములోని గొల్లకావడి' వద్ద నున్నది. ఇది దూరమునుండి చూచుటకు చాల చిన్నదిగా కన్పించినను, దాని దూరమును కనుగొని లెక్కకట్టి చూచినచో, అది చాల పెద్దగనే యుండును. దాని పొడవు ఇంచుమించు 15 కాంతి సంవత్సరములు; వెడల్పు 5 కాంతి సంవత్సరములు. ఇంత వైశాల్యము గల వస్తువును సూర్యునితో పోల్చి, 'సూర్యునికంటె ఇన్ని రెట్లు పెద్దది' అని చెప్పుట అసంభవము. ఈ ఒక్క నభోలము నుండియే ఎన్నియో లక్షల సూర్య నక్షత్రములు ఉద్భవింపవచ్చును. ఇది మనవద్దినుండి 600 కాంతి సంవత్సరముల దూరమున నున్నది. ఇది, ఇతర నభోలములతో పోల్చి చూచినచో, చాల కొద్ది దూరమనియే చెప్పవచ్చును. ఈ నభోలములలోని నక్షత్రపూర్వరూప వాయుపదార్థము యొక్క సాంద్రత చాల తక్కువ. ఇది, గాలి సాంద్రతలో ఒక కోటవ వంతుకంటె తక్కువగానే యున్నదని చెప్పవలయును. ఈ పదార్థ మంతయును స్వకీయాకర్షణచే ఒకచోట పోగై మున్ముందు నక్షత్రములుగ విడిపోవును.
క్షీరసాగరములో నక్షత్ర గుచ్ఛములు, నభోలములు, విడిచుక్కలు కాక, కొన్నిచోట్ల నల్లని మాసికలు కాన నగును. ఇట్టిది ఒకటి రాజహంస మండలమునుండి అశ్వతరమండలము (Centaurus) వరకు వ్యాపించియుండును. అనగా క్షీరసాగరము రాజహంసమండలమునొద్ద రెండుగ చీలి మరల అశ్వతర మండలముదగ్గర కలిసికొనును. ఈ నల్లని మాసికే 'ఛాయాపథము' అని వర్ణింపబడినది. ఇట్టిది యొకటి దక్షిణధ్రువప్రాంతమునొద్ద నున్నది. దీనిని 'బొగ్గుసంచి' (coal sack) అని యందురు ఇట్టి కాలమేఘములు ఇప్పటికి ఇంచుమించుగా 200 కనుగొన బడినవి. నిజముగ ఇవి మాసికలుకావు. వీటియందును కొంత పదార్థమున్నది. అదియొక నల్లని మేఘముగా నేర్పడి, దాని వెనుకనున్న నక్షత్రముల కాంతి మనవద్దకు రాకుండ అడ్డుపడుచున్నది. అది నల్లగానుండి, కాంతి నిరోధకముగా నుండుటకు కారణము అచ్చటనుండు పదార్థములో దుమ్మువంటి పదార్థము కొంత కలిసియుండు టయే. ఇట్టి ధూళిపదార్థము క్షీరసాగరములోని ఇతర ప్రాంతములయందును ఉన్నదని నమ్ముటకు కొన్ని ప్రబల కారణములున్నవి. అచ్చటనుండు కాంతిని విశ్లేషించినచో ఇది స్పష్టమగును. ఇది కాక, నక్షత్రమునకును నక్షత్రము
చిత్రము - 37
నకును నడుమనుండు ప్రదేశములో (Inter Stellar space) కొంత కాల్షియమ్, కొంత సోడియమ్ ఉన్నట్లు రుజువగును. అయితే, దీని సాంద్రత మన మూహించలేనంత స్వల్పముగ నుండును.
పైన వివరించినవిధముగా, చుక్కల గుత్తులు, నభోలములు, విడిచుక్కలు, బొగ్గుపంచులు మున్నగునవన్నియు చేరి, ఈ పెద్ద క్షీరసాగరముగా నేర్పడినది. ఇదియొక పెద్ద బండిచక్రమువలె నుండునని మొదటనే తెలుపబడినది. దీనిని అడ్డముగా అంచుమీదినుండి చూచినచో, ఈ పై చిత్రములోని విధముగ కన్పించును.
బండిచక్రమునకు నడుమ కుండ ఉన్నట్లుగానే, దీనికిని మధ్యభాగమున నక్షత్రములును, నక్షత్రగుచ్ఛములును ఎక్కువగనుండి, మధ్యప్రదేశమున మంద మెక్కువగ నుండును. పైపటములో చుక్కలుగా గుర్తుపెట్టబడినవి ఈ క్షీరసాగరములో నుండు కొన్ని చుక్కలగుత్తులే. ఇట్టి చుక్కలగుత్తి యొకటి X అను గుర్తుగలచోటనున్నది. సూర్యుడు ఈ గుచ్ఛములోనివాడే. ఇతడు పటములో చూపబడినట్లు ఈ గొప్ప చక్రమునకు కేంద్రమున నుండక, ఒక ప్రక్కకు తప్పుకొని యున్నాడు. సూర్యుని దూరము దీని కేంద్రమునుండి సుమారు 30 వేల కాంతి సంవత్సరములు. మనకు కనిపించు ముఖ్య నక్షత్రముల దూరములను దీనితో పోల్చినచో ఇవి యన్నియు ఒక గుచ్ఛముగా నున్నవనుట స్పష్టమగును. క్షీరసాగరముయొక్క వ్యాసము సుమారు 1 లక్ష 20 వేల కాంతి సంవత్సరములు. మందము 20 వేల కాంతి సంవత్సరములు, దీనికేంద్ర మెచ్చటనున్నదో చూడవలె నన్న, X గుర్తుపెట్టిన చోటినుండి 'ఇ' అను గుర్తుదిశలో చూడవలెనుగదా ! ఇతరదిశలో కంటె ఈ దిశలో చూచినచో, ఎక్కువ సంఖ్యగల నక్షత్రములు దృష్టిపథమునకు వచ్చుననుట విశదము. కావున ఆకాశమున ఈ క్షీరసాగర కేంద్రము ఏదిక్కుననున్నదో చూడవలెననిన, వీటిలోని నక్షత్రములు అతిసాంద్రముగ ఏ దిక్కున నుండునో ఆ దిశలోనే దీనికేంద్రము ఉండవలెననుట స్పష్టము. ధనుస్సు రాశిలోని క్షీరసాగరము సాంద్ర తమముగనుండి, దానికేంద్రమును ఆ దిక్కుననే ఉండవలయునను ఊహకు తావిచ్చుచున్నది.
క్షీరసాగరమును భ్రమణగతికి లోనయ్యే యున్నది. క్షీరసాగరముకూడ దాని కేంద్రముచుట్టును పరిభ్రమించు చున్నది. అనగా, దానితోపాటు ఈ చుక్కల గుత్తులు, నభోలములు, విడిచుక్కలు అన్నియును ఈ క్షీరసాగరముచుట్టును పరిభ్రమించుచున్నవన్నమాట. సూర్యుని చుట్టును తిరుగు గ్రహములవలెనే, ఈ కేంద్రమునకు దూరముగనున్న నక్షత్రములు, తాము చుట్టిరావలసిన త్రోవ చాల పెద్దదగుటచేతను, కేంద్రమునకు దూరముగ నున్న కారణమున అచ్చటి గురుత్వాకర్షణ తక్కువై గమనవేగము తగ్గుటచేతను, అవి ఒకసారి ఈ కేంద్రమును చుట్టివచ్చుటకు బహు దీర్ఘ కాలముపట్టును. ఈ విధముగ సూర్యుడున్న నక్షత్ర గుచ్ఛము కేంద్రముచుట్టును ఒకమారు తిరిగివచ్చుటకు 22 కోట్ల 50 లక్షల సంవత్సరములు పట్టును. ప్రస్తుతము దీని గమనవేగము క్షణమునకు 180 మైళ్ళు. దీని గమనదిశ రాజహంస మండలము వైపు. అనగా సూర్యునికి రెండు విధములయిన గమనములు కలవు. 1. ఆతడున్న నక్షత్రగుచ్ఛము తనచుట్టును తాను తిరుగుచుండుటచే, దాని కేంద్రము చుట్టును సూర్యుడు తిరుగుచుండును. 2. నక్షత్రగుచ్ఛము క్షీరసాగర కేంద్రముచుట్టును తిరుగుచుండుటచే, దానితోపాటు సూర్యుడును క్షీరసాగరముచుట్టును పరిభ్రమించు చుండును.
గ్రహములలో సూర్యునికి దగ్గరగా నున్నవాటికి ఎక్కువ వేగమును, దూరముగా నున్నవాటికి తక్కువ వేగమును ఎట్లుండునో, అదేవిధముగ క్షీరసాగర కేంద్రమునకు దగ్గరగానున్న చుక్కల వేగము ఎక్కువగా నుండును. లేనిచో అవి కేంద్రమున పడిపోవును. అయితే సూర్యుడు గ్రహములను తన ఆకర్షణప్రభావముచే తన చుట్టును ఏ విధముగ పరిభ్రమింప జేసికొనుచున్నాడో, ఆవిధమగు బలవత్తర ఆకర్షణక్తి గల ఏ యొక వస్తువును క్షీరసాగర కేంద్రమున లేదు. ఇచ్చట నక్షత్రములు, నక్షత్రగుచ్ఛములు అతి సాంద్రముగ నుండుటచే, వాటి సమష్టి ఆకర్షణశక్తివలననే మిగిలిన వన్నియు కేంద్రము చుట్టును పరిభ్రమించుచున్నవి.
క్షీరసాగరము తన కేంద్రముచుట్టును పరిభ్రమించుచుండుటచే, దాని మొ త్తము బరువును కనుగొనవచ్చును. అట్లు కనుగొనగా ఇది సూర్యునికంటె 16×1010 రెట్లు అని తెలిసినది. దీనిలో నభోలములక్రిందను, బొగ్గుసంచుల క్రిందను, నక్షత్ర మధ్యప్రదేశమున నుండు పదార్థము క్రిందను సగము తీసివేసినచో, 8× 10010 సూర్యుల బరువు గల నక్షత్రములు ఈ క్షీరసాగరమున నున్నవన్నమాట. ఈ నక్షత్రముల సగటు బరువు ఒక్కొక్కటి సూర్యుని యంత యుండునని తలచినచో, ఈ క్షీరసాగరమున ఇంచుమించుగా 1011 నక్షత్రము లున్నవని తలచవచ్చును.
బి. వి.