సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/కోడూరు-V

కోడూరు - V :

కోడూరు తెలంగాణమునందలి మహబూబునగ రుజిల్లా మహబూబునగరము తాలూకాలోనున్న చిన్న గ్రామము. ప్రాచీన కాలమందు ఈ గ్రామము చారిత్రక ప్రసిద్ధిచెందిన రాజధాని పట్టణముగా విలసిల్లినట్లు శాసనాధారములు కలవు. రాష్ట్రకూటుల కాలమున చోళ మాండలికులకు ఇది రాజధానిగా నుండెను. రాష్ట్రకూటుల తరువాత రాజ్యమునకు వచ్చిన చాళుక్య ప్రథమతైలపుని సంతతి వారు ఈ చోళులను జయించి తమ రాజప్రతినిధులను ఈ ప్రాంతముల నేలుటకు నియమించినప్పుడు వారలు కోడూరును రాజధానిగా జేసికొనియుండిరి. కోడూరు పట్టణము నేలిన మాండలికులు పశ్చిమ చాళుక్యచక్రవర్తు లకు సామంతులుగా నుండిన తెలుగుచోడుల శాఖకు చెందిన వారు. ఈ రాజులు తమ శాసనములందలి బిరుదా వళులలో తాము “కోడూరు పురవ రేశ్వరుల" మని చాటి యున్నారు.

1. క్రీ. శ. 1084 నాటిది గంగాపురశాసనము. ఇందు కోడూరు నవపురదస్థానపతి ధర్మము చేసినట్లు కలదు. ఇందు శ్రీ మత్ప్రతాపచక్రవర్తి జగదేకమల్లుడు ప్రశం సింపబడినాడు.

2. క్రీ. శ. 1108 నాటిది అలంపుర శాసనము. ఇందు శ్రీ మన్మహామండలేశ్వర మల్లరసు అనువాడు అలంపురం శ్రీ బ్రహ్మేశ్వరదేవరకు అంగరంగభోగాలకు ధర్మము చేసినట్లు కలదు. ఈ మల్లరసు శ్రీమ త్రిభువన మల్ల దేవర పాదపద్మోపజీవి, సమధిగత- పంచమహాశబ్ద-మహా మండలేశ్వర . . . కోడూరు పురవరేశ్వర...అని చెప్పుకొని యున్నాడు.

3. క్రీ. శ. 1110 నాటిది ఆలవానిపల్లి శాసనము. ఇందు “త్రిభువనమల్ల దేవర ప్రియపుత్రుడు మహామండ లేశ్వర తైలపదేవుడు “కన్దూ స్యాన్ సిర కన్దూరు వాడ . . .త త్పాద పద్మోపజీవి మహాప్రధాన మనె వేగ౯ డె..." రాజధాని కోళూరు నవపురపంచమఠస్థాన మహాజనులకు చేసిన ధర్మమును తెలుపును. 4. క్రీ. శ. 1122 నాటివి. బూదపూరు, నెక్కొండ శాసనములు. వీటిలో కుమార తైలపదేవుడు కోడూరు పురము నేలుచున్నట్లు కలదు.

5. క్రీ. శ. 1182 నాటిది జడచర్ల శాసనము. ఇందు ...శ్రీ మన్మహామండ లేశ్వర కందూరి ఉదయన చోడ మహారాజు వక్కాణింపబడినాడు. ఇతడు కోడూరి -స్వయంభు సోమనాథ దేవరకు ధర్మము చేసినట్లు కలదు. ఈ దానమునకు "కోడూరి గోకర్ణసింగ రూకలు" ఇచ్చి నట్లు చెప్పబడినది. కావున గోకర్ణునకు కోడూరుతో సంబంధము క లదనియు, ఆతని పేర నాణెములు ముద్రింప బడుచుం డెననియు ఆ నాణెములకు “కోడూరి గోకర్ణ సింగ రూకలు" అను పేరున్నట్లును తేలుచున్నది.

ఈ విధముగా కోడూరు పురవరమును గూర్చి శాసన లేఖనములు కలవు. అయితే ఈ రాజులు కోడూరుపుర మును విడచి కందూరును రాజధానిగా చేసికొనినట్లు ఆల వానిపల్లి, జడచర్ల శాసనములు వెల్లడిచేయుచున్నవి. తెలుగు చోడుల చరిత్రలో కందూరుపురము ప్రసిద్ధి వహించినది. కోడూరును వదలినను వారు కోడూరుపుర వరేశ్వరుల మనియే చెప్పుకొనుచు వచ్చినారు. కోడూ రును ఏల వదలవలసి వచ్చినదో తెలియదు. కాని కొంత ఊహించవచ్చును.

ఇప్పటి కోడూరుగ్రామ మధ్యమందు "చాళుక్య కాంతలు అగ్నిగుండము చొచ్చినతావు" అను ప్రదే శము కలదు. దానిని "బిందెము" అందురు. బిందు అనగా రక్త బిందువు. పూర్వము అమ్మవార్ల యెదుట 'బిందించెడు' వారు. అనగా జంతువులను బలియిచ్చి రక్త బిందువులు పడునట్లు చేసెడివారు. కావున బిందెము అనగా రక్తబిందువు పడినచోటు అనగా బలి యయిన చోటని భావము. అది తుములు యుద్ధము జరిగినచోటయి యుండును. ఈ ప్రదేశమున రాతితో ఎత్తగు అరుగు కట్టినారు. పైని వీరవిగ్రహములను నెలకొల్పినారు. ఈ ఉదంతమునుబట్టి అచ్చట ప్రళయమువంటి ఘోర మహా సంగ్రామము దాపరిల్లినట్లు తోచును. ఈ సంగ్రా మము ఎప్పుడు జరిగినదో, ఎందుకు జరిగినదో, వీర ప్రతివీరు లెవ్వరో తెలియదు. అయితే ఆ కాలములో పల్లవులకు, రాష్ట్రకూటులకు, చోళులకు, పశ్చిమ చాళుక్యు లకు, పూర్వ చాళుక్యులకు తరచు యుద్ధములు ప్రవ ర్తిల్లు చుండెను. మహబూబు నగరంజిల్లా, నల్లగొండ జిల్లా యుద్ధరంగములుగా నుండుచుండెను. శత్రుపుర ములను దహించుటయే అప్పటి యుద్ధనీతియై యుండెను. ఆ సేనా నివహములు కోడూరు మార్గమున నడచు 'చుండెడివి. అట్టి యుద్ధ ప్రస్థానములందు కోడూరు పురము దారుణాఘాతమునకు గురియై యుండునని భావించినచో అది సత్యమునకు దూరముగా నుండ జాలదు. ఈ సంగ్రామముల ఫలితముగా కోడూరుపురము రాజధాని గౌరవమును గోల్పోయినట్లు కనబడుచున్నది.

ఈ కోడూరు ప్రాచీన నగరమని విశ్వసించుటకు ఇచ్చట కోటలు, దిబ్బలు మొదలయినవాటి శిథిలావశేష ములు కనిపించుచున్నవి. పురాతత్వ శాఖవారి దృష్ట్యా కోడూరు గ్రామము ప్రాముఖ్యము వహించియున్నది. ఇచ్చట చరిత్ర కందని శిలాయుగమునాటి ప్రాచీనజనుల శిలానిర్మితసమాధులు, వలయాకారముగ నమర్చిన గుండ్లు కోడూరుయొక్క ప్రాచీనతను వెల్లడిచేయుచున్నవి.

ఆ. వీ.