సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/కోడూరు-III
కోడూరు - III :
ఈ కోడూరుగ్రామము కృష్ణాజిల్లా గుడివాడ తాలూకాలో నున్నది. ఈ కోడూరునకు అనపోతపురము అను నామాంతరము కలదు. ఈ అనపోతుడు కొండవీటి రెడ్డి రాజగు అనపోతారెడ్డి ( క్రీ.శ. 1353-1364). ఇదియొక చారిత్రక ప్రదేశము.
టాలెమీ అను పాశ్చాత్య చరిత్రకారుడు తన గ్రంథమునందు ఈ కోడూరును పేర్కొని యున్నాడు. కోడూరును "కొడ్డూర” అని అతడు తన భూగోళశాస్త్ర గ్రంథములో లిఖించియున్నాడు. టాలమీ కాలములో సముద్ర వర్తకమునకు ప్రధానకేంద్ర పట్టణముగా నిది ప్రఖ్యాతి చెంది యుండెను. ఇందుచే, కోడూరునకు తూర్పుగా సముద్రతీరమందున్న మచిలీపట్టణము గొప్ప నావికా రక్షణస్థానముగా నుండెనని స్పష్టమగుచున్నది.
ఈ కోడూరు పురమునకు అనపోతపురమను నామాంతర ముండుటయు, ఇచ్చట అనపోతారెడ్డి దానశాసన మొకటి దొరకుటయు చూడగా, రెడ్డిప్రభువగు అనపోతారెడ్డి రాజ్యవిస్తీర్ణము, ఆతని ఆధిపత్యప్రభావము మన మూహించుట కవకాశము కలదు.
అనపోతారెడ్డి దానశాసనము ఐదురేకులు గల తామ్ర శాసనము, శా, శ. 1280 పుష్యమాసపు టమావాస్యతిధి మంగళవారమునాడు, సూర్యగ్రహణ సమయమున అనపోతారెడ్డి అరువదియొక్కమంది భిన్న భిన్న గోత్రశాఖలు గల బ్రాహ్మణులకు ఈ కోడూరును దానముచేసి, దానికి “అనపోతపురము” అని నామకరణము చేసినట్లు ఈ శాసనము తెలుపుచున్నది. ఈ కోడూరు మలాపహము అను దానియొడ్డున గలదనియు, అష్టవిధైశ్వర్య భోగములతో దానము చేయబడెననియు గూడ ఆ శాసనము సాక్ష్య మిచ్చుచున్నది. మలాపహ తీరస్థ మనుటచే నేటికిని ఈ కోడూరు సరిహద్దులోనే పెద్దమురికికాలువ యొకటి కలదు. కోడు అనగా కాలువ. దాని తీరమందున్న ఊరు కోడూరు. ఈ కోడూరు శాసనరచయిత బాలసరస్వతి అను పండితుడుగా గనుపడుచున్నాడు. ఇది యా పండితునకు గల బిరుదమై యుండును.
ఈ శాసనమువలన అనపోతారెడ్డి విజయములు కృష్ణా, గౌతమీనదుల పర్యంతము విస్తరించినవని మాత్రము విదిత మగుచున్నది. అమరావతిలోనిది అమరేశ్వరాలయము. ఇచ్చటి అమరేశ్వరుని సన్నిధియందు “రావుతు కేశు" డను శత్రువును కృష్ణానది యొడ్డుననే అనపోతారెడ్డి వధించె
నని వెన్నెలకంటి సూరనార్యుని ఆంధ్ర విష్ణుపురాణము చెప్పు దానితో పై విషయము పొంది పొసగియుండుట గమనార్హము.
ఈ అనపోతారెడ్డి కోడూరు శాసనములో పేర్కొనబడిన పేళ్ళలో శంకనిపల్లి, విన్నకోట, కనుమేర్ల, పొట్టిపాడు, కలవపూడి యనువాని నన్నింటిని నేడు కృష్ణాజిల్లా గుడివాడలో నున్న సంకర్షణపురము, విన్నకోట, కనుమెర్ల, పొట్టిపాడు, కలువపూడి యను గ్రామములుగ క్రమమున గుఱుతించి పోల్చవచ్చును.
బొ. వేం. కు. శ.
[[వర్గం::సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము-వ్యాసాలు]]