సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/కోడూరు-II

కోడూరు-II :

కోడూరు కడప మండలమున రాజం పేట తాలూకా యందు గల మహాగ్రామము. కడప పట్టణమున కియ్యది యేబది రెండు మైళ్ళ దూరమున (84 కిలోమీటర్లలో) గలదు. మదరాసునుండి బొంబాయికి బోవు రైలుమార్గ మున గలదు. రేణిగుంట దాటిన తర్వాత మూడవ స్టేషను. ఇచట అన్ని విధములగు రైలుబండ్లు ఆగును. ఇది పూర్వ కాలము నుండియు ప్రసిద్ధికెక్కిన స్థలము. తిరుపతికి వెళ్లు వారు కాలినడక ఈ మార్గమున కొండలలో వెళ్లుచుండిరి. శేషాచలమునకు సమీపమున నున్నది. తిరుపతికొండనుండి ప్రవహించు కుంజర (గుంజన) యను సెలయేరు సంతత ప్రవాహముగలది ఈ కోడూరు నానుకొని ప్రవహించును. ఈ నదీజలముచే నీ గ్రామమున అనేక విధములగు ఫల వృక్షములు పుష్కలముగా ఫలముల నిచ్చును. ఇచట సమీపమున గల శేషాచలము, పాలకొండ యడవులనుండి కలపసామానులు, వంటకట్టెలు, చీనీపండ్లు, అరటిపండ్లు, తములపాకులు పలుచోట్లకు ఎగుమతి యగును. వెదురు మంచములు, గంపలు, తడికెలు, వెదుళ్ళు సమృద్ధిగ లభించు స్థల మిది. చేతిపనుల కనుకూలములగు వస్తువులీ కొండలయందు లభించుటచే తద్వృత్తులచే జీవించువా రిందు ఎక్కువ గలరు. సమృద్ధములగు ఫలజాతు లుత్పత్తి యగుచుండుట వలన ఇందు ప్రభుత్వమువారు ఫల పరిశోధన కేంద్రమును స్థాపించియున్నారు. ఈ కేంద్రము చూడదగినది . అ నేక విధములగు ఫలరసము లిందులభించును. నిపుణులగు వారు ఈ కేంద్రమున నుత్పత్తిచేసి యెగుమతి చేయుదురు. రక్త చందన వృక్షములు 1865 సంవత్సరములో నిచటి సమీపా రణ్యములలో నాటి యభివృద్ధి నొనరించుచున్నారు. శ్రీగంధపుచెట్లు ఈ ప్రాంతపు టడవులలో దొరతనము వారు తమ పర్య వేక్షణ క్రింద నభివృద్ధి చేయించుచున్నారు. అటవీశాఖవారు ఇచట 1871 వ సంవత్సరమున వంట చెరకుల డిపోను స్ధాపించిరి. ఇవి మద్రాసు మున్నగు ప్రదేశముల కెగుమతియగును. 1880 ప్రాతమున జర్మనీ లూధరన్ మిషన్ వారు తమ కార్యాలయమును ఇట స్థాపించినట్లు తెలియుచున్నది. 1887 వ సంవత్సరమునందు ఇచట మిషనువారు చర్చిని నిర్మించినారు. ఈ యూరికి ఒక టిన్నర మైలు దూరమున మిషనువారు కుష్ఠువ్యాధి నిర్మూలనార్థము కురపపల్లె యనుచోట ఆసుపత్రి నిర్మించి నారు. ప్రకృత మయూర నొక వైద్యశాల యున్నది. ఇచట మొదట లూథరన్ మిషను వారు ఎనిమిది ప్రైమరీ స్కూళ్ళను నడుపుచువచ్చినను ప్రకృతమున ఒక యున్నత పాఠశాలను జిల్లా పరిషత్తువారు సక్రమముగ నడుపు చున్నారు. లెక్కల ప్రకారము (Census No. 96, 97,) విస్తీర్ణము 18.21 మైళ్ళు. జనసంఖ్య 10,572. 1951

మద్రాసునుండి బొంబాయిపోవు రైలుమార్గము మద్రాసు అండ్ సదరన్ మహారాటా రైల్ వే అను పేరుతో 1854-66 లో ఈ ప్రాంతమున వేయబడినది. శ్రీ కాళహస్తీశ్వర మాహాత్మ్యమును రచించిన ధూర్జటి కవి తిన్నని కథలో "పొత్తపినాటలోన నుడుమూరను పక్కణమొప్పు" అని ఉదహరించిన పొత్తపి సీమకు జేరిన దీ కోడూరు. తిరుపతి వెళ్ళవలయుననిన నిటనుండి శేషా చలములో ప్రయాణము చేసిన పాపనాశన క్షేత్రము చేర వీలయిన త్రోపగలదు. ఇపుడు ఆ మార్గమున రోడ్డు వేయు ప్రయత్నములు జరుగుచున్నవి. ఈ మహా గ్రామము చుట్టుప్రక్కలనుండు వనములు చూడతగినవి.

ఈ గ్రామము చారిత్రకముగా ప్రసిద్ధికి నెక్కినట్లు కొన్ని విషయములు గలవు. మధురాంతక పొత్తపి చోళ తిక్క రాజు పాక నాటిని పాలించునప్పుడు (1254-1291) పొ త్తపి యను సీమ యొకటి ప్రత్యేకముగా నుండెడిది. ఈ పొ త్తపిసీమకు పొత్తపియే రాజధానీ నగరము. ఈ పొత్తపి ప్రకృతము రాజంపేట తాలూకాయందు గల గ్రామము. మధురాంతక పొత్తపిచోళులు మిరి పెక నాడు అను దేశ భాగమును పాలించుచుండిరి. ఈ కుటుంబము వారికి గండగోపాల నామము గలదు. పాలించిన మనుమసిద్ధి చోళవంశమునకు ఇతడే తిక్కన సోమయాజికి పోషకుడు. ఈ మనుమ సిద్ధిని గూర్చిన వివాద విషయము పొత్తపిసీమ సంబంధ మైనది యొకటి తెలియుచున్నది. ఒక బ్రాహ్మణజాతికిని, నెల్లూరును చేరిన వాడు. వెల్లాలజాతికిని కలిగిన విరుద్ధ విషయములో మధురాంతక పొత్తపి చోళమహారాజు నిర్ణేతగా నేర్పడెను. బ్రాహ్మణు లకు పల్లవరాజు ముక్కంటి కాడువెట్టి యనునాతడు ఏబది రెండు భాగములు సాకలి కోడూరు అను గ్రామ మున నొసగినట్లు శాసన మున్నది. ఈ భాగమును ఆ యూరి రైతులు అనుభవించుచు బ్రాహ్మణులకు చెంద నీయక యుండగా మనుమసిద్ధి ఈ వాదమును విచారించి, కోడూరు అగ్రహారము బ్రాహ్మణులకు మరలవచ్చునట్లు తీర్మానించినట్లును తెలియుచున్నది. ఈ శాసనములో నుదాహృతములయిన పెనగలూరు, ఇండ్లూరు అనునవి కోడూరు ప్రాంతముననే గలవు. పొత్తపిసీమ కడప సమీ పమునుండి కోడూరు దాటి శ్రీకాళహస్తి వరకు వ్యాపించి నట్లు కనబడును.

సూర్యవంశమువా రగు మట్లరాజుల కాలములో రాజం పేట తాలూకాయందు ఆ రాజులు అరువదినాలుగు అగ్రహారములు కట్టించిరి. పెక్కు చెరువులు త్రవ్వించి ముఖ్య ములగు సారవంతములగు భూములను వారు దేవతలకును బ్రాహ్మణులకును ఇనాములుగా నిచ్చినట్లు పూర్వపు ఈ కోడూరు సాక్ష్య మిచ్చుచున్నవి. శాసనములు గ్రామము చారిత్రక ప్రసిద్ధి నందినది. ఫలసార వంతమగు కోడూరు పొ త్తపి సీమలో మిగుల ముఖ్యమయిన ప్రదే శము. ఇటనుండి శేషాచలారణ్యము ప్రారంభమగును.

కోడూరునకు నిర్వచనము: “కోడు" అనగా పల్లము - నది యొక్క మడుగుతీరము. ఆప్రదేశమున నిర్మించిన గ్రామము కాబట్టి కోడూరు అను నామమేర్పడినది. ఈనదీ నామము కుంజరీ యనునది. పూర్వమిటకు శేషాచలము నుండి యేనుగులు అడవులు తిరిగి యీ నదియందలి మడుగులో నీరుత్రావుచుండుటవలన కుంజరీ యనునామ మానదికి వచ్చినది. ఈ కుంజరీ శబ్దము క్రమముగా జనుల వాడుకలో ఆనోట ఆనోట బడి మారి" గుంజన” యైనది. ఈ నది సర్వకాలముల యందును జలముతో నుండును. ఈ నదీతీరమున అనేక ఫలవృక్ష వనములు, సస్యశ్యామ లము లగు కేదారములును గలవు.

జ. వే. సు. ళ.