సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/కొరియాదేశము (భూగోళము)
కొరియాదేశము (భూగోళము) : కొరియాదేశము సుమారు 340- 421/20 ఉత్తర అక్షాంశముల నడుమను, 1240 - 1310 తూర్పు శేఖాంశ వృత్తముల నడుమను కలదు. పశ్చిమమునను, ఉత్తరమునను ఈ దేశము మంచూరియాచేతను, ఆసియా విభాగపు రష్యాచేతను పరివేష్టితమైయున్నది. కాగా, ఇది ద్వీపకల్పమై దక్షిణప్రాగ్దిశలలో, పసుపు సముద్రములోనికిని, జపాను సముద్రములోనికిని చొచ్చుకొనియున్నది. ఈ ద్వీప కల్పము యొక్క పొడవు 600 మైళ్లు. దీని వైశాల్యము 85,225 చ. మైళ్లు. 1951 వ సంవత్సరమునాటికి ఇచ్చటి జనాభా 3 కోట్లు. జనసాంద్రత చ. మైలు 1కి 352 మంది. ప్రధాన నగరములు : (1) సియోల్ (ఇది దక్షిణ కొరియా రాజధాని. జనాభా 15 లక్షలు), (2) పూసాన్ (ఇది ప్రధానమైన రేవు పట్టణము. జనాభా 4,73,619), (3) ప్యోంగ్ యాంగ్ (ఇది ఉత్తరకొరియా రాజధాని. జనాభా 10 లక్షలు), (4) టెయ్‌గు (ఇది పట్టు పరిశ్రమ కేంద్రము. జనాభా 3,13,705), (5) ఇంచాన్ (ఇది రేవు పట్టణము. జనాభా 2,65,767).
నైసర్గిక స్థల వర్ణనము, వాతావరణము : కొరియా తూర్పు రేవు ప్రాంతమంతయు నిమ్నోన్నతమయిన పర్వత పంక్తులచే ఆక్రమింపబడియున్నది. రేవునకు సమీపముననే వేయికిపైగా దీవులు కలవు. అందలి పెక్కునదులు నూరుమైళ్ళకు పైగా ఓడ ప్రయాణమునకు అనుకూలమై నట్టివి. ఇట్టివాటిలో దక్షిణముననున్న 'రకుటో' అను నదియు, మధ్యప్రాంతమున నున్న 'కాన్' అను నదియు, వాయవ్యమున మ౦చూరియా సరిహద్దు ప్రక్కనగల 'యాలు' అను నదియు ముఖ్యములైనవి. జులై, ఆగస్టు మాసములలో మిక్కుటముగా వర్షములు కురియు తరుణములోతప్ప తక్కిన బుతువులలో కొరియాదేశ మందలి వాతావరణము అమెరికా మధ్యమప్రాంత మందుగల వాతావరణమును పోలియుండును. సంవత్సరమునకు సగటు దాదాపు 40 అంగుళముల వర్షపాతము ఉండును. కాని దక్షిణో త్తర ప్రాంతముల నడుమను, తీరప్రాంతము యొక్కయు, దేశాంతర్భాగము యొక్కయు, నడుమను గల శీతోష్ణస్థితుల విభేదములు ప్రస్ఫుటముగా నున్నవి. చలికాలమందు పశ్చిమోత్తర దిశలనుండి శీతలమును శుష్క మునగు ఋతు పవనములు వీచును. ఉత్తరకొరియాలో ఏర్పడు గడ్డమంచు త్వరగా కరగక, ఎక్కువ కాలము నిలువ యుండగలదు. కాని దక్షిణప్రాంతమందలి గడ్డమంచు సౌమ్యమగు శీతోష్ణస్థితులు(temperatures) కారణముగా శీఘ్రముగా కరగును. ఉత్తర దేశమునందలి ప్రాంతములందు శీత కాలమున ప్రచండమైన చలిగాలులు వీచును. దక్షిణ కొరియాలో పూసాన్ నగర ప్రాంతమందు, సంవత్సరములో ఏడునెలలకు పైగా మంచు గడ్డకట్టదు. ఋతుపవనముల వలనను, తుపానులవలనను, వర్షపాతము ముఖ్యముగా వేసవిలో సంభవించును. వేసవికాలపు వేడిమికిని, శీతకాలపు చలికిని నడుమగల అంతరము వాయవ్యదిశకు పోనుపోను అధికమగును.
వ్యవసాయము : కొరియా ప్రధానముగా వ్యవసాయ వృత్తిని అవలంబించిన దేశము. కాని అచ్చటిభూమి సార రహితమైనది. అతివృష్టి అనావృష్టి దోషముల చేతను అధిక సంఖ్యాకులయిన జనులు వ్యవసాయముపై ఆధార పడుట చేతను, ఆహారోత్పత్తి విషయమున, కొరియా వెనుకబడియున్నది. ఉత్తర కొరియా యందలి వ్యవసాయము, దక్షిణ కొరియాయందలి వ్యవసాయము కంటె బహు ముఖముల వృద్ధిచెందెను. వరి ధాన్యము కంటె ఇతర ఆహార ధాన్యములు అచ్చట అధికముగా పండుచున్నవి. కాయగూరలు కూడ ఎక్కువగా పండింప
చిత్రము - 17
బడు చున్నవి. రాసాయనికములయిన ఎరువులను తయారు చేయుటకు ఉపయోగపడు కొన్ని మొక్కలు అచ్చట పెంచబడుచున్నవి. దక్షిణ కొరియాలో ప్రధానమైన పంట వరిపంటయే. తరువాత బార్లీ, గోధుమ ప్రాముఖ్యము వహించు చున్నవి. బార్లీ సంవత్సరమునకు, రెండు పంటలు పండును. సోయాచిక్కుడు, ఓట్లు, కొన్ని రకముల జొన్న ధాన్యము, ఉర్ల గడ్డలు, కాబేజి మున్నగునవి ఇతరములైన పంటలు.
కొరియా వ్యవసాయము మిక్కుట మైన మానవ(దేహ) పరిశ్రమచే సాధ్యమైనది. వ్యవసాయముయాంత్రిక మొనర్ప (Mechanise) బడలేదు. మిక్కిలి సుళువైన పరికరములు మాత్రమే వ్యవసాయమునకు లభ్యము లగుచున్నవి.
జపాను ప్రభుత్వమువారు తమ పరిపాలన కాలమున కొరియానుండి తమ దేశమునకు ధాన్యమును తరలించుకొని తమలోటును భర్తీ చేసికొనిరి. ముఖ్యముగా స్వప్రయోజనము నాశించియే, వ్యవసాయ ప్రాంతమును విస్తృతము చేయుటకును, నీటిపారుదల వసతులను అభివృద్ధి చేయుటకును జపాను ప్రభుత్వమువారు, కొరియాలో పెద్ద మొత్తముల ధనమును వ్యయపరచిరి. రెండవ ప్రపంచ యుద్ధానంతరము ఏర్పడ్డ రసాయనపు టెరువుల కొరత వలనను, 1950 వ సంవత్సరము తరువాత జరిగిన యుద్ధ విధ్వంసమువలనను, దక్షిణ కొరియాలో వ్యవసాయము నష్టపడెను. కాని యుద్ధవిరామ సంధి జరగిన పిమ్మట వ్యవసాయము పుంజుకొనెను. సుమారు 48,00,000 ల యెకరముల విస్తీర్ణముగల భూమి కొరియాలో సాగుచేయబడుచున్నది. 28,50,000ల యెకరములలో మాగాణి పంటలును, 19,50,000ల యెకరములలో మెరక పంటలును పండింపబడుచున్నవి సగటున కుటుంబమునకు 21/2 యెకరములును, ఒక్కొక్క వ్యక్తికి అరయెకరమును పడునని లెక్కలవలన అంచనా వేయబడినది.
పర్వతములు, అరణ్యములు : కొరియాదేశము పర్వతమయమై యున్నది. పర్వతములనడుమ చిన్న చిన్న మైదానములు కలవు. పర్వతముల ఎత్తుకంటె వాటి విశేషసంఖ్యయే ఎక్కువ ఆశ్చర్యకరముగ నుండును. దేశముయొక్క మొత్తము విస్తీర్ణములో అయిదవవంతు ఆక్రమించియున్న మైదానముల యందును తీర ప్రదేశములయందును మూడుకోట్ల ప్రజలు కిక్కిరిసి నివసించుచున్నారు. కొరియా దేశమునకును మంచూరియా దేశమునకును నడుమనున్న రెండు నదులును, ఒక కొండ వరుసయు ఉభయ దేశములకును సరిహద్దుగా నున్నది. దేశమునకు ఈశాన్యదిశగా ప్రవహించు ట్యుమెన్ అను నది మీదుగా కొరియాప్రజలు శతాబ్దములక్రితము నుండియు వలసపోయిరి. ఈ నదియొక్క 'హెడ్ వాటర్స్' నడుమ 9,000 అడుగుల ఎత్తుగల 'పాయ్‌టన్' అనుపేరుతో ఒక అగ్నిపర్వతము కలదు. ఉత్తర సరిహద్దు ప్రాంతములో అధిక భాగము నిర్జనప్రదేశమై యున్నది.
కొరియా భూభాగములో, నూటికి 73 వంతులు అరణ్యప్రాంతమై యున్నది. 1953 వ సంవత్సరము నాటికి 1,57,25,000 ల యెకరములమేరకు ఈఅరణ్యము లాక్రమించి యుండెను. కాని 1943-50 సంవత్సరములనడుమ జరిగిన యుద్ధ విధ్వంసమువలనను, విచక్షణ లేకుండా అడవులను నరకివేయుటవలనను, సమర్థమైన పర్యవేక్షణము లేకుండుటవలనను, అటవీసంపద నూటికి సగము వరకు క్షీణించెను. అడవులలో వంటచెరకును, గృహనిర్మాణమునకు ఉపయోగపడు కలపసామగ్రియు లభ్యమగును. ఇవికాక దేవదారువు, స్ర్పూస్, లార్చ్ అను రమణీయమైన వృక్ష సంతతులును కాననగును.
కొరియాలో చేపలపరిశ్రమ విరివిగా నున్నది. 10 లక్షలకుపైగా ప్రజలు ఈపరిశ్రమపై ఆధారపడి జీవించుచున్నారు. కొరియనులు తమ ఆహార విషయమున జంతు మాంసముపైకంటె చేపలపైననే అధికముగా ఆధారపడి యున్నారు.
భౌగోళికముగను, జాతీయముగను కొరియనులు ఆసియాదేశ ప్రజలలో పెక్కురకంటె భిన్నులు. వారి ఆచార వ్యవహారములును, సంప్రదాయములును, వస్త్రధారణమును, భిన్నములుగనే ఉండును. వారిగృహములు మట్టి గోడలతో దృఢముగ నిర్మింపబడును. వంటశాలల నుండి బయలుదేరు పొగ, భూమి అడుగు భాగమున ఏర్పరచబడిన గొట్టముల ద్వారమున వ్యాపించి ఇల్లంతటికిని వేడిమిని కలుగ జేయును కొరియా ప్రజలు అన్నిటను వ్యక్తిత్వముగల విశిష్ట జాతీయులుగా పరిగణింపబడి యున్నారు.
పరిశ్రమలు: జపాను ప్రభుత్వమువారు తమ పరిపాలన కాలములో, కొరియాయందు పరిశ్రమలను అభివృద్ధి చెందనీయక అచ్చటినుండి ముడి సరకులను, తమ దేశమునకు దిగుమతి చేసికొనిరి. 1930 వరకు గృహోప కరణములు ఆహార పదార్థములు, గుడ్డలు మున్నగునవి మాత్రమే కొరియాలో ఉత్పత్తి అగుచుండెడివి. అనంతరము జపాను ప్రభుత్వమువారు కొరియా ప్రజల కోరికను అనుసరించి ఉత్తర భాగమున ముఖ్యముగా భారీపరిశ్రమలను నెలకొల్పి తమ స్వంత పారిశ్రామిక నిర్మాణమునకు దోహద మొనరించుకొనిరి. ఈభారీపరిశ్రమలలో రాసాయనిక పదార్థములు, సిమెంటు, ఇనుము, ఉక్కు, విద్యుచ్ఛక్తి యంత్రముల ఉత్పత్తి ఉత్తర కొరియాలో అభివృద్ధి చెందుచుండగా, గుడ్డల పరిశ్రమ, ఆహార పదార్థముల పరిశ్రమ మాత్రమే దక్షిణ కొరియాలో స్థాపింపబడెను. కొరియా దేశములో బంగారము, రాగి, వెండి, టంగ్ స్టెన్ (తుంగన్థము) నల్ల సీసపురాయి (graphite) గనుల నుండి తీయబడుచున్నవి. అల్యూమినియం, నాన్ ఫెఱ్ఱస్ లోహములు, యుద్ధసామగ్రులుగూడ దక్షిణ ఉత్తర కొరియా ప్రాంతములలో అభివద్ధి చెందెను. జల విద్యుత్తునకు సంబంధించిన ప్రాజెక్టులుగూడ నూతనముగా వెలసినవి. వీటిలో ఆసియా ఖండములో పేరెన్నిక గన్న ఒక ఆనకట్ట యొక్క నిర్మాణ ఫలితముగా ఆరు లక్షల కిలోవాట్ల విద్యుచ్ఛక్తి ఉత్పత్తి జేయబడుచున్నది.
ఉత్తర కొరియాలో పారిశ్రామికాభివృద్ధి జరిగినను అచ్చటికంటె దక్షిణ కొరియా విభాగములో బ్యాంకింగ్ విధానము ఎక్కువగా అభివృద్ధి యయ్యెను. దక్షిణ కొరియాలో వర్తక వ్యాపారములు అధికముగా కేంద్రీకృతములై నూరింట 80 వంతులు అర్థ సంబంధమైన లావాదేవీలు జరుగుటయే ఇందులకు కారణము.
రవాణా సౌకర్యములు : కొరియాలో రైల్వే రహదారులు ప్రముఖములైన రవాణామార్గములయ్యెను. జపాను ప్రభుత్వమువారు తమ పాలనకాలములో ఆర్థిక సైనికావసరములకై రైలు మార్గములను విస్తృత మొనర్చిరి. ప్రధానమయిన రైల్వే మార్గము ఆగ్నేయ దిశాగ్రమున నున్న 'పూసాన్' అనునగరమును, మంచూరియా సరిహద్దున నున్న 'నినూయ్ జ్' అను నగరమును కలుపుచున్నది. సియోల్ నుండి మరియొక రైల్వేశాఖ ఈశాన్యదిశ యందున్న సముద్రపు రేవు వరకు నిర్మింపబడి యున్నది. మరియొక శాఖ అచ్చటినుండియే బయలుదేరి నైరృతి దిశకు చేరుచున్నది. రెండవ ప్రపంచ యుద్ధకాలములో రైల్వే నిర్మాణము అలక్ష్యము చేయబడినను, అనంతర కాలమున దాని అభివృద్ధి కొనసాగుచునే యున్నది.
రెండవ యుద్ధము ముగియునప్పటికి సగటున చ॥ మైలునకు 0.17 మైలు నిడివిగల మామూలు రహదారీ రోడ్డు మాత్రమే నిర్మింపబడి యుండెను. 1952 వ సంవత్సరము నాటికి 21,000 మైళ్ళ పొడవున రోడ్లు నిర్మింపబడి ముఖ్యమైన రైల్వే మార్గములతో కలుపబడెను. కొరియా దేశము పర్వతమయమయి ఉండుట చేతను, తూర్పు పడమరలుగా రోడ్డు మార్గములు గాని, రైలు మార్గములుగాని లేకుండుట చేతను, రేవు ప్రాంతములో జనసమ్మర్దముగల ప్రధాన నగరములు అభివృద్ధిచెందుట చేతను, అచ్చట ఓడ రవాణా మార్గములు ప్రాముఖ్యము నొందజొచ్చెను. 1955 వ సంవత్సరము యొక్క అంతమున కొరియాలో వేయేసి టన్నుల శక్తిగల పొగయోడలు 28 వరకుండెను. చేపలుపట్టు పడవలతో కలిసి మొత్తము 2,65,931 టన్నుల శక్తిగల 8096 ఓడలు అచ్చటనుం డెను.
బి. ఎన్. చ.