సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/కొక్కొండ వేంకటరత్నము పంతులు

కొక్కొండ వేంకటరత్నము పంతులు:

తొట్టతొలుత 'మహామహోపాధ్యాయ' బిరుదమును సంపాదించిన పండితులు కొక్కొండ వేంకటరత్నము పంతులుగారు. వీరు వినుకొండలో 1842 వ సంవత్సరమున జన్మించిరి. గుంటూరిలో

చిత్రము - 15

విద్యాభ్యాసము కావించిరి. చిత్తూరు మండలాంతర్గత మగు 'తిరువల' అను గ్రామమున వెలసిన శ్రీ తనుమధ్యా బిల్వనా థేశ్వరుల నారాధించితత్కరుణా కటాక్ష ప్రభావమున కవితావిద్య నార్జించినారు. వీరు కొంతకాలము చెన్నపురి రాష్ట్రీయ కళాశాల యందును, చాలకాలము రాజమహేంద్రవర కళాశాలయందును ఆంధ్ర పండితస్థానము నలంకరించి పెక్కుమంది కళార్థులకు విద్యాభిక్ష పెట్టినారు.

విద్వత్పరిషత్తులు 'కవిబ్రహ్మ' అనియు, 'అక్షరసంఖ్యాచార్యు' లనియు పంతులుగారికి బిరుదములు ప్రసాదించినవి. 'ఆంధ్రభాషా సంజీవిని' అను పేరుగల తెనుగు పత్రికకు సంపాదకులుగా నుండి వేంకటరత్న కవిగారు చేసిన సారస్వతసేవ చిరసంస్మరణీయ మైనది. వీరు రచించిన కృతులలో ప్రసిద్ధము లైనవి "ఆంధ్ర ప్రసన్న రాఘవ నాటకము, పంచతంత్రము, సింహాచల యాత్ర, బిల్వేశ్వరీయ ప్రబంధము, కుమార నృసింహము, ధనంజయ విజయ వ్యాయోగము, నరకాసుర విజయ వ్యాయోగము, మంగళగిరి మహత్వము, గోవిందమంజరి, దీక్షిత చరిత్రము, శంకరాచార్య చరిత్ర, కోరుకొండ మాహాత్మ్యము" అనునవి. ఈ గ్రంథములలో కొన్ని అనువాదములును, కొన్ని స్వతంత్ర రచనలును గలవు. వేంకటరత్న కవిగారి కవితారచన సంస్కృత సమాస నిబిడమై యుండును. రసవత్తరమైన ఘట్టములు స్వల్పముగా గోచరించుచుండును. వీరు వెండి, బంగారము మొదలగు క్రొత్త పేళ్లతో వృత్తములు రచించిరి. మొత్తము కవిత్వములో ప్రతిభకంటె వైదుష్యమే ముందు నడచునట్లు కనబడును.

నాడు పెక్కు తడవలు కందుకూరి వీరేశలింగము, వేదము వేంకటరాయ శాస్త్రి ప్రభృతులతో వేంకటరత్నము పంతులుగారు పత్రికా వాదమును నెరపిరి. ఆనాటి పండితులలో వీరు గ్రాంథికవాదులుగా పేరుమోసిరి. గృహ వ్యవహార సందర్భములలో గూడ గ్రాంథిక భాషలోనే మాటాడుచుండు నభ్యాసము వేంకటరత్నకవిగారు కలిగియుండిరి. “పలుకు దయ్యమా! యిది పాయసమమ్మా! ! బమ్మదయ్యపు టిల్లాలా! యిది పానక మమ్మా!" అను ధోరణిలో సంభాషణము సాగించువారని ప్రసిద్ధి. సలక్షణ భాషపై వీరికిగల అభినివేశ మంతటిది.

వేంకటరత్నము పంతులుగారు తెనుగుననే కాక సంస్కృత భాషలో కూడ గ్రంథరచన సాగించినవారు. జయదేవుని 'గీత గోవిందము'ను పోలిన వీరి 'గీత మహా నటము' అను గ్రంథము నాడు పండితశ్లాఘా పాత్రమై తన రారినది. ఇట్లు సంస్కృతాంధ్రముల యందు బహుగ్రంథ రచన సాగించి, అధ్యాపకవృత్తిలో ప్రసిద్ధి గడించి, తెనుగువారిలో మున్ముంగల 'మహామహోపాధ్యాయ' మహాబిరుదమును ఆర్జించుకొన్న కొక్కొండ వేంకటరత్నము పంతులుగారు డెబ్బది వత్సరముల పైగా జీవయాత్ర గడపి 1915 వ సంవత్సరమున బిల్వనాథేశ్వరునిలో ఐక్యమందిరి.