సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/కొండాపురము

కొండాపురము :

మెదకు జిల్లా, కలబగూరు తాలూకాలో బిదరుప్రాంతమున కొండాపురమను చిన్న గ్రామము కలదు. దాని ప్రాంతమునందు అత్యంతప్రాచీనకాలములో, అనగా 2000 సంవత్సరముల క్రిందట వైభవోపేతమైన యొక నగరము ఆంధ్ర రాజధానిగా విలసిల్లి యుండెనని చరిత్రకారులు నిర్ధారణ చేసిరి. ప్రాచీనకాలములో ఆ మహానగరమునకు ఎట్టి పేరు ఉండెనో తెలియదు. కాని నగరశిథిలములు దొరకిన ప్రాంతము కొండాపుర గ్రామమునకు సుమారు అరమైలు దూరమున మాత్రమే ఉండుటచేత ఈ పురాతన నగరమును కూడ సౌకర్యార్థము కొండాపురమనియే వ్యవహరించు చున్నారు. ఈ పూర్వపు పట్టణము పేరు కూడ కొండాపురమో అట్టిదే వేరొక పేరో అయి యుండ వచ్చుననుటకు అవకాశము కలదు. ప్రాచీన కాలములో విదర్భ అను దేశము ఉండెడిది. దానికి కుండిన పురము రాజధానియై యుండెను. విదర్భయే ఇప్పటి బీదరు

చిత్రము - 9

అపురూపపు జాడి (ఎఱ్ఱనిమట్టితో స్నిగ్ధము చేయబడినది) - కొండాపురము

అయి యుండవచ్చును. ఆకుండినపురమే కొండాపురముగా నేడు మారి యుండవచ్చును. కుండినపురము శ్రీకృష్ణుని భార్య యగు రుక్మిణీదేవికిని, నలమహారాజు భార్య యగు దమయంతీ దేవికిని జన్మస్థానమని పురాణములు చెప్పుచున్నవి. దీనిని బట్టి కొండాపురపు చరిత్ర అత్యంత ప్రాచీనకాలమునకు చెందినదని చెప్పవచ్చును.

ప్రాచీననగర ప్రదేశము సముద్రమట్టమునకు 1788 అడుగుల ఎత్తున ఉన్నది. ఇప్పుడది 80 ఎకరముల జొన్న చేనుగా మారినది. ఈ చేనిలో అచ్చటచ్చట మంటిదిబ్బలు కనబడుచున్నవి. ఈ దిబ్బలు నేలమట్టమునకు సుమారు 20-30 అడుగుల ఎత్తున్నవి. మంటిదిబ్బలకును, కొండాపుర గ్రామమునకును మధ్యగా ఒక ఏరు ప్రవహించు చున్నది. ఈ ఏటియొక్క ప్రవాహమును అరికట్టుచు గొప్పతటాకము నిర్మింపబడినది. జల సమృద్ధిగల ఈ నదీతీరముననే పూర్వోక్తమయిన పురాతన పట్టణమును కట్టి యుందురు.

చిత్రము - 10

యక్షవిగ్రహము (ముందుభాగము) - కొండాపురము

చిత్రము - 11

యక్షవిగ్రహము (వెనుకభాగము) - కొండాపురము
వానకాలములో వాన వలన మంటిదిబ్బలమీది మన్ను కొట్టుకొనిపోగా విచిత్రాకారముగల ఇటికలు కనబడినవి. ఇచ్చట ఏదో చరిత్రకు సంబంధించిన గని కలదని పురావస్తుశాఖవారు గ్రహించి త్రవ్వకము లారంభించిరి. ఈ

చిత్రము - 12

మట్టితో చేయబడిన జంతువిగ్రహము - కొండాపురము

చిత్రము - 13

మృణ్మయపాత్రలపైనున్న బౌద్ధ మత చిహ్నములు - కొండాపురము

మంటిదిబ్బలకు కొంచెము దూరములో బ్రహ్మాండమయిన ఆకారముగల గండశిలలు, మరికొంత దూరమున చుట్టును

చిత్రము - 14

మట్టి తాయెతులు కొండాపురము

పెట్టని కోటలవలె గుట్టల వరుసలు ఉన్నవి. జలసౌకర్యము, స్వాభావిక రక్షణసౌకర్యము ఉండుట రాజధాని యైన నగరమునకు ఆవశ్యకముకదా! అట్టి సౌకర్యములు గమనించియే ఆ పట్టణనిర్మాణము కావించియుందురు.

పురావస్తు శాఖవారు 1941 లో త్రవ్వకముల నారంభించిరి. ఇండ్ల శిథిలములు, ఇటికలతోను, మట్టితోను కట్టిన గోడలు, రాతి కాలువలు, కమ్మరి కొలుములు, పెద్ద పెద్ద మట్టిగాబులు, స్తూపములు, చైత్యములు, విహారములు కనబడినవి. ఇంకను భాండములు, విగ్రహములు, పూసలు, సొమ్ములు, నాణెములు దొరకినవి. పట్టణములకు ఉండ వలసిన లక్షణము లన్నియు కనబడెను. అచట కర్మకారు లుండిరి. పరిశ్రమలుండెను. టంకసాలయుండెను. జనులు బౌద్ధమతావలంబులుగా నుండిరి. ఇట్టి అద్భుత వృత్తాంతము బయల్పడుటయేగాక, నూతన చారిత్రకాంశములు కూడ లభించినవి.

ఇచ్చట దొరికిన వస్తువులను మత దృష్టితోను, శిల్ప దృష్టితోను చూచినచో రెండువేల సంవత్సరముల క్రిందట ఆంధ్రజనుల సభ్యత ఎట్లుండెనో వెల్లడి కాగలదు. వారు ఇండ్లను ఇటికతోను, సున్నముతోను కట్టుచుండిరి, ఈ ఇటికలను దగ్గర నున్న తటాకములోని మట్టితోనే చేయు చుండిరి. ఇంటియొక్క ప్రాకారకుడ్యమునకు వాడిన ఇటిక 22 అంగుళముల పొడవు, 12 అంగుళముల వెడల్పు రెండున్నర అంగుళముల మందము కలదిగా నుండెను. గోడల మూలలందు 20 అంగుళముల చదరపు ఇటికలను వాడిరి. గుండ్రని కట్టడములకు—స్తూపములు, గోపురములు మున్నగు వాటికి-వంపు మూలలు గల ఇటికలను వాడుచుండిరి. ఈ యిటికలు 2000 సంవత్సరములు గతించి నప్పటికిని ఇంకను చెక్కు చెదరక అందముగా నున్నవి. ఇండ్లపై పెంకులు కప్పుచుండిరి. నేలగచ్చు చేయుచుండిరి.

ఇచ్చట మూడు విహారములు, రెండు చైత్యములు, 3 స్తూపములు కనబడినవి. ఒక విహారములో 7 గదులు కలవు. 4-5 గదుల మధ్య 5 అడుగుల 2 అంగుళముల వెడల్పు గల నడవ కలదు. ప్రతి గదియు 10 చదరపు టడుగుల విస్తీర్ణము కలదిగా నున్నది. బౌద్ధభిక్షువుల నివాసము కొరకు మూలలయందు కట్టబడిన కొట్టిడీలు కలవు. ఒక చైత్యముయొక్క లోపలి భాగము 25 అడుగుల 4 అంగుళముల పొడవు, 10 అడుగుల 4 అంగుళముల వెడల్పు కలిగి యున్నది. ఒక స్తూపముయొక్క ఆవర్తపు అడ్డు కొలత 19 అడుగు లున్నది. ఇచ్చట బుద్ధదేవుని ప్రతిమ దొరకలేదు. కావున ఇచటి జనులు హీనయాన శాఖకు చెందిన బౌద్ధు లయి యుందురని తేలుచున్నది.

ప్రతి గృహమునందును ఒకటి, రెండు నేలమాళిగలు కనబడినవి. ఈ నేలమాళిగలలోనే వివిధ నాణెములు, అచ్చు దిమ్మెలు, విగ్రహములు, అమూల్యాభరణములు, పూసల పేర్లు మొదలగునవి దొరకినవి. వాటిని అమూల్యములుగా భావించి నేలమాళిగలలో భద్రపరచి యుందురు. అసేతు హిమాచల పర్యంతము గల చరిత్ర పరిశోధకులను ఆశ్చర్యచకితులను గావించినది ఇచ్చట గనబడిన కుంభ కార విద్యాప్రావీణ్యము. ఇచ్చటి కుమ్మరి చిత్రకళను, శిల్పకళను మేళవించిన ప్రతిభాశాలి. ఈతడు మట్టితో కుండలనే గాక గాజులను, సొమ్ములను కూడ చేయుచుండెడి వాడు. ఎఱ్ఱమట్టినే వాడుచుండెను. ఒక జాడి అసాధారణమగు పనితనము గలిగి ఎత్తుగా నున్నది. ఒక భాండము తొమ్మి దడుగుల వలయము, మూడడుగుల లోతు కలిగి, వన్నెచిన్నెలతో నిగనిగలాడుచున్నది. మృణ్మయ పాత్రములు వివిధ వర్ణములతో చిత్రాలంకార భూషితము లయి నాజూకుగా నున్నవి. పూజకు ఉపయోగించు భాండములపై సాంకేతిక చిహ్నములు కలవు. ఒక దానిమీద "బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి" అను త్రిరత్నములు చిత్రింపబడినవి.

ఈ కుమ్మరవాడు బోలు విగ్రహములను తెల్లని, మెత్తని మట్టితో చేసి త్రివర్ణములతో చిత్రించినాడు. ఆ విగ్రహముల తలలపై శిరో వేష్టనములు గలవు. ఆ విగ్రహముల పాగాలు, వాటి మెడలోని హారములు, వాటి చెవులకు గల పోగులు, ఆకర్షకములుగా నున్నవి. కొన్ని నవ్వుపుట్టించు విగ్రహములు కలవు. ఈ కుమ్మరి హాస్యప్రియుడుగా కనబడుచున్నాడు.


ఇచ్చటి కమ్మరీడును గట్టివాడే. కొడవళ్ళు, గొడ్డళ్ళు, పటకాలు, బాకులు, ఉలులు, మేకులు, నాగళ్ళు మొదలగునవి దొరికినవి. బల్లెముల అగ్రములు దొరకుటచే ఇచ్చట సైన్య ముండెనని తోచుచున్నది. కొలుములు, తిత్తులు, కాల్చిన పనిముట్లను చల్లార్చుటకు పెద్ద పెద్ద నీటి బానలు, కమ్మరి అంగళ్ళు ఎక్కువ సంఖ్యలో కనబడినందున కమ్మరి పని ఇచ్చట భారీయెత్తున సాగుచుండెనని మనము గ్రహింప వచ్చును.

ఇచ్చట రత్నాల సొమ్ములు, బంగారు సొమ్ములు దొరకినవి. వాటిని భాగ్యవంతులు పెట్టుకొనుచుండి రనవచ్చును. వెండి, రాగి, దంతపు సొమ్ములు, ఆల్చిప్ప సొమ్ములు కూడ దొరకినవి. వీటిని బీదవారు ధరించుచుండి రనవచ్చును. రత్నాభరణములు వివిధాకారములలో నున్నవి. నిరుపేదల కొరకు కుమ్మరివాడు మట్టిగాజులు, మట్టి హారములు, మట్టి తాయెతులు చేయుచుండెను. భాగ్యవంతులు బంగారు కాసుల దండలు వేసికొను చుండగా బీద పడుచులు కుమ్మరివాడు సృష్టించిన మట్టికాసుల దండలను వేసికొని కులుకుచుండిరి కాబోలు, ఈ మట్టి కాసులు క్రీస్తుశకములోని రోమక బంగారు నాణెములను అచ్చముగ పోలి యున్నవి.

ఇచ్చట సుమారు నాలుగువేల నాణెములు దొరకినవి. ఇందు 10 వెండివి, 100 పంచలోహములవి, 50 రాగివి, మిగత నాణెములు సీసపువి. ప్రతి నాణెమునకు చిల్లి కలదు. ఈ నాణెములు చేసెడు అచ్చు దిమ్మెలు కూడ దొరకినవి. ఈ నాణెములలో శాతవాహన వంశజులయిన గౌతమీపుత్ర శాతకర్ణి, వాసిష్ఠీపుత్ర పులమావి, శివశ్రీ పులమావి, యజ్ఞశ్రీ శాతకర్ణి అను సమ్రాట్టులకు చెందినవిగా నాలుగు నాణెములు స్పష్టముగా కన్పట్టు చున్నవి. ఇంతవరకు చరిత్ర కారులకు తెలియని నాణెములు ఇచ్చట దొరకినవి. రాజముద్రికలును దొరకినవి. అందలి అక్షర స్వరూపమును బట్టి అవి క్రీ. శ. మొదటి శతాబ్దికి చెందినవని తెలియుచున్నది.

దక్షిణాపథము పూసల పరిశ్రమకు కేంద్ర మని విజ్ఞుల అభిప్రాయము. కొండాపురము కూడ అట్టి కేంద్రములలో నొకటి యని తోచును. ఇచ్చట 23,391 పూసలు దొరకినవి. ఇందు 22,000 మట్టిపూసలే. మరియు రాగి, స్ఫటికము, శంఖము, కెంపురాయి, సూర్యకాంతము, ఎముక మొదలగు వాటితో చేయబడిన పూసలే గాక ఇంద్రనీలము, కురువిందము, వైఢూర్యము, గరుడ పచ్చ, మరకతము మున్నగు రత్నమయములగు పూసలుకూడ లభించినవి. ఇవి సుమారు మూడు వందల ఆకార భేదములను కలిగియున్నవి. ఈ పూసలలో వృషభాకారపు పూస బేర్కొన దగి యున్నది. బుద్ధుడు వృషభ రాశిలో జన్మించి యుండుటచే ఆ చిహ్నము పవిత్రమైనదిగా ఆ బౌద్ధులు భావించి యుందురు. రావియాకు, త్రిరత్న రూపములు కూడ అట్టివియే. స్వస్తికము, శ్రీవత్సము, గజలక్ష్మి, చురకత్తి, మొదలగు వాటి రూపములలో కొన్ని యున్నవి. పూసలు కూడ కాల నిర్ణయములో తోడ్పడును. ఇచ్చట దొరికిన పూసలను బట్టి క్రీ. పూ. మొదటి శతాబ్దము నుండి, క్రీ. శ. రెండవ శతాబ్దము వరకు గల మూడు వందల సంవత్సరములలో కొండాపురము వైభవ శిఖరము నంది యుండెనని చరిత్ర పరిశోధకులు నిశ్చయించి యున్నారు.

శాతవాహనులు ప్రతిష్ఠానములో రాజ్యము చేయుచున్న కాలములో వారికి ప్రాకార పరిఖావృతములగు ముప్పది నగరము లుండెనని మెగస్థనీసు క్రీ. పూర్వము 302 లో వ్రాసినాడు. ఆ ముప్పది పురములలో ఈ కొండాపురము ఒక మేలి పురమయి యుండవచ్చునని అనుకొనుచున్నారు. భారత ప్రభుత్వపు పురావస్తుశాఖకు డైరెక్టర్ జనరల్ అగు రావుబహద్దూర్ కె. యన్, దీక్షితులుగారు కొండాపురమును గూర్చి ఇట్లు చెప్పినారు :

“ఇది నిజముగా మహాస్థలము. దక్షిణాపథములో శోధించదగిన స్థలము. ఆంధ్ర రాజయుగపు వైభవ శిఖరమునకు గొంపోవు విస్తృత యోగ్యతలుగల నగర ప్రదేశము మరియొకటి నాకు దక్షిణమున కనబడ లేదు. ఇచ్చట కనుగొన్న వస్తుసంపద అసాధారణ విశిష్టత గలది. కొండాపురమును నేను దక్షిణ భారతపు 'తక్షశిల' అనుచున్నాను."