సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/కేశవ జగన్మోహినీ ఆలయము (ర్యాలి)

కేశవ జగన్మోహినీ ఆలయము (ర్యాలి) :

రాజమహేంద్రవరమునకు సుమారు పదునైదు మైళ్లు దక్షిణమున గౌతమి, వసిష్ఠ యను గోదావరి పాయలకు మధ్యమున 'ర్యాలి' యను పురాతన గ్రామమున్నది. ఈ యూరు వేయి యేండ్లకు పూర్వము నౌకలమీద రత్నముల వ్యాపారము చేయు వర్తకులకు నిలయమై రత్నాపుర మను పేరున నుండెడిదట. జగన్మోహినీ కేశవస్వామి ఇట ప్రతిష్ఠింపబడిన నాటి నుండియు 'రాలి' యను పేరున బరగి ఇప్పుడు 'ర్యాలి' యనబడుచున్నది. క్రీ. శ. పదునొకండవ శతాబ్ద్యంతమున, శ్రీ కేశవస్వామి

చిత్రము - 4.

చిత్రము - 5.

వారిటకు వేంచేసి స్థిరనివాసియగుటయు, చోళదేశమునుండి ద్రావిడ బ్రాహ్మణ కుటుంబములు స్వామి వారి విగ్రహముతోపాటు ఇచ్చటికి వచ్చుటయు మొదలగు చారిత్రకాంశములీ స్థలమునకు అఖండఖ్యాతి గూర్చినవి. విగ్రహము ఎదుటిభాగమున కేశవస్వామి రూపమును, వెనుక ప్రక్కను జగన్మోహినీ రూపమును జూపు ఈపాలరాతి విగ్రహమునందలి శిల్పము యావద్భారత దేశమునను అపురూపమై, మహా శిల్పులకును, రాజ్యాధిపతులకును గూడ దిగ్భ్రమ గొల్పునంతటి కళాచాతుర్యముతో వెలసియున్నది. ద్రావిడ బ్రాహ్మణులు మొదట ఈ గ్రామమున నిలిచి పిమ్మట పేరూరు (పెద్ద ఊరు) నకు పోయిరి.

ఈగ్రామ మధ్యమున తూర్పు పడమరలుగా వ్యాపించియున్న వీథికి ఇరుకొనలందును ఎదు రెదురుగా కేశవస్వామి యాలయమును, కమండలేశ్వరస్వామి యాలయమును నిల్చియున్నవి. ఈ గ్రామమున క్షేత్రపాలకుడగు వేణుగోపాలస్వామియు చిరకాలము క్రిందటనే వెలసియున్నాడు. పెద్ద మెట్టవీథులతోను, కొన్ని చదునగు పల్లపు వీథులతోను గూడిన ఈ గ్రామము నేడు స్వామి దర్శనమునకు వచ్చు ప్రముఖ భక్తుల కారణమునను, వ్యవసాయము, వర్తకము మొదలైనవి పెరుగుటచేతను, కాలువలును, రహదారులును, వంతెనలును గలిగి రాజుకీయముగ గూడ ప్రాముఖ్యము నొందు పెద్ద గ్రామముగ నొప్పుచున్నది. వేలకొలది విద్యార్థు లిటకు విజ్ఞానయాత్రల కొరకు ఏటేట వచ్చుచున్నారు.

ఆంధ్రదేశ చరిత్రలో తూర్పు చాళుక్యరాజులు వేంగి ముఖ్యపట్టణము గాను, పశ్చిమ చాళుక్యరాజులు కళ్యాణపురము రాజధానిగాను, క్రీ. శ. ఏడవశతాబ్ది నుండియు నేలుచు, నిరంతరము పరస్పర యుద్ధములలో మునిగి యుండిరి. ఆ కాలమున దక్షిణమున తంజాపురి ప్రాంతమున చోళరాజ్యము విలసిల్లెను. చోళరాజులు తూర్పు, పడమటి చాళుక్యులతో వివాహ సంబంధములు చేసికొని, తూర్పు చాళుక్యుల కెక్కువ సహాయము చేయుచుండిరి. క్రీ. శ. 1022 నుండి 1063 వరకు రాజమహేంద్రవరమున రాజ్యమేలిన రాజరాజ నరేంద్రుని పెక్కుమార్లు అతని సవతి తమ్ముడగు విజయాదిత్యుడు పడమటి చాళుక్య రాజుల సహాయమున ఓడించి సింహాసన భ్రష్టుని జేయగా, రాజేంద్ర చోళుడను రాజు దక్షిణమునుండి వచ్చి రాజరాజును రాజమహేంద్రవర రాజ్యమున పునస్థాపితుని చేయుచుండెను. రాజేంద్ర చోళుడు తన కొమార్తె, అమ్మంగదేవిని రాజరాజునకిచ్చి పెండ్లిచేసెను. ఈ దంపతుల పుత్రుడు రాజేంద్ర కులోత్తుంగ చోళు డన బరగెను. ఈతడు చోళరాజుల దౌహిత్రు డగుటచేతను, అప్పటి చోళరాజులగు వీర రాజేంద్రచోళుడు చనిపోవుటయు, ఆతని కొడుకు అధిరాజేంద్రుడు యుద్ధమున చనిపోవుటయు, అట్లు చోళ సింహాసనము రాజహీన మగుటయు తటస్థింపగా చాళుక్య, చోళ రాజ్యములు రెండింటికిని తానే వారసుడయ్యెను. అంతకుముందు రాజ్యకాంక్షచే విజయాదిత్యుడు (కులోత్తుంగుని సవతి పినతండ్రి) వేంగి రాజ్యముపై డీకొనగా కులోత్తుంగుని రాజ్యమున నిల్పుటకు అప్పటి చోళరాజగు వీర రాజేంద్ర చోళుడు దక్షిణమునుండి దండయాత్రవచ్చి, విజయాదిత్యునికి సాయపడుటకు బెజవాడ వరకును వచ్చిన పడమటి చాళుక్య రాజగు ఆరవ విక్రమాదిత్యు నోడించి, రాజమహేంద్రవరమునకు వచ్చి, విజయాదిత్యునిగూడ తరిమి, కులోత్తుంగుని మరల ఆంధ్ర సింహాసనమున నిల్పెను. కాని కులోత్తుంగుడు చోళ రాజ్యముననే ప్రీతి కలిగి తన ఇద్దరు శత్రువులతోను సంధి చేసికొని, తన కొమాళ్ళను వేంగిరాజ్య మేలుటకు నిల్పి, తాను చోళదేశమున నిలిచిపోయెను. ఇతడు క్రీ. శ. 1118 వరకును జీవించెను. ఇట్లు రాజరాజ నరేంద్రునికిని అతని కొడుకు కులోత్తుంగునికిని సహాయము చేయుటకు మాటి మాటికిని చోళరాజులగు రాజేంద్ర చోళుడు, వీరేంద్రచోళుడు మొదలగువారు సైన్య పరివారములతో రావలసి వచ్చుచుండెను. ఈ చోళ రాజులు వేంగిరాజ్య రక్షణార్థము వచ్చినప్పుడు వారివెంట కుంభకోణము, వెలంగ మాను మొదలగు ప్రాంతములందలి ద్రవిడ బ్రాహ్మణులు, ఆంధ్రదేశమున నివసింపదలచి, తమ కుటుంబములతో గూడ పండ్రెండు గోత్రముల వారు వచ్చి ఈ యుభయ గోదావరీ మధ్యస్థమగు ర్యాలియందు నివాస మేర్పరచుకొనిరి. ఆ ద్రావిడులు శిల్ప నైపుణ్య ముట్టిపడు సుందరతమ సాలగ్రామశిలానిర్మితమగు జగన్మోహినీ కేశవస్వామి విగ్రహమును ఒక రథముపై నుంచుకొని దానిని ద్రోసికొని వచ్చుచుండగా, రథపు చీల రాలిపడెను. మరియొక చీల అతికి రథమును జరుపజూచినను రథము కదలలేదు. స్వప్న దర్శనాదులచే స్వామి సంకల్పముగూడ నచట నిల్చి పోవుటయే యని భక్తు లెరిగి, ఆ విగ్రహము నచటనే ప్రతిష్ఠించిరి. రథము చీల రాలి, స్వామి యట నెలకొనుటచే అచ్చటి వారాగ్రామమునకు ర్యాలియని పేరిడిరట. ద్రావిడ చోళరాజుల బిరుదమున 'గండ' పదము కలదు. రాజేంద్ర చోళునికి 'ఒక్కెత్తు గండ' (యుద్ధమున నొకే కేతువుగల ఏకైక వీరుడు) బిరుదము కలదు. అభ్యుదయ గండచోళుడు కేశవస్వామిఆలయమును కట్టించెనని, పెద్దలు చెప్పుదురు. ఈ అభ్యుదయ గండబిరుదము పదునొకండవ శతాబ్దాంతప్రాంత చోళరాజులకు చెందియుండును. వీథికి రెండు కొనలందును కేశవస్వామియు, కమండలేశ్వరుడును ఎదురెదురుగ నుండుటకు స్థలపురాణపు గాథ ఇట్లున్నది; దేవాసురులు క్షీరసముద్రమున బుట్టిన అమృతముకొరకు కలహింపగా, విష్ణువు మోహినీ రూపము దాల్చి, రాక్షసులను కనుగప్పి, దేవతలకు అమృతము పంచెను. ఈ వార్త ఈశ్వరుడు విని, మోహినీ రూపమును తనకు జూపుమని విష్ణువును వేడ ఆతడు మోహినీ రూపమున ప్రత్యక్ష మాయెను. ఆ యతిలోక సౌందర్యమునకు మోహితుడై శివుడు మైమరచి ఆ స్త్రీని బట్ట వెంటబడెను. జగన్మోహినియు తన టక్కులచే శివుని చాలదూర మాకర్షించుకొని వచ్చెను. తుదకు శివు డలసినట్లెరిగి, విష్ణువు తన సంపూర్ణ పురుషరూపముతో నెదురుగ నిలిచి, జగన్మోహిని రూపమును వెనుకనుంచుకొనెనట. శివుడు తన భ్రాంతి నెరిగి, సిగ్గిలి, ముందుకు సాగలేక స్థాణువాయె నట. అతడు కమండలేశ్వరు డాయెనని కొందరందురు. బ్రహ్మ ఇట యజ్ఞకుండము నిల్పెననియు, అతడు తన కమండలువు నుంచినచోట ఆవిర్భవించిన శివుడు కమండలేశ్వరు డాయెననియు ఒక గాథ కలదు. ఈ గ్రామ సమీపమున వసిష్ఠానదిలో బ్రహ్మకుండ మను భాగము కలదు. అందు భక్తులు స్నానము చేయుదురు. జగన్మోహినియు నలసి పోయెను. ఆమె నుదుటి నుండి స్వేద బిందువు రాలగా అట నొక పుష్కరిణి ఏర్పడెను. స్వేద బిందువు రాలుటచే ఏర్పడిన కొలనుగల గ్రామము గాన, రాలి యని పేరొందెనందురు. దేవాలయము వెనుక నున్న చెరువునకు చోళ సముద్రమను పేరని పెద్దలు నేటికిని చెప్పుదురు.

జగన్మోహినీ విగ్రహ శిల్పసౌందర్యము వర్ణనాతీతము. వెనుక వైపునగల చక్రాకారపు జటాబంధమును, గోచి పోసి కట్టిన చీర కట్టుబడి లక్షణమును ద్రావిడ శిల్పపు తీరును దెల్పును. ఆ కాలపు ద్రావిడ శిల్ప ప్రభావము ఆంధ్ర శిల్పముపై గాఢముద్ర వేసినట్లు తోపక మానదు. శిల్పి పేరుగాని, శిలాశాసనముగాని దేవాలయమున కాన రావు. కాని ఈ విగ్రహమును ద్రావిడభక్తు లిట స్థాపింప పదునొకండవ శతాబ్దాంతముననో, పండ్రెండవ శతాబ్దాదినో గల చోళ రాజు లిట ఆలయమును కట్టించిరనుట ప్రమాణ సిద్ధము.

విగ్రహమునకు కిరీటము, మకరకుండలములు, కంఠమాలయు, శిల్పసంపద లొప్పు కంఠపు ముడుతలును, మెడలో కౌస్తుభహారమును, యజ్ఞోపవీతమును గలవు. వక్షమును, నాభియు, నడుమునకు గల ఆభరణములును, వస్త్రమును కడు రమ్యముగా చెక్కబడినవి. చేతులలో శంఖము, చక్రము, గదయు అమరినవి. ఒక హస్తము అభయముద్రను తెల్పును. గద పట్టిన చేతి వ్రేళ్ళును, గోళ్ళును అప్రతిమాన శిల్పవైభవమును చాటును. కంకణ కేయూరములును, రత్నాంగుళీయకములును ఒప్పినవి. చక్రముపట్టిన చేయి మాత్రము ఖండితమై యున్నది. గంగ విష్ణుపాదోద్భవయని తెల్పుట కీ విగ్రహపు పాదము తడిగా నున్నట్లుతోచి నిరంతరము నీరూరుచున్నట్లు శిల్పముతో నొప్పును. ఇది ఈ విగ్రహ మహిమ యందురు. పాదపీఠముకడ గరుడాళ్వారును, ప్రహ్లాద, నారద, పరాశరాది పరమ భాగవతో త్తముల రూపములును చెక్కబడినవి. కాళ్ళ కిరుప్రక్కలను శ్రీ దేవియు, భూదేవియు, రుక్మిణీ సత్యభామలును చిత్రరూపమున నున్నారు.స్వామికి ఉభయ పార్శ్వములను కేశవస్వామి విగ్రహములతో ఆలయ రూపము చెక్కబడినది. ప్రక్కలనుండి మీదికి పొన్న చెట్టును, దానిమీద గోవర్ధన పర్వతమెత్తిన విష్ణువును, ఆ మీద ఏనుగు, రేచుక సింహములు జాతివైరము విడచియున్న రూపములును గలవు. మీదివై పున ఎడమ నుండి కుడికి దశావతారములును, తుంబురు నారద భక్తులును, కిన్నెర కింపురుషులును, రాక్షససంహారమును సూచించు కీర్తిముఖములును, రంభోర్వసులును, పడగలతోడి శేషుడును కనిపించును. వెనుక ప్రక్క మోహినీ రూపమున కేశములను తెల్పు గీతలు కలిగి, నడుమ చేమంతి రూపముకల గుండ్రని జటాబంధము సొంపు లొలుకును. చేతుల దండతాయెత్తులును, పట్టీలును, గోచి పోసిన చీర కట్టుబడియు, పాదముల అందెలు, గజ్జెలును పొందుపరుప బడినవి. పద్మినీజాతి స్త్రీ లక్షణమగు 'శ్రీవత్సము'అను మచ్చ కుడిపిక్కమీద కడు సహజముగగన్పట్టు నట్లు చెక్కబడినది. ఇంతటి శిల్ప మీ యైదడుగుల యెత్తు విగ్రహమున ముందు వెనుకల చెక్కబడియుండుట చూచి ముగ్ధులు కానివారును, శిల్పిని మనమున స్తుతింపని వారును ఉండరు. ద్రావిడ కుటుంబములవారు ఇటనుండి వెడలిపోయిరి. కాని ఈ గ్రామము చిరకాలము బొమ్మకంటి, వారణాసి, అప్పల్ల, వంగల మొదలగు వంశములందు ఉద్భవించిన షట్ఛాస్త్ర పండితులకు నిలయమై యుండెను.