శ్రీ సుందరకాండ (రాయప్రోలు సుబ్బారావు)/సర్గ 48
శ్రీ
సుందరకాండ
సర్గ 48
1
మారుతి అక్ష కుమారు వధింపగ
దానవేంద్రుడు యథా మనస్సమా
ధాన పరుండయి, తనయు నింద్రజితు
ఇంద్రసముని పిలిపించి యిట్లనెను.
2
అస్త్ర విదుండవు శస్త్ర కుశలుడవు;
సురుల కసురులకు శోకదాతవై
నీ పౌరుషమును చూపి తింద్రునకు,
అజుని కొలిచి బ్రహ్మాస్త్ర మందితివి.
3
నీవు చాపమందిన మాత్ర సురా
సురులు విఱిగిపోయిరి దిక్కుల బడి,
కదనంబున నిన్నెదిరించి ప్రయా
సల గాసిల్లని శత్రువు లెవ్వరు ?
4
భుజబల మహిమయె నిజ రక్షకముగ,
చేసిన తపములె క్షేమ కవచముగ,
కాపాడును నిను, గమనింపగలవు
దేశ కాలముల తీరుతెన్నులను.
5
సమరముల నశక్యములు లేవు, నీ
కలవిగాని దెయ్యదియు లేదు మతి
మంత్రములను, నీ మహితాస్త్రంబుల
వాడిమి నెఱుగని వారు లే రిలను.
6
ననుబోలుదు తపమునను బలమునను,
సరివత్తువు అస్త్ర ప్రయోగముల,
రణముల రిపు మర్దన కీవుండగ
నే సుఖమందును నిశ్చితార్థినయి.
7
కింకరసేన నఖిలము వధించెను
తునిమె జంబుమాలిని, సచివసుతుల
అగ్రనాయకుల నందఱ బలిగొనె,
కోతి యొకడు నిరాతంకంబుగ.
8
గుఱ్ఱంబులు ఏన్గులు, రథంబులు స
మృద్ధమైన బలమెల్ల నశించెను,
నీ ప్రియ సోదరు డప్రతిమానుడు
అక్షకుమారుడు హతమైపోయెను.
9
ఇది యంతయు గమనించి, బలంబుల
బరవసము నరసి, వానరుని ప్రభా
వ పరాక్రమములు పాటింపుచు, నీ
దీమసంబు కొలదిని వర్తింపుము.
10
రిపు ఘాతుకుడవు, కపిని దగ్గరిన
యంతనె తడయక అందఱొకుమ్మడి
సుడివడ మర్దింపుడు సందీయక,
పోరాడుము మెలపున వీరాగ్రణి !
11
బలములు లేవట పాఱదోల, వ
జ్రాయుధంబు లే దతని; కార్చుటకు
వశముగాని పావకనిబోలె, లయ
కాలవాత్యవేగమున వీగు కపి.
12
చెప్పినదంతయు చిత్తగించి, అట
కార్యమందు లక్ష్యంబునిలిపి, ధను
రస్త్రము లేమఱ కారంభింపుము,
పోయిరమ్ము నీ పో కక్షతముగ.
13
నిన్ను పోరిలోనికి పంపించుట
మంచిది కాదనిపిం చటు లయినను,
సుక్షత్రియులకు శోభనపథమిది
రాజసుతులకు పరమ ధర్మము నిదె.
14
ఆహవముల వివిధాస్త్ర శస్త్రములు
నెఱపు కౌశలము నేర్చు టవశ్యము,
సంగ్రామంబుల శౌర్యముచూపి, జ
యంబు గొనుట వీరాభీష్టార్థము.
15
జనకుని పలుకుల పనిగొని, దక్ష సు
త ప్రభావుడు ప్రదక్షిణము సలిపె
తండ్రికి వీర విధాయకంబుగ, మన
సువ్విళ్ళూరగ యుద్ధకాంక్షతో.
16
ఇష్టబంధుజనమెల్లను దీవిం
పగ, పొంగి పొరల భండన మోహము,
వీరోత్సాహము వెల్లివిరియగా,
యుద్ధమునకు సన్నద్ధుడై నడచె.
17
రాక్షసేంద్రు గారాబుకొడుకు, తెలి
తామరపువ్వుల తళుకు కనుల రూ
పసి, తేజోబలవంతు, డింద్రజితు
పొంగె, సముద్రుడు పున్నమనుంబలె.
18
పవన సుపర్ణుల జవముగలిగి, నా
లుగు తెలికోరల మగయేనుగులను,
కాండ్లకు కట్టిన కంచురథంబును
ఎక్కె నింద్రజితు ఇంద్రసమానుడు.
19
పేరుగొన్న బలువిలుకాడు, మహారథి
కుల లోపల ప్రముఖుండు, శరప్రయో
గము లెఱిగిన మొనగా, డస్త్రవిదుడు,
వెడలె మహాకపి కడకు హుటాహుటి.
20
రథనిర్ఘోషము, రాక్షసుల ధను
ర్జ్యాటంకారము లాలకించి, అం
తంతల, హనుమ సమాహితుడాయెను,
సంతోషముతో సంగరకేళికి.
21
రణపండితు, డింద్రజితు, దీర్ఘమగు
చాపము నెక్కిడి; సారించి, నిశిత
శరపుంఖంబుల సవరించి, మహా
కపివీరు సమక్షంబున నిలచెను.
22
అట్లు, రణకుతూహల దోహలుడై
పాణితలంబున బాణములూని, ఎ
దురు నడువగ, జంతువు లఱచెను వెఱ,
దిక్కుల శోభలు దిగజాఱెను వెత.
23
సములగు వీరుల జంట డీకొనగ,
వేడుక చూడగ విచ్చేసిన ఋషి
నాగయక్షులు పెనంబడిరి చదల,
ఎలుగులెత్తి పక్షులు గలగలమనె.
24
రథమునెక్కి అతిరయమున వచ్చెడి.
ఇంద్రజిత్తును సమీక్షించి హనుమ,
మితిమీఱగ తన మేను పెంచి గాం
డ్రించి నిగిడి గర్జించెను గట్టిగ.
25
రావణు సుతుడును రథముపై నిలిచి,
చిత్రకార్ముకము చేతపట్టి టం
కారించె, ఘనాఘనములు ఉరిమిన;
కై వడి, మెఱుపులుగా శరము లెగయ.
26
తీరణ వేగోద్రిక్త బలిష్ఠులు,
అని మొన వెనుకాడని శూరులు, రా
త్రించర వనచర ధీరులు తల
పడిరి సురాసుర బద్ద వైరమున.
27
వీరపుత్రుడు మహారథికుడు వి
ఖ్యాతి గన్న విలుకాడు ఇంద్రజితు
పఱపిన శరములు వ్యర్థము చేసెను,
తక్కుచు నిక్కుచు చుక్కల త్రోవను.
28
అరి లోకాంతకుడయిన ఇంద్రజితు
వానరవీరునిపై రువ్వెను బం
గారు కొనల ఱెక్కల నారసములు,
పిడుగుల వడితో మిడిసి మీదపడ.
29
రావణపుత్రుని రథ వేగంబును,
బలముల భేరీపటహధ్వానము,
వింటి మ్రోతలను విని హనుమంతుడు
మింటికెగసె మిఱుమిట్లు గొలుప వడి.
30
కుండపోతగా కురియు బాణముల
నడుమనడుమ వడివడి చెరలాడుచు,
పవనసుతుడు దానవసుతుని నిశిత
మయిన లక్ష్యమును వ్యర్థముచేసెను.
31
మఱల ఇంద్రజితు పఱపు శరములకు
ఎదురుగా నిలుచు కదల కొక్కతఱి,
మఱియొకప్పు, డచ్చెరువుగ చేతులు
చాచుచు చివ్వునలేచి పైకెగురు.
32
రణకర్మ విశారదు లిరువురు, వే
గాతి వేగ సంయతబలు లిరువురు,
అఖిల భూత మోహనముగ నయ్యెడ,
సలిపిరి వీరోత్సవమగు సమరము.
33
అసురు డెఱుంగడు హనుమ సత్తువను,
హనుమకు తెలియదు అసురుని సారము,
దేవ పరాక్రమ దీప్తు లిద్దరును,
పైకొనిరి పరస్పర జయలాలస.
34
గుఱి తప్పని తీర్పరి యింద్రజితుడు,
సూటిగ తార్చిన సునిశిత శరములు,
పాటు తప్పి పడ , వ్యాకులుడై చిం
తా సమాధి మానసు డాయెను వెత.
35
వానర వీరుని వధియించుట, కపు
డలవి కాదనుచు ఆత్మ నెఱిగి, ఆ
కట్టుట యెట్లీ కపినని రాక్షస
రాజ సూను డారటపడి యించుక.
36
అస్త్ర విదగ్రణియైన ఇంద్రజితు
అజుడిచ్చిన బ్రహ్మాస్త్రము నంతట,
హనుమంతుని పైకొన సంధించెను
సప్రయోగ కౌశల్యము వెలయగ.
37–38
శస్త్రము లీతని చంపలే వనుచు
రాక్షసుడేసిన బ్రహ్మాస్త్రముతో,
కాళ్ళును చేతులు కట్టుబడినగతి
నిశ్చేష్టితుడై నేలవ్రాలె కపి.
39-40
బ్రహ్మ, మంత్రదై వతమగు అస్త్రము
చేత నిబద్ధుడనై తినంచు కపి,
తెలిసినంతనె, ధృతిన్ స్మరియించెను
పరమేష్ఠి మహత్తర వరదానము.
41
బ్రహ్మయిచ్చిన వరప్రదానమున
బందంబులు విడివడవం చెఱిగియె
అసురుడేసెనిది; అనువర్తించుటె
ప్రస్తుతమగునని భావించె హనుమ.
42
బ్రహ్మాస్త్ర మహాబలమెంచి ,పితా
మహుని అనుగ్రహ మహిమ తలచి, బం
ధ విమోచనమును తలపోసియు, తుది
సమ్మతించె విధిసంఘటన కపుడు.
43
బ్రహ్మాస్త్రముచే బద్ధుడనైనను
భయములే, దిపు, డభయవిధాతలగు
బ్రహ్మేంద్రానిల భగవంతులు నా
కక్షయ రక్షకులయిన కతంబున,
44-48
రక్కసులకు నే చిక్కుటయు నిపుడు
మంచి కొఱకె సంభవము కాదగును,
రాక్షస రాజు సమక్షమందు సం
వాదము సలిపెడి వలను పొసంగును.
:
అని కృతనిశ్చయుడై యిట్లు, రిపుని
హంతయైన హనుమంతుండు, బలా
త్కార బాధలకు కడగిన అసురులు
భయమందగ ఉద్భటముగ అఱచెను.
:
అరిలోకాంతకు డగు వానరు డటు
చేష్టలుడిగి, వడిచెడుట కనుంగొని,
చేరి బిగించిరి నారచీరలను,
పనసచెట్టు తోళ్ళను నిశాచరులు,
:
తన్ను చూచుటకు దానవపతి తమ
కించుచుండునని యెంచి హనుమయును,
అసురు లెంత కక్కసపెట్టినను స
హించె, ఎట్లు బాధించిన నోర్చెను.
49-50
చెట్టు తోళ్ళతో కట్టినంతనె మ
హాస్త్ర బంధము తనంతనె విడబడె;
అన్యబంధముల అంటుసోకినన్
బట్టువదలి విడబడు బ్రహ్మాస్త్రము.
?
కపియోధుని వల్కలముల కట్టుట
చూచి ఇంద్రజితు క్షుభితుం డాయెను,
మంత్రోక్తములగు మహితాస్త్రంబులు
పట్టివిడిచినన్ పాఱ వితరములు.
?
చేసిన కార్య మిసీ ! నిరర్థకం
బాయె, ఎఱుగ రీ యసురు లొక్క ది
వ్యాస్త్రము విడిచిన అన్యాస్త్రము ప
ట్టదు; సందేహాస్పదమిక సర్వము.
51
అంత రాక్షసులు, హనుమ నీడ్చుకొని
పోసాగిరి రయమున; బందంబుల
రాపిడి వేదన లోపల తెలియక
పోయె మహాస్త్ర విమోచనము కపికి.
52
పిడి గ్రుద్దులతో పీడించుచు, క
ఱ్ఱలతో బాదుచు రాక్షసు లీడుచు
కొనిపోయి హనూమను నిలబెట్టిరి,
రాక్షసపాలకు రావణు మ్రోలను .
53
అప్పు డింద్రజితు అస్త్రము క్తుడయి,
నార చీరె బందములతో మసలు
వానరుని మహాబలుని చూపె కొలు
వున నున్న దశాస్యునకు ప్రభువునకు.
54
కదలకుండ బిగకట్టిన మదమా
తంగము బోని ప్లవంగవీరుని స
మర్పించిరి నాయకులును తోడనె,
రాక్షసరాజగు రావణేంద్రునకు.
55
అచ్చట కూడిన అసురు లందఱును
గుసగుసలాడిరి గువ్వకుత్తుకల,
ఎవడు వీ, డిచటి కెందుకు వచ్చెను?
ఎవరు వీని బంధువు లిచ్చటనని.
56
క్రోధముతో మఱికొందఱు దైత్యులు
కాల్చుడు, చీల్చుడు, కడతేర్చుడు, భ
క్షింపుడు వానరునంచు, ఒకరితో
నొకరు చెప్పుకొని రు త్తలపాటున.
57
అచట, మార్గమున కవతల రత్న మ
యమయిన రాజసభాంగణమున కన
వచ్చిరి, రావణుపాదముల కడను
పరిచారిక లెందఱొ సామీరికి.
58
అధిక దీ'ప్తితో, అమిత బలముతో
మండుచున్న మార్తాండు చందమున,
ఓలగమున్న మహోన్నతు రావణు,
రాక్షస రాజును వీక్షించెను కపి.
59
క్రోధముచే కుంకుమ రక్తములయి
ఘూర్ణిలు కన్నుల కోతిని చూచుచు,
ఆదేశించె దశాస్యుడు, వానరు
వృత్త మరయుడని వృద్ధ సచివులకు .
60
వారును క్రమముగ వానరు నడిగిరి,
అసలు మూల కార్యార్థం బేమని ?
వానరేశ్వరుడు పంపవచ్చితిని,
అతని దూతనే నని పలికెను హరి.
19-6-1967