శ్రీ సుందరకాండ (రాయప్రోలు సుబ్బారావు)/సర్గ 47
శ్రీ
సుందరకాండ
సర్గ : 47
1
వేగశాలి కపివీరుడు సేనా
పతుల నైదుగుర హతమార్చుట విని,
రాక్షసరాజు సమక్షమందె కనె,
ఆహవదోహలు అక్షకుమారుని.
2
తండ్రి చూపులనె తల పెఱింగి, వి
ల్లంది లేచెను అరిందముడాతడు;
ఋత్విజులు సమర్పింప హవిస్సులు
ప్రజ్వలించు క్రతు పరిషదగ్నివలె.
3
బంగరు గొలునులు బంధించిన రథ
మెక్కి, బాలరవి చక్కదనముతో
వెడలెను, వానరవృభుని పోతర
మణచి, పట్టగా అక్షకుమారుడు.
4
మేలిమి గొలుసులు వ్రేలుకాడ, ర
త్నాల పతాకల ధ్వజములెగయ అ
ష్టాశ్వంబుల ఆయత్తమయిన రథ
మతని తపస్యార్జిత మనోరథము.
357 సర్గ 47
5-6
తాకీితాకక ఆకాశంబున
పరుగిడు సూర్యప్రభలువోలె; ఎని
మిది ఖడ్గమ్ము లిమిడ్చిన తూణీ
రములతో అది విరాజిలుచుండెను.
.
దానినించుక కదల్బలేరు దే
వాసురులైన, సమస్త యుద్ధ పరి
కరములతో, బంగారు సరులతో,
ఇన శశికాంతుల మినమినలాడును.
7
గజతురంగ రథ ఘట్టన ఘోషల
భూనభోంతరంబుల బోరుకలగ,
చేరగవచ్చె కుమారుడు తోరణ
మాసాదించిన హనుమదాపులను.
8
ప్రళయకాల పావకునివలె వెలుగు
వానరు దగ్గరి, భ్రమసి కుమారుడు
ఆనతుడై బహుమానించె వారిని;
సాటి వీరు పరిపాటి చూపులను.
9
అరికుల దుర్ణయుడయిన వానరుని
వేగంబును రణవిక్రమ సాహస
ములు తలంచి, తన బలమునెంచి, పెరి
గెను యుగాంత భానునివలె అక్షుడు.
10
రణమున ఎదుట, తిరంబుగ నిలిచిన
హనుమను కనుగొని అక్షకుమారుడు,
అడ్డగింప సాధ్యముకాని కపిని
మున్నూరంబుల ముంచెను వడివడి.
11
అరులనోర్చి, అలయక బెదరక గ
ర్వంబుతోడ మార్మసలు మారుతిని
వీక్షింపుచు ఆయితపడి అక్షుడు,
చేపట్టెను శరచాపముల నొడిసి.
12
పసిడి కడియములు పచ్చల పతకము,
రవ్వల కమ్మలు రంజిల, అక్ష కు
మారుడు పవన కుమారుని తాకెను;
సంభ్రమింప నిర్జర నిశాచరులు.
13
పుడమి మ్రోగె, భానుడు వెలుగ కొదిగె,
కదలక నిలిచెను గాలి, మిన్నఱచె,
ఉదధి యుబికె, గిరులదరెను అక్షకు
మారుడు వాయు కుమారుడు కదియగ.
14
పదును కొసలు గల పసిడియలుగులను,
విషపు పాములట్లెసగొను మూటిని,
వేసెను, కపితల వ్రీలగ అక్షుడు,
అస్త్రచారసంహారపారగుడు.
15
శిరసు చిల్లి పడి చిమ్మునెత్తుటను
తడిసి కనులు తిరుగుడ పడ అగపడె
హనుమంతు డపుడు, అరుణ కిరణ శర
పాళితో పొడుచు భానుమూర్తి వలె.
16
ఎట్టయెదుట విల్లెత్తి యుద్ధమున
మఱలని రాజకుమారు యోధుగని,
సుగ్రీవుని సచివాగ్రణి, మారుతి
ఉల్లసిల్లి యుద్ధోన్ముఖు డాయెను.
17
మందరాద్రిపయి మార్తాండునివలె
రూక్షజ్వాలారుణ దారుణముగ
చూచే హనుమ అక్షుని, వాహన బల
ములతో కాలుచు పోల్కిని చురచుర .
18
మించువింట కురిపించెను వాలం
పఱహరిపై ముమ్మరముగ అక్షుడు;
కులపర్వతమున కుంభవర్ష మును
క్రుమ్మరించు మేఘుని చందంబున.
19
అంతకంత కాహవదోహలుడయి,
తెగువయు మగటిమి తీండ్రింపగ, బిగి
వీగు కుమారుని వీక్షించి, కనలి
గర్జించె నుదగ్రముగ మహాకపి.
20
పిల్ల తనపు కవ్వింపుల కచ్చెను
అక్ష కుమారుడు అక్షు లెఱ్ఱపడ,
హనుమతోడ కయ్యమునకు తలపడె,
గడ్డిగోతిలో పడ్డ యేన్గువలె.
21
అక్షుని నారాచక్షతి నొవ్వున
గర్జింపుచు భీకరముగ మారుతి,
దీర్ఘ బాహువులు త్రిప్పుచు విసరుచు,
ఎగసెను ఘోరాకృతి వినువీధికి.
22
బలపరాక్రమోద్భట సాహసికుడు
దానవ సూను డుదగ్రవేగమున,
ఎగసిపోవు ప్లవగేంద్రుని కొట్టెను;
పిడుగులతో మేఘుడు కొండంబలె.
23
అక్షుడు పఱచు నిరంతర శరముల.
బాఱి తప్పుకొని పైరగాలివలె,
సందు గొందులను చలన చాలనము
జరిపెను మింట ప్రచండ విక్రముడు..
24
పోరికి ఉవ్విళ్ళూరుచు, విలుగొని
నిశితాయుధముల నింగినించు, అ
క్ష కుమారుని దక్షతకు, మహాకపి
వేడుకపడుచును వేదనలోబడె.
25
హరకుమార నిభు డక్షకుమారుడు
నడిబుజములలో అడచిన అఱచుచు,
కర్మసుకుశలుడు కపి స్మరియించెను
రణములలోన పరాక్రమక్రమము.
26
బాలదివాకర ప్రభలను చిమ్ముచు
బాలుర కోపని పనులను తీర్చుచు
సకలాహవ సాధకుడై శోభిలు ,
మనసురాదు చంపగ నీ బాలుని.
27
ఇతడు మహాత్ము డహీనబలీయుడు,
యుద్ధభయాపద లోర్వగ శక్తుడు,
కర్మగుణోదయ కలన సుపూజ్యుడు,
యక్షనాగ సంయమి గణములకును.
28
తన పరాక్రమోత్సాహము పొంగగ
నన్ను చూచును రణంబున బెదరక
ఇతని ప్రతాపోద్ధత వేగమునకు
దేవాసురులును దేవురించెదరు.
29
ఈతని నిట్లె యుపేక్షించిన వ
ర్థిలు, పరాక్రమ, మతిక్రమించు నను
కాన, వధించుటె కార్య మిపుడు నా;
కగ్నిని విడరా దల్ప కణంబని.
30
ఇటు తర్కింపుచు, ఎదిరి బలోద్వే
గము, స్వకర్మయోగమును పోల్చి; అ
క్ష కుమార మారకమున కీకొనె,
ఆత్మ వేగబల మావహింప హరి.
31
శిక్షితంబులయి చేవతేలి, రథ
భారంబును తడబడక లాగగల
అక్షుని యెనిమిది అశ్వములను, అఱ
చేతులతో చెచ్చెర చావపొడిచె.
32
ఆ వెంటనె సుగ్రీవ సచివు డగు
హనుమ తన్నులకు హతమై కూలెను
రథము, కొప్పరము శిథిలమై యిరుసు
విరిగి తునిగిపడె విన్నువిడిచి భువి.
33
అక్షకుమారుండంతట, రథమును
విడిచిపెట్టి, తన విల్లుపూని, ఖ
డ్గంబుతోడ ఆకసమున కెగసెను;
యాగమహిమ దివికేగు ఋషిపగిది.
34
సిద్ధసుపర్ణులు సేవించెడి విపు
లాకాశమున నిరంకుశముగ విహ
రించు రాజసుతు రెండుకాళ్ళు బిగ
బట్టె వాయుజవ బలుడు మహాకపి.
35
తండ్రి వేగసత్వము లలమగ హను
మంతుం డక్ష కుమారుని గిరగిర
త్రిప్పి త్రిప్పి విసరెను; పెనుబామును
పట్టి యూచి పడవైచు గరుడివలె.
36
అనిల నందనుడు హతమార్చగ నటు,
అక్ష , కుమారుడు, హస్తము లూరులు,
కటి కంఠములు వికావికలయి, కీ
ళ్ళు సడలి పడె శిథిలుండయి నేలను.
37
కింకరబలములు కీడ్వడి మడసెను,
పోయిరి సేనానాయకు లేవురు ,
అక్షకుమారుడు హతమాయెను, కపి.
చేత ననుచు పతికాతరు డాయెను.
??
అమల తపోవ్రతులయిన మహర్షులు,
పంచ భూతములు, పన్నగ యక్షులు,
సుర, లింద్రుడు అచ్చెరువందిరి, అ
క్ష కుమారు నటు చంపిన కపిగని.
38
నెత్తురు జీఱలు నెఱయు కనులతో
ఇంద్ర కుమారన కీడగు అక్షకు
మారుని కూల్చి యథారీతిని, హరి
ద్వార తోరణము నారోహించెను.