శ్రీ సుందరకాండ (రాయప్రోలు సుబ్బారావు)/సర్గ 49
శ్రీ
సుందరకాండ
సర్గ - 49
1
భీమ పరాక్రమధాముడు మారుతి
అసురుని చేతల కచ్చెరువందుచు
రోష తామ్ర కల్మాష నేత్రుడయి
పాఱచూచె రావణు నోలగమున.
2
ఆతని మకుటము జ్యోతిర్మయమై
అపరంజిపసిమిని పిసాళించుచు,
ముత్తెపు కుచ్చులు బిత్తరింప దీ
పించుచుండె ఉద్వేలమానముగ.
3
జీవరత్నముల జిగిజిగి మిగులగ
మొలకమణుల పూజలు చెక్కిన చి
త్రాభరణములు ప్రియములై నవి మెయి
నిండార మెరయు చుండె నందముగ.
4
సన్న పట్టువస్త్రము ధరియించెను,
అరుణ చందనము అలదె నంగముల,
వెఱపు గొలుప విప్పిన రక్తాక్షులు
వ్రాలు పెదవులును వ్రేలుకోరలును.
5-6
పదిశిరములతో భ్రాజమానముగ
అగపడె నాత డుదగ్రదీధితుల;
పడగలెత్తి చూచెడి పాములతో
క్రాలెడి మందర శైలము లీలను.
7
కాటుకరాశికి దీటగు ఱొమ్మున
వ్రేలుచుండె ముత్యాల సరంబులు;
నల్లని మబ్బుకు తెల్లని కొంగలు
వాలుగ తీర్చిన వల్లె వాటువలె.
8
గందపు పూతల క్రందుకొన్న, బా
హువు లొప్పెను కేయూరభూషలను,
బలసిన అయిదుతలల పెనుబాములు
దిగజాఱెడి సోయగము వెలార్చుచు.
9
కసటులేని స్పటికముల మర్చి, రత
నాలను సూయణముగా కూర్చిన,
మంచి పట్టుకంబళముపై సుఖా
సీనుడాయెను దశానను డయ్యెడ.
10-12
మంత్ర తంత్ర మర్మము లెఱింగిన, ప్ర
హస్త, దుర్ధర, మహాపార్శ్వ, నికుం
భులు, మంత్రులు నల్వురు బలగముతో
నాల్గు సంద్రముల నడవడి నుండిరి.
13
రాజ కార్య పారగులగు మంత్రులు,
శుభ మనీషు, లిష్టులు పరివేష్టిం
పగ కొలువుండెను పంక్తికంధరుడు,
దేవతల సభను దేవేంద్రుడు వలె.
14
ఆ రాక్షస నాయకుని, మహాతే
జో విరాజితుని, చూచెను మారుతి;
మేరు పర్వతము మీది నెత్తమున,
నిగనిగ లాడెడి నీళ్ళ మబ్బువలె.
15
అక్కసు తీఱగ రక్కసు లటునిటు
తెఱపియిడక బాధింపుచు నున్నను,
విస్మయుడై కపి వీరుడు చూచుచు
నుండె రావణు నఖండ వై భవము.
16
భ్రాజమానమగు రాక్షస ప్రభువు
గంభీరాకృతి కని మోహితుడై ,
వాయుసుతుడు భావంబులోన చిం
తింపసాగె పలుతీరుల నిట్టుల.
17
ఏమి రూపహో! ఏమి ధైర్య మిది?
ఏమి బలమహో! ఎట్టి సత్వ మిది?
సర్వసులక్షణ సంపన్నుడు వీ
డకట! విధివిపర్యాసము నేమన!
18
ఆర్జించిన ధర్మార్థముకంటె, అ
ధర్మ సంచితముదారముగ పెరుగ
దేని, సమర్థం డీత డమరులను
అమరేంద్రుని సైతము పాలింపగ.
19
కుత్సితంబులగు ఘోరకర్మములు
పెక్కులు చేసెను వీడు క్రూరుడయి,
అందుచేత భయమంది తల్లడిలు
సర్వసురాసుర చక్ర లోకములు,
20
రాక్షసరాజు పరాక్రమ తేజము
లరసి హనుమ చింతాకులుడాయెను,
వీడలిగిన ఈ రేడు జగము లే
కార్ణవంబయి లయంబగు నంచును.