శ్రీ సుందరకాండ (రాయప్రోలు సుబ్బారావు)/సర్గ 16
శ్రీ
సుందరకాండ
సర్గ 16
1
స్తవనీయను సీతను కొనియాడుచు
హరిపుంగవుడగు హనుమంతుండును,
తోడ్తో విదితాత్ముడు రఘురాముడు
తలపు తగుల చింతన్ బడె క్రమ్మఱ.
2
ధ్యాన స్తిమితుండయి ఒక నిమిషము
జానకి దురవస్థలు తలంచి, తే
జస్వి యయ్యు హరిసత్తముడు, మనో
వ్యధ లాపగలే కలమటించె నిటు.
3
గురువుల శిక్షుల పెరిగిన లక్ష్మణు
నకు మాన్యస్థానము, రామున క
ర్ధాంగి సీత; ఇటు లయ్యు దుఃఖమున
తపియించును, విధి దాటరానిదో !
4
రాముని శస్త్రాస్త్రముల ప్రభావము
లక్ష్మణు బాహుబల పరాక్రమములు
ఎఱిగినదగుట మృగేక్షణ క్రుంగదు ;
తొలకరించు ప్రొద్దుల గంగపగిది.
5
కులశీలంబులు, గుణరూపంబులు,
తులతూచిన యట్టు లమరె వీరికి,
రామునకు తగిన రమణి జనకసుత,
వైదేహికి తగు వరుడు రాఘవుడు.
6
మేలిమి వన్నెల మెఱయు లక్ష్మివలె
జగదనురంజనియగు జానకి గని,
మనసు రామచంద్రుని సన్నిధిగొన,
పులకరించి తలపోసె హనుమ యిటు.
7
రావణుబోని పరాక్రమాంధుని క
బంధుని కూల్చెను బలిమిని రాముడు,
బహుబలశాలిని వాలిని చంపెను,
ఈ విశాల కమలేక్షణ కోసమె.
8
భీమ విక్రమోద్దాముడయిన వి
రాధ రాక్షసుని రణమున మార్కొనె,
మును దేవేంద్రుడు మోహరించి శం
బరుని వధించినభంగి సులభముగ.
9
ఘోరకర్మఠులు క్రూరదానవులు
పదునాలుగువే లెదిరించ జన
స్థానమున శరజ్వాలలు కురిసెను
భస్మంబై కుప్పలు పడ నడవిని.
10
యుద్ధముఖంబున ఉదురు మిడుకగుచు
నిలిచిన ఖరుఖండించెను, త్రిశరుని
పరిమార్చెను దాశరథి, దూషణుని
తెగనేసెను ఉద్రిక్త శౌర్యమున.
11
వాలి బాహుబలశాలి యేలగా
అన్యదురాసద మగు వానర ల
క్ష్మీవిభవము సుగ్రీవున కిచ్చెను;
ఈమె కోసమయి రాము డుద్ధతిని.
12
ఈ విశాల ధవళేక్షణ ఉనికిని
ఆదిపాదులను అన్వేషింపగ
వచ్చితి నేనును, పారావారము
దాటితి, చొరబడి తడవితి లంకను.
13
రాముడీ సతికొఱకు సప్తసము
ద్రములు, నాలుగు చెఱగుల భూతలము
తిరిగి తిరిగి శోధించిననేనియు,
ఆశ్రమయుక్తం బనియె తలచెదను.
14
ముల్లోకముల ప్రభుత్వ విభవమును,
సీత, జనకఋషి కూతురి గరిమయు,
రెండు నరసి తర్కించినచో, సీ
తకు చాలదు సుంతయు సామ్రాజ్యము.
15
ధర్మశాలి, తత్త్వజ్ఞుడు, మిథిలా
రాజ్యపాలకుడు, పూజ్యుడు, జనకుడు
ఆతనిసుత యీ సీత, సూర్యకుల
తిలకుని సతియై వెలుగు పతివ్రత.
16
యాగార్థముగా సాగి, వరిపొలము
నాగలితో దున్నగ, మొగచాలున ,
పద్మరేణువులవంటి సుగంధపు
మృత్కణములతో మెఱసె నీ గరిత
17
అని మొన వెన్నీయని శూరాగ్రణి,
సూర్యవంశ వనసురమందారము,
ధర్మశాలియగు దశరథునింటికి,
పెద్ద కోడలయి పేరు తెచ్చినది.
18
ధర్మజ్ఞుండు, కృతజ్ఞుండు, దయా
దాక్షిణ్య మయు డుదారుడు రాముడు,
ఆ మహాత్ము నర్దాంగి యీ యబల,
కూళరాక్షసుల పాలయు పొగులును.
19
భోగము లన్నియు పోనడంచి, భవి
తవ్య మించుకంతయు తలపోయక,
భర్తృస్నేహము బలిమి చెలిమి,
దుర్గమ కానన మార్గము పట్టెను.
20
దొరికినకాయలు దుంపలు తిని, తని
వోయి, భర్తృ సేవాయితమతియై,
కష్టవనములను ఇష్టభవనముల
వలె సుప్రీతిని మెలగచునున్నది.
21
కనకమువలె పచ్చని మెయిమెఱయగ
మచ్చిక నవ్వుల ముచ్చట లాడుచు
సై చును చెఱలను జానకి ఆలన
పాలనలేని అభాగిని భంగిని.
22
రావణ రాహుగ్రస్తమయిన యీ
శుభగాత్రి ముఖము చూడ, తపించుచు
న్నాడచ్చట ప్రియనాథుడు రాముడు;
చలిపందిలికోసము పిపాసివలె.
23
ఈ రామామణి ఇనకులాగ్రణికి
మఱల లభించిన పరమ ప్రీతిని
తనివి చెందు డెందమ్మున; పోయిన
రాజ్యము వచ్చిన రాజన్యునివలె.
24
కామ భోగభాగ్యములు విడిచి, ప్రియ
బంధుజనము నెడబాసి, దూరమున,
మోయుచునున్నది కాయము మానిని,
రామసమాగమ ర క్తిని భక్తిని,
25
కసరికొట్టు రక్కసుల నెఱుంగదు,
పూచి ఫలించిన భూజము లరయదు,
ఏకాగ్రస్థితి హృదయంబున ల
క్షించు నొక్క రఘుశేఖరు మాత్రమె.
26
భూషణములలో భూరిభూషణము
భర్త భార్య, కా వరభూషణ దూ
రగయై జానకి రాజిల; దిప్పుడు
సందె చీకటిని చక్రవాకివలె.
27
ఇట్టి మంగళాకృతి కిమైథిలికి
వెలియై రాముడు వేదనలంబడి
కమిలి కూల కెటొ కాయము మోయును,
శక్యము కాదీ సహన మందఱికి.
28
నల్లని కురులకొనలు మెఱసెడి, యీ
పద్మేక్షణ సుఖపడ తగినది, ఇ
ట్లగచాట్లంబడి పొగలుట చూచిన,
నా మనసును కొందలమున క్షోభిలు.
29
సహనంబున భూజనని బోలు నీ
కమలేక్షణ రాఘవుల రక్షణన్
మెసలె మునుపు, రక్కసుల కావలిని
చెట్టుక్రింద గాసిలుచున్నదిపుడు.
30
మంచుపడ్డ తామరపువువలె శో
భలు మాయగ నెవ్వగల కృశించుచు,
సహచరుబాసిన చక్రవాకివలె,
దీన దశానిహతిన్ బడె జానకి.
31
చలికా రెడలిన చంద్రుడు విరహో
ద్దీపన పరుడై తెర వెడలెను తమి,
పూలతోడ కై వ్రాలు ఈ యశో
కములు కూడ శోకమునె దాకొలుపు.
32
ఈ గతి మారుతి ఔగాము లవే
క్షించు, చాసుదతి సీతయనుచు మది
నిశ్చయించుకొని నికటంబున గల
వృక్షముపై ఒక్కెడ కూర్చుండెను.
11-2-1967