శ్రీ సుందరకాండ (రాయప్రోలు సుబ్బారావు)/సర్గ 15

శ్రీ

సుందరకాండ

సర్గ 15

                 1
ఆశింశువపై ఆసీనుండయి,
మైథిలికోసము మార్గము చూచుచు,
పారజూచె పావని అశోకవని
సర్వంబును కడు జాగరూకుడయి.
                 2
సంతాన లతలు సాగిన సీమలు,
కల్పవృక్షములు కాచిన కోనలు,
దివ్యగంధరసతేమనంబులయి,
తనుపుచుండె నవి వన సౌభాగ్యము.
                3
అందచందముల నందనవనమై,
మృగవిహంగముల కిష్టరంగమై,
శుకపిక కలరవ సుమనోహరమై,
చారుగృహ ప్రాసాద జటిలమయి.
               4
ఎఱ్ఱ కలువలును హేమకమలములు,
తేలియాడగా దిగుడు బావులను,
రమ్యాసనములు, రత్నకంబళులు
నెగడుచునుండెను నేలమాళుగుల.

                5
సకల ఋతువులను వికసించెడి పూ
దీగెలతో, ఎడతెగక కాచు ఫల
వృక్షంబులతో, విలసిల్లె అశో
కోద్యానము భానూదయ ప్రభల.
                 6-8
సారెకెగురుచున్ శాఖల పక్షులు
ఆకులు దులిపిన మ్రాకుల పంగల,
మొలకెత్తు నపుడపుడె పసిచిగురులు,
శోకము మాపు అశోకసాలముల.
                    ?
మొదలునుండి సిగతుదిదాకను, ఎడ
తెఱపి లేక ఒత్తిన పూగుత్తుల,
బలువు బరువునన్ పచ్చని కొమ్మలు
తూలి వాలబడె నేలను తాకుచు.
                   ?
కొండగోగు లటు కొల్లగ పూచెను,
ముమ్మరముగ ఇటు పూచె మోదుగులు,
గుంపు కొన్న మాకుల తలపసరున
కారుకొనెను ప్రాంగణము లన్నియును.
                  9
పున్నాగంబులు, పొదసంపెగ, లే
డాకుల యరటులు, అన్ని వాడలను
పూచి పొలిచి అలవోకనందముగ
శోభిలుచుండెను చూడ వేడుకగ.
                 10
బంగారపు కడవలవలె కొన్నియు,
ఇంగలము సిగల భంగిని కొన్నియు,
కాటుకబోదెల దీటున కొన్నియు,
సొంపుగనుండె అశోకవృక్షములు.

                 11
వాసవు నందనవనము చందమున,
ధనదుని చైత్రరథంబు విధంబున,
దివ్యంబయి, భవితవ్యంబయి,
రమ్యంబయి అనురంజించె వనము.
                 12
పువ్వులు చుక్కలపోల్కి క్రాల రెం
డవ ఆకాశమనన్ దగి, పువ్వులు
రత్నములట్లు మెఱయ, పంచమ సా
గరమనజాలి ప్రకాశించె వనము.
                  13
సకల ఋతువులను వికసితంబులై ,
తేనెవాసనల తేలుసాలములు,
ప్రియహరిణంబులు, పెంపుడు పక్షులు,
కలరవములతో పిలపిలలాడును.
                 14
పలుజాతుల పువ్వుల సువాసనలు,
ప్రసరింపంగ తరంగంబులవలె,
పుణ్యగంధ పరిపూర్ణమై పొలుచు
రెండవ గందపుకొండ చందమున.
                15-19
ఆ యశోకవని కంతరమందున
కాంచె హనుమ వెయికంబంబులతో,
పగడపు మెట్లును, పసిడి తిన్నెలును,
తనరుచున్న చైత్యప్రాసాదము.
                    ??
రూపురేఖలను చూపఱు నాక
ర్షించుచు, మితిమీఱిన మహోన్నతిని
ఆకాశంబును తాకి తారలను
పట్టి ఊచుచున్నట్టులుండె నది.

                  ??
అచట శుక్ల పాడ్యమి నెలవలె ని
ర్మలముగ, మాసినవలువతో, ఉపా
సముల చిక్కి, రాక్షసుల నడుమ, ని
ట్టూర్పు లూడ్చు ఒక యువతి కానబడె.
                 20
తన సురూపసౌందర్య, ప్రభ లిం
చించుకంత కనుపించుచుండ, పొగ
లావరించిన హుతాశను కీలను
పోలియుండె నా పుణ్యసతీమణి.
                 21
నలిగిన పచ్చని వలువ నొక్కటియె
కట్టి, నిరాభరణగాఉన్న గరిత;
బురదపాముకొన పూలులేని తెలి
తామరకాడ విధాన కనంబడె.
                 22
దుఃఖతాపమున తుకతుకనుడుకుచు
సిగ్గుతో చితికి, చిన్నవోయి, కన
బడె నపుడా తాపసి; అంగారకు
నోటబడ్డ చంద్రుని రోహిణివలె,
                 23
కన్నుల నశ్రుల కట్టలుతెగ, దై
న్యముతో, శోకధ్యానమున మునిగి,
అన్నపానముల నంటక ముట్టక ,
బక్కచిక్కి వసివాళ్ళ గంటుపడి.
                24
ప్రియజనములు కనుపించక యెందును,
క్రూరరాక్షసుల గుట్టలనడుమను;
తల్లిమంద కెడదవ్వుల దిగబడి,
కుక్కలు మూగిన గున్నలేడివలె.

               25
నల్లత్రాచు చందమున వాలుజడ
పిరుదులదాకను పొరలుచు వ్రేలగ;
వానమబ్బు లెడబడ, కార్కొను వన
రాజితో వెలయు రత్నగర్భవలె.
               26
కష్టంబుల నెఱుగక సుఖంబుగా
పెరిగి దుఃఖముల కెరయై, మాసిన
చీరను చుట్టి, కృశించి తపించు, ఆ
తరుణిని గని సీతను స్మరించె కపి.
                  27
కామరూపి దశకంఠుడు కొనిపోన్
ఏ రూపము మే మారసితి మపుడు;
ఆ రూపమె యిట అచ్చుపోసిన
ట్లున్న దీమె యెడ వన్నె తఱిగినను.
                 28
పున్నమ చంద్రుని బోని మోముతో
కన్నుబొమల చక్కనతో భాసిలు
సుస్తని, యీమె సమస్త తమస్సును
పోకార్చును తన ముఖ వర్చస్సున.
                 29
పద్మపత్రముల వంటి కనులు, స
న్నని నడుమును, నల్లని వేణియును మె
ఱయగా, కాముని రతివలె కనబడు
లేమను, తలచెను రాముని సతియని.
                    30
పున్నమచంద్రుని బోలి, జగములకు
ఇష్టార్థమయి హసించుచు, తను సౌం
దర్యము చిందగ, తాపసనైష్ఠికి
వలె కూర్చుండెను వట్టి నేలపయి.

               31-32
జడిసిన ఫణిపతి జాయచాయ బుస
కొట్టుచు, కార్కొను నిట్టూర్పులతో,
అధికశోకమున అగలి, పొగలు క
ప్పిన నిప్పుకవలె కనబడె నాయమ.
                 33
సందిగ్ధంబగు శాస్త్రమువలె, స
న్నగిలిన సంపద పగిది, కొనసా
గక తెగిపోయిన కాంక్షాలతవలె,
సడలి క్షయించిన శ్రద్ధవిధంబున .
                 34
విఘ్నంబులతో వికలమై చెడిన
కర్మసిద్ధివలె, కలుషం బంటిన
బుద్ధిభంగిని, అభూతంబగు అప
వాద పంకమున పడిన కీర్తివలె.
                35
రాముని సత్యవ్రతమున బలియై,
అసురుని దుర్మోహంబున కెరయై,
దిక్కులు చూచును బిక్కవోయి, ఆ
లేడికనుల శాలినవిలోచన.
                 36
నిండిపొర్లు కన్నీళ్ళభారమున
వంగెను నల్లని వాల్గను ఱెప్పలు,
ముడుచుకొన్న నెమ్మొగముతోడ ని
ట్టూర్పులు చిమ్ముచు నుండెను పొరిపొరి.
                    37
తీఱనివేదన దీనదీనయై
ఉన్న సొమ్ములను ఉజ్జగించి, మా
సిన మేనును చీరను చూడక, మే
ఘము కప్పిన శశికళవలె, చెన్నఱె.

                38
వల్లెలేక పొర వారిన శ్రుతి పా
ఠము, స్ఫురింపక తడవుకొనురీతిని;
మైథిలి నటునిటు మఱిమఱి చూచుచు
హనుమయు సందేహంబున తడబడె.
                 39
అపరిష్కృతమయి అర్థాంతరమగు
శబ్దమువలె కష్టపడి తెలుసుకొనె,
సొమ్ములు పెట్టక శోభలు కొఱవడి
బోసిపోయి, ససిమాసిన సీతను.
              40
ఆ రాజసుతను, ఆయతనేత్ర, న
నింద్య చరిత్రను నిలుకడగా కని,
సందర్భ సమంజసములను తరచి,
నిశ్చయించుకొనె నెలత సీతయని.
               41
జానకి యెక్కడ యే నగలు ధరిం
చెనని రాముడు చెప్పెనొ నాకచ్చట;
ఆ నగలిక్కడ అగపడుచున్నవి
దేవి యంగముల తీర్చిన తెఱగున .
               42
కెంపులు పగడము లింపుగ తాపిం
చిన గాజుల జతలును, కొనలను వం
పులు తీర్చిన రవ్వల కమ్మలు గా
త్రమున శోభిలును రాముడన్నటులె.
              43
దీర్ఘ విరహమున తెర్లుచున్న మెయి
సెగల పొగలతో నగలు నల్లబడి,
ఆయా తావుల పాయకయున్నవి,
అచట రాఘవుం డన్నప్రకారమె.

                 44
ఋశ్యమూకమున ఏవి చూచితిమొ
ఆ నగ లిక్కడ అగపడకున్నవి;
ఈమె మేన ఇపు డెయే సొమ్ములు
అగపడుచున్నవొ అవి లేవక్కడ.
                 45
అచట చెట్టునకు ఆఱగట్ట వా
నరు లందఱు చూచిరి బంగారపు
పట్టవంటి సతి పసుపు పైట; అది
యే కనుపించును ఇచ్చట నచ్చుగ.
                46
వడివడి నింగినిబడి అసురుడు దో
తెచ్చునపుడు వైదేహి వేసటను
సొమ్ములనొలిచి, పసుపు చీరపయట
ముడిచి, చించి తడబడి పడవైచిన.
                  ?
నగల మూట క్రిందబడెను గలగల
మ్రోగుచున్ , వెతకపోయిన వానరు
లరసి, తెచ్చి యిచ్చిరి దానిని; చూ
చితి మచ్చట యీ చీర చెఱంగునె.
                 47
ఇంతకాల మొకటే ఒక కోకను
కట్టిన కతమున కనుమాసిన దిది,
అయినను మును పడవై చిన దేవీ
వసనాంచల మా వన్నెనె యున్నది.
               48
ఈ కనకాంగి మహీశుడు రాముని
ప్రియపత్నియె సంశయము లేదిపుడు,
తోడునీడలకు దూరమయ్యు సతి
దూరము కాదు మనోరాగస్థితి.

                  49
కారుణ్యముచే, కామపీడచే,
దయచేత, విషాదముచేత, రఘూ
ద్వహు డెవ్వరికై పరితపించు నా
మానవతీమణి జానకి యీమెయె.
                   50
ధర్మపత్నియను దారుణశోకము,
అబల ఆర్తయను అతిసౌహార్దము,
స్త్రీయను జాలియు, ప్రేయసి యను రా
గము, బాధింపగ కుములును రాముడు.
                    51
దేవిరూపమును, దివ్యాంగంబుల
సౌష్ఠవమును, దాశరథుని కళ
లిచ్చి పుచ్చుకొను ; ఈ యసితేక్షణ
రాఘవుని కళత్ర, మిది నిశ్చయము.
                   52
ఈ సాధ్వి మనోధృతి ఆయనయం,
దా మహాత్ముని మన సీ యమయం, దవి
కల్పముగా లగ్నములై నవి; కా
వున బ్రతికెద రీ యనఘులిద్దరును.
                  53.
అర్ధాంగిని, జాయను కోల్పడియును
దుఃఖదోషమున తూలి త్యజింపక,
దేహము మోయును ధీరశాంతు, డీ
ప్రభు, వశక్యమిది పరుల కందఱికి.
                 54
హనుమ యిట్లు సీతను దర్శించి, ప్ర
మోద పూరముల మునుగుచు తేలుచు
మనసును ధ్యానసమాధి నిలిపి, ల
క్షించి, ప్రస్తుతించెను శ్రీ రాముని.