శ్రీ సుందరకాండ (రాయప్రోలు సుబ్బారావు)/సర్గ 17

శ్రీ

సుందరకాండ

సర్గ 17

                  1
తెల్ల కలువగుత్తివలె, నపుడు, శశి
తేటలు తేరుచు దివినుదయించెను,
నీలోదకముల నిండు చెరువులో
అత్తమిల్లు కలహంసము కై వడి.
                  2
కపి సత్తమునకు ఉపచారంబులు
సలుపగవచ్చిన సచివునిచాడ్పున,
స్వచ్ఛములగు తన చల్ల ని కరముల
అభి షేకించెను ఆప్యాయనముగ.
                 3
అప్పుడు కనుగొనె హనుమ పూర్ణ చం
ద్రాస్యను సీతను, అధికశోక దు
ర్భర పీడనమున వాడిన వనితను;
నడిసముద్రమున నావ విధంబున.
                 4
ఆమె యథాస్థితి నరయు తలంపున ,
పరిసర మంతయు పరికింప హరికి .
అగపడిరయ్యెడ అనతిదూరమున,
ఘోరరూపముల గొడ్డురక్కసులు.

                 5
ఒంటికన్నుకల, దొక చెంప చెవి క
లది, తమ్మెలులేనిది, తలలో ముకు
చెఱమ లున్నదియు, చేట చెవులదియు,
పలు వికారరూపంబులవారలు.
                6
బక్క పడిన మెయి, బండవంటి తల,
పీలబోయి కడు పెరిగిన నిడుమెడ,
బట్టతలలు, చిటిపొట్టివెండ్రుకలు,
చిఱిగిన కంబళి చింపిరి గంపలు.
                  7
వ్రేలాడు నొసలు వీనులు, జాఱిన
ఉదరంబు, లురు పయోధరంబులును,
దిగవ్రాలిన వాతెఱలు, చెక్కులు మొ
గాలు, కీళ్ళు, మోకాళ్ళ చిప్పలును.
                 8
పొట్టిపొడుగు తనువులు కలవారలు,
గూనివారు, మరుగుజ్జులు, గిడ్డలు,
కఱిమేనులు, వంకరమోములు కల
వార లెందఱో కనబడి రెడనెడ.
                9
వికృతాంగులు, కోపిష్ఠలు, కా
ఱునలుపు, గోరోచనపురంగు మే
నులను మిడియువారలు, గయాళి జం
తలు, బలు బడితెలు తాల్చినవారును.
              10
పులి మొగములు, దున్నలమోములు, పం
దుల ముట్టెలు, నక్కలమోరలు, హరి
ణాననములు, హర్యశ్వగజోష్ట్ర
వ్యాఘ్ర పాదములవంటి పాదములు .

                 11
ఒక్క హస్తమును, ఒంటిపాదమును,
గాడిదచెవులును, గజకర్ణములును,
గుఱ్ఱపు చెవులును, గోకర్ణములును,
సింగపు వీనుల చెలగిరి కొందఱు.
                  12
నొసటినడుమ బుసబుసమను ముక్కులు,
ఏనుగుతొండముబోని ముక్కు, ల
డ్డముగ తిరిగి వికటములగు ముక్కులు
కలవార, లనాసలును కనబడిరి.
                 13
ఏన్గులకాళ్ళును ఎద్దులకాళ్ళును,
చిట్లినపదములు చీలినవ్రేళ్ళును,
వాటునకందని వక్షోదరములు,
అతివిపరీతము లసురుల రూపులు,
                  14
మితిమీఱిన మిడిమిట్ట మొగంబులు
కన్నులు, దీర్ఘనఖంబులు, నాల్కలు,
పందుల మోరలు, పశువుల మొగములు,
ఏనుగు మోములు ధేనుముఖంబులు.
15
ఘోరరూపముల క్రోధముతో, ఉ
ద్దురముగ, కలహింతురు గీ పెట్టుచు,
అశ్వఖరోష్ట్ర భయానకవక్త్రలు,
క్రూరరాక్షసులు కోలాహలముగ.
              16
భీకరంబులగు ఆకారంబుల
మాంసభోక్తలయి, మద్యరక్తలయి
త్రాగుచు తూలుచు రక్కసి మూకలు
బూడిదె కురు లల్లాడ భ్రమింతురు.

              17
పచ్చిమాంసమును, వెచ్చని నెత్తురు,
కుడిచి, పూసికొని, ఒడ లెఱుపెక్కగ,
సందడించు రాక్షసు లెడాపెడల
చేరి రంద ఱొక చెట్టుబోదెకడ.
               18
దాని కొమ్మక్రిందనె దీనముగా
కూరుచున్న జనకుని పుత్రిని, నిర
వద్య చరిత్రను వైదేహిని ద
ర్శించెను జయలక్ష్మీ ప్రియుడు హనుమ.
               19
కురులు మురికితో బిరుసెక్కగ, శో
కమునకాగి మెయికాంతులు తగ్గెను,
చేసినపుణ్యము క్షీణించగ, తా దివి
విడిచి నేలపై బడిన తారవలె.
             20
చరితలకెక్కిన సాధ్వీమణి, పతి
విరహంబున ఆభరణము లంటక
పోయినను కళలు మాయవు; పెనిమిటి
ప్రేమాభరణము విడువని కతమున.
               21
పాపి రావణుడు బందెపెట్ట, బం
ధులకు దూరమయి, దురపిల్లును సతి;
మంద కెడంబయి మధ్యగహనమున
సింహ మడ్డగించిన కరిణికరణి.
              22-23
కాలవర్షముల కడపట, శరద
భ్రము లలమిన చంద్రకళ విధంబున,
జీవతంత్రులను చేవడి సవరిం
చక విడిచిన వల్లకి చందంబున.

               24
శోకమంటని అశోకవనముననె
శోకసాగర క్షోభల సుడివడి
త్రెళ్ళుచుండె మైథిలి; అవగ్రహము
చిక్కబట్ట శోషిలు రోహిణివలె.
                 25
మేను పసిమితో మెఱయుచునున్నను
పేరిన మురికిని విన్నబోయి సతి,
పాటి బురదలో పడి పూడిన తా
మరకాడ పగిది మెఱసీ మెఱయదు.
                 26
మాసిన కోకను మై బిగియ పెనచి,
లేడికనుల వాలిక చూపులతో,
దెసలు చూచు వైదేహిని కనె హరి,
పూలు లేని లవలీలత భాతిని.
                 27
దీనత తూలియు దేవి, ఆత్మవిభు
లావు చేవలు తలంచి, తేఱి, తే
జరిలుచుండె, ఉజ్జ్వలతరమగు తన
శీల మహిమ రక్షింప తల్లివలె.
                28
లేడి కనుల బోలిన కటాక్షములు
దిగ్భ్రమంబుతో తిరుగ, భయపడిన
కన్నెలేడి వలె కలవరబోయి, ఎ
గాదిగ చూచుచు కనబడె మైథిలి.
                 29
ఉడుకు బెడకు నిట్టూర్పుల వేడికి
చివురాకుల చె ట్లవిసి నల్లబడ,
శోకం బంతయు చుట్టబెట్టుకొని
ఉప్పెన లేచిన చొప్పున నుండెను.

             30
బక్క చిక్కి ఆభరణాలంకర
ణములు పెట్టకున్నను శోభిల్లెడి,
సర్వాంగ సులక్షణవతి సీతను
కాంచి, వేడ్క పులకించి మహాకపి.
               31
నెత్తురు జీఱలు జొత్తిలు కన్నుల
వైదేహినిగని పరమహర్షమున
ఆనందాశ్రులు వానకురియ, స్మరి
యించెను తోడ్తో ఇనుకుల తిలకుని.
               32
సీతా దర్శన జాత ప్రీతిని
ఉత్కంఠుండయి ఉబ్బి, రామ ల
క్ష్మణులను తలచి నమస్కరించి, కపి
వీరుడుండె కనిపించక చెట్టున.