వీరభద్ర విజయము/హిమవంతుఁడు స్తుతి సేయుట
హిమవంతుఁడు స్తుతి సేయుట
మార్చు174-ఉ.
“ఈ పరిపాటి యెంత గల దిట్టి విధం బని నిర్ణయింపఁగా
నా పరమేశుఁ డైన కమలాక్షుఁడు నైన విరించి యైన వా
రోపరు యిట్లు నిన్నెఱుఁగ నోపుదురే పరు లెల్ల నమ్మ నీ
రూపము సర్వమున్ గలుగురూపము గాదె తలంపఁ జండికా!
175-మ.
నరదేవాసురపుజితాంఘ్రియుగళా! నారాయణీ! శాంకరీ!
కరుణాపూరితమానసా! త్రిణయనీ! కళ్యాణయుక్తా! నిశా
చరదర్పోన్నతిసంహరీ! సదమలా! చండార్చినీ! యోగినీ!
తరణీ! యాగమవందితా! భగవతీ! తల్లీ! జగన్మోహినీ!
176-శా.
నాకుం గూఁతు వైతి వీవు తరుణీ! నాభోక్త దా నెంతయో
నాకుల్ మెచ్చఁగ నింత “దేవరకుఁ గళ్యాణిన్ సమర్పించి యా
శ్రీకంఠాంకున కిట్లు మామ యగునే శీతాచలుం” డంచు ము
ల్లోకంబుల్ వినుతింపఁ గంటి నిపు డో లోలాక్షి! నీ సత్కృపన్.
177-క.
నీ యందె సకల గిరులును
నీ యందె మహార్ణవములు నిలయున్ జగముల్
నీ యందె యుద్భవించును
నీ యందే యడఁగియుండు నిరుపమమూర్తీ!
178-క.
ఉత్పత్తి స్థితి లయముల
కుత్పాదన హేతు వనుచు నూహించి నినున్
దాత్పర్యంబున మునులును
సత్పురుషులు చెప్ప విందు సదమలమూర్తీ!
179-క.
సన్నములకుఁ గడు సన్నము
నున్నతముల కున్నతంబు నొప్పిదములకున్
జిన్నెయన నొప్పు రుచులకుఁ
దిన్నన నీ చిన్ని గుణము దేవీ గౌరీ!
180-క.
నిన్ను మహేశ్వరుఁ డెఱుఁగును
నెన్న మహేశ్వరుని నీవు నెఱుఁగుదు గౌరీ!
యన్యుల కెల్లను దరమే
నిన్నును నీ నాథు నెఱుగ నిక్కము తల్లీ!
181-క.
ధారుణి దివ్యాకారం
బారయ యొప్పిదము భంగి యది యిది యనఁగా
నేరరు బ్రహ్మాదులు నిను
నేరుతునే నీదు మహిమ నీరజనేత్రా!”
182-వ.
అని యనేక విధంబుల నుతించి మఱిఁయుఁ దుహినధరణీధర నాయకం డి ట్లనియె.
183-ఉ.
“పిన్నవు గమ్ము నీ మహిమ పెంపుఁ దలఁపక తప్పుఁ జేసితిన్
గన్నులపండు వయ్యె నినుఁ గంటిఁ గృతార్థుడ నైతిఁ జాలున
మ్మన్న” యటంచుఁ బర్వతుఁడు మానుఁగ మ్రొక్కినఁ జూచి కన్యయై
క్రన్నన నిల్చి తండ్రి మును కన్నను ముద్దులుచేసె వేడ్కతోన్.
184-వ.
ఇట్లు ప్రసన్నయైయున్న న మ్మహీధరనాయకుం డి ట్లనియె.
185-శా.
“శ్రీలావణ్యవిశేషపుణ్య యనుచున్ జింతింపఁగాఁ గంటి శ్రీ
కైలాసాద్రి మహేంద్ర వల్లభునకున్ గణ్యుం డనం గంటి నీ
శ్రీలోలం బగు పాదపద యుగమున్ సేవింపఁగాఁ గంటి నీ
వాలింపం బరమేష్ఠినిన్ దనిపి యి ట్లర్థించితేఁ బార్వతీ!
186-సీ.
కడు నెండిపోయిన ఘన తటాకమునకు: వారిపూరము నిండ వచ్చినట్లు;
తన రాక తఱిఁ జూచి వనజంబు లుబ్బంగఁ: బొలుపొంద నర్కుండు వొడిచినట్లు;
కమలహీనం బైన కమలాకరంబులోఁ: గమలపుంజంబులు గలిగినట్లు;
ఘనతమఃపటలంబు గప్పిన మింటిపైఁ: దుది చంద్రబింబంబు దోఁచినట్లు;
ఆ. గిరులలోన నొక్క గిరి యైన నా పేరు
వెలయఁజేసి తిపుడు జలజనయన
నీకుఁ దండ్రి నైతి నా కింత చాలదే
యిది మహాద్భుతంబు యిందువదన!
187-క.
ఏ నీకుఁ దొల్లి కొడుకను
మానుగ నా కిపుడు నీవు మహిఁ గూఁతురవై
మానిని! పుట్టితి విప్పుడు
భూనుతముగ నాకు నిట్టి పుణ్యము గలదే?”
188-చ.
అని గిరినాథుఁ డుబ్బికొనియాడుచుఁ గానక కన్నకూఁతురన్
వినయముతోడ నెత్తుకొని వీటికి వేగమె యేగి యప్పు డ
ల్లన తనయుండు రాజధవళాయము చొచ్చి కుమారిఁ జూపుడున్
గనుఁగొని సొంపుతో నతని కామిని మేనక సంభ్రమంబునన్.
189-ఆ.
పాలయిండ్లమీఁది పయ్యెద వీడంగ
బన్నసరము లలర బారసాచి
కౌఁగలించి వేడ్కఁ గమలాయతాక్షి తాఁ
గోర్కి పల్లవింపఁ గూతుఁ జూచి.
190-సీ.
“రా లోకసుందరి! రా జగన్మోహినీ!: రావమ్మ కైలాసరాజపత్ని!
రా కన్యకామణీ! రా రాజబింబాస్య!: రావమ్మ యౌవనరాజ్యలక్ష్మి!
రా ఓ మహాకాళి! రా ఓ సరోజాక్షి!: రావమ్మ! భారతీరమణవినుత!
రా ఓ జగన్మాత! రా ఓ సదానంద!: రావమ్మ మత్తేభరాజగమన!”
ఆ. యనుచుఁ బెక్కుగతుల నంకించి యంకించి
దగిలి మేనకాఖ్య తన్నుఁ బిలువఁ
తండ్రి చెయ్యి డిగ్గి తద్దయు వేడ్కతోఁ
గామినీలలామ గౌరి యపుడు.
191-సీ.
కలహంసనడ లొప్ప ఘంటల రవ మొప్ప: రంజిల్లు నూపు రారావ మొప్ప
పాటించికట్టిన పట్టుచెందియ మొప్ప: బాల చన్నులమీఁద పయ్యె దొప్ప
కంఠహారము లొప్పఁ గరకంకణము లొప్పఁ: గడకఁ గేయూరాది తొడవు లొప్ప
సన్నపునడు మొప్ప సవరైన పిఱుఁ దొప్ప: లలితకనకకుండలములు నొప్ప
ఆ. వాలుఁజూపు లొప్ప నీలాలకము లొప్ప
భూతితో నుదుటఁ ద్రిపుండ్ర మొప్పఁ
జిఱుత ముద్దు లొప్పఁ జెక్కిటమెఱుఁ గొప్పఁ
దరుణి జేరవచ్చె తల్లికడకు.
192-వ.
ఇట్లు పార్వతీమహాదేవి డాయ నేతెంచి.
193-సీ.
“కమనీయ మోహనాకారభారతి వచ్చె;: దయతోడ నన్నుఁ గన్నతల్లి వచ్చె;
చాతుర్య గాంభీర్య జగతి కన్నియ వచ్చె;: లలితసంపదలక్ష్మి వచ్చె;
భూరిలోకైకవిభూతిధారుణి వచ్చె;: మంగళపావనగంగ వచ్చె;
తెఱఁగొప్ప దేవాదిదేవవల్లభ వచ్చె;: మానితంబగు మహామాయ వచ్చె;
గీ. తల్లి వచ్చెను నన్నేలుతల్లి వచ్చె;
బాల వచ్చెను ప్రౌఢైకబాల వచ్చె;
అబల కరుణింప నేతెంచె” ననుచుఁ దిగిచి
కౌఁగలించెను మేనక గౌరిఁ జూచి.
194-వ.
అప్పు డి ట్లనియె.
195-శా.
“నీవా సర్వజనైకమాతవు సతీ! నిన్నున్ మహాభక్తితో
దేవేంద్రాదులు పూజసేయుదురు; నీ ధీరత్వమా యెవ్వరున్
భావింపం గలవారు లేరు; నిఖిలబ్రహ్మాండభాండావళుల్
నీవే సేయు మహేంద్రజాలతతులే; నీలాలకా! బాలికా!
196-సీ.
చిలుకలకొల్కివే; శృంగారగౌరివే;: మముఁ గన్నతల్లివే మగువ! నీవు
పరమేశు నమ్మినపట్టంపుదేవివే;: మిన్నేటిసవతివే మెలఁత! నీవు
నా తపఃఫలమవే నన్నేలుశక్తివే;: నా ముద్దుపట్టివే నాతి! నీవు
మూఁడులోకములకు మూలంపుమూర్తివే;: యవ్వలతల్లివే యతివ! నీవు
ఆ. అమ్మ! నిన్నుఁ గన్న యంతనుండియు నాకు
బలసి కోర్కు లెల్లఁ బల్లవించెఁ
గోమలాంగి! నీవు కూఁతుర వైతివి
కన్య! యిట్లు భోక్త గలదె నాకు?”
197-క.
అని యిట్లు మేనకాంగన
ఘనముగ నిచ్చలును దగిలి గౌరవమున మ
న్ననసేయుచు భాషించుచుఁ
బెనుపున గౌరీకుమారిఁ బెనుచుచు నుండెన్.
198-ఆ.
ఇట్లు గౌరీదేవి హిమశైలపతి యింట
నమర ముద్దుబాల యై చరించి
కొంతకాలమునకుఁ గోమలి వెలుగొందె
సకల జనులు దన్ను సన్నుతింప
199-సీ.
ఒకనాఁటి కొకనాఁటి కొక్కొక్క మిక్కిలి: రేఖ నొప్పెడి చంద్రరేఖ మాడ్కి
నొరగింపఁ గరఁగింప నొక్కొక్క వన్నియ: గలుగుచు నున్న బంగారు కరణి
నాఁడునాఁటికిఁ బోవనవకంబుఁగొను చెల్వు: గంగాప్రవాహంబుఁ దొంగలింపఁ
జనుదోయి క్రిక్కిరి సౌరభ్య తనువుతో: నొప్పులకుప్ప యై యుప్పతిల్ల
తే. అనుదినంబును నొకచంద మతిశయిల్ల
నమ్మహాదేవి యభివృద్ధి నలరుచుండె
“పొందఁ గల్గునొక్కొ భూతేశు భువనేశుఁ
బంచముఖుని” ననుచుఁ బలుకుచుండు.
200-శా.
రంగత్ స్ఫార మనోరథ భ్రమరికల్ రమ్యాననాంభోజముల్
నింగిం గ్రాలెడు లేఁతనవ్వునురువుల్ సేవింపఁ బెంపారు దో
ర్భంగంబుల్ తనరారు శంకరమహాపద్మాకరం బందు నా
యంగం బంగజకేళిపూరమున నోలాడించు టిం కెప్పుఁడో.
201-వ.
ఇ వ్విధంబున.
202-సీ.
శృంగారములుసేయ శృంగారి యొల్లదు: పువ్వులు దురుమదు పువ్వుఁబోడి
పలుకంగనేరదు పలుకనేరనిభాతిఁ : జంచలత్వము నొందుఁ జంచలాక్షి
సరసులఁ గ్రీడింప సరసిజానన వోదు: మౌనంబుతోఁ గుందు మానవిభవ
గంధంబు వూయదు గంధవారణయాన: చెలువలఁ బిలువదు చెలులచెలియ
తే. ముకుర మే ప్రొద్దుఁ జూడదు ముకురవదన
తరుణి మఱియును సర్వకృత్యములు మఱచి
హరుని తోడిదె గొండాటయై లతాంగి
యుగ్రతాపంబు సైరింప కున్నఁ జూచి.
203-ఆ.
కూడి యాడుచున్న కోమలిజనములు
శిశిరవిధులఁ గొంత సేద దీర్చి
శైలరాజుఁ గానఁ జనుదెంచి యతనికి
వెలఁదు లి వ్విధమున విన్నవింప.
204-క.
అతఁ డంతయు నప్పుడు దన
సతి యగు మేనకకుఁ జెప్పి చయ్యన గౌరీ
సతిఁ గానవచ్చి యయ్యెడ
మతిమంతుఁడు పల్కెఁ దియ్యమాటలు వెలయన్.