వీరభద్ర విజయము/హిమవంతుఁడు పార్వతికి శివునిం జూపుట
హిమవంతుఁడు పార్వతికి శివునిం జూపుట
మార్చు205-శా.
“అమ్మా! పార్వతి! దేవదేవుఁ డగు నా యర్ధేందుచూడామణిన్
రమ్మా కానఁగ బోద” మంచు ముదమారం బాలఁ గొంచున్ బ్రయా
ణమ్మై శీతనగాంతరాళమునకున్ నక్షత్రవీధిన్ మహా
సమ్మోదంబున బోయి యంతఁ గనియెన్ శైలేంద్రుఁ డ మ్ముందటన్.
206-చ.
ఘనతర మాతులుంగ వట ఖర్జుర రంభ కదంబ నింబ చం
దన నవచంపక క్రముక లత మాల విశాల సాల రో
చన వర గంధసార ఘనసార యుదంబర చూత కేతకీ
పనస లవంగ లుంగ తరు పంక్తుల నొప్పినదాని వెండియున్.
207-క.
కొలకులఁ దిరిగెడు హంసల
కలకల నాదముల కీర కలకలములునుం
గలకంఠంబుల నాదము
లళి నాదము లమరు సుందరారమంబున్.
208-వ.
కని య మ్మహావనంబు దరియంజొచ్చి తత్ప్రదేశంబున.
209-మ.
పరఁగ న్వెల్పలి చింత మాని యచల బ్రహ్మాసనాసీనుఁ డై
తిర మై రాజిత దేహము న్విమల భూతిన్ దీర్చి కూర్చుండె తా
గరుసుల్ నేరక తన్నుఁ దాన తలపై గాఢాత్ము డై నిష్ఠతో
హరుఁ డ య్యోగసమాధిమై దవిలి నిత్యానందుఁ డై యుండగన్.
210-చ.
చెలువయు దాను గాంచి శివుఁ జేర భయంపడి కొంతదవ్వులన్
నిలిచె గిరీంద్ర శేఖరుఁడు నీళగుండును నంతలోనఁ బెం
పొలయ సమాధి మాని కడు నొప్పుగఁ గన్నులు విచ్చి చూచుచోఁ
బలికె ధరాధరుం డలరి పార్వతికిం దగఁ బ్రీతి తోడుతన్.
211-మ.
“అదె శంభుండు సమాధి వోవిడిచి నిత్యానందముం దోఁచె న
ల్లదె కాన్పించెఁ గృపాక్షులం దెఱచెఁ దా నాలించె లోకంబులన్
మదవేదండసమానయాన మునిరాణ్మందారునిం జేరఁగా
నదనై యున్నది సమ్ముఖమునకు డాయం బోదమా పార్వతీ!
212-వ.
అని విచారించి.
213-క.
గిరిరాజు తన్ను డగ్గర
నరుదెంచి వినమ్రుఁ డగుచు నబ్జదళాక్షిన్
దరిశనము వెట్టి నిలచినఁ
గరుణయు మోదంబుఁ బుట్టెఁ గఱకంఠునకున్.
214-సీ.
కామునిబాణమో కందర్పదీపమో: కాంతిరేఖయొ వేల్పుకన్యయొక్కొ
మెలగెఁడుతీఁగెయో మెఱుఁగులబొమ్మయో: తీరగు బంగారుతీఁగెయొక్కొ
మోహంపుదీపమో మోహనవార్ధియో: లాలితమోహనలక్ష్మియొక్కొ
చిత్రంపురేఖయో శృంగారములు దోఁచు: రేఖయో పూర్ణేందురేఖయొక్కొ
ఆ. యనఁగ నొప్పుదానిఁ నభినవలావణ్య
రూపకాంతు లందు రూఢి కెక్కి
పరఁగుచున్నదానిఁ బర్వతకన్యక
జూచి వెఱఁగుపడియె సోమధరుఁడు.
215-ఉ.
ఆ చపలాక్షి చిత్తమున న య్యురగాధిపబాహుకంకణుం
జూచుచు నుండెఁ గాని మఱి చూచినచూపు మరల్ఫ లేమనిం
జూచి మహీధ్రవల్లభుఁడు శూలికి మ్రొక్కఁగదమ్మ బాలికా
చూచెదు గాని నీ వనుచు సుందరి మ్రొక్కఁగఁ బంచి వేడ్కతోన్.
217-వ.
పరమ సమ్మోదంబున న మ్మహాత్మునికి సాష్టాంగదండప్రణామంబు లాచరించి కరకమలంబులు ముకుళించి యి ట్లనియె.
218-క.
“జయజయ శ్రీగిరిమందిర!
జయజయ మందారహార! సలలితవర్ణా!
జయజయ భువనాధీశ్వర!
జయజయ యోగీంద్రపారిజాత! మహేశా!
219-క.
జయజయ హాలహలధర!
జయజయ దేవేంద్ర కమలసంభవ వినుతా!
జయజయ పన్నగకంకణ!
జయజయ గంగావతంస! జయ చంద్రధరా!
220-సీ.
కుసుమదామంబులు కోమలి తన మౌళిఁ: బెట్టదు నీ మౌళిఁ బెట్టి కాని;
గజరాజనిభయాన గంధంబు తనమేన: నలఁదదు నీ మేన నలఁది కాని;
రాజీవదళనేత్ర రత్నకంకణములు: దొడగదు నీ కేలఁ దొడిఁగి కాని;
పుష్కరానన పట్టుఁబుట్టంబుఁ గట్టదు: కడకఁతో నీ కటిఁ గట్టి కాని;
ఆ. మహితలోలనేత్ర మాటాడ దెప్పుడుఁ
గొంచమేని నిన్నుఁ గోరి కాని;
యింత పిదప నిప్పు డేమియు నొల్లదు
నిన్నె కాని దేవ! నిశ్చయంబు.