వీరభద్ర విజయము/చతుర్థాశ్వాసము/పరమేశ్వరునితో వీరేశ్వరుండు ధ్వంసవృత్తాంత మంతయుఁ దెల్పుట
పరమేశ్వరునితో వీరేశ్వరుండు ధ్వంసవృత్తాంత మంతయుఁ దెల్పుట.
188-సీ.
ఇది సరస్వతి ముక్కు యిది దక్షు తుండంబు
యిదె వహ్ని నాలుక లవధరింపు
మిదె హవ్వవాహునియిల్లాలి చను ముక్కు
భాసురం బగుచున్న నాసికంబు
యివె పావకుని చేతు లివె దేవతల తలల్
నిడుద ముక్కును భర్గు నేత్రములును
ఇవె గజదంతంబు లివె దేవగణముల
కాళ్లును చేతులు కాయచయము
ఆ.
తెచ్చినాఁడ సురల నచ్యతు నాదిగాఁ
బట్టి తెచ్చినాడఁ బరఁగ నింక
నేమినేయువాఁడ నీశాన యానతి
నీవె నాకుఁ గరుణ నేర్పడంగ.”
189-వ.
అని విన్నవించి ముకుళితహస్తుం డై వీరభద్రేశ్వరుండు నిలిచియున్న సమయంబున.
190-క.
కలఁగుచు తలఁగుచుఁ గొంకుచు
వెలవెల నై సిగ్గుపడుచు వెఱపున నమరుల్
జలరుహనయనుఁడు మొదలుగఁ
బలుమరుఁ బ్రణమిల్ల నంత భవుఁ డిట్లనియెన్.
191-సీ.
మిమ్మెల్లఁ గాఁచితి మేలైన కరుణను
వెఱవకుండుఁడు మీరు వేల్పులార!
యేను గోపించిన మానుపింపఁగ మీకు
దిక్కేది చెప్పుఁడా దివిజులార!
మఱియు దక్షునిఁ గూడి మమ్మిట్లు మఱతురే
తెలిసియుండవలదె దివ్వులార!
యవుఁగాక మీసేఁయు నపరాధములు గాచి
యభయంబు లిచ్చితి నమరులార!
ఆ.
అనుచు నీలకంఠుఁ డల్లన నగవుతో
నానతిచ్చి కరువు నమరియున్న
చచ్చి మరలఁ బుట్టి వచ్చినవారైరి
సంతసిల్లె దేవ సంఘమెల్ల.
192-వ.
అయ్యవసరంబున సరోజసంభవుండు పరమేశ్వరునకుపాష్టాంగదండ ప్రణామంబు లాచరించి కరమలంబులు నిటలంబున ఘటియించి విశేష తాత్పర్య చిత్తుం డై “సర్వెశ్వరా! యొక్క విన్నపం బవధరింపు” మని యిట్లనియె.
193-క.
తప్పులు చేసినవీరలఁ
దప్పులకున్ దగినభంగి దండించి దయం
జెప్పుదును నీ క్రమంబున
నిప్పుడు మన్నించు టొప్పు నిభచర్మధరా!
194-క.
పుట్టింప నీవె నేర్తువు
నెట్టన రక్షింప నీవె నేర్తువు గడిమిం
గిట్టింప నీవె నేర్తువు
యిట్టి దయారసమె చెల్లు నీకు మహేశా!
195-క.
సురసంఘములకు నీచేఁ
జొరిఁ జచ్చుట వారివారిపుణ్యము సుమ్మీ
సురచిరముగఁ బ్రాణంబులు
పరమేశా! యేము మగుడఁ బడయుట గాదే.
196-క.
దేవతల యంగకంబులు
దేవర చేఁజేతఁ ముట్టి తెచ్చె ననంగా
దేవతలకుఁ బెద్దఱికము
దేవా! ప్రాప్తించె వినుము దేవాధిపతీ!
197-క.
ఖండేందుజూట! నీచే
ఖండింపఁగఁ బడినచోట్లు క్రతుభుక్కులకున్
మండనములు దొడిగినక్రియ
నొండొండ వెలింగి యొప్పుచున్నవి దేవా!”
198-వ.
అని విన్నవించిన నప్పరమేశ్వరుండు.
199-ఉ.
లోలదయాళుఁ డై నిఖిలలోకవిభుండు శివుండు కొండరా
చూలిముఖేందుమండలముఁ జూచుచు నిట్లను “వీరభద్రుఁడున్
వేలుపుమూకలన్ గనలి వేగఁ గలంచి యలంచెఁ గోపమున్
జాలును వీరలన్మనకు నైరణచేయఁగఁ బోలు నంగనా!
200-క.
నేరము చేసినవీరుల
వీరిం దెగటార్చ మనము వీక్షించినచో
వారింపఁగ దిక్కెవ్వరు
గౌరీ! యిఁకఁ గరుణతోడఁ గావఁగవలయున్.
201-వ.
అని సకలభువనప్రతీష్ఠుం డగు పరమేశ్వరుండు కరుణాకటాక్షుం డై.