వీరభద్ర విజయము/చతుర్థాశ్వాసము/వీరభద్రుం డింద్రాదులతోఁ బోరాడుట


వీరభద్రుం డింద్రాదులతోఁ బోరాడుట.

161-క.
ఎక్కడ వచ్చెద రిచటికి
వ్రక్కలు గావింతు నన్న వాసవుఁ డనిలో
గ్రక్కున వజ్రము వైచెను
చిక్కెను వజ్రంబు వీరసింహునిచేతన్.
162-క.
అందంద వీరకాహళ
దుందుభి నిప్సాణ శంఖ తూర్య రవంబుల్
క్రందిల్లె వీరసారథి
బృందారకబృంద మెల్లఁ బొరిఁబొరి వణఁ కెన్.
163-వ.
ఇట్లు తన కెదురుపడ నారాయణేంద్రాది దేవగణంబుల నాలంబున పలాయమానంబులం జేసి తనివిచనని కోపంబున నొకని నొకనికిం బది నూఱు వేయు లక్ష కోటిరూపులై విజృంభించి ప్రళయకాలాగ్ని చందంబున వలయాకారంబుఁ గొని కొఱవి ద్రిప్పిన తెఱంగున నెక్కడఁ జూచినఁ దానయై కనుపట్టి చంపుచు; నెదురులేని మదగజేంద్రంబు చందంబున నవ్వీరగణ కంఠీరవుండు ఘోరవీరతాండవాడంబరుం డై సమరకేళీవిహారంబు సలుపుచున్న సమయంబున నిలింప దేవ సంఘంబులు వీరభద్రునిచే భల్లభగ్నాంగులై శిరంబులు దెగి అర్ధచంద్ర నిశిత విఖంబులఁ గంఠంబులు దెగి పడి బెగడి జేవురు గొండల తెఱంగున నెత్తుటఁ జొత్తిల్లువారును; తమ బంధుజనంబులం బాయఁజాలక వారి కెదురుపడి చచ్చువారును; గుముర్లు కట్టి వీరభద్రు రణంబు చూచి భీతచిత్తులై ప్రాణంబులు విడుచువారును; దావానలంబునం బడి కాలు భూరి జంతుచయంబుల చాడ్పున భద్రుఫాలానలంబున భస్మీభూతు లగువారును మఱియు శివద్రోహుల మగు పాపకర్ముల కింత వలవదే యని తమలోన నెఱింగించుకొను వారును మఱియుఁ గులశైలగుహాంతరములలో డాగువారును; గాఱడవుల దూఱువారును; నేరుల మునుంగువారును; నెఱ్ఱెలు చొఱఁ బాఱువారును; బీనుఁగుల మఱువు దీసికొనువారును; రూపు చెడి దేహయష్టి తుత్తుమురులైన వారును; “వీరభద్ర వీరభద్రా శరణంబు శరణం” బనువారును; భల్లాయుధంబులచేత దేహంబులు వ్రయ్యలై పలుమాఱు నెలుంగెత్తి యేడ్చువారును; వూరి గఱచుకొని నిరాయుధులై పడువారును నైరయ్యవసరంబున కొండలరాసులు వ్రేగులప్రోవులు నెముకలతిప్పలు మాంసంబులు పీనుఁగు తలలు పెంటలు మెదడు రొంపియు నెత్తురుటేరులును నై పీనుంగులు జలచరంబుల చాడ్పునను ధవళచామరంబులు వెలినురుఁగుల చందంబునను గంధర్వ దివిజ శల్యంబుల తెట్టలు కొండల కైవడియు నై పడియున్న దేవభట్టారకు లరవిందపుఁ దూండ్లభంగియుఁ దునిసిన ధవళఛత్రంబులు పుండరీకంబుల కరణియు రాలిన కరకంకణాది భుషణజాలంబులు మరాళాది జలపక్షుల లాగునను గుప్పలుగొని పడియున్న శిరంబులు శంఖంబులును దట్టంబులు నానా ద్వీపంబులును మార్తాండమండల కిరణంబులవలనఁ దేరి చూడరాని నెత్తురుటేరులును శరంబులచేత నురంబులు పగిలి పఱచు నిలింప సంఘంబులు తరంగంబుల చందంబునను మహాభీతచిత్తులై పఱచు నార్తారవంబులు మ్రోఁతయు నై మహార్ణవంబుతో ననుకరించె నప్పుడు శరచ్చంద్రికా మయూఖ విలసితుం డైన చందురుండునుం బోలె రక్తార్ణవంబు నుబ్బించుచు వీరభద్రుం డొప్పుచుండె నయ్యవసరంబున.
164-మత్త.
ఓహటించె రణంబులోఁ బడియున్న మాధవముఖ్యులన్
సాహసంబునఁ జేరి వెండియుఁ జండకోపముతో శివ
ద్రోహు లిద్దఱు నెల్ల వెంటనఁ దూలి పోవఁగ నీక మీ
రాహవంబునఁ బట్టు డిందఱి నంచుఁ బల్కె గణాధిపుల్.
165-తరల.
కఱకువేల్పులఁ బట్టువారల కాళ్లు సేతులు పొట్టలున్
మొఱలు కూఁతలు వెట్ట నుగ్రత మొష్టిఘాతల నొంచుచున్
పఱవగం జననీక శృంఖలబంధనంబులు చేసి తా
నరిమురిన్ రణకేళి సల్పెను నాత్మ నెంతయు సోలుచున్.
166-వ.
అనిన విని మునీంద్రులు విస్మయాత్మకు లై వాయుదేవు నుపలక్షించి తమలో నిట్లనిరి.
167-క.
శివనిందయు స్మృతినిందయు
శివభక్తులుగానివారి సేవించుటయున్
భువనమునఁ గాదు దక్షుఁడు
శివనిందను దలఁచి యిట్లు చెడియెన్ ధరణిన్.
168-సీ.
సలలితంబుగ జన్నశాలలు భస్మమై
తోరణంబులు డుస్సి ధూళిఁ గలసె
హోమగుండము లెల్ల నొగి నెత్తురులఁ దోఁగి
బ్రహ్మలు వేల్పులు పరఁగఁ జచ్చె
బృందారకావలిఁ బొలియించెఁ గులవధూ
జనవిలాపంబులు సందడిల్లె
భాసురం బగు లక్ష్మిపతిఁ బట్టి కట్టిరి
తపసులు పెద్దలు ధరణిఁ గూలె
ఆ.
బెరసి తలలగములు పీనుఁగుపెంటలు
మదపుకుప్పలైన మాంసములును
రక్తనదులు మెదడురాసులు నెముకలు
గుట్టలయ్యెఁ జెప్ప జెట్టలగుచు.
169-ఆ.
గిరిశుఁగూర్చి సేయు గురుపాతకంబైన
పుణ్య మధికమగుచుఁ బొరయుచుండు
శ్రీగిరీశు వేఱుసేయు పుణ్యంబైన
పాతకంబు నెల్లభంగులందు.”
170-వ.
అని మునీంద్రులు సముచితాలాపంబులం బల్కుచు వాయుదేవుం జూచి “మహాత్మా! మఱియును దత్సంగ్రామంబున వీరభద్రుం డెవ్విధంబునం జరియించె వినుపింపు” మని యడిగిన నతం డిట్లనియె.
171-క.
“ఈ విధమున గణనాథులు
దేవానీకములఁ బట్టి తెరలని బలిమిన్
బోవని శృంఖలబంధము
గావించిరి సంగరమునఁ గలుషాత్మకులన్.
172-వ.
తత్సమయంబున.
173-క.
చారుతరభ క్తితోడను
సారథి యై మెలఁగుచున్న చనవునఁ బ్రీతిన్
వీరగణాధీశ్వరునకు
భారతిపతి మ్రొక్కి నిలిచి పలికెన్ గడఁకన్.
174-శా.
“ వీరాంభోనిధి! నేఁడు మీ యలుకకున్ వీరెంతవారయ్య త్వ
త్కారుణ్యంబునఁ గాతు గాక యని యా కష్టాత్ములన్ బోరిలోఁ
 గాఱింపం గబళింప నీ ప్రమథుఁ డొక్కెం డైన జాలండె దు
శ్చారుల్ దివ్వులు వీరి నెన్నక మదిన్ నైరించి రక్షింపవే.
175-క.
తప్పులు చేసిన బిడ్డల
తప్పులకును శిక్షఁ బెట్టి తండ్రులు దెలియం
జెప్పుదురుగాక యెందును
తప్పులకును ద్రుంతురయ్య తరుణేందుధరా!
176-క.
తారే వెట్టినతరువుల
తారే వెఱుకుదురె పతికి దాసీజనముల్
నేరక యెఱుఁగక చేసిన
నేరంబులు సైఁప వలదె నీలగ్రీవా!”
177-క.
అని యిట్లు బ్రహ్మదేవుఁడు
వినుతులు సేయంగఁ బ్రీతి వీరాధిపుఁడు
న్మనమున దయ గరుణించుట
గని హరియును సురలు బ్రహ్మ ఘటితాంజలులై.
178-వ.
ఇట్లు స్తుతియింపం దొడంగిరి.
179-క.
“ జయజయ నిర్ణరమదహర!
జయజయ రణరంగభీమ! శౌర్యోద్దామా!
జయజయ వీరాంభోనిధి!
జయజయ లోకైక వీర! సంతతధీరా!
180-ద.
శ్రీనీరరూపా! శివ! ద్రోహగండా! ప్రచండప్రతాపా! సుపర్వాణసంఘా! తమోభానుబింబప్రదీపా! మహాకోప రూపాదివీరాంకవీరా! పురారాతి సంహార ఘోరావతారా! శివాచారమందార! బృందారకాధీశగర్వాపహారా! దయాకార! నాగేంద్రహారా! సనందాదియోగీంద్ర చేతోవిహారా! జనాధార! నీ దివ్య తత్త్వంబు భావింపఁగా లేక గర్వాంధకారాంధు లేమైతిమో నీదు రూపంబు రూపింప నజ్ఞాన బంధంబులం జిక్కి వేద ప్రకారంబులన్ మించి యిచ్చోటికిం దక్షయాగంబు వీక్షింపఁగా నిన్ను మారాక యెల్లం గడుం దప్పులై యుండు సైరింపవే దేవదేవా! శివద్రోహు లై నట్టి మమ్మున్ విజృంభించి శిక్షించి తీవింక నీదైన వైరంబు చాలింపు తండ్రీ! మముం గూర్చి మే మెంతవారమ్ము నీ యానతిం గాదె యీ బ్రహ్మ లోకంబులం బ్రాణనిర్మాణుఁ డై యుంట; నీ యానతిన్ గాదె యీ విష్ణు లోకైకరక్షాభుజాదక్షుఁ డై యుంట; నీ యానతిం గాదె రుద్రుండు సర్వ ప్రపంచారి యై యుంట; నీ యానతిం గాదె రేయుం దినంబుల్ వెలుంగొందుచుం జంద్రసూర్యాదులున్ భవ్వు లై యుంట; నీ యానతిం గాదె దేవేంద్ర నాగేశ ముఖ్యుల్ ప్రతాపించి దిక్పాలు రై యంట; నీ యానతిం గాదె దేవౌఘముఖ్యుల్ సులోకోపకారార్థు లై యుంట; నీ యందుఁ గాదె సరోజాతజాతాండముల్ దొంతు లై యుంట; నీ యున్న చందంబు నేమెంత యూహింపఁగావచ్చు; వేదంబులు న్నీవ; వాదంబులు న్నీవ; ధైర్యంబులు న్నీవ; మర్మంబులు న్నీవ; యీ బ్రహ్మయు న్నీవ; యీ విష్ణువు న్నీవ; యీ రుద్రుఁడు న్నీవ; సర్వంబును న్నీవ సుమ్మీ; జగన్నాధ! నీ పెంపు నీకుం దలంపంగఁ జిత్రంబు మాబోఁటి వారెల్ల నిన్నున్ విచారింపఁగా నేర్తురే? నీవు కారుణ్యదృష్టిన్ బ్రసన్నుండ వై వీరు నా వారు నా దాసు లంచున్ ముదంబొప్ప మన్నించి దివ్యప్రబోధ ప్రపాదంబులన్ జేసి రక్షింపగా నీకు భారంబు గాకుండు నజ్ఞానభావంబులం బాపి సుజ్ఞానమార్గంబులం జేసి నిష్కర్ము లై నిత్య సమ్మోదు లై యేకచిత్తంబునం బొంది నిర్వాణు లై నిష్కళంకంబులన్ బొంది మిన్నంది మీ యందు భావంబు గీలించి; నీ దివ్య రూపంబు దా నెట్టిదౌఁ గాక యంచుం దలం పొంది భావించు వా రెల్ల దృగ్గోచరం బైన నిన్నేర్పడం గానఁగా లేక విభ్రాంతు లై చిక్కువడ్డార దెందేనిమిత్తంబునం జేసి నీ చందము న్నీ విలాసంబులు న్నీదు రూపంబునుం జూచియు; న్నీవు దండించు పుణ్యంబులు న్బొందఁ గల్గెన్; మహాధన్యుల మ్మైతీ మో దేవ! దేవాదిదేవా! మహాదేవ! నీ లెంక లైనట్టి నీ దాసు లైనట్టి మమ్ముం దయాళుండ వై ప్రీతి రక్షింపవే; దేవ! వీరెవ్వరుం గానఁగా లేరు నేరంబు సైరింపవేచ దేవ! మన్నింపవే దేవ! శ్రీవిరభద్రా! శరణ్యంబు రుద్రా! నమస్తే! నమస్తే! నమస్తే! నమః.
181-క.
జయజయ లోకారాధిత!
జయజయ ఫాలాగ్ని నేత్ర శశిరవినయనా!
జయజయ శూలాయుధకర!
జయజయ సోమార్ధజూట! సర్వజ్ఞనిధీ!
182- క.
నినుఁ గాన లేవు చదువులు
నినుఁ గానవు జగము లిట్టు నీ విచ్చోటం
జను దెంచి శిక్షవెట్టుట
పనిగొని మాతపము లెల్ల పండుట గాదే.
183-క.
పాపం బని చింతిపక
పాపాత్ముని దక్షుఁ గూడి మతిమాలి వెసం
బాపపు జన్నముఁ జూచిన
పాపాత్ముల కింత వలదె పాపము ధరణిన్.
184-శా.
భూమిన్ బాలురు సేయు వెఱ్ఱితనముల్ పోషించి యెవ్వారలం
బ్రేమన్ ముద్దులు సేయఁగావలయునో పెంపార నూహింపుమా
మేమెల్లన్ భవదీయపుత్త్రులము గామే తండ్రి మానేరముల్
స్వామిద్రోహరగండ! సైఁచి కరుణన్ సంప్రీతి రక్షింపవే.
185-క.
అవథారు వీరవిక్రమ!
భవదీయ మహోగ్రకోప పావకకీలన్
వివరంబన నిట్లైతిమి
భవమత్తుల కింతి వలయుఁ బావనమూర్తీ!
186-క.
రక్షింపుము కరుణాకర!
రక్షింపుము లోకనాథ! రమ్యాకారా!
రక్షింపుము రిపుసంహర!
రక్షింపుము వీరభద్ర! రౌద్రసముద్రా!”
187-వ.
అని మఱియు ననేక ప్రకారంబుల దామోదర విరించీంద్రాది సుర గణంబులు వినుతింప ననుకంపాయత్త మానసుండై వీరావేశంబుఁ జాలించి, గోవింద పురందర దేవగణసమూహంబులకు శృంఖలాబంధ మోచనంబులు చేయించి యప్పరమేశ్వరుం డున్నయెడకుఁ జనుదెంచి పాష్టాంగదండ ప్రణామంబు లాచరించి తన కడిమి మెఱసి దక్షాధ్వరంబు చుట్టుముట్టుకొని పట్టితెచ్చిన దేవతలను దదీయాంగకంబులును నమ్మహాదేవు సన్నిధిం బెట్టి వేర్వేఱ నెఱింగించువాఁడై యిట్లనియె.