వీరభద్ర విజయము/చతుర్థాశ్వాసము/శివుండు బ్రహ్మమొదలగువారి ననుగ్రహించుట


శివుండు బ్రహ్మమొదలగువారి ననుగ్రహించుట.

202-సీ.
పావకజిహ్వలు బాహుఖండంబులు
వలనొప్పఁ బిలిపించి వహ్ని కిచ్చె
పూషుదంతంబులు పూషున కిప్పించె
భర్గుని నయనంబు భర్గున కిచ్చె
భారతిముక్కును భారతి కిప్పించి
ముక్కున కొక మంచిముత్తె మిచ్చె
అగ్ని దేవునియాలి నల్లన రప్పించి
చనుముక్కులును ముక్కు సతికి నిచ్చె
తే.
మఱియు భద్రుండు దెచ్చిన సురలయంగ
కంబులెల్లను మరలంగఁ గరుణ నిచ్చెఁ
దెగినవారల జీవుల మగుడ నిచ్చి
యభయమిచ్చి బంభావించె నభవుఁ డపుడు.
203-క.
హరికి సురపతికిఁ గరుణను
వరుసన్ బిలిపించి చక్రవజ్రాయుధముల్
కరిచర్మధరుం డిచ్చెను
సరభసమున సురలు బ్రహ్మ సంస్తుతిసేయన్.
204-క.
శంకర దేవుని పంపున
పంకజభవుఁ డొక్క తగరు పడియున్ననిరా
టంకముగ దానిశిరమును
లంకించెను దక్షుతనువు లక్షణ మొదవన్.
205-వ.
ఇవ్విధంబున.
206-క.
దక్షునితల యంటించిన
దక్షుఁడు నలుదెసలు చూచి తనచిత్తములో
నక్షీణభక్తి వెలయఁగ
దక్షారికి మ్రొక్కె సిగ్గు దనరఁగఁ బ్రీతిన్.
207-క.
నినుఁ దెలియక మతిమాలితి
నినుఁ దెలియక ఖలుఁడ నైతి నీలగ్రీవా!
నినుఁ దెలియక గతిఁ దప్పితి
నినుఁ దెలియక మరులుకొంటి నిరుపమమూర్తీ!
208-క.
నీ వేల నాకు నొందెడు
నీవు దురత్మును నెల్ల నేరవు బ్రవన్
నీ విధముఁ దెలియ వశమే
నీ వెఱవుఁ దలంపఁ దరమె నిర్మలకీర్తీ!
209-క.
బంధరనానాకల్మష
బంధంబులు చుట్టముట్టి భావములోనన్
బంధించి బలిసి యున్నవి
బంధంబులఁ బాపి కరుణఁ బాటింపు శివా!
210-క.
నిను నే విధమునఁ గొలుతును
నిను నే విధమునఁ దలంతు నిను నెబ్భంగిన్
వినుతింతు నానతీవే
యనుపమగుణహార! త్రిజగదభినవరూపా!
211-క.
గంగారమణిమనోహర!
గంగారంగత్తరంగ కలితశిరోజా!
గంగాసలిలవినోదన!
గంగాతటినీసమీప గమనవిహారా!
212-క.
గౌరీకుచపరిరంభణ!
గౌరీముఖచంద్ర బింబ గంధ సరోజా!
గౌరీమానసరంజన!
గౌరీనయనారవింద కమలాధిపతీ!
213-వ.
అని మఱియు శరణంబు వేఁడితి దక్షునిం గనుంగొని రజతగిరి మందిరుం డిట్లనియె.
214-ఆ.
“మమ్ము మఱవఁ దగునె మహనీయ మగు బుద్ధి
గలిగి నడువు మెల్ల కార్యములను
నీకు నివ్విధంబు నీ నేరమునఁ గాని
మత్కృతంబుగాదు మాను దక్ష!”
215-క.
అని పరమేశుఁడు ప్రియమునఁ
దన గణనాయకులలోన దక్షుని నునిచెన్
ఘనుఁడు దయాళుఁడు శంభుఁడు
వనజాక్ష ప్రముఖ సురలు వారక పొగడన్.
216-వ.
మఱియు తదీయావసరంబున నారాయణ బ్రహ్మేంద్రాదిదేవ గణంబులు దండప్రణామంబు లాచరించి కరకమలంబులు ఫాలంబునఁ జేర్చి యిట్లని స్తుతియింపఁ దొడంగిరి.
217-సీ.
భుజగేంద్రభూషాయ! భూతాధినాథాయ!
నిత్యానురాగాయ! నిర్మలాయ!
గంగావతంసాయ! ఖండేందుజూటాయ!
దేవాది దేవాయ! దిక్పటాయ!
వేదాంతవేద్యాయ! వీరప్రతాపాయ!
కైవల్యనాథాయ! ఘనఘనాయ!
రణరంగవీరాయ! రమణీయరూపాయ!
భువనాభిరామాయ! పురహరాయ!
ఆ.
ఓంనమశ్శివాయ! ఓంకారరూపాయ!
శంకరాయ! రిపుభయంకరాయ!
మదనసంహరాయ! మానితకైలాస
మందిరాయ! నీలకంధరాయ!
218-క.
జయజయగౌరీవల్లభ!
జయజయ కైలాసనాధ! జయ కరుణాబ్ధీ!
జయజయ త్రిజగన్మోహన!
జయజయ లోకైకమాత! జయ శర్వాణీ!”
219-వ.
అని మఱియు ననేకవిధంబుల నయ్యాదిదంపతుల స్తుతియింప నంత నప్పరమేశ్వరుండును వీరభద్రునిం జూచి కరుణావిశేషమానసుండై “భద్రకాళియును నీవు నిందు ర”మ్మని చేరం బిలిచి సమ్మదమున గాఢాలింగనంబు చేసి; తన యంకపీఠంబున నునిచి వినుతించె; వారల గౌరీ దేవియును కృపాకటక్ష యై యుల్లంబున సంతసిల్లి వీక్షించె; నివ్విధంబున సతియునుఁ బతియును గారవించి యిరువురు నిట్లని యానతిచ్చిరి.
220-క.
“లోకంబులు గల్పింపఁగ
లోకంబులు గావ నణఁప లోకైకనిధీ!
నీకును భారము మీఁదట
నాకాధిపవినుతచరణ! నాగేంద్రధరా!