మీఁగడ తఱకలు/ప్రాచీనాంధ్రవచనకావ్యములు

5

ప్రాచీనాంధ్రవచనకావ్యములు

“దేశభాషలందుఁ దెలుఁగు లెస్స" నాఁ బరఁగిన మన యాంధ్రభాషయందు నన్నయభట్టారకుఁ డాదిగాఁ గల తొల్లింటికవు లెల్లరును జంపూప్రబంధములను, మిక్కిలి తక్కువగా నిర్వచన పద్యకావ్యములను మాత్రమే రచించిన ట్లెఱుకపడుచున్నది గాని శుద్ధవచనకావ్యములను, మఱియు దృశ్యకావ్యములను రచించినట్టు కన్పట్టదు. ఆద్యప్రకృతి యగుగీర్వాణభాషయందు, సుబంధుని వాసవదత్తయు, బాణునికాదంబరీ హర్షచరిత్రములును, దండి దశకుమారచరిత్రమును మొదలుగాఁ గొన్ని ప్రౌఢతమము లగుగద్యకావ్యములు గలవు. కాళిదాస భవభూతి ప్రముఖుల రసోత్తరము లగుదృశ్యకావ్యములును గలవు. మన యాంధ్రవాఙ్మయము సంస్కృతవాఙ్మయమునుబట్టి పుట్టి పెరుగుటయుఁ, దొలుదొలుతఁ బ్రాయికముగా నాంధ్రకావ్యకర్తలు సంస్కృతగ్రంథములనే యనువదించుచు వచ్చుటయు, విస్పష్టమ కదా. పురాణాదులతోఁ బాటు మున్నే కొన్ని గద్య కావ్యములును, దృశ్యకావ్యములును, సంస్కృతము నుండి మనవారిచేఁ దెనుఁగున ననువదింపcబడెనుగాని యా యనువాదములును జంపూరూపములే యయ్యెను. వచనకవిత్వ మొక కవిత్వ మనిపించుకొన దని తలఁచి, నన్నయ భట్టారకాదులు రచింపమానిరని కొంద ఱనియెదరుగాని యది సమంజసమయినట్టు కన్పట్టదు. సంస్కృతమున వాసవదత్తాకాదంబర్యాదులకున్న గౌరవ మసామాన్యమైనది గదా! కవిత్వమునకు ఛందఃపరిశ్రమమే ముఖ్యమనుట కెవ్వ రంగీకరించెదరు? పద్యకవిత్వముకంటె గద్యకవిత్వమే కవియొక్క సంపూర్ణశక్తి నపేక్షించునని సంస్కృతభాషయందు "గద్యం కవీనాం నికషం వదంతి" యనునానుడి కలదు. నన్నయాదులు వచనకావ్యరచన మీకారణముచేతనే మాని రన్నచో దృశ్యకావ్యములు రచింపమికి వేఱొకకారణము వెదకవలసియుండును. వారు వీనిని రచింపమికిఁ గారణ మిదియని నిరూపింపవలనుపడదు.

పదపడి యిటీవల పదునాఱవశతాబ్దితుదనుండియు వచన కావ్యములును యక్షగానము లనునొకవిధ మగురూపకవికారములును రచింపఁబడుచు వచ్చినవి. యక్షగానము లంతకుcబూర్వము సయిత ముండిన నుండియుండును గాని వచనకావ్యములు లే వనవచ్చును. ఆంధ్రభోజఁ డనఁబడు కృష్ణదేవరాయల నాఁటనుండియుఁ జోళపాండ్యాది రాజ్యములందుఁ దెలుఁగు రాజభాషగా వ్యవహరింపఁబడుచువచ్చెను. ఆరాజ్యములను విజయనగరరాజసంబంధులు పరిపాలించుచువచ్చిరి. పదునాఱవశతాబ్దినుండి యాంధ్రదేశమున రచింపcబడిన వానికంటె నక్కడ రచింపబడిన తెనుఁగుఁగబ్బములు మెండు. మఱియు నవి రసోత్తరములు అయి యున్నవి. విజయవిలాసాదిప్రబంధము లయ్యెడ నప్పు డుప్పతిల్లినవే. నాఁ డక్కడ రచింపఁబడిన కబ్బము లింకను మనకుఁ గొన్ని చేకుఱలేదు. మన యాంధ్రభాషావధూటి శుద్ధద్రావిడదేశమున సయితముఁ దన నుడికారపుఁ బొంకమున సంపూర్ణాదరము వడిసి పోషింపఁబడినదిగదా! తొలుదొలుత యాంధ్రవచన కావ్యరచన దక్షిణ దేశముననే యారంభింపఁ బడినది. దక్షిణదేశమందు రచింపఁబడిన యీ వచనకావ్యములఁగూర్చి ప్రశంసింపఁ బోవునప్పుడు ముందు నన్నయభట్టారకాదులు తమగ్రంథములఁ దందందుఁ బొందుపఱుచుచు వచ్చిన వచనములఁగూర్చియుఁ గొంతచర్చించుట యావశ్యకము కాకపోదు. నన్నయభట్టారకునికవనమునం దెడనెడఁ గల్గుగద్యములు మన యచ్చుకూర్పునఁ బదిపదునైదు బంతులకంటె హెచ్చుగాక ముచ్చట లిచ్చుచుండును. తొంటికవుల రచనలలో నన్నయభట్టారకుని గద్యములే పద్యములట్లు ధారాచమత్కృతి గల్గి చదువ నింపై యుండును. తిక్కనామాత్యుని గద్యములు మిక్కిలి మెలపు మీఱినతెలుఁగుఁ బలుకుబళ్లతో నించుక జిలుగులై బిగువు గల్గి రసమొల్కు చుండును. ఈతని కృతులందు గద్యములు నన్నయార్యుని కృతులందువలెఁగాక, కొండొకమెండై నిడుదలునై పొడకట్టుచున్నవి. ఎఱ్ఱనార్యుని కృతులందలి గద్యము లొక్కొకయెడఁ బ్రౌఢ మగుసంస్కృత రచనమును, గొండొక యెడనినుపారు తెలుఁగుఁగూర్పును గల్గి నిబిడములై ప్రాయికముగా వర్ణనాంశము గల్గియుండును. ఈ మువ్వరగద్యములును ననుప్రాసప్రయాసరహితములై యెల్లవిధముల మేల్మికూర్పు గల్గియున్నవి. కవిత్రయమునకుఁ దర్వాతివారు రచించిన గ్రంథములందు గద్యములు మిక్కిలి మాఱుపాటును జెందినవి. నాచన సోమనాథునిగద్యము చదువువారికి గుండియ తల్లడమును గల్గించుచుఁ గొండవీటిచేఁత్రాళ్లవలె బొడుగువాఱి దేసితెలుఁగుఁబల్కులతో నిండారి యనుప్రాసవిన్యాసములచే నతికఠినములై యుండును. ఈతని గ్రంథమున వచనము లచ్చునఁ బోసి ముద్రకొట్టఁబడినట్లు నెలకొని యున్నవి. యుద్ధాదికమును వర్ణించుపట్టులం దీతఁ డిట్టి వచనములఁ బెట్టుచుండును. కథాంశమును జెప్పునప్పు డీతని కృతియందు గద్యములే యంతగాఁ గాన్పింపవు. శ్రీనాథుఁడు సంస్కృత ప్రాయముగా నుద్ధతశైలితో నతిప్రౌఢమగువచనముల రచించెను. ఒక్కొకయెడ నీతనిగద్యములు నన్నయార్యునిగద్యములతోసయితము సాటివచ్చుచుండును. తెలుఁగుఁ గూర్పులగూడఁ గొండొక కలయఁ గూర్చినను బోతనామాత్యుఁడు వచనములను గడునిడుదలుగను గఠినములుగను నెలకొల్పెను. పెద్దనాదుల కృతులందు వచనములు మిక్కిలి తక్కువ ఉన్నను వర్ణనాత్మకములై యతిప్రౌఢములై యుండును. పెద్దనాదులకుఁ దర్వాతికవులు కొందఱు పద్యములందు వలయు గణయతి ప్రాసనిర్బంధము లేమిచేఁ దమకుఁ గల్గెడు సౌకర్యమును వీడనాడి యిబ్బడిగా నిర్బంధములను దెచ్చిపెట్టుకొని, తమగ్రంథములందు బహుక్లిష్టముగను, అనుప్రాసనిరంతరముగను, దురవబోధముగను వచనములఁ గూర్చుచు వచ్చిరి. ఇట్టి వచనములను బ్రాయికముగాఁ దద్గ్రంథములఁ బఠించువారు వదలి వేయుచుందురు.

నన్నయభట్టారకాదులు పద్యములం దింపుగాఁ గూర్పవలను పడనివంశక్రమాదివృత్తాంతమును దెలుపవలసినపుడును, మిక్కిలి విరివిగా నున్నకథ నల్లంతతో సంగ్రహింపవలసినపుడును, బఠించువారికి నిరంతరపద్య సంఘటనమువలనc గల్గు విసువు నవయింపవలసినపుడును, నెడనెడ సంస్కృతగ్రంథమును మీఱక హృద్యము లగుగద్యములఁ గల్పించిరి. నాచనసోమనాథుఁ డుత్తరహరివంశమును దెల్గించె నన్నపేరేగాని యందుండి తనయిచ్చకు వచ్చిన మూఁడునాల్గుకథలఁ గైకొని విచ్చలవిడిగాఁ గ్రంథము రచించినవాఁ డగుటచేఁ బద్యములందును గద్యములందును గూడఁ దనగడుసరితనమును విశృంఖలముగఁ జూపుకొనఁ గల్గెను. పోతనామాత్యునకు భాగవతమందలి యాధ్యాత్మికవిషయములు కొన్ని పద్యములందుఁ గూర్పఁ గుదురని వగుటచే గొప్ప గొప్ప గద్యములఁ జెప్పక తప్పదయ్యె. ఆధ్యాత్మికవిషయములఁ దెల్పునపుడే కాక మఱికొన్ని యెడలనుగూడ నీతఁడు పెక్కువగా వర్ణనలఁ బెట్టుకొని, కఠినము లగుగద్యములను గూర్చెను. తర్వాతఁ బెద్దనాదులు తాము విశృంఖలముగాఁ గల్పింప దొరకొన్నమనుచరిత్రాదిప్రబంధములందుఁ జంద్రికాదులను వర్ణింప మొదలిడి యనల్పము లగుకల్పనలఁ గల్పించుకొని, యవి పద్యములం దిమడ్పఁ గుదురకపోఁగా శబ్దాడంబరమం దాదరము మెండుకొనుకతన నంతంతలేసి ప్రౌఢగద్యములఁ గూర్చిరి. అప్పటి నుండియుఁ బ్రబంధ మనుచుఁ గూర్ప మొదలిడిన తర్వాత నట్టిగద్యములఁ గూర్చుట కవులకుఁ దప్పని పనివలె నయ్యెను. మన తెల్గుదేశమున శుద్ధవచనకావ్యము లుప్పతిల్లమియకాక చంపూప్రబంధములందలి గద్యములస్థితియు నీవిధమున నుండుకాలమున దక్షిణదేశమునం దాంధ్రవచనకావ్యరచన మారంభింపఁబడినది. అప్ప డక్కడ రచింపఁ బడిన గద్యకావ్యములందుఁ గేవలకల్పితములు లేవు. అన్నియును బురాణములును దదుపాఖ్యానములునుగనే కన్పట్టుచున్నవి. నన్నయాదులచే రచింపఁబడిన భారతాదిప్రబంధములు ప్రౌఢతమము లగుకతనఁ దదర్ధగ్రహణము సామాన్యజనసులభము గాకపోవుటయే యక్కడ తొలుత నీ వచనకావ్యరచనోపక్రమమునకుఁ గారణమయినట్టు చూపట్టుచున్నది. తఱచుగా నీ కావ్యములందు వాక్యములు క్లిష్టాన్వయములై యంతును బొంతును లేక యుండును. వీనియందు గిరిసరిదాదివర్ణన మంతగాఁ గన్పట్టదు. సంస్కృతమూలమునఁ గలప్రధానకథ ననుసరించి పరిమితములగు వర్ణనలతో నీవచనరచన కావింపఁబడినది. ప్రౌఢదీర్ఘసమాసములును, ననుప్రాసప్రయాసములును వీనియందుం గానరావు.

సంహితైకపదే నిత్యా, నిత్యా ధాతూపసర్గయోః
నిత్యా సమాసే, వాక్యేతు సా వివక్షా మపేక్షతే.

సంస్కృతభాషయం దీకారిక వాక్యమునసయితము సంహిత వివక్షాయత్త మని తెలుపుచున్నది. కాని యీపద్ధతి తెలుఁగు భాషయందుఁ దొల్లింటికవు లవలంబించినవారు కారు. గద్యమున నేకవాక్యమందు సంహితను దప్పకపాటించుటయేకాక, రెండువాక్యములు కలయునప్పుడు సయితము విడువరైరి. ఈ కారణముచేఁ బ్రాచీనాంధ్రగ్రంథములం దెక్కడను సంధి విడువఁబడిన గద్యము కాన్పింపదు. ఈ దక్షిణదేశపుటాంధ్ర వచనకావ్యములందుఁ గొన్నింట నట్లుకాక, యుచ్చారణసౌలభ్యముకొఱకై క్వాచితముగాఁ బయికారిక ప్రకారము సంహిత యవివక్షితమై సంధి విడనాడఁబడియున్నది. . కొందఱు లోకవ్యవహారానుగుణముగా నాబాలసుగ్రహమగు తెఱఁగున వచనము రచింపవలయు ననునభినివేశముతోఁ గావలయు శబ్దలక్షణాదికమును సైత మంతగాఁ బాటింపరైరి. ఎంతయేని సలక్షణమును బ్రౌఢమును నగుపద్యకవిత్వమున నాఱితేరిన పుష్పగిరి తిమ్మన్న రచించినవచనమును గొండొకపట్టులందు వ్యాకరణమును నిరాకరించు చున్నది. ఇప్పటికి నాకుఁ జేకుఱిన వచనగ్రంథములలోఁ దొల్తటిది

వచనభారతము

ఈ గ్రంథమునుగూర్చి తెలిసికొనవలసినయంశ మెక్కువ కలదు గావున మునుమున్న యిందలి యాశ్వాసాంతగద్యముఁ జదువుదము.

“ఇది శ్రీరామచంద్రచరణారవిందసేవాభినందనపవననందన వరప్రసాదాసాదిత గీర్వాణాంధ్ర కర్ణాటకాది నానాభాషా కావ్యరచనాచతుర, శ్రీమన్మహారాజాధిరాజరాజపరమేశ్వరరాజమార్తాండ ప్రౌఢప్రతాపాప్రతిమ వీరనరపతిబిరుద తెంబరగండబిరుదాంకిత శంఖచక్రమకరనుత్స్య హనూమద్గరుడ గండభేరుండ సింహశరభసాల్వాది నానావిధదేవార్హ ధ్వజాంకిత యుదవవంశతిలక, అంగ వంగ కళింగ కాశ్మీరలాటాంధ్ర ద్రవిడ ద్రావిడాది నానాదేశాధీశ్వర కిరీటకోట సంఘట్టనత్రస్తనిస్తులనివరత్న పరాగపరాగితనిజభవనద్వారాసక్తానేకజనపాలఫాలతలఘటితాంజలి పుంజ రంజితారవిందక (ప) రాయమాణ సభాస్థానస్థ సింహాసనాధిరూధ నానావిద్వదభీష్ట వరప్రసాద దేవరాజచిక్కదేవరాజకరుణా ప్రాప్త కర్ణాట రాజ్యలక్ష్మీ నృత్యరంగాయమాణ శ్రీరంగపట్టణపరిపాలనాథాదృత 'సైన్యాధిపత్య నిర్వాహక' మహారాష్ట్రమదేభపంచానన, కేళాదివంశాటవీ దావదహన, మథురానాథమదవిమర్దన, జయాఘాటశిరః కందుకక్రీడన, యస మంతరాయ నాసికాకృంతన, నింమోజిసమూలోన్మూలన, దాదోజిప్రాణ హరణ, దండధర ప్రతాప శిలవిఠల ఫాలేరాయ ఫాలాక్షరవిదలన, నానావిధానేకాంతర్బాహ్యాదిశాత్రవ మేఘౌఘ జంఝానిల, పరరాజగర్వాంధ కారవిదళనదినరాజదళవాయి 'దొడ్డరాజతనూజ' యాచకసురభూజ భుజబలాటోప పరాజితారిరాజన్య సమర్పితానేక రత్నరాశియుత ధనకనక వస్తువాహనాదిసువస్తువిస్తారిత సంతోషితాఖిల భూసురాశీర్వాదానువర్ధిత పుత్రపౌత్రాది వంశాభివృద్ధి విరాజమాన, 'కళవేకుల వంశాంబుధి రాకానిశాకర' ఆశ్వలాయనసూత్ర, పరమపవిత్ర భారద్వాజగోత్ర ప్రదీపకాసేతుశీతాచలమధ్యవర్తికా శీప్రభృతిపుణ్యక్షేత్ర నిత్యాన్నదానాద్యనేక ధర్మశాస్త్రోక్తదానదీక్షావిచక్షణ, క్షాత్రాధీశ్వర కార్యఖడ్గప్రవీణ అనవధికా గ్రహారగృహారామక్షేత్రాదిసంతోషితాఖిలకవిరాజ, శ్రీవీరరాజ ప్రణీతం బైనమహాభారత వచనకావ్యమునందుఁ బ్రథమాశ్వాసము."

ఈ చదువఁబడిన గద్యమువలన నీగ్రంథమును రచించిన యాతఁడు మైసూరుప్రభు వగుచిక్కదేవరాయలయొద్ద దళవాయి యయిన దొడ్డరాజు కుమారుఁడగువీరరా జని తెలియుచున్నది. మైసూరుప్రభువులలోఁ జిక్కదేవరాయలు మిక్కిలిప్రఖ్యాతుcడు. ఈతనిఁగూర్చి సంస్కృతాంధ్ర కర్ణాటభాషలలోఁ గొన్నిగ్రంథములు రచింపఁబడెను. తెలుఁగునఁ జిక్కదేవరాయవిలాసమును నింక ననేకచాటుపద్యములును గలవు. ఈతఁడు 1650 తర్వాత 1700 లోఁగా రాజ్యమేలెను. ఇంచుమించుగా మనగ్రంథకర్తయు నాకాలముననే యుండును. ఈకవి తాను ఆశ్వలాయన సూత్రమును భారద్వాజగోత్రమును గల క్షత్రియుఁ డయినట్లు చెప్పుకొనెను. ఈతని దాతృత్వాదికమును, ఈతని జనకుని ప్రతాపాదికమును గద్యమువలనఁ దెలిసికొననగును. ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారమున నప్పకవీయమునకు రూపాంతరమై వీరభూపాలీయ మనునొక లక్షణగ్రంథము గలదు. కూర్చినగ్రంథకర్తపే రందుఁ దెలియుట లేదుగాని యసమగ్రమై యూదిపర్వముమాత్రమే చూపట్టుచున్నది. ఇయ్యది శ్రీకృష్ణాంకితముగాc దేనియ తేటవోలె సారస్యము గల తెలుఁగు వచనమున రచింపఁబడినది. నన్నయాదుల భారతమున కిది దండాన్వయము గాదు. సంస్కృతభారతపు మక్కికి మక్కి గాదు. కథాంశమును జక్కగాc దేటపఱుచు స్వంతంత్రరచనము. ఈకవి తనగ్రంథ ముద్ధతశైలి నుండవలయు నని యపేక్షింపక, సర్వసామాన్యముగా నర్థమగునట్లుండవలయు నని తలంచి, తలంచినట్లే నిర్వర్తించెను. ఈ గ్రంథమున నెక్కడను బిగువుదక్కి నీరసముగా నుండుకూర్పు కాన్పింపదు. కొంతవచనభాగమును మచ్చు చూపుచున్నాఁడను.

"కుమారకా! యేను జాత్యంధుండ నయినను బాండు భూపాలుండు నన్ను మిగులం బూజించె. అది యె ట్లంటేని, లోచనంబులు లేమింజేసి పరదళంబుల మొగ్గరంబులు పన్ని యగ్గలిక మెఱయ గెలువంజాల, స్వరాష్ట్ర పరిపాలనంబున కసమర్దుండ. సాంగంబులుగ వేదంబులను రాజనీతిశాస్రంబులు నధికరించితి. ఎంత యుధికరించిన నేమి ప్రయోజనంబు? క్షత్రియుండగువాఁడు ధర్మమార్గంబుదప్పక సమరంబు గావించి హతుం డయ్యెనేని స్వర్గంబున కరుగు. జయించినఁ గీర్తియును భూమియుం బడయుగావున నాయుధోపజీవుల కాయోధనం బవశ్యకర్తవ్యంబు అట్లు గెలిచి, పుత్త్రులయెడ నైశ్వర్యంబు నిలిపి, వనవాసంబున కరుగగలయు నిట్టి కర్మంబున కే నసమర్థుండ నయినను బాండునృపాలుండు నన్ను రాజ్యంబున నిలిపి, తాను దిగ్విజయంబుసేసి, సకలధనంబులు నా యధీనంబులు గావించె. అతండు నన్నురాజ్యంబున నిలుపుటకు ధర్మంబు కారణం బగుంగాని వేఱొండు నిమిత్తంబు లేదు. క్షత్రియులకుఁ బుత్రు లెంద ఱున్నను, దేజో౽ధికుండ జ్యేష్ఠుం డగుంగాని వయో౽ధికుండు జ్యేష్ఠుండు కానేరండు. అట్లు గావునఁ దేజో౽ధికుం డగుపాండు నృపాలుండు వయఃక్రమంబునఁ గనిష్ఠుండయ్యు జ్యేష్ఠుం డనంబడు, నతనికుమారులు వేదశాస్రంబులు చదివి, సకలార్ధంబులుఁ దెలిసి, గుణంబులం బ్రసిద్దులగుచు నస్త్రాభ్యాసంబు సేసి, లోకద్వయంబునం బూజ్యలగుచు, జనులు తమయెడ ననురాగంబు సేయ మెలఁగుచున్నవారు. ధర్మపౌరుష ప్రభావంబుల వార లధికులై యున్నయెడ వారల నెట్లు నగరంబు వెలువరింపించి వారణావతంబునకుం బనుపువాఁడ, నట్లు పనిచినను లోకంబునం గలజనులు నిందింపకుందురె?"

(ఆదిపర్వము-నూటముప్పది తొమ్మిదవ యధ్యాయము.)

ఈ వచనము సంస్కృతభారతమునఁ గల్గు విషయములన్నియును గల్గి, యాంధ్రభారతముకంటె మిక్కిలి విపులముగా నున్నది. ఈచదువcబడిన భాగము నన్నయార్యుని రచనమున నత్యల్పమగునట్లు సంకుచింపఁబడినది. విస్తరభీతిచే దానినిగూడ నిం దుదాహరింప మానితిని. సంస్కృత భారతప్రకార మధ్యాయవిభాగముతో నీయూదిపర్వము మూఁడాశ్వాసములుగా విభజింపఁబడినది. ఆశ్వాసాద్యంతములందుఁ బద్యములు కలవు.

ఈ గ్రంథమునందుఁ గొంత ప్రాచీనప్రయోగసరళి కన్పట్టుచున్నది. (1) అమ్మహాసంగ్రామంబునకుం గూడిన పదునెనిమిది యక్షౌహిణుల రాజులును కాలవశంబునం జని రందులకు సుయోధనుండు హేతువై నిల్చుటంజేసి యజ్ఞానంబునం దన కేమియుఁ దోఁచదయ్యె నెంత తెలిసెద నన్నం దెలివి సెందఁజాలక యున్నవాడ. (2) సూతనందనా! యింతకార్యంబు నడచిన పిమ్మటఁ దాను బ్రతికియుండుటకు ఫలంబు లేశంబునుం గాన (ధృతరాష్ట్రునిపల్కులు) (3) ఓ డుండుభంబ! తొల్లి యొక దుష్టభుజంగంబు తనకుఁ బ్రాణపదం బయినప్రమద్వరకుఁ గీ డాచరించె (రురునిపల్కు)

ఇట్టి వాక్యములందు ‘నేను' శబ్దము ప్రయోగింపఁబడు. పట్టులందుఁ 'దాను' శబ్దము ప్రయోగింపఁబడినది. పూర్వకవుల రచనలం దిట్టి ప్రయోగములు కలవు.

(1) ఈ ప్రబంధముం-దన కిపు డంకితంబుఁ బ్రమదంబునఁ జేయుము.

(ప్రౌఢకవిమల్లన)

(2) అత్యుగ్రబాణశక్తిఁ దన్నుఁ బంపు దేవ (మన్మథుని పల్కు) (నన్నిచోడదేవుఁడు) ఇట్లు కొంత ప్రాచీనప్రయోగసరణి కలదు.

మఱియు

(1) శంతనునరపాలుఁ డేకాంతంబున నేకాంతం గనుఁగొని మరులుకొనియె యథార్ధంబునఁబలుకరింపు మన సూతుం డిటులను,

(2) నే నిక్కన్నియకు జనకుండ నగుటం జేసి పలుకరించెద నాకర్ణింపుము -ఇట్లు పెక్కువాక్యములందు 'పలుకు' ధాతువు ప్రయోగింపఁ బడునెడ 'బలుకరించు' ధాతువు ప్రయోగింపఁ బడినది. ప్రాచీనగ్రంథములఁ దిట్టి ప్రయోగములు కలవో యని సందియ మగుచున్నది. ప్రయోగ వైచిత్ర్యము లిట్టివి కొన్ని గలవు.

మఱియు నిందుఁ దత్సమక్రియలకు శత్రర్ధమున నింపు గాగమము తఱచుగాఁ గావింపఁబడినది. దక్షిణదేశపుఁ బ్రబంధములం దెల్ల నిట్టి ప్రయోగములు కుప్పతెప్పలుగాఁ గలవు. ఆంధ్రదేశమందు రచింపఁబడిన వసుచరిత్రాది ప్రబంధములందును గలవు. పెద్దనామాత్యుఁడ కూడ 'ఇంపు మీఱంగ ధాత్రి పాలింపుచుండ' అని ప్రయోగించెను. ఇది ప్రాచీన కవిసమ్మతము కాదు.

అమహదర్థక మగుతచ్ఛబ్దమునకు 'వాటిని' మొదలగు రూపములు గూడ వాడఁబడినవి. అయ్యవి యసాధువులు. ఇంక నెందేనిఁ జిన్ని చిన్ని దోషము లిట్టివి మఱికొన్నియు నుండిన నుండఁబోలును. బహుస్థలములందుఁ జూపట్టు చుండుటచేఁ బైప్రయోగములు గ్రంథకర్తృ కృతములే యని చెప్పవలసియున్నది. ప్రాయికముగాఁ దాళపత్ర సంపుటములు లేఖకదోషభూయిష్ఠములై యుండును. అట్టి దోషములను గూడc దద్గ్రంథకర్తలకుం దగిలింపరాదు. ఈ వచనభారతము నీవీరరాజును మఱికొందఱును గలసి పూరించిన ట్లున్నది. తంజాపురపు సరస్వతీభాండాగారమున వచనాత్మకములగు శాంత్యానుశాసనికపర్వములు క్రమముగా నారాయణ తుపాకుల యనంతభూపాలక కర్తృకము లయినవి కలవు. ఇక్కడి యీయూదిపర్వము నందుఁగూడ వీరరాజు నాశ్వాసాంతగద్యమునం దొక్కచో నడుమఁ దుపాకులయనంతభూపాలకుగద్యమును వ్రాయబడియున్నది. ఈ తుపాకులయనంతభూపాలకుcడు మధురరాజులయొద్ద దళవాయి యని తెలియుచున్నది. ఈతఁడును వీరరాజుసమకాలపువాఁడే కాcదగును. అనంతభూపాలకకర్తృకము లయిన వచనకావ్యములు మఱికొన్ని గలవు. అందు విష్ణుపురాణము, భగవద్గీత యనుగ్రంథములు ప్రాచ్యలిఖితపుస్తక భాండాగారమునం దున్నవి. విష్ణుపురాణ మాఱాశ్వాసముల గ్రంథముగా రచింపఁబడినది. వెన్నెలకంటి సూరనార్యుని విష్ణుపురాణముకంటె నియ్యది కడువిపులమై సంస్కృతమూలము ననుసరించుచున్నది. ఈ కృతియును శ్రీకృష్ణునకే సమర్పింపcబడెను. ఈ విష్ణుపురాణవచనము ధారాళ మగురచన గల్గి యించుక ప్రౌఢమై మిక్కిలి చక్కఁగ నున్నది. వచనభారత మందువలెఁ గాక యిందు సంస్కృతసమాసములు కొండొక మెండుగాఁ జూపట్టుచున్నవి.

ఇంచుక మచ్చు చూపుచున్నాఁడను.

“అంత శ్రీకృష్ణుండు విమలతరచంద్రికాసాంద్రంబును, హృదయానందకరంబునై, వికసితనీలోత్పలకుముదసౌరభంబులచే దిగంతంబులఁ బరిమళింపఁ జేయునట్టి శరత్కాలంబున నుత్పల్లకుసుమవాసనాసక్తంబులై ఝుంకారం బొనర్చునట్టి తుమ్మెదలమొత్తంబుచే నలంకృతంబును విహారయోగ్యంబును నగుబృందావనంబుం గనుంగొని, యుచ్చట గోపవనితానికరంబులతోడఁ గూడి రమియించి, వారల మనోరథంబులు నెఱవేర్పందలంచి, యొక్కనాఁటి రాత్రియందు నొక్కరుడ, నవరత్నఖచిత దివ్యాభరణభూషితుండును, దివ్యచందనచర్చితగాత్రుండును. మనోజ్ఞ కుసుమమాలికాధరుండును నై వనంబునకుం జని, జగన్మోహనంబును, నవ్యక్తమధురంబును, నమృతోపమానంబును మాత్రాలయసమన్వితంబును నగువేణుగానం బొనర్చుటయు, సర్వభూతమనోహరం బయినయమ్మురళీ నాదం బాలకించి గోపాంగనలు మదనబాణవిదళితహృదయలై యవ్వసుదేవ నందను సమీపంబున కరుదెంచిరి. అం దొక్కసుందరి నిజగృహంబునంద యుండి శ్రీకృష్ణుని వేణునాదంబున కనురూపమును, నవ్యక్తమధురంబునుగా మెల్ల మెల్లన గానంబు గావించె."

(అయిదవయాశ్వాసము 13వ అధ్యాయము)

ఈతని గద్య మిట్లున్నది.

"ఇది శ్రీనందనందనచరణారవిందమత్తమధుకరాయమాణచిత్త చతుర్విధకవితాసామ్రాజ్యభోజ చంద్రగిరికృష్ణభూపాలక తనూజ భాగమాంబా గర్భశుక్తిముక్తాఫల తుపాకుల యనంతభూపాలక ప్రణీతం బైనవిష్ణుపురాణఁ బునందుఁ బ్రథమాశ్వాసము"

వచనభారతకర్త యయినవీరరాజు కుమారుం డగునంజరాజుచే సయితము పెక్కులు వచనకావ్యములు రచింపఁబడెను. నంజరాజు మైసూరురాజునొద్ద మంత్రియై మిక్కిలి యెన్నిక కెక్కినవాఁడు. ఈతని నుద్దేశించి సంస్కృతమున నభినవకాళిదాసబిరుదాంకుఁ డగునృసింహకవిచే నంజరాజయశోభూషణ మనుపేరఁ బ్రతాపరుద్రీయమునకుఁ బ్రతిబింబముగా నొకయలంకారశాస్త్రగ్రంథము రచియింపఁబడెను. తద్గ్రంథకర్త గ్రంథావ సానమున నిట్లు చెప్పకొన్నాఁడు.

శ్లో|| ఆలూరితిర్మలకవే రభినవభవభూతినామబిరుదస్య
      సుహృదా నృసింహకవినా కృతి రకృత నవీనకాళిదాసేన.

ఈ యభినవకాళిదాసు దైనందినప్రబంధనిర్మాణసాహసికుఁడఁట! నంజరాజయశోభూషణము ప్రౌఢరచన గల గ్రంథము. నంజరాజుచే రచింపబడిన వచనకావ్యములందు హాలాస్యమాహాత్మ్యము, విష్ణుభక్త విలాసము, హరభక్తవిలాసము, కాశీమహిమార్ధదర్పణము ననునవి నాకుc జేకుఱినవి. హాలాస్యమాహాత్మ్యమున నీనంజరాజు తనతండ్రిని

ఉ|| ఆదళవాయి దొడ్డవసుధాధిపమౌళికిఁ గల్గె సజ్జనా
      హ్లాదకరుండు షోడశమహాద్భుతదానధురంధరుండు తే
      జోదిననాథుఁ డంచితయశోధవళీకృతసర్వదిక్తటుం
      డాదినృపాలసన్నిభుఁ డుదారుఁడు వీరనరేంద్రుఁ డున్నతిన్||

అని వర్ణించెను. ఈతనికబ్బములలో హాలాస్యమాహాత్మ్యము స్కాందపురాణ మందలి దక్షిణమధురాపురీమహిమమును దెలుపు హాలాస్యఖండమునకు సరిగాఁదెలుఁగున రచియింపఁబడినదెబ్బదిరెండధ్యాయముల వచన కావ్యము. నంజరాజకవి వచనరచన మించుక ప్రౌఢమై మిక్కిలి చక్కఁగనే యున్నను వచనభారతశైలికిఁగొండొక వెన్బడుచున్నది. అందందు, వ్యాకరణాపాకరణము లేకపోలేదు. ఈకవినిగూర్చి శ్రీవీరేశలింగము పంతులుగారు కొంత వ్రాసియున్నారు. గ్రంథవిస్తరభీతిచేఁ దక్కినగ్రంథముల వదలి హాలాస్యమాహాత్మ్యమునుండియే మచ్చున కించుక వచనభాగమును జదివెదను.

"ఆసిద్దండు భయభక్తియుక్తుం డగురాజుం గనుంగొని వాంఛితార్థమ్ము వేఁడుకొ మ్మనుచుఁ బలుక నమ్మహీపాలుం డతనికిం బ్రణమిల్లి యంజలి గావించి సద్గుణవంతుc డగుపుత్రుం గరుణింపు మని యభ్యర్ధింప సిద్ధవేషధరుండును సచ్చిదానందస్వరూపుండును భగవంతుండు నగుహాలాస్యనాథుండు ఓయి పాండ్యభూపాలకా! నీ కత్యంతైశ్వర్యసమేతుం డగుపత్రుండును గీర్తియు దీర్గాయుష్యంబును గడపల శాశ్వతం బగుముక్తియుం గలుగుంగాక యని వచియించి, గజముఖంబువలన నేకావళియుc దీసి యిచ్చి, యాశీర్వాదంబులచేత నతనిం బ్రమోదంబు నొందించి, కరమ్ములఁ దదీయశరీరమ్ము నివిరి, ముహూర్తమాత్రమునం దదృశ్యుఁ డగుటయు భూపాలుం డాసిద్దుని విచిత్రం బవలోకించి యిది సుందరేశ్వరువినోదం బని మనంబునం దలంచినవాఁడై లింగమూర్తిధరుం డగునమ్మహాదేవు సాన్నిధ్యంబున కరిగి భక్తిచేత నమస్కరించి యి ట్లని వినుతించె."

(ఇరువదియేడవ యధ్యాయము)

ఈ నంజరాజు కర్ణాటభాషయందు భారతేతిహాసమును వచన కావ్యముగా రచించెను. అదియును బ్రాచ్యలిఖితపుస్తక భాండాగారమునఁగలదు.

ఈకాలముననే మథురాపురీనాథుడైనవిజయరంగ చొక్కభూపాలకునాదరమునఁ బెక్కులు వచనకావ్యములును బద్యకావ్యములును రచింపcబడినవి.

రాజరాజనరేంద్ర, కృష్ణరాయు, రఘునాథరాయాదులవలె నీప్రభురత్నమును నాంధ్రకవీశ్వరుల కాలంబమై 1704 మొదలు 1731 వఱకు రాజ్య మేలెను. శేషము వెంకటపతి మొదలగువా రీతని యాస్థానకవులుగా నుండిరి. అహల్యాసంక్రందనవిలాసమును రచించిన సముఖమువెంలటకృష్ణప్పనాయకుం డీతనికొల్వున నున్నవాఁడు. అహల్యాసంక్రందనవిలాసమున

గీ|| 'సముఖమీనాక్షినృపగర్భవిమలజలధి
      చంద్ర! వేంకటకృష్ణేంద్ర! శౌర్యసాంద్ర!
      మునుపు జైమినిభారత మనఘ! వచన
      కావ్య మొనరించినట్టిసత్కవివి కావె' ||

అని తారాశశాంకవిజయ మొనర్చిన శేషమువేంకటపతి మెచ్చినట్లు వెంకటకృష్ణప్పనాయకుఁడు చెప్పుకొన్నజైమినిభారతవచన మిప్పు డీయాంధ్ర సాహిత్యపరిషత్తువారిచే దక్షిణదేశమునుండి సంపాదింపఁబడిన తాళపత్ర గ్రంథములందుఁ గలదు. ఈతనిచే రాధికాసాంత్వన మనునేకాశ్వాస క్షుద్రప్రబంధము రచింపఁబడినది. కొంతకాలముక్రింద నాతాళపత్రగ్రంథమును విక్రయించుటకై యొకరు ప్రాచ్యలిఖిత పుస్తకభాండాగారమునకుఁ గొనివచ్చిరి. దానిని నేను జూచితిని. ముద్దుపళని రాధికాసాంత్వనమం దిందలి పద్యము లన్నియుఁ గలవు. మఱికొన్ని పద్యము లెక్కువగాఁ జేర్పఁబడి నాల్గాశ్వాసములుగా ముద్దుపళని గ్రంథము విభక్త మయి కన్పట్టుచున్నది.

విజయరంగచొక్కభూపాలకు నాస్థానముననే కవీశ్వరుఁడుగా నున్న వెలగపూడికృష్ణకవిచే వేదాంతసారసంగ్రహ మను వచనకావ్య మొకటి రచింపఁబడెను. అది నాకుఁ జేకుఱలేదు. ఈవిజయరంగచొక్క భూపాలకుఁడు సయితము శ్రీరంగమాహాత్మ్య మనువచనకావ్యమును రచించెను. ఈవచన మంతగా నిర్దుష్ట మన వలనుపడదు.

సులువుగా నర్థ మగునట్లు వ్యావహారికశైలిని రచింపఁబడినది. ఇంచుక యుదాహరించెదను.

"అంత నవి యన్నియు దేవేంద్రుఁడు విని కోపము చేసికొని ఐరాతము నెక్కి వజ్రాయుధమును దూసికొని దేవతలనెల్ల సహాయముగాఁ గూర్చుకొని ఆరా జుండుతపస్థ్సలంబునకుం జనె. అప్పడు ఇక్ష్వాకు మహారాజు పూజాద్రవ్యముల నెత్తుకొని దేవేంద్రునికి నెదురుగాఁ బూజచేసెను. అప్పు డాదేవేంద్రుఁడు ఏకకాలంబుగాఁ గొండలుకొట్టే వజ్రాయుధమును జేతఁదీసికొని కొట్టెను. ఆదెబ్బశబ్దమునకు రాజైనతాను ఇసుమంతైన మనస్సు చలించక శ్రీమన్నారాయణమూర్తియం దుండెడు చక్రమును ధ్యానము చేసెను." ఈగ్రంథము లేఖకదోషములతో నిండియున్నది. ఇంచుక సంస్కరించి యీభాగమును మచ్చు చూపితిని. ఈవిజయరంగచొక్కభూపాలుకాలమున నింక ననేక వచన కావ్యములు రచింపఁబడినవి. మిత్రవిందాపరిణయమును రచించిన కుందు వెంకటాచలకవియు నీతని యాస్థానమం దున్నవాఁడే, ఈతcడు

సీ|| "చదివినా వేమేమి చదువ యోగ్యంబులో
                  యవి యెల్ల నిస్సంశయంబు గాఁగ,
       వచనకావ్యములుగా రచియించినావు భా
                 రతభాగవతములు రామకథయు.”

అని విజయరంగచొక్కభూపాలుఁడు తన్నుమెచ్చినట్లు చెప్పుకొనెను. ఈతని భారత, భాగవత, రామాయణ వచనములు మనకు లభింపవలసి యున్నవి.

పదపడి సమీరకుమారవిజయ మను ప్రౌఢప్రబంధ మొనర్చిన పుష్పగిరితిమ్మనార్యుఁడు భాగవతసార మను వచనకావ్య మొనర్చెను. ఉత్తరరామాయణము నొనర్చినకంకంటిపాపరాజకవి కీతఁడు మిత్రము. ఈతని భాగవతసారము సంస్కృతాంధ్రభాగవతములకు మిక్కిలి సంగ్రహముగా నున్నది. ఇందలివచనశైలి మిక్కిలి తేలికగాc దేటగా నింపు గూర్చుచున్నది. రచనాప్రౌఢిమ నీగ్రంథమందు తిమ్మకవి చూపలేదు. వ్యాకరణమును మీఱిన ప్రయోగము లందం దిందుఁ గన్పట్టుచున్నవి. ఇంచుక మచ్చు చూపుచున్నాఁడను.

భాగవతసారము

షష్ఠస్కంధము

“ఆలో యమకింకరులు అఘోరయమపాశమున నతనిని గట్టిగాఁగట్టి, కొంపోవ నుద్యోగించఁగా, నంతలో ఆజానుచతుర్బాహులు, నీలమేఘశ్యాములు, సుగుణాభిరాములు, అమితదయాళురు, విష్ణుదూతలు వచ్చి, ఆపాశము త్రెంచి పాఱవైచి, యమదూతలఁ బాఱఁద్రోలి, యాతనా శరీరధారి యైనయజామీళుని వెఱవకు మని అభయమిచ్చి, యాదరించి పలికిరి. యమభటులును దిట్టలుగనుక, వెనుకకుఁబోయి మఱలివచ్చి, ఆ మకరకుండల, కిరీట, హార, కేయూర, వైజయంతీ, వనమాలికా భరణులైన విష్ణుదాసులఁ జేరవచ్చి 'అయ్యా మీ రెవ్వరివారలు? మమ్మెఱుంగరా పాపకర్మునిఁబట్టి మేము కొంచుకుపోవఁగా అడ్డగించ మీకుఁ బని యేమి యున్నది. యమునిశాసనము మీకు నవ్వులాయెనా?" అనఁగా శ్రీమన్నారాయణుని కింకరులు పలికిరి. "రారోయి యమభటులారా! మీరు ధర్మరాజుదూతలు గనుక గుణవంతులు. మీపలుకులయందుఁ గఠినత్వము లేదు. ఈ బ్రాహ్మణుండు దురాచారి యగును. ఇతండు దండింపఁదగియుండియు దండనకుఁ దగనివాఁడైనాఁడు. దండార్హుం డెవ్వండు? దండింపఁదగనివా డెవ్వండు? ఆత్మకు కర్మానుభవము ఎటువలె కలుగును? వినిపింపుం డనిన కేలుపుణుకుచున్ను యమదూతలు పలికిరి, వినరయ్యా మహాత్మురారా! శ్రీభగవంతునియొక్క వాక్యములు వేదములు. అందు చెప్పఁబడ్డది ధర్మ మనఁబడును. వేదమార్గము తప్పిననే అధర్మమగును. ధర్మమున సుఖమును అధర్మమున దుఃఖమును ప్రాణులు పొందుదురు. ప్రాణి చేసినపాపపుణ్యములకు సాక్షులు సేనా యున్నారు. కర్మ మేవేళ జీవుఁడు సేయునో ఆకాలమే కర్మమునకు సాక్షియై యుండును. కాఁబట్టి తప్పించుక పోఁగూడదు."

ఈ కవియే రచించిన సమీరకుమారవిజయమందున్న వచనమును గూడ నించుక చదివినచో నాతనికి భాగవతసార మెంత తేలికగా నర్థమగునట్లు రచింపవలయు ననునభినివేశము కలదో తేటపడఁగలదు.

సమీరకుమారవిజయమందలి వచనము

“ఇప్పగిది నప్పరమపావనుం డప్పు డుప్పరంబునఁ గప్పుజిగి గప్పిన నాయొప్పిదంబు విప్పగుమెప్పునం దప్పక చూచి ముప్పిరిగొను భక్త్యనురాగసంభ్రమంబుల మత్పరాయణుం డగుటంజేసి యచ్చోటు వాసి మదీయసన్నిధిఁ బెన్నిధిఁ గన్న పేదచందంబున డెందంబు గందళింపఁ దనమనోవృత్తి ననుసరించు శరీరంబు సభృత్యపరివారంబుగా మఱిచి దూరంబున నున్ననన్నుఁ జేరంబూని కూర్చున్న యటుల తద్గగనంబున కుద్గమించునయ్యంచితాత్ము సంచరణంబున."

మనుచరిత్రమునకుఁ దర్వాత రచింపఁబడుచు వచ్చిన ప్రబంధము లందలి గద్యములు తఱచుగా నీ తెఱఁగుననే యుండును.

ఈ తిమ్మకవియు దక్షిణదేశవువాఁడో యని సందియము కలుగు చున్నది.

ఎరశూర్ యమ్మావాద్యార్ చిన్నయ యనునతఁ డీతని భాగవత సారమును ద్రావిడభాషలోని కనువదించెను. ఆ ద్రావిడానువాదమున నిట్టు కలదు. "ఇందె పన్ని రెండు కందంగళుం, శ్రీకృష్ణప్రీతియాయ్, తెలింగిలెయుం పుష్పగిరి తిమ్మయ్యర్ పణ్ణినది పార్తు ఎరశూర్ యమ్మావాద్యార్ శిన్నయ్య తమళ్ వచన మాహ పణ్ణినదు."

ఈ పుష్పగిరి తిమ్మకవి 18వ శతాబ్ది మధ్యమున నున్నవాఁ డని శ్రీవీరేశలింగము పంతులవారు వ్రాసియున్నారు. కంకంటి పాపరాజు నుత్తరరామాయణమునకు, విష్ణుమాయావిలాసమునకు, నీకవి సమీర కుమారవిజయమునకు నూఱు సంll పైబడినకాలమున వ్రాయఁబడిన భిన్నదేశపుcదాళపత్రప్రతులు ప్రాచ్యలిఖితపుస్తకభాండాగారమునఁ గలవు. 200 సం|| పూర్వము వ్రాయఁబడిన తాళపత్రపుఁబ్రతులు నైజాం దేశమునందు బ్రహ్మశ్రీమానవల్లిరామకృష్ణకవిగారు సంపాదించినట్లు చెప్పుచున్నారు. భాగవతసారపు ద్రావిడభాషానువాదమునకే ప్రాఁబడిన తాళపత్రప్రతులు చూపట్టుచున్నవి. కావునఁ గంకంటి పాపరాజకవియు, పుష్పగిరి తిమ్మకవియు, నంతకంటెఁ బూర్వులై యుందురు. తిమ్మకవి భాగవతసారము ప్రాచ్యలిఖిత పుస్తకభాండాగారమున నసమగ్రముగాఁ గలదు. మీఁదఁ బేర్కొనఁబడినవిగాక తంజాపురపు సరస్వతీ భాండాగారమునఁ గొన్ని వచనకావ్యములు గలవు. త్రికామకవి ధేనుమాహాత్మ్యము, పరమానందతీర్థుల బ్రహ్మవిద్యాసుధార్ణవము మఱియు మైరావణచరిత్రము, వివేకచింతామణి, వివేకసారము మొదలగువచనగ్రంథము లచ్చటి పుస్తకసూచియందుఁ గన్పట్టుచున్నవి. ఆ గ్రంథములఁ గూర్చియుఁ దత్కర్తలగూర్చియు దద్గ్రంథములఁ బరిశీలించిన పదపడిగాని తెలుప వలనుపడదు. 17, 18వ శతాబ్దులం దింకను గొన్ని వచనకావ్యములు దక్షిణదేశమున నుప్పతిల్లియుండును.

భారతసావిత్రి, గోవ్యాఘ్రచరిత్రము మొదలగు కొన్ని చిన్ని చిన్ని వచనగ్రంథములను, మనకుటుంబములందు వృద్ధపరంపరగా స్త్రీపురుషులు కంఠపాఠముచేసి భగవద్గీతవోలెఁ బ్రతిదినమును బారాయణము సేయుచుందురు. ఏనాఁ డెవ్వరిచే రచింపబడెనో తెలియరాదు గాని యావచనములు చక్కనికూర్పు గల్గి మధురములై యొప్ప లొల్కుచున్నవి. భారతసావిత్రినుండి యించుక యుదాహరించుచున్నాఁడను.

“సుయోధనా! ఆదరంబుమీఁద నొసంగినశాకమాత్రం బేనియు మనంబున కమృతోపమానంబై చను. భక్తి లేక యిచ్చిన నమృతంబయినను నిస్సారంబై చను. నాపలుకులు వినఁ గలవాఁడ వైతేని నీదురభిమానంబు విడిచి పాండునందనులకు రాజ్యంబు సమభాగంబుగాఁ బంచి యిచ్చి మీరు నూర్వురు వా రేవురుఁ గలసి యేకీభవించి యుండుట కార్యంబు."

ప్రాచ్యలిఖితపుస్తక భాండాగారమున నొండు రెండు శతాబ్దులకు మున్ను దక్షిణదేశమునఁ గేవలవ్యావహారిక భాషలో రచింపఁబడిన వచనగ్రంథములు కొన్ని సేకరింపఁబడియున్నవి. విస్తరభీతిచే వానినిం గూర్చి యిచ్చట ముచ్చటింప మానితిని.

తొంటికాలమున సర్వలోకసామాన్యముగా నర్థ మగుటకై యెంత పండితు లయినను వ్యాఖ్యానాది గ్రంథముల రచియించునప్పుడు కేవలవ్యావహారికభాషనే యుపయోగించుచుండెడివారు. సర్వలక్షణసార సంగ్రహమొనర్చి ప్రసిద్ధి కెక్కినచిత్ర కవిపెద్దన్న (హరిశ్చంద్రనలోపాఖ్యానవ్యాఖ్యాత) తాళ్లపాక తిరువేంగళనాథుఁడు (అమరకోశవ్యాఖ్యాత) మొదలగులాక్షణికు లగుప్రాచీనవ్యాఖ్యాత లెల్లరును దమగ్రంథములందు సంస్కార శూన్య మయిన యీభాషనే యుపయోగించుచువచ్చిరి. అప్పటి యావచనరచన లందును గొంతవఱకు వ్యాకరణనిరాకరణ మీకారణముచేతనే సమకుఱి యుండు నని యీవఱకే వాకొనియుంటినిగదా!.

19వ శతాబ్దినుండి మనదేశమున వచన రచన యుపక్రమింపఁ బడినది. చిన్నయసూరిగారు 19వ శతాబ్ది ప్రారంభమునఁ జెన్నపురమునఁ ప్రఖ్యాతపండితులుగా నుండిరి. వీరినాcటనుండియుం గల్పితవచన గ్రంథములు మిక్కిలి వెలువడఁజొచ్చినవి. వారివచనరచన మిక్కిలి సరసమై ప్రౌఢమై సర్వాతిశాయి యై తర్వాతివారి రచనలకు మార్గదర్శక మైనది. ఇంతకంటె సుప్రసిద్ధ మగువీరిరచననుగూర్చి చెప్పఁ బని యుండదు.

చిన్నయసూరిగారి కాలమునఁ జెన్నపురముననే కోలాశేషాచలకవి యను నాతఁడు గోడే వెంకట జగ్గారాయలవారికిఁ గృతిగా నీలగిరియాత్రా చరిత్ర మనునొకహృద్య మగు గద్యప్రబంధమును గల్పించెను. ఈకవి రచన చిన్నయసూరిగారి త్రోవను వెన్నాడుచు మిక్కిలి చక్కగా నున్నది. అతిశయోక్త్యాదికావ్యాలంకారంబులం దొఱంగి కలరూ పెఱింగించువేడ్క నిఖిలజనసుబోధం బగునట్లుగా రచించిన ట్లాతఁడు చెప్పికొనియెను.

ఇంచుక చదివెదను.

"నావిడిదల యగునిలు సొచ్చినయనంతరంబ యెచ్చటఁ గూర్చుండిన నెచ్చటఁ గ్రుమ్మరిన నెద్ది యంటిన నాసర్వం బతిశీతలం బయి గోచరించె నంతఁ గొంతతడవునకె చలి మొలతెంచె. మార్గశ్రమంబున న్విడిదల ప్రవేశించు సమకాలంబునన శీతంబు గోచరింప దయ్యె నని తోcచెను. మఱునాఁడె నాకును నాబాసటయయి వచ్చిన శ్రీనివాస మొదలారికిని స్వదేశంబునుండి కొంపోయిన చలితొడుగు లొడళ్లం దొడిగికొనవలసివచ్చె అచ్చట నగ్ని యొకండు దక్క నెల్లపదార్ధంబులు నతిశీతలంబు లయి యున్నయవి. కొన్నిపదార్ధంబులు మంచుగడ్డలంబోలి శీతంబుచే దుస్స్పర్శంబు లయి యున్నయవి. టెంకాయనూనియ నేతి తెఱంగునం బేరుచున్నది. వార్చినతోడన పులియయందు వడ్డించిన యన్నంబు కొంత ఘృతవ్యంజనాదులతోడ మొదల భుజించి యెడఁ గలుగఁ ద్రోచి యుంచిన యవశిష్టాన్నంబు భుజియింపఁ బోయిన నొకానొకప్పుడు పర్యుషితకల్పం బయి కానంబడియెడు, మఱియు నచ్చటిచలి రేవగళ్లు హూహూకారంబుఁ బుట్టించుచున్నయది."

స్కాందపురాణాంతర్గత మగుశివరహస్యఖండము ముదిగొండ బ్రహ్మయ లింగారాధ్యకవిచే వచనకావ్యముగా రచింపఁబడెను. ఈ రచన మించుమించుగాఁ జిన్నయ్యసూరిగారికాలముననేయాంధ్రదేశమునరచింపఁ బడియుండును, కవివిషయ మంతగాఁ దెలిసినది గాదు. ఈ రచన మనుప్రాసక్లేశము గల్గి తత్సమపదబహుళమై యించుకక్లిష్టముగనే యున్నను నిర్దుష్ట మైనట్లు కన్పట్టుచున్నది. ముద్రితమై విక్రయింపఁ బడుచున్న యీగ్రంథమునుండి యుదాహరణ గైకొనలేదు.

చిన్నయ్యసూరిగారితర్వాతప్రెసిడెన్సీకాలేజీయం దాంద్రోపాధ్యాయులుగా నున్న చెదలువాడ సీతారామశాస్త్రిగారు కొన్ని సంస్కృతనాటకాదులను కథలుగా వచనమున రచించిరి. తేలికపలుకులతోఁ చక్కఁగా నర్థ మగుచు నీవచనరచన యింపు గూర్చుచున్నది. చిన్నయ్యసూరిగారికిఁ దర్వాతివచనగ్రంథకర్తలందు సంహితను బాటింపక సంధి విడఁగొట్టి వాక్యములఁ గూర్చినవారిలో వీరు తొల్తటివా రని చెప్పఁ జెల్లును. వీరి గ్రంథములును ముద్రితములై యున్నవి గావున రచన నుదాహరింపలేదు. పదపడి నాఁడునాఁటికి నాంధ్రవచనరచన క్రొత్తక్రొత్తయై పలుదెఱఁగుల వెలయుచున్నది.


  • * *