6

భాగవతము

అష్టాదశపురాణములలో భాగవత మొకటిగాఁ బేర్కొనఁ బడినది. విష్ణుభాగవత మష్టాదశపురాణములలోనిది గా దనియు బోపదేవుఁడు దానిని గల్పించె ననియుఁ గొంద ఱందురు. పదుమూఁడవశతాబ్దిలోఁ బ్రఖ్యాతాంధ్రకవీశ్వరుఁడుగా నుండిన పాల్కురికిసోమనాథుఁడు విష్ణుభాగవతము కల్పిత మన్నాఁడు. ఎవ్వ రేమన్నను విష్ణుభాగవతము మిక్కిలి ప్రఖ్యాతిని గడించినది. అష్టాదశపురాణములలోను దాని కున్నంత గౌరవము మఱి యేపురాణమునకు లేదు. సంస్కృతమున దాదాపుగా నలువదివ్యాఖ్యానములు దానికున్నవి. సర్వభాషలలోను నది పరివర్తిత మయినది. తెలుఁగుపరివర్తనములఁ గూర్చి నే నిక్కడ గొంత పేర్కొందును.

పోతన-సింగన

పదునైదవశతాబ్దిపూర్వార్ధమున భాగవతము నిర్వురుకవీశ్వరులు తెలిఁగించిరి. అం దొకఁడు బమ్మెర పోతరాజుగారు. ఈయన కృతి జగత్ప్రసిద్ధమేకదా! రెండవవాఁడు మడికి సింగనార్యుఁడు. ఈతఁడు దశమస్కంధముమాత్రమే ద్విపదకృతిగాఁ దెనిఁగించినాఁడు. అది తంజావూరుపుస్తకశాలలో నున్నది. అది యింకను నాంధ్రలోకమునఁ బ్రకటితము గాకుండుట శోచనీయము.

పోతరాజుగారిభాగవతము సమగ్రముగా లభించిన ట్లీనడుమ నొకప్రవాదము పుట్టినది. ఆంధ్రసాహిత్యపరిషత్పుస్తకభాండాగారమున కది చేరినదఁట! కాని యాపుస్తకభాండాగారమున నది కానరాదు. అట్టిది దొరకియుండ దనుకొనెదను. ఏల యనఁగా పోతరాజుగారికిఁ దర్వాత నించుమించుగా నలువదియేcబది యేండ్లకె యాయన గ్రంథమందలి లుప్తభాగముల నితరులు పూరించిరి. పోతరాజుగారికిఁదర్వాత నలువదియేcబదియేండ్లకే లభింపనియాభాగము లిప్పుడు లభించిన వనుటను ప్రత్యక్షముగా నాగ్రంథమును జూచినప్పడు కాని విశ్వసింపరాదు.

పోతరాజుగా రేకశిలానగర (ఓరుఁగల్లు) వాస్తవ్యులు. ఆకాలమున నానగరము విప్లవములపాలయి యుండెను. విద్యావినోదముల కప్పు డక్కడ వెరవులేదు. ఈకారణమునఁ గొన్నాళ్లదాఁక నాగ్రంథము నెవరుఁ దాఁకరయిరి. పరిశీలనము లేకపోవుటచేఁ గాఁబోలు నది కొంతశిథిల మయినది. రాజున కంకిత మిచ్చినచో నాతఁడు పదిప్రతులు వ్రాయించి పదువురచేఁ జదివించి వ్యాప్తికిఁ దెచ్చియుండెడివాఁడు. పోతరాజుగా రట్టు చేయరైరి సరిగదా మఱియు నట్టివారిని దిట్టిరి. సర్వజ్ఞసింగభూపతి కుపితుఁడై యాగ్రంథమును బూడ్పించినాఁ డనికూడఁ బ్రతీతి కలదు. కాని దాని మనము విశ్వసింపరాదు. ఆయన దానివ్యాప్తికిఁ దోడు పడకుండవచ్చును. పోతరాజుగారు క్రీ 1420 ప్రాంతములం దుండిరి. క్రీ 1490 ప్రాంతములందుఁ గల హరిభట్టు పోతరాజు గారిభాగవతమున లోపించినభాగములను (షష్ఠస్కంధము ఏకాదశద్వాదశస్కంధములు) పూరించినాఁడు. పోతరాజుగారిగ్రంథము సమగ్రముగా నాకాలమున లభించుచుండినచో నాతఁ డాస్కంధములఁ బూరింపఁ బూనఁడు. హరిభట్టుకాల మిప్పుడు మనకుఁ దెలిసినదిగాన యిట్లు చెప్పఁగలిగితిమి. వెలిగందలనారయ, ఏర్చూరిసింగన మొదలగువారికాలములు మన కెఱుఁగ రాలేదు. వారు హరిభట్టుకంటెఁగూడఁ బూర్వులుగా నుండ వచ్చునేమో! అప్పుడే లభింపనిపోతరాజుగారిరచన మిప్పుడు లభించె ననుట విశ్వాస్యముగా నాకుఁదోఁపదు. అయినను దొరకినపుస్తక మేదో నలుగురకన్నులకుఁ గానవచ్చు నేని యెట్లేని నిర్ణయ మేర్పడును. అదియుఁ గానరాకున్నది. వ్రాఁతప్రతులలో సామాన్యముగా నన్నిరచనములకుఁగూడఁ బోతరాజుగారిపేరే కానవచ్చును. అది బ్రాంతిజనకమై యుండవచ్చును.

లుప్తభాగములఁ బూరించినవారు.

హరిభట్టు

పోతరాజుగారు భాగవతము నద్వైతసిద్ధాంతానుగుణముగా శ్రీధరవ్యాఖ్య ననుసరించి రచించిరి. హరిభట్టు విశిష్టాదైతసిద్ధాంతాను గుణముగా షష్ఠైకాదశద్వాదశస్కంధములఁ బూరించెను. హరిభట్టురచన మంత హృద్యమయినదిగాఁ దోఁపదు. తెలుఁగుభాగవతము వ్రాఁతప్రతులు పెక్కులు ఏర్చూరిసింగన షష్ఠస్కంధముతోను వెలిగందలనారయయేకాదశద్వాదశస్కంధములతోను నుండును. కాని యక్కడక్కడఁ గొన్ని ప్రతులలో హరిభట్టురచనములుకూడఁ గలసియున్నవి. అమృత ప్రవాహమువంటి పోతరాజుగారిరచనము నశించుటచేతఁ దత్తుల్యముగా లుప్తభాగములను బూరింపఁగోరి హరిభట్టువలెనే మటికొందఱుకూడ రచనముల నెఱపిరి. కాని యెవ్వరికిని దత్తుల్యరచనము పొసఁగలేదు. అట్టిభాగ్యము భారతకవులకే లభించినది. రామాయణమునఁగూడ నొక్కయయ్యలార్యురచనముమాత్రమే భాస్కరరచనముతో సరితూఁగఁ గల్గినది కాని తక్కినవి కొఱవడినవే.

ఏర్చూరి సింగన

భాగవతపూరణములలో నేర్పూరిసింగన షష్ఠస్కంధరచనము ప్రశస్త మయినది. అది కొంతవఱకుఁ బోతరాజుగారిరచనమును బోలుచున్నది. హరిభట్టుషష్ఠస్కంధరచనముకంటె నిదియెంతేని మేలితరముగా నున్నది. సింగనకాల మెఱుఁగరాదు. ఆతఁడుకూడఁ గృష్ణరాయలకుఁ బూర్వఁ డే కావచ్చును. కువలయాశ్వచరిత్ర మనుగ్రంథమునుగూడ నాతఁడు రచించెను. అది దొరకలేదు.

సర్వన

ఈతఁడుకూడ షష్ఠస్కంధమును రచించెనఁట! ఈతని గ్రంథము దొరకలేదు. ఈతఁ డెప్పటివాఁడో యెఱుఁగరాదు. ప్రబంధరత్నావళిలో నీతనిగ్రంథమునుండి పద్యము లుద్ధరింపఁబడినవి.

రాచమల్లువారు

ఇద్దఱో ముగ్గురో వీరిపేళ్లేమో యెఱుఁగరాదు. వీరుగూడ షష్ఠస్కంధమును దెనిఁగించిరి. లక్షణగ్రంథములందు వీరి గ్రంథమునుండి యుద్ధరింపఁబడిన పద్యములు పెక్కులు గానవచ్చును. శృంగారషష్ఠ మని వీరిగ్రంథమునకుఁ బేరు. షష్ఠస్కంధము నిందఱు పూరించుటకుఁ గలవిశేష మేమో!

వెలిగందల నారయ

ఏకాదశద్వాదశస్కంధములు వెలిగందలనారయ రచితములు ఇప్పుడు ముద్రిత మయియే యున్నవిగదా! ప్రాఁతవ్రాఁతప్రతులలోఁ బెక్కింట 11, 12 స్కంధములు పోతరాజుగద్యముతోనే కానవచ్చుచున్నవి. ప్రతివిలేఖకులప్రమాదము కావచ్చును. ఏలయనఁగా నారెండుస్కంధములును మిక్కిలి సంగ్రహమై నీరసరచనము గలిగియున్నవి. అది పోతరాజుగారి రచనము కానేరదు. కాని యొకవిశేష మున్నది. పోతరాజుగారియితర స్కంధములందలిపద్యము లిందుఁ గొన్ని కలవు. హరిభట్టురచనమును నారయ రచనమును గొన్నిపద్యభాగములందును వచనభాగములందును నైక్య మందుచున్నవి. పోతరాజుగారి రచనము శిథిలమై యందదుకులుగాఁ గొన్నికొన్ని పద్యభాగములు వచనభాగములు గలిగియుండఁగా హరిభట్టును నారయయును వేర్వేఱుగా నాతునుకల నదికించి పూరించి యుందు రేమో! ఇట్లగునేని వారిర్వుర రచనములలోఁ గొంతయైక్య ముండుటకుఁ గారణము గుదురును.

సంజీవరాయకవి

ఈతఁడు నందవరవంశ్యుఁడు. ఎప్పటివాఁడో యెఱుఁగరాదు. ఏకాదశద్వాదశస్కంధముల నీతcడుగూడఁ దెలిఁగించెను. ఈతని రచనము ప్రశస్తమైనది. హరిభట్టునారయరచనములకంటె మేలయినది. కాని సమగ్రముగా లభింపలేదు.

గంగన

పంచమస్కంధము నీతఁ డొక్కఁడే తెలింగించినాఁడు. ఇది యిప్పుడు భాగవతములో ముద్రిత మయియే యున్నది. ఈతనిరచనము నీరసమయినది.

ఇతర రచనములు

ఇంతవఱకుఁ బోతరాజుగారిభాగవతమున లుప్తభాగములఁ బూరించినవారిఁ గూర్చి పేర్కొంటిని. ఇఁక స్వతంత్రముగా భాగవతములను మరల రచించినవారిఁ బేర్కొందును. ద్వైతవిశిష్టాద్వైతమతముల మూలమునను జైతన్యమతముమూలమునను పోతరాజుగారి భాగవతము బహుప్రచారము గలది గాని యది యద్వైతసిద్ధాంత ప్రతిపాదక మగుటఁ గొందఱ కతృప్తిని గొల్పియుండవచ్చును. ఈకారణమునఁగూడ మటికొందఱు మరల భాగవతమును దెలిఁగించియుందురు.

కోనేరునాథుఁడు

ఈతఁడు కృష్ణరాయలయవసానకాలమందుఁ గలఁడు. బాలభాగవత మనుపేరఁ బద్యరూపముగాను ద్విపదరూపముగాను నీతఁడు రెండు గ్రంథముల రచియించినాఁడు. ఈతని రచనము రసోత్తర మయినది. విశిష్టాద్వైతసిద్ధాంతానుగుణముగా నీతఁడు గ్రంథము రచించెను గాని యనేకస్థలములందుఁ బోతరాజుగారిరచనమును బుడికిపుచ్చుకొన్నాఁడు. ఈతని పద్యగ్రంథ మింతవఱకు ముద్రితము గాకుండుట శోచనీయము. ఈతనిద్విపదరచనము కొంత యిటీవల ముద్రిత మయినది. కాని యదికూడ సమగ్రముగాఁ బ్రకటితము కావలెను.

తేకుమళ్ల రంగశాయికవి

ఈతఁడుకూడ భాగవతమును ద్విపదరూపమునఁ దెనిఁగించినాఁడు. కోనేరునాథునిద్విపద సంగ్రహముగా నున్నది గాని యీతని ద్విపద విస్తృతముగా నున్నది. పుష్పగిరితిమ్మకవిసాహాయ్యమునఁ దా నాగ్రంథము రచించినట్టు కవి చెప్పుకొన్నాఁడు. వాణీవిలాసవనమాలికాది బహు గ్రంథముల నీతఁడు రచించినాఁడు.

పుష్పగిరితిమ్మకవి

ఈతఁడు ద్విపదభాగవతరచనమున రంగశాయికవికిఁదోడుపడుటే కాక తెనుఁగున వచనభాగవతమునుగూడ రచించినాఁడు. అది తేటగా నున్నది. దానిఁ జూచి తదనుసారముగా నరవమున నొకకవి వచన భాగవతము రచించినాఁడు,

తరిగొండ వేంకమాంబ

ఈమెకూడ భాగవతమును ద్విపదరూపమున రచించెను. ఈమె గ్రంథము ఓరియంటల్‌లైబ్రరిలో నున్నది. వేఱొకప్రతి క్రొత్తగా చిత్రాడలో నాంధ్రపరిశోధకమండలివారికి దొరకినది. అది యింతవఱకుఁ బ్రఖ్యాత మయినది గాదు. మహనీయురాలగుస్తీరచించిన దగుటచేతను సుకుమారకవిత యగుటచేతను నిది ప్రకటింపఁదగినది.

యక్షగానములు

ఇప్పుడు పేర్కొనఁబడిన రచనములు గాక యక్షగానరూపముగా నున్నభాగవతరచనము లనేకము లున్నవి. అందుఁ గొన్ని రసోత్తరము లయినవి. సిద్దేంద్రుఁ డనుయోగి రచించినగ్రంథము వానిలోఁ బ్రఖ్యాతము. కూచిపూఁడి (కృష్ణా మండలము) బ్రాహ్మణులు పారంపర్యముగా నాయతీంద్రునికృతిని బ్రదర్శింతురు. ఇంక నసామాన్యముగాఁ బేర్కొనఁ దగిన దింకొకటి కలదు. సంస్కృతమునఁ గృష్ణలీలాతరంగిణి యనుపేర భాగవతదశమస్కంధమును గేయరూపమున రచించినమహనీయులు నారాయణతీర్థులవారు తెలుఁగున రచించినపారిజాతకథ, ఇది భాగవత మందలి పారిజాతాపహరణకథమాత్రమే.

మీఁదఁ బేర్కొనఁబడిన కవీశ్వరుల రచనములలోనఁ బ్రఖ్యాతము లయినవానినుండి మచ్చుతునుకలఁ జూపుదును,

భాగవతము

హరిభట్టు-షష్ఠస్కంధము

గీ|| శ్రీసమేత! మిమ్ము సేవింప నొల్లక
     మీఱి శుభము లొందఁ గోరువాఁడు
     చెంగలించి శునకలాంగూలముఖమున
     నదిని దాఁటఁ గోరునట్టివాఁడు.

చ|| అరయఁగఁ బద్మసంభవుఁడు నాత్మనివాససరోజకర్ణికాం
     తరమున నుండి తీవ్రపవనప్రహితాధికవీచిమాలికా
     పరిమితఘోషభీషితవిభావ్యమహార్ణవమందు మగ్నుఁడై
     పరువడితో మిముం దలఁచి పారము నొందఁడె భక్తవత్సలా!

శా|| ఓ రాజీవదళాభిరామనయనా! యోసత్యసన్మంగళా!
      యోరాత్రించరకంఠనాళదళనా! యోసర్వలోకాధిపా!
      యోరత్నాకరమేఖలాపరివృధా! యోభక్తకల్పద్రుమా!
      యోరాకాహరిణేందురమ్యవదనా! యోపద్మనాభాచ్యుతా!

శా|| శ్రీవత్సాంకితమూర్తయే విమలరాజీవాక్షయుగ్మాయ ల
      క్ష్మీవక్రాంబుజషట్పదాయ వసుధామిత్రాయ సర్వాత్మనే
      భావజ్ఞాయ కృపాకరాయ హరయే భక్తార్ధసంధాయినే
      గోవిందాయ సమస్తదైత్యనివహక్రూరాయ తుభ్యం నమః

శా|| ప్రస్కన్నామరరాక్షసున్... భూభారాపహర్తన్ మహే
      శస్కందాదినుతప్రభావుఁ గమలాసంవాసరాజన్మహో
      రస్కున్ విష్ణుఁ దలంచి భాగవతపౌరాణీయ మైనట్టి ష
      ష్ఠస్కంధంబుఁ దెనుంగుఁ జేసెదను గృష్ణప్రీతిగా వేడుకన్

సంజీవరాయకవి-ఏకాదశస్కంధము

క|| ఒకనాఁ డచ్చోటికిఁ గొం
     కక కృష్ణకుమారు లేఁగి గర్వితులై కృ
     ష్ణకుమారుఁ డైనసాంబుని
     నెకసక్కెము మీఱఁ జేసి రింతిగ నధిపా.

వ|| ఇ ట్లతనియుదరంబు వస్త్రగ్రంథి నున్నతంబై యుండునట్లుగా నంగనావేషధారిఁ గావించి మునులకడకుం దోడ్కొని చని ప్రణతులై యిట్లనిరి.

తరలII పరమసంయములార యిచ్చెలి బాల గర్భిణి దీనియం
        దరయఁ బుట్టెడుపట్టి సూనుఁడొ యాఁడుబిడ్డయొ సిబ్బితిం
        బెరసి మి మ్మడుగంగఁ జాలఁడు పేర్మిఁ జెప్పఁగ నొప్పు నీ
        తరుణి మెచ్చఁగ మీకు హస్తగతంబు కాదె యశేషమున్.

మ|| అనుడుం జుఱ్ఱని చిచ్చుఁ ద్రోక్కినవిధంబై యాత్మఁ గ్రోధంబు పె
        ల్లునఁ గన్నుల్ దొగరూన వీరి పెనుత్రుళ్లున్ బాపకున్న న్మహా
        జనులం గేరెద రంచు నెంచి యదువంశం బెల్లఁ బోకార్పఁగా
        ఘనమైపుట్టెడు నిన్బరోఁకలి వధూగర్భంబునం బొం డనన్

గీ|| యదుకుమారులు భయమున నవయవములు
       వడవడ వడంక సాంబగర్భభవముసల
       మపుడ కన్గొని యద్భుత మంది యెద్ది
       గతి యయో యని వగచిరి కౌరవేంద్ర!

వ|| మఱియు.

చ|| కటకట మందభాగ్యులము కాలగతిం గడవంగవచ్చునే
     యిటు చనుదెంచి సాధుజన హేళన మే మొనరించుటంగదా
     పటుతర మైనశాపమున భంగము వచ్చెఁ గులంబు కెల్ల నా
     రట మెద సంభవిల్లె మనరా జిఁక నే మనువాఁడొ దీనికిన్,

ఉ|| ఆఁకటి కోర్చి దప్పికి భయంపడ కార్తిని శీతికాదులన్
      గైకొన కింద్రియంబుల నఖండధృతిం గుదియించియుం దుదిం
      జీకులువోలెఁ గ్రోధమునఁ జేసియె గోష్పదమగ్నులై కటా
      వ్యాకులతన్ వహింతురుగదా! భువిఁ గొందఱు నిష్ఠ డిందఁగన్

చ|| తఱుగుమదంబున నిజపదంబులకుం బ్రణమిల్లుదేవులం
      జిఱునగ వొప్పఁ జూచి మునిశేఖరుఁ డిట్లను వీరిలోపలం
      దెఱవ నొకర్తుఁ గైకొనుఁడు దివ్యసభాభరణంబు గాఁగ న
      క్కఱ గలదేని భీతివడఁగాఁ దగ దాత్మల మీ కొకింతయున్

చ|| వినుము విగాఢతర్షత వివేకము మాని సుఖం బటంచు గొ
     బ్బునఁ బశుహింస సేయుదురు భూమి దయారహితాత్ములై కటా
     వెనుకను బంచతం బెరసి వేదనఁ బొందుదురయ్య! మున్ను జ
     చ్చినపశుసంఘముల్ దము గ్రసింపఁగ దిక్కఱి ఘోరభంగులన్.

చ|| ప్రియతమవస్తు వెద్దియుఁ బరిగ్రహయోగ్యము గాదు దానఁ గ
     స్తియ సమకూడు సౌఖ్యములఁ దెచ్చు నకించనభావ మెప్పుడున్
     రయమున మింట నొక్కకురరం బెఱచిం గొనిపోవు చన్యముల్
     పయిఁబడ దానిఁబోవిడిచి పార్ధివముఖ్య వహించె నిర్వృతిన్

మ|| సరసానార్యవగాహశీతలములై సంఫుల్లనూనచ్ఛటాం
      తరరేణూత్కరపశ్యతోహరములై నానాలతాలాసికా
      చరణన్యాసవిధానదేశికములై సంచారమున్ సల్పె మం
      ధరవాతంబులు సంయమీంద్ర తనునైదాఘాంబువుల్ డిందఁగన్

కోనేరునాథుఁడు - బాలభాగవతము.

ఉ|| విశ్వముఁ గల్గఁజేసియును విశ్వములోనన యుండియున్ గృపా
     శాశ్వతలీల విశ్వ మనిశంబును బ్రోచియునొక్కవేళ న
     వ్విశ్వము లీలకై పరిభవించియుఁ దా వెలుఁగొందు నెవ్వఁ డా
     విశ్వము దానయైనకృతి వేడుక నిప్పుడు నన్నుఁ గాచుతన్

మ|| బిసినీపత్రములందుఁ గానఁబడునబ్బిందుచ్చటల్ సాటిగా
       నసువుల్ సంచలనంబు నొంచెడి సమోహం బయ్యెడిన్ మేను స
       వ్యసనం బయ్యెడు నింద్రియవ్రజము దిక్కై ప్రోవ నన్యుండు లేఁ
       డసమానప్రతిభావ! నా దయినకుయ్యాలింపు వేగంబునన్.

మ|| అమితబ్రహ్మరహస్యమార్గగమనాయాసక్తిమచ్చేతసే
       విమలాచారజుషే పదత్రయమితోర్వీం విష్ణురూపాయ తు
       భ్య మహం సంప్రదదే నమో నమమ నిత్యప్రీతిర స్తంచు ని
       స్తముఁడై గ్రక్కున ధారవోసె బలి యుత్సాహంబు సంధిల్లగన్,

మ|| మమతాహంకృతు లుజ్జగించి మదిఁ గామశ్రేణి నిశ్రేణికా
       క్రమణబ్రాంతిఁ బరిత్యజించి శమసామ్రాజ్యస్థుఁడై యిందిరా
       రమణున్ విష్ణు నశేషశేషిఁ గరుణారాశిం దదీయైక శే
       షమతిన్ మర్త్యుఁడు గొల్చు టెంతయు నభీష్టం బార్య నా కెప్పుడున్

శా|| లోకప్రస్తుతశాస్త్రజాలముల నాలోకించియున్ లీప్సచేఁ
      బైకొన్నట్టివిచారమార్గమున నొప్పం జూడఁగా నిశ్చితం
      బేకం బయ్యె బహుప్రకారముల లక్ష్మీశుండు నారాయణుం
      డేకాలంబున నెల్లవారల కనుధ్యేయుండు సంసేవ్యుఁడున్,

ఉ|| ఎడ్డెకుఁ జేయుసత్కృతము వెంగలి కిచ్చినయట్టికన్నియల్ (?)
      గ్రుడ్డికిఁ జూపునద్దములు కుత్సితవృత్తికిఁ జేయుదానముల్
      గొడ్డగునట్టిమ్రాని కొనగూర్చినప్రోదులు చక్రహస్తుపై
      నొడ్డినభక్తిలేనిగతయుక్తికిఁ జెప్పినశాస్త్రజాలముల్

రాచమల్లువారి శృంగారషష్ఠము

మ|| అని యీవిద్య గురుప్రసన్నుఁడు దృఢస్వాంతుండు నౌ చిత్రకే
       తునృపాలాగ్రణి కిచ్చి నారదమునీంద్రుం డంగిరోయుక్తుఁడై
       చనియెన్ బంకజగర్భగేహమున కాసర్వంసహాభర్త దా
       ని నుపాసించి భజించె నేడహములన్ విద్యాధరాధ్యక్షతన్.

క|| అనుటయఁ గృష్ణద్వైపా
     యనతనయుం డిట్టు లనియె నవహితమతివై
     విను మతిగుహ్యము నారా
     యణకవచము భక్తవాంఛితార్ధప్రదమున్

గీ|| తత్తరమున నాపోశన మెత్తఁబోయి
     భూసురుం డెత్తు నుత్తరాపోశనంబు.

నీ.గీతి|| వలవదు భయంబు వా రెంతవార లైన
          నట్టివారలు మన కగ్గ మైనవారు
          వారు నిరయంబునకుఁ గాపు వచ్చువార
          లనుచు బుద్ధిగఁ జెప్పె మార్తాండసుతుఁడు.

గీ|| తల్లియును దండ్రి దైవంబు తలఁప గురుఁడ
     కాఁడె యితఁ డేమి చేసినఁ గనలఁ దగునె
     నాస్తికాధమ! యోరి! యన్యాయవృత్తి
     నాస్తి తత్త్వం గురోః పర మనఁగ వినవె?

చ|| పెరిగినయీసున న్నెమలిపింఛములం బురివిప్ప దోలునీ
      సరసిరుహాక్షివేనలికి సాటిగ నిల్వఁగ నోడి చొచ్చె నిం
      దిర శరణంబు తేcటిగమి నీలము లింద్రునిపేరు గాంచెఁ బె
      న్నిరులు గుహాశ్రయంబు గనియెన్ నెఱి గల్గినవారి కోర్తురే

క|| నెరసె నెఱసంజ చక్రక
      సరసీరుహవిరహవేదసంసూచకమై...

క|| అరిగి సమిత్ర్పసవకుశాం
     కురపక్ష --లోత్కరంబు గొని గృహమునకున్
     మరలి యిట వచ్చునప్పుడు
     ధరణీసురనందనుండు దనకట్టెదుటన్

  • * *