మీఁగడ తఱకలు/వేములవాడ భీమకవి
4
వేములవాడ భీమకవి
వేములవాడ భీమకవి శాపానుగ్రహశక్తిమంతుఁ డని, ఉద్దండకవి యని ప్రాచీనకవులు ప్రశంసించినారు. శ్రీనాథుఁడు 'వచియింతు వేములవాడ భీమనభంగి నుద్దండలీల నొక్కొక్క మాటు' అన్నాడు.
క|| భీమకవి రామలింగని
స్త్రీమన్మథుఁడై చెలంగు శ్రీనాథకవిన్
రామకవిముఖ్యులను బ్రో
ద్దామగతిన్ భక్తి మీఱఁ దలఁచి కడంకన్ ||
అన్నాడు కూచిమంచి జగ్గన.
క|| లేములవాడక సుఖి యై
లేమలవాడన్ జనించి లేమలవాఁ డన్
నామంబునఁ బరగిన నుత
భీమున్ గవిభీము సుకవిభీముఁ దలంతున్ ||
అన్నాడు గోపరాజు,
ఈ భీమకవి గోదావరీమండల దాక్షారామపు లేములవాడ వాస్తవ్యుఁ డని కొందఱును, నైజాంరాష్ట్రమందలి వేములవాడ వాస్తవ్యుఁ డని కొందఱును తలఁచుచున్నారు. ఉభయవాదములకును సాధనము లున్నవి. ఈ భీమకవికూడ శ్రీనాథునివలెఁ దెలుంగాధీశునిఁ గస్తూరీఘనసారాది సుగంధవస్తువులు యాచించిన ట్లీచాటుపద్యము చెప్పచున్నది.
మ|| ఘనుఁడన్ వేములవాడవంశజుఁడ దాక్షారామభీమేశనం
దనుడన్ దివ్యవిషామృత ప్రకటనానాకావ్యధుర్యుండ భీ
మన నాపేరు నెఱుంగఁ జెప్పితిఁ దెలుంగాధీశ! కస్తూరికా
ఘనసారాదిసుగంధవస్తువులు వేగం దెచ్చి లాలింపరా!
వృద్ధపారంపర్యమున నీపద్య మీవిధముగా వినికిడి కలదుగాని ప్రాత వ్రాఁతలలో 'తెలుంగాధీశ' యని కాక 'కళింగాధీశ' యని పాఠము కానవచ్చుచున్నది. మనభీమకవి కళింగాధీశుఁ డయిన యనంతవర్మ చోడగంగదేవుని దర్శించినట్లింకను గొన్ని చాటుపద్యములు చాటుచున్నవి గాన యీపద్యమున 'కళింగాధీశ' యను పాఠమే పరిగ్రాహ్య మనవచ్చును.
పయిపద్యమున భీమకవి 'విషామృతము' మొదలగు గ్రంథముల రచించి నట్లున్నది. కాని యాగ్రంథము లేవియు నిప్పుడు కానరాకుండుట శోచనీయము. 'విషామృత'మని జ్యోతిషగ్రంథ మొకటి కలదుగాని యది యితనిదై యుండదు. ప్రసిద్ధమైన కవిజనాశ్రయ మీభీమకవి రచించినదిగా లోకప్రతీతి. గ్రంథమున 'రేచన' రచించిన ట్లున్నది. ఆతఁడు కోమటియఁట. అనంతవర్మ చోడగంగదేవుని సంధివిగ్రహి 'రేచన' యొకడు కలడు. అతనిశాసనము గోదావరీమండల దాక్షారామభీమేశ్వరస్వామి యాలయములో నున్నది. మనభీమకవి యా రేచనపేర కవిజనాశ్రయము రచించియుండు నేమో! కవిజనాశ్రయ మిప్పుడు చాల అపపాఠములతో, ప్రక్షిప్తగ్రంథములతో నిండియున్నది. దానిని జాగ్రత్తగా సంస్కరించి యుద్ధరింపవలసియున్నది. చిత్రపుభీమన యనుకవి రచించినఛందస్సు 'ఉత్తమగండచ్ఛందస్సు' అను పేరిది వేఱొకటి గలదు. అదియు కవిజనాశ్రయము నొకటే యని కొందఱు భ్రమపడిరి. అది యట్లు గాదు. ఉత్తమగండచ్ఛందస్సు వేఱు. కవిజనాశ్రయము వేఱు. ఉత్తమగండచ్ఛందస్సు చిత్రపుభీమన రచించినది. కవిజనాశ్రయచ్ఛందస్సు వేములవాడభీమకవిరచించిన దని ప్రతీతి గలది. రెండును బ్రాచీనతరచ్ఛందోగ్రంథములే! వేములవాడభీమకవిగ్రంథము లేవియు దొరకకపోయినను లక్షణగ్రంథాదులం దాతని చాటుపద్యము లుదాహృతములై చాల దొరకుచున్నవి. మఱిన్నీఆంధ్రప్రయోగరత్నాకరమున వేములవాడ భీమకవికృతి నృసింహపురాణ మనుపేరితో కొన్నిపద్యము లుదాహృతము లయియున్నవి. సాహిణిమారన, చాళుక్యచొక్కభూపతి, సాగిపోతరాజు, (అనంతవర్మ) కళింగగంగదేవుడు, చోడగంగడు, మైలమభీమడు, నల్లసిద్ధి, లేటివరపుపోతరాజు, రణతిక్కన యనువారి మీఁద నీతఁడు చాటుపద్యములఁ జెప్పినాడు. ఇందుఁగొన్ని కల్పితములును గావచ్చును. పైవారిలో మైలమభీమనికే ఏఱువభీమఁ డని, చిక్కభీమఁ డని నామాంతరములు. ఈతనిపై భీమకవి ప్రశస్తమయిన ప్రశంసా పద్యములు చెప్పినాడు. అవి యెల్ల చాటుపద్యమణిమంజరిలోఁ జూడనగును. మచ్చునకు రెండుపద్యములు.
క|| అరినరు లేఱువభీమని
పొరువున మనలేరు చిచ్చుపొంతను వెన్నై
తెరువునఁ బెసరై జూదరి
సిరియై రేన్చెట్టుక్రింద జిల్లెడుచెట్టై. ||
ఉ|| యాచక ఖేచరుండు సుగుణాంబుధి మైలమభీమఁ డీల్గినన్
జూచి వరించె రంభ, యెడఁజొచ్చెఁ దిలోత్తమ, దారి నిద్దఱన్
దోచె ఘృతాచి, ముగ్గుఱకు దొడ్డడికయ్యము పుట్టె, నంతలో
నాcచుకుపోయె ముక్తిసతి, నవ్విరి యద్దశఁ జూచి నిర్జరుల్
నోఁచినవారి సొమ్ము లవి నోమనివారికి వచ్చునే ధరన్||
ఈపద్యపుఁ దుదిచరణము గలపద్యము నాచనసోమనాథుని యుత్తరహరివంశమునను గలదు.
ఉ|| ఏఁచు నుపేంద్రునిం బదక మిమ్మని రుక్మిణి మున్ను దేవుఁడుం
బూఁచినపూవు దప్పుటకుఁ బోకులఁబోవుచు నుండు నిమ్మెయిన్
డాఁచినసొమ్ము చేరె నిచటన్ మదిఁ గోరనిసత్యభామకున్
నోఁచినవారిసొమ్ము లవి నోమనివారికి వచ్చునే ధరన్?
-ఉ.హ. 168, ప్రథమాశ్వాసము.
భీమకవిచాటుపద్యముల పోలికపద్యములు నాచనసామనాథుని యుత్తరహరివంశమున నింకను కలవు. భారతిలో శ్రీనేలటూరి వెంకటరమణయ్యగారు ప్రకటించిన తాళ్లప్రొద్దుటూరిశాసనము వేములవాడ భీమకవిరచనము కావచ్చు నని నాతలఁపు. ఏలనఁగా నందులో వేములవాడ భీమకవి పేరఁ బ్రసిద్ధి గన్న చాటుపద్య మిదికూడ గలదు.
ఉ|| పన్ని తురంగమంబునకుఁ బక్కెర వెట్టినవార్త చారుచే
విన్నభయబునం గలఁగి వేసటనాఁటనె చక్ర(?) గోట్టముల్
మన్నియపట్టణంబులును మక్కెన వేంగి కళింగ లాదిగా
నిన్నియు నొక్కపె ట్టెగసె నేఱువభీమనృపాలుధాటికిన్ ||
మఱిన్నీ ఆ శాసనపుఁబద్యముల యనుకరణములుకూడ నాచన సోమనగ్రంథములో నున్నవి. పయి చాటుపద్యము లన్నింటిని బర్యాలోచింపఁగా భీమకవి క్రీ|| 12వ శతాబ్దిపూర్వార్ధమున ననఁగా నిప్పటి కెన్మిదివందల యేండ్లకు పూర్వ మున్నవాఁ డగును.
వేములవాడభీమకవి శాపానుగ్రహశక్తిమంతుఁ డనుటకుఁ దార్కాణముగాఁ బెక్కు చాటుధార లున్నవి. భీమకవి యొక్కప్పుడు గుడిమెట్ట యను గ్రామమున కరిగెనట! సాగిపోతురాజను రా జాతని గుఱ్ఱము నక్కడఁ దనసాహిణమునఁ గట్టి పెట్టించి యాతఁడు వేడినను విడిపింపఁ డయ్యెనఁట. దానిపైఁ గోపించి భీమకవి చెప్పినపద్యము.
చ|| హయ మది సీత, పోతవసుధాధిపుఁ డారయ రావణుండు, ని
శ్చయముగ నేను రాఘపుఁడ, సహ్యజ వారిధి, మారుఁ డంజనా
ప్రియతనయుండు లచ్చన, విభీషణుఁ డాగుడి మెట్టఁ లంక నా
జయమును బోతరక్కసునిచావును నేడవనాఁడు చూడుcడీ!
చ|| గొనకొని మర్త్యలోకమునఁ గోమటి పుట్టఁగఁ బుట్టెఁ దోన బొం
కును గపటంబు లాలనయుఁ గుచ్చితబుద్ధియు రిత్తభక్తియున్
ననువరిమాటలున్ బరధనంబును గ్రక్కున మెక్కఁ జూచుటల్
కొనుటలు నమ్ముటల్ మిగులఁగొంటుఁదనంబును మూర్ఖవాదమున్ ||
ఉ|| కోమటి కొక్క టిచ్చి పది గొన్నను దోసము లేద, యింటికిన్
సేమ మెఱింగి చిచ్చిడినఁ జెందద పాపము, వాని నెప్పుడే
నేమరుపాటున న్మఱియు నేమి యొనర్చిన లేద దోస మా
భీమనిలింగ మాన కవిభీమని పల్కులు నమ్మి యుండుఁడీ!
ఉ|| లేములవాడభీమ! భళిరే కవిశేఖరసార్వభౌమ! నీ
వేమని యాన తిచ్చితివి యిమ్ములఁ గోమటిపక్షపాతివై
కోమటి కొక్క టిచ్చి పది గొన్నను దోసము లే దటంటి వా
కోమటి కొక్క టీక పది గొన్నను ధర్మము ధర్మపద్ధతిన్ ||
సాహిణిమారుఁ డనుదండనాథుఁడు చాళుక్యచొక్క భూపతి నెదిరించె నట! భీమకవి యామారుని శపించి, చొక్క భూపతికే జయము చేకూర్చెనఁట.
ఉ|| చక్కఁదనంబుదీవియగుసాహిణిమారుఁడు మారుకైవడిన్
బొక్కిపడంగలండు చలమున్ బలమున్ గలయాచళుక్యపుం
జొక్కనృపాలుఁ డుగ్రుఁడయి చూడ్కుల మంటలు రాలఁ జూచినన్
మిక్కిలి రాజశేఖరునిమీఁదికి వచ్చిన రిత్తవోవునే!
కళింగగంగు నాస్థానమునకు భీమకవి యరుగఁగా నాతఁ డనాదరమున నిది సమయము కాదు పొమ్మనె నఁట! దానిపై భీమన కోపించి శాప మి ట్లొసగెను.
ఉ|| వేములవాడభీమకవి వేగమె చూచి కళింగగంగు తా
సామము మాని కోపమున సందడి దీఱిన రమ్ము పొ మ్మనెన్
మోమును జూడ దోస మిఁక ముప్పదిరెండుదినంబు లావలన్
జామున కర్ధమం దతనిసంపద శత్రులపాలు గావుతన్.|
శాపము ఫలించెను. రాజకళింగగంగు గర్భదరిద్రుఁడై పరుల కెఱుకపడకుండఁ బ్రచ్ఛన్నవేషము దాల్చి తిరిపమెత్తుచుం బొట్ట గడపుకొనుచుండెను. భీమకవి యొకనాఁడు రాత్రి పల్లకి నెక్కిదివటీలతో నెక్కడకో పోవుచుండఁగా నాతఁడు త్రోవనేఁగుచుఁ జీకటిలో నొకగోతఁ గూలి 'అయ్యో కాలిదివటీయైన లేదయ్యెఁ గదా!' యనుకొని చింతిల్లె నఁట! అది భీమకవి విని నీ వెవ్వండ వని యడుగ 'భీమకవిగారిచే జోగి చేయఁబడిన వాఁడు' ననెనఁట! భీమకవి 'రాజకళింగగంగవా' యనఁగా నాతఁడు కేల్మోడ్చి 'రక్షింపుఁ'డనె నcట! అంతట
ఉll వేయుగజంబు లుండఁ బదివేలుతురంగము లుండ నాజిలో
రాయలఁ గెల్చి సజ్జనగరంబునఁ బట్టము గట్టుకో వడిన్
రాయకళింగగంగు కవిరాజభయంకరమూర్తిఁ జూడఁగాc
బోయెను మీనమాసమునఁ బున్నమ వోయినషష్ఠినాటికిన్ ||
అని యాశీర్వదించి, తిరిగి లబ్ధరాజ్యునిఁ జేసెనcట.
ఒక బ్రాహ్మణుని దొడ్డిలోని పేరాముదపాకులు భీమకవితాలూకు నౌక రొకఁడు మందు కనికోసికొనఁ బోగా నాయింటి బ్రాహ్మణుఁ డానౌకరును బారతో గొట్టెనఁట! ఆ బ్రాహ్మణుఁ డడcగారునట్లు భీమకవి శపించెను.
క|| కూ రడుగము కా యడుగము
నారయఁగా నుల్లి బచ్చ లల్ల మడుగ మా
పేరాముదపా కడిగినఁ
బారమ్మున నేసె నట్టె బాపఁడు ద్రెళ్ళున్.
అనుగ్రహించి భీమకవి జన్నమాంబ యనునామెకు గండమాలావ్యాధిని పద్యరచనచేఁ గుదిర్చెనఁట.
క|| ఘనరోగంబులబలమా?
కనుఁగొనఁగా జన్నమాంబకర్మపుఫలమా?
నినుఁ బ్రార్థించెద వినుమా
మునుకొని యోగండమూల! మునుగకుc జనుమా!
కొన్నాళ్ల కామెమీఁద మరలఁ గోపించి శపించి, మరల నావ్యాధి నామెకే వచ్చునట్లు చేసెనంట.
భీమకవి తనశాపానుగ్రహశక్తిమత్త్వమును బ్రశంసించుకొన్నపద్యమిది.
సీ|| గడియలోపలఁ దాడి కడఁగి ముత్తునియగాఁ
దిట్టిన మేధావి భట్టుకంటె
రెండుగడెల బ్రహ్మదండిముం డ్లన్నియు
డుల్లఁ దిట్టినకవి మల్లుకంటె
మూఁడుగడెలకుఁ దా మొనసి యుత్తినగండి
పగులఁ దిట్టినకవిభానుకంటె
అఱజాములోపలఁ జెఱువునీ ళ్ళింకంగఁ
దిట్టినబడబాగ్ని భట్టకంటె
గీ|| ఉగ్రకోపి నేను నోపుదు శపియింపఁ
గ్రమ్మఱింప శక్తి గలదు నాకు
వట్టిమ్రానఁ జిగురు పుట్టింప గిట్టింప
బిరుదు వేములాడ భీమకవిని.
ఉ|| రామునమోఘబాణమును రాజశిఖామణికంటిమంటయున్
భీముగదావిజృంభణ ముపేంద్రునివజ్రముఁ జక్రిచక్రమున్
దామరచూలివ్రాఁతయును దారకవిద్విషుఘోరశక్తియున్
లేములవాడ భీమకవి లేశము తిట్టిన రిత్తవోవునే |
- * *