పోతన తెలుగు భాగవతము/నవమ స్కంధము/హరిశ్చంద్రుని వృత్తాంతము
హరిశ్చంద్రుని వృత్తాంతము
తెభా-9-192-సీ.
గురుశాపవశమునఁ గూలి చండాలుఁడై-
యనఘాత్ముఁ గౌశికు నాశ్రయించి;
యతని లావున దివిజాలయంబున కేఁగ-
మన్నింప కమరులు మరలఁ ద్రోయఁ;
దల క్రిందుగాఁ బడి దైన్యంబుతో రాఁగఁ-
గౌశికుఁ డెప్పటి ఘనత మెఱసి
నిలిపె నాకసమున; నేఁడు నున్నాడు త్రి-
శంకుఁ; డాతఁడు హరిశ్చంద్రుఁ గనియె;
తెభా-9-192.1-తే.
నా హరిశ్చంద్రుఁ గౌశికుఁ డర్థిఁ జేరి
యాగదక్షిణామిషమున నఖిలధనముఁ
గొల్లగొని మీఁదఁ గులహీనుఁ గొలువఁ బెట్ట;
బొంక కలజడిఁ బొందె నా భూవరుండు.
టీక:- గురు = గురువుయొక్క; శాప = శాపమునకు; వశమునన్ = గురగుటవలన; కూలి = కుంగిపోయి; చండాలుడు = నీచపుట్టుకవాడు, మాలవాడు; ఐ = అయ్యి; అనఘాత్మున్ = పుణ్యాత్ముని; కౌశికున్ = విశ్వామిత్రుని {కౌశికుడు - కుశికుని మనుమడు, విశ్వామిత్రుడు}; ఆశ్రయించి = చేరి; అతని = అతని; లావునన్ = శక్తివలన; దివిజాలయమున్ = స్వర్గమున; కున్ = కు; ఏగన్ = వెళ్ళగా; మన్నింపకన్ = అంగీకరింపకుండ; అమరులు = దేవతలు; మరలన్ = వెనక్కు; త్రోయన్ = తోసివేయగా; తలక్రిందుగాన్ = తలకిందులుగా; పడి = పడిపోయి; దైన్యంబు = దీనత్వము; తోన్ = తోటి; రాగన్ = వస్తుండగా; కౌశికుడు = విశ్వామిత్రుడు; ఎప్పటి = తనకుసామాన్యమైన; ఘనతన్ = గొప్పదనముతో; మెఱసి = అతిశయించి; నిలిపెన్ = ఆపెను; ఆకసమునన్ = ఆకాశమునందు; నేడున్ = ఇప్పటికిని; ఉన్నాడు = ఉన్నాడు; త్రిశంకుడు = త్రిశంకుడు {త్రిశంకుడు - 1తండ్రికి బాధకలిగెడి కార్యము చేయుటచేతను 2గురుధేనువును వధించుట చేతను 3అప్రోక్షిత మాంసమును భక్షించుట చేతను త్రివిధ హృదయ శంకువులుగల ఇతనికి ఈ పేరు వసిష్ఠునిచే పేరుపెట్టబడెను}; ఆతడు = అతను; హరిశ్చంద్రున్ = హరిశ్చంద్రుని; కనియెన్ = పొందెను; ఆ = ఆ.
హరిశ్చంద్రున్ = హరిశ్చంద్రుని; కౌశికుడు = విశ్వామిత్రుడు; అర్థిన్ = దానమునకు; చేరి = దగ్గరకు వెళ్ళి; యాగ = యాగమునకైన; దక్షిణ = దక్షిణ యనెడి; మిషన్ = వంకతో; అఖిల = సమస్తమైన; ధనమున్ = సంపదలను; కొల్లగొని = కొల్లగొట్టి; మీదన్ = ఆపైన; కులహీను = తక్కువకులమువానివద్ద; కొలువు = సేవకవృత్తిని; పెట్టన్ = పెట్టగా; బొంకక = అబద్దమాడకుండ; అలజడి = ఇబ్బందులను; పొందెన్ = పొందెను; ఆ = ఆ; భూవరుండు = రాజు.
భావము:- సత్యవ్రతుడు గురుశాపానికి గురై చండాలుడు అయ్యాడు. పుణ్యాత్ముడైన విశ్వామిత్ర మహర్షిని ఆశ్రయించి, అతని శక్తివలన స్వర్గానికి వెళ్ళగా, దేవతలు అంగీకరించక వెనక్కి తోసేసారు. సత్యవ్రతుడు దయనీయంగా తలకిందులుగా పడిపోసాగాడు. విశ్వామిత్రుడు తన తపోశక్తిని వాడి అతనిని ఆకాశంలో ఆపాడు. ఇప్పటికి అతను త్రిశంకుడు అనబడుతూ అలా తలక్రిందులుగా ఆకాశంలో ఉన్నాడు. త్రిశంకుడికి హరిశ్చంద్రుడు పుట్టాడు. విశ్వామిత్రుడు ఆ హరిశ్చంద్రుని దగ్గరకు వెళ్ళి యాగానికి దక్షిణ అనె వంకతో అతని సమస్త సంపదలను దానం రూపంలో కొల్లగొట్టాడు. ఇంకా ఆపైన నీచకులస్థుడివద్ద సేవకుడిగా చేసాడు. అయినా హరిశ్చంద్రుడు అబద్దమాడకుండ ఎంత కష్ఠాన్ని అయినా భరించాడు.
తెభా-9-193-వ.
ఇట్లు విశ్వామిత్రుండు హరిశ్చంద్రు నెగులపఱచుట విని వసిష్ఠుండు విశ్వామిత్రునిఁ గృధ్రమ్మవు గమ్మని శపించె; విశ్వామిత్రుండును వసిష్ఠుని బకంబవు గమ్మని శపించె; పక్షిరూపు లయ్యును వైరంబు మానక యయ్యిరువురును యుద్ధంబు చేసి రంత హరిశ్చంద్రుండు పుత్రులు లేక నారదు నుపదేశంబున వరుణోపాసనంబు నతి భక్తితోఁ జేయ నా వరుణుండు ప్రత్యతక్షంబైన నతనిక మ్రొక్కి యిట్లనియె.
టీక:- ఇట్లు = ఈ విధముగ; విశ్వామిత్రుండు = విశ్వామిత్రుడు; హరిశ్చంద్రున్ = హరిశ్చంద్రుని; నెగులు = బాధ; పఱచుట = పెట్టుట; విని = విని; వసిష్ఠుండు = వసిష్టుడు; విశ్వామిత్రునిన్ = విశ్వామిత్రుని; గృధ్రవున్ = గ్రద్దవు; కమ్ము = ఐపోవుము; అని = అని; శపించెన్ = శాపమిచ్చెను; విశ్వామిత్రుండునున్ = విశ్వామిత్రుడు; వసిష్టుని = వసిష్టుని; బకంబవు = కొంగవు; కమ్ము = ఐపోవుము; అని = అని; శపించెన్ = శాపమిచ్చెను; పక్షి = పక్షిగా; రూపులు = స్వరూపముపొందినవారు; అయ్యును = అయినప్పటికిని; వైరంబున్ = శత్రుత్వమును; మానక = వదలక; ఆ = ఆ; ఇరువురును = ఇద్దరు; యుద్ధంబున్ = యుద్ధము; చేసిరి = చేసిరి; అంతన్ = అంతట; హరిశ్చంద్రుండు = హరిశ్చంద్రుడు; పుత్రులు = కొడుకులు; లేక = కలుగపోవుటచేత; నారదున్ = నారదుని; ఉపదేశంబునన్ = సలహాప్రకారము; వరుణ = వరుణదేవుని; ఉపాసనంబున్ = పూజను; అతి = మిక్కిలి; భక్తి = భక్తి; తోన్ = తోటి; చేయన్ = ఆచరించగా; ఆ = ఆ; వరుణుండు = వరుణదేవుడు; ప్రత్యక్షంబు = ప్రత్యక్షము; ఐనన్ = కాగా; అతనికి = అతనికి; మ్రొక్కి = నమస్కరించి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఈ మాదిరిగా విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడిని బాధ పెట్టుట విని వసిష్టుడు విశ్వామిత్రుని గ్రద్దవు ఐపోమని శాపమిచ్చాడు. విశ్వామిత్రుడు వసిష్టుని కొంగవు ఐపోమని శాపమిచ్చాడు. పక్షులుగా అయినా శత్రుత్వమును వదలక ఆ ఇద్దరు యుద్ధం చేస్తూనే ఉన్నారు. అంతట హరిశ్చంద్రుడు కొడుకులు కలుగక నారదుని సలహాప్రకారం వరుణదేవుని పూజించాడు. వరుణదేవుడు ప్రత్యక్షము కాగా నమస్కరించి ఈ విధముగ పలికాడు.
తెభా-9-194-ఆ.
"వరుణదేవ! నాకు వరవీరగుణముల
కొడుకు పుట్టెనేని కొడుకుఁ బట్టి
పశువుఁ జేసి నీవు పరిణమింపఁగ వేల్తుఁ
గొడుకు నీఁ గదయ్య కొసరు లేక."
టీక:- వరుణదేవ = ఓ వరుణదేవుడా; నా = నా; కున్ = కు; వర = గొప్ప; వీర = వీరుని; గుణముల = లక్షణములుకలగిన; కొడుకున్ = పుత్రుడు; పుట్టెను = జన్మించినట్లు; ఏని = అయితే; కొడుకున్ = పుత్రుని; పట్టి = తప్పక; పశువున్ = బలిపశువునుగా; చేసి = చేసి; నీవు = నీవు; పరిణమింపగన్ = సంతోషించునట్లుగ; వేల్తున్ = బలిచ్చెదను; కొడుకున్ = పుత్రుని; ఈగద = ఇమ్ము; అయ్య = నాయనా; కొసరు = వెలితి; లేక = లేకుండగ.
భావము:- “ఓ వరుణదేవా! నాకు గొప్ప వీరుడు జన్మించేలా వరం ఇమ్ము. ఆ పుత్రుని తప్పక నీకు బలిస్తాను. పుత్రుడు పుట్టేలా అనుగ్రహించు.”
తెభా-9-195-వ.
అని పలికినం గుమారుండు గలిగెడు మని వరంబిచ్చి వరుణుండు చనియె; నంత హరిశ్చంద్రునకు వరుణప్రసాదంబున రోహితుఁడను కుమారుండు జన్మించె; వరుణుండును హరిశ్ఛంద్రకుమారు నుద్దేశించి.
టీక:- అని = అని; పలికినన్ = అడుగగా; కుమారుండు = పుత్రుడు; కలిగెడుము = కలుగుగాక; అని = అని; వరంబున్ = వరమును; ఇచ్చి = ఇచ్చి; వరుణుండు = వరుణదేవుడు; చనియెన్ = వెళ్ళిపోయెను; అంతన్ = అప్పుడు; హరిశ్చంద్రున్ = హరిశ్చంద్రుని; కున్ = కి; వరుణ = వరుణుని; ప్రసాదంబునన్ = అనుగ్రహమువలన; రోహితుడు = రోహితుడు; అను = అనెడి; కుమారుండు = పుత్రుడు; జన్మించె = పుట్టెను; వరుణుండును = వరుణుడు; హరిశ్చంద్ర = హరిశ్చంద్రుని; కుమారున్ = పుత్రుని; ఉద్దేశించి = ఘురించి;
భావము:- అని అడుగగా పుత్రుడు కలిగేలా వరుణదేవుడు వరం ఇచ్చాడు. అప్పుడు హరిశ్చంద్రునికి వరుణుని అనుగ్రహంవలన రోహితుడు అని పుత్రుడు పుట్టాడు. హరిశ్చంద్రుని పుత్రుని గురించి వరుణుడు...
తెభా-9-196-సీ.
పురిటిలోపల వచ్చి పుత్రు వేలుపు మన్నఁ-
బురుడు బోయినగాని పొసఁగ దనియె;
బలురాకమును వచ్చి బాలు వేలుపు మన్న-
బండ్లు లేకుండ నభావ్యుఁ డనియెఁ;
బండ్లు రాఁజూచి డింభకుని వేలుపు మన్నఁ-
బడి పండ్లురామి నభావ్యుఁ డనియె;
బడిపండ్లు పొడమినఁ గొడుకు వేలుపు మన్నఁ-
బోరుల కొదవక పోల దనియెఁ;
తెభా-9-196.1-ఆ.
దొడరి యిట్టు గొడుకుతోడి మోహంబునఁ
బ్రొద్దు గడుపుచుండె భూవరుండు
దండ్రి తలఁపుకొలఁది దనలోనఁ జింతించి
యింట నుండ కడవి కేఁగెఁ గొడుకు.
టీక:- పురిటి = పురిటిసుద్ధికి; లోపల = ముందు; వచ్చి = వచ్చి; పుత్రున్ = కుమారుని; వేలుపుము = బలివ్వుము; అన్నన్ = అనగా; పురుడు = పురుటుమైల; పోయినన్ = పోతే; కాని = తప్పించి; పొసగదు = కుదరదు; అనియెన్ = పలికెను; పలు = పళ్ళు; రాక = వచ్చుటకు; మును = ముందు; వచ్చి = వచ్చి; బాలున్ = పిల్లవానిని; వేలుపుము = బలిమ్ము; అన్నన్ = అనగా; పండ్లు = పళ్ళు, దంతములు; లేకుండన్ = లేకపోవుటచేత; అభావ్యుండు = తగనివాడు; అనియెన్ = పలికెను; పండ్లున్ = పళ్ళు; రాన్ = వచ్చుట; చూచి = చూసి; డింభకుని = పిల్లవానిని; వేలుపుము = బలిమ్ము; అన్నన్ = అనగా; పడిపండ్లు = పడిపళ్ళు; రామిని = రాకపోవుటచేత; అభావ్యుడు = తగనివాడు; అనియెన్ = అనెను; పడిపండ్లు = దంతములు; పొడమినన్ = వచ్చినతరువాత; కొడుకున్ = పుత్రుని; వేలుపుము = బలిమ్ము; అన్నన్ = అనగా; పోరులన్ = యుద్ధముల; కున్ = కి; ఒదవక = ఉపయోగపడకుండగ; పోలదనియెన్ = కుదరదు; అనియెన్ = చెప్పెను; తొడరి = పూని.
ఇట్టు = ఈ విధముగ; కొడుకున్ = పుత్రుని; తోడి = తోటి; మోహంబునన్ = వ్యామోహమువలన; ప్రొద్దుగడుపుచున్ = సాకులతోరోజులుగడుపుచు; ఉండెన్ = ఉండెను; భూవరుండు = రాజు; తండ్రి = తండ్రియొక్క; తలపు = భావనలోని; కొలదిన్ = లోటును, మేరను; తన = తన; లోనన్ = మనసునందు; చింతించి = విచారించి; ఇంటన్ = ఇంటిలో; ఉండకన్ = ఉండకుండ; అడవి = అడవి; కిన్ = కి; ఏగెన్ = వెళ్ళిపోయెను; కొడుకు = పుత్రుడు.
భావము:- పురిటిసుద్ధికి ముందు వచ్చి కుమారుడిని బలివ్వమని అనగా పురుటిమైల పోతే తప్ప కుదరదు అన్నాడు; పళ్ళు రాడానికి ముందు అడిగితే పళ్ళు, దంతాలు లేకపోవుటచేత తగదు అన్నాడు; పళ్ళు రాగా చూసి అడిగితే పాలపళ్ళు పడి మామూలు పళ్ళు రాకపోవుటచేత తగదు అన్నాడు; దంతాలు వచ్చాకా అడిగితే నా కొడుకు యుద్ధాలు చేసేదాకా కుదరదు అన్నాడు; ఈ మాదిరగా పుత్రుడి మీది వ్యామోహంతో సాకులు చెప్తూ హరిశ్చంద్రుడు రోజులు గడుపుతున్నాడు. తండ్రి భావనలోని లోటు, మేర గ్రహించిన కొడుకు ఇల్లు వదలి అడవికి వెళ్ళిపోయాడు.
తెభా-9-197-వ.
ఇట్లు వనంబునకుఁ జని శరశరాసన ధరుండయి రోహితుండు దిరుగుచుండి వరుణగ్రస్తుండై హరిశ్చంద్రుండు మహోదరవ్యాధిచేఁ బీడితుండుగా నుండుట విని పురంబునకుం దిరిగిరా గమకింప నింద్రుండు ముసలి తపసియై వచ్చి నిట్లనియె.
టీక:- ఇట్లు = ఈ విధముగ; వనంబున్ = అడవి; కున్ = కి; చని = వెళ్ళి; శరశరాసన = విల్లంబులు; ధరుండు = ధరించినవాడు; అయి = ఐ; రోహితుండు = రోహితుడు; తిరుగుచుండి = విహరింస్తూ; వరుణ = వరుణుని ప్రభావమునకు; గ్రస్తుండు = లోనైనవాడు; ఐ = అయ్యి; హరిశ్చంద్రుండు = హరిశ్చంద్రుడు; మహోదరవ్యాది = కడుపుబ్బరింపువ్యాధి; చేన్ = చేత; పీడితుండు = బాధింపబడువాడు; కాన్ = అయ్యి; ఉండుటన్ = ఉండుటను; విని = తెలిసి; పురంబున్ = నగరమున; కున్ = కు; తిరిగి = మరలి; రాన్ = వచ్చుటకు; గమకింపన్ = బయలుదేరుచుండగా; ఇంద్రుండు = ఇంద్రుడు; ముసలి = ముదుసలి; తపసి = ముని; ఐ = వేషమున; వచ్చి = వచ్చి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- అలా అడవికి వెళ్ళి విల్లంబులు ధరించి విచారంగా తిరుగుతున్న రోహితుడికి, వరుణుని ప్రభావం వలన తండ్రి కడుపు ఉబ్బరింపుతో బాధపడుతున్నాడు అని తెలిసింది. అతను నగరానికి మరలి వచ్చుటకు బయలుదేరుతుంటే, ఇంద్రుడు ముదుసలి ముని వేషంలో వచ్చి ఇలా చెప్పాడు.
తెభా-9-198-క.
"పుణ్యభూము లరుగు; పుణ్యతీర్థంబులఁ
గ్రుంకు; పుణ్యజనులఁ గోరి చూడు;
పుణ్యకథలు వినుము భూపాలపుత్రక!
మేలు గలుగునట్టి మేర గలదు."
టీక:- పుణ్యభూములు = పుణ్యక్షేత్రములు; అరుగు = వెళ్ళుము; పుణ్యతీర్థంబులన్ = పుణ్యతీర్థములందు; క్రుంకు = స్నానములుచేయుము; పుణ్యజనులన్ = పుణ్యాత్ములను; కోరి = యత్నించి; చూడు = దర్శించుము; పుణ్యకథలు = పవిత్రమైనచరిత్రలు; వినుము = ఆరకింపుము; భూపాలపుత్రక = రాకుమార; మేలున్ = మంచి; కలుగున్ = జరుగును; అట్టి = అటువంటి; మేర = హద్దు; కలదు = ఉన్నది.
భావము:- “ఓ రాకుమార! పుణ్యక్షేత్రలు దర్శించు. పుణ్యతీర్థాలలో స్నానాలు చెయ్యి. పుణ్యాత్ములను దర్శించు. పవిత్ర చరిత్రలు ఆలకించు. మంచి జరుగుతుంది.”
తెభా-9-199-వ.
అని యిట్లు మగిడించినం దిరిగి చని రోహితుం డొక్క యేఁ డవ్వనంబునం దిరిగి క్రమ్మఱఁ జనుదేర నింద్రుండు వచ్చి తొంటి యట్ల నివారించె; ఇవ్విధంబున.
టీక:- అని = అని; ఇట్లు = ఇలా; మగిడించిన్ = మరలించగా; తిరిగి = మరలి; చని = పోయి; రోహితుండు = రోహితుడు; ఒక్క = ఇంకొక; ఏడు = సంవత్సరము; ఆ = ఆ; వనంబునన్ = అడవిలో; తిరిగి = మసలి; క్రమ్మఱన్ = మరల; చనుదేర = బయలుదేరగా; ఇంద్రుండు = ఇంద్రుడు; వచ్చి = వచ్చి; తొంటి = ఇంతకు ముందు; అట్లు = వలెనే; నివారించెన్ = ఆపెను; ఈ = ఈ; విధంబునన్ = విధముగ.
భావము:- ఇలా ఇంద్రుడు మరలించగా ఆగిన రోహితుడు ఇంకొక సంవత్సరం అడవిలోనే మసలి మరల బయలుదేరాడు. ఇంద్రుడు మళ్ళీ వచ్చి ఇంతకు ముందులాగే ఆపాడు. ఇలా..
తెభా-9-200-సీ.
ఐదేండ్లు మరలించె నమరేంద్రుఁ డా బాలు-
నాఱవ యేఁటఁ దా నడవినుండి
యింటికి వచ్చుచు నెలమి నజీగర్తు-
మధ్యమ పుత్రు సన్మాన్యచరితు
ఘను శునశ్శేపునిఁ గొని యాగపశువుగ-
నా హరిశ్చంద్రున కాతఁ డిచ్చెఁ;
బురుషమేధము చేసి భూపాల వర్యుఁడు-
వరుణాది నిఖిల దేవతలఁ దనిపె
తెభా-9-200.1-తే.
హోత కౌశికుఁ; డధ్వర్యుఁ డొనర భృగువు;
బ్రహ్మ జమదగ్ని; సామంబు పాడువాడు
ముని వసిష్ఠుఁ; డా మఖమున ముదముఁ బొంది
కనకరథ మిచ్చె నింద్రుఁ డా మనుజపతికి.
టీక:- ఐదు = ఐదు (5); ఏండ్లు = సంవత్సరములు; మరలించెన్ = వెనుకకుపంపెను; అమరేంద్రుండు = దేవేంద్రుడు; ఆ = ఆ; బాలున్ = పిల్లవానిని; ఆఱవ = ఆరవ (6); ఏటన్ = సంవత్సరమున; తాన్ = అతను; అడవి = అడవి; నుండి = నుండి; యింటి = ఇంటి; కిన్ = కి; వచ్చుచున్ = వస్తూ; ఎలమిన్ = తెలవిగా; అజీగర్తు = అజీగర్తుని; మధ్యమ = నడిమి; పుత్రున్ = కొడుకును; సత్ = మంచి; మాన్య = గౌరవప్రదమైన; చరితున్ = వర్తనగలవానిని; ఘనున్ = గొప్పవానిని; శునశ్శేపునిన్ = శునశ్శేపుని; కొని = తీసుకొని; యాగపశువుగ = బలిపశువుగా; ఆ = ఆ; హరిశ్చంద్రున్ = హరిశ్చంద్రున; కున్ = కు; ఆతడు = అతడు; ఇచ్చెన్ = ఇచ్చెను; పురుషమేధము = నరబలి; చేసి = ఇచ్చి; భూపాల = రాజులలో; వర్యుడు = శ్రేష్ఠుడు; వరుణ = వరుణుడు; ఆది = మున్నగు; నిఖిల = సమస్తమైన; దేవతలన్ = దేవతలను; తనిపె = తృప్తిపరచెను.
హోత = హోత; కౌశికుడున్ = విశ్వామిత్రుడు; అధ్వర్యుడున్ = అధ్వర్యుడు; ఒనరన్ = చక్కగ; భృగువు = భృగువు; బ్రహ్మ = ఋత్వికుడు; జమదగ్ని = జమదగ్ని; సామంబు = సామవేదమును; పాడు = గానంచేయు; వాడు = వాడు; ముని = ఋషి; వసిష్ఠుడు = వసిష్ఠుడు; ఆ = ఆ; మఖమునన్ = యజ్ఞమునందు; ముదము = సంతోషము; పొంది = పొంది; కనక = బంగారు; రథమున్ = రథమును; ఇచ్చెన్ = ప్రసాదించెను; ఇంద్రుడు = ఇంద్రుడు; ఆ = ఆ; మనుజపతి = రాజున {మనజపతి - మానవులకుప్రభువు, రాజు}; కిన్ = కు.
భావము:- ఐదు (5) ఏళ్ళపాటు ఇంద్రుడు ఆ పిల్లవాడిని ఆపాడు. ఆరవ (6) ఏట రోహితుడు అడవి నుండి ఇంటికి వస్తూ దారిలో అజీగర్తుని నడిమి కొడుకును చక్కటి వర్తన కలవాడు ఐన శునశ్శేపుడిని చూసాడు. రోహితుడు తెలవిగా ఆ శునశ్శేపుని తీసుకు వచ్చి, హరిశ్చంద్రుడికి బలిపశువుగా ఇచ్చాడు. ఆయన నరబలి ఇచ్చి వరుణాది సకల దేవతలను తృప్తిపరచాడు. ఆ యాగానికి హోత విశ్వామిత్రుడు; అధ్వర్యుడు భృగువు; ఋత్వికుడు జమదగ్ని; సామవేదం గానంచేసే వాడు వసిష్ఠుడు; ఇంద్రుడు ఆ రాజు యజ్ఞానికి సంతోషించి బంగారు రథం ప్రసాదించాడు.
తెభా-9-201-వ.
శునశ్శేపుని ప్రభావంబు వెనుక వివరించెద; నంత భార్యాసహితుం డైన హరిశ్చంద్రు వలనం బ్రీతుండై విశ్వామిత్రుండు నిరస్తదోషుం డైన యతనికి ముఖ్యజ్ఞానంబు గృప జేసిన మనం బన్నమయంబు గావున, మనంబున నన్నరూపి యైన పృథివి నెఱంగి, పృథివిని జలంబువలన నడంచి, జలంబుఁ దేజంబువలన నింకించి, తేజంబు వాయువు వలనం జేరిచి, వాయువు నాకాశంబునం గలిపి, యాకాశంబుఁ దామసాహంకారంబునందు లయంబు చేసి, యహంకారత్రయంబు మహత్తత్త్వంబునందు డిందించి, పరతత్త్వంబునకు లోకంబులు సృజించెద నను తలంపైన మహత్తత్త్వంబు నందు విషయాకారంబు నివర్తించి, విషయవర్జితంబైన మహత్తత్త్వంబును బరతత్త్వంబుగా నెఱుంగుచు నయ్యెఱుకవలన సంసారహేతువైన ప్రకృతిని భస్మంబు చేసి, యయ్యెఱుకను నిర్వాణసుఖపారవశ్యంబునం బరిహరించి, సకలబంధవిముక్తుండై హరిశ్చంద్రుం డవాఙ్మానస గోచరంబయిన నిజరూపంబుతో వెలుంగుచుండె; నతని కుమారునకు రోహితునకు హరితుండు పుట్టె; హరితునకుఁ జంపనామ ధేయుఁడు జనియించె; నతండు దనపేర జంపానగరంబు నిర్మించె; నా చంపునికి సుదేవుండు, సుదేవునికి విజయుండు, విజయునకు రురుకుండు, రురుకునకు వృకుండు, వృకునకు బాహుకుండు జనియించి; రందు బాహుకుండు
టీక:- శునశ్శేపుని = శునశ్శేపుని; ప్రభావంబున్ = మహిమను; వెనుకన్ = తరువాత; వివరించెదన్ = తెలిపెదను; అంతన్ = అప్పుడు; భార్యా = భార్యతో; సహితుండు = కూడ ఉన్నవాడు; ఐన = అయిన; హరిశ్చంద్రున్ = హరిశ్చంద్రుని; వలనన్ = వలన; ప్రీతుండు = సంతోషించినవాడు; ఐ = అయ్యి; విశ్వామిత్రుండు = విశ్వామిత్రుడు; నిరస్త = విడిచిన; దోషుండు = దోషములుగలవాడు; ఐన = అయినట్టి; అతని = అతని; కిన్ = కి; ముఖ్య = పరమ; జ్ఞానంబున్ = విద్యను; కృపచేసినన్ = దయతోఇవ్వగా; మనంబున్ = మనస్సు; అన్నమయంబున్ = అన్నస్వరూపము; కావునన్ = కనుక; మనంబునన్ = మనసునందు; అన్న = ఆహారమును; రూపి = రూపించునది; ఐన = అయిన; పృథివిన్ = భూమిని; ఎఱింగి = తెలిసికొని; పృథివినిన్ = భూమిని; జలంబున్ = నీటి; వలనన్ = అందు; అడంచి = కలిపి; జలంబున్ = నీటిని; తేజంబున్ = తేజస్స; వలనన్ = అందు; ఇంకించి = లీనముచేసి; తేజంబున్ = తేజస్సును; వాయువు = వాయువు; వలనన్ = అందు; చేరిచి = చేర్చి; వాయువున్ = వాయువును; ఆకాశంబునన్ = ఆకాశమునందు; కలిపి = లయంజేసి; ఆకాశంబున్ = ఆకాశమును; తామసాహంకారంబు = తామసాహంకారము; అందున్ = లో; లయంబున్ = కలిసిపోవునట్లు; చేసి = చేసి; అహంకార = అహంకారములు; త్రయంబున్ = మూటిని; మహత్తత్త్వంబునన్ = మహత్తత్త్వమునందు; డిందించి = విలీనముచేసి; పరతత్త్వంబున్ = పరతత్వమున; కున్ = కు; లోకంబువ్ = లోకములను; సృజించెదను = సృష్టించెదను; అను = అనెడి; తలంపు = భావము; ఐన = అయినట్టి; మహత్తత్త్వంబునన్ = మహత్తత్త్వము; అందున్ = అందు; విషయాకారంబున్ = ఇంద్రియార్థములను; నివర్తించి = తొలగించి; విషయ = ఇంద్రియార్థమునండు; వర్జితంబు = విడువబడినది; ఐన = అయినట్టి; మహత్తత్త్వంబునున్ = మహత్తత్త్వమును; పరతత్త్వంబున్ = పరతత్వము; కాన్ = అయినట్లు; ఎఱుంగుచున్ = తెలియుచు; ఆ = ఆ; ఎఱుక = తెలివిడి, జ్ఞానము; వలనన్ = వలన; సంసార = సంసారమునపడుటకు; హేతువు = కారణభూతము; ఐన = అయినట్టి; ప్రకృతిని = ప్రకృతిని; భస్మంబు = బూడిద; చేసి = చేసి; ఆ = ఆ; ఎఱుగను = తెలవిడిని, జ్ఞానమును; నిర్వాణ = ముక్తి; సుఖ = సౌఖ్యపు; పారవశ్యంబునన్ = పరవశముతో; పరిహరించి = తొలగించి; సకల = సమస్తమైన; బంధ = బంధనములనుండి; విముక్తుండు = విడివడినవాడు; ఐ = అయ్యి; హరిశ్చంద్రుండు = హరిశ్చంద్రుడు; అవాఙ్మానస = వాక్కు మనసులకతీతమై; గోచరంబు = తెలిసెడిది; అయిన = ఐన; నిజ = ఆత్మ; రూపంబున్న = స్వరూపము; తోన్ = తోటి; వెలుంగుచున్ = ప్రకాశించుచు; ఉండెన్ = ఉండెను; అతని = అతని; కుమారున్ = పుత్రుని; కున్ = కి; రోహితున్ = రోహితుని; కున్ = కి; హరితుండు = హరితుడు; పుట్టెన్ = జన్మించెను; హరితున్ = హరితున; కున్ = కు; చంప = చంపుడు అనెడి; నామధేయుండు = పేరుగలవాడు; జనియించెన్ = పుట్టెను; అతండు = అతడు; తన = తనయొక్క; పేరన్ = పేరుతో; చంపా = చంపా యనెడి; నగరంబున్ = నగరమును; నిర్మించెన్ = కట్టించెను; ఆ = ఆ; చంపుని = చంపుని; కిన్ = కి; సుదేవుండున్ = సుదేవుడు; సుదేవుని = సుదేవుని; కిన్ = కి; విజయుండు = విజయుడు; విజయున్ = విజయుని; కున్ = కు; రురుకుండు = రురుకుడు; రురుకున్ = రురుకుని; కున్ = కి; వృకుండున్ = వృకుండును; వృకున్ = వృకున; కున్ = కు; బాహుకుండు = బాహుకుడు; జనియించిరి = పుట్టిరి; అందున్ = వారిలో; బాహుకుండు = బాహుకుడు.
భావము:- ఆ శునశ్శేపుడి మహిమను తరువాత చెప్తాను. ఆ యాగానికి సంతోషించిన విశ్వామిత్రుడు దయతో అప్పుడు దోషరహితుడు అయిన హరిశ్చంద్రుడికి అతని భార్యకి ముఖ్యజ్ఞానాన్ని ఇచ్చాడు. అంత హరిశ్చంద్రుడు మనస్సు అన్న స్వరూపము కనుక, అన్నరూపి అయిన భూమిని తెలుసుకున్నాడు. భూమిని నీటి అందు కలిపి, నీటిని తేజస్సు అందు లీనంచేసి, తేజస్సును వాయువు అందు చేర్చి, వాయువును ఆకాశమునందు లయంజేసి, ఆకాశాన్ని తామసాహంకారంలో కలిపాడు. అహంకారాలు మూటిని మహత్తత్త్వమునందు విలీనముచేసి, పరతత్వంబునకు లోకాలను సృష్టించెదను అను భావమైన మహత్తత్త్వములో ఇంద్రియార్థాలను తొలగించాడు. అవి తొలగిపోగా మహతత్వమును పరతత్వముగా తెలుసుకున్నాడు. ఆ తెలివిడి వలన సంసారానికి కారణభూతం అయిన ప్రకృతిని బూడిద చేసాడు. ఆ తెలవిడిని ముక్తి సౌఖ్యం పొందిన పరవశంతో తొలగించి, సకల బంధాలనుండి విడివడ్డాడు. అంత హరిశ్చంద్రుడు వాక్కు, మనసులు అతీతమైన ఆత్మ స్వరూపంతో ప్రకాశిస్తూ ఉన్నాడు. అతని పుత్రుడు రోహితునికి హరితుడు జన్మించాడు. హరితునకు చంపుడు పుట్టాడు. అతడు తన పేరుతో చంపానగరము నిర్మించాడు. ఆ చంపునికి సుదేవుడు, సుదేవునికి విజయుడు, విజయునికి రురుకుడు, రురుకునికి వృకుడు, వృకునకు బాహుకుడు పుట్టారు. వారిలో బాహుకుడు అను...