పోతన తెలుగు భాగవతము/నవమ స్కంధము/సగరుని కథ
సగరుని కథ
తెభా-9-202-సీ.
దండించి పగవారు దనభూమిఁ జేకొన్న-
నంగనలును దాను నడవి కేఁగి
యడవిలో ముసలియై యాతఁడు చచ్చిన-
నాతని భార్య దా ననుగమింపఁ
గదియుచో నా స్త్రీకి గర్భంబు గలుగుట-
యౌర్వమునీశ్వరుఁ డాత్మ నెఱిఁగి
వారించె; నంత నవ్వనజాక్షి సవతులు-
చూలు నిండారినఁ జూడఁ జాల
తెభా-9-202.1-తే.
కర్థి నన్నంబు గుడుచుచో నందుఁ గలిపి
విషము పెట్టిరి; పెట్టిన విరిసి పడక
గరముతోఁ గూడ సగరుండు ఘనుఁడు పుట్టి
వరయశస్ఫూర్తితోఁ జక్రవర్తి యయ్యె.
టీక:- దండించి = ఓడించి; పగవారు = శత్రువులు; తన = తనయొక్క; భూమిన్ = రాజ్యమును; చేకొన్నన్ = తీసుకొనగా; అంగనులునున్ = స్త్రీజనములు; తానున్ = తను; అడవి = అడవి; కిన్ = కి; ఏగి = వెళ్ళి; అడవి = అడవి; లోన్ = అందు; ముసలి = ముదుసలి; ఐ = అయ్యి; ఆతడున్ = అతడు; చచ్చినన్ = చనిపోగా; ఆతని = అతనియొక్క; భార్య = రాణి; తాన్ = తను; అనుగమింపన్ = సహగమనముచేయ; కదియుచోన్ = సిద్దపడుతుండగా; ఆ = ఆ; స్త్రీ = పడతి; కిన్ = కి; గర్భముగలుగుట = కడుపుతోనుండుట; ఔర్వ = ఔర్వుడు యనెడి; ముని = మునులలో; ఈశ్వరుడు = గొప్పవాడు; ఆత్మన్ = మనసులో; ఎఱిగి = తెలియుటచేత; వారించెన్ = ఆపెను; అంతన్ = అంతట; ఆ = ఆ; వనజాక్షి = సుందరి {వనజాక్షి - వనజ (పద్మముల) వంటి అక్షి (కన్నులు గలామె), అందగత్తె}; సవతులు = సపత్నులు; చూలునిండారినన్ = నవమాసములునిండగా; చూడజాలక = చూడలేక; అర్థిన్ = కావాలని; అన్నంబున్ = భోజనము; కుడుచుచోన్ = తినేటప్పుడు; అందున్ = దానిలో; కలిపి = కలిపేసి, చేర్చి.
విషమున్ = విషమును; పెట్టిరి = పెట్టిరి; పెట్టినన్ = అలా పెట్టినప్పటికి; విరిసి = విచ్చిన్నమై; పడకన్ = జారిపోక; గరము = విషము; తోగూడ = తోపాటు; సగరుండు = సగరుడు {సగరుడు - విషముతోపాటు పుట్టినవాడు}; ఘనుడు = గొప్పవాడు; పుట్టి = పుట్టి; వర = గొప్ప; యశస్ = కీర్తి; స్ఫూర్తితో = వహించి; చక్రవర్తి = సార్వభౌముడు; అయ్యెన్ = అయ్యెను.
భావము:- వృకుని కొడుకుని శత్రువులు ఓడించి రాజ్యం తీసేసుకున్నారు. అతను తన స్త్రీలతో అడవికి వెళ్ళి, ముదుసలి అయ్యి చనిపోయాడు. అతని రాణి సహగమనము చేయబోగా, ఆమె కడుపుతో ఉందని తెలిసిన ముని ఔర్వుడు ఆ ప్రయత్నం ఆపాడు. ఆ సుందరికి నవమాసములు నిండగా అసూయతో చూడలేని సపత్నులు, కావాలని విషాన్నం పెట్టారు. అలా విషం పెట్టినా గర్భం జారిపోలేదు. విషంతోపాటు సగరుడు పుట్టి, గొప్ప కీర్తి వహించి సార్వభౌముడు అయ్యాడు.
తెభా-9-203-శా.
చండస్ఫూర్తి నతండు తండ్రిపగకై సంగ్రామరంగంబులం
జెండెన్ హైహయబర్బరాదుల; వధించెం దాళజంఘాదులన్;
ముండీభూతులుగా నిరంబరులుగా మూర్తుల్ సబీభత్సలై
యుండంజేసె, నిజారులన్ సగరనామోర్వీవిభుం డల్పుఁడే.
టీక:- చండ = తీవ్రత; స్ఫూర్తిన్ = విజృంబణముతో; తండ్రి = తండ్రియొక్క; పగ = పగతీర్చుట; కై = కోసము; సంగ్రామ = యుద్ధ; రంగంబులన్ = రంగములందు; చెండెన్ = చెండాడెను; హైహయ = హైహయులు; బర్బర = బర్బ్రరులు; ఆదులన్ = మున్నగువారిని; వధించెన్ = సంహరించెను; తాళజంఘ = తాళజంఘుడు; ఆదులన్ = మున్నగువారిని; ముండీభూతులు = గుండుగీయబడినవారు; కాన్ = అగునట్లు; నిరంబరులు = వివస్త్రలు; కాన్ = అగునట్లు; మూర్తుల్ = స్వరూపాలు; సభీభత్సలు = రోతకలిగించెడివి; ఐ = అయ్యి; ఉండన్ = ఉండునట్లు; చేసెన్ = చేసెను; నిజ = తన; అరులన్ = శత్రువులను; సగర = సగరుడు అనెడి; నామ = పేరు కలిగిన; ఉర్వీవిభుండు = రాజు {ఉర్వీవిభుడు - ఉర్వీ (భూమికి) ప్రభువు, రాజు}; అల్పుడే = తక్కువవాడా, కాదు.
భావము:- ఆ సగరుడు తండ్రి పగతీర్చుట కోసం తీవ్రంగా యుద్ధాలు చేసి, హైహయులు, బర్బరులు మున్నగువారిని సంహరించాడు. తాళజంఘాదులను గుండుగీయించి, వివస్త్రలును చేయించి, వారిని కురూపులుగా చేసాడు. ఆ మహారాజు బహు గొప్పవాడు.
తెభా-9-204-క.
ఖగరాజరుచులు గల యిల
పగరాజుల నడఁచి యేలె బాహాశక్తిన్
నగరాజధీరు శూరున్
సగరున్ హతవిమతనగరుఁ జను వినుతింపన్.
టీక:- ఖగ = సూర్యుని; రాజ = చంద్రుని; రుచులు = కాంతులు; కల = ప్రసరించెడి; ఇలన్ = భూమంతటిని; పగ = శత్రు; రాజులన్ = రాజులను; అడచి = అణచేసి; ఏలెన్ = పాలించెను; బాహా = భుజ; శక్తిన్ = బలముతో; నగరాజ = మేరుపర్వతమంత; ధీరున్ = ధైర్యముగలవాని; శూరున్ = శూరత్వముగలవాని; సగరున్ = సగరుని; హత = మట్టుపెట్టిన; విమత = శత్రు; నగరున్ = నగరములు కలవానిని; చనున్ = తగినది; వినుతింపన్ = కీర్తించుట.
భావము:- శత్రు రాజులను అందరిని అణచి, సూర్య చంద్రులు ప్రకాశించే భూమండలం అంతా పాలించాడు. గొప్ప భుజబలం, మేరుపర్వత మంత ధైర్యం, శూరత్వం కలిగి శత్రు నగరాలను మట్టుపెట్టిన ఆ సగరుడు కీర్తించ తగ్గవాడు.
తెభా-9-205-సీ.
ఔర్వుండు చెప్పంగ నమర వేదాత్మకు-
హరి నీశు నమృతు ననంతుఁగూర్చి
వాజిమేధంబులు వసుధేశ్వరుఁడు చేసె-
నందొక్క మఖమున హయము విడువ
నగభేది గొనిపోయి నాగలోకంబునఁ-
గపిలుని చేరువఁ గట్టి తొలఁగెఁ;
నంత గుఱ్ఱముఁ గాన కా రాజు దన పుత్ర-
నివహంబు దిశలకు నెమకఁ బంప
తెభా-9-205.1-తే.
వారు నిల యేడు దీవుల వరుస వెదకి
మఖతురంగంబు లేకున్న మగిడి రాక
ప్రాభవంబున దోర్దండబలము మెఱసి
గ్రొచ్చి కోరాడి త్రవ్విరి కుతల మెల్ల.
టీక:- ఔర్వుండు = ఔర్వుడు; చెప్పంగన్ = సలహాప్రకారము; అమరన్ = చక్కగా; వేదాత్మకున్ = విష్ణుమూర్తిని {వేదాత్మకుడు - వేదస్వరూపుడు, విష్ణువు}; హరిన్ = విష్ణుమూర్తిని; ఈశున్ = విష్ణుమూర్తిని; అమృతున్ = విష్ణుమూర్తిని {అమృతుడు - అమృతమువంటివాడు, విష్ణువు}; అనంతున్ = విష్ణుమూర్తిని {అనంతుడు - అంతములేనివాడు, విష్ణువు}; గూర్చి = గురించి; వాజిమేధంబులున్ = అశ్వమేధయాగములు; వసుధేశ్వరుడు = రాజు {వసుధేశ్వరుడు - వసుధ (భూమి)కి ఈశ్వరుడు (ఫ్రభువు), రాజు}; చేసినన్ = ఆచరింపగా; అందున్ = వానిలో; ఒక్క = ఒకానొక; మఖంబున్ = యజ్ఞమునందు; హయమున్ = అశ్వమును; విడువన్ = వదలగా; నగభేది = ఇంద్రుడు {నగభేది - పర్వతాల గర్వమణచినవాడు, ఇంద్రుడు}; కొనిపోయి = తీసుకెళ్ళి; నాగలోకంబునన్ = పాతాళలోకమునందు; కపిలుని = కపిలుడి; చేరువన్ = దగ్గర; కట్టి = కట్టివేసి; తొలగెన్ = వెళ్ళిపోయెను; అంతన్ = అప్పుడు; గుఱ్ఱము = అశ్వము; కానక = కనబడక; ఆ = ఆ; రాజు = రాజు; తన = తనయొక్క; పుత్ర = పుత్రుల; నివహంబున్ = సమూహమును; దిశల్ = అన్నిదిక్కుల; కున్ = కు; నెమకన్ = వెదకుటకు; పంపన్ = పంపించగా.
వారు = వారు; ఇలన్ = భూమిపైన; ఏడుదీవులన్ = సప్తద్వీపములందు {సప్తద్వీపములు - 1జంబూ 2ప్లక్ష 3శాల్మలీ 4కుశ 5క్రౌంచ 6శాక 7పుష్కర అనెడి ఏడు ద్వీపములు}; వరుసన్ = వరసగా; వెదికి = అన్వేషించి; మఖతురగంబున్ = యాగాశ్వము; లేకున్న = లేకపోవుటచేత; మగిడి = వెనుదిరిగి; రాక = రాకుండగ; ప్రాభవంబునన్ = గొప్పదనము; దోర్దండ = భుజ; బలము = బలము; మెఱసి = అతిశయించునట్లు; గ్రొచ్చి = గునపములతో గ్రొచ్చి; కోరాడి = పారలతో కోరాడి; త్రవ్విరి = తవ్విపోసిరి; కుతలము = భూమండలము; ఎల్లన్ = అంతటిని.
భావము:- ఆ సగర మహారాజు, ఔర్వుడి సలహా ప్రకారం వేదాత్మకుడు, అమృతుడు, అనంతుడు, అయిన విష్ణువును గురించి అనేక అశ్వమేధయాగాలు ఆచరించాడు. వాటిలో ఒక యజ్ఞంలో వదలిన అశ్వాన్ని ఇంద్రుడు తీసుకు వెళ్ళి, పాతాళలోకంలో కపిలుడి దగ్గర కట్టివేసి వెళ్ళిపోయాడు. అప్పుడు యాగాశ్వం కనబడక ఆయన తన పుత్రులు అందరిని వెదకటానికి అన్ని దిక్కులకు పంపించాడు. వారు భూలోకంలోని సప్తద్వీపాలూ అన్వేషించినా యాగాశ్వం కనబడలేదు. వెనుదిరిగి రాకుండగ ఆ మహా భుజబల సంపన్నులు గునపాలతో భూమండలం అంత తవ్విపోసారు.
తెభా-9-206-వ.
ఇట్లు సుమతికొడుకులు నేలంద్రవ్వి పాతాళంబునం దూర్పుముట్టి యున్న నుత్తరభాగంబునం గపిలమునిపొంతనున్న తురగంబుఁ గని.
టీక:- ఇట్లు = ఈ విధముగ; సుమతి = సుమతియొక్క; కొడుకులు = పుత్రులు; నేలన్ = భూమిని; త్రవ్వి = తవ్వి; పాతాళంబునన్ = పాతాళలోకమునందు {తూర్పుముట్టియున్ననుత్తరభాగము - ఈశాన్యము}; తూర్పున్ = తూర్పుదిక్కును; ముట్టి = తగిలి; ఉన్నన్ = ఉన్నట్టి; ఉత్తర = ఉత్తరపు; భాగంబునన్ = దిశవైపున; కపిల = కపిలుడు అనెడి; ముని = ఋషి; పొంతన్ = దగ్గర; ఉన్నన్ = ఉన్నట్టి; తురగంబున్ = గుఱ్ఱమును; కని = చూసి.
భావము:- ఇలా భూమిని తవ్విన సుమతి పుత్రులు పాతాళలోకంలో ఉత్తర ఈశాన్య భాగంలో తపస్సు చేసుకుంటున్న కపిలమహర్షి దగ్గర ఉన్న గుఱ్ఱాన్ని కనుగొన్నారు.
తెభా-9-207-చ.
"ఎఱిఁగితి మద్దిరయ్య తడవేటికి? గుఱ్ఱపుదొంగ చిక్కె; నీ
జఱభుని బట్టి చంపుఁ; డతిసాధుమునీంద్రుఁడుఁబోలె నేత్రము
ల్దెఱవక బాకినోరు మెదలింపక బైసుక పట్టె" నంచు న
య్యఱువది వేవురున్ నిజకరాయుధముల్ జళిపించి డాయుచోన్.
టీక:- ఎఱిగితిమి = తెలిసికొన్నాము; అద్దిరయ్య = భళీ; తడవు = ఆలసించుట; ఏటికి = దేనికి; గుఱ్ఱపు = గుఱ్ఱం; దొంగ = దొంగ; చిక్కెన్ = దొరికెను; ఈ = ఈ; జఱభుని = రంకులాడును; పట్టి = పట్టుకొని; చంపుడు = సంహరించండి; అతి = మిక్కిలి; సాధు = సజ్జనుడైన; ముని = మునులలో; ఇంద్రుడున్ = శ్రేష్ఠుని; పోలెన్ = వలె; నేత్రముల్ = కళ్ళు; తెఱవక = తెరవకుండ; బాకి = పెద్ద; నోరు = నోటిని; మెదలింపక = మెదపకుండ; బైసుకన్ = ప్రతిజ్ఞ, పంతము; పట్టెను = పట్టెను; అంచున్ = అనుచు; ఆ = ఆ; అఱువదివేవురున్ = అరవైవేలమంది(60000); నిజ = తమ; కరా = చేతులలోని; ఆయుధముల్ = కత్తులను; జళిపించి = ఆడించి; డాయుచోన్ = దగ్గరౌతుండగ.
భావము:- వారు “భలే భలే గుఱ్ఱం దొంగ దొరికేసాడు. ఇంకా ఆలస్యం చేయడం దేనికి. దొంగను పట్టుకొని సంహరించండి.” అని అనుకున్నారు. వెంటనే ఆ అరవైవేలమంది(60000) తమ చేతులలోని కత్తులు ఆడిస్తూ కదలకుండా మెదలకుండ ఉన్న మిక్కిలి సజ్జనుడైన కపిలముని దగ్గరకు పోతుండగా....
తెభా-9-208-చ.
కపిలుఁడు నేత్రముల్ దెఱవఁగాఁ దమ మేనుల మంట పుట్టి తా
రపగతధైర్యులై పడి యఘాళికతంబున మూఢచిత్తులై
నృపసుతు లందఱున్ ధరణి నీఱయి రా క్షణమంద; సాధులం
దపసులఁ గాసిఁ బెట్టెడి మదస్ఫురితాత్ములు నిల్వనేర్తురే?.
టీక:- కపిలుడు = కపిలుడు; నేత్రముల్ = కన్నులను; తెఱవగాన్ = తెరచుట తోటి; తమ = వారి; మేనులన్ = శరీరములందు; మంట = అగ్ని; పుట్టి = జనించి; తారు = వారు; అపగత = కోల్పోయినట్టి; ధైర్యులు = ధైర్యములుగలవారు; ఐ = అయ్యి; పడి = పడిపోయి; అఘాళి = పాపాల సమూహముల; కతంబునన్ = వలన; మూఢచిత్తులు = మూర్ఖులు; ఐ = అయ్యి; నృపసుతులు = రాకుమారులు; అందఱున్ = అందరు; ధరణిన్ = నేలపై; నీఱయిరి = బూడిదైపోయిరి; ఆ = ఆ; క్షణము = క్షణము; మంద = లోనే; సాధులన్ = మంచివారిని; తపసులన్ = మునులను; గాసిబెట్టెడి = బాధించెడి; మద = గర్వముతో; స్ఫురిత = విఱ్ఱవీగెడి; ఆత్ములు = మనసులుగలవారు; నిల్వనేర్తురే = మనగలరా, లేరు.
భావము:- కపిలుడు కన్నులు తెరిచాడు. తత్క్షణం, ఆ మూర్ఖ రాకుమారుల శరీరాలలో చేసిన పాపాల వలన అగ్ని జనించి వారు నేలపై పడిపోయి బూడిదై పోయారు. మంచివారిని, మునులను బాధించి గర్వంతో విఱ్ఱవీగే వారు మనగల లేరు కదా.
తెభా-9-209-సీ.
కొందఱు కపిలుని కోపానలంబున-
మ్రందిరి సగరకుమారు లనుచు
నందు రా ముని శాంతుఁ డానందమయమూర్తి-
తొడరి కోపించునే? దువ్వ నేలఁ
గాక జన్మించునే గగనస్థలంబున?-
నే సాంఖ్యమతమున నిద్ధమతులు
భవసముద్రము మృత్యుపదమును లంఘింతు-
రా బుద్ధిఁ జేయు పరాత్మభూతుఁ
తెభా-9-209.1-తే.
డఖిలబోధకుఁ డతనికి నరసిచూడ
సఖు లమిత్రులు నెవ్వరు? సగరసుతులు
దాము దయచేయు నేరమిఁ దనువులందు
ననలకీలలు పుట్టి నీఱైరి గాక.
టీక:- కొందరు = కొంతమంది; కపిలుని = కపిలునియొక్క; కోప = కోపము యనెడి; అనలంబునన్ = అగ్నియందు; మ్రందిరి = చచ్చిరి; సగర = సగరుని; కుమారులు = పుత్రులు; అనుచున్ = అంటు; అందురు = అంటారు; ఆ = ఆ; ముని = ఋషి; శాంతుడు = శాంతస్వభావి; ఆనందమూర్తి = ఆనందస్వరూపి; తొడరి = తడబడి; కోపించునే = కోపముతెచ్చుకొనునా; దువ్వ = ధూళి; నేలన్ = నేలమీద; కాక = తప్పించి; జన్మించునే = పుట్టునా, పుట్టదు; గగనస్థలంబునన్ = ఆకాశమునందు; ఏ = ఎట్టి; సాంఖ్య = సాంఖ్యయోగ; మతమునన్ = మార్గమునందు; ఇద్ధమతులు = వివేకవంతులు; భవ = సముద్రము యనెడి; సముద్రము = సముద్రమును; మృత్యుపదమునున్ = మరణించుటను; లంఘింతురు = దాటెదరు; ఆ = అట్టి; బుద్ధిన్ = విజ్ఞానమును; చేయు = స్థాపించిన; పరాత్మభూతుడు = పరమాత్మయైనవాడు; అఖిల = సర్వ; బోధకుడు = జ్ఞాని; అతని = అతని; కిన్ = కి; అరసిచూడ = తరచిచూసినచో.
సఖులు = మిత్రులు; అమిత్రులు = శత్రులు; ఎవ్వరు = ఎవరు, లేరు; సగర = సగరుని; సుతులు = పుత్రులు; తాము = వారు; దయచేయు = చేసుకొన్న; నేరమిన్ = తప్పులవల్ల; తనువులన్ = శరీరములు; అందున్ = లో; అనల = అగ్ని; కీలలు = మంటలు; పుట్టి = జనించి; నీఱైరి = కాలుపోయిరి; కాక = తప్పకుండ.
భావము:- కొందరు తెలియక కపిలుని కోపాగ్నికి సగరుని పుత్రులు చచ్చారు అంటారు. ఆ ఋషి శాంతస్వభావి, ఆనందస్వరూపి. ఆయన తడబడి కోపం తెచ్చుకొంటాడా. ధూళి నేలమీద పుడుతుంది తప్ప ఆకాశంలో పుట్టదు కదా. సాంఖ్యయోగం తెలిసిన వివేకవంతులు జనననమరణాలనే సంసార సాగారాన్ని దాటుతారు. అట్టి విజ్ఞానాన్ని స్థాపించిన వాడు, పరమాత్మ స్వరూపుడు, సర్వం తెలిసిన వాడు అయిన కపిలునికి మిత్రులు శత్రువులు అంటూ ఎవరూ ఉండరు. ఆ సగరుని పుత్రులు వారు చేసుకొన్న తప్పులకు ఫలితంగా వారే కాలిపోయీరు.
తెభా-9-210-వ.
మఱియు సగరుండు గేశిని యందు గన్న పుత్రుం డసమంజసుం డనువాఁడు, సమంజస గుణంబులు లేక పూర్వజన్మంబున యోగీశ్వరుండై యుండి, సంగదోషంబువలన యోగభ్రష్ఠుండయి సగరునకు జన్మించి, జాతిస్మరజ్ఞానంబు గలిగి లోకంబువారలకుఁ దమ వారలకు నప్రియంబగు వర్తనంబునం దిరుగుచు నొక్కనాఁడు.
టీక:- మఱియున్ = ఇంకను; సగరుండు = సగరుడు; కేశిని = కేశిని; అందున్ = అందు; కన్న = పుట్టించిన; పుత్రుండు = కొడుకు; అసమంజసుండు = అసమంజసుడు; అను = అనెడి; వాడు = వాడు; సమంజస = సరియైన; గుణంబులు = గుణములు; లేక = లేకపోవుటచే; పూర్వ = పూర్వపు; జన్మంబునన్ = పుట్టుకలో; యోగి = యోగులలో; ఈశ్వరుండు = శ్రేష్ఠుడు; ఐ = అయ్యి; ఉండి = ఉండి; సంగ = సాంగత్య; దోషంబు = దోషము; వలనన్ = వలన; యోగ = యోగము; భ్రష్టుండు = చెడిపోయినవాడు; అయి = ఐ; సగరున్ = సగరుని; కున్ = కి; జన్మించి = పుట్టి; జాతిస్మర = పూర్వజన్మస్మృతి; జ్ఞానంబు = తెలివితేటలు; కలిగి = ఉండి; లోకంబువారల్ = లోకుల; కున్ = కు; తమ = వారి; వారల్ = వారి; కున్ = కి; అప్రియంబు = నచ్చనివి; అగు = ఐన; వర్తనంబునన్ = నడవడికతో; తిరుగుచున్ = నడుస్తూ; ఒక్క = ఒకానొక; దినమున = రోజు.
భావము:- పూర్వజన్మలో యోగశ్రేష్ఠుడు దుర్గుణుడు అయి సాంగత్య దోషం వలన యోగం చెడిన జీవుడు, సగరునికి కేశిని అందు అసమంజసుడు అనే కొడుకుగా పుట్టాడు. అతనికి పూర్వజన్మ స్మృతి తెలివితేటలు ఉన్నాయి. ఆయన లోకభిన్నమైన నడవడికతో నడుస్తూ ఉండేవాడు. ఒక నాడు....
తెభా-9-211-చ.
వరుస నయోధ్యలోనఁ గలవారల నాడెడు పిన్నవాండ్ర నా
సరయువులోనఁ వైచి జనసంఘముఁ దండ్రియుఁ దిట్టుచుండ వాఁ
డురుమతిఁ గొన్ని ప్రొద్దులకు యోగబలంబునఁ జేసి బాలురం
దిరిగి పురంబు లోపలికిఁ దెచ్చిన నివ్వెఱఁ గంది రందఱున్.
టీక:- వరుసన్ = వరసగా; అయోధ్య = అయోధ్య; లోనన్ = అందు; కల = ఉన్నట్టి; వారలన్ = వారిని; ఆడెడు = ఆడుకొనుచున్న; పిన్నవాండ్రన్ = పిల్లవాళ్ళని; ఆ = ఆ; సరయువు = సరయువునది; లోనన్ = లోనికి; వైచి = పడవేసి; జన = లోకుల; సంఘమున్ = సమూహము; తండ్రియున్ = తండ్రి; తిట్టుచుండన్ = తిడితుండగ; వాడు = వాడు; ఉరు = గొప్ప; బుద్ధిన్ = తెలివితేటలతో; కొన్ని = కొద్ది; ప్రొద్దుల్ = దినముల; కున్ = కు; యోగబలంబునన్ = యోగశక్తి; చేసి = చేత; బాలురన్ = పిల్లలను; తిరిగి = వెనక్కి; పురంబు = నగరము; లోపలి = లోని; కిన్ = కి; తెచ్చినన్ = తీసుకురాగా; నివ్వెఱగు = ఆశ్ఛర్యమును; అందిరి = పొందిరి; అందఱున్ = అందరు.
భావము:- అయోధ్యలో ఆడుకుంటున్న పిల్లలను అందరిని అసమంజసుడు సరయునదిలో పడవేసాడు. లోకులు, తండ్రి అందరూ తిట్టసాగారు. అందరు.ఆశ్ఛర్యపోయేలా, మహా జ్ఞాని అయిన ఆయన కొన్నాళ్ళ పిమ్మట తన యోగశక్తితో పిల్లలను అందరిని బ్రతికించి వెనక్కి నగరానికి లోనికి తీసుకు వచ్చాడు.
తెభా-9-212-వ.
అయ్యసమంజసుని కొడు కంశుమంతుం డనువాఁడు వినీతుండై తన యొద్దఁ బనులు జేయుచుండు నంత; సగరుండమ్మనుమని నంశుమంతు నశ్వంబు వెదకి తెమ్మనిపంచిన నతండు దనతండ్రుల చొప్పునం జని, వారలు ద్రవ్విన మహాఖాతంబుచొచ్చి, యందు భస్మరాసులపొంత నున్న హయంబుఁ గని, యా సమీపంబు నందున్న కపిలాఖ్యుం డయిన విష్ణుదేవునికి దండప్రణామంబు చేసి, యిట్లని స్తుతియించె.
టీక:- ఆ = ఆ; అసమంజసుని = అసమంజసుని; కొడుకు = పుత్రుడు; అంశుమంతుడు = అంశుమంతుడు; అను = అనెడి; వాడు = వాడు; వినీతుండు = ఒద్దికగలవాడు; ఐ = అయ్యి; తన = తన; ఒద్దన్ = దగ్గర; పనులున్ = పనులను; చేయుచుండున్ = చేస్తుండగ; అంత = అంతట; సగరుండు = సగరుడు; ఆ = ఆ; మనుమని = మనవడిని; అంశుమంతున్ = అంశుమంతుని; అశ్వంబున్ = గుఱ్ఱమును; వెదకి = అన్వేషించి; తెమ్ము = తీసుకురా; అని = అని; పంచినన్ = పంపించగా; అతండు = అతడు; తన = తనయొక్క; తండ్రుల = తండ్రుల; చొప్పునన్ = వలనే; చని = వెళ్ళి; వారలు = వారు; త్రవ్విన = తవ్వినట్టి; మహా = గొప్ప; అఖాతంబున్ = గొయ్యియందు; చొచ్చి = ప్రవేశించి; అందున్ = దానిలో; భస్మ = బూడిద; రాసుల = రాసుల; పొంతన్ = దగ్గర; ఉన్న = ఉన్నట్టి; హయంబున్ = గుఱ్ఱమును; కని = చూసి; ఆ = ఆ; సమీపంబున్ = దగ్గర; అందున్ = లో; ఉన్న = ఉన్నట్టి; కపిల = కపిలుడను; ఆఖ్యుండు = పేరుగలవాడు; అయిన = ఐన; విష్ణుదేవున్ = విష్ణుమూర్తి; కిన్ = కి; దండప్రణామంబున్ = సాష్టాంగనమస్కారములు {దండప్రణామము - దండము (కఱ్ఱ)వలె నేలపై పడి చేయు నమస్కారము, సాష్టాంగనమస్కారము}; చేసి = చేసి; ఇట్లు = ఇలా; అని = పలికి; స్తుతియించెన్ = కీర్తించెను.
భావము:- ఆ అసమంజసుని పుత్రుడు, సగరుడుని మనవడు అంశుమంతుడు మంచి ఒద్దిక గలవాడు. తాత దగ్గర పనులను చేస్తుండగా, ఆయన మనవడు అంశుమంతుని గుఱ్ఱాన్ని వెతికి తీసుకురా అని పంపించాడు. అతడు తన తండ్రులు తవ్విన ఆ పెద్ద గొయ్యి యందు ప్రవేశించి, దానిలో బూడిద రాసుల దగ్గర ఉన్న గుఱ్ఱాన్ని చూసాడు. ఆ దగ్గరలో ఉన్న భగవంతుడు కపిలునికి దండప్రణామం చేసి ఇలా కీర్తించాడు.
తెభా-9-213-సీ.
"మతిచిక్కఁబట్టి సమాధి గౌరవమున-
వాసిగాఁ దనకు నవ్వల వెలుంగు
నినుఁ గానఁ డొకనాఁడు నిన్నెఱుంగునె? బ్రహ్మ-
యజుని మనంబున నవయవముల
బుద్ధి జన్మించిన భూరిజంతువులందు-
హీనులమైన మా కెఱుఁగ వశమె?
తమలోన నీ వుండఁ దా మెఱుంగరు నిన్ను-
గుణములఁ జూతురు గుణములైనఁ
తెభా-9-213.1-తే.
గాన రొకవేళఁ జీఁకటిఁ గందు రాత్మ
లందుఁ దెలియరు వెలుపల నమరు బొందు
లరయుదురు దేహధారు లత్యంధు లగుచుఁ
గడిఁది నీ మాయ నెన్నఁడుఁ గడువ లేక."
టీక:- మతిన్ = మనసుని; చిక్కబట్టి = చిక్కబట్టుకొని; సమాధి = యోగసమాధి; గౌరవమునన్ = అవస్థలో; వాసిగా = ప్రసిద్ధమైన; తన = తన; కున్ = కు; అవ్వల = అతీతముగ; వెలుంగు = ప్రకాశించెడి; నినున్ = నిన్ను; కానడు = చూడలేడు; ఒకనాడు = ఎప్పటికిని; నిన్నున్ = నిన్ను; ఎఱుంగునె = తెలియగలడే; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; యజుని = బ్రహ్మదేవుని; మనంబునన్ = మనసునుండి; అవయవముల = అవయవములనుండి; బుద్ధిన్ = బుద్ధినుండి; జన్మించిన = పుట్టినట్టి; భూరి = అనేకమైన; జంతువులు = జీవుల; అందున్ = లో; హీనులము = అల్పులము; ఐన = అయినట్టి; మా = మా; కున్ = కు; ఎఱుగన్ = తెలిసికొనుట; వశమె = సాధ్యమా, కాదు; తమ = వారి; లోనన్ = లోనే; నీవు = నీవు; ఉండన్ = ఉండగా; తాము = వారు; ఎఱుంగరు = తెలిసికొనలేరు; నిన్నున్ = నిన్ను; గుణములన్ = త్రిగుణాత్మకంగా; చూతురు = చూచెదరు; గుణములు = లక్షణములు; ఐనన = అయినప్పటికి; కానరు = చూడలేరు; ఒకవేళ = ఏకారణంచేతనైన; చీకటి = తమోగుణమును; కందురు = దర్శించెదరు; ఆత్మన్ = తమయాత్మల; అందున్ = లో; తెలియరు = తెలిసికొనలేరు.
వెలుపలన్ = బయట; అమరు = ఉండునట్టి; బొందులన్ = రూపములను; అరయుదురు = చూచెదరు; దేహధారులు = జీవులు {దేహధారులు - శరీరములు గలవారు, జీవులు}; అతి = మిక్కిలి; అంధులు = గుడ్డివారు; అగుచున్ = ఔతూ; కడిది = దాటరాని; నీ = నీ యొక్క; మాయన్ = మాయను; ఎన్నడున్ = ఎప్పటికి; గడువలేక = దాటలేక.
భావము:- “మనసుని చిక్కబట్టుకొని యోగసమాధి సిద్ధిపొందిన ఆ బ్రహ్మదేవుడు సైతం, తనకు అతీతముగ ప్రకాశించే నిన్ను తెలియలేడు. ఆ బ్రహ్మదేవుడి మనసు నుండి అవయవాల నుండి బుద్ధి నుండి పుట్టిన అసంఖ్యాక జీవులలో అల్పులము అయిన మాకు తెలిసికొనుట ఎంత మాత్రం సాధ్యం కాదు. వారితో పాటు నీవు ఉన్నా కూడ, వారు నిన్ను తెలిసికొనలేరు. గుణ ప్రధానులు అయిన దేహధారులు, నీ మాయకు చిక్కి తమోగుణంతో బాహ్యాన్ని మాత్రమే చూస్తారు.”
తెభా-9-214-వ.
అని వినుతి చేయుచు, హయంబు విడువు మని చెప్పక తన తండ్రులు నీఱగుటం దడవక, మ్రొక్కి నిలుచున్న యంశుమంతునికిఁ గరుణావిపులుం డగు కపిలుం డిట్లనియె.
టీక:- అని = అని; వినుతి = స్తుతించుట; చేయుచున్ = చేస్తూ; హయంబున్ = గుఱ్ఱమును; విడువుము = విడిచిపెట్టుము; అని = అని; చెప్పక = చెప్పకుండ; తన = తనయొక్క; తండ్రులు = తండ్రులు; నీఱు = బూడిద; అగుటన్ = ఐపోయినందుకు; తడవక = ప్రస్తావించకుండ; మ్రొక్కి = నమస్కరించి; నిలుచున్న = నిలబడియున్న; అంశుమంతున్ = అంశుమంతుని; కిన్ = కి; కరుణావిపులుండు = దయామయుడు; అగు = ఐన; కపిలుండు = కపిలుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- అని స్తుతిస్తూ, గుఱ్ఱం విడిచిపెట్టమని కాని, తన బూడిద ఐన తండ్రులను కాని ప్రస్తావించకుండ తనకు నమస్కరించి నిలబడి ఉన్న అంశుమంతుని చూసి దయామయుడు ఐన కపిలుడు ఇలా అన్నాడు.
తెభా-9-215-క.
"గుఱ్ఱముఁ గొనిపో బుద్ధుల
కుఱ్ఱఁడ! మీ తాతయొద్దకున్ నీతండ్రుల్
వెఱ్ఱులు నీఱై రదె! యీ
మిఱ్ఱున గంగాజలంబు మెలఁగ శుభమగున్."
టీక:- గుఱ్ఱమున్ = గుఱ్ఱమును; కొనిపో = తీసుకుపో; బుద్దుల = మంచిబుద్దులగల; కుఱ్ఱడ = పిల్లవాడ; మీ = మీయొక్క; తాత = పితామహుని; ఒద్ద = దగ్గర; కున్ = కి; నీ = నీ యొక్క; తండ్రులు = తండ్రులు; వెఱ్ఱులు = తెలివితక్కువారు; నీఱు = బూడిద; ఐరి = అయిపొయారు; అదె = అదిగో; ఈ = ఈ; మిఱ్రునన్ = దిబ్బమీదకి; గంగాజలంబున్ = గంగాజలమును; మెలగన్ = ప్రవహింపజేసినచో; శుభము = మంచి; అగును = జరుగును.
భావము:- “మంచిబుద్ధులు గల పిల్లవాడ! మీ తాత దగ్గరకి గుఱ్ఱాన్ని తీసుకుపో. అదిగో చూడు అక్కడ తెలివితక్కువారైన నీ తండ్రులు కాలి బూడిద అయిపొయారు. అదే ఆ ఈ దిబ్బ. దాని మీదకి గంగాజలన్ని ప్రవహింపజేస్తే మంచి జరుగుతుంది, వారికి పుణ్యగతులు దక్కుతాయి.”
తెభా-9-216-వ.
అని పలికిన నమస్కరించి, తురంగంబుఁ గొనివచ్చి, యా సగరుని కిచ్చిన సగరు డా పశువువలన జన్నంబు కడమ నిండించి యంశుమంతునకు రాజ్యంబిచ్చి, ముక్తబంధనుండై, యౌర్వుండు చెప్పిన మార్గంబున నుత్తమ గతికిం జనియె; నంత.
టీక:- అని = అని; పలికిన = చెప్పగ; నమస్కరించి = నమస్కారముచేసి; తురగంబున్ = గుఱ్ఱమును; కొనివచ్చి = తీసుకొని వచ్చి; ఆ = ఆ; సగరున్ = సగరుని; కిన్ = కి; ఇచ్చినన్ = ఇవ్వగా; సగరుడు = సగరుడు; ఆ = ఆ; పశువు = బలిపశువు; వలన = తోటి; జన్నంబున్ = యజ్ఞము; కడమ = మిగిలినదానిని; నిండించి = పూర్తిచేసి; అంశుమంతున్ = అంశుమంతుని; కున్ = కి; రాజ్యంబున్ = రాజ్యమును; ఇచ్చి = ఇచ్చేసి; ముక్త = తెంచుకొన్న; బంధనుండు = బంధములు కలవాడు; ఐ = అయ్యి; ఔర్వుండు = ఔర్వుడు; చెప్పినన్ = తెలిపినట్టి; మార్గంబునన్ = దారిలో; ఉత్తమగతి = మోక్షమున; కున్ = కు; చనియెను = చేరెను; అంత = అంతట.
భావము:- అని అనుగ్రహించిన కపిలునికి నమస్కారము చేసి, అంశుమంతుడు గుఱ్ఱాన్ని తీసుకు వచ్చి తాత సగరునికి ఇచ్చాడు. సగరుడు మిగిలిన యజ్ఞం పూర్తిచేసాడు. అంశుమంతునికి రాజ్యం ఇచ్చి, సంసార బంధాలు తెంచుకుని, ఔర్వుడు చెప్పిన దారిలో వెళ్శి మోక్షం పొందాడు. అంతట....
తెభా-9-217-క.
జనకులు మ్రగ్గినచోటికి
ననిమిషనదిఁ దెత్తు ననుచు నటవీస్థలికిం
జని తపము చేయఁ జాలక
మనమున వగ లొలయ నంశుమంతుఁడు దీఱెన్.
టీక:- జనకులు = తండ్రులు; మ్రగ్గిన = చచ్చిపోయిన; చోటు = స్థలమున; కిన్ = కు; అనిమిషనదిన్ = దేవనది, గంగను {అనిమిషనది - అనిమిష(దేవతా) నది, గంగ}; తెత్తును = తీసుకొచ్చెదను; అనుచున్ = అంటు; అటవీ = అడవి; స్థలి = ప్రదేశమున; కిన్ = కు; చని = వెళ్ళి; తపమున్ = తపస్సు; చేయన్ = ఆచరించ; చాలక = లేక; మనమునన్ = మనసునందు; వగలు = దిగుళ్ళు; ఒలయన్ = కలుగుతుండగా; అంశుమంతుడు = అంశుమంతుడు; తీఱెన్ = మరణించెను.
భావము:- అంశుమంతుడు తండ్రులు మరణించిన చోటుకి దేవనదిని తీసుకు రావడానికి అడవికి వెళ్ళాడు. తపస్సు ఆచరించ లేక దిగులుపడి మరణించాడు.
తెభా-9-218-క.
ఆతని కొడుకు దిలీపుఁడు
భూతలమున గంగ దెచ్చి పొందించుటకై
ప్రీతిం దపంబు చేయుచు
భాతిగఁ దేలేక కాలపరవశుఁ డయ్యెన్.
టీక:- అతని = అతనియొక్క; కొడుకు = పుత్రుడు; దిలీపుడు = దిలీపుడు; భూతలమునన్ = భూమండలమునకు; గంగన్ = గంగను; తెచ్చి = తీసుకొచ్చుట; పొందించుట = సాధించుట; కై = కోసము; ప్రీతిన్ = కోరి; తపంబున్ = తపస్సు; చేయుచున్ = చేసినను; భాతిగన్ = ప్రకాశముగ; తేలేక = తీసుకురాలేక; కాలపరవశుడు = మరణించినవాడు {కాలపరవశుడు - కాలప్రభావమునకు లోనైనవాడు, మరణించినవాడి}; అయ్యెన్ = అయ్యెను.
భావము:- అతని కొడుడు దిలీపుడు కోరి తపస్సు చేసాడు. కాని భూలోకానికి గంగను తీసుకురాకుండానే మరణించాడు.