పోతన తెలుగు భాగవతము/నవమ స్కంధము/భవిష్యద్రా జేతిహాసము
భవిష్యద్రాజేతిహాసము
తెభా-9-365-తే.
పరఁగ నిక్ష్వాకుఁడును బృహద్బలుఁడు మొదలు
దుదయుఁ గాఁగల రాజులఁ దోడుతోడ
నెఱుఁగఁ జెప్పితి నీవారి; నింకమీఁదఁ
బుట్టఁ గలవారిఁ జెప్పెద భూవరేంద్ర!
టీక:- పరగన్ = ప్రసిద్ధముగ; ఇక్ష్వాకుడును = ఇక్ష్వాకుడు; బృహద్బలుడు = బృహద్బలుడు; మొదలున్ = మొదటివానిగ; తుదయున్ = చివరివానిగ; కల = ఉన్నట్టి; రాజులన్ = రాజులను గురించి; తోడుతోడన్ = వరుసగా; ఎఱుగన్ = తెలియ; చెప్పితిన్ = జేసితిని; నీ = నీకు సంబంధించిన; వారిన్ = వారిని; ఇంకమీదన్ = ఇకపైన; పుట్టగల = పుట్టబోయెడి; వారిన్ = వారిని గురించి; చెప్పెదన్ = తెలిపెదను; భూవరేంద్ర = రాజా {భూవరేంద్రుడు - భూమికి భర్త, రాజు}.
భావము:- రాజా! ఇక్ష్వాకుడితో మొదలుపెట్టి బృహద్బలుడు వరకు ఉన్న ప్రసిద్ధ రాజులు గురించి వివరంగా చెప్పాను. నీ వంశంలో ఇకపై పుట్టబోయే వారిని గురించి చెప్తాను.
తెభా-9-366-వ.
ఆ బృహద్బలునకు బృహద్రణుండును బృహద్రణునకు నురుక్షతుండును, నాతనికి వత్సప్రీతుండును, వత్సప్రీతునకుఁ బ్రతివ్యోముండును, బ్రతివ్యోమునకు భానుండును, భానునకు సహదేవుండును, సహదేవునకు బృహదశ్వుండును, బృహదశ్వునకు భానుమంతుండును, భానుమంతునకుఁ బ్రతీకాశ్వుండును, బ్రతీకాశ్వునకు సుప్రతీకుండును, సుప్రతీకునకు మేరుదేవుండును, మేరుదేవునకు సుతక్షత్రుండును, సుతక్షత్రునకు ఋక్షకుండును, ఋక్షకునకు నంతరిక్షుండును, నంతరిక్షునకు సుతపుండును, సుతపునకు నమిత్రజిత్తును, నతనికి బృహద్వాజియు, నతనికి బర్హియు, బర్హికి ధనంజయుండును, ధనంజయునకు రణంజయుండును, నతనికి సృంజయుండును, సృంజయునకు శాక్యుండును, శాక్యునకు శుద్ధాదుండును, శుద్ధాదునకు లాంగలుండును, లాంగలునకుఁ బ్రసేనజిత్తును, నతనికి క్షుద్రకుండును, క్షుద్రకునకు ఋణకుండును, ఋణకునకు సురథుండును, సురథునకు సుమిత్రుండును బుట్టుదురు; సుమిత్రుని యనంతర కాలంబున సూర్యవంశంబు నశింపఁ గలదు వీరలు బృహద్బలునినుండి క్రమంబునం బుట్టం గలవార” లని చెప్పి శుకుం డిట్లనియె.
టీక:- ఆ = ఆయొక్క; బృహద్బలున్ = బృహద్బలుని; కున్ = కి; బృహద్రణుండును = బృహద్రణుడు; బృహద్రణున్ = బృహద్రణుని; కున్ = కు; ఉరుక్షతుండును = ఉరుక్షతుడు; ఆతని = అతని; కిన్ = కి; వత్సప్రీతుండును = వత్సప్రీతుడు; వత్సప్రీతున్ = వత్సప్రీతుని; కున్ = కి; ప్రతివ్యోముండును = ప్రతివ్యోముడు; ప్రతివ్యోమున్ = ప్రతివ్యోమున; కున్ = కు; భానుండును = భానుడు; భానున్ = భానున; కున్ = కు; సహదేవుండును = సహదేవుడు; సహదేవుని = సహదేవుని; కున్ = కి; బృహదశ్వుండును = బృహదశ్వుడు; బృహదశ్వున్ = బృహదశ్వుని; కున్ = కి; భానుమంతుండును = భానుమంతుడు; భానుమంతున్ = భానుమంతుని; కున్ = కి; ప్రతీకాశ్వుండును = ప్రతీకాశ్వుడు; ప్రతీకాశ్వున్ = ప్రతీకాశ్వున; కున్ = కు; సుప్రతీకుండును = సుప్రతీకుడు; సుప్రతీకున్ = సప్రతీకున; కున్ = కు; మేరుదేవుండును = మేరుదేవుడు; మేరుదేవున్ = మేరుదేవున; కున్ = కు; సుతక్షత్రుండును = సుతక్షత్రుడు; సుతక్షత్రున్ = సుతక్షత్రున; కున్ = కు; ఋక్షకుండును = ఋక్షకుడు; ఋక్షకున్ = ఋక్షకున; కున్ = కు; అంతరిక్షుండును = అంతరిక్షుడు; అంతరిక్షున్ = అంతరిక్షున; కున్ = కు; సుతపుండును = సుతపుడు; సుతపున్ = సుతపున; కున్ = కు; అమిత్రజిత్తున్ = అమిత్రజిత్తు; అతను = అతని; కిన్ = కి; బృహద్వాజియున్ = బృహద్వాజి; అతనిన్ = అతని; కిన్ = కి; బర్హియున్ = బర్హి; బర్హి = బర్హి; కిన్ = కి; ధనంజయుండును = ధనంజయుడు; ధనంజయున్ = ధనంజయున; కున్ = కు; రణంజయుండును = రణంజయుడు; అతనిన్ = అతని; కిన్ = కి; సృంజయుండును = సృంజయుడు; సృంజయున్ = సృంజయున; కున్ = కు; శాక్యుండును = శాక్యుండు; శాక్యున్ = శాక్యున; కున్ = కు; శుద్ధాదుండును = శుద్ధాదుడు; శుద్ధాదున్ = శుద్ధాదున; కున్ = కు; లాంగలుండును = లాంగలుడు; లాంగలున్ = లాంగలుని; ప్రసేనజిత్తున్ = ప్రసేనజిత్తు; అతనిన్ = అతని; కిన్ = కి; క్షుద్రకుండును = క్షుద్రకుడు; క్షుద్రకున్ = క్షుద్రకున; కున్ = కు; ఋణకుండును = ఋణకుండును; ఋణకున్ = ఋణకున; కున్ = కి; సురథుండును = సురథుడు; సురథున్ = సురథున; కున్ = కు; సుమిత్రుండును = సుమిత్రుడు; పుట్టుదురు = పుట్టబోవుచున్నారు; సుమిత్రుని = సుమిత్రుని; అనంతర = ఆతరువాత; కాలంబున్ = కాలమునందు; సూర్యవంశంబున్ = సూర్యవంశము; నశింపగలదు = నశించిపోవును; వీరలు = వీరు; బృహద్బలుని = బృహద్బలుని; నుండి = నుండి; క్రమంబునన్ = వరుసగా; పుట్టంగల = పుట్టబోయెడి; వారలు = వారు; అని = అని; చెప్పి = తెలియజెప్పి; శుకుండు = శుకుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఆ బృహద్బలునికి బృహద్రణుడు; బృహద్రణునికి ఉరుక్షతుడు; అతనికి వత్సప్రీతుడు; వత్సప్రీతునికి ప్రతివ్యోముడు; ప్రతివ్యోమునకు భానుడు; భానునకు సహదేవుడు; సహదేవునికి బృహదశ్వుడు; బృహదశ్వునికి భానుమంతుడు; భానుమంతునికి ప్రతీకాశ్వుడు; ప్రతీకాశ్వునకు సుప్రతీకుడు; సప్రతీకునకు మేరుదేవుడు; మేరుదేవునకు సుతక్షత్రుడు; సుతక్షత్రునకు ఋక్షకుడు; ఋక్షకునకు అంతరిక్షుడు; అంతరిక్షునకు సుతపుడు; సుతపునకు అమిత్రజిత్తు; అతనికి బృహద్వాజి; అతనికి బర్హి; బర్హికి ధనంజయుడు; ధనంజయునకు రణంజయుడు; అతనికి సృంజయుడు; సృంజయునకు శాక్యుండు; శాక్యునకు శుద్ధాదుడు; శుద్ధాదునకు లాంగలుడు; లాంగలునికి ప్రసేనజిత్తు; అతనికి క్షుద్రకుడు; క్షుద్రకునకు ఋణకుండు; ఋణకునికి సురథుడు; సురథునకు సుమిత్రుడు పుడతారు. సుమిత్రుని తరువాత సూర్యవంశం నశించిపోతుంది. వీరు బృహద్బలుని తరువాత పుట్టబోయే వారు.” అని జెప్పి శుకమహర్షి మరల ఇలా చెప్పసాగాడు.