పోతన తెలుగు భాగవతము/నవమ స్కంధము/నిమి కథ

నిమి కథ

తెభా-9-367-సీ.
"న్యుఁడా యిక్ష్వాకు నయుఁడౌ నిమి యాగ-
మాచరింపఁగఁ గోరి యా వశిష్ఠు
నార్త్విజ్యమునకుఁ దా ర్థింపఁ గని యాతఁ-
డింద్రునిమఖము చేయింప నియ్య
కొనినాఁడ మఱి వత్తుఁ గొదవలే దన వచ్చి-
  "సంసార మెంతయు చంచలంబు
కాలయాపనమేల? క్రతువు చేసెద" నని-
న్య ఋత్విక్కుల తఁడు గూర్చి

తెభా-9-367.1-తే.
చేయ నింద్రుని యాగంబు చెల్లఁజేసి
గురుఁడు చనుదెంచి శిష్యుపైఁ గోప మెత్తి
"యోరి నా వచ్చునందాక నుండ" వనుచు.
తని దేహంబు పడుఁగాత ని శపించె

టీక:- ధన్యుడు = ధన్యాత్ముడు; ఆ = ఆ; ఇక్ష్వాకు = ఇక్ష్వాకునియొక్క; తనయుడు = పుత్రుడు; ఔ = అయిన; నిమి = నిమి; యాగము = యజ్ఞము; ఆచరింపన్ = చేయవలెనని; కోరి = తలచి; ఆ = ఆయొక్క; వశిష్టున్ = వశిష్టుని; ఆర్త్విజ్యమున్ = చేయించుటను; తాన్ = అతను; అర్థింపన్ = కోరగా; కని = చూసి; ఆతడు = అతను; ఇంద్రుని = ఇంద్రుడుయొక్క; మఖమున్ = యజ్ఞమును; చేయింపన్ = చేయించుటకు; ఇయ్యకొనినాడు = ఒప్పుకొంటిని; మఱి = మరలి; వత్తున్ = వచ్చెదను; కొదవ = ఇబ్బందేమి; లేదు = ఉండదు; అనన్ = అనగా; వచ్చి = వెనుకకొచ్చి; సంసారము = జీవితము; ఎంతయున్ = మిక్కిలిగ; చంచలంబు = నిలుకడలేనిది; కాలయాపన = ఆలస్యముచేయుట; ఏలన్ = ఎందుకు; క్రతువున్ = యజ్ఞమును; చేసెదను = చేసెదను; అని = అనుకొని; అన్య = మరొక; ఋత్విక్కులన్ = ఋత్విక్కులను; అతడున్ = అతడు; కూర్చి = కుదుర్చుకొని.
చేయన్ = పూర్తిచేయగా; ఇంద్రుని = ఇంద్రుడుయొక్క; యాగంబున్ = యజ్ఞమును; చెల్లజేసి = పూర్తిచేసి; గురుడు = గురువు; చనుదెంచి = వచ్చి; శిష్యున్ = శిష్యుని; పైన్ = మీద; కోపమెత్తి = కోపగించి; ఓరి = ఓయి; నా = నేను; వచ్చున్ = వచ్చెడి; అందాక = వరకు; ఉండవు = ఆగలేదు; అనుచున్ = అనుచు; అతనిన్ = అతనిని; దేహంబుపడుగాతము = మరణించుగాక; అని = అని; శపించెన్ = శాపమిచ్చెను.
భావము:- ధన్యాత్ముడు ఇక్ష్వాకుని పుత్రుడు నిమి యాగం చేయాలని తలచి వశిష్టుని చేయించమని కోరడు. అతను “ఇంద్రుడి యాగం చేయించడానికి ఒప్పుకున్నాను వెళ్ళి వస్తాను ఇబ్బందేం ఉండదు.” అన్నాడు. వశిష్టుని దగ్గరనుండి వెనక్కి వచ్చిన నిమి జీవితం నిలుకడ లేనిది ఆలస్యం చేయటం మంచిది కాదు వెంటనే యాగం చేసేస్తాను అనుకొన్నాడు. మరొక ఋత్విక్కుతో యాగం పూర్తిచేసాడు. ఇంద్రుడి యజ్ఞం పూర్తిచేసి గురువు వశిష్టుడు వచ్చి శిష్యుని మీద కోపగించి, తను వచ్చే వరకు ఆగలేదు కనుక మరణించు గాక అని శాపమిచ్చాడు.

తెభా-9-368-వ.
ఇట్లు వశిష్ఠుండు శపించిన, నిమియును వశిష్ఠుని దేహంబు పడుఁ గాక యని మరల శపియింప, నవ్వశిష్ఠుండు మిత్రావరుణుల వలనఁ గడపట నూర్వశికి జన్మించె; గురుశాపంబున బ్రహ్మజ్ఞాని యైన నిమి విగతదేహుండైన, నతని దేహంబు మునీశ్వరులు గంధ వస్తువులం బొదివి, దాఁచి దొరకొన్న సత్త్రయాగంబు చెల్లంచిరి; కడపట దేవగణంబులు మెచ్చి వచ్చిన వారలకు నిమిదేహంబు చూపి “బ్రదుకం జేయుం” డనవుడు వారలు “నిమిప్రాణంబు వచ్చుం గాక” యని పలికిన నిమి తనదేహంబు చొరనొల్లక యిట్లనియె.
టీక:- ఇట్లు = ఈ విధముగ; వశిష్ఠుండు = వశిష్ఠుడు; శపించినన్ = శపించగా; నిమియును = నిమి; వశిష్ఠుని = వశిష్ఠుని; దేహంబుపడుగాక = మరణించుగాక; అని = అని; మరల = తిరిగి; శపియింపన్ = శపించగా; ఆ = ఆ; వశిష్ఠుండు = వశిష్టుడు; మిత్రావరణుల = మిత్రావరుణుల; వలనన్ = వలన; కడపట = చివరకి; ఊర్వశి = ఊర్వశి; కిన్ = కి; జన్మించెన్ = పుట్టెను; గురు = గురువుయొక్క; శాపంబునన్ = శాపమువలన; బ్రహ్మజ్ఞాని = బ్రహ్మజ్ఞాని; ఐన = అయినట్టి; నిమి = నిమి; విగతదేహుండు = శరీరమువదలినవాడు; ఐనన్ = కాగా; అతనిన్ = అతనియొక్క; దేహంబున్ = శరీరమును; ముని = మునులలో; ఈశ్వరులు = శ్రేష్ఠులు; గంధవస్తువులన్ = సుగంధద్రవ్యములలో; పొదవి = కూర్చి; దాచి = భద్రపరచి; దొరకొన్న = ప్రారంభించిన; సత్త్రయాగంబున్ = సత్త్రయాగమున; చెల్లించిరి = పూర్తిచేసిరి; కడపట = చివరలో; దేవ = దేవతల; గణంబులున్ = సమూహములు; మెచ్చి = సంతోషించి; వచ్చిన = వచ్చినట్టి; వారలు = వారి; కున్ = కి; నిమి = నిమియొక్క; దేహంబున్ = పార్థివ శరీరమును; చూపి = చూపించి; బ్రతుంకన్ = జీవించునట్లు; చేయుండు = చేయండి; అనవుడు = అనగా; వారలు = వారు; నిమి = నిమియొక్క; ప్రాణంబు = జీవము; వచ్చుంగాక = తిరిగిపొందవలసినది; అని = అని; పలికినన్ = చెప్పగా; నిమి = నిమి; తన = తనయొక్క; దేహంబున్ = దేహమునందు; చొరన్ = ప్రవేశించుటకు; ఒల్లకన్ = అంగీకరించకుండ; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఇలా వశిష్ఠుడు నిమిని మరణించు గాక అని శపించగా, నిమి వశిష్ఠుని మరణించు గాక అని తిరిగి శపించాడు. వశిష్టుడు పిమ్మట మిత్రావరుణుల వలన ఊర్వశికి పుట్టాడు. గురుశాపంవలన బ్రహ్మజ్ఞాని నిమి శరీరంవదలాడు. అతని పార్థివ శరీరాన్ని మునిశ్రేష్ఠులు సుగంధద్రవ్యాలలో భద్రపరచి, ప్రారంభించిన సత్త్రయాగం పూర్తిచేసారు. చివరలో దేవతలు సంతోషించి రాగా వారిని నిమిని మరల జీవించేలా చేయమని వేడారు, వారు తథాస్తు అన్నారు, కాని నిమి తన దేహంలో ప్రవేశించడానికి అంగీకరించకుండ ఇలా అన్నాడు.

తెభా-9-369-మ.
"తి మోహాకులితంబు సాంద్రమమతాహంకారమూలంబు సం
నానాసుఖదుఃఖపీడిత మనిత్యం; బిట్టి దేహంబు సం
కృతి నా కేటికి? మీనజీవనము భంగిన్ భీతి బాహుళ్య మం
చిరుల్ పెద్దలు దీనిఁ జేకొనరు సర్వేశున్ హరిం గొల్చుచున్."

టీక:- అతి = మిక్కిలి; మోహా = మోహముచేత; ఆకులితంబు = కలతచెందినది; సాంద్ర = గాఢమైన; మమత = నాది; అహంకార = నేను లకు; మూలంబు = కారణభూతము; సంతత = ఎడతెగని; నానా = వివిధములైన; సుఖ = సుఖములు; దుఃఖ = దుఃఖములచే; పీడితము = పీడింపబడెడిది; అనిత్యంబు = అశాశ్వతమైనది; ఇట్టి = ఇటువంటి; దేహంబున్ = శరీరముతోటి; సంకృతి = బంధము; నా = నా; కున్ = కు; ఏటికిన్ = ఎందులకు; మీన = చేప; జీవనము = జీవితము; భంగిన్ = వలె; భీతి = భయములు; బాహుళ్యమున్ = అనేకములుకలది; అంచున్ = అనుచు; ఇతరులు = మిగతా; పెద్దలు = వివేకవంతులు; దీనిని = దీనిని; చేకొనరు = స్వీకరించరు; సర్వేశున్ = నారాయణుని; హరిన్ = నారాయణుని; కొల్చుచున్ = సేవించుచు.
భావము:- “మోహంతో మిక్కిలి కలతచెందేది మమతాహంకారాలకు కారణభూతం అయినది ఎడతెగని సుఖదుఃఖాలచే పీడింపబడేది అశాశ్వతమైనది శరీర సంబంధం. ఇటువంటి శరీర సంబంధం నాకెందుకు. వివేకవంతులు సర్వేశ్వరుడైన విష్ణుమూర్తిని సేవిస్తూ, చేప జీవితం వలె నిరంతంర మరణభయంతో సాగే ఈ దేహ బంధాన్ని స్వీకరించరు కదా.”

తెభా-9-370-వ.
అని పలికిన నిమిమాటలు క్రమ్మఱింపనేరక "శరీరులు గన్నులు దెఱచినప్పుడును, మూసినప్పుడును నిమి గానవచ్చుంగాక"యని పల్కి దేవతలు చని; రంత.
టీక:- అని = అని; పలికినన్ = అనినట్టి; నిమి = నిమియొక్క; మాటలు = పలుకులను; క్రమ్మఱింపనేరక = తిరస్కరించలేక; శరీరులు = దేహధారులు; కన్నులున్ = కళ్ళను; తెఱచినన్ = తెరచెడి; అప్పుడున్ = సమయమునందు; మూసినన్ = మూసెడి; అప్పుడును = సమయమునందును; నిమి = నిమి; కానవచ్చుంగాక = అస్థిత్వమగుగాక; అని = అని; పల్కి = నిర్ణయించి; దేవతలు = దేవతలు; చనిరి = వెళ్ళిపోయిరి; అంతన్ = అప్పుడు.
భావము:- ఇలా అన్న నిమి పలుకులను తిరస్కరించలేక, దేవతలు “దేహధారులు కన్నులు తెరచేటప్పుడు, మూసేటప్పుడు నిమి అస్థిత్వం కనబడుతుండు గాక” అని పలికి వెళ్ళిపోయారు. అప్పుడు.

తెభా-9-371-ఆ.
పెద్దలైన మునులు పృథివీస్థలికి రాజు
లేమిఁ జూచి నిమికళేబరంబు
రువ నొకఁడు పుట్టెఁ నయుండు వానిని
నకుఁ డనుచుఁ బలికె గము లెల్ల.

టీక:- పెద్దలు = వివేకవంతులు; ఐనన్ = అయినట్టి; మునులు = ఋషులు; పృథివీస్థలి = రాజ్యమున; కిన్ = కు; రాజు = పాలకుడు; లేమిన్ = లేకపోవుటను; చూచి = తెలిసి; నిమి = నిమియొక్క; కళేబరంబున్ = శవమును; తరువన్ = మధించగా; ఒకడు = ఒకానొకడు; పుట్టెన్ = కలిగెను; తనయుండు = పుత్రుడు; వానిన = అతనిని; జనకుడు = జనకుడు; అనుచున్ = అని; పలికెన్ = పేర్కొనినవి; జగములు = లోకములు; ఎల్లన్ = సమస్తమును.
భావము:- విజ్ఞులైన ఋషులు రాజ్యంలో పాలకుడు లేకపోతే అరాజకత్వం పెచ్చుమీరుతుందని, నిమి దేహాన్ని మధించరు. అప్పుడు ఒక పుత్రుడు కలిగాడు. లోకంలో అందరూ అతనిని జనకుడు అని పేర్కొన్నారు.

తెభా-9-372-వ.
మఱియు నతండు విదేహజుండు గావున వైదేహుం డనియు మథనజాతుండు గావున మిథిలుం డనియు ననం బరగె; నమ్మిథులుని చేత నిర్మితం బయినది మిథిలానగరంబు నాఁ బరగె; నా జనకునకు నుదావసుండును, నుదావసునకు నందివర్ధనుండును, నందివర్థనునకు సుకేతుండును, సుకేతునకు దేవరాతుండును, దేవరాతునకు బృహద్రథుండును బుట్టిరి; ఆతనికి మహావీర్యుండును, నతనికి సుధృతియు, నతనికిఁ ధృష్టకేతుండును, నతనికి హర్యశ్వుండును, నతనికి మరువును, నతనికిఁ బ్రతింధకుండును, నతనికిఁ గృతర యుండును, నతనికి దేవమీఢుఁడును, నతనికి విధృతుండును, నతనికి మహాధృతియు, నతనికి గీర్తిరాతుండును, నతనికి మహారోముండును, నతనికి స్వర్ణరోముండును, నతనికి హ్రస్వరోముండును, నత నికి సీరధ్వజుండును పుట్టిరి.
టీక:- మఱియున్ = ఇంకను; అతండు = అతడు; విదేహజుండు = నిర్జీవదేహమునందు పుట్టినవాడు; వైదేహుండు = వైదేహుడు; అనియున్ = అని; మథన = మధించుటచేత; జాతుండు = పుట్టినవాడు; కావున = కనుక; మిథిలుండు = మిథిలుడు; అనియున్ = అన; అనన్ = అనబడుచు; పరగెన్ = ప్రసిద్ధిని పొందెను; ఆ = ఆయొక్క; మిథులుని = మిథులునిచేత; నిర్మితంబు = కట్టించబడినది; అయినది = అయినట్టి; మిథిలానగరంబు = మిథిలానగరము; నా = అని; పరగెన్ = పిరసుద్ధమైనది; జనకున్ = జనకుని; కున్ = కు; ఉదావసుండునున్ = ఉదావసుడు; ఉదావసున్ = ఉదావసున; కున్ = కు; నందివర్దనుండును = నందివర్దనుడు; నందివర్దనున్ = నందివర్దనుని; కున్ = కి; సుకేతుండును = సుకేతుడు; సుకేతున్ = సుకేతుని; కున్ = కి; దేవరాతుండును = దేవరాతుడు; దేవరాతున్ = దేవరాతున; కున్ = కు; బృహద్రథుండును = బృహద్రథుడు; పుట్టిరి = జన్మించిరి; అతని = అతని; కిన్ = కి; మహావీర్యుండును = మహావీర్యుడు; అతని = అతని; కిన్ = కి; సుధృతియున్ = సుధృతి; అతని = అతని; కిన్ = కి; ధృష్టకేతుండును = ధృష్టకేతుడు; అతని = అతని; కిన్ = కి; హర్యశ్వుండును = హర్యశ్వుడు; అతని = అతని; కిన్ = కి; మరువునున్ = మరువు; అతని = అతని; కిన్ = కి; ప్రతింధకుండును = ప్రతింధకుడు; అతని = అతని; కిన్ = కి; కృతరయుండును = కృతరయుడు; అతని = అతని; కిన్ = కి; దేవమీఢుడున్ = దేవమీఢుడు; అతని = అతని; కిన్ = కి; విధృతుండును = విధృతుడు; అతని = అతని; కిన్ = కి; మహాధృతియున్ = మహాధృతి; అతని = అతని; కీర్తిరాతుండును = కీర్తిరాతుడు; అతని = అతని; కిన్ = కి; మహారోముండును = మహారోముడు; అతని = అతని; కిన్ = కి; స్వర్ణరోముండును = స్వర్ణరోముడు; అతని = అతని; కిన్ = కి; హ్రస్వరోముండును = హ్రస్వరోముడు; అతని = అతని; కిన్ = కి; సీరధ్వజుండును = సీరధ్వజుడు; పుట్టిరి = కలిగిరి.
భావము:- ఇంకా అతడు నిర్జీవదేహం నుండి పుట్టాడు కనుక వైదేహుడు అని; మధించుటచేత పుట్టినవాడు కనుక మిథిలుడు అని పేరు పొందాడు. ఆ మిథులునిచే కట్టించబడింది మిథిలానగరం అని ప్రసిద్ధమైంది. జనకునికి ఉదావసుడు; ఉదావసునకు నందివర్దనుడు; నందివర్దనునికి సుకేతుడు; సుకేతునికి దేవరాతుడు; దేవరాతునకు బృహద్రథుడు జన్మించారు. అతనికి మహావీర్యుడు; అతనికి సుధృతి; అతనికి ధృష్టకేతుడు; అతనికి హర్యశ్వుడు; అతనికి మరువు; అతనికి ప్రతింధకుడు; అతనికి కృతరయుడు; అతనికి దేవమీఢుడు; అతనికి విధృతుడు; అతనికి మహాధృతి; అతనికి కీర్తిరాతుడు; అతనికి మహారోముడు; అతనికి స్వర్ణరోముడు; అతనికి హ్రస్వరోముడు; అతనికి సీరధ్వజుడు పుట్టారు.

తెభా-9-373-ఆ.
తఁడు మఖము చేయ వని దున్నింపంగ
లాంగలంబుకొనను క్షణాంగి
సీత జాత యయ్యె సీరధ్వజుం డనఁ
దానఁ జెప్పఁబడియె న్యుఁ డతఁడు.

టీక:- అతడు = అతడు; మఖమున్ = యాగము; చేయన్ = చేయుటకై; అవనిన్ = భూమిని; దున్నింపగన్ = దున్నించుచుండగా; లాంగలంబు = నాగలి; కొనను = చివర; లక్షణాంగి = సౌభాగ్యవతి {లక్షణాంగి - శుభలక్షణములుగల అవయవములు గలామె, సౌభాగ్యవతి}; సీత = సీతాదేవి {సీత - సీత (నాగేటి చాలు)న పుట్టినామె, సీతాదేవి}; అయ్యె = కలిగినది; సీరధ్వజుండును = సీరధ్వజుడు {సీరధ్వజుడు - సీరము (నాగలి) ధ్వజుడు (గుర్తుగాగలవాడు), జనకుడు}; అనన్ = అని; దానన్ = అందుచేతనే; చెప్పంబడియన్ = పిలవబడెను; ధన్యుడు = ధన్యాత్ముడు; అతడు = అతను.
భావము:- ఆ సీరధ్వజుడు యాగం చేయడానికి భూమి దున్నుతుంటే, నాగలి చాలులో శుభలక్షణాంగి సీతాదేవి పుట్టింది. అందుకే ఆ పుణ్యాత్ముడిని సీరధ్వజుడు అని పిలుస్తారు.

తెభా-9-374-వ.
ఆ సీరధ్వజునకుఁ గుశధ్వజుండును, గుశధ్వజునకు ధర్మధ్వజుండు, ధర్మధ్వజునకుఁ గృతధ్వజ మితధ్వజులను వారిద్ధఱుఁ బుట్టి; రందుఁ గృతధ్వజునకుఁ గేశిధ్వజుం డుదయించె నతండు తన్నుఁ దానెఱింగెడి విద్య యందు నేర్పరి యయ్యె; మితధ్వజునకు ఖాండిక్యుం డనువాఁడు జన్మించి తండ్రివలన నెఱుక గలవాఁడయి, కర్మతంత్రంబు నేర్చి కేశిధ్వజునివలన భీతుండయి యేఁగె; ఖాండిక్యునకు భానుమంతుండును, భానుమంతునకు శతద్యుమ్నుండును శతద్యుమ్నునికి శుచియు, శుచికి సనధ్వాజుండు, సనధ్వాజునకు నూర్ధ్వకేతుండును, నూర్ధ్వకేతునకు నజుండును, నజునకుఁ గురుజిత్తును, గురుజిత్తునకు నరిష్టనేమియు, నరిష్టనేమికి శ్రుతాయువును, శ్రుతాయువునకుఁ బార్శ్వకుండును, బార్స్వకునకుఁ జిత్రరథుండును, చిత్రరథునకు క్షేమాపియు, క్షేమాపికి హేమరథుండును, హేమరథునకు సత్యరథుండును, సత్యరథునకు నుపగురుండును, నుపగురునకు నగ్నిదేవు ప్రసాదంబున నుపగుర్వుండును, నుపగుర్వునకు సావనుండును, సావనునకు సువర్చసుండును, గల్గి; రతండె సుభూషణుండని వినంబడు; నా సుభూషణునకు జయుండును, జయునకు విజయుండును, విజయునకు ధృతుండును, ధృతునకు ననఘుండును, ననఘునకు వీతిహవ్యుండును, వీతిహవ్యునకు ధృతియు, ధృతికి బహుళాశ్వుండును, బహుళాశ్వునకుఁ గృతియుఁ, గృతికి మహావశియును జన్మించిరి; వీరలు మైథిలులగు రాజులని చెప్పంబడుదురు; యోగీశ్వరప్రసాదంబున గృహస్థులయి యుండియు, బంధనిర్ముక్తులయి, యాత్మజ్ఞానంబు గలిగి నిరంతర బ్రహ్మానుసంధానంబు చేయుచునుండుదు” రని పలికి శుకయోగీంద్రుం డిట్లనియె.
టీక:- ఆ = ఆ; సీరధ్వజున్ = సీరధ్వజుని; కున్ = కి; కుశధ్వజుండును = కుశధ్వజుడు; కుశధ్వజున్ = కుశధ్వజుని; కున్ = కి; ధర్మధ్వజుండునున్ = ధర్మధ్వజుడు; ధర్మధ్వజున్ = ధర్మధ్వజుని; కున్ = కి; కృతధ్వజ = కృతధ్వజుడు; మితధ్వజ = మితధ్వజుడు; అను = అనెడి; వారు = వారు; పుట్టిరి = జన్మించిరి; అందున్ = వారిలో; కృతధ్వజున్ = కృతధ్వజుని; కున్ = కి; కేశిధ్వజుండును = కేశిధ్వజుడును; ఉదయించెన్ = జన్మించెను; అతండు = అతను; తన్నుతానెఱింగెడి విద్య = ఆత్మజ్ఞానము; అందున్ = అందు; నేర్పరి = బాగుగతెలిసినవాడు; అయ్యెన్ = అయ్యెను; మితధ్వజున్ = మితధ్వజున; కున్ = కు; ఖాండిక్యుండు = ఖాండిక్యుడు; అను = అనెడి; వాడు = అతను; జన్మించి = పుట్టి; తండ్రి = తండ్రి; వలన = నుండి; ఎఱుక = జ్ఞానము; కలవాడు = పొందినవాడు; ఐ = అయ్యి; కర్మతంత్రంబున్ = కర్మకాండలను; నేర్చి = నేర్చుకొని; కేశిధ్వజుని = కేశిధ్వజుని; వలన = ఎడల; భీతుండు = భయపడినవాడు; అయి = ఐ; ఏగెన్ = పారిపోయెను; ఖాండిక్యున్ = ఖాండిక్యున; కున్ = కు; భానుమంతుండును = భానుమంతుడు; భానుమంతున్ = భానుమంతున; కున్ = కు; శతద్యుమ్నుండును = శతద్యుమ్నుడు; శతధ్యుమ్నున్ = శతధ్యుమ్నుని; కిన్ = కి; శుచియున్ = శుచి; శుచి = శుచి; కిన్ = కి; సనధ్వాంజుండు = సనధ్వాజుడు; సనధ్వాజున్ = సనధ్వాజుని; కున్ = కు; ఊర్ధ్యకేతుండును = ఊర్ధ్వకేతుడు; ఊర్ధ్యకేతున్ = ఊర్ధ్వకేతుని; కున్ = కి; అజుండును = అజుడు; అజున్ = అజుని; కున్ = కు; కురుజిత్తునున్ = కురుజిత్తు; కురుజిత్తున్ = కురుజిత్తున; కున్ = కు; అరిష్టనేమియున్ = అరిష్టనేమి; అరిష్టనేమి = అరిష్టనేమి; కిన్ = కి; శ్రుతాయువునున్ = శ్రుతాయువు; శ్రుతాయువున్ = శ్రుతాయువున; కున్ = కు; పార్శ్వకుండును = పార్శ్వకుడు; పార్శ్వకున్ = పార్శ్వకుని; కున్ = కి; చిత్రరథుండునున్ = చిత్రరథుడు; చిత్రరథున్ = చిత్రరథున; కున్ = కు; క్షేమాపియున్ = క్షేమాపి; క్షేమాపి = క్షేమాపి; కిన్ = కి; హేమరథుండును = హేమరథుడు; హేమరథున్ = హేమరథున; కున్ = కు; సత్యరథుండును = సత్యరథుడు; సత్యరథున్ = సత్యరథున; కున్ = కు; ఉపగురుండును = ఉపగురుడు; ఉపగురున్ = ఉపగురున; కున్ = కు; అగ్నిదేవు = అగ్నిదేవునియొక్క; ప్రసాదంబున్న = అనుగ్రహమువలన; ఉపగర్వుండును = ఉపగర్వుడు; ఉపగర్వున్ = ఉపగర్వున; కున్ = కు; సావనుండును = సావనుండును; సావనున్ = సావనున; కున్ = కు; సువర్చసుండును = సువర్చసుడు; కల్గిరి = పుట్టిరి; అతండె = అతడె; సుభూషణుండు = సుభూషణుడు; అని = అని; వినంబడున్ = పిలువబడును; ఆ = ఆ; సుభాషణున్ = సుభాషణున; కున్ = కు; జయుండును = జయుడు; జయున్ = జయున; కున్ = కు; విజయుండును = విజయుడు; విజయున్ = విజయున; కున్ = కు; ధృతుండును = ధృతుడు; ధృతున్ = ధృతున; కున్ = కు; అనఘుండును = అనఘుడు; అనఘున్ = అనఘున; కున్ = కు; వీతిహవ్యుండును = వీతిహవ్యుడు; వీతిహవ్యున్ = వీతిహవ్యున; కున్ = కు; ధృతియున్ = ధృతి; ధృతి = ధృతి; కిన్ = కి; బహుళాశ్వుండును = బహుళాశ్వుడు; బహుళాశ్వున్ = బహుళాశ్వున; కున్ = కు; కృతియున్ = కృతి; కృతి = కృతి; కిన్ = కి; మహావశియును = మహావశి; జన్మించిరి = పుట్టిరి; వీరలు = వీరు; మైథిలులు = మైథిలులు; అగు = ఐన; రాజులు = రాజులు; అని = అని; చెప్పంబడుదురు = పిలువబడెదరు; యోగీశ్వర = మహాయోగుల; ప్రసాదంబునన్ = అనుగ్రహమువలన; గృహస్థులు = సంసారులు; అయి = అయ్యి; ఉండియున్ = ఉన్నను; బంధ = భంధములను; నిర్ముక్తులు = తెంచుకొన్నవారు; అయి = అయ్యి; ఆత్మజ్ఞానంబున్ = బ్రహ్మజ్ఞానము; కలిగి = పొందియుండి; నిరంతర = ఎడతెగని; బ్రహ్మా = పరబ్రహ్మముతో; అనుసంధానంబు = అనుసంధానము; చేయుచున్ = చేస్తూ; ఉండుదురు = ఉండెదరు; అని = అని; పలికి = చెప్పి; శుక = శుకుడు యనెడి; యోగి = యోగులలో; ఇంద్రుండు = ఉత్తముడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఆ సీరధ్వజునికి కుశధ్వజుడు; కుశధ్వజునికి ధర్మధ్వజుడు; ధర్మధ్వజునికి కృతధ్వజుడు, మితధ్వజుడు జన్మించారు. వారిలో కృతధ్వజునికి కేశిధ్వజుడు పుట్టాడు. అతను ఆత్మజ్ఞానం బాగా తెలిసినవాడు. మితధ్వజునకు ఖాండిక్యుడు పుట్టి తండ్రి నుండి కర్మకాండలు నేర్చుకున్నాడు. కేశిధ్వజుడికి భయపడి పారిపోయాడు. ఖాండిక్యునకు భానుమంతుడు; భానుమంతునకు శతద్యుమ్నుడు; శతధ్యుమ్నునికి శుచి; శుచికి సనధ్వాజుడు; సనధ్వాజునికి ఊర్ధ్వకేతుడు; ఊర్ధ్వకేతునికి అజుడు; అజునికి కురుజిత్తు; కురుజిత్తునకు అరిష్టనేమి; అరిష్టనేమికి శ్రుతాయువు; శ్రుతాయువునకు పార్శ్వకుడు; పార్శ్వకునికి చిత్రరథుడు; చిత్రరథునకు క్షేమాపి; క్షేమాపికి హేమరథుడు; హేమరథునకు సత్యరథుడు; సత్యరథునకు ఉపగురుడు; ఉపగురునకు అగ్నిదేవుని అనుగ్రహంతో ఉపగర్వుడు; ఉపగర్వునకు సావనుండు; సావనునకు సువర్చసుడు పుట్టారు. అతడినే సుభూషణుడు అని కూడ అంటారు. ఆ సుభాషణునకు జయుడు; జయునకు విజయుడు; విజయునకు ధృతుడు; ధృతునకు అనఘుడు; అనఘునకు వీతిహవ్యుడు; వీతిహవ్యునకు ధృతి; ధృతికి బహుళాశ్వుడు; బహుళాశ్వునకు కృతి; కృతికి మహావశి పుట్టారు. ఈ రాజులను మైథిలులు అంటారు. మహాయోగుల అనుగ్రహంవలన సంసారులై ఉన్నా భంధాలను తెంచుకొని బ్రహ్మజ్ఞానం పొంది, పరబ్రహ్మంతో ఎడతెగని అనుసంధానం కలిగి ఉంటారు.” అని చెప్పి శుకయోగి ఇలా అన్నాడు.