పోతన తెలుగు భాగవతము/నవమ స్కంధము/ఖట్వాంగుని చరిత్రము

ఖట్వాంగుని చరిత్రము

తెభా-9-253-వ.
ఆ నారీకవచుండు నిర్మూలం బయిన రవివంశంబునకు మూలం బగుటంజేసి మూలకుండనం బరఁగె నామూలకునకు విశ్వసహుండు పుట్టె విశ్వసహునకు ఖట్వాంగుడు పుట్టి చక్రవర్తి యయ్యె; నతండు.
టీక:- ఆ = ఆ; నారీకవచుండు = నారీకవచుడు; నిర్మూలంబు = పూర్తిగానశించినది; అయిన = ఐన; రవివంశంబున్ = సూర్యవంశమున; కున్ = కు; మూలంబున్ = ఆధారము; అగుటన్ = అయి ఉండుట; చేసి = వలన; మూలకుండు = మూలకుడు; అనన్ = అనగ; పరగెన్ = ప్రసిద్ధుడయ్యెను; ఆ = ఆ; మూలకున్ = మూలకుని; కున్ = కి; విశ్వసహుండు = విశ్వసహుడు; పుట్టెన్ = జన్మించెను; విశ్వసహున్ = విశ్వసహుని; కున్ = కి; ఖట్వాంగుడు = ఖట్వాంగుడు {ఖట్వాంగుడు – సూర్యవంశ చక్రవర్తి, శ్రీరాముని తాత అజుడు ఆయన తాత రఘువు ఆయన తాత ఈ ఖట్వాంగుడు}; పుట్టి = జన్మించి; చక్రవర్తి = చక్రవర్తి; అయ్యెను = అయ్యెను; అతండు = అతడు.
భావము:- ఆ నారీకవచుడు పూర్తిగా నశించిన సూర్యవంశానికి ఆధారం అయి ఉండుట వలన మూలకుడు అని కూడ పేరు పొందాడు. మూలకునికి విశ్వసహుడు జన్మించెను. విశ్వసహునికి ఖట్వాంగుడు జన్మించి చక్రవర్తి అయ్యాడు. అతడు... ,
గమనిక:- శ్రీరాముని తాత అజుడు ఆయన తాత రఘువు ఆయన తాత ఈ ఖట్వాంగుడు

తెభా-9-254-సీ.
మరులు వేఁడిన సురనాథులఁ జంపి-
త్రిశులతోఁ దన బ్రతుకుకాల
మెంతని యడిగిన నిదె నిండుచున్నది-
డవులే దేమైన డుగు మనిన
రములు గోరక రవిమానం బెక్కి-
నపురికేతెంచి త్త్వబుద్ధిఁ
రమేశ్వరుని యంద భావంబుఁ గీలించి-
  "కులదైవతద్విజకులముకంటె

తెభా-9-254.1-తే.
నంగనా ప్రాణ రాజ్య పుత్రాదు లెల్ల
గావు ప్రియములు ధర్మంబు డచి నాదు
తి ప్రవర్తింప దెన్నఁడు ది నెఱుంగ
న్య మా యీశ్వరునిఁ దక్క నుచు మఱియు.

టీక:- అమరులు = దేవతలు; వేడినన్ = కోరగా; అసుర = రాక్షస; నాథులన్ = రాజులను; చంపి = సంహరించి; త్రిదశుల = దేవతల; తోన్ = తోటి; తన = తనయొక్క; బ్రతుకుకాలము = జీవితకాలమును; ఎంత = ఇంకఎంత ఉన్నది; అని = అని; అడిగినన్ = అడుగగా; ఇదె = ఇదిగో; నిండుచున్నది = పూర్తయిపోతున్నది; తడవు = ఆలస్యము; లేదు = లేదు; ఏమైమయినన్ = ఇంకొకటేదైన; అడుగుము = కోరుము; అనినన్ = అనగా; వరములు = వరములు; కోరక = అడుగక; వర = శ్రేష్ఠమైన; విమానంబున్ = విమానమును; ఎక్కి = అధిరోహించి; తన = తనయొక్క; పురి = పట్టణమున; కిన్ = కు; ఏతెంచి = వచ్చి; తత్త్వబుద్ధిన్ = తత్వజ్ఞానముతో; పరమేశ్వరుని = భగవంతుని; అంద = ఎడలనే; భావంబున్ = మనసును; కీలించి = లగ్నముచేసి; కులదైవత = కులదేవతలైన; ద్విజ = బ్రాహ్మణ; కులము = కులపువారి; కంటెన్ = కంటె; అంగనా = భార్య.
ప్రాణ = ప్రాణములు; రాజ్య = రాజ్యాధికారము; పుత్ర = కొడుకులు; ఆదులున్ = మున్నగునవి; ఎల్ల = సమస్తమును; కావు = కావు; ప్రియములు = ఇష్టపడవలసినవి; ధర్మంబున్ = ధర్మబద్ధమును; కడచి = దాటి; నాదు = నాయొక్క; మతి = బుద్ధి; ప్రవర్తింపదు = నడవదు; ఎన్నడున్ = ఎప్పుడుకూడ; మదిన్ = మనసున; ఎఱుంగ = తెలియను; అన్యమున్ = ఇతరవిషయములు; ఆ = ఆ; ఈశ్వరుని = విష్ణుమూర్తిని; తక్కన్ = తప్పించి; అనుచున్ = అనుకొనుచు; మఱియున్ = ఇంకను.
భావము:- దేవతలు కోరగా వెళ్ళి దేవదానవ యుద్ధంలో రాక్షస రాజులను సంహరించి, దేవతలతో తన జీవితకాలం ఇంకా ఎంత ఉన్నది అని అడుగగా, “ఇదిగో పూర్తయిపోతోంది. ఆలస్యం లేదు. మరింకొక వరం కోరుకొనుము.” అనగా, ఖట్వాంగుడు వరాలు అడుగక మంచి విమానం ఎక్కి తన పట్టణానికి వచ్చాడు. ఖట్వాంగుడు అంతట భగవంతుని యందే మనసు లగ్నం చేసి కులదేవతలైన బ్రాహ్మణుల కంటె భార్యాపుత్రులు, ప్రాణాలు, రాజ్యాధికారం మున్నగునవి ఏవీ కూడ ప్రియమైనవి కావు. నా బుద్ధి ఎప్పుడూ ధర్మాన్ని అతిక్రమించి నడవదు. భగవంతుని గురించి తప్పించి ఇతరవిషయాలు మనసున ఉంచుకోదు.

తెభా-9-255-మ.
మీఁదన్ బ్రదుకేల? వేల్పులవరం బేలా? ధనం బేల? చం
గంధర్వపురీ విడంబనము లైశ్వర్యంబు లేలా? జగం
బులఁ బుట్టించు తలంపునం బ్రకృతితోఁ బొత్తై తుదిం బాసి ని
ర్మమై వాఙ్మనసామితం బగు పరబ్రహ్మంబు నేఁ జెందెదన్."

టీక:- ఇల = భూలోకము; మీదన్ = పైన; బ్రతుకు = జీవించుట; ఏలన్ = ఎందుకు; వేల్పుల = దేవతల; వరంబు = వరములు; ఏలన్ = ఎందుకు; ధనంబున్ = సంపదలు; ఏలన్ = ఎందుకు; చంచల = చంచలములైన; గంధర్వపురీ = గాలిమేడల, మేఘాలలోనగరాలు పోలిన; విడంబనములు = మోసములు; ఐశ్వర్యంబులు = సంపదలు; ఏలా = ఎందుకు; జగంబులన్ = భువనములను; పుట్టించు = పుట్టించెడి; తలంపునన్ = భావములతో; ప్రకృతి = ప్రకృతి; తోన్ = తోటి; పొత్తు = కలయికలుకలవాడను; ఐ = అయ్యి; తుదిన్ = చివరకు; పాసి = వదిలివేసి; నిర్మలము = పరిశుద్దము; ఐ = అయ్యి; వాక్ = నోటితోను; మానస = మనస్సుతోను; ఆమితంబు = అందనిది; అగు = ఐన; పరబ్రహ్మంబున్ = పరబ్రహ్మమును; నేన్ = నేను; చెందెదన్ = పొందెదను.
భావము:- భూలోకంలో ఈ బ్రతుకు ఎందుకు? దేవతల వరాలు ఎందుకు? సంపదలు ఎందుకు? చంచలమైన గంధర్వ నగారాన్ని పోలిన ఈ సంపదలు ఎందుకు? భువనాలను పుట్టించే తలంపుతో ప్రకృతితో పొత్తుపెట్టుకుని, చివరకు దానిని వదిలివేసి పరిశుద్దం అయ్యి మాటకు, మనసుకు అందని పరబ్రహ్మాన్ని నేను పొందుతాను.

తెభా-9-256-వ.
అని నిశ్చయించి.
టీక:- అని = అని; నిశ్చయించి = నిర్ణయించుకొని.
భావము:- నేను పరమాత్మను పొందెదను అని నిర్ణయించుకొని....

తెభా-9-257-మ.
సెన్ సంగములెల్లఁ బాసి నియతిన్ ట్వాంగు డశ్రాంతమై
దయ్యున్ మఱిమీఁద లే దనెడిదై ల్యాణమై యాత్మలోఁ
లఁపం బల్కగరానిదై పరమమై త్త్వజ్ఞు లూహించి హృ
జ్జజాతంబుల వాసుదేవుఁ డని సంస్ఠాపించు నా బ్రహ్మమున్.

టీక:- కలసెన్ = లీనమైపోయెను; సంగముల్ = తగులములు; ఎల్లన్ = సమస్తమును; పాసి = వదలివేసి; నియతిన్ = నిష్ఠతో; ఖట్వాంగుడు = ఖట్వాంగుడు {ఖట్వాంగుడు – సూర్యవంశ మహారాజు, శ్రీరాముని తాత అజుడు ఆయన తాత రఘువు ఆయన తాత ఈ ఖట్వాంగుడు}; అశ్రాంతము = నిరంతరమైనది; ఐ = అయ్యి; కలది = ఉన్నది; అయ్యున్ = అయిప్పటికిని; మఱి = ఇక; మీదన్ = మించినది; లేదు = లేదు; అనెడిది = అనెడిది; ఐ = అయ్యి; కల్యాణను = శుభకరము; ఐ = అయ్యి; ఆత్మ = మనసుల; లోన్ = అందు; తలపన్ = ఊహించుటకు; పల్కన్ = చెప్పుటకు; రానిది = శక్యముకానిది; ఐ = అయ్యి; పరమము = అత్యున్నతము; ఐ = అయ్యి; తత్త్వజ్ఞులు = పరమజ్ఞానులు; ఊహించి = తరచితరచి; హృత్ = హృదయములు అనెడి; జలజాతంబులన్ = పద్మములందు; వాసుదేవుడు = వాసుదేవుడు {వాసుదేవుడు - హృత్పద్మముల వసించువాడు, విష్ణువు}; అని = అని; సంస్థాపించున్ = నిలుపుకొనెడిదియైన; ఆ = ఆ; బ్రహ్మమున్ = పరబ్రహ్మను.
భావము:- ఆ ఖట్వాంగుడు లౌకికబంధాలు అన్నీ తెంచేసుకుని, నిష్ఠతో శాశ్వతమైనది, తనకు మించినది లేనిది, మిక్కిలి శుభకరమైనది, మనసు ఊహకు అందనిది, చెప్పుటకు సాధ్యం కానిది, సర్వోన్నతమైనది, తత్త్వజ్ఞానులు తమ హృదయపద్మాల యందు వాసుదేవుడని సంస్థాపించుకొనునది అయిన ఆ పరబ్రహ్మంలో లీనం అయిపోయాడు.