పోతన తెలుగు భాగవతము/ద్వితీయ స్కంధము/ధారణా యోగ విషయంబు
తెభా-2-12-వ.
వినుము; నీకు నేడు దివసంబులకుం గాని జీవితాంతంబు గాదు; తావత్కాలంబునకుం బారలౌకిక సాధనభూతం బగు పరమకల్యాణంబు సంపాదింపవచ్చు, నంత్యకాలంబు డగ్గఱినన్ బెగ్గడిలక దేహి దేహ, పుత్ర, కళత్రాది సందోహంబువలని మోహసాలంబు నిష్కామకరవాలంబున నిర్మూలనంబు సేసి, గేహంబు వెడలి పుణ్య తీర్థజలావగాహంబు సేయుచు, నేకాంత శుచిప్రదేశంబున విధివత్ప్రకారంబునం గుశాజిన చేలంబులతోడం గల్పితాసనుండై, మానసంబున నిఖిల జగత్పవిత్రీకరణ సమర్థం బై, యకారాది త్రివర్ణ కలితంబై, బ్రహ్మబీజంబయిన ప్రణవంబు సంస్మరించుచు, వాయువుల జయించి, విషయంబుల వెంటనంటి పాఱెడి యింద్రియంబుల బుద్ధిసారథి యై మనోనామకంబు లైన పగ్గంబుల బిగ్గఁబట్టి మ్రొగ్గం దిగిచి, దట్టంబులైన కర్మ ఘట్టంబుల నిట్టట్టు మెట్టెడి మనంబును శేముషీ బలంబున నిరోధించి, భగవదాకారంబు తోడ బంధించి, నిర్విషయంబైన మనంబున భగవత్పాదా ద్యవయవంబులం గ్రమంబున ధ్యానంబు సేయుచు, రజస్తమోగుణంబులచేత నాక్షిప్తంబును విమూఢంబునగు చిత్తంబునం దద్గుణంబులవలన నయ్యెడి మలంబుల ధారణావశంబునం బోనడిచి, నిర్మలచిత్తంబునం బరమంబైన విష్ణుపదంబునకుం జను ధారణానియమంబు గలుగ సుఖాత్మకం బగు విషయంబు నవలోకించు యోగికి భక్తిలక్షణంబైన యోగాశ్రయంబున వేగంబ మోక్షంబు సిద్ధించు"ననిన యోగీంద్రునకు నరేంద్రుం డిట్లనియె.
టీక:- వినుము = విను; నీకున్ = నీకు; ఏడు = ఏడు (7); దివసంబులకున్ = దినములకు {దినభాగములు - (పగలు, రేయి - ముహుర్తములు) - 2 X 15 (ఒక్కోటి 48 ని. లకు సమానము) - 1 రౌహిణేయము 2 విరించము 3 సోమము 4 నిరృతి 5 మహేంద్రము 6 వరుణము 7 భటము 8 రౌద్రము 9 శ్వేతము 10 మైత్రము 11 శారభటము 12 సావిత్రము 13 విజయము 14 గాంధర్వము 15 కుతపము}; కాని = కాని; జీవిత = జీవితము; అంతంబున్ = అంతము; కాదు = అవ్వదు; తావత్ = ఆ యొక్క; కాలంబునకున్ = సమయమునకు; పార = ఉన్నతమైన; లౌకిక = లోకములకు సంబంధించిన {పారలౌకికము - ఆముష్మికము}; సాధన = సాధనమునకు; భూతంబు = కారణభూతము; అగు = అయినట్టి; పరమ = గొప్ప; కల్యాణంబున్ = శుభకరము; సంపాదిపన్ = సంపాదించుకొన; వచ్చున్ = వచ్చును; అంత్య = అవసాన (మరణ); కాలంబు = సమయము; డగ్గఱినన్ = దగ్గరైందని; బెగ్గడిల్లక = తల్లడిల్లక; దేహి = దేహధారి (మనిషి); దేహ = శరీరము; పుత్ర = సంతానము; కళత్ర = భార్య; ఆది = మొదలగు; సందోహంబున్ = సమూహము; వలని = అందు; మోహన్ = మోహ మనెడి; సాలంబున్ = వృక్షమును; నిష్కామ = కోరికలు లేకుండుట అను; కరవాలంబునన్ = కత్తితో; నిర్మూలనంబున్ = మొదలంటా నరికివేయుట; చేసి = చేసినవాడై; గేహంబున్ = ఇంటినుండి; వెడలి = వెలువడి; పుణ్య = పవిత్రమైన; తీర్థ = తీర్థస్థలములలో; జల = నీటి యందు; అవగాహంబున్ = స్నానములు; చేయుచున్ = చేస్తూ; ఏకాంత = ఒంటరిగ, కలతలులేని; శుచి = శుభ్రమైన; ప్రదేశంబునన్ = స్థలము నందు; విధివత్ = శాస్త్రమున విధింపబడినట్లు, పద్ధతి; ప్రకారంబునన్ = ప్రకారముగ; కుశ = దర్భలు; అజిన = చర్మ; చేలంబులన్ = వస్త్రములు; తోడన్ = తో; కల్పిత = ఏర్పరుచుకొనిన; ఆసనుండు = ఆసనము కలవాడు, ఆసీనుడు; ఐ = అయి; మానసంబునన్ = మనస్సులో; నిఖిల = సమస్త; జగత్ = జగత్తును; పవిత్రీ = పవిత్ర మగునట్లు; కరణ = చేయుటకు; సమర్థంబు = సామర్థ్యము కలది; ఐ = అయినట్టి; అకార = అకారము {అకారాది త్రి వర్ణ కలితంబు - అకారము (సృష్టి) + ఉకారము (స్థితి) + పూర్ణానుస్వారము (లయము) కలిగిన ఓంకారము}; ఆది = మొదలగు; త్రి = మూడు; వర్ణ = వర్ణములు; కలితంబున్ = కలిగినది; ఐ = అయి; బ్రహ్మ = బ్రహ్మ తత్త్వమునకు; బీజంబు = మూలకారణమైనది; అయిన = అయినట్టి; ప్రణవంబున్ = ఓంకారమును; సం = చక్కగా; స్మరించుచు = జపించుచు; వాయువులన్ = ప్రాణములను - లోని వాయువులను; జయించి = నియమించి; విషయంబుల = ఇంద్రియార్థముల {ఇంద్రియ విషయములు - శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు}; వెంటన్ = వెనుకను; అంటి = పడి; పాఱెడి = పోవు; ఇంద్రియములన్ = ఇంద్రియములను; బుద్ధి = బుద్ధి అను; సారథిన్ = నడపించువానిని; ఐ = కలిగి; మనః = మనస్సు అను; నామకంబులు = పేరుగలవి; ఐన = అయినట్టి; పగ్గంబులన్ = పగ్గములతో; బిగన్ = గట్టిగ - బిగించి; పట్టి = పట్టుకొని; మ్రొగ్గన్ = వంచి; తిగిచి = లొంగదీసుకొని; దట్టంబులు = దట్టములు; ఐన = అయినట్టి; కర్మ = కర్మలు అను; ఘట్టంబులన్ = అడవులలో; ఇట్టట్టు = అటునిటూ; మెట్టెడి = తిరుగు; మనంబున్ = మనస్సును; శేముషీ = ప్రజ్ఞా - బుద్ధి; బలంబునన్ = బలమున - శక్తిచేత; నిరోధించి = నిరోధించి - నియమించి; భగవత్ = భగవంతుని; ఆకారంబున్ = ఆకారము; తోడన్ = తో; బంధించి = బంధించేసి; నిర్విషయంబు = విషయబంధనములులేనిది - స్వేచ్చి; ఐన = అయినట్టి; మనంబునన్ = మనస్సులో; భగవత్ = భగవంతుని; పాద = పాదములు; ఆది = మొదలగు; అవయవంబులన్ = అవయవములను; క్రమంబునన్ = క్రమముగ; ధ్యానంబున్ = ధ్యానము; చేయుచున్ = చేస్తూ; రజస్ = రజో; తమః = తమో; గుణంబులన్ = గుణములు; చేతన్ = చేత; ఆక్షిప్తంబునున్ = లాగబడినదియు; విమూఢంబున్ = మిక్కిలి మోహము చెందినదియు; అగు = అయిన; చిత్తంబునన్ = మనస్సు; తత్ = ఆ; గుణంబుల = గుణములు; వలనన్ = వలన; అయ్యెడి = కలుగు; మలంబులన్ = మలంబులను - మురికిని; ధారణా = ధారణ చేయుట; వశంబునన్ = ద్వారా; పోనడిచి = పోగొట్టి; నిర్మల = మలంబులు లేని - అమలమైన; చిత్తంబునన్ = మనస్సుతో; పరమంబు = అత్యుత్తమము; ఐన = అయినట్టి; విష్ణు = వైష్ణవ - వైకుంఠ; పదంబున్ = లోకము - పరమ పదము; కున్ = నకు; చనున్ = వెళ్ళును; ధారణా = ధారణచే; నియమంబున్ = నియమింపబడుట; కలుగన్ = కలుగగ; సుఖ = ఆనందము యొక్క; ఆత్మకంబు = స్వరూపము కలది; అగు = అయిన; విషయంబున్ = విషయమును; అవలోకించు = అనుభవించుచున్న; యోగి = యోగి; కిన్ = కి; భక్తి = భక్తి యొక్క; లక్షణంబు = లక్షణము; ఐన = కలిగిన; యోగ = యోగమును; ఆశ్రమంబునన్ = ఆశ్రయించుట వలన; వేగంబ = శ్రీఘ్రమే; మోక్షంబు = మోక్షము; సిద్ధించున్ = కలుగును; అనిన = అనగా; యోగి = యోగులలో; ఇంద్రుండు = శ్రేష్ఠున; కున్ = కు; నర = నరులకు; ఇంద్రుండు = ప్రభువు - మహారాజు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.
భావము:- రాజేంద్రా! విను. నీకు ఏడు రోజులు తర్వాత గదయ్యా మరణం. ఆపాటి సమయంలో పరలోకసాధనమైన పరమశుభాన్ని ఆర్జించడానికి ఎంతో అవకాశం ఉంది. అవసానకాలం సమీపించగానే భయపడకుండా దేహధారియైన వాడు శరీరం, భార్యాపుత్రులు మొదలైన వాటిపైగల మోహమనే వృక్షాన్ని నిష్కామమనే ఖడ్గంతో తెగనరకాలి. ఇల్లు వదలి పవిత్రమైన తీర్థజలాల్లో స్నానమాడుతూ ప్రశాంతమైన ఏకాంత ప్రదేశం చేరుకోవాలి. అక్కడ శాస్త్రం విధించినట్లు దర్భలూ, జింకచర్మము, వస్త్రము పరచుకొని కూర్చోవాలి. జగమంతా పవిత్రం చెయ్యగలదీ, అకార ఉకార మకారాలనే మూడక్షరాలతో కూడినదీ, బ్రహ్మ బీజమూ ఐన ఓంకారాన్ని మనస్సులో స్మరిస్తూ ఉచ్చ్యాస నిశ్శ్వాసాలను వశపరచుకోవాలి. ఆ పైన విషయాల వెంబడి పరుగిడే ఇంద్రియాలను బుద్ధి అనే సారథితోను, మనస్సనే పగ్గంతోను బిగబట్టి నిగ్రహించాలి. గట్టివైన కర్మబంధాలలో చిక్కుకొని ఊగిసలాడే చిత్తాన్ని ప్రజ్ఞాబలంతో నిరోధించి భగవంతుని మీద నిశ్చలంగా నిలపాలి. విషయరహితమైన మనస్సుతో ఆ దేవుని కరచరణాదులైన అవయవాలను క్రమంగా ధ్యానం చేయాలి. రజోగుణం చేత తమోగుణం చేత ఆకర్షింపబడి మోహానికి లోనయ్యే మనస్సును, ఆ గుణాలవల్ల కలిగిన మాలిన్యాలను ధారణతో తొలగించి నిర్మలం చెయ్యాలి. అలా చేసినవాడు సర్వోత్కృష్టమైన విష్ణుపదం చేరుతాడు. ధారణానియమం సిద్ధిస్తే ఆతడు సుఖమయమైన విషయాన్ని చూస్తాడు. అట్టి యోగి భక్తిలక్షణమైన యోగాన్ని ఆశ్రయించి శ్రీఘ్రమే మోక్షం చూరగొంటాడు.” ఈ విధంగా పలుకుతున్న శుకయోగీంద్రునితో పరీక్షిన్నరేంద్రుడు ఇలా అన్నాడు.
తెభా-2-13-క.
"ధారణ యే క్రియ నిలుచును?
ధారణకే రూప? మెద్ది ధారణ యనఁగా?
ధారణ పురుషు మనోమల
మేరీతి హరించు? నాకునెఱిఁగింపఁగదే."
టీక:- ధారణ = ధారణ {ధారణ - భగవంతునిఁదప్ప మఱియొకటినెఱుఁగమి; (ఇది యమము, నియమము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధ్యానము, ధారణ, మననము, సమాధి అను అష్ట యోగాంగములలో నొకటి.)}; ఏ = ఏ; క్రియన్ = విధముగ; నిలుచును = నిలబడును; ధారణ = ధారణ; కిన్ = కి; ఏ = ఏది; రూపము = రూపము; ఎద్ది = ఏది; ధారణ = ధారణ; అనగాన్ = అనగా; ధారణ = ధారణ; పురుషు = మానవుల; మనో = మనసు నందలి; మలమున్ = మలమును - మురికిని; ఏ = ఏ; రీతిన్ = విధముగ; హరించున్ = పోగొట్టును; నాకున్ = నాకు; ఎఱిఁగింపన్ = తెలియజేయ; కదే = వలసినది.
భావము:- "ధారణ ఎలా నిలుస్తుంది మహర్షీ! దాని స్వరూపం ఎట్టిది ధారణ అంటే ఏమిటి అది జీవుని చిత్తమాలిన్యాన్ని ఎలా పోగొడుతుంది దయచేసి నాకు తెలియపరచండి.”
తెభా-2-14-వ.
అనిన విని రాజునకు నవధూత విభుం డిట్లనియె.
టీక:- అనిన = అనగా; విని = విని; రాజు = పరీక్షన్మహారాజు; కున్ = నకు; అవధూత = అవధూతలలో, సన్యాసులలో {అవధూత - బ్రహ్మనిష్ఠతో వర్ణాశ్రమాచారములను విడిచిన సన్యాసి, దిగంబర రూప సన్యాసి}; విభుండు = శ్రేష్ఠుడు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.
భావము:- ఆ మాటలు విని అవధూతలలో శ్రేష్ఠుడైన శుకుడు పరీక్షిత్తు మహారాజును జూసి ఇలా పలికాడు.
తెభా-2-15-ఆ.
"పవనములు జయించి పరిహృతసంగుఁడై
యింద్రియముల గర్వమెల్ల మాపి
హరి విశాలరూపమందుఁ జిత్తముఁ జేర్చి
నిలుపవలయు బుద్ధి నెఱపి బుధుఁడు.
టీక:- పవనములు = ప్రాణవాయువులను; జయించి = నిగ్రహించి; పరిహృత = పరిహరింపబడిన; సంగుఁడు = సంగములు కలవాడు; ఐ = అయి; ఇంద్రియములన్ = ఇంద్రియముల; గర్వము = మదమును; ఎల్లన్ = అంతను; మాపి = నశింపజేసి; హరి = భగవంతుని; విశాల = విశాలమైన, విశ్వ; రూపము = రూపము; అందున్ = అందు; చిత్తమున్ = మనస్సును; చేర్చి = చేర్చి; నిలుప = నిలుప; వలయున్ = వలెను; బుద్ధిన్ = ప్రజ్ఞను; నెఱపి = ప్రయోగించి; బుధుఁడు = బుద్ధిమంతుడు.
భావము:- “పండితుడైనవాడు శ్వాసవాయువులను జయించి, సంసారం తోడి తగులం వదలిపెట్టి, ఇంద్రియాల గర్వమంతా అణచి బుద్ధిబలంతో మనస్సును విష్ణుదేవుని విశాల స్వరూపం యందు స్థిరంగా నిలపాలి.