పోతన తెలుగు భాగవతము/ద్వాదశ స్కంధము/పురాణగ్రంథ సంఖ్యలు
←ద్వాదశాదిత్యప్రకారంబు | తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/ద్వాదశ స్కంధము) రచయిత: నారయ |
పూర్ణి→ |
తెభా-12-48-వ.
మఱియు నష్టాదశపురాణంబు లందలి గ్రంథసంఖ్య లెట్లనిన బ్రహ్మపురాణంబు దశసహస్రగ్రంథంబు; పాద్మంబేఁ బదియైదువేలు; విష్ణుపురాణం బిరువదిమూఁడుసహస్రంబులు; శైవంబు చతుర్వింశతిసహస్రంబులు; శ్రీభాగవతం బష్టాదశసహస్రంబులు; నారదంబు పంచవింశతిసహస్రంబులు; మార్కండేయంబు నవసహస్రంబు; లాగ్నేయంబు పదియేనువేలనన్నూఱు; భవిష్యోత్తరంబు పంచశతాధికచతుర్దశసహస్రంబులు; బ్రహ్మకైవర్తం బష్టాదశసహస్రంబులు; లైగం బేకాదశసహస్రంబులు; వారాహంబు చతుర్వింశతిసహస్రంబులు; స్కాదం బెనుబదియొక్కవేల నూఱు; వామనంబు దశసహస్రంబులు; కౌర్మంబు సప్తదశసహస్రంబులు; మాత్స్యంబు చతుర్దశసహస్రంబులు; గారుడంబు పందొమ్మిది సహస్రంబులు; బ్రహ్మాండంబు ద్వాదశసహస్రంబు లిట్లు చతుర్లక్షగ్రంథ సంఖ్యాప్రమాణంబులం బ్రవర్తిల్లు నీ పదునెనిమిది పురాణంబుల మధ్యంబున నదుల యందు భాగీరథి విధంబున, దేవతల యందుఁ బద్మగర్భుని మాడ్కిఁ, దారకలందుఁ గళానిధి గరిమ, సాగరంబులందు దుగ్దార్ణవంబు చందంబున, నగంబులను హేమనగంబు భాతి, గ్రహంబుల విభావసుకరణి, దైత్యులందుఁ బ్రహ్లాదుని భంగి, మణులందుఁ బద్మరాగంబు రేఖ, వృక్షంబులందు హరిచందనతరువు రీతి, ఋషులందు నారదు మాడ్కి, ధేనువులందు గామధేనువు పోల్కి, సూక్ష్మంబులందు జీవుని తెఱంగున, దుర్జయంబు లందు మనంబు చొప్పున, వసువు లందు హవ్యవాహనుని పోఁడిమి, నాదిత్యులందు విష్ణువు కరణి, రుద్రుల యందు నీలలోహితుని రీతిని, బ్రహ్మలందు భ్రుగువు సొబగున, సిద్ధుల యందుఁ గపిలుని లీల, నశ్వంబులందుఁ నుచ్ఛైశ్శ్రవంబులాగున, దర్వీకరంబులందు వాసుకి రూపంబున, మృగములందుఁ గేసరి చెలువున, నాశ్రమంబులందు గృహస్థాశ్రమంబు క్రియ, వర్ణంబులలో నోంకారంబు నిరువున, నాయుధంబులఁ గార్ముకంబు సోయగంబున, యజ్ఞంబుల జపయజ్ఞంబు చాడ్పున, వ్రతంబులం దహింస కరణి, యోగంబు లందాత్మయోగంబు రమణ, నోషధుల యందు యవల సొబగున, భాషణంబులందు సత్యంబు ఠేవ, ఋతువులందు వసంతంబు ప్రౌఢి, మాసంబులందు మార్గశీర్షంబు మహిమ, యుగంబులందుఁ గృతయుగంబు నోజఁ దేజరిల్లు; నిట్టి భాగవతపురాణంబు పఠియించి విష్ణుసాయుజ్యంబుఁ జెందుదు" రని మఱియు నిట్లనియె.
టీక:- మఱియున్ = ఇంకను; అష్టాదశ = పద్దెనిమిది (18); పురాణంబులు = పురాణములు; అందలి = లోని; గ్రంథసంఖ్యలు = శ్లోకముల లెక్కలు {గ్రంథసంఖ్యలు - గ్రంథములలోని శ్లోకముల పరిమాణములు}; ఎట్లు = ఎలా ఉన్నాయి; అనినన్ = అన్నచో; బ్రహ్మపురాణంబు = బ్రహ్మపురాణము; దశసహస్ర = పదివేల (10,000) (శ్లోకాలుగల); గ్రంథంబు = గ్రంథము, పుస్తకము; పాద్మంబు = పద్మపురాణము; ఏబదియైదువేలు = ఏభైయైదువేలు (55,000); విష్ణుపురాణంబు = విష్ణుపురాణము; ఇరువదిమూడుసహస్రంబులు = ఇరవైమూడువేలు (23,000); శైవంబు = శివపురాణము; చతుర్వింశతిసహస్రంబులు = ఇరవైనాలుగువేలు (24,000); శ్రీభాగవతంబు = శ్రీమద్భాగవతపురాణము; అష్టాదశసహస్రంబులు = పద్దెనిమిదివేలు (18,000); నారదంబు = నారదపురాణము; పంచవింశతి = ఇరవైయైదువేలు (25,000); మార్కండేయంబు = మార్కండేయపురాణము; నవసహస్రంబు = తొమ్మిదివేలు (9,000); ఆగ్నేయంబు = అగ్నిపురాణము; పదియేనువేలనన్నూఱు = పదిహేనువేలనాలుగొందలు (15,400); భవిష్యోత్తరంబు = భవిష్యోత్తరపురాణము; పంచశతాధికచతుర్దశసహస్రంబులు = పద్నాలుగువేలయైదువందలు (14,500); బ్రహ్మకైవర్తంబు = బ్రహ్మకైవర్తపురాణము; అష్టాదశసహస్రంబులు = పద్దెనిమిదివేలు (18,000); లైంగంబు = లింగపురాణము; ఏకాదశసహస్రంబులు = పదకొండువేలు (11,000); వారాహంబు = వరాహపురాణము; చతుర్వింశతిసహస్రంబులు = ఇరవైనాలుగువేలు (24,000); స్కాందంబు = స్కాందపురాణము; ఎనుబదియొక్కవేలనూఱు = ఎనభైయొక్కవేల వొకవంద (81,100); వామనంబు = వామనపురాణము; దశసహస్రంబులు = పదివేలు (10,000); కౌర్మంబు = కూర్మపురాణము; సప్తదశసహస్రంబులు = పదిహేడువేలు (17,000); మాత్స్యంబు = మత్స్యపురాణము; చతుర్దశసహస్రంబులు = పద్నాలుగువేలు (14,000); గారుడంబు = గరుడపురాణము; పందొమ్మిదిసహస్రంబులు = పంతొమ్మిదవేలు (19,000); బ్రహ్మాండంబు = బ్రహ్మాండపురాణము; ద్వాదశసహస్రంబులు = పన్నెండువేలు (12,000); ఇట్లు = ఈ విధముగ; చతుర్లక్ష = నాలుగులక్షలు (4,00,000); గ్రంథ = శ్లోకములు; సంఖ్యాప్రమాణంబులన్ = సంఖ్యలపరిమితితో; ప్రవర్తిల్లు = విరాజిల్లెడు; ఈ = ఈ; పదునెనిమిది = పద్దెనిమిది; పురాణంబులన్ = పురాణముల; మధ్యంబునన్ = అన్నిటిమధ్యన; నదుల = నదుల; అందున్ = లో; భాగీరథి = గంగానది {భాగీరథి - భగీరథునిచే తేబడిన నది, గంగానది}; విధంబునన్ = వలె; దేవతల = దేవతల; అందున్ = లో; పద్మగర్భుని = బ్రహ్మదేవుని {పద్మగర్భుడు - పద్మము జన్మస్థానముగా కలవాడు, బ్రహ్మ}; మాడ్కిన్ = వలె; తారకల = నక్షత్రముల; లందు = లో; కళానిధి = చంద్రుని {కళానిధి - కళలకు స్థానమైనవాడు, చంద్రుడు}; గరిమ = వలె; సాగరంబుల్ = సముద్రముల {సాగరము - సగరపుత్రులచే తవ్వబడినది, సముద్రము}; అందున్ = లో; దుగ్దార్ణవంబు = పాలసముద్రము {దుగ్దార్ణవము - దుగ్ద (పాల) అర్ణవము (నీటికిస్థానమైనది, సముద్రము), పాలసముద్రము}; చందంబునన్ = వలె; నగంబులను = పర్వతాలలో; హేమనగంబు = మేరుపర్వతము; భాతిన్ = వలె; గ్రహంబులన్ = గ్రహములలో; విభావసు = సూర్యుని {విభావసుడు - విశేషమైన కాంతియే ధనముగా కలవాడు, సూర్యుడు}; కరణి = వలె; దైత్యులు = రాక్షసులు {దైత్యులు - దితి యొక్క సంతానము, రాక్షసులు}; అందున్ = లో; ప్రహ్లాదుని = ప్రహ్లాదుని; భంగిన్ = వలె; మణుల = రత్నముల; అందున్ = లో; పద్మరాగంబు = పద్మరాగము; రేఖన్ = వలె; వృక్షంబుల = చెట్ల; అందున్ = లో; హరిచందనతరువు = మంచిగంధముచెట్టు; రీతిన్ = వలె; ఋషుల = ఋషుల; అందున్ = లో; నారదు = నారదుని; మాడ్కిన్ = వలె; ధేనువుల = ఆవుల; అందున్ = లో; కామధేనువు = కామధేనువు; పోల్కిన్ = వలె; సూక్ష్మంబుల = సూక్ష్మమైనవాని; అందున్ = లో; జీవుని = ఆత్మ; తెఱంగునన్ = వలె; దుర్జయంబుల్ = జయింపరానివాని; అందున్ = లో; మనంబు = మనస్సు; చొప్పున = వలె; వసువుల = వసువుల; అందున్ = లో; హవ్యవాహనుని = అగ్నిదేవుని; పోడిమిన్ = వలె; ఆదిత్యులు = ఆదిత్యుల {ద్వాదశాదిత్యులు - 1ఇంద్రుడు 2ధాత 3పర్జన్యుడు 4త్వష్ట 5పూషుడు 6అర్యముడు 7భగుడు 8వివస్వంతుడు 9విష్ణువు 10అంశుమంతుడు 11వరుణుడు 12మిత్రుడు}; అందున్ = లో; విష్ణువు = విష్ణువు; కరణి = వలె; రుద్రుల = రుద్రుల; అందున్ = లో; నీలలోహితుని = నీలలోహితుని; రీతిని = వలె; బ్రహ్మ = బ్రహ్మ; అందున్ = లో; భ్రుగువు = భ్రుగువు; సొబగున = వలె; సిద్ధుల = సిద్ధుల; అందున్ = లో; కపిలుని = కపిలుని; లీలన్ = వలె; అశ్వంబుల = గుఱ్ఱముల; అందున్ = అందు; ఉచ్ఛైశ్శ్రవంబు = ఉచ్ఛైశ్శ్రవము {ఉచ్ఛైశ్శ్రవము - ఇంద్రుని వాహనము}; లాగున = వలె; దర్వీకరంబుల = సర్పముల {దర్వీకరము - తెడ్డునుబోలు పడగ కలది, పాము}; వాసుకి = వాసుకి; రూపంబునన్ = వలె; మృగముల = మృగముల; అందున్ = లో; కేసరి = సింహము {కేసరి - జూలు కలది, సింహము}; చెలువున = వలె; ఆశ్రమములు = చతురాశ్రమముల అందున్ = లోను గృహస్థాశ్రమంబు = గృహస్థాశ్రమము; క్రియన్ = వలె; వర్ణంబుల = అక్షరములలో; లోన్ = లో; ఓంకారంబు = ఓంకారము; ఇరువునన్ = వలె; ఆయుధంబులన్ = ఆయుధములలో; కార్ముకంబు = ధనుస్సు; సోయగంబునన్ = వలె; యజ్ఞంబులన్ = యాగములలో; జపయజ్ఞము = జపయజ్ఞము; చాడ్పున = వలె; వ్రతంబుల = వ్రతనిష్ఠల; అందున్ = లో; అహింస = అహింస; కరణిన్ = వలె; యోగంబుల = యోగముల; అందున్ = లో; ఆత్మయోగంబు = ఆత్మయోగము; రమణన్ = వలె; ఓషధుల = ఓషధుల; అందున్ = లో; యవల = యవల; సొబగున = వలె; భాషణంబుల = పలుకుల; అందున్ = లో; సత్యంబు = నిజము; ఠేవన్ = వలె; ఋతువుల = ఋతువుల; అందున్ = లో; వసంతంబు = వసంతఋతువు; ప్రౌఢి = వలె; మాసముల = మాసముల; అందున్ = లో; మార్గశీర్షంబు = మార్గశిరమాసము; మహిమన్ = వలె; యుగంబుల = యుగముల; అందున్ = లో; కృతయుగంబు = కృతయుగము; ఓజన్ = వలె; తేజరిల్లున్ = ప్రకాశిస్తుంది; ఇట్టి = ఇలాంటి; భాగవతపురాణంబు = శ్రీమద్భాగవతపురాణము; పఠియించి = చదివి; విష్ణు = విష్ణుదేవుని; సాయుజ్యంబు = సాయుజ్యమును {సాయుజ్యము - సహయోగము చెందుట}; చెందెదరు = పొందుతారు; అని = అని; మఱియున్ = ఇంకా; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- తరువాత, పద్దెనిమిది పురాణాల పరిమాణం ఈ విధంగా ఉంది. (1) బ్రహ్మపురాణం పదివేలశ్లోకాలు గల గ్రంథం; (2) పద్మపురాణం పరిమాణం ఏభైఅయిదువేలు; (3) విష్ణుపురాణం ఇరవైమూడువేలు; (4) శివపురాణం ఇరవైనాలుగువేలు; (5) భాగవతం పద్దెనిమిదివేలు; (6) నారదపురాణం ఇరవైఅయుదువేలు; (7) మార్కండేయపురాణం తొమ్మిదివేలు; (8) అగ్నిపురాణం పదిహేనువేలనాలుగువందలు; (9) భవిష్యోత్తరపురాణం పద్నాలుగువేల అయిదువందలు; (10) బ్రహ్మకైవర్తపురాణం పద్దెనిమిదివేలు; (11) లింగపురాణం పదకొండువేలు; (12) వరాహపురాణం ఇరవైనాలుగువేలు; (13) స్కాందపురాణం ఎనభైయొక్కవేలనూరు; (14) వామనపురాణం పదివేలు; (15) కూర్మపురాణం పదిహేడువేలు; (16) మత్స్యపురాణం పద్నాలుగువేలు; (17) గరుడపురాణం పంతొమ్మిదివేలు; (18) బ్రహ్మాండపురాణం పండ్రెండువేలు; ఈవిధంగా పద్దెనిమిది పురాణాలలో మొత్తం నాలుగులక్షల శ్లోకాలు ఉన్నాయి. ఈ పద్దెనిమిది పురాణాలలో భాగవతం నదులలో గంగానదివలె, దేవతలలో బ్రహ్మవలె, తారకలలో చంద్రునివలె, సముద్రాలలో పాలసముద్రంవలె, పర్వతాలలో మేరుపర్వతంవలె, గ్రహాలలో సూర్యునివలె, రాక్షసులలో ప్రహ్లాదునివలె, రత్నాలలో పద్మరాగంవలె, చెట్లలో హరిచందనంవలె, ఋషులలో నారదునివలె, ధేనువులలో కామధేనువు వలె, సూక్ష్మాలలో జీవునివలె, జయింపరాని వాటిలో మనస్సువలె, వసువులలో హవ్యవాహనునివలె, అదితి సంతానంలో విష్ణువువలె, రుద్రులలో నీలలోహితునివలె, బ్రహ్మలలో భృగువువలె, సిద్ధులలో కపిలునివలె, గుఱ్ఱాలలో ఉచ్చైఃశ్రవమువలె, సర్పాలలో వాసుకివలె, మృగాలలో సింహంవలె, ఆశ్రమాలలో గృహస్థాశ్రమంవలె, వర్ణాలలో ఓంకారంవలె, శస్త్రాలలోధనస్సువలె, యజ్ఞాలలో జపయజ్ఞంవలె, వ్రతాలలో అహింసవలె, యోగాలలో ఆత్మయోగంవలె, ఓషధులలో యవలువలె, వాక్కులలో సత్యవాక్కువలె, ఋతువులలో వసంతఋతువువలె, మాసాలలో మార్గశీర్షంవలె, యుగాలలో కృతయుగంవలె ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ భాగవతపురాణం చదివినవారు విష్ణుసాయుజ్యం పొందుతారు.” అని చెప్పి మరల ఈ విధంగా అన్నాడు.
తెభా-12-49-క.
"సకలాగమార్థ పారగుఁ,
డకలంక గుణాభిరాముఁ, డంచిత బృందా
రక వంద్య పాదయుగుఁ, డగు
శుకయోగికి వందనంబు సొరిది నొనర్తున్.
టీక:- సకల = సర్వ; ఆగమ = శాస్త్రముల; అర్థ = అర్థమును; పారగున్ = కడముట్ట తెలిసినవాడు; అకలంక = కళంకములేని; గుణా = గుణములచే; అభిరాముడు = ఆకర్షణీయమైనవాడు; అంచిత = పూజనీయమైన; బృందారక = దేవతల చేత; వంద్య = నమస్కరింపబడెడి; పాద = పాదముల; యుగుడు = జంట కలవాడు; అగు = ఐనట్టి; శుక = శుకుడు అను; యోగి = యోగి; కిన్ = కి; వందనంబు = నమస్కారములు; సొరిదిన్ = వరసగా; ఒనర్తున్ = చేసెదను.
భావము:- సర్వశాస్త్రాల అర్థాన్నీ సంపూర్ణంగా తెలిసిన వాడు, కళంకం లేని గుణాలు కలవాడు, ఆకర్షణీయ మైన వాడు, దేవతలు సైతం మ్రొక్కే పాదాలు కలవాడు అయిన శుకయోగికి నమస్కారిస్తున్నాను.
తెభా-12-50-సీ.
సకలగుణాతీతు, సర్వజ్ఞు, సర్వేశు,-
నఖిలలోకాధారు, నాదిదేవుఁ,
బరమదయారసోద్భాసితుఁ, ద్రిదశాభి,-
వందిత పాదాబ్జు, వనధిశయను,
నాశ్రితమందారు, నాద్యంతశూన్యుని,-
వేదాంతవేద్యుని, విశ్వమయునిఁ,
గౌస్తుభ శ్రీవత్స కమనీయవక్షుని,-
శంఖ చక్ర గదాసి శార్ఙ్గధరుని,
తెభా-12-50.1-తే.
శోభనాకారుఁ, బీతాంబరాభిరాము,
రత్నరాజితమకుటవిభ్రాజమానుఁ,
బుండరీకాక్షు, మహనీయ పుణ్యదేహుఁ,
దలతు నుతియింతు దేవకీతనయు నెపుడు."
టీక:- సకల = సర్వ; గుణా = గుణములకు; అతీతున్ = అతీతమైనవానిని; సర్వజ్ఞున్ = సర్వము తెలిసినవానిని; సర్వ = సర్వులను; ఈశున్ = నియమించువానిని; అఖిల = సమస్తమైన; లోక = లోకములకు; ఆధారున్ = ఆధారమైనవానిని; ఆదిదేవున్ = ఆదిదేవుని; పరమ = గొప్ప; దయా = కరుణా; రస = రసముచేత; ఉద్భాసితున్ = మిక్కిలిప్రకాశించువానిని; త్రిదశ = దేవతలచే; అభివందిత = వందనములుచేయబడెడి; పాద = పాదములు అనెడి; అబ్జున్ = పద్మములు కలవానిని; వనధి = సముద్రమున; శయను = శయనించువానిని; ఆశ్రిత = ఆశ్రయించినవారిపాలిటి; మందారున్ = కల్పవృక్షమువంటివానిని; ఆది = ఆదీ; అంత = అంతము; శూన్యుని = లేనివానిని; వేదాంత = వేదసారములచేత; వేద్యుని = తెలియబడువానిని; విశ్వ = విశ్వమంతా; మయుని = నిండి యున్నవానిని; కౌస్తుభ = కౌస్తుభ మణి; శ్రీవత్స = శ్రీవత్స లక్షణము కలిగి; కమనీయ = మనోజ్ఞమైన; వక్షుని = వక్షస్థలము కలవానిని; శంఖ = శంఖము; చక్ర = చక్రము; గద = గద; అసి = ఖడ్గము; శార్ఙ్గ = శార్ఙ్గము అను ధనుస్సు; ధరుని = ధరించువానిని.
భావము:- గుణాలు అన్నింటికి అతీతుడు, సర్వం తెలిసిన వాడు, సర్వులకు ఈశ్వరుడు, సకల లోకాలకూ మూలాధారుడు, ఆదిదేవుడు, కరుణాసముద్రుడు, దేవతలు నమస్కరించే పాదాలు కలవాడు, పాలసముద్రంలో శయనించేవాడు, ఆశ్రయించినవారి పాలిటి కల్పవృక్షం, ఆది అంతమూ అనేవి లేనివాడు, వేదాంతంచేత తెలియువాడు, విశ్వమంతా నిండి ఉన్నవాడు, వక్షస్థలం మీద కౌస్తుభము శ్రీవత్సము కలవాడు, శంఖం చక్రం గదా ఖడ్గం శార్ఞ్గం అనే ధనస్సూ ధరించు వాడు, మంగళకర రూపుడు, పీతాంబర ధరుడు, ప్రకాశించే రత్నాల కిరీటంతో ప్రకాశించువాడు, పద్మపత్రాల వంటి నేత్రాలు కలవాడు, దివ్యమైన పుణ్య శరీరం కలవాడు అయిన ఆ దేవకీనందనుని ఎల్లపుడూ స్మరిస్తూ, స్తుతిస్తూ ఉంటాను.
తెభా-12-51-మ.
అని యీ రీతి నుతించి భాగవత మాద్యంతంబు సూతుండు సె
ప్పిన సంతుష్టమనస్కు లై విని మునుల్ ప్రేమంబునం బద్మనా
భునిఁ జిత్తంబున నిల్పి తద్గుణములన్ భూషించుచున్ ధన్యులై
చని రాత్మీయ నికేతనంబులకు నుత్సాహంబు వర్ధిల్లఁగన్.
టీక:- అని = అని; ఈ = ఈ; రీతిన్ = విధముగ; నుతించి = స్తుతించి; భాగవతమున్ = శ్రీమద్భాగవతపురాణము; ఆది = మొదలునుంచి; అంతంబు = చివరివరకు (సమస్తము); సూతుండు = సూతుడు; చెప్పిన = చెప్పగా; సంతుష్ట = తృప్తిచెందిన; మనస్కులు = మనస్సులు కలవారు; ఐ = అయ్యి; విని = విని; మునుల్ = మునులు; ప్రేమంబునన్ = ప్రేమతో; పద్మనాభునిన్ = శ్రీమహావిష్ణువును; చిత్తంబునన్ = అంతరంగమునందు; నిల్పి = నిలుపుకొని; తత్ = అతని; గుణములన్ = గుణములను; భూషించుచున్ = కొనియాడుతూ; ధన్యులు = కృతార్థులు; ఐ = అయ్యి; చనిరి = తరలిపోయిరి; ఆత్మీయ = వారివారి; నికేతనంబుల = నివాసముల; కున్ = కు; ఉత్సాహంబు = ఉత్సాహము; వర్ధిల్లగన్ = ఉప్పొంగుతుండగా.
భావము:- ఈవిధంగా స్తోత్రం చేసి, సూతుడు మొత్తం భాగవత పురాణం అంతా చెప్పాడు. శౌనకాది మహా మునులు మనసులలో ఎంతో సంతోషించారు. హృదయంలో పద్మనాభుడైన శ్రీమహావిష్ణువుని నిల్పుకుని ఆయన గుణాలను కొనియాడుతూ ధన్యులు అయి, ఉత్సాహం ఉప్పొంగుతుండగా తమ తమ నివాసాలకు తరలిపోయారు.