పోతన తెలుగు భాగవతము/ద్వాదశ స్కంధము/ద్వాదశాదిత్యప్రకారంబు

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/ద్వాదశ స్కంధము)
రచయిత: నారయ


తెభా-12-41-వ.
అది యెయ్యది యనిన లోకచక్షువు చైత్రమాసంబు మొదలుగా నేయే మాసంబున నేయే నామంబునం బ్రవర్తించుం; జెప్పవే” యని యడిగినఁ “జైత్రంబుననుండి చైత్రాది ద్వాదశమాసంబుల సౌరగణ సప్తకం బీశ్వర నియుక్తంబై నానాప్రకారంబుల సంచరించు; నా క్రమంబు దొల్లి శుకుండు విష్ణురాతునికిఁ దెలిపిన చందంబునం జెప్పెద” నని సూతుం డిట్లనియె “శ్రీమన్నారాయణ స్వరూపుం డగు మార్తాండుం డేకస్వరూపుం డైన, నతనిం గాల దేశ క్రియాది గుణములం బట్టి ఋషు లనేక క్రమంబులఁ నభివర్ణించి భావించుచున్నవా; రా ప్రకారం బెట్లనినఁ జైత్రంబున సూర్యుండు ధాత యను నామంబు దాల్చి కృతస్థలి, హేతి, వాసుకి, రథకృత్తు, పులస్త్యుండు, తుంబురుండు ననెడు పరిజనులతోఁ జేరికొని సంచరించు; వైశాఖంబున నర్యముండను పేరు వహించి పులహుం, డోజుండు, ప్రహేతి, పుంజికస్థలి, నారదుండు, కంజనీరుం డను ననుచరసహితుండై కాలంబు గడుపుచుండు; జ్యేష్ఠంబున మిత్రాభిదానంబున నత్రి, పౌరుషేయుండు, తక్షకుండు, మేనక, హాహా, రథస్వనుండను పరిజనులతోడం జేరి వర్తించుచుండు; నాషాఢంబున వరుణుండను నాహ్వయంబు నొంది వసిష్టుండు, రంభ, సహజన్యుండు, హూహువు, శుక్రుండు, చిత్రస్వనుండను సహచర సహితుండై కాలక్షేపంబు సేయుచుండు; శ్రావణంబున నింద్రుండను నామంబుచే వ్యవహృతుండై విశ్వవసువు, శ్రోత, యేలాపుత్రుం, డంగిరసుండు, ప్రమ్లోచ, చర్యుండను సభ్యులతోఁ జేరి కాలంబు గడుపుచుండు; భాద్రపదంబున వివస్వంతుండను నామంబు దాల్చి యుగ్రసేనుండు, వ్యాఘ్రుం, డాసారుణుండు, భృగు, వనుమ్లోచ, శంఖపాలుండు లోనుగాఁ గల పరిజనులతో నావృతుండై కాలయాపనంబు సేయుచు నుండు.
టీక:- అది = అది; ఎయ్యది = ఏమిటి; అనినన్ = అన్నచో; లోకచక్షువు = సూర్యుడు {లోకచక్షువు - లోకమునకు నేత్రమువంటివాడు, సూర్యుడు}; చైత్రమాసంబు = చైత్రమాసము; మొదలుగాన్ = మొదలు పెట్టి; ఏయే = ఏయే; మాసంబులన్ = నెలలో; ఏయే = ఏయే; నామంబులన్ = నామములతో, పేర్లతో; ప్రవర్తించున్ = సంచరిస్తాడు; చెప్పవే = తెలుపుము; అని = అని; అడిగినన్ = కోరగా; చైత్రంబున = చైత్రము; నుండి = నుండి; చైత్ర = చైత్రమాసము; ఆది = మొదలగు; ద్వాదశ = పన్నెండు (12); మాసంబులన్ = నెలలో; సౌర = సూర్యుని; గణ = గణములు; సప్తకంబున్ = ఏడుమూర్తులు; ఈశ్వర = భగవంతునిచే; నియుక్తంబు = నియమింపబడినవి; ఐ = అయ్యి; నానా = వివిధ; ప్రకారంబులన్ = విధములుగ; సంచరించును = సంచరిస్తాడు; ఆ = ఆ యొక్క; క్రమంబు = విధానము; తొల్లి = పూర్వము; శుకుండు = శుకుడు; విష్ణురాతుని = విష్ణురాతుడైన పరీక్షిత్తు; కిన్ = కి; తెలిపిన = చెప్పిన; చందంబునన్ = విధముగనే; చెప్పెదను = తెలిపెదను; అని = అని; సూతుండు = సూతుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; శ్రీమన్నారాయణ = విష్ణుదేవుని; స్వరూపుండు = స్వరూపము ఐనవాడు; అగు = అయిన; మార్తాండుండు = సూర్యుడు {మార్తాండుడు - మృతండు అనువాని కొడుకు, బ్రహ్మాండము మృతి (రెండు చెక్కలగుట)నొందినపుడు పుట్టినవాడు, సూర్యుడు}; ఏక = ఒకటే; స్వరూపుండు = రూపము కలవాడు; ఐనన్ = అయినప్పటికి; అతనిన్ = అతనిని; కాల = కాలము; దేశ = ప్రదేశము; క్రియ = క్రియలు; ఆది = మున్నగు; గుణములన్ = భేదముల; పట్టి = ప్రకారము; ఋషులు = మహర్షులు; అనేక = బహు; క్రమంబులన్ = విధములుగ; అభివర్ణించి = మిక్కిలికీర్తించి; భావించుచున్నవారు = ధ్యానించుచున్నారు; ఆ = ఆ యొక్క; ప్రకారంబు = విధము; ఎట్లు = ఎలా; అనినన్ = అనగా; చైత్రంబునన్ = చైత్రమాసమునందు; సూర్యుండు = సూర్యుడు; ధాత = ధాత {ధాత - సమస్తమును ధరించువాడు, సూర్యుడు}; అను = అనెడి; నామంబున్ = పేరు; తాల్చి = ధరించి; కృతస్థలి = కృతస్థలి; హేతి = హేతి; వాసుకి = వాసుకి; రథకృత్తు = రథకృత్తు; పులస్త్యుండు = పులస్త్యుడు; తుంబురుండు = తుంబురుడు; అనెడి = అను; పరిజనుల = సేవకుల; తోన్ = తోటి; చేరుకొని = కూడి; సంచరించున్ = సంచరించును; వైశాఖంబునన్ = వైశాఖమాసమునందు; అర్యముండు = అర్యముడు; అను = అనెడి; పేరు = నామము; వహించి = ధరించి; పులహుండు = పులహుడు; ఓజుండు = ఓజుడు; ప్రహేతి = ప్రహేతి; పుంజికస్థలి = పుంజికస్థలి; నారదుండు = నారదుండు; కంజనీరుండును = కంజనీరుండు; అను = అనెడి; అనుచర = సేవకులతో; సహితుండు = కూడినవాడు; ఐ = అయ్యి; కాలంబున్ = కాలమును; గడుపుచుండు = గమనముచేస్తుండును; జ్యేష్ఠంబునన్ = జ్యేష్ఠమాసమున; మిత్రా = మిత్రుడు {మిత్రుడు - సర్వ భూతముల యందు స్నేహయుక్తుడు, సూర్యుడు}; అభిదానంబునన్ = అనునామముతో; అత్రి = అత్రి; పౌరుషేయుండు = పౌరుషేయుడు; తక్షకుండు = తక్షకుడు; మేనక = మేనక; హాహా = హాహ; రథస్వనుండు = రథస్వనుడు; అను = అనెడి; పరిజనుల = సేవకుల; తోడన్ = తోటి; చేరి = కూడి; వర్తించుచుండున్ = సంచరిస్తుంటాడు; ఆషాఢంబునన్ = ఆషాఢమాసమునందు; వరుణుండు = వరుణుడు {వరుణుడు - జనులచే వరములు కోరబడువాడు, పడమటిదొర}; అను = అనెడి; ఆహ్వయంబున్ = నామమును; ఒంది = పొంది; వసిష్టుండు = వసిష్టుడు; రంభ = రంభ; సహజన్యుడు = సహజన్యుడు; హూహువు = హూహువు; శుక్రుండు = శుక్రుడు; చిత్రస్వనుండు = చిత్రస్వనుడు; అను = అనెడి; సహచర = సేవకులతో; సహితుండు = కూడినవాడు; ఐ = అయ్యి; కాల = కాలమును; క్షేపంబు = గడుపుట; చేయుచుండున్ = చేస్తుంటాడు; శ్రావణంబునన్ = శ్రావణమాసమునందు; ఇంద్రుండు = ఇంద్రుడు; అను = అనెడి; నామంబు = పేరు; చేన్ = తోటి; వ్యవహృతుండు = పిలువబడువాడు; ఐ = అయ్యి; విశ్వవసువు = విశ్వవసువు; శ్రోత = శ్రోతుడు; ఏలాపుత్రుండు = ఏలాపుత్రుడు; అంగిరసుండు = అంగిరసుడు; ప్లమోచ = ప్లమోచ; చర్యుండు = చర్యుడు; అను = అనెడి; సభ్యుల = సేవకుల; తోన్ = తోటి; చేరి = కూడి; కాలంబున్ = కాలమును; గడుపుచుండున్ = నడుపుతుంటాడు; భాద్రపదంబునన్ = భాద్రపదమాసమునందు; వివస్వంతుండు = వివస్వంతుడు {వివస్వంతుడు - కాంతిచేనన్నిటిని కప్పెడువాడు, సూర్యుడు}; అను = అనెడి; నామంబున్ = పేరు; తాల్చి = ధరించి; ఉగ్రసేనుడు = ఉగ్రసేనుడు; వ్యాఘ్రుండు = వ్యాఘ్రుడు; ఆసారణుండు = ఆసారణుడు; భృగువు = భృగువు; అనుమ్లోచ = అనుమ్లోచ; శంఖపాలుండు = శంఖపాలుడు; లోనుగాగల = మున్నగు; పరిజనుల = సేవకుల; తోన్ = తోటి; ఆవృతుండు = కూడినవాడు; ఐ = అయ్యి; కాల = కాలమును; యాపనంబు = గడుపుట; చేయుచునుండున్ = చేయుచుండును.
భావము:- అది ఏమిటంటే ప్రపంచానికి నేత్రం వంటివాడైన సూర్యుడు చైత్రమాసం మొదలుకుని పన్నెండు నెలలలో ఏ నెలలో, ఏ పేరుతో, ఎలా సంచరిస్తాడో చెప్పుము.” అని అడిగిన శౌనకునితో సూతుడు ఇలా అన్నాడు. “చైత్రం నుంచి పన్నెండు మాసాలలోనూ సౌరగణాలు ఏడు (ఆదిత్యుడు, ఆరుగురు పరిచారకులు) భగవంతుని నిర్ణయం ప్రకారం ఎన్నోవిధాలుగా సంచరిస్తూ ఉంటాయి. ఈ విషయాన్ని ఇంతకు ముందు శుకమహర్షి విష్ణురాతునికి చెప్పాడు. అది చెప్తాను.” అని చెప్పి సూతుడు మరల ఇలా అన్నాడు, “శ్రీమన్నారాయణ స్వరూపుడైన సూర్యుడు ఒకడే. అయినా మహర్షులు కాల, దేశ, క్రియా బేధాలను బట్టి అనేక విధాలుగా వర్ణిస్తారు. ఆ వివరాలు చెప్తాను, శ్రద్ధగా విను.
1) చైత్రమాసంలో సూర్యుడు ధాత అని పేరు ధరిస్తాడు. అతనికి కృతస్థలి, హేతి, వాసుకి, రథకృత్తు, పులస్య్తుడు, తుంబురుడు అనేవారు పరిజనులుగా చేరి సంచరిస్తుంటారు.
2) వైశాఖమాసంలో సూర్యుడు అర్యముడు అనే పేరు వహిస్తాడు. పులహుడు ఓజుడు ప్రహేతి పుంజికస్థలి నారదుడు కంజనీరుడు అనే వారు అనుచరులుగా చేరి సంచరిస్తుంటారు.
3) జ్యేష్ఠమాసంలో సూర్యుడు మిత్రుడు అనేపేరు దాల్చుతాడు. అత్రి, పౌరుషేయుడు, తక్షకుడు, మేనక, హాహా, రథస్వనుడు అనే వారు పరిచరులగా చేరి సంచరిస్తుంటారు.
4) ఆషాడమాసంలో సూర్యుడు వరుణుడు అనే పేరు పొందుతాడు. వశిష్టుడు, రంభ, సహజన్యుడు, హుహువు, శుక్రుడు, చిత్రస్వనుడు అనే వారు పరివారంగా చేరి సంచరిస్తుంటారు.
5) శ్రావణమాసంలో సూర్యుడు ఇంద్రుడు అనే పేరు స్వీకరిస్తాడు. అతనికి విశ్వావసువు, శ్రోత, ఏలాపుత్రుడు, అంగిరసుడు, ప్రమ్లోచ, చర్యుడు అనే వారు సహచరులుగా చేరి సంచరిస్తుంటారు.
6) భాద్రపదమాసంలో సూర్యుడు వివస్వంతుడు అనే పేరుతో విరాజిల్లుతాడు. అతనికి ఉగ్రసేనుడు, వ్యాఘ్రుడు, ఆసారణుడు, భృగువు, అనుమ్లోచ, శంఖపాలుడు అనే వారు పరివారంగా చేరి సంచరిస్తుంటారు.

తెభా-12-42-క.
లోఁద్వష్ట్రాహ్వయమును
నివుగ ధరియించి ధాత్రికింపుదలిర్పం
రియించుచు నభమందున్
సిజహితుఁడాశ్వయుజము య్యనఁగడుపున్

టీక:- ధర = భూమండలమున; త్వష్ట్ర = త్వష్ట్ర ; ఆహ్వయమును = అనునామమును; ఇరవుగన్ = నెలకొని; ధరియించి = ధరించి; ధాత్రి = భూజనులకు; కిన్ = కి; ఇంపు = ప్రమోదము; తలిర్పన్ = కలుగునట్లు; చరియించుచు = మెలగుతు; నభము = ఆకాశము; అందున్ = అందు; సరసిజహితుడు = సూర్యుడు {సరసిజహితుడు - పద్మబంధువు, సూర్యుడు}; ఆశ్వయుజమున్ = ఆశ్వయుజమాసమును; సయ్యన = శీఘ్రముగ; గడుపున్ = గడుపుతాడు.
భావము:- 7) ఆశ్వయుజమాసంలో సూర్యుడు త్వష్ట్ర అనే పేరుతో భూమికి ప్రమోదం కలిగేటట్లు ఆకాశంలో సంచరిస్తూంటాడు.

తెభా-12-43-వ.
ఈ మాసంబున ఋచీకతనయుండు, కంబళాశ్వుండు, తిలోత్తమ, బ్రహ్మోపేతుండు, శతజిత్తు, ధృతరాష్ట్రుం, డిషంభరులను సభ్యులతోడఁ గూడి కాలంబు గడుపుచుండుఁ; గార్తికమాసంబున విష్ణువని వ్యవహరింపఁ బడి యశ్వతరుండు, రంభ, సూర్యవర్చసుఁడు, సత్యజిత్తు, విశ్వామిత్రుండు, మఘాపేతుఁ డను పరిజనవర్గంబుతోఁ గూడి కాలంబు నడపుచుండు; మార్గశిరంబునం దర్యమ నామ వ్యవహృతుండై కశ్యపుండు, తార్క్ష్యుండు, ఋతసేనుం, డూర్వశి, విద్యుచ్ఛత్రుఁడు, మహాశంఖుం డనెడు ననుచరులం గూడి చరించుచుండుఁ; బుష్యమాసంబున భగుండను నామంబు దాల్చి స్ఫూర్జుం, డరిష్టనేమి, యూర్ణుం, డాయువు, కర్కోటకుండు, పూర్వచిత్తి యనెడు సభ్యజన పరివృతుండై కాలక్షేపంబు సేయుచు నుండు; మాఘమాసంబునఁ బూషాహ్వయంబు వహించి ధనంజయుండు, వాతుండు, సుషేణుండు, సురుచి, ఘృతాచి, గౌతముండను పరిజన పరివృతుండై చరియించుచు నుండు.
టీక:- ఈ = ఈ; మాసంబునన్ = నెలలో; ఋచీకతనయుండు = ఋచీకతనయుడైన; కంబళాశ్వుండు = కంబళాశ్వుడు; తిలోత్తమ = తిలోత్తమ; బ్రహ్మపేతుండు = బ్రహ్మపేతుడు; శతజిత్తు = శతజిత్తు; ధృతరాష్ట్రుండు = ధృతరాష్ట్రుడు; ఇషంభరులు = ఇషంభరుడు; అను = అనెడి; సభ్యుల = సేవకుల; తోడన్ = తోటి; కూడి = కలిసి; కాలంబున్ = కాలమును; గడుపుచుండున్ = గడుపుచుండును; కార్తికమాసంబునన్ = కార్తికమాసమునందు; విష్ణువు = విష్ణువు; అని = అని; వ్యవహరింపబడి = పిలువబడి; యశ్వతరుండు = యశ్వతరుడు; రంభ = రంభ; సూర్యవర్చసుడు = సూర్యవర్చసుడు; సత్యజిత్తు = సత్యజిత్తు; విశ్వామిత్రుండు = విశ్వామిత్రుడు; మఘాపేతుడు = మఘాపేతుడు; అను = అనెడి; పరిజన = సేవక; వర్గంబు = సమూహము; తోన్ = తోటి; కూడి = కలిసి; కాలంబున్ = కాలమును; నడుపుచుండున్ = గడుపుచుండును; మార్గశిరంబునన్ = మార్గశీర్షమాసము; అందున్ = లో; అర్యమ = అర్యమ; నామ = పేరుతో; వ్యవహృతుండు = పిలువబడువాడు; ఐ = అయ్యి; కశ్యపుండు = కశ్యపుడు; తార్క్ష్యుండు = తార్క్ష్యుడు; ఋతసేనుండు = ఋతసేనుడు; ఊర్వశి = ఊర్వశి; విద్యుచ్ఛత్రుడు = విద్యుచ్ఛత్రుడు; మహాశంఖుండు = మహాశంఖుడ; అనెడు = అనెడి; అనుచరులన్ = సేవకులను; కూడి = కలిసి; చరించుచుండున్ = సంచరించును; పుష్యమాసంబున = పుష్యమాసమునందు; భగుండు = భగుడు {భగుడు - జనులచే పూజింపబడువాడు, సూర్యుడు (విద్యార్థికల్పతరువు)}; అను = అనెడి; నామంబున్ = పేరు; తాల్చి = ధరించి; స్పూర్జుండు = స్పూర్జుడు; అరిష్టనేమి = అరిష్టనేమి; ఊర్ణుండు = ఊర్ణుడు; ఆయువు = ఆయువు; కర్కోటకుండు = కర్కోటకుడు; పూర్వచిత్తి = పూర్వచిత్తి; అనెడు = అనెడి; సభ్యజన = సేవకులతో; పరివృతుండు = కూడినవాడు; ఐ = అయ్యి; కాల = కాలమును; క్షేపంబు = గడుపుట; చేయుచునుండు = చేస్తుంటాడు; మాఘమాసంబునన్ = మాఘమాసమునందు; పూష = పూష; ఆహ్వయంబున్ = నామము, పేరు; వహించి = ధరించి; ధనంజయుండు = ధనంజయుడు; వాతుండు = వాతుడు; సుషేణుండు = సుషేణుడు; సురుచి = సురుచి; ఘృతాచి = ఘృతాచి; గౌతముండు = గౌతముడు; అను = అనెడి; పరిజన = సేవకులతో; పరివృతుండు = కూడినవాడు; ఐ = అయ్యి; చరియించుచునుండు = సంచరించును.
భావము:- ఈనెలలో అతనికి ఋచీకుని కొడుకు జమదగ్ని, కంబళాశ్వుడు, తిలోత్తమ, బ్రహ్మోపేతుడు, శతజిత్తు, ధృతరాష్ట్రుడు, ఇషంభరుడు అనే వారు పరివారంగా చేరి సంచరిస్తుంటారు.
8) కార్తీకమాసంలో సూర్యుడు విష్ణువు అనే పేరుతో వ్యవహరిస్తాడు. అతనికి అశ్వతరుడు, రంభ, సూర్యవర్చసుడు, సత్యజిత్తు, విశ్వామిత్రుడు, మఘాపేతుడు అనే వారు పరివారంగా చేరి సంచరిస్తుంటారు.
9) మార్గశీర్షమాసంలో సూర్యుడు అర్యముడు అనే పేరుతో విలసిల్లుతాడు. అతనికి కశ్యపుడు, తార్క్ష్యు డు, ఋతసేనుడు, ఊర్వశి, విద్యుచ్ఛత్రుడు, మహాశంఖుడు అనే వారు అనుచరులు కాగా చేరి సంచరిస్తుంటారు.
10) పుష్యమాసంలో సూర్యుడు భగుడనే పేరు ధరిస్తాడు. అతనికి స్ఫూర్జుడు, అరిష్టనేమి, ఊర్ణుడు, ఆయువు, కర్కోటకుడు, పూర్వచిత్తి అనే వారు అనుచరులు కాగా చేరి సంచరిస్తుంటారు.
11) మాఘమాసంలో సూర్యుడు పూషుడు అనే పేరుతో వ్యవహరింపబడతాడు. అతనికి ధనంజయుడు, వాతుడు, సుషేణుడు, సురుచి, ఘృతాచి, గౌతముడు అనే వారు అనుచరులు కాగా చేరి సంచరిస్తుంటారు.

తెభా-12-44-క.
క్రతు నామంబు ధరించియుఁ
తురతఁ బాలించుచుండుఁ జాతుర్యకళా
తుఁడై సహస్రకిరణుఁడు
తియుతు లౌననఁ దపస్యమాసము లీలన్.

టీక:- క్రతు = క్రతు; నామంబున్ = పేరు; ధరించియున్ = ధరించి; చతురతన్ = నేర్పుతో; పాలించుచుండున్ = ఏలుతుండును; చాతుర్యకళా = చాతుర్యకళ యందు; రతుండు = కేళీలోలుడు; ఐ = అయ్యి; సహస్రకిరణుడు = సూర్యుడు {సహస్రకిరణుడు - సహస్ర (అనంతమైన) కిరణములు కలవాడు, సూర్యుడు}; మతియుతులు = బుధులు; ఔననన్ = ప్రశంసించుచుండగా; తపస్యమాసమున్ = ఫాల్గుణమాసమునందు; లీలన్ = విలాసముగా.
భావము:- 12) ఫాల్గుణమాసంలో సూర్యుడు క్రతువు అనే పేరుతో విరాజిల్లుతాడు. సహస్రకిరణుడు, చాతుర్యకళా లోలుడు అయి బుద్ధిమంతులు ప్రశంసించేలా కాలాన్ని పరిపాలిస్తాడు.

తెభా-12-45-వ.
అందు వర్చసుండు, భరద్వాజుండు, పర్జన్యుండు, సేనజిత్తు, విశ్వుం, డైరావతుం డనువారలతో నెనసి కాలయాపనంబు సేయుచుండు; నిట్లు ద్వాదశమాసంబుల నపరిమేయ విభూతులచేఁ దేజరిల్లుచు నుభయ సంధ్యల నుపాసించు జనుల పాపసంఘంబుల నున్మూలనంబు సేయుచుఁ, బ్రతిమాసంబును బూర్వోక్త పరిజన షట్కంబు వెంటనంట నుభయలోక నివాసులగు జనంబుల కైహికాముష్మికఫలంబుల నొసంగుచు ఋగ్యజు స్సామాధర్వణ మంత్రంబులఁ బఠియించుచు, ఋషి సంఘంబులు స్తుతియింపఁ బురోభాగంబున నప్సరస లాడ, గంధర్వులు పాడ, బ్రహ్మ వేత్తలగు నఱువదివేవురు వాలఖిల్యమహర్షు లభిముఖులై నుతించుచు నరుగ, నధిక బలవేగ విరాజమానంబులగు నాగరాజంబులు రథోన్నయనంబు సలుప, బాహాబల ప్రతిష్ఠాగరిష్ఠులగు నైరృత శ్రేష్ఠులు రథ పృష్టభాగంబు మోచి త్రోయుచుండ ననాది నిధనుండగు నాదిత్యుండు ప్రతికల్పంబున నిట్లు కాలయాపనంబు సేయుచుఁ దేజరిల్లచుండు; నట్లు గావున నివి యన్నియు వాసుదేవమయంబులుగాఁ దెలియు” మని పౌరాణికోత్తముం డగు సూతుండు శుకయోగీంద్రుండు ప్రాయోపవిష్టుం డగు పరీక్షిన్నరపాలున కుపదేశించిన తెఱంగున నైమిశారణ్య వాసు లగు శౌనకాది ఋషిశ్రేష్ఠులకుఁ దెలిపె; నిట్టి పురాణరత్నం బగు భాగవతంబు వినువారును బఠియించువారును లిఖియించు వారును నాయురారోగ్యైశ్వర్యంబులు గలిగి విష్ణుసాయుజ్యంబు నొందుదు; రది యునుంగాక.
టీక:- అందున్ = దానిలో; వర్చసుండు = వర్చసుడు; భరద్వాజుండు = భరద్వాజుడు; పర్జన్యుండు = పర్జన్యుడు; సేనజిత్తు = సేనజిత్తు; విశ్వుండు = విశ్వుడు; ఐరావతుండు = ఐరావతుడు; అను = అనెడి; వారలు = వారు; తోన్ = తోటి; ఎనసి = చక్కనై; కాల = కాలమును; యాపనంబు = గడుపుట; చేయుచుండున్ = చేస్తుండును; ఇట్లు = ఈ విధముగ; ద్వాదశ = పన్నెండు (12); మాసంబులన్ = నెలలోను; అపరిమేయ = అంతులేని; విభూతులన్ = ఐశ్వర్యముల; చేన్ = తోటి; తేజరిల్లుచున్ = ప్రకాశించుచు; ఉభయ = రెండు (ఉదయ,సాయంత్ర); సంధ్యలను = సంధ్యలందు; ఉపాసించు = ఉపాసన చేసెడి; జనుల = వారి; పాప = పాపముల; సంఘంబులన్ = సమూహములను; ఉన్మూలనంబు = పరిమార్చుట {ఉన్మూలనముచేయుట - మూలాల నుండి నాశనము చేయుట}; చేయుచున్ = చేస్తూ; ప్రతి = ప్రతి ఒక్క; మాసంబును = నెలలోను; పూర్వ = ఇంతకుముందు; ఉక్త = చెప్పినట్టి; పరిజన = సేవకులు; షట్కంబు = ఆరుగురు; వెంటనంటన్ = కూడవస్తుండగ; ఉభయలోక = ఉభయలోకములందు {ఉభయలోకములు - ఇహలోక పరలోకములు}; నివాసులు = ఉండేవారు; అగు = ఐన; జనంబులన్ = ప్రజల; కున్ = కు; ఐహిక = ఈ లోకమునకు చెందిన; ఆముష్మిక = పరలోకమునకు చెందిన; ఫలంబులను = ఫలితములను; ఒసంగుచున్ = ప్రదానముచేస్తూ; ఋక్ = ఋగ్వేదము; యజుః = యజుర్వేదము; సామః = సామవేదము; అధర్వణ = అధర్వణవేదము; మంత్రంబులన్ = మంత్రములను; పఠియించుచున్ = చదువుతూ; ఋషి = ఋషుల; సంఘంబులున్ = సమూహములు; స్తుతియింపన్ = ప్రస్తుతింపగా; పురో = ముందరి; భాగంబునన్ = భాగమునందు; అప్సరసలు = అప్సరసలు; ఆడన్ = నాట్యముచేయుచుండగ; గంధర్వులు = గంధర్వులు; పాడన్ = పాడుచుండగా; బ్రహ్మవేత్తలు = బ్రహ్మజ్ఞానసంపన్నులు; అగు = ఐన; అఱువదివేవురు = అరవైవేలమంది(60,000); వాలఖిల్య = వాలఖిల్యులను; మహర్షులు = మహర్షులు; అభిముఖులు = ఎదురుగానిల్చినవారు; ఐ = అయ్యి; నుతించుచున్ = స్తుతించుచు; అరుగన్ = నడుస్తుండగా; అధిక = మిక్కిలి; బల = శక్తితోను; వేగ = వేగముతోను; విరాజమానంబులు = విరాజిల్లుతున్నవి; అగు = ఐన; నాగరాజంబులు = మత్తేభములు; రథ = రథమును; ఉన్నయనంబు = లాగుట; సలుపన్ = చేయుచుండగ; బాహాబల = భుజబలముతో; ప్రతిష్ఠా = గౌరవముగడించిన; గరిష్ఠులు = గొప్పవారు; అగు = ఐన; నైరృత = నైరృతులను; శ్రేష్ఠులు = ఉత్తములు; రథ = రథముయొక్క; పృష్ట = వెనుక; భాగంబున్ = భాగమును; మోచి = భారమువహించి; త్రోయుచుండన్ = తోస్తుండగా; అనాదినిధనుండు = జననమరణాలులేనివాడు; అగు = ఐన; ఆదిత్యుండు = సూర్యుడు {ఆదిత్యుడు - అదితికి కశ్యపునివలన పుట్టినవాడు, సూర్యుడు}; ప్రతి = అఖిల; కల్పంబునన్ = కల్పమునందు; ఇట్లు = ఈ విధముగ; కాల = కాలమును; యాపనంబు = గడుపుట; చేయుచున్ = చేస్తూ; తేజరిల్లుచున్ = ప్రకాశించుచు; ఉండున్ = ఉండును; కావున = కనుక; ఇవి = వీటిని; అన్నియున్ = అన్నిటిని; వాసుదేవ = శ్రీహరి; మయంబులు = స్వరూపములు; కాన్ = ఐనట్లు; తెలియుము = తెలిసికొనుము; అని = అని; పౌరాణిక = పౌరాణికులలో {పౌరాణికుడు - పురాణములు తెలిసిన వాడు}; ఉత్తముండు = ఉత్తముడు; అగు = ఐన; సూతుండు = సూతుడు; శుక = శుకుడు అను; యోగి = యోగులలో; ఇంద్రుండు = శ్రేష్ఠుడు; ప్రాయోపవిష్టుండు = మరణసన్నధమగువాడు; అగు = ఐన; పరీక్షిత్ = పరీక్షిత్తు అను; నరపాలున్ = రాజున; కున్ = కు; ఉపదేశించిన = చెప్పినట్టి; తెఱంగునన్ = విధముగ; నైమిశా = నైమిశము అను; అరణ్య = అడవి యందు; వాసులు = ఉండువారు; అగు = ఐన; శౌనక = శౌనకుడు; ఆది = మున్నగు; ఋషి = ఋషులలో; శ్రేష్ఠులు = ఉత్తముల; కున్ = కు; తెలిపెన్ = చెప్పెను; ఇట్టి = ఈ; పురాణ = పురాణములలో; రత్నంబు = శ్రేష్ఠమైనది; అగు = ఐన; భాగవతంబున్ = భాగవతమును; విను = వినెడి; వారును = వారు; పఠియించు = చదివెడి; వారును = వారు; లిఖియించు = వ్రాసెడి; వారును = వారు; ఆయుః = ఆయుష్షు; ఆరోగ్య = ఆరోగ్యము; ఐశ్వర్యంబులు = సంపదలు; కలిగి = పొంది; విష్ణు = శ్రీహరి; సాయుజ్యంబున్ = సాయుజ్యమును {సాయుజ్యము - సహయోగము చెందుట}; ఒందుదురు = పొందుతారు; అదియునున్ = అంతే; కాక = కాకుండగ.
భావము:- ఆ నెలలో అతనికి వర్చసుడు, భరద్వాజుడు, పర్జన్యుడు, సేనజిత్తు, విశ్వుడు, ఐరావతుడు, అనేవారు పరిచరులుగా చేరి సంచరిస్తుంటారు.
ఈ విధంగా పన్నెండు నెలలలోనూ ఇంత అని కొలచి చెప్పడానికి వీలుకాని వైభవంతో ప్రకాశిస్తూ ఉభయసంధ్యలలోనూ తనను ఉపాసనచేసే ఉపాసకుల పాపాలను పరిమార్చుతూ ఉంటాడు. మఱియు, ప్రతీనెలలోనూ ముందు చెప్పినట్లుగా ఆరుగురు పరిజనులు చొప్పున అనుసరించి రాగా ఉభయలోక వాసులకు లౌకిక ఫలాలు ఆముష్మిక ఫలాలు ఇస్తూ ఉంటాడు. ఋగ్యజు స్సామాధర్వ వేదమంత్రాలను పఠిస్తూ ఋషులు స్తుతిస్తుంటారు. ముందరి భాగంలో అప్సరసలు నాట్యం చేస్తుంటారు. గంధర్వులు గానం చేస్తుంటారు. బ్రహ్మవేత్తలయిన అరవైవేల మంది వాలఖిల్యమహర్షులు ఎదురుగా స్తోత్రం చేస్తూ నడుస్తుంటారు. మిక్కిలి బలము, వేగము కలిగి విరాజిల్లే మదించిన గజరాజులు రథాన్ని లాగుతుంటారు. బాహుబలంలో పేరుపడ్డ నైరృతులు రథం వెనుక భాగాన్ని నెట్టుతూ ఉంటారు. ఆదీ అంతము లేని ఆదిత్యుడు ప్రతికల్పంలో ఈవిధంగా కాలాన్ని నడిపిస్తూ తేజరిల్లుతుంటాడు. కావున వీటినన్నింటినీ వాసుదేవ మయములు అని తెలుసుకోవాలి.” అని ప్రాయోపవేశం చేస్తున్న పరీక్షన్మహారాజుకు శుకయోగీంద్రుడు చెప్పిన విధంగా పౌరాణికులలో ఉత్తముడైన సూతుడు శౌనకుడూ మొదలయిన ఋషిశ్రేష్ఠులకు చెప్పాడు. పురాణాలలో బహు శ్రేష్ఠమైన భాగవతాన్ని వినేవారు, చదివేవారు, వ్రాసేవారు ఆయువు ఆరోగ్యము, ఐశ్వర్యము కలిగి విష్ణు సాయుజ్యాన్ని పొందుతారు. అదే కాకుండా మరొకటి యేమిటంటే..

తెభా-12-46-తే.
పుష్కరం బందు, ద్వారకాపురము నందు,
థుర యందును, రవిదిన మందు నెవఁడు
ఠన సేయును రమణతో భాగవతము
వాఁడు తరియించు సంసారవార్ధి నపుడ.

టీక:- పుష్కరంబు = పుష్కరతీర్థం; అందున్ = లో; ద్వారకాపురము = ద్వారకాపట్టణము; అందున్ = లో; మథుర = మథురానగరం; అందును = లోను; రవిదినము = ఆదివారము; అందున్ = లోను; ఎవడు = ఎవరైతే; పఠన = చదువుట; చేయున్ = చేస్తాడో; రమణ = ఆసక్తిపూర్వకంగా; భగవతమున్ = భాగవతమును; వాడు = అట్టివాడు; తరియించున్ = దాటును; సంసార = సంసారమనెడు; వార్ధిన్ = సముద్రమును; అపుడ = ఆ సమయమునందే.
భావము:- పుష్కరతీర్థంలో కానీ, ద్వారకాపట్టణంలో కానీ, మధురానగరంలోకానీ ఆదివారంనాడు ఆసక్తి పూర్వకంగా భాగవతాన్ని చదివిన భక్తుడు వెంటనే సంసార సాగరాన్ని తరిస్తాడు.

తెభా-12-47-క.
శ్రీమణీరమణ కథా
పారాయణచిత్తునకును తికిఁ బరీక్షి
ద్భూమణున కెఱిఁగించెను
సామతిన్ శుకుఁడు ద్వాదస్కంధములన్.

టీక:- శ్రీరమణీరమణ = విష్ణుమూర్తి {శ్రీరమణీరమణుడు - శ్రీరమణి (లక్ష్మీ దేవి) రమణుడు (భర్త), విష్ణువు}; కథా = కథలను; పారాయణ = అంతాతెలుసుకొను; చిత్తున్ = ఆసక్తికలవాని; కును = కి; పతి = రాజు; కిన్ = కు; పరీక్షిత్ = పరీక్షిత్తు అను; భూరమణున్ = రాజున; కున్ = కు; ఎఱింగించెను = తెలియజెప్పెను; సారమతిన్ = నిపుణత్వముతో; శుకుడు = శుకుడు; ద్వాదశ = పన్నెండు (12); స్కంధములన్ = స్కంధాలను {స్కంధము - సమూహము, శరీరము, సంస్కారము}.
భావము:- లక్ష్మీపతి అయిన హరి కథలను వినడంలో ఆసక్తి కల పరీక్షుత్తు మహారాజుకు శుకమహర్షి విపులంగా పండ్రెండు స్కంధాలు వినిపించాడు.