పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/వసుదేవుడు కృష్ణుని పొగడుట

తెభా-10.1-116-ఆ.
చాఁగి మ్రొక్కి లేచి రగున నొసలిపైఁ
గేలుఁదమ్మిదోయిఁ గీలుకొలిపి
పాపఁ డనక వెఱక పాపని మొదలింటి
పోకలెల్లఁ దలఁచి పొగడఁ దొడఁగె.

టీక:- సాగి = సాగిలపడి {సాగిలపడుట - సాష్టాంగ నమస్కారము చేయుట}; మొక్కి = నమస్కరించి; లేచి = పైకి లేచి; సరగునన్ = త్వరితముగ; నొసలి = నుదిటి; పైన్ = మీద; కేలున్ = చేతులు అనెడి; తమ్మి = పద్మముల; దోయిన్ = జంటను; కీలుగొలిపి = తగిల్చి; పాపడు = చిన్నపిల్లవాడు; అనకన్ = అనుకోకుండ; వెఱకన్ = వెనుదీయక; పాపని = శిశువును; మొదలింటి = పూర్వపు; పోకలు = నడవడికలు; ఎల్లన్ = అన్నిటిని; తలచి = తర్కించుకొని; పొగడ = కీర్తించుట; తొడగెన్ = మొదలిడెను.
భావము:- భక్తితో సాష్టాంగపడి నమస్కారం చేసాడు. లేచి రెండు చేతులనూ తామర మొగ్గల వలె నుదురు పై జోడించాడు. పసి పిల్లాడు అని వెనుదీయకుండా అతని దివ్య చరిత్రలు అన్నీ తలచుకొని పొగడసాగేడు.

తెభా-10.1-117-క.
"ఏ నిన్ను నఖిలదర్శను
జ్ఞానానందస్వరూపు సంతతు నపరా
ధీనుని మాయాదూరుని
సూనునిఁగాఁ గంటి; నిట్టి చోద్యము గలదే?

టీక:- ఏ = ఎటువంటి; నిన్నున్ = నిన్ను; అఖిల = సమస్తమును {అఖిల - సమస్తమైన చతుర్దశ భువనములను}; దర్శనున్ = పాలించువానిని {దర్శనుడు - సాక్షీభూతముగ చూచువాడు}; జ్ఞాన = జ్ఞానము; ఆనంద = ఆనందములను; స్వరూపు = తన రూపుగా కలవానిని; సంతతున్ = శాశ్వతుని; అపరాధీనుని = సర్వస్వతంత్రుని; మాయా = జననాది ఎల్లమాయలకు; దూరునిన్ = పరమైన వానిని, తిరస్కరించు వానిని; సూనునిన్ = పుత్రుని; కాన్ = అగునట్లు; కంటిన్ = పుట్టించితిని, చూసితిని ఇట్టి = ఇటువంటి; చోద్యమున్ = అద్భుతము; కలదే = ఎక్కడైనా ఉన్నదా, లేదు.
భావము:- “స్వామీ! నీవు సమస్త సృష్టిని నీ యందు దర్శింప జేస్తావు; జ్ఞానము ఆనందము కూడిన స్వరూపుడవు; నీవు శాశ్వతుడవు; ఎవరి అదుపాజ్ఞలకు నీవు లోబడవు; మాయ నిన్ను అంటలేక దూరంగా తొలగిపోతుంది; అట్టి నిన్ను నేను కన్నానట; ఇలాంటి చోద్యం ఎక్కడైనా ఉందా?

తెభా-10.1-118-క.
చ్చుగ నీ మాయను మును
జెచ్చెరఁ ద్రిగుణాత్మకముగఁ జేసిన జగముల్
జొచ్చిన క్రియఁ జొరకుందువు
చొచ్చుటయును లేదు; లేదు చొరకుండుటయున్.

టీక:- అచ్చుగన్ = స్ఫుటముగ; నీ = నీ యొక్క; మాయనున్ = మహిమచేత; మును = పూర్వము; చెచ్చెరన్ = శ్రీఘ్రముగ; త్రిగుణాత్మకము = త్రిగుణములతో ఏర్పడినది {త్రిగుణాత్మకము – త్రిగుణములు కలది, సత్వగుణముచేత ఇంద్రియాధిదేవతలను రజోగుణముచేత ఇంద్రియములను తమోగుణముచేత పంచమహాభూతములను కలిగినది}; కాన్ = అగునట్లు; చేసిన = చేసినట్టి; జగముల్ = భువనములను; చొచ్చిన = ప్రవేశించినవాని; క్రియన్ = వలె ఉండి; చొరకుందువు = ప్రవేశించక ఉందువు; చొచ్చుటయును = ప్రవేశించుట; లేదు = లేదు; లేదు = లేనేలేదు; చొరకుండుటయును = ప్రవేశించకపోవుట కూడ.
భావము:- నీ మాయను చక్కగా నీ నుండి వెలువరచి సత్త్వం, రజస్సు, తమస్సు అనే త్రిగుణాలుగా విస్తరింపజేస్తావు. ఆ మూడు గుణాలతోను జగత్తులన్నీ సృష్టింపబడుతాయి. త్రిగుణాలు నీలో నిండి ఉంటాయి. కనుక సృష్టిలో ప్రవేశించడం ఉండదు. అలా అని ప్రవేశించక పోవడమూ ఉండదు.

తెభా-10.1-119-సీ.
దియు నెట్లన మహదాదులఁ బోలెడి-
దై వేఱువేఱయై న్నివిధము
గు సూక్ష్మభూతంబు మర షోడశ వికా-
ములతోఁ గూడి విరాట్టనంగఁ
రమాత్మునకు నీకు ఱపైన మేను సం-
పాదించి యందు లోఁడియుఁ బడక
యుండు సృష్టికి మున్న యున్న కారణమున-
వానికి లోనిభవంబు గలుగ;

తెభా-10.1-119.1-ఆ.
ట్లు బుద్ధి నెఱుఁగ నువైన లాగునఁ
లుగు నింద్రియముల డలనుండి
వాని పట్టులేక రుస జగంబులఁ
లసియుండి యైనఁ లయ వెపుడు.

టీక:- అదియున్ = అలా; ఎట్లు = ఎలా కుదురుతుంది; అనన్ = అని అడిగినచో; మహత్ = మహతత్త్వము {మహదాదులు - అవ్యక్తము మహత్తు అహంకారము పంచమహాభూతములు}; ఆదులన్ = మున్నగువానిని; పోలెడిది = వంటిది; ఐ = అయ్యి; వేఱవేఱ = విభిన్నములు; ఐ = అయ్యి; అన్ని = సమస్తమైన; విధములు = రకములవి; అగు = ఐన; సూక్ష్మభూతంబుల్ = శబ్ద స్పర్శ రూప రస గంధములు; అమరన్ = అమరి యున్నట్టి; షోడశవికారముల = షోడశవికారముల {షోడశవికారములు - ఏకాదశేంద్రియములు [పంచ జ్ఞానేంద్రియములు (కన్ను, ముక్కు, నాలుక, చెవి, చర్మము) + పంచ కర్మేంద్రియములు (కాళ్ళు, చేతులు, వాక్కు, గుదము, గుహ్యేంద్రియము) మరియు పంచ భూతములు (భూమి, జలము, వాయువు, అగ్ని, ఆకాశము)] మరొక విధము పంచప్రాణములు (5) అంతఃకరణ (1) జ్ఞానేంద్రియములు (5) కర్మేంద్రియములు (5)}; తోన్ = తోటి; కూడి = కలిసి; విరాట్టు = విశ్వరూపుడు; అనగన్ = అనెడి; పరమాత్మున్ = పరబ్రహ్మమున; కున్ = కు; నీ = నీ; కున్ = కు; పఱపు = విశాలము; ఐన = అయినట్టి; మేను = దేహము; సంపాదించి = కల్పించుకొని; అందు = దాని; లోన్ = అందు; బడియున్ = చిక్కి, భోగసాధన కలిగి; పడక = చిక్కకుండగ, అతీతుడవై; ఉండు = ఉండెడి; సృష్టి = మహదాదిసృష్టికి; మున్న = ముందు; ఉన్న = ఉన్నట్టి; కారణమున = కారణముచేత; వాని = వాటి; కిన్ = కి; లోనిభవంబు = లోనైన పుట్టుక; కలుగదు = సంభవించదు; అట్లు = ఆ విధముగ.
బుద్ధిన్ = జ్ఞానముచేత; ఎఱుగను = తెలిసికొనుటకు; అనువు = వీలు; ఐన = అయినట్టి; లాగునన్ = విధముగ; కలుగుచున్ = ఉంటూ; ఇంద్రియముల = ఇంద్రియ {చతుర్దశేంద్రియములు - కర్మేంద్రియములు (5) జ్ఞానేంద్రియములు (5) అంతఃకరణ చతుష్టయము (4)}; కడలన్ = విషయము లందు {అంతఃకరణచతుష్టయము - 1మనస్సునకు సంకల్పము 2బుద్ధికి నిశ్చయము 3చిత్తమునకు చింతనము 4అహంకారమునకు అహంభావము}; ఉండి = వర్తించియు; వాని = వాటికి; పట్టు = తగులము, సంబంధము; లేక = లేకుండగ; వరుసన్ = క్రమముగా; జగంబులన్ = సమస్తభువనములందు; కలసి = చేరి; ఉండి = ఉన్నవాడవు; ఐనన్ = అయినను; కలయవు = అంటవు; ఎప్పుడున్ = ఏ కాలము నందును.
భావము:- అది ఎలాగ అంటే, సృష్టికి ముందు సృష్టిలో ఉండవలసిన సూక్ష్మ శక్తులన్నీ కలిసి నీకు విరాట్ అనే పేరుగల శరీరం నిర్మిస్తాయి. అలా నిర్మించడానికి పదహారు వికారాలు అనబడే ప్రకృతి వికారాలతో ఆ సూక్ష్మ శక్తులు కలసిపోతాయి. ఆ విరాట్ అనే శరీరం నీకు విస్తరించడానికి అవసరమైనది. ఆ నీ శరీరం సృష్టికి ఆధారమైన మహత్తు మొదలైన ధర్మాల వంటిదే గాని, వానికన్న వేరుగా కూడా ఉంటుంది. ఆ శరీరంలో నీవు ప్రవేశించి ఉండి, దానికి అతీతంగా కూడా ఉంటావు. ఎందుచేతనంటే అది నీ శక్తి అనే నీటి నుండి తయారైన బుడగ వంటిది. నీవు సృష్టికి ముందు కూడా ఉన్నందు వలన విరాట్టులోనికి నీవు పుట్టడం ఉండదు. మానవులకు ఇంద్రియాల ప్రవృత్తులు ఎక్కడ ఆగిపోతాయో అక్కడ ఉండి బుద్ధితో పరిశీలిస్తే ఈ విధమైన జ్ఞానం కలుగుతుంది. ఆ సూక్ష్మశక్తుల ఆధారం లేకుండానే నీవు జగత్తులో నిండి ఉండి కూడా దానితో కలవకుండా ఉంటావు.

తెభా-10.1-120-క.
ర్వము నీలోనిదిగా
ర్వాత్ముఁడ; వాత్మవస్తు సంపన్నుఁడవై
ర్వమయుఁడ వగు నీకును
ర్వేశ్వర! లేవు లోను సందులు వెలియున్.

టీక:- సర్వమున్ = సమస్త లోకములు; నీ = నీకు; లోనిదిన్ = లోపల ఉండునది; కాన్ = కాగా; సర్వాత్ముడవు = లోక మందున్నవాడవు {సర్వాత్ముడు - సకల భువనము లంతటి అందు ఉండువాడు, విశ్వరూపుడు}; ఆత్మవస్తుసంపన్నుఁడవు = లోకాతీతుడవు {ఆత్మ వస్తు సంపన్నుఁడు - ఆత్మ అనెడి వస్తువు యొక్క సమృద్ధి కలవాడవు, పరమాత్మ}; ఐ = అయ్యి; సర్వమయుడవు = లోకము ధరించినవాడవు {సర్వ మయుడు - సకల భువనములు కలిగినవాడు, విశ్వంభరుడు}; అగు = ఐన; నీ = నీ; కును = కు; సర్వేశ్వర = హరి {సర్వేశ్వరుడు - సమస్తమైన సృష్టి స్థితి లయ తిరోధానానుగ్రహములను పంచకృత్యములకును ప్రభువు, విష్ణువు}; లేవు = కలుగవు; లోను = లోపలయును; సందులు = మధ్యయును; వెలియున్ = బయటయును.
భావము:- సర్వమునకు ఈశ్వరుడైన భగవంతుడా! సర్వము నీ లోనే ఉంది; సర్వమునకు ఆత్మ అయిన వాడవు నీవు; నీ చేత తయారైన వస్తువులతో సర్వము నిండి ఉన్నది; అట్టి నీకు లోపల, మధ్య, బయట అన్న బేధాలు లేవు.

తెభా-10.1-121-ఆ.
త్మ వలనఁ గలిగి మరు దేహాదుల
నాత్మకంటె వేఱు వి యటంచు
లఁచువాఁడు మూఢముఁడు గావునఁ నీశ!
విశ్వ మెల్ల నీవ వేఱు లేదు.

టీక:- ఆత్మ = పరమాత్మవైన నీ; వలనన్ = వలన; కలిగి = జన్మించి; అమరు = అమరి ఉండెడి; దేహ = శరీరము; ఆదులన్ = మున్నగువానిని; ఆత్మ = పరమాత్మ; కంటెన్ = కంటె; వేఱులు = భిన్నములైనవి; అవి = అవి; అట = అట; అంచున్ = అనుచు; తలచు = భావించెడి; వాడు = అతడు; మూఢతముడు = అత్యధికమైన మూఢుడు {మూఢుడు - మూఢతరుడు - మూఢతముడు}; కావునన్ = కనుక; ఈశ = నారాయణ {ఈశుడు - పంచకృత్యములకు నియామకుడు, విష్ణువు}; విశ్వము = సృష్టి; ఎల్లన్ = అంతయును; నీవ = నీవే; వేఱు = నీకు భిన్నమైనది; లేదు = లేనేలేదు.
భావము:- ఈశ్వరుడా! ఆత్మ నుండి శరీరం మనస్సు మొదలైనవి పుట్టు కొస్తాయి. వాటిని ఆత్మ కన్న వేరైనవి అనుకొనే వాడు పరమ మూర్ఖుడు. విశ్వమంతా నీవే. నీవు కానిది వేరే ఏమి లేదు.

తెభా-10.1-122-వ.
అదియునుం గాక.
టీక:- అదియునున్ = అంతే; కాక = కాకుండగ.
భావము:- అంతే కాకుండా.

తెభా-10.1-123-సీ.
గుణము వికారంబుఁ గోరికయును లేని-
నీ వలన జగంబు నెఱి జనించుఁ;
బ్రబ్బు; లేదగు; నంచుఁ లుకుట తప్పుగా-
దీశుండవై బ్రహ్మ మీవ యైన
నినుఁ గొల్చు గుణములు నీ యానతులు చేయ,-
టులశౌర్యంబులు తికి వచ్చు
గిది నీ గుణముల బాగులు నీ వని-
తోఁచును నీ మాయతోడఁ గూడి

తెభా-10.1-123.1-ఆ.
నీవు రక్త ధవళ నీల వర్ణంబుల
గము చేయఁ గావ మయఁ జూడఁ
నరు; దట్లు నేఁడు దైత్యుల దండింపఁ
బృథివి గావ నవతరించి తీశ!

టీక:- గుణము = సత్వరజస్తమోగుణాలు; వికారంబున్ = జన్మనమృత్యాది మార్పులు; కోరికయున్ = కర్మానుష్ఠాన వాంఛలు; లేని = లేనట్టి; నీ = నీ; వలనన్ = వలన; జగంబున్ = భువనములు; నెఱిన్ = నిండుగా; జనించున్ = పుట్టును; ప్రబ్భున్ = వర్ధిల్లును; లేదగు = నశించును; అంచున్ = అనుచు; పలుకుట = చెప్పుట; తప్పు = అసత్యము; కాదు = కాదు; ఈశుండవు = సర్వనియామకుండవు; ఐ = అయ్యి; బ్రహ్మము = పరబ్రహ్మము; ఈవ = నీవే; ఐన = అయినట్టి; నినున్ = నిన్ను; కొల్చు = సేవించెడి; గుణములు = త్రిగుణములు; నీ = నీ యొక్క; ఆనతులు = ఉత్తరువులను; చేయన్ = చేయుచుండగా; భటుల = సైనికుల యొక్క; శౌర్యంబులున్ = పరాక్రమములు; పతి = ప్రభువున; కిన్ = కు; వచ్చు = చెందెడి; పగిదిన్ = విధముగనే; నీ = నీ యొక్క; గుణములు = గుణములు; బాగులు = మేళ్ళు; నీవి = నీకు చెందినవే; అని = అని; తోచును = అనిపించును; నీ = నీ యొక్క; మాయ = అవ్యక్తమహిమ; తోడన్ = తోటి; కూడి = చేరి.
నీవు = నీవు; రక్త = ఎఱ్ఱని, రజస్; ధవళ = తెల్లని, సత్వ; నీల = నల్లని, తమస్; వర్ణంబులన్ = రంగులచే, గుణములతో; జగమున్ = ప్రపంచమును; చేయన్ = సృష్టించ; కావన్ = పాలించ; సమయన్ = లయములుచేయ; చూడన్ = పూని; తనరుదు = ఒప్పుచుండుదువు; అట్లు = ఆ విధముగ; నేడు = ఇవాళ; దైత్యులన్ = రాక్షసులను {దైత్యులు - దితి యొక్క సంతానము, రాక్షసులు}; దండింపన్ = శిక్షించుటకు; పృథివిన్ = భూమండలమును; కావన్ = కాపాడుటకు; అవతరించితివి = పుట్టితివి; ఈశ = నారాయణ {ఈశుడు - సర్వనియామకుడు, విష్ణువు};
భావము:- ప్రభువా! నీ వలన జగత్తు పుడుతుంది. అయితే ఆ జగత్తుకు అవసరమైన త్రిగుణాలు గాని, వాని మార్పులు గాని నీకు లేవు. సృష్టి చేయాలనే కోరిక కూడ నీకు లేదు. నీ వలననే పుట్టిన జగత్తు నీ వలననే వృద్ధిచెంది నీ యందే లయమౌతుంది అనడం పొరపాటు కాదు. సర్వాతీతుడవై, బ్రహ్మము అయిన నీవు తమ ప్రభువు అని నీ ఆజ్ఞను పరిపాలిస్తాయి. లోకంలో భటుల శౌర్యం ప్రభువు శౌర్యం అని ప్రసిద్ధికెక్కుతుంది. అలాగే నీ మాయతో కూడిన గుణాలు, వాని గొప్పదనాలు నీవిగా తోస్తాయి. నీవు రజోగుణ రూపుడవై సృష్టి చేస్తూ ఉన్నప్పుడు ఎఱ్ఱని రంగుతో కూడి ఉంటావు. సత్త్వగుణ రూపుడవై సృష్టిని రక్షిస్తూ ఉన్నప్పుడు తెల్లని రంగుతో కూడి ఉంటావు. తమోగుణ రూపుడవై సృష్టిని లయంచేస్తూ ఉన్నప్పుడు నల్లని రంగుతో కూడి ఉంటావు. ఇవన్నీ నీవు ధరించే పాత్రలు. అలాగే ఇవాళ కూడ దుష్టులను దండించడానికి భూమి పై మానవుడుగా అవతరించావు.

తెభా-10.1-124-శా.
మింటన్ మ్రోసిన మ్రోత తాలిమిని లోమేండ్రింప మున్ నీవు నా
యింటం బుట్టెద వంచుఁ గంసుడు దొడిన్ హింసించె నీ యన్నలం;
గంటం గూరుకుఁ దేఁడు; నీ యుదయ మా కారాజనుల్ చెప్పగాఁ
బంటింపం; డెదురేఁగుదెంచు వడి నీపై నేఁడు సన్నద్ధుఁడై.”

టీక:- మింటన్ = ఆకాశమున, ఆకాశవాణి; మ్రోసిన = పలికిన; మ్రోత = పలుకులు; తాలిమిని = నిబ్బరమును; లోన్ = లోపల; మేండ్రింప = నశింపజేయగా; మున్ = పూర్వము; నీవున్ = నీవు; నా = నా యొక్క; ఇంటన్ = కడుపున; పుట్టెదవు = జన్మించెదవు; అంచున్ = అనుచు; కంసుడు = కంసుడు; తొడిన్ = ఒకరి తరువాత ఒకరిని; హింసించెన్ = చంపెను; నీ = నీ; అన్నలన్ = ముందు పుట్టిన వారిని; కంటన్ = కంటిమీదకు; కూరుకున్ = నిద్రను; తేడు = తెచ్చుకోడు; నీ = నీ యొక్క; ఉదయము = అవతరించుట; ఆ = అక్కడి; కారాజనులు = చెరసాల కాపలావారు; చెప్పగాన్ = చెప్పగానే; పంటింపడు = ఉపేక్షింపడు; ఎదురు = ఎదుర్కొనుటకు; ఏగుదెంచున్ = వచ్చును; వడిన్ = శ్రీఘ్రముగ; నీ = నీ; పై = మీదకు; నేడు = ఇవాళ; సన్నద్ధుడు = సిద్ధపడినవాడు; ఐ = అయ్యి.
భావము:- ఆకాశవాణి మాటలు కంసుని ధైర్యాన్ని కూలద్రోశాయి. ఆనాటి నుండి నువ్వు నా యింట పుట్టబోతున్నావని భయపడి, వాడు నీ అన్నలను అందరిని సంహరించాడు. ఇప్పుడు నువ్వు పుట్ట బోతున్నా వని తెలిసి కంటికి కునుకు లేకుండ ఉన్నాడు. నువ్వు పుట్టావని కారాగార భటులు చెప్తే తాత్సారం చేయడు. వెంటనే నీ మీదకి విరుచుకు పడటానికి సిద్ధమై వచ్చేస్తాడు.”

తెభా-10.1-125-వ.
అనుచుండ దేవకీదేవి మహాపురుషలక్షణుండును, విచక్షణుండును, సుకుమారుండును నైన కుమారునిం గని, కంసునివలని వెఱపున శుచిస్మితయై యిట్లనియె.
టీక:- అనుచుండన్ = అని పలుకుతుండగా; దేవకీ = దేవకి అనెడి; దేవి = ఉత్తమురాలు; మహాపురుష = మహాపురుషుల యొక్క {మహాపురుషలక్షములు - సాముద్రిక శాస్త్రమున చెప్పబడిన శంఖ చక్ర వజ్ర పద్మ హలాది చిహ్నములు}; లక్షణుండును = లక్షణములు కలవాడు; విచక్షణుండును = జ్ఞాని నేర్పరి ఐనవాడు; సుకుమారుండును = కోమల దేహము కలవాడు; ఐన = అయిన; కుమారునిన్ = పుత్రుని; కని = కనుగొని, ఉద్దేశించి; కంసుని = కంసుని; వలని = మూలమున; వెఱపునన్ = బెదురుతో; శుచి = స్వచ్ఛమైన; స్మిత = చిరునవ్వు కలామె; ఐ = అయ్యి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఇలా వసుదేవుడు అంటూ ఉండగా, దేవకీదేవి కొడుకును చూసింది. అతడు మహాపురుషుల సాముద్రిక లక్షణాలు కలిగి ఉన్నాడు. అతడు చక్కని చూపులు కలవాడు, చాలా సుకుమారుడు అయ్యి ఉన్నాడు. కంసుని పేరు వినబడగానే దేవకీదేవి భయపడింది. శుచి అయి చక్కటి చిరునవ్వు కలది అయి ఆ దేవదేవుని వంక చూసి ఇలా అంది.