పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/దేవకి చేసిన స్తుతి

తెభా-10.1-126-సీ.
"ట్టిట్టి దనరానిదై మొదలై నిండు-
కొన్నదై వెలుఁగుచు గుణములేని
దై యొక్క చందంబుదై కలదై నిర్వి-
శేషమై క్రియలేక చెప్పరాని
దేరూపమని శ్రుతు లెప్పుడు నొడివెడి-
యా రూప మగుచు నధ్యాత్మదీప
మై బ్రహ్మ రెండవ ర్థంబు తుది జగం-
బులు నశింపఁగఁ బెద్దభూతగణము

తెభా-10.1-126.1-ఆ.
సూక్ష్మభూతమందుఁ జొరగఁ నా భూతంబు
ప్రకృతిలోనఁ జొరఁగఁ బ్రకృతి పోయి
వ్యక్తమందుఁ జొరఁగ వ్యక్త మడంగను
శేషసంజ్ఞ నీవు చెలువ మగుదు.

టీక:- అట్టిది = అలాంటిది; ఇట్టిది = ఇలాంటిది; అనన్ = అనుటకు; రాని = వీలుకాని; మొదలు = మూలకారణము; ఐ = అయ్యి; నిండుకొన్నది = అంతటను వ్యాపించినది; ఐ = అయ్యి; వెలుగుచున్ = ప్రకాశించుచు; గుణము = త్రిగుణా; లేనిది = అతీతమైనది; ఐ = అయ్యి; ఒక్కచందంబు = నిర్వికారము కలది {ఒక్కచందము కలది - ఎప్పటికిని ఒకే విధముగా ఉండునది, షడ్భావవికారములు లేనిది}; ఐ = అయ్యి {షడ్వికారములు - 1ఆకలి 2దప్పిక 3శోకము 4మోహము 5ముసలితనము 6చావు}; కలది = శాశ్వతముగ నుండునది; ఐ = అయ్యి; నిర్విశేషము = ఇంద్రియవిషయలు లేనిది; ఐ = అయ్యి; క్రియ = కర్మవాసన గల పనులు; లేక = లేనిదై; చెప్పన్ = నోటితో వివరించుటకు; రానిది = వీలుకానిది; ఏ = ఎట్టి; రూపము = స్వరూపము; అని = అని; శ్రుతులు = వేదములు; ఎప్పుడున్ = ఎల్లప్పుడు; నొడివెడి = చెప్పెడి; ఆ = అట్టి; రూపము = స్వరూపము గలది; అగుచున్ = ఔతూ; అధ్యాత్మ = ఆత్మవిషయ జ్ఞానమును; దీపము = ప్రకాశింపజేయునది; ఐ = అయ్యి; బ్రహ్మ = బ్రహ్మదేవుని; రెండవయర్థంబు = ద్విపరార్థమున, శ్వేతవరాహాది కల్పములు; తుదిన్ = చివరకు; జగంబులున్ = అఖిల లోకములు; నశింపన్ = లయమైపోగా (మహాప్రళయము); పెద్దభూతగణము = పంచమహాభూతములు {పంచమహాభూతములు - భూజలాగ్ని వాయువ్యాకాశములు}.
సూక్ష్మభూతము = భూతాదియైన అహంకారము; అందున్ = లో; చొరగన్ = లయముకాగా; ఆ = ఆ; భూతంబు = అహంకారము; ప్రకృతి = మహతత్త్వము; లోనన్ = అందు; చొరగన్ = లయముకాగా; ప్రకృతి = ప్రకృతి; పోయి = నశించి; వ్యక్తము = అయవ్యక్తతత్వము; అందున్ = లో; చొరగన్ = లయముకాగా; వ్యక్తము = అయవ్యక్తతత్వము; అడంగును = నశించును; శేష = శేషుడు అనెడి; సంజ్ఞన్ = పేరుతో; నీవున్ = నీవు; చెలువము = ఒప్పువాడవు; అగుదు = అయ్యెదవు.
భావము:- “బ్రహ్మదేవుని ఆయుర్దాయంలో రెండవ సగం పూర్తైన పిమ్మట స్థూలమైన పంచమహాభూతాలు అహంకార మనే సూక్ష్మ భూతంలో లీనమవుతాయి. అది మూల ప్రకృతిలో లీనమౌతుంది. ఆ మూల ప్రకృతి వ్యక్తతత్వం లోనికి లీనమౌతుంది. ఆ వ్యక్తతత్వం కూడ లీనమైన తరువాత శేషుడవై నీవు నిలబడి ఉంటావు. అట్టి నీ తత్వం అలాంటిది ఇలాంటిదని వివరించడానికి వీలుకానిది. అదే అన్నిటికి మూలం. అన్నిటా అదే నిండి ప్రకాశిస్తుంటుంది. గుణాలకు అతీతమైనది. ఏకైక తత్త్వంగా నిలబడి ఉంటుంది. అది కాక వేరుగా శేషించినది ఏమీ ఉండదు. దాని రూపం ఇలా ఉంటుంది అని చెప్పడానికి వీలులేదు. ఎందుకంటే అది సర్వ క్రియా స్వరూపమైనది. వేదాలు ఆ తత్త్వాన్ని గురించే సర్వత్రా గానం చేస్తూ ఉంటాయి. ఆత్మను అధిష్ఠించి, దానికి ఆధారంగా నిలబడే జ్యోతి అది. అది నీవే.

తెభా-10.1-127-ఉ.
విశ్వము లీల ద్రిప్పుచు నవిద్యకు జుట్టమ వైన నీకు దా
శాశ్వతమైన కాలమిది ర్వము వేడబమందు; రట్టి వి
శ్వేశ్వర! మేలుకుప్ప! నిను నెవ్వఁడుఁ గోరి భజించు వాడె పో
శాశ్వతలక్ష్మి మృత్యుజయ సౌఖ్యయుతుం డభయుండు మాధవా!

టీక:- విశ్వము = ప్రపంచమును; లీలన్ = క్రీడగా; త్రిప్పుచున్ = నడిపించుచు (సృష్టిస్థితిలయల); అవిద్య = మాయ; కున్ = కు; చుట్టమవు = సంబంధించినవాడవు; ఐన = అయినట్టి; నీ = నీ; కున్ = కు; తాన్ = తను; శాశ్వతము = ఎప్పటికి ఉండునది; ఐన = అయినట్టి; కాలము = కాలము; ఇది = ఇది; సర్వమున్ = సమస్తము; వేడబము = మాయ; అందురు = అంటారు; అట్టి = అటువంటి; విశ్వేశ్వర = ప్రపంచమునకు కర్తా; మేలు = శుభములకు; కుప్ప = రాశి ఐనవాడ; నినున్ = నిన్ను; ఎవ్వడున్ = ఎవరైతే; కోరి = ఇచ్చష్టతో; భజించున్ = సేవించునో; వాడెపో = అతడు మాత్రమే; శాశ్వత = ఎన్నడు చెడని; లక్ష్మి = సంపదలు; మృత్యు = మరణమునుండి; జయ = జయము; సౌఖ్య = సుఖములతో; యుతుండు = కూడినవాడు; అభయుండు = భయము లేని వాడు; మాధవా = నారాయణా {మాధవుడు - మా (లక్ష్మీదేవి)కి ధవుడు (భర్త), మాధవి యొక్క భర్త, విష్ణువు}.
భావము:- విశ్వేశ్వరా! సర్వమేళ్ళకి నిధానమా! లక్ష్మీదేవిభర్తవైన నీవు ఈ విశ్వాన్ని అంతటిని నీ లీలలతో ప్రవర్తింప జేస్తుంటావు. దానికి ఆధారమైన అవిద్య అనెడి మాయకు నీవు దగ్గరి బంధువవు. ఈ శాశ్వతమైన అనంతమైన కాలం యావత్తు నీవు నడిపించే మాయ. ఇలా శాశ్వతమైన కాలాన్ని ప్రవర్తింపజేస్తూ జగత్తులకు మేలు చేకూర్చే నిన్ను కోరి ఆరాధించేవాడు వివేకి. వాడే సమస్త శాశ్వతమైన లక్ష్మీకళలను, సుఖాన్ని, మృత్యుంజయాన్ని పొందినవాడు అవుతాడు.

తెభా-10.1-128-మత్త.
ఒంటి నిల్చి పురాణయోగులు యోగమార్గనిరూఢులై
"కంటి"మందురు గాని, నిక్కము గాన; రీ భవదాకృతిం
గంటి భద్రముఁ గంటి; మాంసపుఁ న్నులం గనబోల; దీ
తొంటిరూపుఁ దొలంగఁబెట్టుము తోయజేక్షణ! మ్రొక్కెదన్.

టీక:- ఒంటిన్ = నిర్మానుష్య స్థలము లందు; నిల్చి = ఉండి; పురాణ = పురాతన {పురాణ యోగులు - సనక సనందన సనత్కుమార సనత్సుజాతాది మహర్షులు}; యోగులు = ఋషులు; యోగమార్గ = యోగవిధానమున; నిరూఢులు = మిక్కిలి నేర్పరులు; ఐ = అయ్యి; కంటిమి = దర్శించితిమి; అందురు = అంటారు; కాని = తప్పించి; నిక్కమున్ = సత్యమునకు; కానరు = చూడలేరు; ఈ = ఈ; భవత్ = నీ యొక్క; ఆకృతిన్ = స్వరూపమును; కంటిన్ = చూడగలిగితిని; భద్రమున్ = శుభములను; కంటిన్ = పొందితిని; మాంసపుకన్నులన్ = చర్మచక్షువులతో; కనన్ = చూచుటకు; పోలదు = సాధ్యము కాదు; ఈ = ఈ; తొంటి = ఆది; రూపున్ = స్వరూపమును; తొలంగబెట్టుము = తొలగింపజేయుము; తోయజేక్షణ = నారాయణా {తోయజేక్షణుడు - తోయజము (తెల్లతామరల)లవంటి కన్నులు కలవాడు, విష్ణువు}; మ్రొక్కెదన్ = నమస్కరించెదను.
భావము:- పద్మాక్షా! ప్రాచీనకాలం నుంచీ మహాయోగీశ్వరులు ఒంటరిగా యోగమార్గంలో అత్యంత తీవ్ర సాధన చేసి నిన్ను చూసాము అంటారు. కాని వారు చూసింది తాము చూడదలచిన రూపాన్నే కాని నీవు అనుగ్రహించే ఈ రూపాన్ని కాదు. నీవు దర్శన మిచ్చిన నీ ఈ రూపాన్ని భద్రంగా చూసి తరించాను ప్రభు. ఈ భౌతికమైన కన్నులతో నీ ఈ దివ్యరూపాన్ని చూడడం కష్టంగా ఉంది. నీకు నమస్కరిస్తాను. సర్వస్వానికి ఆధారమైన ఈ నీ స్వస్వరూపాన్ని ఉపసంహరించు.

తెభా-10.1-129-తే.
విలయకాలమందు విశ్వంబు నీ పెద్ద
డుపులోన దాఁచు డిమి మేటి
టుఁడ వీవు; నేఁడు నా గర్భజుఁడ వౌట
రమపురుష! వేడబంబు గాదె?

టీక:- విలయ = ప్రళయ; కాలము = సమయము; అందున్ = లో; విశ్వంబున్ = భువనములను; నీ = నీ యొక్క; పెద్ద = పెద్ద; కడుపు = గర్భము; లోనన్ = అందు; దాచు = దాచెడి; కడిమి = సమర్థుడవైన; మేటి = శ్రేష్ఠుడవైన; నటుడవు = నడిపించెడివాడవు; ఈవు = నీవు; నేడు = ఇవాళ; నా = నా యొక్క; గర్భజుడవు = కడుపున పుట్టిన వాడవు; ఔట = అగుట; పరమపురుష = నారాయణా {పరమ పురుషుడు - అత్యున్నతమైన కారణభూతుడు, పురుషోత్తముడు, విష్ణువు}; వేడబంబు = మాయే; కాదే = కాదా, అవును.
భావము:- సృష్టి అంతా ప్రళయంలో లీనమైపోయినప్పుడు ఈ సమస్తమైన విశ్వాన్ని కడుపులో దాచుకొన సమర్థుడవైన మహా నటుడవు. అలాంటి పరమ పురుషుడవు నీవు నా కడుపున పుట్టడం నీ మాయ మాత్రమే కదయ్యా! నారాయణా!

తెభా-10.1-130-త.
ళినలోచన! నీవు నిక్కము నాకుఁ బుట్టెద వంచు నీ
లుఁడు కంసుఁడు పెద్దకాలము కారయింట నడంచె; దు
ర్మలినచిత్తుని నాజ్ఞజేయుము; మ్ముఁ గావుము భీతులన్;
నులుసు లేక ఫలించె నోచిన నోము లెల్లను నీవయై.”

టీక:- నళినలోచన = నారాయణా {నళిన లోచనుడు - పద్మాక్షుడు, హరి}; నీవున్ = నీవు; నిక్కమున్ = నిజముగా; నా = నా; కున్ = కు; పుట్టెదవు = జన్మించెదవు; అంచున్ = అనుచు; ఈ = ఈ; ఖలుడు = దుష్టుడు; కంసుడు = కంసుడు; పెద్ద = చాలా; కాలము = కాలము నుండి; కారయింటన్ = చెరసాలలో; అడంచెన్ = అణచివేసెను; దుర్మలిన = చెడ్డపాపపు; చిత్తున్ = బుద్ధి కలవానిని; ఆజ్ఞజేయుము = శిక్షింపుము; మమ్మున్ = మమ్ములను; కావుము = కాపాడుము; భీతులన్ = బెదిరిపోయినవారము; నులుసు = ఏ లోపము, న్యూనత; లేక = లేకుండగ; ఫలించెన్ = ఫలించినవి; నోచిన = నిష్ఠగా ఆచరించిన; నోములు = వ్రతములు; ఎల్లను = అన్నియును; నీవున్ = నీవు; ఐ = కలుగుట అయ్యి.
భావము:- కమలదళాలలాంటి చక్కని కన్నులు గల ఓ ప్రభూ! నీవు నా కడుపున పుట్ట బోతున్నావని విని, దుర్మార్గుడు కంసుడు చాలాకాలంగా మమ్మల్ని ఇలా జైలులో పెట్టి బాధ పెడ్తున్నాడు. మలిన చిత్తంతో మసలుతున్న వాడిని శిక్షించు. భయభ్రాంతులము అయిన మమ్ము రక్షించు. నీ పుట్టుకతో మేము నోచిన నోములు అన్నీ లోటు లేకుండ పరిపూర్ణంగా పండాయి స్వామీ.” అని చెప్పుకొంది దేవకీదేవి.