పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/యశోద గోపికల నొడంబరచుట

తెభా-10.1-330-వ.
అని మఱియు ననేకవిధంబుల బాలకృష్ణుండు చేయు వినోదంబులు దమ యందుఁ జేయు మహాప్రసాదంబు లని యెఱుంగక దూఱుచున్నయట్టి గోపికలకు యశోద యిట్లనియె.
టీక:- అని = అని; మఱియున్ = ఇంకను; అనేక = వివిధ; విధంబులన్ = రకములుగా; బాలకృష్ణుండు = బాలకృష్ణుడు; చేయు = చేసెడి; వినోదంబులున్ = వేడుక పనులు; తమ = వారి; అందున్ = ఎడల; చేయు = చేసెడి; మహా = గొప్ప; ప్రసాదంబులు = అనుగ్రహములు; అని = అని; ఎఱుంగక = తెలియక; దూఱుచున్నయట్టి = తిడుతున్నట్టి; గోపికల = గోపస్త్రీల; కున్ = కు; యశోద = యశోద; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- మరికా ఆ కపట శైశవమూర్తి కొంటె కృష్ణమూర్తి దొంగజాడల ఇలా రకరకాల బాల్యచేష్టలను లీలలుగా ప్రదర్శిస్తూ క్రీడిస్తుంటే. తమకు అందిస్తున్న ఆ మహాప్రసాదాలను తెలుసుకోలేక, ఓపికలు నశించిన గోపికలు తిడుతుంటే. యశోదాదేవి వారికి ఇలా చెప్పుతున్నారు.

తెభా-10.1-331-క.
"చన్ను విడిచి చనఁ డిట్టటు
నెన్నఁడుఁ బొరుగిండ్ల త్రోవ లెఱుఁగఁడు నేడుం
న్నులు దెఱవని మా యీ
చిన్ని కుమారకుని ఱవ్వ చేయం దగునే?

టీక:- చన్ను = చనుబాలుతాగుట; విడిచి = వదలి; చనడు = వెళ్ళడు; ఇట్టట్టు = ఎటుపక్కకి; ఎన్నడున్ = ఎప్పుడు కూడ; పొరుగు = పక్కవారి; ఇండ్లన్ = ఇళ్ళకి; త్రోవలు = దారికూడ; ఎఱుగడు = తెలియనివాడు; నేడున్ = ఇప్పటికి; కన్నులు = కళ్లు; తెఱవని = తెరవనట్టి; మా = మా యొక్క; ఈ = ఈ; చిన్ని = చంటి; కుమారకునిన్ = పిల్లవానిని; ఱవ్వ = అల్లరి, గొడవ; చేయన్ = చేయుట; తగునే = తగినపనేనా, కాదు.
భావము:- "మా కన్నయ్య చంటాడు నా ఒళ్ళో కూర్చుండి పాలు తాగుతుండటమే తప్ప నన్ను వదలి ఈ పక్కకి ఆ పక్కకి పోడు. పక్కింటికి కూడ దారి తెలియదు. అలాంటి ఈ నాటికి సరిగా కళ్ళు తెరవడంరాని పసిగుడ్డును ఇలా అల్లరి పెట్టడం మీకు తగినపని కాదు.

తెభా-10.1-332-తే.
న్య మెఱుఁగఁడు; తన యంత నాడుచుండు;
మంచివాఁ డీత; డెగ్గులు మానరమ్మ!
రామలార! త్రిలోకాభిరామలార!
ల్లులార! గుణవతీమల్లులార!"

టీక:- అన్యమున్ = ఇతర మైన వేమి, తనకు వేరైనది; ఎఱుగడు = తెలియనివాడు, అసలు లేనివాడు; తనయంతన్ = అతనంటతనే, ఆత్మా; ఆడుచుండున్ = ఆడుకొనుచుండును, రాముడు; మంచివాడు = ఉత్తముడు; ఈతడు = ఇతను; ఎగ్గులు = నిందలు, చాడీలు; మానరు = మానివేయండి; అమ్మ = తల్లి; రామలార = మనోజ్ఞరాళ్ళూ; త్రిలోక = ముల్లోకములను; అభి = మిక్కిలి; రామలార = ఆనందింపజేసే ఇంతులూ; తల్లులారా = మా అమ్మలారా; గుణవతీమ తల్లులారా = సుగుణవంతులలో శ్రేష్ఠులారా.
భావము:- తల్లులల్లారా! మనోజ్ఞమైన మగువల్లారా! ముల్లోకాలకు మోదం కలిగించే ముదితల్లారా! నామాట వినండి. ఇతను ఇతరమైనదేది ఎరుగడు. తనంతట తనే క్రీడిస్తు ఉంటాడు. మా కన్నయ్య ఎంతో మంచివాడు అమ్మలార! సకల సద్గుణవతీ లలామల్లారా! ఇతనిపై అపనిందలు వేయకండమ్మా."తల్లి యశోదాదేవి తన వద్దకు వచ్చి బాలకృష్ణుని అల్లరి చెప్పే గోపికలను సమాధాన పరుస్తోంది.

తెభా-10.1-333-వ.
అని యశోద వారల నొడంబఱచి పంపి గొడుకుం గోపింపఁజాలక యుండె; నిట్లు.
టీక:- అని = అని; యశోద = యశోద; వారలన్ = వారిని; ఒడంబఱచి = ఒప్పించి; పంపి = సాగనంపి; కొడుకున్ = పుత్రుని; కోపింపన్ = కోపగించుటకు; చాలక = మనసురాక; ఉండెన్ = ఉండెను; ఇట్లు = ఈ విధముగ.
భావము:- ఇలా ఆ కపట శైశవ కృష్ణమూర్తి దొంగజాడల జేయు బాల్యచేష్టలను చెప్పుకుంటున్న ఓపికలు లేని గోపికలకు యశోదాదేవి నచ్చచెప్పి పంపిది, కాని కొడుకుమీద ఉన్న ప్రేమ వలన కోప్పడలేకపోయింది.

తెభా-10.1-334-ఉ.
కాంలు దల్లితోఁ దన వికారము లెల్ల గణింప భీతుఁ డై
శాంతుని సొంపునం బరమ సాధుని పెంపున గోలమాడ్కి వి
భ్రాంతుని కైవడిన్ జడుని భంగిఁ గుమారకుఁ డూరకుండె నే
వింయు లేక దల్లి కుచవేదికపైఁ దల మోపి యాడుచున్.

టీక:- కాంతలు = గోపికలు; తల్లి = తనతల్లి; తోన్ = తోటి; తన = తన యొక్క; వికారములు = వెకిలిపనులు; ఎల్లన్ = అన్నిటిని; గణింపన్ = ఎంచిచెప్పగా; భీతుడు = భయపడుతున్నవాడు; ఐ = అయ్యి; శాంతుని = పరమశాంతస్వభావుని; సొంపునన్ = విధముగ; పరమ = అతిమిక్కిలి; సాధుని = యోగ్యుని; పెంపునన్ = విధముగ; గోల = అమాయకుని; మాడ్కిన్ = వలె; విభ్రాంతుని = నివ్వెరపడినవాని; కైవడిన్ = వలె; జడుని = మందుని; భంగిన్ = వలె; కుమారకుడు = పిల్లవాడు; ఊరకన్ = చడీచప్పుడు చేయకుండ; ఉండెన్ = ఉండెను; ఏ = ఎట్టి; వింతయున్ = కపటము; లేక = లేకుండగ; తల్లి = తల్లి యొక్క; కుచ = స్తనముల; వేదిక = స్థలము; పైన్ = మీద; తల = తలను; మోపి = ఆన్చి; ఆడుచున్ = ఆడుకొనుచు.
భావము:- ఇలా గోపికలు తన తల్లి యశోదకు తను చేసే అల్లరిల పనులు అన్ని ఎంచి మరీ చెప్తుంటే, ఈ కొంటె కృష్ణుడు ఏం మాట్లాడకుండా ఎంతో భయపడిపోయిన వాడిలాగ, ఎంతో నెమ్మదైన వానిలాగ, పరమ సాధు బుద్ధి వానిలాగ, అమాయకపు పిల్లవానిలాగ, నివ్వెరపోయినవానిలాగ, మందుడి లాగ ఊరికే ఉన్నాడు. అసలు ఏమి జరగనట్లు తల్లి ఒడిలో చేరి తల్లి రొమ్ములపై తలాన్చి ఆడుకుంటున్నాడు.