పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/మల్లరంగ వర్ణన
తెభా-10.1-1310-సీ.
పాషాణ వల్మీక పంకాది రహితంబు;
మృదులకాంచననిభ మృణ్మయంబు
గమనీయ కస్తూరికా జలసిక్తంబు;
బద్ధచందనదారు పరివృతంబు
మహనీయ కుసుమదామధ్వజ తోరణ;
మండితోన్నత మంచ మధ్యమంబు
బ్రాహ్మణ క్షత్రాది పౌరకోలాహలం;
బశ్రాంత తూర్యత్రయాంచితంబు
తెభా-10.1-1310.1-ఆ.
నిర్మలంబు సమము నిష్కంటకంబునై
పుణ్యపురుషు మనముఁ బోలి కంస
సైన్య తుంగ మగుచు సంతుష్ట లోకాంత
రంగమైన మల్లరంగ మొప్పె.
టీక:- పాషాణ = రాళ్ళు; వల్మీక = పుట్టలు; పంక = బురద; ఆది = మున్నగునవి; రహితంబు = లేనిది; మృదుల = మెత్తనైన; కాంచన = బంగారము; నిభ = లాంటి; మృత్ = మట్టితో; మయంబు = నిండి యున్నది; కమనీయ = మనోజ్ఞమైన; కస్తూరికా = కస్తూరికలుపిన; జల = నీళ్ళచేత; సిక్తంబు = తడపబడినది; బద్ధ = కట్టబడిన; చందన = మంచిగంధము; దారు = మ్రాకులచేత; పరివృతంబు = చుట్టును కలది; మహనీయ = గొప్ప; కుసుమ = పూల; దామ = దండలు; ధ్వజ = స్తంభములు, జండాలు; తోరణ = తోరణములుచేత {తోరణము - అలంకరణార్థమై మామిడాకులు మున్నగువానిచే వరుసలుగా కట్టబడిన తాడు}; మండిత = అలంకరింపబడిన; ఉన్నత = ఎత్తైన; మంచ = మంచెలు, రంగస్థలము; మధ్యంబున్ = మధ్యన కలది; బ్రాహ్మణ = బ్రాహ్మణులు; క్షత్ర = రాజులు; ఆది = మున్నగు; పౌర = పురజనుల; కోలాహలంబు = కలకలధ్వని కలది; అశ్రాంత = ఎడతెగని; తూర్యత్రయ = తూర్యత్రయములచే {తూర్యత్రయము - 1నాట్యము 2గీతము 3వాద్యములు అనెడి మూడు, 1తంత్రీ 2చర్మ 3ఊదెడి రకముల వాద్యములు}; అంచితంబు = చక్కగానున్నది.
నిర్మలంబు = పరిశుద్ధమైనది; సమము = సమతలముగానున్నది {సమతలము - మిట్టపల్లములు లేని ప్రదేశము}; నిష్కంటకంబున్ = ముళ్ళులేనిది; ఐ = అయ్యి; పుణ్య = పుణ్యాత్ముడైన; పురుషున్ = మనుష్యుని; మనమున్ = మనసు; పోలి = సరిపోలి; కంస = కంసుని యొక్క; సైన్య = సేనచేత; తుంగము = శ్రేష్ఠమైనది; అగుచున్ = అగుచు; సంతుష్ట = సంతోషించిన; లోక = జనుల యొక్క; అంతరంగము = మనసులు కలది; ఐన = అయిన; మల్ల = మల్లయుద్ధ; రంగ
భావము:- మహారాజు కంసుడు మల్లయుద్ధానికి సిద్ధం చేయించిన క్రీడాప్రాంగణము రాళ్ళు పుట్టలు బురద మున్నగునవి లేకుండా మెత్తని బంగారువన్నెమట్టితో ఒప్పింది. దానికి కమ్మని కస్తూరి జలంతో కళ్ళాపి జల్లారు. చుట్టూ గంధం కఱ్ఱలతో కంచె అమర్చారు. పెద్ద పెద్ద పూల దండలతో, జండాలతో, తోరణాలతో అలంకరించారు. ఎత్తయిన ఆసనముల మధ్య ఆ రంగం నిర్మించారు. అది బ్రాహ్మణులు క్షత్రియులు మొదలగు పురప్రజల కోలాహలంతో నిండి ఉంది. ఎడతెగకుండా మ్రోగుతున్న వాద్యాల ధ్వనులతో అతిశయించింది. అది పుణ్యపురుషుడి మానసంలా మాలిన్యం లేనిది. సమంగా కంటక రహితమై శోభిల్లేది. అది కంసుడి సైన్యంతో ఉన్నతమై ఒప్పారేది. జనుల మనసులను సంతోషం కలిగించేది.
తెభా-10.1-1311-క.
ఆ మల్లరంగ పరిసర
భూమిస్థిత మంచమందు భోజేంద్రుఁడు మా
న్యామాత్యసంయుతుండై
భూమీశులు గొలువ నుండెఁ బొక్కుచు నధిపా.
టీక:- ఆ = అట్టి; మల్ల = మల్లయుద్ధ; రంగ = రంగస్థలమునకు; పరిసర = సమీపమున ఉన్న; భూమి = నేలపై; స్థిత = వేయబడిన; మంచము = ఆసనము; అందున్ = మీద; భోజేంద్రుడు = కంసమహారాజు {భోజేంద్రుడు - భోజవంశపు ప్రభువు, కంసుడు}; మాన్య = పూజ్యులు {మాన్యుడు – మన్నింప దగినవాడు, పూజ్యుడు}; అమాత్య = మంత్రులుతో {అమాత్యుడు - మంత్రముతో (ఆలోచనతో) కూడి ఉండువాడు, మంత్రి}; సంయుతుండు = కూడినవాడు; ఐ = అయ్యి; భూమీశులు = రాజులు {భూమీశుడు - భూమి (రాజ్యము)నకు ఈశుడు, రాజు}; కొలువన్ = సేవించుచుండగా; ఉండెన్ = ఉండెను; పొక్కుచున్ = తపించుచు.
భావము:- ఆ మల్లరంగానికి దగ్గరలో ఉన్న ఆసనం మీద భోజమహారాజు కంసుడు మాన్యులగు మంత్రులతో కూడి సామంతులు సేవిస్తుండగా భేదపడుతూ కూర్చుని ఉన్నాడు
తెభా-10.1-1312-మ.
సకలాంభోనిధి మేఖలావహనముం జాలించి యేతెంచు నా
గ కులాగంబుల భంగి నొప్పుచుఁ దగం గైసేసి చాణూర ము
ష్టికకూటుల్ చలకోసలుల్ గురువులన్ సేవించుచున్ రంగధా
త్రికి నేతెంచిరి తూర్యఘోషముల నుద్రేకం బనేకంబుగన్.
టీక:- సకల = సమస్తమైన; అంభోనిధిమేఖలా = భూమండలము యొక్క {అంభోనిధిమేఖల – సముద్రములు పరివేష్టించినది (మొలనూలుగా కలది), భూమండలము}; వహనమున్ = మోయుటను; చాలించి = ఆపి; ఏతెంచు = వచ్చెడి; నాగ = దిగ్గజములు; కులాగంబుల = కులపర్వతముల; భంగిన్ = వలె; ఒప్పుచున్ =అతియిస్తూ; తగన్ = తగినట్లు; కైసేసి = అలంకరించుకొని; చాణూర = చాణూరుడు; ముష్టిక = ముష్టికుడు; కూటుల్ = కూటుడు; చల = చలుడు; కోసలుల్ = కోసలుడు; గురువులన్ = ఆచార్యులను; సేవించుచున్ = కొలుచుచు; రంగ = మల్లయుద్ధ; ధాత్రి = క్షేత్రమున; కిన్ = కు; ఏతెంచిరి = వచ్చిరి; తూర్య = వాద్యముల యొక్క; ఘోషములన్ = ధ్వనులచేత; ఉద్రేకంబు = ఉద్విగ్నత; అనేకంబుగన్ = మిక్కిలి హెచ్చుతుండగ.
భావము:- సమస్త సముద్రాలు సరిహద్దులుగా ఉన్న భూమండలాన్ని మోయడం మానుకుని నడచి వస్తున్న దిగ్గజాలలా, కులపర్వతాలలా ఒప్పుతూ, తగినట్లు అలంకరించుకుని చాణూరుడూ, ముష్టికుడూ, కూటుడూ, చలుడూ, కోసలుడూ తమ గురువులను కొలుస్తూ వాయిస్తున్న వాద్యాల శబ్దాలకు ఉద్రేకం చెలరేగుతుండగా రంగస్థలానికి వచ్చారు.
తెభా-10.1-1313-క.
నందాదులైన గోపకు
లందఱు చని కానుకలు సమర్పించి నృపున్
సందర్శించి తదనుమతిఁ
జెంది మహామంచముల వసించిరి వరుసన్.
టీక:- నంద = నందుడు; ఆదులు = మున్నగువారు; ఐన = అయినట్టి; గోపకులు = యాదవులు; అందఱున్ = ఎల్లరు; చని = పోయి; కానుకలు = కానుకలను; సమర్పించి = ఇచ్చి; నృపున్ = రాజును {నృపుడు - నరులను పాలించు వాడు, రాజు}; సందర్శించి = చూసి; తత్ = అతని; అనుమతిన్ = అంగీకారము; చెంది = పొంది; మహా = గొప్ప; మంచములన్ = మంచెలపై, అరుగుపై; వసించిరి = కూర్చుండిరి; వరుసన్ = వరుసలుగా.
భావము:- నందుడు మొదలగు గోపాలురు అందరూ వెళ్ళి కంసరాజును దర్శించి, కానుకలు సమర్పించి, అతని అనుమతితో పెద్దపెద్ద ఆసనాల మీద వరుసలు కట్టి కూర్చున్నారు.
తెభా-10.1-1314-వ.
అంత నా రామకృష్ణులు నలంకృతులై మల్లదుందుభి నినదంబు విని సందర్శన కుతూహలంబున.
టీక:- అంతన్ = ఆ పిమ్మట; ఆ = ఆ ప్రసిద్ధులైన; రామ = బలరాముడు; కృష్ణులున్ = కృష్ణుడు కూడ; అలంకృతులు = శృంగారించుకొన్నవారు; ఐ = అయ్యి; మల్ల = మల్లుల; దుందుభి = భేరీ; నినదంబు = ధ్వని; విని = విని; సందర్శన = చూడవలెనని; కుతూహలంబున = వేడుకతో.
భావము:- అప్పుడు బలరామకృష్ణులు జెట్టీల భేరీనినాదాలు విని అలంకరించుకున్నవారై మల్లరంగం చూడడానికి ఉబలాటంతో. . .
తెభా-10.1-1315-క.
ఓడక రంగద్వారము
జాడం జని వారు కనిరి సమద కువలయా
పీడంబున్ భిన్నపరా
క్రీడంబుం బ్రమదకంటకిత చూడంబున్.
టీక:- ఓడక = వెనుదీయక; రంగ = రంగస్థలము యొక్క; ద్వారము = గుమ్మము; జాడన్ = దారమ్మట; చని = వెళ్ళి; వారు = వారు; కనిరి = చూసిరి; సమద = మదించిన; కువలయాపీడంబున్ = కువలయాపీడమను ఏనుగును {కువలయాపీడము - కు (భూ) వలయ (మండలమును) పీడము (భాధించునది), కంసుని ఏనుగు పేరు}; భిన్న = విరిగిన; పర = శత్రువు లనెడి; ఆక్రీడంబును = ఉద్యానవనములు కలది; ప్రమద = మిక్కిలిమిక్కిలి మదించుటచే; కంటకిత = ముళ్ళుగల; చూడంబును = కుంభస్థలము గలది.
భావము:- రామకృష్ణులు జంకూ గొంకూ లేకుండా రంగస్థలం ప్రవేశ ద్వారం దగ్గరకు వెళ్ళి మదించిన కువలయాపీడమనే పెద్ద ఏనుగును చూసారు. అది ఇతర గజాలను ఓడించడంలో మిక్కిలి నేర్పు కలది. ఆ గజరాజు పెచ్చు మీఱిన మదంతో గగుర్పొడుస్తున్న కుంభస్థలము కలది.