పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/ప్రలంబాసుర వధ

తెభా-10.1-727-వ.
ఇట్లు రామకృష్ణులు నద నదీ తీరంబులఁ, గొలంకుల సమీపంబుల, గిరులచఱుల సెలయేఱుల పొంతల మడుఁగులచెంతలఁ, బొదలక్రేవలఁ, బసిమి గల కసవుజొంపంబులఁ బసుల మేపుచుడం బ్రలంబుడను రక్కసుం డుక్కుమిగిలి గోపాలరూపంబున వచ్చి వారల హింసజేయ దలంచుచుండ న య్యఖిలదర్శనుం డగు సుదర్శనధరుం డెఱింగియు నెఱుంగని తెఱంగున.
టీక:- ఇట్లు = ఈ విధముగ; రామ = బలరాముడు; కృష్ణులు = కృష్ణుడు; నద = పడమరకు పారు యేరుల; నదీ = తూర్పుకు పారు యేరుల; తీరంబులన్ = గట్లమీద; కొలంకుల = సరస్సుల; సమీపంబులన్ = దగ్గరలో; గిరులన్ = కొండ; చఱుల = చరియ లందు; సెలయేఱుల = సెలయేరుల; పొంతలన్ = పక్కన; మడుగులన్ = మడుగుల; చెంతలన్ = దగ్గర; పొదల = పొదలకు; క్రేవల = ప్రక్కల, సమీపమున; పసిమి = పచ్చదనము; కల = కలిగిన; కసవు = గడ్డి; జొంపంబులన్ = దుబ్బులను; పసులన్ = పశువులను; మేపుచుండన్ = మేపుతుండగా; ప్రలంబుడు = ప్రలంబుడు {ప్రలంబుడు - ప్ర (మిక్కిలి) లంబుడు (పొడవుగా ఉన్న వాడు)}; అను = అనెడి; రక్కసుండు = రాక్షసుడు {రాక్షసుడు - ప్రమాణము శ్లో:: వృక్షాన్ ఛిత్వా పశూన్ హత్వా కృత్వా రుధిరకర్దమం: బ్రాహ్మణావ యమిత్యేవం మౌస్యంతే రాక్షసాః కలౌ: రాక్షసాః కలిమాశ్రిత్య జాయంతే బ్రహ్మయోనిషు: బ్రాహ్మణానేవ బాధంతే పరిత్యక్తాఖిలాగమాః::}; ఉక్కుమిగిలి = విజృంభించి; గోపాల = గొల్లవాని; రూపంబునన్ = స్వరూపముతో; వచ్చి = దగ్గరకు చేరి; వారలన్ = వారిని; హింస = చంపి; చేయన్ = వేయవలెనని; తలంచుచున్ = అనుకొనుచు; ఉండన్ = ఉండగా; ఆ = ఆ యొక్క; అఖిల = సమస్తమును; దర్శనుండు = చూచువాడు; అగు = ఐన; సుదర్శనధరుండు = కృష్ణుడు {సుదర్శన ధరుండు - సుదర్శనము అను చక్రాయుధము ధరించువాడు, విష్ణువు}; ఎఱింగియున్ = తెలిసినను; ఎరుంగని = తెలియనివాని; తెఱంగునన్ = విధముగ.
భావము:- ఇలా బలరామకృష్ణులు నదనదీ తీరాలలో; సరస్సుల సమీపాన; కొండల దాపున; సెలయేళ్ళ చెంత; మడుగుల దగ్గర; పొదల పొంత; పచ్చని పచ్చిక గుబురులలో; పశువులను మేపుతూ ఉన్నారు. ఆ సమయంలో ప్రలంబాసురుడు అనే రాక్షసుడు గోపబాలుని రూపంతో విజృంభించి వారి వద్దకు వచ్చాడు. రామకృష్ణులను ఏ తీరున హింసించడమా అని ఆలోచిస్తున్నాడు. అన్నీ తెలిసిన శ్రీకృష్ణుడు ఏమీ తెలియనట్లు ఉన్నాడు.

తెభా-10.1-728-క.
రాముని సహజన్ముఁడు
రా మ్మని వానిఁ జీరి రాకం బోకన్
గారాము చేసి మెల్లన
పోరామి యొనర్చెఁ బిదపఁ బొరిగొనుకొఱకున్.

టీక:- ఆ = ఆ; రామునిసహజన్ముడు = కృష్ణుడు {రాముని సహజన్ముడు - బలరాముని యొక్క సోదరుడు, కృష్ణుడు}; రారమ్ము = తొందరగారా {రాముడు - శ్రు:: రమంతే యోగినోనంతే సత్యానందే చిదాత్మని: ఇతి రామ పదేనాసౌ పరబ్రహ్మాభియతే, పరమానందము నిచ్చెడి పరబ్రహ్మ}; అని = అని; వానిన్ = అతనిని; చీరి = పిలిచి; రాకంబోకన్ = ఇటునటు తిరుగునప్పుడు; గారాము = గారాబము; చేసి = చేసి; మెల్లనన్ = మెల్లిగా; పోరామి = చెలిమి; ఒనర్చెన్ = చేసెను; పిదపన్ = తరువాత; పొరిగొను = చంపుట; కొఱకున్ = కోసము.
భావము:- బలరాముడి తోబుట్టువైన కృష్ణుడు ప్రలంబాసురుని హతమార్చేందుకు ఒక పన్నాగం పన్నాడు. ఆ దానవుణ్ణి చెంతకు రమ్మని ప్రియంగా పిలిచి రాకపోకలతో వానిలో నెమ్మదిగా చెలిమి పెంపొందించుకున్నాడు.

తెభా-10.1-729-వ.
ఇట్లు ప్రలంబునితోఁ జెలిమి చేయుచుఁ, గృష్ణుండు గోపాలకులకు, నిట్లనియె.
టీక:- ఇట్లు = ఈ విధముగ; ప్రలంబుని = ప్రలంబాసురుని; తోన్ = తోటి; చెలిమి = స్నేహము; చేయుచున్ = చేస్తు; గోపాలకుల్ = గొల్లవారి; కున్ = కింద; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఇలా ప్రలంబాసురుడితో నెయ్యం నెరపుతూ శ్రీకృష్ణుడు గోపబాలురను ఉద్దేశించి ఇలా అన్నాడు

తెభా-10.1-730-ఆ.
నకుఁ బ్రొద్దుపోదు న మిందఱము రెండు
ములవార మగుచుఁ గందుకముల
శిలలు గుఱులు చేసి చేరి క్రీడింతము
రండు వలయు జయపరాజయములు.

టీక:- మన = మనము అందరి; కున్ = కి; పొద్దుపోదు = కాలక్షేప మగుట లేదు; మనము = మనము; ఇందఱమున్ = ఈ అందరము; రెండు = రెండు (2); గముల = పక్షములు కట్టిన; వారము = వారలము; అగుచున్ = ఔతు; శిలలున్ = రాళ్ళను; గుఱులు = లక్ష్యములుగా; చేసి = చేసికొని; చేరి = కూడి; క్రీడింతము = ఆడుకొనెదము; రండు = రండి; వలయున్ = పొందవలెను; జయ = గెలుపు; పరాజయములున్ = ఓటములు.
భావము:- “మనకు ప్రొద్దు పోవడం లేదు కదా. మనం అందరం రెండు పక్షాలుగా ఏర్పడి రాళ్ళను బంతులను గురి చేసి విసురి కొట్టే ఆట ఆడుదాం. ఎవరు గెలుస్తారో ఎవరు ఓడుతారో చూద్దాం.”

తెభా-10.1-731-వ.
అని యిట్లుపలికి, తానును బలభద్రుండును బెన్నుద్దులై యితర వల్లవు లెల్ల నుద్దించుకొని చిఱ్ఱుద్దు లై వచ్చిన సమయంబుగ విభజించికొని, రెండు గములవారై మార్గంబులందుఁ దృణ దారు శిలా కల్పితంబు లగు గుఱులొడ్డి, కందుక శిలాది ప్రక్షేపణంబుల లక్ష్యంబులఁ దాఁక వైచి, జయ పరాజయ నిర్ణయంబులు గైకొని వాహ్యవాహక లక్షణంబుల నిర్జితులు జేతల వహించి క్రీడించుచు, బలరామునికి వాని చందంబు రహస్యంబున నెఱింగించి; పసుల బిల్చుచు, భాండీరకం బను వటంబు జేరి రా సమయంబున; క్రీడయందుఁ శ్రీదామనామధేయండైన గోపకుండు శ్రీకృష్ణుని వహించె; భద్రసేనుండు వృషభు నెక్కించుకొనియె; బలభద్రుండు ప్రలంబు నారోహించె నప్పుడు.
టీక:- అని = అని; ఇట్లు = ఈ విధముగ; పలికి = చెప్పి; తానును = అతను; బలభద్రుండును = బలరాముడు; పెన్ = పెద్ద; ఉద్దులు = ఉద్దులు, జతగాడు; ఐ = అయ్యి; ఇతర = మిగిలిన; వల్లవుల = గొల్లవాళ్ళను; ఎల్లను = అందరిని; ఉద్దించుకొని = జతపర్చుకొని; చిఱు = చిన్న; ఉద్దులు = జతగాళ్ళు; ఐ = అయ్యి; వచ్చిన = రాగా; సమయంబుగన్ = ఒప్పుకున్నట్లు, అంగీకారమైనట్లు; విభజించుకొని = పంచుకొని; రెండు = రెండు (2); గముల = పక్షముల; వారు = వారుగా; ఐ = ఏర్పరచుకొని; మార్గంబులందు = దారు లమ్మట; తృణ = గడ్డి; దారు = కఱ్ఱలు; శిలా = రాళ్ళతో; కల్పింతంబులు = ఏర్పరచుకొన్నవి; అగు = ఐన; గుఱులు = లక్ష్యములను; ఒడ్డి = పన్నుకొని; కందుక = బంతులు, చెండ్లు; శిల = రాళ్ళు; ఆది = మున్నగు; ప్రక్షేపణంబులన్ = విసరుటచేత; లక్ష్యంబులన్ = లక్ష్యములను; తాకన్ = తగులునట్లుగా; వైచి = విసిరి; జయ = గెలుపు; పరాజయ = ఓటములను; నిర్ణయంబులున్ = నిశ్చయములు; కైకొని = చేసుకొని; వాహ్య = మోయబడువాడు; వాహక = మోయువాడు అను; లక్షణంబులన్ = పద్ధతి ప్రకారము; నిర్జితులు = ఒడినవారు; జేతలన్ = గెలిచినవారిని; వహించి = మోయుచు; క్రీడించుచున్ = ఆడుకొనుచు; బలరాముని = బలరాముడి; కిన్ = కి; వాని = అతని యొక్క; చందంబున్ = విధమును (కపటము); రహస్యంబునన్ = రహస్యముగా; ఎఱింగించి = తెలిపి; పసులన్ = గోవులను; పిల్చుచున్ = పిలుచుకొని వెళుతు; భాండీరకంబు = భాండీరకము; అను = అనెడి; వటంబున్ = మఱ్ఱిచెట్టును; చేరిరి = చేరిరి; ఆ = ఆ; సమయంబునన్ = సమయము నందు; క్రీడ = ఆట; అందున్ = లో; శ్రీదామ = శ్రీదాముడు అనెడి; నామధేయుండు = పేరు గలవాడు; ఐన = అయిన; గోపకుండు = గోపాలుడు; శ్రీకృష్ణుని = కృష్ణుని; వహించెన్ = మోసెను; భద్రసేనుండు = భద్రసేను డనువాడు; వృషభున్ = వృషభు డనువానిని; ఎక్కించుకొనియె = ఎక్కించుకొనెను; బలభద్రుండు = బలరాముడు; ప్రలంబున్ = ప్రలంబుని; ఆరోహించెన్ = ఎక్కెను; అప్పుడు = అప్పుడు.
భావము:- ఇలా చెప్పిన శ్రీ కృష్ణుడు తానూ తన అన్న బలరాముడూ పెద్ద ఉద్దులై చెరొక జట్టుకి నాయకులుగా, నిలబడ్డారు తక్కిన గొల్లపిల్లలు చిఱ్ఱుద్దులుగా జట్టులోని సభ్యులుగా చీలి రెండు జట్లుగా ఏర్పడ్డారు. అలా కొందరు కృష్ణుని జట్టూ; మరికొందరు బలరాముని వైపు చేరారు. వారు గడ్డితో కొయ్యలతో రాళ్ళతో లక్ష్యాలు ఏర్పాటు చేసుకుని, వాటిని బంతులతోను, శిలలోతోను గురి చూసి కొడుతూ, గెలుపు ఓటములు నిర్ణయించుకో సాగారు. ఆటలో గెలిచిన వారు, ఓడిన వారి మీద ఎక్కాలి. ఓడిన వారు గెలిచిన వారిని మోయాలి. ఇలా నియమం పెట్టుకుని ఆడుతూ వెళ్తున్నారు. దారిలో శ్రీకృష్ణుడు రహస్యంగా తన అన్న బలరాముడికి ప్రలంబాసురుడి వృత్తాంతం తెలియ జెప్పాడు. అలా క్రీడిస్తూ గోపాలకులు పశువులను అదిలిస్తూ కదిలి భాండీరకము అనే మఱ్ఱిచెట్టు దగ్గరకి చేరారు. అప్పుడు బలరాముడి పక్షంలో ఉన్న శ్రీ దాముడు అనే గొల్లపిల్లాడు క్రీడలో ఓడినందున కృష్ణుణ్ణి తన మీద ఎక్కించుకుని మోసాడు. అలాగే పరాజయం పొందిన కృష్ణుడి జట్టులోని భద్రసేనుడు మీద వృషభుడు, ప్రలంబుడుమీద బలరాముడు ఎక్కారు.

తెభా-10.1-732-మ.
జాక్షున్ బలిమిన్బలాఢ్యుఁడు తృణార్తుండు మున్మింటికిం
గొనిపోఁ జాలక చిక్కినాఁ డతని నాకున్ మోవరా దంచు నా
నుజారిన్ గొనిపోఁ దలంపక వడిన్ దైత్యేశుఁ డయ్యాటలోఁ
గొనిపోయెన్ గిరి దాఁటి రాము నఖిలక్రూరక్షయోద్దామునిన్.

టీక:- వనజాక్షున్ = పద్మాక్షుని, కృష్ణుని; బలిమిన్ = బలముతో; బలాఢ్యుడు = మిక్కిలి బలము కలవాడు; తృణావర్తుండు = తృణావర్తుడు; మున్ను = ఇంతకు ముందు; మింటి = ఆకాశమున; కిన్ = కు; కొనిపోన్ = తీసుకుపోవుటకు; చాలక = సమర్థుడుగాక; చిక్కినాడు = చిక్కుపోయాడు; ఇతనిన్ = ఇతడిని (కృష్ణుని); నా = నా; కున్ = కుకూడ; మోవన్ = మోయుట; రాదు = వల్లకాదు; అంచున్ = అని; ఆ = ఆ యొక్క; దనుజారిన్ = కృష్ణుని {దనుజారి - దనుజ (రాక్షసులకు) అరి (శత్రువు), విష్ణువు}; కొనిపోన్ = తీసుకుపోవలెనని; తలంపక = అనుకొనకుండా; వడిన్ = వేగముగా; దైత్య = రాక్షసుల; ఈశుడు = ప్రభువు; ఆ = ఆ యొక్క; ఆట = క్రీడ; లోన్ = అందు; కొనిపోయెన్ = తీసుకు వెళ్ళెను; గిరిన్ = ఎల్లను, కొండను; దాటి = దాటేసి; రామున్ = బలరాముని; అఖిల = సమస్తమైన; క్రూర = క్రూరులను; క్షయ = నశింపజేసెడి; ఉద్దామునిన్ = అధికుడిని.
భావము:- ఇంతకు పూర్వం మహా బలవంతుడైన తృణావర్తుడు అనే దైత్యుడు కృష్ణుణ్ణి గగనతలానికి ఎత్తుకుపోలేక, అతని చేతిలో చిక్కి హతమయ్యాడు. అందువల్ల అతణ్ణి భరించడం తనకు సాధ్యం కాదని ప్రలంబుడు రాక్షసాంతకుడైన శ్రీ కృష్ణుడిని పట్టుకుపోడానికి సంకల్పించ లేదు. క్రూరుల నందరినీ అంతరింప జేసే బలదేవుణ్ణి తన మూపున వహించి మోస్తూ, దింపవలసిన చోట దింపక ఎల్ల దాటి వడివడిగా పరిగెత్తిపోయాడు.

తెభా-10.1-733-వ.
ఇట్లు క్రీడాకల్పిత వాహనుం డయిన ప్రలంబుండు బలభద్రునిం గొనిపోవుచు.
టీక:- ఇట్లు = ఈ విధముగా; క్రీడా = ఆటలందు; కల్పిత = ఏర్పరచుకొన్న; వాహనుండు = మోసెడివాడు; అయిన = ఐన; ప్రలంబుడు = ప్రలంబుడు; బలభద్రునిన్ = బలరాముని; కొని = తీసుకొని; పోవుచున్ = వెళ్ళుచు.
భావము:- ఇలా ఆటలో మోసేవాడిగా వచ్చిన ప్రలంబుడు బలరాముడిని ఎత్తుకుపోతూ. . .

తెభా-10.1-734-మ.
గురుశైలేంద్ర సమాన భారుఁ డగు నా గోపాలకున్ మోవలే
యోద్రేకము మాని దైత్యుఁడు నరాకారంబు జాలించి భీ
దైత్యాకృతి నేగె హేమకటకాల్పంబుతో రాముతో
మురు వొప్పంగఁ దటిల్లతేందుయుత జీమూతంబు చందంబునన్.

టీక:- గురు = పెద్ద; శైల = పర్వతములలో; ఇంద్ర = శ్రేష్ఠ మైనదానితో; సమాన = సరితూగెడి; భారుండు = బరువు కలవాడు; అగున్ = ఐన; ఆ = ఆ యొక్క; గోపాలకున్ = గొల్లవానిని; మోవలేక = మోయలేనివాడై; రయోద్రేకమున్ = మిక్కిలి వడిగా పోవుట; మాని = వదలిపెట్టి; దైత్యుడు = రాక్షసుడు; నర = మానవుని; ఆకారంబున్ = స్వరూపమును; చాలించి = వదలిపెట్టి; భీకర = భయంకరమైన; దైత్య = రాక్షసుని; ఆకృతిన్ = స్వరూపముతో; ఏగెన్ = వెళ్ళెను; హేమ = బంగార; కటక = కడియముల యొక్క; ఆకల్పంబు = అలంకారము; తోన్ = తోటి; రాము = బలరాముని; తోన్ = తోటి; మురువు = గర్వము; ఒప్పంగ = మెరయునట్లుగా; తటిల్లత = మెరుపుతీగ; ఇందు = చంద్రుడితో; యుత = కూడిన; జీమూతంబు = మేఘము; చందంబునన్ = వలె.
భావము:- పెద్ద పర్వతరాజం అంత బరువు ఉన్న ఆ బలరాముణ్ణి మోయలేక, గమన వేగం తగ్గించాడు. ఆ రాక్షసుడు మానవ రూపం విడిచి తన అతి భీకరమైన అసురాకారం ధరించి గర్వము అతిశయించగా బలరాముడిని తీసుకు పోసాగాడు. తెల్లని బలరాముడిని అలా మోసుకుని వెడుతున్న నిశాచరుడు, మెరుపులతో మిలమిలలాడే చందమామను పొదివి యున్న కారుమబ్బులా ప్రకాశిస్తున్నాడు.

తెభా-10.1-735-ఉ.
మోము లేక వాని పెనుమూఁపుననుండుచు నా హలాయుధుం
డా మయంబునం గనియె హాటక రత్న కిరీట కుండలో
ద్భాసిత మస్తకున్ భ్రుకుటి భాసుర దారుణ నేత్రునుగ్ర దం
ష్ట్రాహితుం బ్రలంబు నురుశౌర్యవిలంబు మదావలంబునిన్.

టీక:- మోసము = వంచన, ప్రమాదము; లేక = లేకుండగ; వాని = అతని; పెను = పెద్ద; మూపునన్ = భుజముపై; ఉండుచున్ = ఉండి; ఆ = ఆ ప్రసిద్ధుడైన; హలాయుధుండు = బలరాముడు; ఆ = ఆ యొక్క; సమయంబునన్ = సమయము నందు; కనియెన్ = కనుగొనెను; హాటక = బంగారపు; రత్న = రత్నాల; కిరీట = కిరీటము; కుండల = చెవికుండలములతో; ఉత్ = మిక్కిలి; భాసిత = ప్రకాశించుచున్న; మస్తకున్ = శిరము కలవానిని; భ్రుకుటి = బొమముడిచేత; భాసుర = ప్రకాశించునట్టి; దారుణ = భయంకరమైన; నేత్రున్ = కన్నులు కలవానిని; ఉగ్ర = భయంకరమైన; దంష్ట్రా = దంతములు; సహితున్ = కలిగిన వానిని; ప్రలంబున్ = ప్రలంబుని; ఉరు = మిక్కిలి; శౌర్య = శూరత్వముచేత; విలంబున్ = అతిశయించిన వానిని; మద = మదమును; అవలంబునిన్ = అవలంభించిన వానిని.
భావము:- భుజాల మీద ఏమరుపాటు లేకుండా కూర్చుని ఉన్న బలరాముడు, ప్రలంబుణ్ణి గమనించి చూసాడు. సువర్ణఖచిత రత్నకిరీటంతోను చెవిపోగులతోనూ వాడి శిరస్సు మిక్కిలి ప్రకాశిస్తోంది. వాడి కన్నులు బొమముడితో పరమ దారుణం గాను, వాడి కోరలు మహ భయంకరం గానూ మెరుస్తున్నాయి. దొడ్డ శౌర్యానికి దుర్గర్వానికి అతడు ఆటపట్టుగా కనబడ్డాడు. దానితో. . .

తెభా-10.1-736-వ.
కని నక్తంచరుం డని యించుక శంకించి, వెఱవక.
టీక:- కని = చూసి; నక్తచరుండు = రాక్షసుడు {నక్తంచరుడు - నక్తము (రాత్రి) చరుడు (చరించువాడు), రాక్షసుడు}; అని = అని; ఇంచుక = కొద్దిగా; శంకించి = అనుమానించి; వెఱవకన్ = బెదిరిపోకుండా.
భావము:- బలరాముడు తనని మోస్తున్న వాడు రక్కసుడని కొంచెం సంశయించాడు. అయినా భయపడకుండా. . .

తెభా-10.1-737-క.
డువడిఁ దను దివికిం గొని
డిఁ జనియెడు దనుజు శిరము వ్రయ్య హలధరుం
రి పటుచటులతర మగు
పిడికిట వెస విసరి పొడిచె బిఱుసున నలుకన్.

టీక:- కడు = మిక్కిలి; వడిన్ = వేగముగా; తనున్ = అతను; దివి = ఆకాశమున; కిన్ = కు; కొని = తీసుకొని; వడిన్ = వేగముగా; చనియెడు = పోతున్న; దనుజుని = రాక్షసుని; శరమున్ = తల; వ్రయ్యన్ = బద్ద లగునట్లుగా; హలధరుండు = బలరాముడు {హల ధరుడు - హలము నాగలి అనెడి ఆయుధము ధరించువాడు, బలరాముడు}; అడరి = విజృంభించి; పటు = తీవ్రమైనది; చటులతరము = మిక్కిలి కఠినమైనది {చటులము - చటులతరము - చటులతమము}; అగు = ఐన; పిడికిటన్ = పిడికిలితో; వెసన్ = వడిగా; విసరి = విసిరి; పొడిచెన్ = కొట్టెను; బిఱుసునన్ = కఠినత్వముతోటి; అలుకన్ = కోపముతోటి.
భావము:- నాగలి ఆయుధంగా కల బలరాముడు విజృంభించి తన్ను వడివడిగా పట్టుకుపోతున్న ఆ దానవుడి తల వ్రక్కలయ్యేట్లు అత్యుగ్ర మైన తన పిడికిలి బిగించి పెఠీలు మని పొడిచాడు.

తెభా-10.1-738-క.
ధరు బలుపిడికిట హతిఁ
పగిలిన రుధిరజలము నువివరములం
దొలఁక మొఱయిడుచు దనుజుఁడు
రిపుపవి నిహత నగము గిదిం బడియెన్.

టీక:- హలధరున్ = బలరాముని; బలు = బలమైన; పిడికిట = పిడికిలి; హతిన్ = పోటుతో; తల = శిరస్సు; పగిలినన్ = బద్దలుకాగా; రుధిర = రక్తపు; జలము = ద్రవము; తనువివరములన్ = నవరంధ్రములనుండి {తను వివరములు - నేత్రములు రెండు, శోత్రములు రెండు, నాసారంధ్రములు రెండు, నోరు ఒకటి, మలమూత్ర విసర్జక రంధ్రములు రెండు, మొత్తం ఈ తొమ్మిది దేహము నందలి రంధ్రములు, నవరంధ్రములు}; ఒలకన్ = కారగా; మొఱ = మొఱ్ఱో యని అరుచుట; ఇడుచున్ = చేయుచు; దనుజుడు = రాక్షసుడు; బలరిపు = ఇంద్రుని {బలరిపుడు - బలాసురుని శత్రువు, ఇంద్రుడు}; పవి = వజ్రాయుధముచేత; నిహత = వేటు వేయబడిన; నగము = పర్వతము; పగిదిన్ = వలె; పడియెన్ = పడిపోయెను.
భావము:- బలరాముడి పిడికిటి పోట్లకు రాక్షసుడి తల పగిలి బ్రద్దలైంది. నెత్తురు నవరంధ్రాల నుండి పెల్లుబికి ప్రవహించింది. దేవేంద్రుడి వజ్రాయుధం వేటుకు కూలే పర్వతం లాగ వాడు మొఱ్ఱో అంటూ నేలకూలి ప్రాణాలు విడిచాడు.

తెభా-10.1-739-మత్త.
మేలుమేలుగదయ్య! రాముఁడు మేటిరక్కసు నొక్కఁడున్
నేలఁ గూలిచె నొక్క పోటున నేడు విస్మయ” మంచు గో
పాకుల్ గని చచ్చి వచ్చిన భ్రాతఁ గన్న విధంబునం
జా దీవన లిచ్చి రాముని త్కరించిరి వేడుకన్.

టీక:- మేలుమేలు = బాగుబాగు; కద = కదా; అయ్య = నాయనా; రాముడు = బలరాముడు; మేటి = గొప్ప; రక్కసున్ = రాక్షసుని; ఒక్కడున్ = ఒంటరిగా; నేలగూల్చెన్ = చంపెను; ఒక్క = ఒకేఒక్క; పోటునన్ = గుద్దుతో; నేడు = ఇవాళ; విస్మయము = ఆశ్చర్యకరము; అంచున్ = అనుచు; గోపాలకుల్ = గొల్లవాళ్ళు; కని = చూసి; చచ్చి = మరణించి; వచ్చిన = తిరిగిబతికిన; భ్రాతన్ = సోదరుని; కన్న = కనుగొనిన; విధంబునన్ = విధముగా; చాలన్ = మిక్కిలి; దీవనలు = ఆశీర్వచనములు; ఇచ్చి = ఇచ్చి; రాముని = బలరాముని; సత్కరించిరి = గౌరవించిరి; వేడుకన్ = సంతోషముతో.
భావము:- “బలే బలే! ఇవాళ మన బలరాముడు ఇంత పెద్ద రాక్షసుడినీ ఒక్క దెబ్బ తోటే నేల కూలగొట్టాడు. ఇది మహాద్భుతం” అంటూ గోపబాలకులు అందరూ బ్రతికి వచ్చిన సహోదరుణ్ణి చూసినంత మిక్కిలి సంతోషంతో పెక్కు దీవెనలిస్తూ ఆయనను గౌరవించారు.

తెభా-10.1-740-క.
వంతుఁ డగు ప్రలంబుఁడు
లుముష్టిన్ నిహతుఁడైన బ్రతికితి మనుచున్
సూదనాది దివిజులు
లుపైఁ గుసుమముల వానఁ రఁగించి రొగిన్.

టీక:- బలవంతుడు = మిక్కిలి బలము కలవాడు; అగు = ఐన; ప్రలంబుడు = ప్రలంబుడు; బలు = బలరాముని; ముష్టిన్ = పిడికిటిపోటుతో; నిహతుడు = చచ్చినవాడు; ఐన = అయిన; బ్రతికితిమి = ఆపదనుండి బైటపడితిమి; అనుచున్ = అనుచు; బలసూదన = ఇంద్రుడు {బలసూదనుడు - బలాసురుని సంహరించిన వాడు, ఇంద్రుడు}; ఆది = మున్నగు; దివిజులు = దేవతలు; బలు = బలరాముని; పైన్ = మీద; కుసుమముల = పూల; వాన = వర్షము; పరగించిరి = వ్యాపింపజేసిరి; ఒగిన్ = చక్కగా.
భావము:- బలాడ్యుడైన ప్రలంబుడు బలరాముడి పిడికిటిపోటుకి చచ్చేసరికి. బలాసురుని చంపిన ఇంద్రుడు సహితంగా దేవతలు అందరూ “అమ్మయ్య ఇక బ్రతికిపోయాం” అని ఊరట పొంది, ఒక్క పెట్టున బలరాముడి మీద పూలవాన కురిపించారు.