పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/నోటిలో విశ్వరూప ప్రదర్శన

తెభా-10.1-339-వ.
అని పలికి నెయ్యంబున నయ్యవ్వ నియ్యకొలిపి క్రీడామనుజ బాలకుం డైన యీశ్వరుండు తన నోరు దెఱచి ముఖంబుఁ జూపిన
టీక:- అని = అని; పలికి = చెప్పి; నెయ్యంబున్ = ఇంపుగా; ఆ = ప్రసిద్ధురాలైన; అవ్వన్ = తల్లిని; ఇయ్యకొలిపి = ఒప్పించి; క్రీడా = విలాసార్థము; మనుజ = మానవునిగా అవతరించిన; బాలకుండు = పిల్లవాడు; ఐన = అయినట్టి; ఈశ్వరుండు = భగవంతుడు; తన = తన యొక్క; నోరున్ = నోటిని; తెఱచి = తెరచి; ముఖంబున్ = ముఖమును; చూపినన్ = చూపించగా.
భావము:- అలా కృష్ణుడు తల్లిని మెత్తని మాటలతో శాంతింపజేసాడు. సర్వలోకాలకు ప్రభువైన ఆ లీలామానవ వేషధారి అయిన శైశవకృష్ణుడు తన నోరు తెరిచి తల్లి యశోదాదేవికి చూపించాడు.

తెభా-10.1-340-క.
లితాంగి కనుంగొనె
బాలుని ముఖమందు జలధి ర్వత వన భూ
గో శిఖి తరణి శశి ది
క్పాలాది కరండమైన బ్రహ్మాండంబున్.

టీక:- ఆ = ఆ; లలితాంగి = సుందరి {లలితాంగి - మృదువైన శరీరము కలామె, స్త్రీ}; కనుంగొనెన్ = చూచెను; బాలుని = పిల్లవాని యొక్క; ముఖము = మోము; అందున్ = అందు; జలధి = సముద్రములు {జలధి - నీటికి నిధి, కడలి}; పర్వత = పర్వతములు {పర్వతము - సంధులు కలది, కొండ}; వన = అడవులు; భూగోళ = భూమండలము; శిఖి = అగ్ని {శిఖి - సిగలు కలది, అగ్ని}; తరణి = సూర్యుడు {తరణి - అంధకారమును తరింపజేయువాడు, సూర్యుడు}; శశి = చంద్రుడు {శశి - కుందేలు గుర్తు ధరించినవాడు, చంద్రుడు}; దిక్పాల = అష్టదిక్పాలకులు {అష్టదిక్పాలకులు - 1తూర్పు ఇంద్రుడు 2ఆగ్నేయము అగ్ని 3దక్షిణము యముడు 4నైఋతి నిరృతి 5పడమర వరుణుడు 6వాయవ్యము వాయువు 7ఉత్తరము కుబేరుడు 8ఈశాన్యము శివుడు}; ఆది = మొదలగువానికి; కరండము = భరణి; ఐన = అయిన; బ్రహ్మాండంబున్ = విశ్వమంతా {బ్రహ్మాండము - ఒక పెద్ద గుడ్డు ఆకారమున ఉండు భూగోళ ఖగోళాది మొత్తము, విశ్వము}.
భావము:- యశోదామాత ఆ పసివాని నోటిలో సముద్రాలు, పర్వతాలు, అరణ్యాలు మొదలగు వాటితో భూగోళము; అగ్ని; సూర్యుడు; చంద్రుడు; అష్టదిక్పాలకులు 1తూర్పుకి ఇంద్రుడు, 2ఆగ్నేయానికి అగ్ని, 3దక్షిణానికి యముడు, 4నైఋతికి నిరృతి, 5పడమరకి వరుణుడు, 6వాయవ్యానికి వాయువు, 7ఉత్తరానికి కుబేరుడు, 8ఈశాన్యానికి శివుడు మొదలగు సమస్తముతో కూడి ఉన్న బ్రహ్మాండం మొత్తాన్ని చూసింది.

తెభా-10.1-341-వ.
కనుంగొని.
టీక:- కనుంగొని = చూసి.
భావము:- యశోద కొడుకు నోటిలో బ్రహ్మాండం చూసి.

తెభా-10.1-342-మ.
యో! వైష్ణవ మాయయో! యితర సంల్పార్థమో! సత్యమో!
లఁపన్ నేరక యున్నదాననొ! యశోదాదేవిఁ గానో! పర
స్థమో! బాలకుఁడెంత? యీతని ముఖస్థంబై యజాండంబు ప్ర
జ్వమై యుండుట కేమి హేతువొ! మహాశ్చర్యంబు చింతింపఁగన్

టీక:- కలయో = స్వప్నమా; వైష్ణవ = విష్ణుమూర్తి యొక్క; మాయయో = మాయా; ఇతరసంకల్పార్థమో = అసత్యమా, చిత్తభ్రమా {ఇతర సంకల్పార్థము - సరికాని ఆలోచనలవలన కలిగినది, అసత్యము, చిత్తభ్రమ}; సత్యమో = వాస్తవమా; తలపన్ = విచారించ; నేరక = లేక; ఉన్నదాననొ = ఉన్నానేమో; యశోదాదేవిన్ = నేనసలు యశోదాదేవిని; కానో = కాదేమో; పర = ఇతరమైన; స్థలమో = ప్రదేశమేమో (ఇది); బాలకుడు = పిల్లవాడు; ఎంత = ఎంతటివాడు; ఈతని = అతని యొక్క; ముఖస్థంబు = ముఖమునం దున్నది; ఐ = అయిన; అజాండంబు = విశ్వము; ప్రజ్వలము = మిక్కిలి, అధికముగా ప్రకాశిస్తున్నది; ఐ = అయ్యి; ఉండుట = ఉండుట; కున్ = కు; ఏమి = ఏమి; హేతువో = కారణమో; మహా = గొప్ప; ఆశ్చర్యంబు = వింత; చింతింపగన్ = విచారించగా.
భావము:- కొడుకు నోటిలో బ్రహ్మాండం చూసి విభ్రాంతురాలైన యశోద ఇలా అనుకోసాగింది
“నేను కలగనటం లేదు కదా? లేకపోతే ఇదంతా విష్ణుమాయేమో? ఇదంతా నా చిత్తభ్రమా? కాకపోతే ఇదే సత్యమా? ఒకవేళ నా బుద్ధి సరిగా పనిచేయటం లేదా? అసలు నేను యశోదను అవునా కాదా? ఇది అసలు మా ఇల్లేనా మరొటా? ఈ పిల్లాడు ఎంత, వీడి నోటిలో బ్రహ్మాండం అంతా వెలుగులు చిమ్ముతూ ఉండటం ఏమిటి? ఇలా ఎలా సాధ్యం? ఆలోచించేకొద్దీ ఇదంతా మహా ఆశ్చర్యంగా ఉంది.

తెభా-10.1-343-ఆ.
బామాతృఁడగు సలీలుని ముఖమందు
విశ్వ మెల్ల నెట్లు వెలసి యుండు
బాలు భంగి నితఁడు భాసిల్లుఁ గాని స
ర్వాత్ముఁ డాది విష్ణుఁ గుట నిజము.”

టీక:- బాల = సామాన్య బాలునికి; మాతృడు = సమానమైనవాడు; అగు = ఐన; సలీలుని = లీలతో కూడి ఉన్నవాని; ముఖము = ముఖము; అందున్ = లో; విశ్వము = భువనభాండము; ఎల్లన్ = అంతా; ఎట్లు = ఏ విధముగ; వెలసి = విలసిల్లి; ఉండున్ = ఉండగలదు; బాలున్ = పిల్లవాని; భంగిన్ = వలె; ఇతడు = ఇతను; భాసిల్లున్ = ప్రకాశించును; కాని = కాని; సర్వాత్ముడు = నారాయణుడు {సర్వాత్ముడు - సర్వమునందు (ఆత్మగా) నుండెడి వాడు, విష్ణువు}; ఆదివిష్ణుడు = నారాయణుడు {ఆదివిష్ణుడు - మూలాధారమైన సర్వవ్యాపకుడు, విష్ణువు}; అగుటన్ = ఐ ఉండుట; నిజము = తథ్యము.
భావము:- యశోద కొడుకు నోటిలో బ్రహ్మాండం చూసిన విభ్రాంతిలో ఇంకా ఇలా అనుకుంటోంది.
ఇంత చిన్న పిల్లవాడి నోటిలో, ఈ బ్రహ్మాండం అంతా ఎలా ఇమిడిపోయింది పసివాడిలాగ కనిపిస్తున్నాడు కాని ఇతడు నిజానికి సర్వమునందు ఆత్మరూపంలో ఉండే సర్వాత్మకుడు, ఆదిమూలాధారమైన సర్వవ్యాపకుడు అయిన శ్రీమహావిష్ణువే. ఇదే ముమ్మాటికీ నిజం.”

తెభా-10.1-344-వ.
అని నిశ్చయించి.
టీక:- అని = అని; నిశ్చయించి = నిర్ణయించుకొని.
భావము:- ఇలా యశోదాదేవి ఈ కృష్ణబాలుడు సాక్షాత్తు ఆ మహావిష్ణువే అని నిశ్చయించుకొని .

తెభా-10.1-345-ఆ.
మహాత్మువలన నీ విశ్వరూపంబు
గానఁబడిన బుద్ధి కంప మయ్యె
నా మహాత్ము విష్ణు ఖిలలోకాధారు
నార్తులెల్లఁ బాయ నాశ్రయింతు.

టీక:- ఏ = ఏ; మహాత్మున్ = గొప్పవాని; వలనన్ = వలన; ఈ = ఈ; విశ్వ = భువనభాండము యొక్క; రూపంబున్ = స్వరూపము; కానబడినన్ = కనబడుటచేత; బుద్ధి = మనసు; కంపము = చలించినది; అయ్యెన్ = అయినది; ఆ = అట్టి; మహాత్మున్ = గొప్పవానిని; విష్ణున్ = నారాయణుని; అఖిల = సమస్తమైన; లోక = భువనములకు; ఆధారున్ = ఆధారభూతుని; ఆర్తులు = పీడలు, దుఃఖములు; ఎల్లన్ = అన్నిటిని; పాయన్ = తొలగించుకొనుటకు; ఆశ్రయింతు = కొలచెదను.
భావము:- ఇలా ఈ నోటిలో విశ్వదర్శనం ఇచ్చిన కృష్ణబాలుడు సాక్షాత్తు ఆ మహావిష్ణువే అని నిశ్చయించుకొనిన యశోదాదేవి ఇలా స్తోత్రం చేస్తోంది. .
“విష్ణుమూర్తి అన్ని లోకాలకు ఆధారంగా నిలబడినవాడు. ఈ బ్రహ్మాండం అంతటా వ్యాపించి ఉన్న ఆ మహాత్ముడైన విష్ణువు వల్లనే నాకు ఈ విశ్వరూపం కనబడింది. నా బుద్ధి చలించిపోయింది. నా దుఃఖాలన్నీ పోవడానికి ఆ మహా విష్ణువునే శరణు కోరుతాను.

తెభా-10.1-346-క.
నా గడు నేను గోవులు
నీ మందయు గోపజనులు ని బ్బాలుని నె
మ్మోమున నున్న విధముఁ గని
యేఱితిమి గాక యీశుఁ డీతఁడు మాకున్".

టీక:- నా = నా యొక్క; మగడు = భర్త; నేనున్ = నేను; గోవులున్ = పశువులు; ఈ = ఈ; మందయున్ = పల్లె; గోపజనులును = యాదవులు; ఈ = ఈ; బాలుని = పిల్లవాని; నెఱ = నిండైన; మోమునన్ = ముఖము నందు; ఉన్న = ఉన్న; విధమున్ = విధానమును; కని = చూసి; ఏమఱితిమి = భ్రమ పడితిమి; కాక = తప్పించి; ఈశుడు = భగవంతుడు; ఇతడున్ = ఇతను; మా = మా అందరి; కున్ = కి.
భావము:- “ఈ బాలకుని నిండు ముఖము నందు నేను, నా భర్త, గోవులు, గోపగోపికా జనులు, ఈ వ్రేపల్లెలో ఉన్న మేమందరము ఉన్నతీరు కనుగొని ఏమరుపాటు చెందాము(ను) తప్పించి, ఇతడు సాక్షాత్తు మా కందరికీ ప్రభువైన ఈశ్వరుడు”
అని యశోదాదేవి భావించసాగింది.

తెభా-10.1-347-వ.
అని తన్ను పరమేశ్వరుండని తలంచుచున్న యశోద యందు నా కృష్ణుండు వైష్ణవమాయం బొందించిన.
టీక:- అని = అని; తన్ను = అతనిని; పరమేశ్వరుండు = భగవంతుడు; అని = అని; తలంచుచున్ = ఎంచుచున్నట్టి; యశోదన్ = యశోద; అందున్ = ఎడల; ఆ = ఆ; కృష్ణుండు = కృష్ణుడు; వైష్ణవ = విష్ణుమూర్తి యొక్క; మాయన్ = మహిమను; పొందించినన్ = కలిగించగా.
భావము:- బాలకృష్ణుడు ఇలా తనను భగవంతుడైన శ్రీమహావిష్ణువుగా భావిస్తూ ఉన్న యశోదకు మళ్ళీ వైష్ణవమాయను ఆవరింపజేశాడు

తెభా-10.1-348-క.
నుపడి యెఱుక చెడి యా
తుక సర్వాత్ముఁ డనుచుఁ లుకక యతనిం
గొడుకని తొడపై నిడుకొని
డు వేడుకతోడ మమతఁ గావించె నృపా!”

టీక:- జడనుపడి = మూఢత్వములో పడిపోయి; ఎఱుక = జ్ఞానము; చెడి = పోయి; ఆ = ఆ; పడతుక = పడతి; సర్వాత్ముడు = విష్ణుమూర్తి; అనుచున్ = అనుచు; పలుకక = అనకుండా; అతనిన్ = అతనిని; కొడుకు = పుత్రుడు; అని = అని; తొడ = ఒడి; పైన్ = మీద; ఇడుకొని = పెట్టుకొని; కడు = మిక్కిలి, అధికమైన; వేడుక = కుతూహలము; తోడన్ = తోటి; మమతన్ = ప్రీతి; కావించెన్ = చేసెను; నృపా = రాజా.
భావము:- పరీక్షిన్మహారాజా! ఆ మాయా ప్రభావంవలన యశోద మోహం చెంది, బాలకృష్ణుడు సర్వాత్ముడే అనే విషయం మరచిపోయింది. అతడు తన కొడుకే అనుకుంటూ ఒడిలో కూర్చోబెట్టుకొని చక్కగా ముద్దులాడింది”