పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/గోపికల యెడ ప్రసన్ను డగుట

తెభా-10.1-845-క.
బాలకు హస్తకీలిత
ఫాలకు నితాంతశీత వనాగమ నా
లోలకు నంబరములు కృ
పాలుఁడు హరి యిచ్చె భక్తపాలకు డగుటన్.

టీక:- బాలల = బాలికల; కున్ = కు; హస్త = చేతులు; కీలిత = కూర్చబడిన; ఫాలల్ = నుదురు కలవారల; కున్ = కు; నితాంత = అధికమైన; శీత = చలి; పవన = గాలుల; ఆగమన = రాకచేత, వీచుటచేత; ఆలోలల్ = వణుకుతున్నవారల; కున్ = కు; అంబరములున్ = వస్త్రములను; కృపాలుడు = కృష్ణుడు {కృపాలుడు - అనుగ్రహించు స్వభావము కలవాడు, కృష్ణుడు}; హరి = కృష్ణుడు; ఇచ్చెన్ = ఇచ్చివేసెను; భక్త = భక్తులను; పాలకుడు = ఏలువాడు; అగుటన్ = అగుటచేత.
భావము:- శ్రీ కృష్ణుడు దయామయుడు. భక్తజన పరిపాలకుడు. అందుకనే మిక్కుటమైన చలిగాలికి వణుకుతున్న వారూ నెన్నొసట చేతులు ఉంచి మ్రొక్కుతున్నవారూ అయిన ఆ చెలువలకు వలువలు ఇచ్చేసాడు.

తెభా-10.1-846-ఆ.
చీర లపహరించి సిగ్గులు విడిపించి
రిహసించి యైనఁ రఁగ మనకు
నుఁడు నోము కొఱఁతగాకుండ మ్రొక్కించె
నుచు హరి నుతించి బలలెల్ల

టీక:- చీరలు = వస్త్రములను; అపహరించి = దొంగిలించి; సిగ్గులు = లజ్జలు; విడిపించి = తొలగించి; పరిహసించి = ఎగతాళిచేసి; ఐనన్ = అయినను; పరగన్ = ప్రసిద్ధముగా; మన = వారల; కున్ = కు; ఘనుడు = గొప్పవాడు; నోము = వ్రతమునకు; కొఱత = లోటు; కాకుండ = జరుగకుండ; మ్రొక్కించెన్ = నమస్కరింపజేసెను; అనుచు = అనుచు; హరి = కృష్ణుని; నుతించిరి = స్తోత్రముచేసిరి; అబలలు = స్త్రీలు; ఎల్లన్ = అందరును.
భావము:- “చీరలు దొంగిలించినా, సిగ్గులు దీసినా ఎగతాళి చేసినా చివరకు వ్రతలోపం జరగకుండా మన మ్రొక్కులు అందుకున్నాడు” అంటూ ఆ సుందరులు అందరూ కృష్ణుడిని సంతోషంగా అభినందించారు.

తెభా-10.1-847-క.
ల్లములు నొవ్వ నాడిఁనఁ
ల్లలు చేసినను నగినఁ లఁచిన నైనన్
ల్లభులు చేయు కృత్యము
ల్లభలకు నెగ్గుగాదు; ల్లభ మధిపా!

టీక:- ఉల్లములు = మనసులు; నొవ్వన్ = నొచ్చుకొనునట్లు; ఆడినన్ = పలికినను; కల్లలు = మోసములు; చేసినను = చేసప్పటికి; నగినన్ = పరిహాసములు చేసినను; కలచిననైన్ = కలవరపెట్టినను; వల్లభులు = ప్రియులు; చేయు = చేసెడి; కృత్యములున్ = పనులు; వల్లభల్ = ప్రియురాండ్ర; కున్ = కు; ఎగ్గు = అనాదరముగా; కాదు = తోచదు; వల్లభము = ఇష్టమైనవి; అధిపా = రాజా.
భావము:- ఓ రాజా! మనసులు నొచ్చేలా మాటలాడి నప్పటికి, మోసగించి నప్పటికి, అపహసించి నప్పటికి, కలత కలిగించి నప్పటికి ప్రియులు చేసే పనులు ప్రియురాండ్రకు బాధాకరం కాదు పైగా అది ఎంతో ప్రియంగానే ఉంటాయి.

తెభా-10.1-848-వ.
ఇట్లు హరి వలువ లిచ్చినం గట్టుకొని సతు లతని యందు బద్ధానురాగులై యుచ్చరింపక ఱెప్పలిడక తప్పక చూడ నా ప్రోడ యెఱింగి చేరి వారి కిట్లనియె.
టీక:- ఇట్లు = ఈ విధముగా; హరి = కృష్ణుడు; వలువలు = వస్త్రములను; ఇచ్చినన్ = ఇవ్వగా; కట్టుకొని = ధరించి; సతులు = ఇంతులు; అతని = అతని; అందున్ = ఎడల; బద్ధ = మిక్కిలి, బంధించిన; అనురాగులు = అనురాగము కలవారు; ఐ = అయ్యి; ఉచ్చరింపక = మారుపలుకక; ఱెప్పలు = కనురెప్పలు; ఇడకన్ = మూయక; తప్పకన్ = విడువకుండ; చూడన్ = చూచుచుండగా; ఆ = ఆ; ప్రోడ = వివేకి; ఎఱింగి = తెలుసుకొని; చేరి = కలిసి; వారి = వారల; కిన్ = కు; ఇట్లు = ఈ విధముగా; అనియె = పలికెను.
భావము:- ఈ విధంగా నారాయణుడు ఇచ్చిన చీరలు ఆ నారీమణులు ధరించారు. అతని పట్ల అచంచలమైన ప్రణయం కలవారు అయినప్పటికిని, కనురెప్పలు మూయక చలింపక, అలాగే నవనీతచోరుణ్ణి అవలోకిస్తూ నిలపడ్డారు. చతురుడైన స్వామి వారి చెంతకు చేరి ఇలా అన్నాడు.

తెభా-10.1-849-సీ.
క్షణవతులార! జ్జించి చెప్పరు-
గాని మీ మర్మముల్ గానఁబడియె;
నుఁ గొల్వఁ జింతించినారు నాచేతను-
త్యంబు మీ నోము ఫల మగును;
గామితార్థంబులు లిమిఁ జెప్పఁగ నేల?-
నుఁ గొల్వ ముక్తికి డవవచ్చుఁ;
డమ కూడఁగ నంబికాదేవి నోమంగ-
టమీఁద రాత్రుల యందు మీకు

తెభా-10.1-849.1-ఆ.
న్నుఁ బొందఁ గల్గు మ్మి పొం"డని హరి
ల్క నింతు లెల్ల భ్రాంతిఁ జనిరి
పము పండె ననుచుఁ త్పదాంభోజముల్
మానసించికొనుచు మందకడకు.

టీక:- లక్షణవతులారా = ఓ ప్రమదలు {లక్షణవతులు - శుభలక్షణములు కల స్త్రీలు}; లజ్జించి = సిగ్గుపడి; చెప్పరు = చెప్పుటలేదు; కాని = తప్పించి; మీ = మీ యొక్క; మర్మముల్ = రహస్యములు; కానబడియెన్ = తెలియవచ్చెను; ననున్ = నన్ను; కొల్వన్ = సేవించుటకు; చింతించినారు = యోచించితిరి; నా = నా; చేతను = వలన; సత్యంబు = ఇది నిక్కము; మీ = మీ యొక్క; నోము = వ్రతము; సఫలము = ఫలప్రదము; అగును = అగును; కామిత = కోరిన; అర్థంబులు = ప్రయోజనములు; కలిమిన్ = సిద్ధించుటలను; చెప్పగన్ = చెప్పుట; ఏల = ఎందుకు; ననున్ = నన్ను; కొల్వన్ = సేవించుటచేత; ముక్తి = మోక్షమున; కున్ = కు; నడవవచ్చున్ = పోగలరు; కడమన్ = చివరకు; కూడగన్ = కలియుటకు; అంబికాదేవిన్ = అంబికాదేవిని; నోమంగన్ = పూజించినచో; అటమీద = ఆ తరువాత; రాత్రులన్ = రాత్రులు; అందున్ = సమయమునందు; మీ = మీ అందర; కున్ = కు.
నన్నున్ = నన్ను; పొందగల్గు = పొందుట లభించును; నమ్మి = నమ్మకముంచి; పొండు = వెళ్ళండి; అని = అని; హరి = కృష్ణుడు; పల్కన్ = చెప్పగా; ఇంతులు = పడతులు; ఎల్లన్ = అందరును; భ్రాంతిన్ = భ్రమతో; చనిరి = వెళ్ళిరి; తపమున్ = తపస్సు (తమ); పండెన్ = ఫలించినది; అనుచున్ = అనుచు; తత్ = అతని; పద = పాదములు అనెడి; అబ్జములున్ = పద్మములను; మానసించుకొనుచున్ = స్మరించుకొనుచు; మంద = గోకులమున; కున్ = కు.
భావము:- “ఓ శుభలక్షణవతులైన సుందరీమణులారా! బిడియపడి చెప్పటంలేదు కాని, మీ హృదయ రహస్యం నాకు తెలిసిపోయింది. మీరు నన్ను పతిగా పొందడం కోసం వ్రతం చేపట్టారు. నా వలన మీ నోము పండుతుంది. నన్ను సేవిస్తే కైవల్యమే కరతలామలకం అవుతుంది. కోరిన కోరికలు ఈడేరుతాయి. అని వేరుగా చెప్పడం ఎందుకు? ఇందుకు తోడుగా మీరు గౌరీవ్రతం పరిసమాప్తి చేస్తే రాత్రులందు నాతో కలయిక మీకు లభిస్తుంది. నా మాటలు నమ్మి, మీరు ఇండ్లకు వెళ్ళిపొండి.” అని కృష్ణుడు పలికాడు. గోపికలు తపస్సు ఫలించిందని హరి పాదపద్మాలు మదిలో తలచుకుంటూ ఆనందంగా వ్రేపల్లెవాడకు వెళ్ళిపోయారు.

తెభా-10.1-850-వ.
ఇట్లు గోపకన్యక లందుఁ బ్రసన్నుండయి గోవిందుండు బృందావనంబు దాఁటి దూరంబున ధేనువుల మేపుచుండఁ; జండకిరణుని యెండంబడి దండిచెడి తరుల దండ నండగొనుచు నాతపత్రాకారంబులయి నీడలు చేయుచున్న వృక్షంబుల నీక్షించి కృష్ణ బలరామ శ్రీదామ దేవప్రస్థ విశాలార్జున ప్రముఖులకుం దక్కిన గోపకు లిట్లనిరి.
టీక:- ఇట్లు = ఈ విధముగా; గోప = గోపికా; కన్యకలు = యువతులు {కన్యక - అవివాహిత స్త్రీలు}; అందున్ = ఎడల; ప్రసన్నుండు = అనుగ్రహించినవాడు; అయి = ఐ; గోవిందుండు = కృష్ణుడు {గోవిందుడు - గోవులకు ఒడయుడు, కృష్ణుడు}; బృందావనంబున్ = బృందావనము; దాటి = గడచి; దూరంబునన్ = దూరప్రాంతమున; ధేనువులన్ = ఆవులను; మేపుచుండన్ = కాచుచుండగా; చండకిరణుని = సూర్యుని {చండకిరణుడు - తీవ్రమైన కిరణములు కలవాడు, సూర్యుడు}; ఎండన్ = ఎండకు; పడి = గురియై; దండిచెడి = శక్తిక్షీణించి, నీరసించి; తరుల = చెట్లనీడలను; దండన్ = వద్ద; అండగొనుచున్ = ఆశ్రయముపొందుతు; ఆతపత్ర = గొడుగుల; ఆకారంబులన్ = వలె రూపుగొనినవి; అయి = ఐ; నీడలున్ = ఛాయలను; చేయుచున్న = ఏర్పరచుచున్నట్టి; వృక్షంబులన్ = చెట్లను; ఈక్షించి = చూసి; కృష్ణు = కృష్ణుడు; బలరామ = బలరాముడు; శ్రీదామ = శ్రీదాముడు; దేవప్రస్థ = దేవప్రస్థుడు; విశాల = విశాలుడు; అర్జున = అర్జునుడు; ప్రముఖుల్ = మొదలగువారి; కున్ = కి; తక్కిని = మిగతా; గోపకులు = గోపాలకులు; ఇట్లు = ఈ విధముగా; అనిరి = పలికిరి.
భావము:- ఇలా గోవిందుడు గోపకన్యలను అనుగ్రహించి బృందావనం దాటి దూరంలో గోవులను మేపుతున్నాడు. అది మంచి వేసవికాలం. భానుని తాపం భరించలేక గోపకులు బడలిపోయారు. చెట్లనీడలను ఆశ్రయిస్తున్నారు. గొడుగులవలె నీడనిస్తున్న ఆ చెట్లను చూసి శ్రీ కృష్ణుడు బలరాముడు, శ్రీరాముడు దేవప్రస్థుడు విశాలుడు అర్జునుడు మొదలైన వారితో తక్కిన గోపాలబాలకులు ఇలా అన్నారు.

తెభా-10.1-851-మ.
"కారంబులు చేయ వెవ్వరికి నేకాంతంబు లం దుండు నా
శీతానిల వర్ష వారకములై త్వగ్గంధ నిర్యాస భ
స్మ లాశాగ్ర మరంద మూల కుసుమచ్ఛాయా ఫలశ్రేణిచే
నుకారంబులు చేయు నర్థులకు నీ యుర్వీజముల్ గంటిరే. "

టీక:- అపకారంబులున్ = కీడులను; చేయవు = కలిగించవు; ఎవ్వరి = ఎవరి; కిన్ = కిని; ఏకాంతంబులన్ = నిర్మానుష్య ప్రదేశముల; అందున్ = లో; ఉండున్ = ఉండును; ఆతప = ఎండను; శీత = చలి; అనిల = గాలిని; వర్ష = వానలను; వారకములు = నివారించునవి; ఐ = అయ్యి; త్వక్ = బెరడు, పైపట్ట; గంధ = సుగంధ ద్రవ్యములు; నిర్యాస = జిగురులు; భస్మ = బూడిద; పలాశ = ఆకులు; అగ్ర = చిగుళ్ళు; మరంద = తేనెలు; మూల = దుంపలు; కుసుమ = పూలు; ఛాయ = నీడ; ఫల = పండ్లు; శ్రేణి = పంక్తుల, సమూహముల; చేన్ = చేత; ఉపకారంబులున్ = మేలులను; చేయున్ = చేయును; అర్థులు = కోరినవారల; కున్ = కు; ఈ = ఈ యొక్క; ఉర్వీజములు = చెట్లు {ఉర్వీజము - ఉర్వి (భూమి యందు) జములు (పుట్టునవి), వృక్షములు}; కంటిరే = చూసితురా.
భావము:- “ఈ చెట్లు చూడండి. ఎవరికీ కీడు చేయవు, ఎవరి జోలికి పోకుండా ఏకాంతంగా ఉంటాయి. ఎండ, వాన, గాలి, మంచుల బారి నుండి ఆశ్రితులను కాపాడతాయి. ఆర్ధి జనులకు తమ పట్టలు, గంధము, జిగురు, బూడిద, చివురుటాకులు, తేనె, పళ్ళు, వేళ్ళు, పూలు, నీడ ఇచ్చి మేలు చేస్తాయి.”

తెభా-10.1-852-వ.
అని చిగురాకు పువ్వు కాయ పండు తండంబుల వ్రేఁగున వీఁగిన తరువుల నడిమి తెరువునం బసుల దాఁటుల దాఁటించి, యమునకుం జని, వెడఁదమడుఁగుల మెల్లనఁ జల్లని నీరుఁ ద్రావించి, తత్సమీపంబున మేపుచు, వల్లవు లెల్ల మూఁకలుగొని, యాఁకలి గొంటిమని విన్నవించినఁ దనకు భక్తురాండ్రగు విప్రభార్యలవలనం బ్రసన్నుం డయి వారలం జూచి రామసహితుం డయిన హరి యిట్లనియె.
టీక:- అని = అని; చిగురు = చిగుళ్ళు; ఆకు = ఆకులు; పువ్వు = పూలు; కాయ = కాయలు; పండు = పండ్లు; తండంబుల = పెద్దసమూహముల; వ్రేగునన్ = బరువునకు; వీగిన = వంగిపోయిన; తరువుల = చెట్ల; నడిమి = మధ్య; తెరువునన్ = దార్లమ్మట; పసుల = పశువుల; దాటులన్ = సమూహములను; దాటించి = గడచి; యమున = యమునానది; కున్ = కు; చని = వెళ్ళి; వెడద = విశాలమైన; మడుగులన్ = చెరువులందు; మెల్లనన్ = మెల్లిగా; చల్లని = చల్లటి; నీరున్ = నీటిని; త్రావించి = తాగించి; తత్ = ఆ; సమీపంబునన్ = దగ్గరలో; మేపుచున్ = మేపుతు; వల్లవులు = గొల్లవారు; ఎల్లన్ = అందరును; మూకలుగొని = గుంపులుకట్టి; ఆకలిగొంటిమి = ఆకలి వేయుచున్నది; అని = అని; విన్నవించినన్ = మనవిచేయగా; తన = అతని; కున్ = ఎడల; భక్తురాండ్రు = భక్తి కలిగిన స్త్రీలు; విప్ర = బ్రాహ్మణ; భార్యల = సతుల; వలనన్ = ఎడల; ప్రసన్నుండు = అనుగ్రహము కలవాడు; ఐ = అయ్యి; వారలన్ = వారిని; చూచి = చూసి; రామ = బలరామునితో; సహితుండు = కూడినవాడు; అయిన = ఐన; హరి = కృష్ణుడు; ఇట్లు = ఈ విధముగా; అనియె = పలికెను.
భావము:- ఇలా అంటూ చివురుటాకులు పువ్వులు కాయలు పండ్లు మున్నగు వాటి బరువుతో వంగిన చెట్ల సందుల నడిమి బాటలో, పశువుల మందలను తోలుకుని గోపబాలకులు యమునానదికి వెళ్ళారు. అక్కడ పెద్ద మడుగులలో నెమ్మదిగా పశువులను చల్లనినీరు త్రాగించి ఆ సమీపంలో వాటిని మేపుతూ వారు “ఆకలి వేస్తోంది” అని కన్నయ్యకు విన్నవించుకొన్నారు. బలరామ సహితు డైన శ్రీహరి తన భక్తురాండ్రగు బ్రాహ్మణ పత్నులను అనుగ్రహింప దలచి, యాదవ బాలకులతో ఇలా చెప్పాడు.

తెభా-10.1-853-సీ.
"ల్లవులార! యీ నమున విప్రులు-
బ్రహ్మవాదులు దేవవనమునకు
రుగుట కాంగిరసాహ్వయ సత్రంబు-
లుపుచునున్నారు నుఁడు మీరు
మా నామములు చెప్పి మైత్రితో నడిగిన-
న్నంబుఁ బెట్టెద"నుచుఁ బలుక
వారలు చని విప్రరుల కెల్లను మ్రొక్కి-
  "సుల మేపుచు బలద్ర కృష్ణు

తెభా-10.1-853.1-తే.
లసి పుత్తెంచి రిట మమ్ము న్న మడుగ
ర్మవిదులార! యర్థిప్రదాతలార!
పెట్టు డన్నంబు; శ్రాంతులఁ బిలిచి తెచ్చి
పెట్టుదురు గాదె మిముబోఁటి పెద్ద లెల్ల.

టీక:- వల్లవులారా = ఓ గోపకులు; ఈ = ఈ యొక్క; వనమునన్ = అడవి యందు; విప్రులు = బ్రాహ్మణులు; బ్రహ్మవాదులు = వేదమార్గులు; దేవభవనమున్ = స్వర్గమున; కున్ = కు; అరుగుట = వెళ్ళుట; కున్ = కై; అంగిరస = అంగిరసము అనెడి; ఆహ్వయ = పేరు కలిగిన; సత్రంబున్ = యాగమును; సలుపుచున్నారు = చేయుచున్నారు; చనుడు = వెళ్ళండి; మీరు = మీరు; మా = మా యొక్క; నామములు = గోత్రనామములను; చెప్పి = తెలియజెప్పి; మైత్రి = స్నేహభావము; తోన్ = తోటి; అడిగినన్ = అడిగినచో; అన్నంబున్ = ఆహారమును, తిండిని; పెట్టెదరు = ఇచ్చెదరు; అనుచున్ = అని; పలుక = చెప్పగా; వారలు = వారు; చని = వెళ్ళి; విప్రవరుల్ = బ్రాహ్మణుల; కున్ = కు; ఎల్లన్ = అఁదరకు; మ్రొక్కి = నమస్కరించి; పసులన్ = పశువులను; మేపుచున్ = మేపుతు; బలభద్ర = బలరాముడు; కృష్ణులు = కృష్ణుడులు; అలసి = అలిసిపోయి.
పుత్తెంచిరి = పంపిరి; ఇట = ఇప్పుడు; మమ్మున్ = మమ్ములను; అన్నము = ఆహారము; అడుగన్ = అడుగుటకై; ధర్మవిదులారా = ఓ ధర్మముతెలిసినవారు; అర్థిప్రదాతలార = ఓ కోరినవారికిచ్చువారు; పెట్టుడు = ఇవ్వండి; అన్నంబున్ = ఆహారమును; శ్రాంతులన్ = అలసిపోయినవారిని; పిలిచి = పిలిచి; తెచ్చి = తీసుకు వచ్చి; పెట్టుదురుగాదె = తినుటకు ఇచ్చువారుకదా; మిము = మీ; బోటి = వంటి; పెద్దలు = గొప్పవారు; ఎల్లన్ = అందరు.
భావము:- “ఓ గోపాలబాలకులారా! ఈ వనంలో విప్రులు ఉన్నారు. వారు వేదవేత్తలు. స్వర్గానికి వెళ్ళడం కోసం “అంగిరసం” అనే యాగం చేస్తున్నారు, మీరు వారి వద్దకు వెళ్ళండి. నా పేరూ, మా అన్నగారి పేరు చెప్పి అనురాగ పూర్వకంగా వారిని అడగండి. మీకు అన్నం పెడతారు.” అలా శ్రీకృష్ణుడు చెప్పగా గొల్లపిల్లలు ఆ బ్రాహ్మణోత్తముల దగ్గరికి వెళ్ళి నమస్కరించారు. “ఓ ధర్మవేత్తలారా! ఆర్ధిజనులకు అడిగినవి ఇచ్చే మహనీయులారా! బలరామకృష్ణులు పశువులను మేపుతూ బడలిక చెందారు. దయచేసి అన్నం పెట్టండి. మీ వంటి పెద్దలు అకలిగొన్నవారిని పిలిచి పెడతారు.

తెభా-10.1-854-క.
దీక్షితునకు నైనం
నుఁ గుడువఁగఁ; బశువధంబు సౌత్రామణియుం
నిన వెనుక దోషము లే
ఘాత్మకులార! పెట్టు న్నము మాకున్. "

టీక:- ఘన = గొప్పవారైన; దీక్షితున్ = దీక్షితుని, దీక్షవహించినవాని {దీక్షితుడు - సోమముగల యజ్ఞమునందు దీక్ష వహించువాడు}; కున్ = కి; ఐనన్ = అయినను; చనున్ = తగును; కుడువంగన్ = భుజించుట; పశు = యాగపశువు; వధంబున్ = బలిచ్చుట; సౌత్రామణియున్ = ఇంద్రహోమము {సౌత్రామణి - సుత్రాముడైన ఇంద్రుని సంబంధమైన హోమము}; చనిన = అయిన; వెనుక = పిమ్మట; దోషము = తప్పు; లేదు = లేదు; అనఘాత్ములారా = ఓ పుణ్యాత్ములు {అనఘాత్ములు -అఘము (పాపము) లేని మనసు గల వారు, పుణ్యాత్ములు}; పెట్టుడు = పెట్టండి, ఇవ్వండి; అన్నము = ఆహారము; మా = మా; కున్ = కు.
భావము:- యాగం నడుస్తూ ఉండగా పశువధము, సౌత్రామణి కార్యక్రమములు జరిగిన పిమ్మట దీక్షలో ఉన్న గొప్పవాడు సైతము అన్నము తిన వచ్చును. ఇందు దోషములేదు కదా! మహానుభావులారా! యాగం నడుస్తోంది ఆగండి అనకుండా, మాకు అన్నము పెట్టండి.

తెభా-10.1-855-వ.
అని గోపకులు పలికిన.
టీక:- అని = అని; గోపకులు = యాదవులు; పలికినన్ = అడుగగా.
భావము:- అని గోపాలురు అనగా.

తెభా-10.1-856-మ.
క్రతువున్ మంత్రముఁ దంత్రమున్ ధనములుం గాలంబు దేశంబు దే
యున్ ధర్మము నన్యముల్ దలఁప నెవ్వాఁ డట్టి సర్వేశ్వరున్
తి నూహింపక గోపబాలుఁ డనుచున్ మందస్థితిం జూచి దు
ర్మతులై యన్నము లేదు లే దనిరి సన్మాన్యక్రియాశూన్యులై.

టీక:- క్రతువున్ = యజ్ఞము; మంత్రము = యజ్ఞపు మంత్రములు; తంత్రమున్ = వేదశాస్త్రము; ధనములున్ = అవసరమైన విత్తములు; కాలంబు = తగిన కాలము; దేశంబున్ = ప్రదేశము; దేవతయున్ = అధిదేవత; ధర్మమున్ = విధానము; అన్యములున్ = ఇతరములు; తలపన్ = తరచిచూడగా; ఎవ్వాడు = ఎవరో; అట్టి = అటువంటి; సర్వేశ్వరున్ = సర్వనియామకుని; మతిన్ = మనసు నందు; ఊహింపకన్ = తెలిసికొనక; గోప = యాదవ; బాలుడు = పిల్లవాడు; అనుచున్ = అనుచు; మంద = జడ; స్థితిన్ = స్థితిలో; చూచి = చూసి; దుర్మతులు = చెడ్డబుద్ధి గలవారు; ఐ = అయ్యి; అన్నము = భోజనము; లేదులేదు = లేనేలేదు; అనిరి = అని చెప్పిరి; సత్ = మంచి; మాన్య = మన్నన; క్రియా = చేయుట; శూన్యులు = లేనివారు; ఐ = అయ్యి.
భావము:- యాగములు, వేదమంత్రములు, క్రియా తంత్రములు, హవిస్సులు, దర్శ పూర్ణమాస సంక్రమణాదికములైన పుణ్య కాలములు, కాశీ మున్నగు దివ్యస్థలాలు, ఇంద్రాగ్ని సోమాది దేవతలు, యాగఫలమైన ధర్మము, యాగదీక్షితు డైన యజమానుడు మొదలైన ఈ సమస్తం ఏ మహవిష్ణు స్వరూపాలై ఉన్నాయో, అట్టి మహావిష్ణువే శ్రీ కృష్ణుడని వారు అజ్ఞానం వలన అంతరంగాలలో తెలుసుకోలేక పోయారు. కేవలం గోపబాలకుడనే తలచారు. ఆ విప్రులు దుర్భుద్ధితో కృష్ణుడు పంపిన గొల్లపిల్లలను ఆదరించ లేదు. అన్నం లేదు లేదని అదలించి పొమ్మన్నారు.

తెభా-10.1-857-వ.
అంత గోపకులు నిరాశులై వచ్చి యెఱింగించిన హరి లౌకికానుసారి యగుచు “మీ ర య్యార్యుల నడుగక, వారి భార్యలకు మారాకఁ జెప్పుఁ; డన్నంబు పెట్టుదు” రని పంచిన వారు చని బ్రాహ్మణసతుల దర్శించి నమస్కరించి సంపూజితులై యిట్లనిరి.
టీక:- అంతన్ = అంతట; గోపకులు = గొల్లవారు; నిరాశులు = నిరాశ చెందినవారు; ఐ = అయ్యి; వచ్చి = వెనుకకు వచ్చి; ఎఱింగించినన్ = తెలుపగా; హరి = కృష్ణుడు; లౌకిక = లోకరీతి; అనుసారి = అనుసరించువాడు; అగుచున్ = అగుచు; మీరు = మీరు; ఆ = ఆ యొక్క; ఆర్యులన్ = బ్రాహ్మణులను; అడుగక = అడుగకుండా; వారి = వారి యొక్క; భార్యల్ = సతుల; కున్ = కు; మా = మేము; రాకన్ = వచ్చుటను; చెప్పుడు = చెప్పండి; అన్నంబున్ = భోజనము; పెట్టుదురు = ఇచ్చెదరు; అని = అని; పంచినన్ = పంపగా; వారు = వారు; చని = వెళ్ళి; బ్రాహ్మణ = విప్ర; సతులన్ = భార్యలను; దర్శించి = చూసి; నమస్కరించి = మ్రొక్కి; సత్ = చక్కగా; పూజితులు = గౌరవింపబడినవారు; ఐ = అయ్యి; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.
భావము:- అప్పుడు గోపబాలకులు నిరాశతో మరలివచ్చి శ్రీ కృష్ణుడికి విషయం వివరించారు. గోవిందుడు లోకవ్యవహారం అనుసరిస్తూ వారితో “మీరు మళ్ళీ ఆ పెద్దలను అడగకండి. వారి పత్నులకు రామకృష్ణులు ఈ వనానికి ఏతెంచారు అని చెప్పండి. అన్నం పెడతారు వెళ్ళండి.” అని మళ్ళీ గొల్లపిల్లలను పంపాడు. వారు యజ్ఞవాటికకి వచ్చి బ్రాహ్మణ స్త్రీలను దర్శించి నమస్కరించారు. తమను ఎంతో సంతోషంతో ఆదరించిన ఆ ఇల్లాండ్రతొ గొల్లపిల్లలు ఇలా అన్నారు.

తెభా-10.1-858-క.
"గోవుల మేపుచు నాఁకొని
గోవిందుం డన్న మడిగికొని రండని మ
మ్మీవేళనుఁ బుత్తెంచెను
ధీవిలసితలార! రండు తెం డన్నంబుల్. "

టీక:- గోవులన్ = ఆవులను; మేపుచున్ = కాచుచు; ఆకొని = ఆకలేసి; గోవిందుండు = కృష్ణుడు; అన్నము = భోజనము; అడిగికొని = కోరి; రండు = రండి; అని = అని; మమ్మున్ = మమ్ములను; ఈవేళనున్ = ఈరోజున; పుత్తెంచెను = పంపించెను; ధీవిలసితలారా = ఓ బుద్ధివికాసము కలవారా {ధీవిలసిత - బుద్ధివికాసము కలామె, బుద్ధిమంతురాలు}; రండు = రండి; తెండు = తీసుకురండి; అన్నంబుల్ = ఆహారపదార్థములు.
భావము:- “ఓ బుద్ధిమతులారా! శ్రీ కృష్ణుడు గోవులను మేపుతున్నాడు. ఆయనకు ఆకలి వేస్తోంది. మిమ్మల్ని అడిగి అన్నం పెట్టించుకుని రండని మమ్మల్ని పంపించాడు. రండమ్మా అన్నం పెట్టండి.”