పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/గోపికలు కృష్ణయల్లరి చెప్పుట

తెభా-10.1-306-వ.
మఱియు నా కుమారశేఖరుండు కపట శైశవంబున దొంగజాడలం గ్రీడింప గోపిక లోపికలు లేక యశోదకడకు వచ్చి యిట్లనిరి.
టీక:- మఱియున్ = ఇంకను; ఆ = ప్రసిద్ధుడైన; కుమారశేఖరుండు = కృష్ణుడు {కుమారశేఖరుడు - పిల్లలో శ్రేష్ఠుడు, కృష్ణుడు}; కపట = మాయా; శైశవంబునన్ = బాల్యమునందు; దొంగ = యాయలు చేయు; జాడలన్ = విధముల; క్రీడింపన్ = విహరించుచుండగా; గోపికలు = యాదవస్త్రీలు; ఓపికలు = తాలిములు; లేక = లేనివారై; యశోద = యశోద; కడ = వద్ద; కున్ = కు; వచ్చి = వచ్చి; ఇట్లు = ఇలా; అనిరి = పలికిరి.
భావము:- ఇంకను ఆ మాయామాణవబాలకుడు శ్రీకృష్ణుడు మాయా శైశవ లీలలలో క్రీడిస్తుంటే, గోకులంలోని గోపికలు ఓపికలు లేక, తల్లి యశోదాదేవి దగ్గరకు వచ్చి కృష్ణుని అల్లరి చెప్పుకోసాగారు .

తెభా-10.1-307-క.
“బాలురకుఁ బాలు లే వని
బాలింతలు మొఱలుపెట్టఁ కపక నగి యీ
బాలుం డాలము చేయుచు
నాకుఁ గ్రేపులను విడిచె నంభోజాక్షీ!

టీక:- బాలురు = పిల్లల; కున్ = కి; పాలు = తాగుటకు పాలు; లేవు = లేవు; అని = అని; బాలింతలు = పసిబిడ్డల తల్లులు; మొఱలుపెట్టన్ = మొత్తుకొనగా; పకపక = పకపక అని; నగి = నవ్వి; ఈ = ఈ; బాలుండు = పిల్లవాడు; ఆలమున్ = అల్లరి; చేయుచున్ = చేస్తూ; ఆల = ఆవుల; కున్ = కు; క్రేపులను = దూడలను; విడిచెన్ = వదలిపెట్టెను; అంభోజాక్షీ = సుందరీ {అంబోజాక్షి - పద్మాక్షి, స్త్రీ}.
భావము:- కలువలవంటి కన్నులున్న తల్లీ! అసలే పిల్లలకి తాగటానికి పాలు సరిపోవటం లే దని పసిపిల్లల తల్లులు గోలపెడుతుంటే, నీ కొడుకు పకపక నవ్వుతూ, వెక్కిరిస్తూ లేగదూడల తాళ్ళువిప్పి ఆవులకు వదిలేస్తున్నాడు చూడవమ్మ.

తెభా-10.1-308-క.
డఁతీ! నీ బిడ్డడు మా
వలలో నున్న మంచి కాఁగిన పా లా
డుచులకుఁ బోసి చిక్కిన
వలఁ బో నడిచె నాజ్ఞ లదో లేదో?

టీక:- పడతీ = ఇంతీ; నీ = నీ యొక్క; బిడ్డడు = పిల్లవాడు; మా = మా యొక్క; కడవల = కుండల; లోన్ = అందు; ఉన్న = ఉన్నట్టి; మంచి = శుభ్రముగ; కాగిన = కాగినట్టి; పాలున్ = పాలను; పడుచులకు = పిల్లలకు; పోసి = తాగించి; చిక్కిన = మిగిలిన; కడవలన్ = కుండలను; పోనడిచెన్ = పగులగొట్టెను; ఆజ్ఞ = అడ్డూ అదుపు; కలదో = ఉన్నవా; లేదో = లేవా.
భావము:- ఓ యశోదమ్మా! నువ్వు గొప్ప పడచుదానివే కాని, నీ పిల్లాడు చూడు; మా కుండలలో చక్కగా కాగిన పాలు ఉంటే, ఆ పాలను తోటిపిల్లలకు పోసేశాడు, ఆ పైన మిగిలిన కడవలను పగలగొట్టేశాడు. మీ వాడికి భయభక్తులు చెప్తున్నారో, లేదో మరి.

తెభా-10.1-309-క.
మీ పాపఁడు మా గృహముల
నా పోవఁగఁ బాలు ద్రావ గపడ కున్నన్
గోపింపఁ బిన్నపడుచుల
వాపోవఁగఁ జిమ్ముకొనుచు చ్చెం దల్లీ!

టీక:- మీ = మీ యొక్క; పాపడు = పిల్లవాడు; మా = మా యొక్క; గృహములన్ = ఇండ్లలో; ఆపోవగన్ = సరిపడినంత; పాలు = పాలను; త్రావ = తాగుటకు; అగపడకన్ = కనబడకుండా; ఉన్నన్ = ఉండగా; కోపింపన్ = కోపించినచో; పిన్నపడచులన్ = పసిబిడ్డలను; వాపోవగన్ = ఏడ్పించుచు; జిమ్ముకొనుచు = కాలితో ఎగజిమ్ముతో; వచ్చెన్ = వచ్చెను.
భావము:- ఓ యమ్మా! మీ అబ్బాయికి మా యింట్లో తాగటానికి సరిపడగ పాలు కనబడలేదు. దానితో కోపించి పసిపిల్లలను పడదోసుకుంటూ బయటకు వస్తున్నాడు. పసిపిల్లలేమో గుక్కపెట్టి ఏడుస్తున్నారు. మరి నువ్వు ఓ బిడ్డకు తల్లివే కదా ఇదేమైనా బాగుందా చెప్పు.

తెభా-10.1-310-మత్త.
పుట్టి పుట్టఁడు నేడు దొంగిలఁ బోయి మా యిలు జొచ్చి తా
నుట్టి యందక ఱోలు పీఁటలు నొక్క ప్రోవిడి యెక్కి చై
పెట్టఁ జాలక కుండ క్రిం దొక పెద్ద తూఁ టొనరించి మీ
ట్టి మీఁగడపాలు చేరలఁ ట్టి త్రావెఁ దలోదరీ!

టీక:- పుట్టిపుట్టడు = కొత్తగా పుట్టినవాడు; నేడు = ఇవాళ, అప్పుడే; దొంగిలబోయి = దొంగిలించుటకు వెళ్ళి; మా = మా యొక్క; ఇల్లున్ = నివాసమును; చొచ్చి = ప్రవేశించి; తాన్ = అతను; ఉట్టి = ఉట్టి {ఉట్టి - పాలు పెరుగు లాంటివి పిల్లులకు అందకుండుటకై పైన వేళ్ళాడదీసెడి తాళ్ళసాధనము}; అందక = అందకపోవుటచే; ఒక = ఒక; ఱోలున్ = రోటిని {రోలు - ధాన్యాదులను దంచుటకైన గుండ్రటి రాతి లేదా కఱ్ఱ సాధనము}; పీటలు = పీటలు {పీట – కూర్చొనుటకైన క్రింద కోళ్ళు గల బల్ల, పీటలలో కొన్ని రకాలు నేల పీట, ఎత్తు పీట, ముక్కాలి పీట}; ఒక్క = ఒక; ప్రోవు = పోగులా; ఇడి = పెట్టి; యెక్కి = పైకెక్కి; చై = చెయ్యి; పెట్ట = పెట్టుటకు; చాలకన్ = సరిపోకపోవుటచేత; కుండ = కుండకు; క్రిందన్ = కింద పక్కని; ఒక = ఒకానొక; పెద్ద = పెద్ద; తూటు = కన్నము; ఒనరించి = చేసి; మీ = మీ యొక్క; పట్టి = పిల్లవాడు; మీగడపాలు = మీగడకట్టిన పాలను; చేరలన్ = దోసిళ్ళతో; పట్టి = పట్టుకొని; త్రావెన్ = తాగెను; తలోదరీ = సుందరీ {తలోదరి - తల (పలుచ)నైన ఉదరము కలది, స్త్రీ}.
భావము:- ఓ సన్నకడుపు సుందరీ! యశోదా! మీ వాడు మొన్నే కదా పుట్టాడు. అప్పుడే చూడు దొంగతనాలు మొదలు పెట్టేసాడు. మా యింట్లో దూరాడు. ఉట్టిమీది పాలు పెరుగు అందలేదట. రోళ్ళు, పీటలు ఒకదానిమీద ఇంకోటి ఎక్కించాడు. వాటిమీదకి ఎక్కినా చెయ్యి పెడదామంటే అందలేదట. అందుకని కుండ కింద పెద్ద చిల్లు పెట్టాడు. కారుతున్న మీగడపాలు దోసిళ్ళతో పట్టుకొని కడుపు నిండా తాగేసాడు.

తెభా-10.1-311-క.
డం జని వీరల పెరు
గోక నీ సుతుఁడు ద్రావి యొక యించుక తాఁ
గోలి మూఁతిం జరిమినఁ
గోలు మ్రుచ్చనుచు నత్త గొట్టె లతాంగీ!

టీక:- ఆడన్ = అక్కడకు; చని = వెళ్ళి; వీరల = వీరి యొక్క; పెరుగున్ = పెరుగును; ఓడకన్ = బెదురు లేకుండ; నీ = నీ యొక్క; సుతుండు = పుత్రుడు; త్రావి = తాగి; ఒకయించుక = కొంచెము; తాన్ = అతను; కోడలి = వారి కొడుకుభార్య యొక్క; మూతిన్ = నోటికి; చరిమినన్ = రాయగా; కోడలు = కోడలు; మ్రుచ్చు = చాటుమాటుగా తీసుకొనునది, దొంగ; అనుచును = అనుచు; అత్త = భర్తతల్లి; కొట్టెన్ = కొట్టినది; లతాంగీ = ఇంతి {లతాంగి - లతవంటి దేహము కలామె, స్త్రీ}.
భావము:- లత వలె సున్నితమైన దేహం గల సుందంరాంగీ యశోదా! నీ కొడుకు అలా వెళ్ళి, వీళ్ళ ఇంట్లోని పెరుగు శుభ్రంగా తాగాడు. పోతూపోతూ నిద్రపోతున్న వాళ్ళ కోడలి మూతికి కొద్దిగా పెరుగు పులిమాడు. లేచాక అత్తగారు చూసి దొంగతిండి తిందని కోడలిని కొట్టింది.

తెభా-10.1-312-క.
వా రిల్లు చొచ్చి కడవలఁ
దోరంబగు నెయ్యిఁ ద్రావి తుది నా కడవల్
వీరింట నీ సుతుం డిడ
వారికి వీరికిని దొడ్డ వా దయ్యె సతీ!

టీక:- వారి = వారి యొక్క; ఇల్లున్ = నివాసమును; చొచ్చి = దూరి; కడవలన్ = కుండలలోని; తోరంబు = చక్కటి, గట్టిగా పేరుకొన్నది; అగు = ఐన; నెయ్యిన్ = నేతిని; త్రావి = తాగి; తుదిన్ = చివరకు; ఆ = ఆ; కడవల్ = కుండలను; వీరి = వీరి యొక్క; ఇంటన్ = ఇంటిలో; నీ = నీ యొక్క; సుతుండు = పుత్రుడు; ఇడన్ = పెట్టగా; వారి = వారల; కిన్ = కి; వీరి = వీరల; కిని = కి; దొడ్డ = పెద్ద; వాదు = జగడము; అయ్యెన్ = అయినది; సతీ = ఇల్లాలా.
భావము:- ఓ యిల్లాలా! మీ సుపుత్రుడు వాళ్ళింట్లోకి దూరి ఘమఘమలాడే నె య్యంతా తాగేసి, చివరకి ఆ కుండలు వీళ్ళింట్లో పడేసి పోయాడు. దాంతో వాళ్ళకీ వీళ్ళకీ పెద్ద గొడవ అయిపోయింది తెలుసా?

తెభా-10.1-313-క.
"వేలుపులఁటె; నా కంటెను
వేలుపు మఱి యెవ్వ"రనుచు వికవిక నగి మా
వేలుపుల గోడపై నో
హేలావతి! నీ తనూజుఁ డెంగిలిఁ జేసెన్.

టీక:- వేలుపులటె = దేవతలా (ఇవి); నా = నాకు; కంటెను = వేరైన; వేలుపు = దేముడు; మఱిన్ = ఇంకను; ఎవ్వరు = ఎవరున్నారు; అనుచున్ = అనుచు; వికవికన్ = విరగబడి వికవిక అనుచు {వికవిక - విరగబడి నవ్వుటలోని ధ్వన్యనుకరణ}; నగి = నవ్వి; మా = మా యొక్క; వేలుపులగోడ = దేవతలను చిత్రించిన గోడ; పైన్ = మీద; ఓ = ఓహో; హేలావతి = విలాసవతీ; నీ = నీ యొక్క; తనూజుడు = పుత్రుడు; ఎంగిలి = మైల; చేసెను = పరచెను.
భావము:- ఓ యమ్మ! యశోదమ్మ! గొప్పగా నవ్వేవు గాని దీనికేమంటావు. మా యింట్లో దేవతలను చిత్రించిన గోడను చూసి, “వీళ్ళా దేవతలు? నాకంటె వేరె దేవతలు ఎవరున్నారు?” అంటు పకపక నవ్వుతూ నీ కొడుకు గోడమీద ఎంగిలి చేసాడు.

తెభా-10.1-314-క.
వెన్నఁ దినఁగఁ బొడగని మా
పిన్నది యడ్డంబు వచ్చి పిఱిఁదికిఁ దివియన్
న్నొడిసి పట్టి చీఱెనుఁ
జిన్ని కుమారుండె యితఁడు? శీతాంశుముఖీ!

టీక:- వెన్నన్ = వెన్నను; తినగన్ = తింటుండగా; పొడగని =చూసి; మా = మా యొక్క; పిన్నది = చిన్నమ్మాయి; అడ్డంబున్ = అడ్డుపెట్టుటకు; వచ్చి = వచ్చి; పిఱిదికిన్ = వెనుకకు; తివియన్ = లాగగా; చన్ను = స్తనమును; ఒడిసి = అనువుగా; పట్టి = పట్టుకొని; చీఱెను = గీరెను; చిన్ని = చిన్న; కుమారుండె = పిల్లవాడా; ఇతడున్ = ఇతను; శీతాంశుముఖీ = సుందరీ {శీతుంశుముఖి - చంద్రముఖి, స్త్రీ}.
భావము:- చంద్రముఖీ! యశోదమ్మా! మా ఇంట్లోకి చొరబడి నీ కొడుకు వెన్న తింటున్నాడు. అది చూసి మా చిన్నమ్మాయి అడ్డంవెళ్ళి ఇవతలకి లాగింది. మీ వాడు మా పడచుపిల్ల రొమ్ముమీద గోళ్ళతో గీరేసి పారిపోయాడు. చంద్రుళ్ళా వెలిగిపోతున్న ముఖం పెట్టుకొని మరీ చూస్తున్నావు గాని చెప్పవమ్మా! ఇవి పసిపిల్లలు చేసే పనులా.

తెభా-10.1-315-క.
మ్మగువ దన్ను వాకిటఁ
గ్రుమ్మరుచోఁ జీరి నిలిపికొని పే రడుగం
గెమ్మోవిఁ గఱచి వడిఁ జనె
మ్మా! యీ ముద్దుగుఱ్ఱఁ ల్పుఁడె? చెపుమా.

టీక:- ఈ = ఈ; మగువ = ఇల్లాలు; తన్నున్ = అతనిని; వాకిటన్ = ఇంటి గుమ్మం ముందు; క్రుమ్మరుచోన్ = తిరుగుచుండగా; చీరి = పిలిచి; నిలిపికొని = నిలబెట్టి; పేరున్ = నామమును; అడుగన్ = ఏమిటని అడుగగా; కెంపు = ఎఱ్ఱని; మోవిన్ = పెదవిని; కఱచి = కరచి; వడిన్ = వేగముగా; చనెన్ = వెళ్ళిపోయెను; అమ్మా = తల్లీ; ఈ = ఈ; ముద్దు = మనోజ్ఞమైన; కుఱ్ఱడు = పిల్లవాడు; అల్పుడె = తక్కువవాడా, కాదు; చెపుమా = తెలుపుము.
భావము:- ఈ ఇల్లాలు వాకిట్లోంచి వెళ్తున్న నీ పిల్లాడ్ని పిలిచి నిలబెట్టి పేరు అడిగింది. మీ వాడు చటుక్కున ఆమె పెదవి కొరికి పారిపోయాడు. ఓ యమ్మో! మీ ముద్దుల కొడుకు తక్కువ వాడేం కాదు తెలుసా.

తెభా-10.1-316-క.
చేబంతి దప్పి పడెనని
ప్రాల్యముతోడ వచ్చి వనము వెనుకన్
మా బిడ్డ జలక మాడఁగ
నీ బిడ్డఁడు వలువఁ దెచ్చె నెలఁతుక! తగునే?

టీక:- చేబంతి = చేతితో ఆడెడి బంతి; తప్పి = తప్పిపోయి; పడెను = పడిపోయినది; అని = అని; ప్రాబల్యము = దబాయించుట; తోడన్ = తోటి; వచ్చి = వచ్చి; భవనము = మేడ; వెనుకన్ = వెనుక, పెరడులో; మా = మా యొక్క; బిడ్డ = ఆడపిల్ల; జలకమాడగన్ = స్నానము చేయుచుండగా; నీ = నీ యొక్క; బిడ్డడు = పిల్లవాడు; వలువ = గుడ్డ; తెచ్చెన్ = తీసుకు వచ్చేసాడు; నెలతుక = ఇంతి; తగునే = ఇది యుక్తమైనదేనా, కాదు.
భావము:- ఓ యింతి! తన చేతి ఆట బంతి ఎగిరివచ్చి పడిందని దబాయింపుగా మా పెరట్లోకి వచ్చేసాడు. అప్పుడు మా అమ్మాయి స్నానం చేస్తోంది. మీ అబ్బాయి చీర తీసుకొని పారిపోయాడు, ఇదేమైనా బావుందా చెప్పమ్మా యశోదా!

తెభా-10.1-317-క.
చ్చెలువఁ జూచి "మ్రుచ్చిలి
చ్చుగ నుఱికించుకొనుచు రిగెద; నాతో
చ్చెదవా?"యని యనినాఁ
డిచ్చిఱుతఁడు; సుదతి! చిత్ర మిట్టిది గలదే?

టీక:- ఈ = ఈ; చెలువన్ = అందగత్తెను; చూచి = చూసి; మ్రుచ్చిలి = దొంగతనముగ; అచ్చుగన్ = చక్కగా; ఉఱికించుకొనుచున్ = లేపుకొని; అరిగెదన్ = పోయెదను; నా = నా; తోన్ = తోటి; వచ్చెదవా = వస్తావా; అని = అని; అనినాడు = అన్నాడు; ఈ = ఈ; చిఱుతడు = చిన్నవాడు; సుదతి = సుందరి {సుదతి - మంచి దంతములు కలామె, స్త్రీ}; చిత్రము = విచిత్రము; ఇట్టిది = ఇలాంటిది; కలదే = ఎక్కడైనా ఉందా, లేదు.
భావము:- ఈ చక్కటామెను “దొంగతనంగా లేవదీసుకుపోతాను, నాతో వచ్చేస్తావా” అని అడిగాడట మీ చిన్నాడు. విన్నావా యశోదమ్మ తల్లీ! ఇలాంటి విచిత్రం ఎక్కడైనా చూసామా చెప్పు.

తెభా-10.1-318-క.
కొడుకులు లేరని యొక సతి
డు వగవఁగఁ దన్ను మగనిఁగాఁ గైకొనినం
గొడుకులు గలిగెద రని పైఁ
డినాఁ డిది వినుము శిశువు నులే? తల్లీ!

టీక:- కొడుకులు = పుత్రులు; లేరు = కలుగలేదు; అని = అనుచు; ఒక = ఒకానొక; సతి = ఇల్లాలు; కడున్ = ఎక్కువగా, మిక్కిలి; వగవన్ = విచారించగా; తన్నున్ = అతనిని; మగనిన్ = భర్త; కాన్ = అగునట్లు; కైకొనిన్ = చేపట్టినచో; కొడుకులు = పుత్రులు; కలిగెదరు = పుట్టెదరు; అని = అని; పైన్ = మీద; పడినాడు = పడ్డాడు; వినుము = విను; శిశువు = పిల్లవాళ్ళ; పనులే = చేతలా ఇవి, కాదు; తల్లీ = అమ్మా.
భావము:- ఓ యమ్మా యశోదా! ఈ విచిత్రం విను. ఓ యిల్లాలు తనకు కొడుకులు లేరే “అపుత్రస్య గతిర్నాస్తిః” అని శాస్త్రం కదా మరి మా గతేంటి అని బాధపడుతుంటే, “నన్ను మొగుడుగా చేసుకో కొడుకులు పుడతారు” అని మీదమీదకి వచ్చాడుట మీ వాడు. ఇవేమైనా పసివాడి పనులా చెప్పు.
అవును అతనేమైనా పసివాడా కాదు సాక్షాత్తు శ్రీమహావిష్ణువే కదా. పరబ్రహ్మస్వరూపు డైన తన్ను భర్తగా స్వీకరించ మని సద్గతులు కలుగుతాయి అని నొక్కి చెప్పే, ఆ కపట శైశవ కృష్ణమూర్తి దొంగజాడల బాల్యచేష్టలను చేస్తున్నాడు

తెభా-10.1-319-క.
"తలఁగినదానం దల"మనఁ
లఁగక యా చెలికి నాన లయెత్తఁగ "నీ
లఁగిన చోటెయ్యది"యని
యూఁచెన్ నీ సుతుండు గవె? మృగాక్షీ!

టీక:- తలగినదానన్ = బహిష్టురాలను; తలము = తప్పుకొనుము; అనన్ = అనగా; తలగక = తప్పుకొనక; ఆ = ఆ; చెలి = ఇంతి; కిన్ = కి; నాన = సిగ్గు; తలయెత్తగ = కలుగునట్లుగా; నీ = నీ యొక్క; తలగిన = తొలగిన; చోటు = చోటు; ఎయ్యది = ఏది; అని = అని; తల = శిరస్సును; ఊచెన్ = ఊపెను; నీ = నీ యొక్క; సుతుండు = పుత్రుడు; తగవె = ఇది ధర్మమేనా. కాదు; మృగాక్షీ = సుందరీ {మృగాక్షి - లేడికన్ను లామె, స్త్రీ}.
భావము:- చక్కని లేడికన్నులవంటి కళ్ళు నీ కున్నాయిలే కాని ఓ యశోదమ్మ! ఇటు చూడు. ఈ అమ్మాయి “బహిష్ఠు అయ్యాను దూరంగా ఉండు” అంటే, నీ పుత్రుడు తప్పుకోడు. పైగా తలూపుతూ “బహిష్ఠు అయిన చోటేది” అని అడిగాడుట. ఈ అమ్మాయేమో పాపం సిగ్గుతో చితికిపోయింది. ఇదేమైనా బావుందా చెప్పు.

తెభా-10.1-320-క.
వ్రాలఁగ వచ్చిన నీ సతి
"చూలాలం దలఁగు"మనుడు "జూ లగుటకు నే
మూలంబు జెప్పు"మనె నీ
బాలుఁడు; జెప్పుదురె సతులు? ర్వేందుముఖీ!

టీక:- వ్రాలగన్ = మీదపడుటకు; వచ్చినన్ = రాగా; ఈ = ఈ; సతి = ఇంతి; చూలాలన్ = గర్భిణిని; తలగుము = తప్పుకొనుము; అనుడున్ = అనగా; చూలు = గర్భము; అగుట = కలుగుట; కున్ = కు; ఏ = ఏది; మూలంబు = కారణము; చెప్పుము = చెప్పు; అనెన్ = అన్నాడు; నీ = నీ యొక్క; బాలుడు = పిల్లవాడు; చెప్పుదురె = చెప్తారా; సతులు = ఇల్లాండ్రు; పర్వేందుముఖీ = సుందరీ {పర్వేందుముఖీ - పర్వ (పౌర్ణమినాటి) ఇందు (చంద్రునివంటి) ముఖి (మోముకలామె), స్త్రీ}.
భావము:- ఓ యశోదమ్మా! నీ కొడుకు ఈ ఇల్లాలు ఒళ్ళో కూర్చోడానికి వచ్చేడు. ఈమె “గర్భవతిని దూరంగా ఉండు అంది”. “ గర్భవతివి కావటానికి కారణం ఏమిటి చెప్పు” అని అడుగుతున్నాడు నీ కొడుకు. సుందరి! ఈ తెలివితేటలకు నిండుపున్నమి నాటి చందమామలా నీ మోము వికసించిందిలే. కాని, అలా అడిగితే ఆడవాళ్ళు ఎవరైనా చెప్తారుటమ్మా.

తెభా-10.1-321-క.
గువా! నీ కొమరుఁడు మా
వా రటు పోవఁ జూచి మంతనమునకుం
గఁ జీరి పొందు నడిగెను
ముల మున్నిట్టి శిశువు దువంబడెనే?

టీక:- మగువా = ఇంతీ; నీ = నీ యొక్క; కొమరుడు = పుత్రుడు; మా = మా యొక్క; మగవారు = భర్తలు; అటున్ = అలా; పోవన్ = వెళ్ళిపోగా; చూచి = చూసి; మంతనమున = రహస్యమున; కున్ = కు; తగన్ = చక్కగా; చీరి = పిలిచి; పొందు = కూడుటను; అడిగెను = అడిగెను; జగములన్ = లోకము లందు; మున్ను = ఇంతకు పూర్వము; ఇట్టి = ఇటువంటి; శిశువున్ = పిల్లవానిని; చదువంబడెనే = ఎక్కడైనా చెప్పబడెనా, లేదు.
భావము:- ఓ ఇల్లాలా! మా మగవాళ్ళు బైటకు వెళ్ళటం చూసి రహస్యం చెప్పాలి దగ్గరకి రా అని పిలిచి, నీ కొడుకు క్రీడిద్దాం వస్తావా అని అడిగాడు. ఇలా అడిగే పసిపిల్లాడు ఉన్నా డని ఇంతకు ముందెప్పుడైనా విన్నామా?
గోపికలు యశోదకి చెప్పిన బాలకృష్ణుని అల్లరి ఇది. ఇక్కడ పాలపర్తి నాగేశ్వర శాస్త్రి గారు చెప్పిన విశేషార్థం చూడండి. అసంభవ నాదుల చేత బ్రహ్మైక్యం భంగపరచే దుర్వృత్తులు లే నప్పుడు, రహస్యమున నా యం దైక్యము గమ్మని పిలిచేడు. (ఉపనిషత్ ప్రమాణం – చిదేవాహం చిదేవత్వం సర్వ మే త చ్చిదేవహి.)

తెభా-10.1-322-క.
మ్మి నిదురబోవ నా పట్టిచుంచు మా
లేఁగతోఁకతోడ లీలఁ గట్టి
వీథులందుఁ దోలె వెలది! నీ కొమరుండు;
రాచబిడ్డఁ డైన వ్వ మేలె?

టీక:- నమ్మి = నమ్మకముగా; నిదురబోవన్ = నిద్రపోగా; ఆ = ఆ; పట్టి = చిన్నపిల్ల; చుంచున్ = జుట్టును; మా = మా యొక్క; లేగ = లేగదూడ; తోక = తోక; తోడన్ = తోటి; లీలన్ = విలాసముగా; కట్టి = కలిపి కట్టేసి; వీథులన్ = వీథుల; అందున్ = లో; తోలెన్ = తూలెను (ఆ దూడను); వెలది = పడతి; నీ = నీ యొక్క; కొమారుండు = పుత్రుడు; రాచబిడ్డడు = రాకుమారుడు; ఐనన్ = అయినప్పటికిని; ఱవ్వ = అల్లరి చేయుట; మేలె = మంచిదా, కాదు.
భావము:- ఓ ఉత్తమురాలా! యశోదమ్మా! నా కొడుకు ఆడి ఆడి అలసి నిద్రపోయాడు. నీ సుపుత్రుడు వచ్చి నా కొడుకు జుట్టును మా లేగదూడ తోకకు కట్టి, దాన్ని వీథు లమ్మట తోలాడు. ఎంత గొప్ప నాయకుడి పిల్లా డైతే మాత్రం ఇంతగా అల్లరి పెట్టవచ్చా.

తెభా-10.1-323-క.
నా ట్టి పొట్ట నిండఁగఁ
బై డి నీ పట్టి వెన్న బానెం డిడినాఁ;
డూపిరి వెడలదు; వానిం
జూపెద నేమైన నీవ సుమ్ము లతాంగీ!

టీక:- నా = నా యొక్క; పట్టి = పిల్లవాని; పొట్ట = కడుపు; నిండగన్ = నిండా; పైపడి = మీద ఎక్కి, బలవంతం చేసి; నీ = నీ యొక్క; పట్టి = పిల్లవాడు; వెన్నన్ = వెన్నను; బానెండు = పెద్ద కుండెడు; ఇడినాడు = పెట్టాడు; ఊపిరి = శ్వాస; వెడలదు = రావటంలేదు; వానిన్ = అతనిని; చూపెదన్ = చూపించెదను; ఏమైనన్ = ఏదైనా ప్రమాదము జరిగితే; నీవ = నీవే బాధ్యురాలవు; సుమ్ము = సుమా; లతాంగీ = సుందరీ.
భావము:- పూతీగెలాంటి చక్కదనాల సుందరాంగీ ఓ యశోదమ్మా! నీ కొడుకు నా కొడుకును పట్టుకొని వాడి పొట్ట నిండిపోయినా వదలకుండా బలవంతంగా బానెడు వెన్న పట్టించేసాడు. వాడికి ఊపిరి ఆడటం లేదు. మా వాడిని తీసుకు వచ్చి చూపిస్తా. ఇదిగో వాడి కేమైనా అయిందంటే నీదే బాధ్యత సుమా.

తెభా-10.1-324-క.
తెవ యొకతె నిద్రింపఁగ
నెఱిఁ గట్టిన వలువ వీడ్చి నే టగు తేలుం
పించి నీ కుమారుఁడు
వెచుచు నది పఱవ నగియె విహితమె? సాధ్వీ!

టీక:- తెఱవ = ఇంతి; ఒకతె = ఒకర్తె; నిద్రింపగన్ = నిద్రపోతుంటే; నెఱిన్ = చక్కగా; కట్టిన = కట్టుకొన్న; వలువన్ = చీరను; వీడ్చి = విప్పి; నేటు = దృఢమైనది; అగు = ఐన; తేలున్ = తేలుచేత; కఱిపించి = కరిపించి; నీ = నీ యొక్క; కుమారుడు = పిల్లవాడు; వెఱచుచున్ = బెదిరిపోతూ; అది = ఆమె; పఱవన్ = పరుగెడుతుండగ; నగియెన్ = నవ్వెను; విహితమె = తెలియునా; సాధ్వీ = అబల.
భావము:- ఒకామె నిద్రపోతుంటే బట్టలు విప్పేసి, నీ కొడుకు ఇంత పెద్ద తేలు తెచ్చి కరిపించాడు. ఆమె బెదిరిపోయి పెద్ద నోరు పెట్టుకొని అరుస్తూ గంతులు వేస్తుంటే మీ అబ్బాయి పకపక నవ్వాడు. ఇదేమైనా బాగుందా తల్లీ! ఎంతో సాధు స్వభావివి కదా నువ్వు చెప్పు మరి.

తెభా-10.1-325-క.
నా కొడుకును నా కోడలు
నేతమునఁ బెనఁగ బాము నీతఁడు వైవం
గో లెఱుంగక పాఱినఁ
గూఁ లిడెన్ నీ సుతుండు గుణమె? గుణాఢ్యా!

టీక:- నా = నా యొక్క; కొడుకును = పుత్రుడు; నా = నా యొక్క; కోడలున్ = కొడుకుభార్య; ఏకతమునన్ = ఏకాంతమందు; పెనగన్ = కలియుచుండగా; పామున్ = సర్పమును; ఈతడున్ = ఇతను; వైవన్ = వేయగా; కోకలు = వంటిమీది బట్టలు; ఎఱుంగక = తెలియకుండ; పాఱినన్ = పరుగెట్టగా; కూకలు = కేకలు; ఇడెన్ = పెట్టెను; నీ = నీ యొక్క; సుతుండు = పుత్రుడు; గుణమె = మంచి బుద్దా ఇది, కాదు; గుణాఢ్య = ఇల్లాలా {గుణాఢ్య - సుగుణములచే ఉత్తమురాలు, స్త్రీ}.
భావము:- నా కొడుకు కోడలు ఏకాంతంలో ఉంటే, నీ కొడుకు వెళ్ళి పాము నొకదానిని వారిమీద పడేసాడు. వంటిమీద బట్టలు లేవని తెలియనంతగా భయపడిపోయి, వాళ్ళు పరుగులు పెడుతుంటే, చూసి హేళనగా కేకలు పెట్టాడు. ఓ యశోదమ్మా! నీవేమో సుగుణాల రాశివి కదా. మరి మీ వాడి గుణ మేమైనా బావుందా చెప్పు.

తెభా-10.1-326-ఆ.
రుణి యొకతె పెరుగుఁ ద్రచ్చుచోఁ దుది వంగి
వెన్నదీయ నొదిఁగి వెనుకఁ గదిసి
గువ! నీ సుతుండు గపోఁడుములు చేయ
సాఁగినాఁడు తగదె? క్కఁజేయ.

టీక:- తరుణి = పడతి {తరుణి - తరుణ వయసు స్త్రీ}; ఒకతె = ఒకామె; పెరుగున్ = పెరుగును; త్రచ్చుచోన్ = చిలుకుతూ; తుదిన్ = ఆఖరున; వంగి = వంగొని; వెన్నన్ = వెన్న; తీయన్ = తీయుచుండగా; ఒదిగి = పొంచి ఉండి; వెనుకన్ = వెనుకవైపు; కదిసి = చేరి; మగువ = ఇంతి; నీ = నీ యొక్క; సుతుండు = పుత్రుడు; మగపోడుములు = పోకిరీ వేషములు; చేయసాగినాడు = చేయుట మొదలు పెట్టాడు; తగదె = ఉచితము కాదు, అవును; చక్కజేయన్ = సరిదిద్దుట.
భావము:- ఓ యమ్మా! ఒక యువతి పెరుగు చిలుకుతోంది. చివరకి వెన్న తీయడానికి వంగింది. నీ కొడుకు వెనక చేరి పోకిరీ పనులు చేయసాగాడు. కొంచం బుద్ధి చెప్పరాదా?
స్త్రీ బాలాంధజడోపమా అంటారు కదా అలా ఉండి, పెరుగు అనే జ్ఞానం పేరుకున్న వేదాలు చిలికిచిలికి, వెన్న అనే సారం తీయడానికి ప్రయత్నిస్తే సరిపోదు అని. ఏకాంతిక భక్తి లేనిచో వ్యర్థమని పరమాత్మ వెనుతగిలి మగపోడుమ లనే సరైన పురుషయత్నం చూపుతున్నాడట.

తెభా-10.1-327-సీ.
లకంఠి! మా వాడ రితల మెల్ల నీ-
ట్టి రాఁగల డని పాలు పెరుగు
లిండ్లలోపల నిడి యే మెల్లఁ దన త్రోవఁ-
జూచుచో నెప్పుడు చొచ్చినాఁడొ?
లుపుల ముద్రల తాళంబులును బెట్టి-
యున్న చందంబున నున్న వరయ;
నొక యింటిలోఁ బాడు నొక యింటిలో నాడు-
నొక యింటిలో నవ్వు నొకటఁ దిట్టు;

తెభా-10.1-327.1-ఆ.
నొకట వెక్కిరించు నొక్కొకచో మృగ
క్షి ఘోషణములు రఁగఁ జేయు
నిట్లు చేసి వెనుక నెక్కడఁ బోవునో
కాన రాఁడు రిత్త డవ లుండు.

టీక:- కలకంఠి = పడతి {కలకంఠి - కోకిలవంటి కంఠస్వరము కలామె, స్త్రీ}; మా = మా యొక్క; వాడన్ = పేట, వీధి; గరితలము = స్త్రీలము {గరితలు - ఉత్తమురాండ్రు, స్త్రీలు}; నీ = నీ యొక్క; పట్టి = పిల్లవాడు; రాగలడు = వస్తాడు; అని = భావించి; పాలు = పాలను; పెరుగున్ = పెరుగును; ఇండ్ల = ఇళ్ళ; లోపలన్ = లో; ఇడి = పెట్టి; ఏము = మేము; ఎల్లన్ = అందరము; తన = అతని; త్రోవన్ = దారిలో; చూచుచోన్ = చూస్తుండగా; ఎప్పుడున్ = ఎప్పుడు; చొచ్చినాడొ = దూరాడో; తలుపుల = తలుపుల యొక్క; ముద్రల = గొళ్ళెముల; తాళంబులునున్ = తాళములు; పెట్టి = వేసినవి; ఉన్నన్ = అలానే ఉన్న; చందంబునన్ = విధముగనే; ఉన్నవి = ఉన్నాయి; అరయ = తరచి చూసినను; ఒక = ఒకానొక; ఇంటి = ఇంటి; లోన్ = అందు; పాడున్ = పాటలు పాడును; ఒక = ఒకానొక; ఇంటి = నివాసము; లోన్ = అందు; ఆడున్ = నాట్య మాడును; ఒక = ఒకానొక; ఇంటి = గృహము; లోన్ = అందు; నవ్వున్ = నవ్వుతుండును; ఒకటన్ = ఒకదానిలో; తిట్టున్ = తిడుతుండును; ఒకటన్ = ఒకచోట.
వెక్కిరించున్ = వెక్కిరించును; ఒక్కొక్కచోన్ = కొన్ని చోట్ల; మృగ = జంతువుల; పక్షి = పక్షుల; ఘోషణములున్ = అరుపులను; పరగన్ = ప్రసిద్ధముగా; చేయున్ = చేయును; ఇట్లు = ఈ విధముగ; చేసి = చేసిన; వెనుకన్ = తరువాత; ఎక్కడన్ = ఎక్కడకు; పోవునో = వెళ్ళిపోవునో; కానరాడు = కనిపించడు; రిత్త = ఖాళీ; కడవలు = కుండలు; ఉండు = ఉండును.
భావము:- ఓ యశోదమ్మా! మంజులవాణి! మీ వాడు వస్తాడని ఊహించాము. మా వీథిలోని గొల్ల భామలము అందరము తలుపులు అన్ని వేసేసి, గడియలకు తాళాలు బిగించాము. అతను వచ్చే దారిని కాపాలాగా చూస్తునే ఉన్నాం. తలుపులకు వేసిన గొళ్లేలు తాళాలు వేసినవి వేసినట్టే ఉన్నాయి. కాని ఇలా చూసేసరికి ఎలా వచ్చాడో ఎలా దూరాడో మరి ఒకరి ఇంట్లో పాటలు పాడుతున్నాడు. ఇంకొక ఇంటిలో గెంతుతున్నాడు. ఇంకో ఇంట్లో నవ్వుతున్నాడు. మరింకొక ఇంట్లోనేమో తిడుతున్నాడు. ఇంకొక చోటేమో ఎక్కిరిస్తున్నాడు. కొన్ని ఇళ్ళల్లో అయితే పక్షులలా కూతలు జంతువులలా కూతలు కూస్తున్నాడు.. ఇంతట్లోనే ఎలా వెళ్ళిపోతాడో చటుక్కున వెళ్ళిపొతాడు. చూస్తే ఖాళీ కడవలు ఉంటాయి తల్లీ.

తెభా-10.1-328-క.
డు లచ్చి గలిగె నేనిం
గుడుతురు గట్టుదురు గాక కొడుకుల నగుచున్
డుగుల వాడలపైఁ బడ
విడుతురె రాకాంత లెందు? విమలేందుముఖీ!

టీక:- కడు = ఎక్కువగా, మిక్కుటమైన; లచ్చి = సంపదలు; కలిగెను = ఉన్నట్లు; ఏనిన్ = అయితే; కుడుతురు = మంచి తిండి తింటారు; కట్టుదురు = మంచి బట్ట కడతారు; కాక = అంతేకాని; కొడుకులన్ = పుత్రులను; నగుచున్ = నవ్వుకొనుచు; బడుగుల = పేదల; వాడలన్ = పేట, వీధి; పైన్ = మీద; పడన్ = పడమని; విడుతురె = వదులుతారా, వదలరు; రాకాంతలు = క్షత్రియపడతులు; ఎందు = ఎక్కడ అయినా; విమలేందుముఖీ = సుందరీ {విమలేందుముఖి - స్వచ్ఛమైన మోము కలామె, స్త్రీ}.
భావము:- నిర్మలమైన మోము గల ఓ యశోదాదేవి! ఎంత భాగ్యవంతులు అయితే మాత్రం. గొప్ప తిండి తింటారు, గొప్ప బట్టలు కట్టుకుంటారు. అంతేకాని రాజవంశపు స్త్రీలు ఎక్కడ అయినా ఇలా పిల్లలను ఊళ్ళోని పేదల మీద పడి పేదలను వేపుకు తిన మని చిరునవ్వులు నవ్వుతూ పంపుతారా? చెప్పు.

తెభా-10.1-329-క.
మ్మ! నీ కుమారుఁడు
మా యిండ్లను బాలు పెరుగు ననీ డమ్మా!
పోయెద మెక్కడి కైనను
మా న్నల సురభులాన మంజులవాణీ!”

టీక:- ఓ = ఓహో; అమ్మ = తల్లి; నీ = నీ యొక్క; కుమారుడు = పుత్రుడు; మా = మా యొక్క; ఇండ్లను = నివాసములలో; పాలున్ = పాలు; పెరుగున్ = పెరుగు; మననీడు = బతకనీయడు; అమ్మా = తల్లీ; పోయెదము = పోతాము; ఎక్కడికైనను = మరింకొక చోటునకు; మా = మా యొక్క; అన్నల = అన్నల (పుట్టింటివారి) యొక్క; సురభులు = గోవులమీద; ఆన = ఒట్టు; మంజులవాణీ = సుందరీ {మంజులవాణి - మృదువుగా మాటలాడెడి యామె, స్త్రీ}.
భావము:- ఓ మంజులవాణీ! యశోదమ్మ తల్లీ! నీ సుపుత్రుడు మా ఇళ్ళల్లో పాలుపెరుగు బతకనీయ డమ్మా. మెత్తని మాటల మామంచి దానివే కాని. సర్దిపుచ్చాలని చూడకు. మేం వినం. మా అన్నల (పుట్టింటి వారి) యొక్క గోవుల మీద ఒట్టు. ఈ వాడలో మేం ఉండలేం. ఊరు విడిచి పోతాం. మాకు మరో గతి లేదు."
విశే. అవును పాపం. వాళ్ళు అమాయకులైన గోపికలు కదా. వాళ్లెక్కడికి పోతారు? ఎక్కడికీ పోరు. మహా అయితే నాలుగు రోజులు పుట్టిళ్ళకి వెళ్తారు. అందువల్లనే వాళ్ళ అన్నల సురభులు గుర్తుకొచ్చాయి.