పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/కుబ్జ ననుగ్రహించుట

తెభా-10.1-1274-క.
ళినాక్షుఁడు గాంచెను
నానా లేపముల భాజముఁ జేఁగొనుచుం
బూని చనుదెంచు దానిని
నాన రుచి నిచయ వినమితాబ్జం గుబ్జన్.

టీక:- ఆ = ఆ ప్రసిద్ధుడైన; నళినాక్షుడు = పద్మాక్షుడు, కృష్ణుడు; కాంచెను = చూసెను; నానా = రకరకముల; లేపముల = మైపూతలు కల; భాజనము = పాత్రను; చేకొనుచున్ = తీసుకొనుచు; పూని = ధరించి; చనుదెంచు = వచ్చుచున్న; దానిని = ఆమెను; ఆనన = ముఖము యొక్క; రుచి = కాంతుల; నిచయ = సమూహముతో; వినమిత = తలవంచుకొన్న; అబ్జన్ = పద్మములు కలామెను; కుబ్జన్ = మరుగుజ్జు స్త్రీని.
భావము:- అలా రాచవీథిని వెళ్తున్న, కమలముల వంటి కన్నులు కల కన్నయ్య రకరకాల మైపూతలు గల పాత్ర పట్టుకుని వస్తున్న కుబ్జను చూసాడు. అప్పుడు ఆమె ముఖము ముందు పద్మం తలవంచుకునే టంత కాంతివంతంగా వెలిగిపోతోంది.

తెభా-10.1-1275-వ.
కని యిట్లనియె.
టీక:- కని = చూసి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- అలా వెలిగిపోతున్న ముఖంతో ఎదురు వచ్చిన కుబ్జను చూసి కృష్ణుడు ఇలా అన్నాడు.

తెభా-10.1-1276-క.
"ఎవ్వరిదానవు? లేపము
లెవ్వరికిం గోరికొనుచు నేగెదు? నీ పే
రెవ్వరు మా కి మ్మిన్నియు
నివ్వటిలెదు చక్కనగుచు నీరజనేత్రా!"

టీక:- ఎవ్వరి = ఎవరికి సంబంధించిన; దానవు = దానివి; లేపములు = మైపూతలు, కలపములు; ఎవ్వరి = ఎవరి; కిన్ = కి; కోరి = కావాలని; కొనుచున్ = తీసుకొనుచు; ఏగెదు = పోవుచున్నావు; నీ = నీ యొక్క; పేరు = నామధేయము; ఎవ్వరు = ఏమిటి; మా = మా; కున్ = కు; ఇమ్ము = ఇవ్వవలసినది; ఇన్నియున్ = ఇవన్నిటిని; నివ్వటిలెదు = అతిశయించెదవు; చక్కన = అందము కలామెవు; అగుచున్ = అయ్యి; నీరజనేత్రా = సుందరీ {నీరజనేత్ర - నీరజ (కమలముల) వంటి నేత్ర (కన్నులు కలామె), స్త్రీ}.
భావము:- “ఓ పద్మాక్షీ! నీ వెవరి దానివి? ఈ పూతలు ఎవరి కోసము తీసుకువెళ్తున్నావు? నీ పేరేమిటి? ఈ లేపనము లన్నీ మాకియ్యి. నీవు చక్కనిదాని వయ్యి ప్రకాశిస్తావులే.”

తెభా-10.1-1277-వ.
అనిన న య్యబల యిట్లనియె.
టీక:- అనినన్ = అనగా; ఆ = ఆ యొక్క; అబల = స్త్రీ {అబల - బలము లేని ఆమె,స్త్రీ}; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- కృష్ణుడి మాటలు విని, ఆ ముదిత ఇలా అంది.

తెభా-10.1-1278-ఉ.
"క్కనివాఁడ వౌదు; సరసంబుల నొంపకు; మెల్లవారికిం
క్కఁదనంబు లెక్కడివి; చారుశరీర! త్రివక్ర యండ్రు; నే
నిక్కము కంసుదాసిని; వినిర్మల లేపన విద్యదాన; నన్
మిక్కిలి రాజుమెచ్చుఁ; దగ మీరు విలేపనముల్ ధరింపరే!"

టీక:- చక్కని = అందము కలిగిన; వాడవు = వాడవు; ఔదు = అయ్యివుండవచ్చును; సరసంబులన్ = సరసపుమాటలు; ఒంపకుము = ఒలకబోయకు; ఎల్లవారి = అందరి; కిన్ = కి; చక్కదనములు = అందముగా నుండుట; ఎక్కడివి = ఎక్కడనుండి వచ్చును; చారు = అందమైన; శరీర = దేహము కలవాడా; త్రివక్ర = త్రివక్ర {త్రివక్ర - మువ్వంకలామె, వంకరమెడ, దొడ్డికాళ్ళు, గూనినడుము అను మూడు వంకరలను త్రివక్రములు అంటారు}; అండ్రు = అంటారు; నేన్ = నేను; నిక్కము = నిజముగ; కంసు = కంసుని యొక్క; దాసిని = పరిచారికను; వినిర్మల = మిక్కిలి స్వచ్ఛమైన; లేపన = మైపూతలు చేసెడి; విద్యదాన = నేర్పు కలామెను; నన్ = నన్ను; మిక్కిలి = అధికముగ; రాజు = రాజు (కంసుడు); మెచ్చున్ = మెచ్చుకొనును; తగన్ = చక్కగా; మీరు = మీరు; విలేపనముల్ = కలపములను; ధరింపరే = వేసుకొనండి.
భావము:- “ఓ సుందరాంగుడా! నీవు బలే అందగాడివేలే కానీ, సరసాలతో నన్ను వేధించకు. అందరికీ అందాలు ఎక్కడ నుంచి వస్తాయి? త్రివిక్ర అంటారు నన్ను. నేను కంసుడి దాసిని. స్వచ్ఛమైన మైపూతలు చేయుట తెలిసినదానిని. నన్ను రాజు ఎంతో మెచ్చుకుంటూ ఉంటాడు. మీరు ఈ విలేపనాలు చక్కగా రాసుకోండి.”

తెభా-10.1-1279-క.
ని పలికి యా కుమారుల
నువులు నగవులును వీక్షిమ్ములు మాటల్
చిత్తముఁ గరఁగించిన
నులేపము లిచ్చె వారి బల ప్రియముతోన్.

టీక:- అని = అని; పలికి = చెప్పి; ఆ = ఆ యొక్క; కుమారుల = బాలుర; తనువులున్ = రూపులు; నగవులును = నవ్వులు; వీక్షితమ్ములు = చూపులు; మాటల్ = పలుకులు; తన = తన యొక్క; చిత్తమున్ = మనసును; కరగించినన్ = మెత్తగా కరిగించగా; అనులేపములు = మైపూతలు; ఇచ్చెన్ = ఇచ్చెను; వారి = వారల; కిన్ = కు; అబల = స్త్రీ; ప్రియము = ప్రేమ, ఇష్టము; తోన్ = తోటి.
భావము:- ఆ పడచువారైన బలరామకృష్ణుల చక్కటి స్వరూపాలు, నవ్వులు, చూపులు, మాటలు తన మనస్సును కరగించగా, ఆ కుబ్జ ప్రేమతో ఇలా అంటూ వారికి మైపూతలు ఇచ్చింది.

తెభా-10.1-1280-సీ.
వ్విధంబునఁ గుబ్జ యిచ్చిన లేపంబు-
న్నియుఁ దాను దేమున నలఁది
కొని ప్రసన్నత నొంది కుబ్జ మువ్వంకల-
యొడలు చక్కఁగ నొత్తి యునుపఁ దలఁచి
త్పదంబుల మీఁదఁ న పదంబులు ద్రొక్కి-
స్తాంగుళద్వయ బల గవుద
క్రింద విప్పుగ నిడి కృష్ణుఁడు మీఁదికి-
నెత్తఁగ వక్రత లెల్ల మాని

తెభా-10.1-1280.1-ఆ.
క్కనైన చిత్తన్ముబాణము క్రియఁ
గొమరుమిగిలి పిఱుఁదుఁ గుచయుగంబు
సొంపుఁ జేయఁ దరుణి సుందరమూర్తి యై
మలనయనుఁ జూచి కాంక్షతోడ.

టీక:- ఈ = ఈ; విధంబునన్ = విధముగ; కుబ్జ = కుబ్జ; ఇచ్చినన్ = ఇవ్వగా; లేపంబులు = మైపూతలు; అన్నియున్ = అన్నిటిని; తాను = అతను; దేహమునన్ = శరీరముపై; అలదికొని = రాసుకొని; ప్రసన్నతన్ = సంతుష్టి; ఒంది = చెంది; కుబ్జ = కుబ్జ యొక్క; మువ్వంకలన్ = త్రివక్రములుగల {మువ్వంకలు - 1దొడ్డికాళ్ళు 2గూని 3మెడవంకర}; ఒడలు = దేహమును; చక్కగనొత్తి = చక్కబెట్టి; ఉనుప = ఉంచవలెనని; తలచి = భావించి; తత్ = ఆమె; పాదముల = కాళ్ళ; మీదన్ = పైన; తన = అతని యొక్క; పదంబులున్ = కాళ్ళతో; త్రొక్కి = తొక్కిపెట్టి; హస్త = చేతి; అంగుళ = బొటకనవేళ్ళు; ద్వయమున్ = రెంటిని; అబల = స్త్రీ యొక్క; గవుద = చెంపల; క్రిందన్ = కింద; విప్పుగన్ = విరివిగా; ఇడి = ఉంచి; కృష్ణుడు = కృష్ణుడు; మీది = పై; కిన్ = కి; ఎత్తగన్ = లేపగా; వక్రతలు = వంకరులు; ఎల్లన్ = సర్వము; మాని = పోయి.
చక్కని = అందమైనది; ఐన = అయినట్టి; చిత్తజన్ము = మన్మథుని {చిత్తజన్ముడు - మనసున పుట్టువాడు, మన్మథుడు}; బాణము = బాణము; క్రియన్ = వలె; కొమరుమిగిలి = అందగించి; పిఱుదున్ = పిఱ్ఱల; కుచ = స్తనముల; యుగంబున్ = జంటలు; సొంపు = చక్కదనము; చేయన్ = కలిగించగా; తరుణి = స్త్రీ {తరుణి – తరుణ వయస్కురాలు}; సుందర = అందమైన; మూర్తి = స్వరూపస్తురాలు; ఐ = అయ్యి; కమలనయనున్ = పద్మాక్షుని, కృష్ణుని; చూచి = చూసి; కాంక్ష = కోరిక; తోడన్ = తోటి.
భావము:- ఇలా కుబ్జ ఇచ్చిన మైపూతలు అన్నీ కృష్ణుడు తన వంటి నిండా రాసుకుని ప్రసన్నుడయ్యాడు. మువ్వంపులు గల దాని దేహాన్ని చక్కనొత్తి ఆమెను అనుగ్రహంచ దలచాడు. దాని పాదాల మీద తన పాదాలు వేసి త్రొక్కిపట్టాడు. తన చేతి రెండు వేళ్ళను దాని గడ్డము క్రింద పెట్టి దేహము చక్కగా సాగేలా పైకెత్తాడు. అంతే ఆమె వంపులు తీరి మన్మథుడి సమ్మోహనాస్త్రం అన్నంత అందగత్తె అయిపోయింది. పిరుదులు, చనుగవ సొంపు మీరగా, కుబ్జ చక్కని చుక్క అయింది. ఆమె కమలాక్షుడి వైపు కాంక్షతో చూసి. . . .

తెభా-10.1-1281-క.
"వేంచేయుము నా యింటికిఁ
బంశరాకార"! యనుచుఁ బైకొం గాక
ర్షించి హరిఁ దిగిచెఁ గామిని
పంచాశుగబాణజాల గ్నహృదయయై.

టీక:- వేంచేయుము = రమ్ము; నా = నా యొక్క; యింటి = నివాసమున; కిన్ = కు; పంచశరాకార = కృష్ణా {పంచశరాకారుడు - పంచశరుని (మన్మథుని) వంటి ఆకారము కలవాడు, కృష్ణుడు}; అనుచున్ = అని పలుకుచు; పైకొంగు = ఉత్తరీయము చెంగును; ఆకర్షించి = పట్టుకొని లాగి; హరిన్ = కృష్ణుని; తిగిచి = గుంజి; కామిని = స్త్రీ {కామిని - కామము గలామె, స్త్రీ}; పంచాశుగ = మన్మథుని {పంచాశుగుడు - ఐదుబాణములు కలవాడు, మన్మథుడు}; బాణ = బాణముల; జాల = పరంపరచేత; భగ్న = భంగపడిన; హృదయ = మనస్సు గలామె; ఐ = అయ్యి.
భావము:- మదనుని బాణాలు తాకి కుబ్జ హృదయం చెదిరింది. కృష్ణుడిని కామిస్తున్న, ఆ కామిని “మన్మథాకారా! నా ఇంటికి దయ చెయ్యి” అంటూ అతడి కండువా చెంగు పట్టుకుని లాగుతూ పిలిచింది.

తెభా-10.1-1282-క.
కామిని తిగిచినఁ గృష్ణుఁడు
రాముని వీక్షించి నగుచు "రాజానన! మ
త్కామితముఁ దీర్చి పిదపన్
నీ మందిరమునకు వత్తు నే డలుగకుమీ!"

టీక:- కామిని = స్త్రీ; తిగిచినన్ = లాగగా; కృష్ణుడు = కృష్ణుడు; రాముని = బలరాముని; వీక్షించి = చూసి; నగుచున్ = నవ్వుతు; రాజానన = చంద్రముఖి, సుందరి; మత్ = నాకు; కామితమున్ = కావలసినదానిని; తీర్చి = నెరవేర్చి; పిదపన్ = తరువాత; నీ = నీ యొక్క; మందిరమున్ = నివాసమున; కున్ = కు; వత్తున్ = వచ్చెదను; నేడు = ఇవాళ; అలుగకుమీ = కోపగించవద్దు.
భావము:- ఆ మదవతి తనను అలా లాగగా కృష్ణుడు బలరాముడిని చూసి నవ్వి, ఆమెతో ఇలా అన్నాడు “ఓ చంద్రముఖీ! నేను వచ్చిన పని సాధించిన తరువాత నీ ఇంటికి వస్తాను. ఇప్పటికి కోపించబోకు.”

తెభా-10.1-1283-వ.
అని వీడుకొలిపి కృష్ణుండు విపణిమార్గంబునం జనిచని తాంబూల మాలికాగంధంబులును బహువిధంబు లయిన కానుకలు పౌరు లిచ్చినఁ బరిగ్రహించుచు ధనుశ్శాల కరిగి యందు.
టీక:- అని = అని; వీడుకొలిపి = పోవ ననుజ్ఞ ఇచ్చి, సాగనంపి; కృష్ణుండు = కృష్ణుడు; విపణి = అంగళ్ళ; మార్గంబునన్ = వీధమ్మట; చనిచని = చాలా దూరము పోయి; తాంబూల = తాంబూలములు {తాంబూలము - తమలపాకులు యందు వక్కలు సున్నము ఇష్టానుసారముగ ఇతర సుగంధద్రవ్యాదులు కలిపి ఉంచబడినది}; మాలికా = పూలదండలు; గంధంబులును = సుగంధ ద్రవ్యములు; బహు = అనేక; విధంబులు = విధములు; అయిన = ఐన; కానుకలు = బహుమతులు; పౌరులు = పురవాసులు; ఇచ్చినన్ = ఇవ్వగా; పరిగ్రహించుచు = పుచ్చుకొనుచు; ధనుశ్శాల = విల్లలు ఉంచు ఇంటి; కిన్ = కి; అరిగి = వెళ్ళి; అందున్ = దానిలో.
భావము:- కృష్ణుడు ఇలా అంటూ ఆమెను సాగనంపాడు. తరువాత బజారు వీధమ్మట వెళ్ళి వెళ్ళి, పురప్రజలు ఇచ్చిన తాంబూలాలు, పూలదండలు, చందనములు, ఇంకా అనేక రకాల కానుకలను స్వీకరిస్తూ ధనుశ్శాల దగ్గరకి వెళ్ళాడు.