పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/కరిపాలకునితో సంభాషణ


తెభా-10.1-1316-వ.
కని తత్కరిపాలకశ్రేష్ఠుండైన యంబష్ఠునికి మేఘనాదగంభీర భాషణంబుల రిపుభీషణుం డగు హరి యిట్లనియె.
టీక:- కని = చూసి; తత్ = ఆ యొక్క; కరిపాలక = మావటిలలో {కరిపాలకుడు - ఏనుగును పాలించువాడు, మావటి}; శ్రేష్ఠుండు = ఉత్తముడు; ఐన = అయిన; అంబష్ఠుని = అంబష్ఠుని; కిన్ = కి; మేఘనాద = ఉరుము యొక్క; గంభీర = గంభీరత కలిగిన; భాషణంబులన్ = పలుకులతో; రిపు = శత్రువులకు; భీషణుండు = భయము కలిగించువాడు; అగు = ఐన; హరి = కృష్ణుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- అరివీర భయంకరుడైన శ్రీకృష్ణుడు ఆ మదించిన ఏనుగును చూసి, మేఘగర్జన వలె గంభీరమైన కంఠంతో దాని మావటివాళ్ళ నాయకుడితో ఇలా అన్నాడు.

తెభా-10.1-1317-శా.
"రీ! కుంజరపాల! మా దెసకు నీ యుద్యన్మదేభేంద్రముం
బ్రేరేఁపం బనిలేదు; త్రిప్పు మరలం బ్రేరేఁపినన్ నిన్ను గం
భీరోగ్రాశనితుల్య ముష్టిహతులన్ భేదించి నే డంతకుం
జేరంబుత్తు మహత్తరద్విపముతో సిద్ధంబు యుద్ధంబునన్."

టీక:- ఓరీ = ఓయీ; కుంజరపాల = మావటివాడా {కుంజరపాలుడు - కుంజరము (ఏనుగు)ను కాచువాడు, మావటి}; మా = మా; దెస = వైపున; కున్ = కు; నీ = నీ యొక్క; ఉద్యత్ = ఉద్వేగము కలిగిన; మద = మదపు; ఇభ = ఏనుగు; ఇంద్రమున్ = శ్రేష్ఠమును; ప్రేరేపన్ = పురికొలుపవలసిన; పనిలేదు = అవసరము లేదు; త్రిప్పు = మరలించుము; మరలన్ = ఇంకొకసారి; ప్రేరేపినన్ = పురికొల్పినచో; నిన్నున్ = నిన్ను; గంభీర = గంభీరమైన; ఉగ్ర = భయంకరమైన; అశని = పిడుగుపాటుతో; తుల్య = సమానమైన; ముష్టి = పిడికిటి; హతులన్ = పోట్లతో; భేదించి = బద్దలుచేసి; నేడు = ఇవాళ; అంతకున్ = యముని; చేరన్ = దగ్గరకు పోవునట్లు; పుత్తున్ = పంపించెదను; మహత్తర = మిక్కిలి గొప్ప {మహా - మహత్తరము - మహత్తమము}; ద్విపము = ఏనుగు; తోన్ = తోటి; సిద్ధంబు = ప్రసిద్ధముగ; యుద్ధంబునన్ = యుద్ధము నందు.
భావము:- “ఓరీ మావటీ! మా వేపుకు ఈ మత్తగజాన్ని ఎందుకు ఉసిగొల్పుతావు. వెనుకకు మరలించు. వినకుండా డీకొట్టమని పోరుకు ఉసికొల్పావంటే, నీ మదపుటేనుగును, నిన్ను కలిపి గంభీరమైన దారుణమైన పిడుగుపాటుల వంటి నా పిడికిలిపోటులతో పొడిచి పొడిచి యముని పాలికి ఇపుడే పంపడం తథ్యం సుమా.”

తెభా-10.1-1318-వ.
అని పలికి.
టీక:- అని = అని; పలికి = చెప్పి.
భావము:- ఇలా ఆ మావటిని హెచ్చరించి. . .

తెభా-10.1-1319-మ.
మించిన కొప్పుఁ జక్కనిడి మేలనఁ బచ్చనిచీర కాసె బం
ధించి లలాటకుంతలతతిన్ మరలించుచు సంగరక్రియా
చుంచుతఁ బేర్చి బాలకుఁడు చూచు జనంబులు దన్ను బాపురే!
యంచు నుతింప డగ్గఱియె స్తజితాగము గంధనాగమున్.

టీక:- మించిన =అతిశయించిన; కొప్పున్ = జుట్టుముడిని; చక్కన్ = చక్కగా; ఇడి = పెట్టుకొని; మేలు = బాగుంది, శ్రేష్ఠము; అనన్ = అనిపించెడి; పచ్చని = పచ్చటి పీతాంబరము; చీర = బట్టను; కాశ = గోచీకట్టుతో; బంధించి = ఎగగట్టి; లలాట = నొసటి; కుంతల = ముంగురుల; తతిన్ = సమూహమును; మరలించుచున్ = వెనుకకు తోసుకొనుచు; సంగర = యుద్ధ; క్రియా = క్రీడకు; చుంచుతన్ = జుట్టును, కొప్పును; పేర్చి = బలముగా చేర్చికట్టి; బాలకుడు = పసివాడు, కృష్ణుడు; చూచు = చూస్తున్న; జనంబులున్ = వారు; తన్ను = అతనిని; బాపురే = బళీ; అంచున్ = అనుచు; నుతింపన్ = స్తుతించుచుండగ; డగ్గఱియె = దగ్గరకు పోయెను; హస్త = తొండముచేత; జిత = జయింపబడిన; అగమున్ = కొండలు కలదానిని; గంధ = మదపు; నాగమున్ = ఏనుగును.
భావము:- కన్నయ్య తన చిక్కటి జుట్టుముడిని గట్టిగా బిగించుకున్నాడు. మెల్లగా పీతాంబరాన్ని దట్టిగా బిగించి కట్టుకున్నాడు. నుదుట వ్రేలాడుతున్న ముంగురులను పైకి త్రోసుకుని పోరాటానికి అనువైన సిగచుట్టాడు. చూస్తున్న జనాలు బాలుడైన ఆ శ్రీకృష్ణుడిని “అయ్యబాబోయ్!” అంటూ మెచ్చి పొగడుతుండగా, తొండంతో కొండలను పిండిచేసే ఆ మదగజం దగ్గరకు వెళ్ళాడు.