పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/కపట బాల లీలలు

తెభా-10.1-419-క.
"చుంచొదువుఁ బాలు ద్రావు ము
దంచితముగ" ననుఁడుఁ బాలు ద్రావి జననితోఁ
జుం చొదువ దనుచు లీలా
చుంచుం డై యతఁడు చుంచుఁ జూపె నరేంద్రా!

టీక:- చుంచు = పిలక, బలము, నేర్పరితనం {నేర్పరి- చుంచుప్ ప్రత్యయం ("తేనవిత్తః చుంచుప్ చణపౌ"అని కౌముదీ సూత్రం)}; ఒదవున్ = బాగగును, కలుగును; పాలున్ = పాలను; త్రావుము = తాగుము; ఉదంచితముగన్ = చక్కగా; అనుడున్ = అని చెప్పగా; పాలున్ = పాలను; త్రావి = తాగి; జనని = తల్లి; తోన్ = తోటి; చుంచు = జుట్టు; ఒదవదు = పెరగలేదు; అనుచు = అంటూ; లీలాచుంచుండు = లీలలందు ఆసక్తి కలవాడు; ఐ = అయ్యి; అతడు = అతను; చుంచున్ = పిలకను; చూపెన్ = చూపించెను; నరేంద్రా = రాజా.
భావము:- ఓ రాజా పరీక్షిత్తు! “చక్కగా పాలు తాగు జట్టు బాగా పెరుగుతుం” దని చెప్పి పాలు తాగించింది తల్లి యశోదాదేవి. పాలు తాగి చేతితో జుట్టు తడువుకుంటు “జుట్టు పెరగలేదేం టమ్మా” యని అడిగాడు లీలలు చూపుటందు ఆసక్తిగల ఆ బాలకృష్ణమూర్తి.

తెభా-10.1-420-క.
సెగోల పట్టుకొని జల
శములో నీడఁ జూచి "లశయుతుండై
సెగోలఁ బాపఁ డొకఁ డిదె
చెన్ ననుఁ గొట్ట" ననుచుఁ ల్లికి జెప్పెన్.

టీక:- సెలగోల = చెర్నాకోల, కొరడాకఱ్ఱ; పట్టుకొని = చేతబట్టి; జల = నీటి; కలశము = బాన; లోన్ = అందు; నీడన్ = ప్రతిబింబమును; చూచి = చూసి; కలశ = కుండలో; యుతుడు = ఉన్నవాడు; ఐ = అయ్యి; సెలగోలన్ = కొరడాకఱ్ఱతో; పాపడు = చిన్నపిల్లవాడు; ఒకడు = ఒకానొకడు; ఇదె = ఇదిగో; తలచెన్ = అనుకుంటున్నాడు; ననున్ = నన్ను; కొట్టన్ = కొట్టాలి; అనుచున్ = అనుచు; తల్లి = తల్లి; కిన్ = కి; చెప్పెన్ = చెప్పెను.
భావము:- చిన్నికన్నయ్య ఒకరోజు సెలగోల చేతిలో పట్టుకొని, గిన్నెలోని నీళ్ళలోకి చూసాడు. తన ప్రతిబింబం కనబడింది. ఆ గిన్నెపట్టుకొని తల్లి దగ్గరకు వెళ్ళి “అమ్మా! ఇదిగో చూడు! ఒక పిల్లాడు సెలగోల పట్టుకొని నన్ను కొట్టటానికి వస్తున్నాడు” అన్నాడు.

తెభా-10.1-421-క.
"భిక్షులు వచ్చెద రేడ్చిన;
భిక్షాపాత్రమున వైచి బెగడించి నినున్
శిక్షించెద"; రని చెప్పిన
భిక్షులఁ గని, తల్లిఁ గనియు భీతిల్లు నృపా!

టీక:- భిక్షులు = యాచకులు, అడుక్కొనెడివారు; వచ్చెదరు = వస్తారు; ఏడ్చినన్ = ఏడ్చినచో; భిక్షాపాత్రమునన్ = భిక్షాపాత్ర యందు; వైచి = వేసుకొని; బెగడించి = బెదిరించి, జడిపించి; నినున్ = నిన్ను; శిక్షించెదరు = దండింతురు; అని = అని; చెప్పినన్ = చెప్పినచో; భిక్షులన్ = బిచ్చగాళ్ళను; కని = చూసి; తల్లిన్ = తల్లిని; కనియున్ = కనుగొనినను; భీతిల్లె = భయపడెను; నృపా = రాజా.
భావము:- ఓ మహారాజా! యశోదాదేవి “ఏడవుకురా కన్నా! ఇదిగో బిచ్చగాళ్లు వస్తున్నారు. ఏడుస్తుంటే వాళ్ళు నిన్ను జోలెలో వేసుకొని తీసుకు వెళ్ళి కొడతారు జాగ్రత్త” అని బెదిరించింది. చిన్నికిట్టయ్య వాకిట్లోకి వచ్చిన బిచ్చగాళ్లను చూసి, తల్లి వైపు భయపడుతూ చూసాడు.

తెభా-10.1-422-వ.
ఇట్లు కృష్ణుండు బహువిధంబులఁ గపటబాలలీలల వినోదింప, బృహద్వనంబున నందాదు లైన గోపవృద్ధులు మహోత్పాతంబు లగుటయు, వానివలన బాలుం డుత్తరించుటయుఁ జూచి యేకాంతంబున నొక్కనాడు విచారింప నుపనందుం డను వృద్ధగోపకుండు తన యెఱుక మెఱసి యిట్లనియె.
టీక:- ఇట్లు = ఈ విధముగ; కృష్ణుండు = బాలకృష్ణుడు; బహు = అనేక; విధంబులన్ = రకములుగా; కపట = మాయా; బాల = బాలుని; లీలలన్ = క్రీడలతో; వినోదింపన్ = వేడుకలు కలుగ చేయగా; బృహద్వనంబునన్ = బృహద్వనమను వ్రేపల్లెలో; నంద = నందుడు; ఆదులైన = మొదలైన; గోప = యాదవ; వృద్ధులు = పెద్దలు; మహా = గొప్ప; ఉత్పాతంబులు = అనుకోని కీడులు, ఉపద్రవములు; కలుగుటయున్ = సంభవించుట; వాని = వాటి; వలనన్ = నుండి; బాలుడు = బాలకృష్ణుడు; ఉత్తరించుటయున్ = దాటుట, బైటపడుట; చూచి = కనుగొని; ఏకాంతంబునన్ = రహస్యముగ; ఒక్క = ఒకానొక; నాడున్ = దినమున; విచారింపన్ = చర్చించుచుండగా; ఉపనందుండు = ఉపనందుడు; అను = అనెడి; వృద్ధ = పెద్దవయసు; గోపకుండు = గొల్లవాడు; తన = తన యొక్క; ఎఱుక = తెలివి; మెఱసి = చూపి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఇలా చిన్ని కృష్ణుడు కపటబాలలీలలు చూపుతూ క్రీడిస్తూ గోపికలను, గోపాలురను, అందరిని వినోదింపజేస్తున్నాడు. ఒకరోజు నందుడూ, ఇతర గోపాలక పెద్దలూ వ్రేపల్లె దగ్గరి పెద్ద తోటలో సమావేశం అయ్యారు. అప్పటివరకు జరిగిన భయంకరమైన ఉత్పాతాలూ, వాటినుంచి కృష్ణుడు తప్పించుకోటం మున్నగు విషయాలు చర్చించారు. వారిలో ఉపనందుడు అనే వృద్ధగోపాలుడు బుద్ధిలో దైవసంకల్పం వలన ఒక ఆలోచన మెరిసింది, అతడు ఇలా అన్నాడు.